నల్ల హంస

నాకు సముద్రపు ఒడ్డున ఇసుక గూళ్ళు కట్టుకోవడం ఇష్టం.

వాడికి ఇసుకలో పరిగెడుతూ అలలతో ఆడుకోవడం ఇష్టం.

నాకు రాత్రివేళ చుక్కలతో కబుర్లు చెప్పడం ఇష్టం.

వాడికి చందమామని చూస్తూ సూర్యుడి కోసం ఎదురుచూడటం ఇష్టం.

ఇష్టాలు వేరని తెలిసినా మనం ఎవర్నైనా ఎందుకు ఇష్టపడతాం?

ఒక మనిషిని ఇష్టపడటం అంటే వారి గురించి వచ్చే ఆలోచనల్ని ప్రేమించడం.

నిజానికి మనిషితో కన్నా వారి ఆలోచనలతోనే ఎక్కువ జీవితం గడుపుతాం మనం.

అవి మన సొంతం.

అక్కడ ఏ కల్మషాలకీ చోటు లేదు.

అబద్ధమో నిజమో అన్నీ మనవే.

అవన్నీ మనం కట్టుకున్న అందమైన కోటలే.

ఆ ఊహల్ని ఇష్టపడినట్టు ఆ మనిషిలోని నిజాల్ని ఇష్టపడగలమా?

అవి అంగీకరించి ముందుకు సాగటం అంటే, మనం కాని మనతో బతకడమేగా!

***

‘పెద్దయ్యాక మనిద్దరం ఆస్ట్రేలియా వెళ్లి నల్ల హంసల్ని చూసొద్దాం..’ అనేవాడు నాతో. శీతాకాలం తెల్లవారుజామున చలిమంట దగ్గర కూర్చున్నట్టుంటుంది వాడితో మాట్లాడితే. మధ్య మధ్య వచ్చే చల్లగాలి చక్కిలిగిలి పెట్టినట్టు అల్లరి చేస్తుంటాడు ఎప్పుడూ. ఈ రెంటినీ చెరో భుజంపైనా మోసుకొచ్చినట్లుండే ఫిబ్రవరి ఎండంత ఇష్టం నాకు వాడంటే. ఎండ వెనకే నిప్పుల కొలిమి వస్తుందనీ, అది నన్ను కొంచెం కొంచెంగా జీవితాంతం దహిస్తూనే ఉండబోతోందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కానీ ఆలస్యం అయిపోయింది. ప్రపంచానికి కనిపించకుండా పారిపోగలనేమోగానీ నా నుండి నేను తప్పించుకోలేను. పదిహేడేళ్ళుగా తెలుసు వాడు. ఇప్పటి నా వయసులో సగం కన్నా ఎక్కువ రోజులు గడిపాను వాడితో.

“అందరూ నీ గురించే అడుగుతున్నారు. త్వరగా వచ్చి చావు…” ఆరుసార్లు తన ఫోన్ కట్ చేశానని కోపంగా మెసేజ్ చేసింది అమ్మ. అక్కడికి వెళ్ళడమంటే చావులాగే ఉంది నాకు. కానీ మా వల్ల దగ్గరైన మా ఇద్దరి కుటుంబాలు, మాకన్నా ఎక్కువ దగ్గరయిపోవటం వల్ల ఈ రోజుని తప్పించుకోలేను. తెల్లారితే వాడి పెళ్ళి.

“బయల్దేరుతున్నా! పదే పదే ఫోన్ చెయ్యకు” అమ్మకి మెసేజ్ పెట్టి రెడీ అయ్యాను. ఈ హోటల్ రూముల్లో, లిఫ్ట్‌లలో ఇన్నేసి అద్దాలు ఎందుకు పెడతారో? ఎక్కడ చూసినా అదే నేను. ఎన్నిసార్లు చూసుకున్నా అదే ఏడుపు ముఖం. వాడు నా కోసం పంపిన కారు డ్రైవర్ ఫోన్ చేసి పావుగంటలో వస్తా అన్నాడు. హోటల్ బాల్కనీలోంచి దూరంగా రామకృష్ణ బీచ్ ఎలా ఉన్నావని పలకరించింది. ప్రతీ ఊర్లోనూ సముద్రం ఉండకపోవచ్చు గానీ, సముద్రంతో ప్రతీ ఒక్కరికీ ఒక కథ ఉంటుంది.

****

ఆరో తరగతి వరకూ ఊర్లో హాయిగా సాగిపోయింది నా చదువు. తర్వాత ఇంగ్లీష్ మీడియం కోసం విశాఖపట్నం తీసుకొచ్చి, మామయ్య ఇంట్లో పెట్టాడు నాన్న. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసే మామయ్యకి పెద్ద ఆదాయం మాత్రం సాయంత్రం ట్యూషన్ల వల్ల వచ్చేది. మూడు గదుల ఆ ఇంటి అరుగు సాయంత్రం అయిందంటే దాదాపు పాతిక ముప్పై మంది పిల్లల్తో నిండిపోయేది. ఓ రోజు అత్తయ్య ఊరెళ్ళినప్పుడు అర్ధరాత్రి తర్వాత మామయ్య నా పక్కకొచ్చి పడుకున్నాడు. ఆ రోజు నుండి నాకు ఆ ఇంట్లో ఉండాలంటే భయం మొదలైంది. అత్తయ్యకి చెప్పాలనుకున్నాను. కానీ పిల్లలు లేని తను, మామయ్య నా మీద చూపిస్తున్న ప్రేమకి మురిసిపోయింది. చూచాయిగా చెప్పినా అర్థం చేసుకోలేకపోయింది.

“వాళ్ళు పెట్టింది తిని, చెప్పింది చెయ్. బాగా చదువుకో.. ” ఓరోజు రాత్రికి రాత్రి ఊరికి పారిపోతే, మర్నాడే మళ్ళీ నన్ను వాళ్ళింట్లో దింపేసి, వెళ్తూ చెప్పాడు నాన్న. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మా అమ్మానాన్నకి కూడా నేను చెప్పిన విషయం చిన్నదిగా కనిపించడం ఆశ్చర్యమైతే, ఇదంతా నేను ఊరి మీద బెంగ పెట్టుకుని తిరిగి వచ్చెయ్యడానికి చెప్తున్న వంకలా అనిపించడం వింత.

హాఫియర్లీ పరీక్షల రోజులు. మర్నాడు లెక్కల పరీక్ష ఉందనగా, నానమ్మకి ఒంట్లో బాలేదని ఫోను రావడంతో అత్తయ్య హడావుడిగా వెళ్ళిపోయింది.

“నువ్వెందుకు ఎప్పుడూ అదోలా ఉంటావు?” ఆ రోజు సాయంత్రం ట్యూషన్ అయ్యాక వెళ్ళబోతూ అడిగాడు, అప్పుడప్పుడే పరిచయమవుతున్న వాడు.

“నీకెందుకు? నీ పని చూసుకో” మాటల్లో కరుకుతనం కళ్ళలో చూపించలేకపోయాను.

రాత్రి భోజనం చెయ్యాలనిపించలేదు. అరుగు మీద కూర్చుని చదువుకుంటున్నానేగానీ, మామయ్య ఎప్పుడు లోపలికి పిలుస్తాడో అని భయపడుతూనే ఉన్నాను. తొమ్మిది దాటుతుంటే వచ్చాడు వాడు వాళ్ళమ్మని తీసుకుని.

“పరీక్ష ఫెయిల్ అవుతానని భయపడి ఏడుస్తుంటే తీసుకొచ్చాను అన్నయ్యగారూ! మీరు దగ్గరుండి రాత్రంతా చదివించండి. పిల్లలిద్దరూ ఉన్నారుగా. ఒకరికొకరు సాయంగా ఉంటారు” అని చెప్పేసి వెళ్ళిపోయింది.

“ఇవ్వాళ అంటే నేనొచ్చాను. మళ్ళీసారి ఏం చేస్తావ్?” రాత్రి చదువుకుంటుంటే నవ్వుతూ అడిగాడు.

“నేను నిన్ను రమ్మని చెప్పానా?” తల ఎత్తకుండానే చెప్పాను.

“సరేలే గానీ, నీకు తెలుసా? నాకు ఎడమ చేత్తో కూడా రాయటం వచ్చు. రెండేళ్ళ క్రితం కుడిచేతికి సిమెంట్ కట్టు పడినప్పుడు నేర్చుకున్నాను”.

“అయితే నన్నేం చేయమంటావ్?” విసుగ్గా అడిగాను. సమాధానం చెప్పకుండా నవ్వేశాడు. వాడికి చెప్పలేదు గానీ, చాలా రోజుల తర్వాత ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను.

పది రోజుల తర్వాత అత్తయ్య మార్కెట్ నుండి కంగారుగా వచ్చి నాకో ఉత్తరం చూపించింది. ‘మీరు ఊరెళ్ళిన ప్రతీసారీ మీ ఆయన వేరే అమ్మాయితో చనువుగా ఉంటున్నాడు. జాగ్రత్తగా ఉండమని’ సారాంశం. బోరుమంది. అబద్ధానికి, అనుమానానికీ ఎంత దగ్గర సంబంధం ఉందో నాకు తెలియదు గానీ, ఈ వార్త సత్సంగం సభ్యుల ద్వారా పుకారులా కాలనీలోని చాలామంది చెవుల్లోకి చేరింది. నిజం చెప్పులేసుకుని గుమ్మం దాటేలోపు పుకారు విమానమెక్కి ప్రపంచం తిరిగొచ్చేస్తుందని అమ్మ చెప్పేది. ఈ సంఘటన తర్వాత ఇక ఎప్పుడూ మామయ్యని అత్తయ్య ఒంటరిగా వదల్లేదు.

“నీకు నేను ఉంటాను. ఎప్పుడూ, ఏం కావాలన్నా” కొత్త సంవత్సరం రోజున పిల్లలందరం కలిసి బీచ్‌కి వెళ్ళినప్పుడు వాడు చెప్పిన మాట. అన్నట్టుగానే వాడు నా చెయ్యి విడిచిపెట్టలేదు.

***

“ఊళ్ళో అందరూ ఈ రోజే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నట్టున్నారు. దారంతా గుంపులుగా జనం. బారాత్‌లు. మనం వెళ్లడం ఇంకో అరగంట ఆలస్యమయ్యేలా ఉంది” కారు ఎక్కుతుంటే చెప్పాడు డ్రైవర్. నాతో మాటలు కలిపి, మధ్యలో ఫోన్ డిస్ల్పే మీదున్న తన రెండేళ్ళ కూతురి ఫోటో చూపించాడు.

“బావుంది. నీలాగే ఉంది” అన్నాను. మురిసిపోయాడు ఆ మాటకి.

“ఈ దారిలోంచి వెళితే మీ ఫ్రెండ్ పెళ్ళికి త్వరగా వెళ్లిపోవచ్చు” ట్రాఫిక్‌ని తప్పించడానికి దగ్గర దారని సందులోకి కారు తిప్పుతూ అనుమతి తీసుకుంటున్నట్టు చెప్పాడు.

‘ఫ్రెండ్…’ నాలో నేను నవ్వుకుని సరే అన్నాను. మా పరిచయానికి స్నేహం, ప్రేమలాంటి ఏ పేర్లూ పెట్టనిచ్చేవాడు కాదు నన్ను. మా మధ్య ఈ ప్రస్తావన వచ్చిన ప్రతీసారీ వాడి ఇష్టాల్లో ఒకటిగా మొదలై ఇప్పుడు నాకు అలవాటైపోయిన పాత హిందీ పాట పాడేవాడు. ‘సిర్ఫ్ ఎహసాన్ హే ఏ.. రూహ్ సె మెహసూస్ కరో.. ఇస్ రిష్తే కో కోయి నామ్ న దో..’ అని. వాడు చెప్పినట్టే ఇన్ని సంవత్సరాలుగా ఆస్వాదిస్తూనే వచ్చాను. రేపట్నుంచి ఏం చెయ్యాలో?

కల్యాణ మంటపం దగ్గరవుతున్న కొద్దీ నాకు చేతులు, కాళ్ళలో చెమటలు ఎక్కువవుతున్నాయి. కారు మా చిన్నప్పటి స్కూలు దాటుతుంటే, కళ్ళు మూసేసుకున్నాను.

***

ఎంసెట్ పరీక్ష అయిన రోజు సాయంత్రం వాడి ఇంటికెళ్ళాను. వాడి గదిలో పాత పుస్తకాలు, సామాన్లు, కొన్ని బట్టల్ని అట్టపెట్టెల్లో సర్దుతున్నాడు. వాటిలో నేనిచ్చిన చొక్కా కూడా ఉంది.

“ఎందుకిప్పుడివన్నీ సర్దుతున్నావు?”

“ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తేనే కదా, కొత్త వాటికి చోటు దొరికేది”.

ఆ పెట్టెల్ని పనిమనిషికి ఇచ్చేసి, కావాల్సినవి తీసుకుని మిగతావి బయట పారెయ్యమన్నాడు. తర్వాత ఏం మాట్లాడకుండా టెర్రస్ గోడ మీద కూర్చుని ఆకాశంలో రంగుల్ని చూస్తున్నాడు. పరీక్ష బాగా రాయలేదేమో అనుకున్నాను.

“అలా గోడ మీద కూర్చోకు. పద. వీధి చివర పానీపూరీ తిందాం” పిలిచాను.

“వద్దు. ఇక్కడ బాగోదు.”

“ఏం?”

“ఇక్కడ తీఖా పానీ ఒక్కటే ఉంటుంది. మీఠా ఉండదు. రెండూ ఉంటేనే ఇష్టం నాకు. కూర్చో వచ్చి” చెయ్యి పట్టి లాగి దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు. చాలాసేపు నా చేతిని తన చేతిలో ఉంచుకున్నాడు. ఎందుకో వాడి స్పర్శ కొత్తగా అనిపించింది. మాటల మధ్యలో నా పెదవుల్ని తాకాడు. అలవాటైన మనిషే అయినా ఆ రోజు వింతగా ప్రవర్తించాడు. ఇంటికొచ్చాక లోలోపల తెలియని ఒక కొత్త ఆరాటం. నాలాగే వాడికీ అనిపిస్తోందా అని.

నాన్నకి వైజాగ్ ట్రాన్స్‌ఫర్ దొరకడంతో అమ్మ వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇద్దరూ ఇక్కడికే వచ్చేశారు. ఇంజనీరింగ్‌లో వాడు చేరిన కాలేజీలోనే చేరాను. ఇద్దరి ర్యాంకులకీ మధ్య దాదాపు నలభై వేలు తేడా ఉన్నా నేను పట్టుబట్టి అక్కడే చేరటం, నాకు తెలిసి నేను తీసుకున్న మొదటి సొంత నిర్ణయం. కాలేజీ మా మధ్యకు కొత్త పరిచయాల్ని, అలవాట్లనీ తీసుకొచ్చింది. రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు ఓ రోజు సాయంత్రం ఫోన్ చేశాడు.

“అమ్మా వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు. రాత్రి ఎవరూ ఉండరు. రెండ్రోజుల వరకూ రారు” అన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ అంత ప్రత్యేకంగా నన్ను రమ్మనలేదు వాడు. వెళ్లాను. తర్వాత వాడెప్పుడు కావాలన్నా వద్దనలేదు. నాకు కావాలి అని ఏ రోజూ అడగలేదు. అప్పుడప్పుడు అనిపించేది, నాది ఇష్టం వాడిది అవసరమేమోనని.

ఆ నాలుగేళ్లలో చాలామంది వాడి జీవితంలోకి వచ్చిపోయారు. స్వతహాగానే అంతర్ముఖ మనస్తత్వం ఉన్న నేను పెద్దగా ఎవరినీ కలుపుకోలేదు. వాడే మొదలు, బహుశా వాడే ఆఖరు. చాలాసార్లు కోపం వచ్చేది. వాడికి నేనొక సులభంగా దొరికే అలవాటులా, గిల్ట్ ప్లెజర్‌లా కనిపిస్తున్నానేమో అనిపించేది. కానీ ఎంతమంది వచ్చి వెళ్లినా నా స్థానం నాదే అన్నట్టు వాడు ప్రవర్తించడం నాకు నచ్చేది. వాడి నవ్వులో, వాడి స్పర్శలో నాకు అన్ని సమాధానాలూ దొరికినట్టు మురిసిపోయాను. కాలేజీలో మేమిద్దరం వేరువేరుగా ఎవరికీ తెలియదు. అప్పుడు, ఇప్పుడు కూడా.

తర్వాత ఉద్యోగాలు కూడా ఒకే ఊర్లో రావడం వల్ల వాడిని వదిలి వెళ్లాల్సిన అవసరం రాలేదు. వెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి కదా ముందు. చాలామంది అనేవారు నా మాటలు, చేష్టలు వాడిని గుర్తు చేస్తున్నాయి అని. నన్ను ఆవహించేసినట్టున్నాడు. వాడిని నాలోంచి బయటకి తియ్యడం ఎలాగో తెలియదు.

ఆరు నెలల క్రితం ఒక అమ్మాయి గురించి చెప్పాడు. నాకు గుర్తున్నంత వరకు వాడికి దగ్గరగా వచ్చిన ఎనిమిదో అమ్మాయి తను. ఈసారి ఈ అమ్మాయి దగ్గర ఆగిపోయాడు. తన కోసం చెన్నైకి షిఫ్ట్ అయిపోయాడు. నన్ను తనతో రమ్మన్నాడు. సముద్రం ఉన్న ఇంకో ఊరికి వెళ్లడానికి ఈసారి మనసు ఒప్పుకోలేదు. వాడు లేని రోజులు ఎలా ఉంటాయో చూడాలనిపించింది.  మొదటిసారి ఒంటరితనం పరిచయమైంది.

***

“ఎక్కడ? రెసెప్షన్ అయిపోవస్తోంది” వాడి నుంచి మెసేజ్.

“ఆన్ ది వే..” రిప్లై ఇచ్చాను.

ఏదో టైపు చేస్తున్నాడు. వాడి వాట్సాప్ డీపీలో వాడి పక్కన ఆ అమ్మాయి నవ్వుతూ సిగ్గుపడుతోంది. మొబైల్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టేసి పక్కన పడేశాను. అప్పటివరకూ ముఖం కూడా చూడని వాళ్లతో పెళ్ళనేసరికి వెంటనే ప్రేమ ఎలా పుట్టేస్తుంది? భవిష్యత్తు మీద అంత నమ్మకమా వీళ్ళకి? నిజానికి నాకైతే ఇది కొత్త బంధం మీద మోజులా అనిపిస్తుంది. పిల్లలకి ఓ బొమ్మ కొనిస్తే రెండ్రోజులు దానితోనే ఆడతారు. మూడోరోజు ఇంకో కొత్త బొమ్మ కనిపించగానే దీనికి నూకలు చెల్లిపోతాయి. అలమరాలో పాత బొమ్మల పక్కన కొలువైపోతుంది. బొమ్మలు కదా! మనసులుండవు. ఉన్నా మనకి అవసరం లేదు. ఈ కొత్త పరిచయాలు, పెళ్ళిళ్ళు కూడా ఇంతే! తెలుసుకోవాలన్న ఆరాటం. తెలిశాక ఇంతేనా అని నిరుత్సాహం.

కల్యాణ మంటపం బయట పెద్ద కటౌట్ పెట్టారు. వాడికీ, ఆ అమ్మాయికీ బంధుమిత్రుల అభినందనలంటూ అందరి ఫొటోలతోపాటు నాదీ వేశారు. నేను ఉండాల్సిన చోటును గుర్తు చేస్తున్నట్టు.

“ఇప్పుడా రావటం? ఎంత మారిపోయావో. నన్నూ, అత్తయ్యనీ పూర్తిగా మర్చిపోయావు” కారు దిగి లోపలి వెళ్తుంటే గుమ్మం బయట పిల్లలతో మాట్లాడుతూ నన్ను చూసి దగ్గరికొచ్చాడు మామయ్య.

“బావున్నావా?” అడిగాను.

“హా.. మాకేం? నీక్కూడా సంబంధాలు చూడమంటావా?” నా భుజం చుట్టూ చెయ్యి వేస్తూ వెకిలిగా నవ్వాడు.

“నువ్వింకా మారలేదా? వచ్చిన పని చూసుకుని వెళ్ళు. పిల్లల జోలికెళ్లావని తెలిస్తే చంపేస్తాను. అత్తయ్య మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను.” నా కాలి షూ వంక చూపిస్తూ అతని చేతిని విసిరికొట్టాను.

లోపలికి అడుగుపెట్టగానే అప్పటివరకూ స్టేజీ మీద, మంటపంలో అక్కడా ఇక్కడా ఉన్న వాడి ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ నా చుట్టూ చేరారు. ఆలస్యంగా వచ్చినందుకు ప్రేమగా కోప్పడుతూనే, దగ్గరికి తీసుకున్నారు. నేను లేకుండా కళ లేదన్నారు. పెదాలకైతే నవ్వును బలవంతంగా అంటగట్టగలిగాను గానీ, కళ్ళు నా మాట వినట్లేదు. ఆ హడావుడిలో ఎవరూ అది గమనించే స్థితిలో లేరు. నన్ను చూడగానే స్టేజీ మీద నుండి దిగబోతున్న వాడి చెయ్యి పట్టుకుని, నన్నే పైకి పిలిచింది ఆ అమ్మాయి. వాడికిష్టమైన నల్లరంగు సూట్‌లో మెరిసిపోతున్నాడు. ఫ్యామిలీ ఫొటో కోసం వాడి పక్కన వెళ్ళి నుంచున్నాను. చూడగానే గట్టిగా హత్తుకున్నాడు. నన్ను చూసే వరకూ మనసు కుదురులేదన్నాడు. కాసేపు నన్ను కిందికి దిగనివ్వలేదు. నేనున్నంతసేపూ నా చేతిని పట్టుకునే ఉన్నాడు.

“ఆకలేస్తోంది” రిసెప్షన్ అయ్యాక ముహూర్తానికి ఇంకా నాలుగు గంటల టైం ఉందనగా, వాడి గదిలోకి వెళ్ళిపోతూ అన్నాడు నాతో.

“ఐస్ క్రీం తీసుకురానా? ఈ టైంలో అదొక్కటే దొరకొచ్చు” పైనుంచి డైనింగ్ హాల్ వైపు తొంగి చూశాను.

“మ్.. వెనిలా..”

“ప్లస్ చాకొలెట్…” నవ్వి కిందికొచ్చేశాను.

***

“అసలేంటి నీకన్ని పన్లు? ఎంగేజ్మెంట్‌కి కూడా రాలేదు” కోపంగా చూశాడు.

“వీసా ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా! అయినా కోపం నీ ముఖానికి సూట్ అవ్వదులే. నటించకు”.

“మ్.. పెళ్ళి నాదైతే నువ్వు అలసటగా కనిపిస్తున్నావు?” నా నుదుటి మీద చెమటను తుడిచి కర్చీఫ్‌ని జేబులో పెట్టుకున్నాడు.

“ఈ కర్చీఫ్..?”

“నీదేలే గానీ, చెప్పు! ఎందుకలా ఉన్నావ్?”

“ఆలోచనల వెనక పరుగులు పెట్టినట్టున్నాను. అలుపు కళ్ళలోకొచ్చేసింది”.

“అందుకే ఎక్కడో ఒక చోట పరుగులాపు. నేను తన దగ్గర ఆగినట్టు” దూరంగా కనిపిస్తున్న బ్యానర్‌ని చూపించి నవ్వాడు.

“అసలు పెళ్ళెందుకు? ఇలా బానే ఉంది కదా?” వాడి కళ్ళలోకి చూసి నవ్వాను.

“బావుంది అని అక్కడే ఆగిపోతామా? తర్వాత పేజీలో ఏం ఉందో చూడొద్దా? సరే, నువ్వెప్పుడు పెళ్ళి చేసుకుంటున్నావ్?” నా భుజాన్ని తన భుజంతో గుద్దుతూ అడిగాడు.

“నువ్వు చేసుకుంటున్నావు కదా? చాలదా?”

“అలా ఎలా? నువ్వు కూడా చేసుకోవాలి. పెళ్ళి తర్వాత కూడా మనం ఇలానే ఉండాలి”.

“మనం ఇలానే ఉండాలనుకున్నప్పుడు వేరే వాళ్ళనెందుకు మధ్యలోకి రానివ్వడం?”

“మనిద్దరిలో ఒకరైనా అమ్మాయిగా పుట్టి ఉంటే అలాగే చేసేవాళ్ళం”.

నేనేం మాట్లాడలేదు.

“ప్రేమ కావాలి కదా? అలాగే పిల్లలు కావాలి. కానీ ఎవరొచ్చినా నీ తర్వాతే. నా సంగతి కాదు. నువ్వు చెప్పు. నేను లేకుండా ఏం చెయ్యగలవ్ నువ్వు?”

“ఏం చేయలేనని నీ ఉద్దేశం? చిన్నప్పటి నుండి ఎన్ని నేర్పించావ్ నాకు..” సిగరెట్ తీసి వెలిగించాను.

“నీకు అనవసరంగా అలవాటు చేశాను? కొత్తలో ఎంత ఉక్కిరి బిక్కిరైపోయేవాడివో” నా చేతిలోంచి సిగరెట్ లాక్కుని ఒకసారి పీల్చి నాకు ఇచ్చేశాడు.

“అన్నీ అందరికీ ఏదో ఒక రోజు కొత్తే. మెల్లగా అలవాటవుతాయి. నాకు నువ్వు అయినట్టు”.

“అన్ని అలవాట్లూ మంచివి కాదు. సరే! వదిలేయ్. నువ్వు కూడా చెన్నై వచ్చేయ్. ప్లీజ్! నేను లేకుండా నువ్వు ఉండలేవు” అభ్యర్థిస్తున్నట్టు అడిగాడు.

వాడు ఏడిస్తే నాకు నచ్చదు.

“మరి నువ్వు?”

“నీకు తెలీదా? ఎక్కడికి వెళ్లొచ్చినా నీ దగ్గరే ఆగుతున్నాను కదా? అయినా మన మధ్య విషయాలు ప్రపంచానికి డప్పు కొట్టి చెప్పాల్సిన అవసరం ఏం ఉంది?”

“మరి నాకు నేనేం చెప్పుకోను?” నా కళ్ళలోకి చూడలేదు వాడు.

“మీరు ముహూర్తం దాటిపోయే వరకూ ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా?” మా ఇద్దరి అమ్మలూ ఒకేసారి మమ్మల్ని తరిమారు.

పెళ్ళైన నాల్రోజుల తర్వాత వాడు హనీమూన్‌కి బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ వంద జాగ్రత్తలు చెప్పాడు నాకు. నా చేతిలో నుంచి వాడి చేతిని అతికష్టం మీద వదిలించుకున్నాను.

****

“నువ్వు కూడా పెళ్ళిచేసుకుని వెళ్ళొచ్చు కదరా? మళ్ళీ ఎప్పుడొస్తావో..” సూటుకేసులో నా బట్టల్ని సర్ది నా వంక చూసింది అమ్మ.

“వాడిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పా కదా? నీకెలా కావాలంటే అలా ఉండు నాన్నా..” వెనక నుండి వచ్చిన నాన్న నా గది కిటికీ తెలుపుల్ని తెరిచారు.

“సరేలే! ఒరేయ్ ఇవిగో నువ్వు దాచుకున్న సామాన్లు. మొత్తం నాలుగు పెట్టెలు” గదిలో ఓ మూల ఉన్న పెట్టెల్ని లెక్కపెడుతూ చెప్పింది అమ్మ.

“అవి పాతవి. ఇంక పనికిరావమ్మా. పారేసేయ్”.

“సరే”

సూటుకేసు ముయ్యడానికి ఇబ్బంది పడి, బట్టల్ని బయటికి తీసి పొందిగ్గా సర్ది అప్పుడు పెట్టెని మూసి, తృప్తిగా నిట్టూర్చి నా వైపు చూసి కళ్ళెగరేసి నవ్వింది. వాడు హనీమూన్ నుండి వచ్చేలోపే నేను దేశం దాటేసి సిడ్నీ వచ్చేశాను.

వాడిని సులువుగా వదిలేసుకున్నానా అని నా మీద నాకే సందేహం వస్తుంది ఒక్కోసారి. మనకి ఎవరైనా కావాలి అనిపిస్తే వాళ్ళ కోసం ప్రపంచంతోనైనా యుద్ధానికి దిగుతాం. వద్దనిపిస్తే మనతో మనమే యుద్ధం చేస్తాం. వాడు నేను కావాలి అని ప్రపంచానికి చెప్పలేడు. వాడి కోసం పోరాటం చేసి వాడిని వేరే వాళ్లతో నేను పంచుకోలేను. వాడి వల్ల జీవితానికి సరిపడా శారీరక, మానసిక అవసరాలు తీరిపోయాయేమో అనిపిస్తుంది. రేపు ప్రశ్నార్థకమైనా నా ప్రయాణం మాత్రం ఇక నుంచి సులువు. బరువులేని ఒంటరి ప్రయాణం.

“ఎక్కడికెళ్ళాలి?” అడిగాడు డ్రైవర్.

“ఒలింపిక్ పార్క్” లొకేషన్ చెప్పాను.

ఫిబ్రవరి ఎండ పలకరించింది. కారు ఎక్కుతుంటే డోర్‌కి చిక్కుకున్న నా చొక్కా వెనక వైపు చిరిగి, భుజం మీద వాడి పచ్చబొట్టు ఉన్న చోట చిన్నగా గీరుకుంది. బ్యాండైడ్ ఇచ్చాడు డ్రైవర్.

కారు వెనక అద్దంలోంచి ఫిబ్రవరి ఎండ నా భుజం మీద గాయంపైన పడి మండుతోంది. బైటికి చూస్తూ నా అరచేతులు చూసుకున్నాను. నా చేతి గీతల్లో చెమట మెరుస్తోంది. వాడి చేతి తడి జ్ఞాపకాలదై ఉండొచ్చు. అలవాటుగా నా అరిచేతుల్ని ముఖం దగ్గరకు తెచ్చుకుని కళ్ళు మూసుకున్నా. వాడు గుర్తొచ్చాడు. కొన్ని పాత అలవాట్లు ఎంత వద్దనుకున్నా మానుకోలేని ఇష్టాలు.

దూరంగా నల్లహంస కనిపిస్తోంది.

*

రచయిత అనేకన్నా కథ చెప్పేవాడు అనిపించుకోవడం ఇష్టం

* హాయ్ రవి! మీ గురించి చెప్పండి.

హాయ్! నేను పుట్టింది, పెరిగింది, మా కుటుంబం స్థిరపడింది తూర్పుగోదావరి జిల్లాలో. నేను ఏడేళ్లుగా ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఉంటున్నాను. ఇక్కడ బిజినెస్ అనలిస్ట్‌గా పని చేస్తున్నాను.

* కథలు రాయాలన్న ఆలోచన ఎలా మొదలైంది?

2019లో సంక్రాంతి టైంలో డబ్లిన్‌లో ఉన్నప్పుడు మా ఇంటిని మిస్సవుతున్న ఫీలింగ్‌తో నా చిన్నప్పటి రోజుల్లో సంక్రాంతి ఎలా ఉండేదో తలుచుకుంటూ ఒక నోట్ రాశాను. దాన్ని కథ అనలేను కానీ, బాల్యస్మృతి అనొచ్చు. అది మా ఇంట్లో వాళ్లు, చుట్టాలు, ఫ్రెండ్స్ చదివి చాలా బాగుందన్నారు. అలా నా రాత మీద నాకు నమ్మకం కలిగింది. ఆ తర్వాత ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ అనే నవలను ఒక యాప్‌లో 16 ఎపిసోడ్ల సిరీస్‌గా రాశాను. మొత్తం రాయడానికి 10 నెలలు పట్టింది. దానికి పేరొచ్చింది. చాలామంది నా శైలిని మెచ్చుకుంటూ మెసేజ్లు చేశారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా నుంచి ఒకావిడ మెయిల్ చేసి, నా రచన తననెంత కదిలించిందో చెప్పింది. ఆ తర్వాత రచన మీద కొంత సీరియస్‌నెస్ వచ్చింది. దాన్నొక బాధ్యతగా భావించడం మొదలుపెట్టాను.

* తొలి కథ ఎప్పుడు రాశారు?

‘మాస్టారు – రాధగారు – పిల్లలు’ అనే ఏడు భాగాల కథ రాశాను. అందులో ఒక భాగం ‘వెలలేని బహుమతి’ కథ 2020 నవంబర్‌లో ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. అది నా మొదటి కథ. ఆ తర్వాత మరొక భాగం ‘ఇట్లు.. నీ ఎంకటలచ్చిమి’ కథ 2021 ఏప్రిల్‌లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సాక్షి ఫన్‌డేలో మరో రెండు కథలు వచ్చాయి. ఇప్పటిదాకా పది కథలు రాస్తే అందులో నాలుగు ప్రచురితమయ్యాయి.

చాలా తక్కువ కథలే రాశారెందుకు?

తక్కువ ఎక్కువ అనే తేడాలు నాకు తెలియదు. I’m not in a race. నాలో స్పందన కలిగి, రాయాలని అనిపిస్తే తప్ప రాయలేను. నేను రచయితని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు నచ్చేలా రాశాను. చదివినవాళ్లు మెచ్చుకుంటున్నారు. అది చాలు. రచయిత అనేకన్నా కథ చెప్పేవాడు అనిపించుకోవడం ఇష్టం నాకు. మనం చెప్పే ప్రతి మాటా గతంలో ఎవరో చెప్పిందే! ప్రతి తరంలోనూ ఒకరు దానికి రంగులద్ది కొత్త తరాలకు అందిస్తారు. అలా నాకు రాయాలని అనిపించినవి నేను రాశాను.

* మీకు నచ్చిన రచయితలు?

ఇంట్లో ఉన్నప్పుడు ‘కన్యాశుల్కం’, ‘చివరకు మిగిలేది’, ‘పాకుడురాళ్లు’, వంశీ ‘మా పసలపూడి కథలు’, యండమూరి వీరేంద్రనాథ్ నవలలు, మహమ్మద్ ఖదీర్‌బాబు ‘పోలేరమ్మ బండ కతలు’ లాంటివి చదివాను. 18వ ఏట చలం గారి ‘మైదానం’ నవల చదివాను. ఐర్లాండ్ వచ్చాక తెలుగు పుస్తకాలు అందుబాటులో లేవు. ఇక్కడ నాకు సాహిత్యం గురించి తెలుసుకునేందుకు, పుస్తకాలు చదివేందుకు అవకాశం లేదు. అందుకే చాలా తక్కువే చదవానని ఒప్పుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్పుడప్పుడూ చదువుతూ ఉంటాను.

* ఇంకా ఏమేం రాయాలని ఉంది?

ఇటీవల ఒక నవల రాయడం పూర్తి చేశాను. రెండు నవలల్నీ పుస్తకాలుగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను. దీంతోపాటు మరిన్ని కథలు రాయాలి. బాగా చదవాలి. ప్రస్తుతానికి నాకున్న ఆలోచన అదే!

*

రవి మంత్రిప్రగడ

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Chala sensitive topic ni chala baga chepparu..e type stories rayalante chala dairyam and vallanu ardam chesukone manasu rendu vundali meeku avi rendu vunnaysni inko sari prove indhi…👏👏👏meeru eppudu disappoint cheyaru and mi writing style always unique..❤️Hope another one also have good future in your story 😊😊

  • ఎంత బాగుంది రవి!! ఇలా హాయిగా రాయడం మీకు మాత్రమే సొంతం కాబోలు! కథ మధ్యలోనే నేను ట్విస్ట్ ఊహించగలిగాను. కథాశం కూడా అంత గొప్పదేమీ కాదు. కానీ మీరు కథ నడిపిన విధానం, కథనం ఉంది చూశారూ.. అద్భుతం. ఇది మీకు మాత్రమే సొంతమైన టాలెంట్.

    ఏడుపు గొట్టు కథలకు దూరంగా, పీడితులు పీడకులు అని పిడకలు వేసే సాంప్రదాయానికి చెందని వైవిధ్యమైన కథలకు మీరు మాత్రమే కేరాఫ్ అడ్రస్.

    మీ కథ అని చూడగానే, ఎంతటి పనిలో ఉన్న ఆగి మరీ చదువుతాను. చదివేక టైం వేస్ట్ చేశానని మాత్రం నాకు ఎప్పుడూ అనిపించదు. ఇప్పుడు కూడా అస్సలు అనిపించలేదు. నిజంగా నిజం.. ❤️

  • Chala bagundi ravi garu. Katha ayipoyaka kooda aa trans lo undipoya nenu ila mausunlni katti padeyadam meeke sadyam ❤

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు