జన గళంలో పదునెక్కిన స్వరం వైరముత్తు

అయ్యో మనిషీ! నిజంగా మనిషిగా మారాలనుకుంటే
చెట్టువద్దకు రా!ప్రతి మనిషిలోనూ ఒక బోధి వృక్షం ఉంది..

1975లో చెన్నైలోని  పచియప్పన్ కాలేజీలో జరిగిన కవితోత్సవంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి  వచ్చి కవిత్వం చదివారు. అదే కవితోత్సవంలో 23 ఏళ్ల ఒక యువకుడు తన కవితలు చదివి ‘తనకు 12 ఏళ్ల వయసు నుంచి కరుణానిధే కవిత్వంలో ప్రేరణ’ అని చెప్పారు. ఆ కవితలు, ఆ యువకుడి మాటలు విన్న కరుణానిధి ముగ్ధుడై ‘కుంకుమం పత్రికలో రాయొచ్చు కదా’ అని సలహా ఇచ్చారు. అప్పటి నుంచీ ఆ యువకుడితో కరుణానిధికి స్నేహం ఏర్పడింది. కరుణానిధి ఓడినా, గెలిచినా నిమిత్తం లేకుండా ఆ స్నేహం కొనసాగించారు. అతడి కోసం కరుణానిధి చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా వచ్చేవారు. అతడు రాసిన 37 పుస్తకాల్లో 18 పుస్తకాలు కరుణానిధే ఆవిష్కరించారు. ఆ యువకుడు ఎవరో కాదు, శనివారం జ్ఞాన పీఠ పురస్కారానికి ఎంపికైన వైరముత్తు. సినారె తర్వాత సినీపాటల రచయితగా, సాహితీ వేత్తగా జ్ఞానపీఠ పురస్కారం లభించిన మరో రచయిత వైరముత్తు.

73 ఏళ్ల వైరముత్తు 19 ఏళ్ల వయసులో ఉండగానే తొలి కవితాసంకలనాన్ని వెలువరించారు. ఆయన విద్యార్థిగా ఉండగానే ఆ కవితా సంకలనం పాఠ్య పుస్తకం అయింది. తేని జిల్లాలోని మెట్టూరులో జన్మించిన క్షత్రియ కులానికి చెందిన వైరముత్తు వ్యవసాయం చేసుకుంటూనే చదువు కొనసాగించారు. ఆయన కవితలు పల్లెటూరి జీవనాన్ని, మానవ సంబంధాలను, పర్యావరణాన్ని, గ్లోబలైజేషన్ వల్ల ఏర్పడే ప్రమాదాల్ని వ్యక్తం చేస్తాయి. పేదరికం, తల్లి ప్రేమ, బాల్యవివాహాలు, స్వేచ్చ లేకపోవడం వంటి సామాజిక సమస్యలు ఆయన కవిత్వంలో అడుగడుడుగునా కనిపిస్తాయి. ‘మౌనంగా ఉన్న వారి స్వరమే తన కవిత’ అని ఆయన అంటారు. ప్రాచీన సంగం సాహిత్యం ప్రభావం ఆయనపై ఎక్కువ. ప్రాచీన సాహిత్య పదాలను ఆధునిక సంగీతంతో మేళవించడం ఆయన ప్రత్యేకత.

వైరముత్తు కవితల్ని చదివిన భారతీ రాజా 1980లో ఆయనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు   సినిమాలో పాటలు రాసేందుకు అవకాశం ఇచ్చారు. తొలి పాట ఎస్ పి బాలసుబ్రహ్మణ్యమే పాడారు. అప్పటి నుంచీ ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. గత 46 ఏళ్లలో ఆయన 7,500 పాటలు రాశారు. బాలచందర్, రహమాన్, ఇళయరాజా, మణిరత్నం  ఆయన పాటలు ప్రజల నోళ్లలో నానేలా చేశారు.  ఎస్పీబీ, శంకర్ మహదేవన్, చిత్ర, ఉన్నికృష్ణన్ మొదలైన వారెందరో ఆయన కవిత్వానికి రాగమాధుర్యాన్ని అందించారు. రోజా తమిళ సినిమాకోసం ఆయన రాసిన చిన్నిచిన్ని ఆశై పాట తర్వాత తెలుగుతో పాటు అనేక భాషల్లోనూ హిట్ అయింది.    పాటలే కాదు, స్ట్రీన్ ప్లే, డైలాగులు రాయడం కూడా చేశారు. అదే సమయంలో ఏనాడూ కవిత్వం రాయడం మానలేదు. వైగై ఆనకట్ట వల్ల మునిగిపోయిన 14 గ్రామాల్లో ఒక గ్రామానికి చెందిన వైరముత్తు ఆధునీకరణ వల్ల దెబ్బతిన్న నిర్వాసితుల కన్నీళ్లు, నెత్తురు, వేదన గురించి ఆయన రచించిన ‘కల్లిక్కట్టు ఇతిహాసం’ అన్న ఆయన నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పురుషాధిక్యానికి బలైన ఒక గ్రామీణ మహిళ జీవితంపై రచించిన ‘కరువచ్చి కావ్యం’ అనే మరో నవలా ప్రసిద్ది చెందింది. పద్మశ్రీ, పద్మభూషణ్ తో పాటు  వరించాయి. సినీపాటల రచయితగా  ఏడు సార్లు జాతీయ పురస్కారాలు పొందిన ఘనత ఆయనకే దక్కింది.  తెలుగులో కవిసామ్రాట్ గా విశ్వనాథకు గుర్తింపు వస్తే, తమిళంలో వైరముత్తుకు కవిసామ్రాట్ అన్న పురస్కారం లభించింది. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పురస్కారాన్ని అందించారు.

ఏ పక్షీ
గూడు కట్టి
దాన్ని అద్దెకు ఇవ్వదు.

ఏ జంతువూ
తనకు అవసరం లేని
భూమిని దొంగిలించదు.

ఓ మనిషీ, గమనించు
కలిసి జీవించే జీవితం
ఇంకా కూలిపోకుండా ఉన్నది
అడవిలోనే…
మనుషుల సమాజంలో కాదు.

అని మనిషి కంటే అడవి, అక్కడ నివసించే జంతువులే గొప్ప అని వైరముత్తు భావిస్తారు.

నువ్వు వెళ్లిపోయినా
నీ నీడ మాత్రం
ఇప్పటికీ అలాగే ఉంది…
నా హృదయపు లోతుల్లో
పడిగాపులు కాస్తూ.

అని రాసిన వైరముత్తు తాను ప్రేమించిన యువతి కోసం అన్వేషిస్తూనే ఉంటారు..

నేను దూరంగా కనిపించే ఆకాశంలా ఉన్నాను
నువ్వు నీ దుపట్టాతో నన్ను దగ్గరకు లాగావు
నా ఇరవై ఐదు సంవత్సరాల జీవితాన్ని
ఒక క్షణంలో ఎలా బంధించావు?

అని ఆమెను ప్రశ్నిస్తారు. .


జీవితం ఒక్కసారిగా కిందికి పడిపోతే
ఆమెను మళ్లీ ఎక్కడ కనుగొనగలను?
తూర్పు పడమరలలో
వృథాగా ఆమెను వెతుకుతున్నాను.

ఒక చిన్న మంచు బిందువులా
ఆమె ఒంటరి పచ్చి గడ్డిపైన
నిశ్శబ్దంగా కూర్చుంది.

జ్ఞాపకాలు కనిపించకుండా

నదుల్లా జారిపోతుంటే,
రోజులు మాత్రం
అర్థం లేని నిశ్శబ్దంగా కరిగిపోతున్నాయి.

అని రాస్తారు. .  స్త్రీత్వాన్ని గౌరవించని సమాజంలో మానవత్వం వికసించదు అని అంటారు. .

వైరముత్తుకు చెట్లన్నా, ప్రకృతి అన్నా ఎంతో ప్రేమ.

చెట్టు సృష్టి వేసిన చిత్రపటం, భూమిపై నిలిచిన ఆశ్చర్యార్థకం,కొమ్మలు-నక్షత్రాలను చేరాలనే
ఆకాశానికెగసే చేతులు. అని రాస్తూ పోయిన వైరముత్తు

అయ్యో మనిషీ! నిజంగా మనిషిగా మారాలనుకుంటే
చెట్టువద్దకు రా!ప్రతి మనిషిలోనూ ఒక బోధి వృక్షం ఉంది.. అంటారు.

‘పిలుపు’ అన్న కవితలో ఒక తల్లి తన బిడ్డతో ఇలా అంటుంది. “మేఘాల మధ్య నక్షత్రం నిద్రపోయినా,
ఆకుల మధ్య గాలి నిద్రపోయినా,నా కళ్ళు మాత్రం నీ కోసం రాత్రంతా మేల్కొని ఉంటాయి”

వైరముత్తు సినిమాల కోసం పాటలు రాసినా ఆయన తన పాటలు సినిమాల్లో వచ్చేంతవరకూ వేచి చూడరు. ఆయన రాస్తూనే ఉంటారు. అవి సినిమాల్లో పాటలై ప్రవహిస్తూనే ఉంటాయి. ‘రాత్రింబగళ్లు  పల్లవులు రాస్తూనే ఉంటాను. నేను ఇచ్చేది అసలు పదకొండో పల్లవి మాత్రమే. మొదటి పది పల్లవులు నా మనసులోని చెత్తబుట్టలో పడిపోతాయి. బంగారంపై ఉండే మురికిని శుభ్రం చేసి దర్శకులకిస్తాను..  భవిష్యత్తులో వచ్చే ఆకలికి నేనిప్పుడే అన్నం పెట్టగలను’ అని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

ప్రముఖ రచయిత్రి, ప్రతిభారే నేతృత్వంలోని   జ్ఞానపీఠ న్యాయనిర్ణేతల బృందంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్, అకాడమీ మాజీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు, దామోదర మోజో,ప్రఫుల్ల శైలేదార్ , కేశుభాయ్ దేశాయ్, జానకీ ప్రసాద్ శర్మ, అనామికలతో పాటు నేను కూడా ఉండడం ఒక బృహత్తర అవకాశం.

ఈసారి దేశ వ్యాప్తంగా అనేకమంది గొప్ప రచయితలు జ్ఞానపీఠ పురస్కారం కోసం పరిశీలనకు వచ్చారు. అయితే తమిళనాడులో గత ఆరు దశాబ్దాలలో కేవలం ఇద్దరు రచయితలు అఖిలన్ కు 1975లో జయకాంతన్ కు 2002లో ఈ పురస్కారాలు లభించాయి. అంటే గత 24 ఏళ్లుగా తమిళనాడుకు చెందిన ఏ రచయితకూ జ్ఞానపీఠ లభించలేదు. ఈ కొలమానంతో పాటు వైరముత్తు సాహితీ ప్రతిభ ఆయనకు ఈ పురస్కారం దక్కేందుకు కారణమైంది.

‘మా నాన్న కరుణానిధి బతికుంటే ఇవాళ వైరముత్తును ను కౌగలించుకుని, ఆనందోత్సాహాలతో ముంచెత్తేవాడు. నేనిప్పుడు ఆయన స్థానంలో  ఉన్నాను.’ అని స్టాలిన్ ప్రకటించారు.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

3 comments

Leave a Reply to Giriprasad Chelamallu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముమ్మాటికీ జ్ఞానాపీట్ పురస్కారానికి అర్హత వున్న సాహితిదురాందరుడే అయినప్పటికీ తమిళనాడు ఎలక్షన్ ప్రకటించిన సందర్భంలో ఇప్పుడు ప్రకటించి ఆ గౌరవ పురస్కరపు విలువకు ఒక మచ్చ అంటించారని చెప్పక తప్పదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు