చూపు  

‘ఇట్లా ఎన్నాళ్లు రావాలంటారు డాక్టర్ గారు?’ కళ్ళల్లో వేసుకున్న ఐ డ్రాప్స్ తాలూకు మసక కొంచెం తగ్గిన తరువాత కుర్చీ లోంచి లేస్తూ అడిగాను.

డాక్టర్‌ తలెత్తి చూస్తూ అన్నాడు–

‘చెప్పలేము. గ్లకోమా అనుకుంటున్నాము గానీ ఇదేదో ఈ మధ్య కొత్తగా వొస్తున్న సమస్యలా వుంది. మొన్న ఐ స్పెషలిస్టుల సెమినార్ లో దీని గురించే చర్చించాము. పోయిన సారి చెప్పాను మీకు. కళ్ల మీద విపరీతమైన ప్రెషర్ పడడం వల్ల కళ్ళకూ బ్రెయిన్ కూ లింక్ ఐ వుండే ఆప్టికల్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆపరేషన్ కు వెళ్ళినా రిస్క్’

నవ్వొచ్చింది.

’ఎందుకు నవ్వుతున్నారు?’

‘మరేం లేదు సార్! మీరు చాలా రోజుల నుంచి తెలుసు కనుక చనువుతో అంటున్నాను. అంత ప్రెషర్‌ పడే పనులేం చేయలేదు డాక్టర్‌ నేను. ఈ యాభై యేళ్ళలో రోజూ ఇంటి నుండి ఆఫీసుకు వెళ్ళడం, తిరిగొచ్చాక కబుర్లు చెప్పుకుంటూ టివిలో కార్యక్రమాలు చూసుకోవడం, లేదంటే బుక్స్‌ చదూకోవడం. ఇంతే నేను చేసింది. పొరపాటున న్యూస్‌లో ఏదైనా కాస్త డిస్టర్బ్‌ చేసే వార్త కనిపించినా దృష్టి మరల్చేస్తాను. కంటికి స్ట్రయిన్‌ ఇవ్వను’

‘అదే నిజమైతే మంచిదే. కాని ఏదో విచిత్రంలా ఇటువంటి  కొత్త జబ్బులు కామన్‌ అయిపోయాయి. మొన్న మా బంధువుల్లో కూడా ఒకడికి ఈ జబ్బు వచ్చింది. జస్ట్‌ ముప్పై యేళ్ళవాడు. అన్నట్టు మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య వుండేదా?’

‘మా నాన్నకైతే లేదు. ఎనభై ఏళ్ల వయసులో ఇప్పటికీ పొద్దున్నే న్యూస్‌పేపర్‌ మొత్తం చదువుతారు. కానీ మా తాతకు ఈ చూపు సమస్య వుండేది. కాకపోతే అదంతా ఒక శాపం వల్ల వొచ్చిందని చెప్తుంటే చిన్నప్పుడు వినేవాణ్ణి’

‘కథా ….? ఇంట్రెస్టింగ్ …. ఈ సారి వొచ్చినపుడు చెప్పాలి మీరు’ నవ్వాడు.

క్లినిక్‌ మెట్లు దిగాను.

తమ్ముడు బయట ఎదురు చూస్తున్నాడు.

కారు డోర్‌ ఓపెన్‌ చేసి కూచున్నాను.

వాడు స్టీరింగ్‌ ముందు కూచుంటూ ‘ఇంటి దగ్గర్నుండి ఆల్రెడీ కాల్స్‌ వొస్తున్నాన్నయ్యా! మనం చేరుకుంటే భోజనాలు మొదలు పెడతారు’ అన్నాడు.

ఇవాళ తమ్ముడి ఇంట్లో పూజ కార్యక్రమం. సిటీలో ఉన్న చెల్లెళ్లూ, దగ్గరి బంధువులూ అందరం వాడి ఇంటికి ముందు రోజు రాత్రే చేరుకున్నాం. ఇవాళ నా అపాయింట్‌మెంట్‌ వుండడం వల్ల తప్పక తోడు వచ్చాడు.

దారిలో క్రాసింగ్ దగ్గర చిన్న ట్రాఫిక్ జామ్ కనిపించింది. కాస్త వయసు పైబడిన ఎవరో బట్టతలాయనను ట్రాఫిక్ పోలీసులు పక్కకు తీసుకెళుతున్నారు. అతడి చేతిలో ఏదో ప్లకార్డు వుంది.

‘పనీ పాటా లేనోల్లంతా ఇట్లా రోడ్డు మీదకు ప్లకార్డులతో వొచ్చి, దానికి నిరసన దీనికి నిరసన అని న్యూసెన్స్ క్రియేట్ చేస్తారన్నయ్యా! ఈ సిటీలో ఎవడికైనా ఇవన్నీ పట్టించుకునే తీరిక వుందా అన్న స్పృహ కూడా వుండదు వీళ్ళకు’ తమ్ముడి మొహంలో విసుగు.     

-2-

మేము తమ్ముడి ఇంటికి చేరుకునే సరికి అందరూ మాకోసం ఎదురు చూస్తున్నారు. మరో సందర్భంలో అయి ఉంటే పెద్ద హంగామాగా ఈ పూజ జరిగి ఉండేది. టోలీచౌకిలో విల్లా కొన్నాక లాంఛనంగా గృహప్రవేశం చేశాడు కాని కరోనా వల్ల పూజ ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఇక ఈ వైరస్ ఇప్పట్లో పోయేలా లేదని దగ్గరి వాళ్లనే పిలిచి  భోజనాలు ఏర్పాటు చేసాడు.

కొందరు భోం చేస్తున్నారు. కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. నా శ్రీమతీ, మరదలు, మా ఇద్దరు చెల్లెళ్ళు, పిల్లలతో అంతా సందడిగా ఉంది.

‘అమ్మా నాన్నా వస్తే బాగుండేదిరా’ అన్నారు ఎవరో.

వాళ్లు రాలేదు. ఐదు గంటల ప్రయాణం చేసి ఏమి వస్తాంలే అని మానుకున్నారు.

’అమ్మ సంగతి సరే అన్నయ్యా! కొంచెం ఓపిక చేసుకుంటే నాన్న వచ్చేవాడు కదా. ఇవాళ కూడా ఊళ్ళో ఏదో పంచాయితీ సెటిల్‌ చేయడం కోసం ఉండి పోయాడు. లేబరోళ్ల జాగా అట. అది కబ్జా అయితే ఈయకేంటి, కాకపోతే ఈయనకేంటి’ కొంచెం నిష్టూరంగా అంది పెద్ద చెల్లెలు.

దానికి నాన్న విషయంలో మిగతా మా ముగ్గురికన్నా ఎక్కువ ఫిర్యాదులున్నాయి.  కెమిస్ట్రీ లో డాక్టరేట్‌ చేసి యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. అందరం కలిసినప్పుడు నాన్న సమక్షంలో ‘తాతయ్య  సంపాదించి ఆస్తి యిస్తే మా కోసం ఏమీ మిగిల్చకుండా ఊళ్ళో వాళ్ళ కోసం తగలేసావు’ అని మొహం మీదే అనేసేది.

నాన్న ఇటువంటి మాటలు మౌనంగా వినడమే తప్ప ఏ రోజూ వివరించే ప్రయత్నం చేయడు.

భోజనాలు ముగిశాయి. అందరం హాలులో చేరాము.

పిల్లల్లో ఎక్కువమంది ఆడుకునే వయసు దాటినవాళ్లు కాబట్టి ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు.

‘హే… పెద్ద మావయ్య భలే కథలు చెబుతారు తెలుసా?’ అంది ఎనిమిదేళ్ళ మేనకోడలు నన్ను చూసి. ఇది నా చిన్నచెల్లెలి కూతురు.

‘అవును? నా చిన్నప్పుడు చాలా కథలు చెప్పేవారు. ఇప్పుడు ఒక్క కథ కూడా చెప్పరు’ కొంచెం నిష్టూరంగా అన్నది మా అమ్మాయి. అది ఇంటర్‌.

‘ఇవాళ మాత్రం మా అందరికీ ఒక మంచి కథ చెప్పాల్సిందే మావయ్యా! చిన్న పిల్లలకే కాదు, పెద్ద పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్‌ గా వుండే కథ చెప్పాలి’ ఆర్డర్‌ జారీ చేశాడు, ఇరవై యేళ్ళ నా మేనల్లుడు. వీడు నా పెద్ద చెల్లెలి కొడుకు.

స్టీల్‌ ట్రేలో తమలపాకులు, వక్కపలుకులు, సున్నం తెచ్చి టీపాయ్‌ మీద పెట్టారు. పెద్దవాళ్లు కూడా వాటికోసమని చేరారు.

‘చెప్పన్నయ్యా, చాలా ఏళ్లయింది నువ్వు కథలు చెబుతుంటే విని’ కుర్చీని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు తమ్ముడు.

కాసేపు ఆలోచనలలో పడి పోయాను.

నిజానికి నేను చెప్పే కథలన్నీ చిన్నప్పుడు తాతయ్య నాకు చెప్పిన కథలే. చూపు సరిగా లేకపోవడం వలన ఆయనకు పక్కన ఎప్పుడూ ఒక మనిషి కావాల్సి వచ్చేది. ఆ మనిషిని పక్కన ఉంచుకోవడానికి ఏవేవో కబుర్లు చెప్పేవాడు. సాధారణంగా ఆ మనిషిని నేనే అయ్యేవాణ్ణి.

ఆయన ఎన్నో కథలు చెప్పినా ఆ శాపం కథ మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. ఇక రెండు రోజుల్లో పోతాడనగా ఆ కథ చెప్పాడు. వింతగా అనిపించింది. ఇదంతా నిజంగా జరిగిందా? అని తరువాత ఎప్పుడో నాన్నను అడిగితే ఆయన నవ్వి ఇంకేదో చెప్పాడు తప్ప తాతయ్య చెప్పింది నిజమో అబద్ధమో స్పష్టం చేయలేదు. ఇవాళ ఉదయం డాక్టర్‌తో జరిపిన సంభాషణ తరువాత ఎందుకో తాతయ్య చెప్పిన కథను వీళ్ళకు చెప్పాలనిపిస్తోంది.

తమ్ముడి వైపు తిరిగి అన్నాను – ‘అరేయ్‌… తాతయ్య శాపం కథ చెప్పనా?’

‘చెప్పన్నయ్యా … చిన్నప్పుడు అడిగీ అడిగీ ఆ కథ సంగతే మర్చిపోయాను’

‘కథ చెప్పండి … కథ చెప్పండి’ పిల్లలందరూ ఒక్క గొంతుతో ఉత్సాహపడుతున్నారు.

ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని చెప్పడం మొదలు పెట్టాను.

‘తాతయ్య నాకు చెప్పిన కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే దాదాపు వందేళ్ల కింద జరిగిన కథ యిది. మీకు ఆసక్తికరంగా వుండడం కోసం ఈ కథని తాతయ్య చెప్పినట్టే చెప్పడానికి ప్రయత్నిస్తాను’

-3-

తాతయ్య చెప్పిన కథ

జనం భూస్వాముల ఏలుబడిలో ఉండే రోజులు అవి. మా ఊరే కాదు చుట్టుపక్కల వున్న పదిహేను ఊళ్లు కూడా మా ఊరి భూస్వామి మోహనరావు అజమాయిషీలో ఉండేవి. ఆయన ఎత్తుగా, టమాటా పండు రంగులో, సాముగరిడీలు చేసిన ఒంటితో, వెడల్పాటి ఛాతీతో బలంగా వుండేవాడు. మెల్లగా, మెత్తగా మాట్లాడేవాడు. ఆయన నేరుగా దండించిన మనిషి లేడు. కాని ఎదిరించినవాడు ఏదో ఒక విధంగా దండన పొందకుండా లేడని అంటారు. రోజూ పొద్దున్నే అర్థగంట సూర్యనమస్కారాలు, అర్థగంట పూజలు పునస్కారాలు చేయకుండా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకునేవాడు కాదాయన. ఊరి మధ్యలో ఆయన ఇల్లు రెండేకరాల స్థలంలో రాళ్ళతో కట్టిన రాజుల కోటలా వుండేది. ‘అది కోటే, ఆయన రాజుగారే, అనుమానమెందుకు?’ అని గుసగుసగా చెప్పుకునే వాళ్ళు. ఊరికి ఆనుకునే ఒక చిన్న అడవి వుండేది. కోయలు వుండేవాళ్లు అక్కడ.

ఊళ్లన్నీ తిరిగి రైతుల దగ్గర శిస్తులు వసూలు చేసి భూస్వామికి  ముట్టజెప్పే పెద్ద పాలేర్లలో నేను కూడా ఒకడిని. అట్లా రైతుల దగ్గర నుండి వసూలు చేసిన శిస్తులలో కొంత భాగం భూస్వామి తన పై వాళ్లకు పంపించి, మిగతా సొమ్ము తన సొంతానికి ఉంచేసుకునే వాడు. భూస్వామి దగ్గర నమ్మకం సంపాదించిన తరువాత, నా పిల్లలు మంచి బతుకు బతకాలని చుట్టు పక్కల ఊళ్ళల్లో కొద్దిగా భూమి సంపాదించి పెట్టుకున్నాను.

కరువొచ్చినా, కాటకమొచ్చినా రైతుల శిస్తులు తగ్గించే వాడు కాదు. చిత్రహింసలు పెట్టి వసూలు చేయించే వాడు. ఆ తరువాత రైతులందరినీ సమావేశానికి పిలిచి, ‘ఇదంతా మన ఊళ్ళు బాగుండాలనే కదా, ఊళ్ళ బాగు కోసం అందరం కొన్ని త్యాగాలు చేయక తప్పదు’ అని చెప్పేవాడు. ఇటువంటి సమావేశాలకు మా భూస్వామి, ‘ఊరి మనసుల మాట’ అని  ఒక చిత్రమైన పేరు పెట్టాడు. అటువంటి సమావేశాలలో భూస్వామి ఒక్కడే మాట్లాడే వాడు. ఊరి జనం నోళ్ళు కట్టేసినట్టు నిశ్శబ్దంగా విని తలలూపేవారు.

ఒకసారి లోకమంతా గత్తరొచ్చి, గంజి నీళ్ల కోసం కూడా జనాలు అల్లాడి పోయిన రోజులొచ్చాయి. భూస్వామి, తన దగ్గర వున్న ధాన్యపు గింజల రాసులు తీయకుండా, వారానికోసారి అందరూ బయటికొచ్చి కప్పల పెళ్లిళ్లు చేయాలని సూచించాడు. అందరూ మన సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోవడం వల్లనే ఈ కరువు కాటకాలు అని సుదీర్ఘ వివరణ ఇచ్చేవాడు. ఆ మాటలు విన్న ఊరి వాళ్లలో ఎక్కువ మంది జనం సంతోషంతో కళ్ళ నీళ్లు పెట్టుకునే వాళ్ళు. భూస్వామిని మన సంస్కృతీ సంప్రదాయాల రక్షకుడని, దైవాంశ సంభూతుడని కీర్తిస్తూ ఒక బృందం పాటలు కట్టి పాడుతూ ఊళ్ళు తిరిగేది.

ఒకసారి కొంతమంది పెద్ద మనుషులు ’అయ్యా! మాకెటూ చదువు లేదు. కనీసం మా పిల్లలైన నాలుగు అక్షరమ్ముక్కలు నేరిస్తే బాగుపడతరయ్యా!’ అని భూస్వామిని ప్రాధేయపడ్డారు. ఈ సమస్యను ఆయన గంభీరంగా తీసుకున్నాడు. ఊరి హితవు కోసం చాలానే ఆలోచించినట్టుగా అందరికీ విశ్వాసం కలిగింది. ఆ తర్వాత ఆయన అన్నాడు.∙‘బడి కట్టిస్తే ఎవరికీ లాభం వుండదు గానీ ఒక పని చేద్దాం. ఇప్పుడున్న గుడి గుడిలా లేదు. ఊరన్నాక ఒక పెద్ద గుడి లేకపోతే ఎట్లా? సమయం వచ్చినపుడు మీరందరూ తలా ఓ చెయ్యి వేస్తే ఊరికి ఒక పెద్ద గుడి కట్టుకుందాము’ అన్నాడు.

ఈ మాట అందరికీ నచ్చింది. అప్పటిదాకా బడి బడి అని వొచ్చిన పెద్ద మనుషులు కూడా భూస్వామి గొప్పతనాన్ని పొగుడుతూ కట్టబోయే గుడి ముచ్చట్లలో మునిగి పోయారు.

రోజులన్నీ ఇలా గడిచిపోతే ఏ సమస్యా వచ్చేది కాదు. కాని సమస్యలు రాకుండా రోజులు ఉండవు. నా చిన్ననాటి స్నేహితులు ముగ్గురు ఆ సమయంలోనే మా ఊళ్లోకి వచ్చారు. వాళ్ల పేర్లు వరదరాజులు, సాయన్న, శీనయ్య. వీళ్ళు నాలా ఊళ్లోనే ఉండిపోయిన పక్షులు కాదు.  పట్నంలో వున్న  మేనమామల దగ్గరా, అమ్మమ్మల దగ్గరా చేరి చక్కగా చదువుకున్నారు.  వరదరాజులు నల్లటి చిక్కటి జుత్తుతో బక్కపల్చగా వుండేవాడు. మాట మాట్లాడితే కంచు మోగినట్టు వుండేది. ‘ఇంత బక్క ప్రాణికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వొచ్చింది’ అని ఆశ్చర్యపోయే వాళ్ళం. సాయన్నకు చిన్నప్పుడే ఏదో సమస్య వచ్చి కాలు కుంటిదై పోయింది. అయినా అదేమీ లెక్కచేయకుండా బాగా చదువుకున్నాడు. నలుగురు  కలిసిన చోట ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఇక శీనయ్య ఎత్తుగా బలిష్టంగా వుండేవాడు. మంచి అందగాడు. పెద్దగా మాట్లాడేవాడు కాదు. శీనయ్య బలమంతా అతని అక్షరాలే.

వీళ్లు ముగ్గురూ పట్నంలోనే ఏవో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కాని అక్కడ ఏవో గొడవలు జరిగి, కొద్ది రోజులు ఊళ్ళో గడపడానికని వచ్చి ఆ యేడాది ఊళ్లోనే వుండి పోయారు. అప్పట్నుంచీ ఊళ్ళో చిన్న చిన్న అలజడులు మొదలయ్యాయి. వరదరాజులు ఊళ్ళోని రైతులు, ఇతర కులవృత్తుల వాళ్ళతో వరుసగా మాట్లాడుతూ వాళ్ళ ఇబ్బందులను తెలుసుకునే వాడు. వాళ్ళతో కలిసిపోయి ముచ్చట్లు చెబుతూ చాలా దగ్గరి వాడై పోయాడు. ‘మా వరదరాజులు మాటలింటే మంచి హుషారుగా వుంటుంది. ఆ మాటల నిండ మా బతుకులే గద’ అని ఊళ్ళో వాళ్ళు చెప్పుకునే వాళ్ళు. సాయన్న రాత్రి పూట చెట్ల కింద దీపాల వెలుగులో ఊళ్ళో వాళ్ళకు చదువు చెప్పడం మొదలు పెట్టాడు.  శీనయ్య  ఊరికి కొంచెం మధ్యన శిథిలమైన ఇంటి గోడ ఒకటి వుంటే, దానికి సున్నం వేసి, రోజూ అక్కడ బొగ్గుతో ఏదో ఒకటి రాస్తూ వుండే వాడు. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని జనం, ఆ తరువాత పొద్దున్నే నోట్లో వేప పుల్ల వేసుకుని పళ్ళు తోముకుంటూ అటుగా వెళ్ళి ఆ రోజు శీనయ్య ఏం రాశాడా అని కూడబలుక్కుని చదవకుండా వుండలేని స్థితికి చేరుకున్నారు.

ఇదంతా నెమ్మదిగా భూస్వామికి తెలియడం మొదలయింది. నా స్నేహితులు కాబట్టి నన్ను కూడా వాకబు చేసేవాడు.

స్నేహితులు ఊళ్ళోకి వచ్చిన తరువాత జరుగుతున్నదేమిటో, జరగబోయే ప్రమాదమేమిటో కొద్దిగా అర్థమై, ఒకరోజు ఊరి వాగులో అందరం కలిసి ఈతకు వెళ్ళినపుడు మెల్లిగా వరదరాజులుకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాను –‘ ఇప్పుడు ఊళ్ళల్లో వాళ్ళకు కొత్తగా వచ్చిన కష్టాలేమున్నయిరా? ఏండ్ల నుంచి ఎట్ల బతుకుతున్నరో అట్లనే బతుకుతున్నరు కదా! ఇప్పుడు మీరు వాళ్ళకు లేనిపోనివి నేర్పించి అందరినీ చెడగొట్టడం అవసరమంటావా? మోహనరావు గారి సంగతి మీకు అర్థం కావడం లేదు’

అప్పుడు వరదరాజులు నా వైపు చూసిన చూపు నేను చచ్చేదాకా మర్చిపోలేను. ఒక కుక్కను చూసినట్టు చూశాడు.

‘ఇట్ల మాకు చెప్పమని మీ మోహనరావు పంపించినాడా? ఒక్క సంగతి చెప్పరా! తాతల కాలం నుండి అదే రెండెకరాల చెక్క దున్నుకునే వాళ్ళు ఇప్పటికీ మీ మోహనరావుకు శిస్తు కట్టే రైతులే గానీ యజమానులు కారు. మీ మోహనరావు మాత్రం తాతల కాలం నుండీ రైతుల రక్తం పీల్చి శిస్తులు వసూలు జేసుకునే ఆసామే! ఇది ఎప్పటికీ ఇంతేనా? మారొద్దా? బతకనేర్చినోనివిరా … నీకు ఇవన్నీ నెత్తికెక్కవు’

వరదరాజులుతో వాదించి గెలవలేమని, వాళ్ళు వెలుతున్న దారి నుండి వాళ్ళను పక్కకు తప్పించడం అసంభవం అని అర్థమై, ఇక ఆ రోజు నుండి ఎప్పుడు కలిసినా ఆ విషయాలు వాళ్ళ దగ్గర ప్రస్తావించలేదు. నిజం చెప్పాలంటే, నా చిన్నప్పటి స్నేహితులతో కలిసి వాగులో ఈతకు వెళ్ళడం అదే చివరి సారి కూడా!

ఒకరోజు భూస్వామి విధించిన శిస్తులు కట్టలేక ఇద్దరు రైతులు ఉరేసుకుని చచ్చిపోయారు. అప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు ఊళ్ళో వాళ్ళను సమావేశ పరిచి, భూస్వామి విధించిన శిస్తులు ఎక్కువగా వున్నాయని, అవి తగ్గించాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను భూస్వామే  ఆదుకోవాలని వివరించారు. విన్న వాళ్ళందరూ ఆ వాదనలలో న్యాయం వుందని అంగీకరించారు గానీ, మిత్రులకు తోడుగా భూస్వామి దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. ఆఖరికి, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యా పిల్లలు కూడా భయపడ్డారు.

ఇక లాభం లేదని ముగ్గురు మిత్రులు భూస్వామిని కలిసి అధిక శిస్తుల గురించి, చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం గురించి విన్నవించారు. అప్పుడు నేను అక్కడే వున్నాను.

‘మీరు ముగ్గురూ పట్నం నుండి ఎందుకొచ్చారో నాకు తెలుసు. ఊళ్ళోకి వచ్చి మీరు చేస్తున్నదేమిటో కూడా నాకు తెలుసు. అయినా సరే, ఏదో మన ఊరి పిలగాళ్ళు అని మీ అమ్మానాయినల మొహం చూసి పట్టించుకోలేదు. అయినా మేమందరం ఇక్కడే పుట్టి ఇక్కడే చచ్చిపోవలసిన వాళ్ళం. కష్టం నష్టం ఏదన్నా వుంటే మా లోపల మేము మాట్లాడుకుంటం. చక్కగ పట్నం పోయి ఏదో ఒక పని చూసుకొని దర్జాగా బతకక ఇవన్నీ ఎందుకురా మీకు?  నా పక్కన నిలబడ్డ వీడు మీ స్నేయితుడే గద. వీడిని చూసి నేర్చుకోండి. దేవుడిచ్చిన కండ్లున్నయి గదా అని అన్నీ చూసేస్తే చూపు వుంటదా?’

భూస్వామి ఆ ముగ్గురికీ సర్ది చెబుతున్నడో, బెదిరిస్తున్నాడో అర్థం కాలేదు. వరదరాజులు మాత్రం శాంతంగా అన్నాడు – ‘మంచిది మోహనరావు గారు. రేపటి నుండి అదే పనిలో వుంటాము’. వరదరాజులు, ‘మోహనరావు గారు’ అని పేరు పెట్టి చెప్పడం ఊహించని భూస్వామి మొహం తెల్లగా పాలిపోయింది.

అది అట్లానే కొనసాగి వుంటే ఏమి జరిగి వుండేదో గానీ, ఆ తరువాతి రెండు రోజుల్లో ఒక వార్త బయటికొచ్చింది. ఊరికి ఆనుకుని వున్న అడవి భూమిలో రాజుల కాలం నాటి నిధి వుందని పట్నం నుండి వచ్చిన పెద్ద సార్లు భూస్వామికి చెప్పడంతో, వున్న ఫళంగా అడవిలో వున్న కోయల్ని ఖాళీ చేయించవలసిన అవసరం వచ్చింది. ఈ ముచ్చట ఒకరి చెవిలో మరొకరు రహస్యంగా చెప్పుకోవడమే గానీ, భూస్వామి ఊరి పెద్ద మనుషులను పిలిపించి సమావేశం పెట్టి వాళ్ళతో చెప్పిన ముచ్చట వేరు. తన ఆజమాయిషీ కింద వున్న ఊళ్ళల్లో జనం పెరిగిపోతున్నారు కాబట్టి, అడవిని, అడివి లోని కోయలనూ ఊరిలో కలిపేసుకుంటే అందరికీ ఉపయోగంగా వుంటుందని. పెద్ద మనుషులందరూ భూస్వామి పెద్ద మనసును కీర్తిస్తూ తీర్మానాలు చేశారు.

‘మీకు ఊరి చివర ఇండ్లు కట్టిస్తం’ అని కోయవాళ్ళకు చెప్పి, వాళ్ళు అడివి ఖాళీ చేసేటట్టు చూడమని భూస్వామి మనుషుల్ని పంపించాడు. ‘అడివితోనే మా బతుకులు, అడివిని విడిచిపెట్టి బతకలేమని’ కోయ వాళ్ళు మొండికేశారు. దానితో వాళ్ళ మీద భూస్వామి మనుషులు రహస్యంగా దాడులు చేయడం మొదలుపెట్టారు. ఎవరు ఇచ్చిన ఆలోచనో తెలియదు గానీ, ఆ కోయవాళ్లు వరదరాజులును, సాయన్నను కలిసి సాయమడిగారు.

ఇక ఆ తరువాత రెండు రోజులకు వరదరాజులు, సాయన్న ఊళ్ళో కనిపించకుండా పోయారు. అడవిలో కోయవాళ్లతోనే వుండడం మొదలు పెట్టారు. కొద్ది రోజులలోనే బలహీనులు అనుకున్న అడవిలోని కోయవాళ్ళందరూ ఒక సైన్యంగా  తయారై భూస్వామి మనుషులెవరూ అడవి లోకి వెళ్లకుండా కట్టడి చేశారు.

శీనయ్య మాత్రం ఎప్పటిలాగే గోడ మీద రాతలు రాసేవాడు. కొత్తగా అడవి గురించి, కోయవాళ్ళ గురించి కూడా రాయడం మొదలు పెట్టాడు. కోయవాళ్లను ఖాళీ చేయించి, అడవిని నరికి భూమిని తవ్వితే నష్టం ఒక్క కోయవాళ్లకే కాదనీ, పశు పక్ష్యాదులకు మేత దొరకదనీ, చెట్లు అంతరించి వర్షాలు కురవవనీ రాసేవాడు. ఊరి ప్రజలకు విషయం అర్థమైనా, పొద్దున లేస్తే పనులు చేసుకుంటే తప్ప పూట గడవని బతుకులు కావడం మూలాన పట్టించుకోనట్లు వుండే వాళ్ళు.

ఇదిట్లా కొద్ది రోజులు గడవగానే ఒక రోజు పెద్ద వార్త ఒకటి మా ఊరితో పాటు చుట్టు పక్కల ఊళ్ళలోనూ అగ్గిలా అంటుకున్నది. పశువుల మేత కోసం అడవికి వెళ్ళిన పశువుల కాపర్లకు అడవి మొదట్లో దేవుడి విగ్రహం కనిపించిందన్నది ఆ వార్త సారాంశం. విగ్రహాన్ని దర్శించుకోవడం కోసం జనం గుంపులుగా వచ్చే లోపలే అక్కడ విగ్రహం పెట్టడానికి ఒక చిన్న గుడిసె, పూజలు చేసే అయ్యవారు, పూజా సామాగ్రి అన్నీ సిద్ధమై పోయాయి. చాలా మంది జనం పొగయ్యాక, భూస్వామి అక్కడికి మందీ మార్బలంతో వొచ్చి, ఊరికి మంచి రోజులు వచ్చాయనీ, అందుకే దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడనీ, అందరూ తలా ఒక చెయ్యి వేస్తే పెద్ద గుడి కట్టి ఈ అడవి ప్రాంతాన్ని పెద్ద పుణ్యక్షేత్రంగా మార్చుకుందామన్నది తన మనసులో మాటని చెప్పాడు. జనాలందరూ పూనకం వచ్చినట్టు చప్పట్లు కొట్టారు.

సరిగ్గా అప్పుడే కోయలతో వచ్చిన వరద రాజులు ‘దేవుడి పేరు చెప్పి ఈ అడవిని నాశనం చేస్తే కోయలు చూస్తూ ఊరుకోరు’ అన్నాడు.

భూస్వామి శాంతంగా ఊరంతటినీ చూశాడు.

‘అందరూ విన్నారుగదా …. నన్నే చంపుతానని బెదిరిస్తున్నాడు. ఇటువంటి వాళ్ళు బయట వుంటే నాకే కాదు, అందరికీ ప్రమాదం’ అన్నాడు.

వెంటనే ఊరి పెద్దలు అందుకుని, ‘అవునయ్యా .. పంచాయితీ పెట్టి వీళ్ళకు శిక్ష వేయకపోతే ప్రమాదం’ అన్నారు.

‘పంచాయితీ పెట్టి తేల్చే లోపల వరదరాజులునీ, సాయన్ననీ మన చీకటి కొట్టంలో వేయండి’

ఆ తరువాత పంచాయితీ జరిగింది లేదు. పెద్ద మనుషులు వాళ్ళ తప్పుల గురించి చర్చించిందీ లేదు. రోజులు గడుస్తున్నా వరదరాజులుకూ, సాయన్నకూ ఆ చీకటి కొట్టం నుండి విముక్తి లభించలేదు. సరయిన గాలీ వెలుతురూ తిండీ తిప్పలూ లేక వాళ్ళు చిక్కి శల్యమై పోతున్నారని  అప్పుడప్పుడూ చీకటి కొట్టం వైపుగా వెళ్ళే పని వాళ్ళు ఊళ్ళో వాళ్ళతో గుసగుసగా చెప్పేవాళ్లు. ఆ తరువాత, చీకటి కొట్టం వైపు పని వాళ్ళకు కూడా ప్రవేశం లేకుండా పోయింది.

మంచి కొలువులు చేసి ఆసరాగా వుంటారనుకుంటే కొడుకుల బతుకులు ఇట్లా అయిపోవడం చూసి వరదరాజులు, సాయన్నల తలిదండ్రులు తట్టుకోలేకపోయారు. భూస్వామి దగ్గరికి వెళ్ళి బతిమాలుకుందామని, తోడుగా రమ్మని అందరి ఇళ్లకూ వెళ్ళి వేడుకున్నారు. ఎప్పుడూ మౌనంగా గోడ మీద రాతలు రాసే శీనయ్య అన్ని వీధులూ తిరుగుతూ ‘ఇప్పుడు మౌనంగ వుంటే, ఇవాళ వరదరాజులు సాయన్నల వంతు, రేపు మన వంతు’ అని బిగ్గరగా అరిచి చెప్పాడు.

ఏ ఇంటి నుండీ ఎవ్వరూ అడుగు బయట పెట్టలేదు.

అప్పటికి వర్షాలు కురవడం మొదలై ఊళ్ళో చలిజ్వరాలు ఎక్కువయ్యాయి.

చివరికి, వరదరాజులు సాయన్నల అమ్మానాయినలు భూస్వామి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డారు. ‘బయట కాలం బాగాలేదయ్యా! వర్షాల వల్ల అందరికీ మాయ జ్వరాలొస్తున్నయి. పిల్లలకు మేము నచ్చజెప్పుకుంటం. పెద్ద మనుషుల పంచాయితీ పెట్టేదాకనన్న వాళ్ళను వొదిలేయండయ్య’ అని వేడుకున్నారు.

‘ఆరోజు గుడి దగ్గర జరిగిందానికి మీరు కూడ సాక్ష్యంగ వున్నారు గదా! వాళ్ళు బయట వుంటే ప్రమాదమనే గదా పెద్ద మనుషులు చీకటి కొట్టంల వేయమన్నది. పైగా అన్ని ఊర్ల మాట కూడా ఇదే. ఇంతమంది మాటను పక్కన పెట్టలేను గదా?’

దాంతో అర్థరాత్రి ఊరి మధ్యకు వచ్చి అందరినీ పేరు పేరునా పిలుస్తూ ఆ తలిదండ్రులు ఏడవడం మొదలు పెట్టారు. ఊరి వాళ్ళందరూ తలుపులు తెరిచి గుమ్మాల దగ్గర నిలబడి చూసారే తప్ప ఎవరూ దగ్గరికి వచ్చి ఓదార్చే ధైర్యం కూడా చేయలేకపోయారు.

ఏడ్చీ ఏడ్చీ, ఆ తల్లులు నేల మీది మట్టి తీసి గుండెల మీద పోసుకుంటూ అన్నారు – ‘మనందరి బతుకులు బాగు పడాలని గదా మా బిడ్డలు కొట్లాడింది. వాళ్ల కోసం మీలో ఒక్కరూ రాకపోతిరే. మన బతుకులు ఎన్నడన్న బాగు పడతయా? అందరూ కండ్లు వుండి గూడా గుడ్డోల్ల లెక్క ఐపోయిరి గదా! మీకు ఈ చూపు వుండి మాత్రం ఏం ఉపయోగం? మీ చూపు చల్లంగా ఉంటుందా?’

ఆ తరువాత చీకటి కొట్లో వున్న వరదరాజులు సాయన్నల పరిస్థితి ఏమయిందో ఎవరికీ తెలియదు.కొద్ది రోజులకు శీనయ్య కూడా మాయమై పోయాడు. ఆ ముగ్గురు భూస్వామికి భయపడి ఊరు విడిచి వెళ్లారని కొందరు, భూస్వామి మనుషులే మాయం చేసి వుంటారని ఇంకొందరు  చెప్పుకున్నారు.

తరువాత మరికొన్ని రోజులకు ఊరి జనాలకు చూపుకు సంబంధించిన సమస్యలు మొదలైనాయి. ఆ తల్లుల శాపం తగిలిందని కొందరు పెద్ద మనుషులు చెప్పడం మొదలు పెట్టారు. దాంతో చాలామంది భయపడి, ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పటికే వేరే ఊళ్లలో కొన్ని భూములు సంపాదించి జాగ్రత్త పడి వున్న నేను కూడా ఆ ఊరు వదిలి కుటుంబంతో వచ్చేశాను. ఇప్పుడు అది చాలా ప్రశస్తమైన గుడి. ఎక్కడెక్కడి నుండో జనాలు వొస్తారు. ఇప్పుడక్కడ అడివి లేదు. కోయవాళ్లూ లేరు. అంతా గుడి, గుడికి సంబంధించిన సత్రాలు, స్థలాలు. భూస్వామి కుటుంబమే ఆ గుడి ధర్మకర్తలు. స్వతంత్రం వొచ్చిన తరువాత, భూస్వామి కుటుంబం రాజకీయాలలోకి దిగింది. ఇప్పుడు అక్కడి ఎమ్మేల్యే, ఎం పి ఇద్దరూ ఆ భూస్వామి కుటుంబం వాళ్ళే. ఆ గుడి, ఆ గుడి ఆస్తులూ అన్నీ ప్రభుత్వం తీసుకోవాలని ఆ తరువాత ముగ్గురు యువకులు పెద్ద కోర్టులో కేసులు వేస్తే, ఆ కేసులు చెల్లవని పెద్ద కోర్టు తీర్పు ఇచ్చింది. తరువాత ఆ ముగ్గురు యువకులు కూడా కనిపించకుండా పోయారు.

 -4-

కథ చెప్పడం పూర్తి చేసి అందరి వైపు చూశాను. పెద్ద వాళ్ళూ, పిల్లలూ అందరూ నిశ్శబ్దంగా నా వైపే చూస్తున్నారు.

‘అవునూ … ఊర్లో వాళ్ళకు శాపం వల్లనే చూపు పోయిందా?’ మేనకోడలు ముందుకు జరిగి అడిగింది.

‘అది సరే గానీ అన్నయ్యా! తాతయ్య పోయాక ఈ కథ గురించి నాన్నని అడిగితే ఏదో చెప్పాడన్నావ్?’ నా రెండో చెల్లి అడిగింది.

‘నీకు తెలుసుకదా ఆయన సంగతి. కట్టబోయే గుడి ప్రాభవాన్ని ఊహించి భూస్వామే ఊరి బావి నీళ్ళలో ఏదో మందు కలిపించి, చూపు పోయేలా చేసి, దానికి సాయన్న వరదరాజుల అమ్మల శాపం కారణం అని ప్రచారం చేయించి వుంటాడు. మీ తాతయ్య లాంటి వాళ్ళు ఆ ప్రచారం నమ్మి, అటు అడవితో పాటు ఇటు ఊరు కూడా ఖాళీ చేసి భూస్వామికి అప్పజెప్పారు అన్నాడు’

తమ్ముడు వాచీ చూసుకుని, ‘మూడవుతోంది, కాస్త టివి పెట్టండి. వార్తల హెడ్ లైన్స్ చూద్దాం!’ అని రిమోట్ తో టి వి ఆన్ చేశాడు.

టి వి లో వార్తలు మొదలయ్యాయి.

‘రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు. మూడో స్థానంలోకి ఇండియా’

‘కరోనాతో విలవిలలాడుతున్న అమెరికా. న్యూ యార్క్ లో పెరిగిన కరోనా మరణాలు’

‘కరోనాతో వణుకుతున్న సెన్సెక్స్ సూచీ. బంగారం ధర ఆకాశం వంక’

‘వరదరాజులు ఆరోగ్య పరిస్థితి విషమం. కుటుంబ సభ్యుల విన్నపం తిరస్కృతి’

‘హే … టి విలో కూడా వరదరాజులు అని చెప్పారే’ చిన్న పిల్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అంది.

‘ఇక చాలు, అందరూ కాసేపు పడుకోండి. ఈ కరోనా దెబ్బకు షేర్ల రేట్లు పడిపోయి మనసేమీ బాలేదు. పైగా పొద్దుట్నుంచీ రెస్ట్ లేక నిద్దరొస్తోంది’ టివి స్విచ్చాఫ్  చేస్తూ అన్నాడు తమ్ముడు. తగ్గిన బ్యాంకు డిపాజిట్ల రేట్లు గుర్తొచ్చి నాక్కూడా మనసు చివుక్కుమన్నది.

పిల్లలందరూ హాలు వదిలి, ఇంటి వెనుక గార్డెన్‌ వైపు వెళ్ళారు. తమ్ముడు లేచి బెడ్‌ రూమ్‌ కు వెళ్లిపోయాడు. ఉదయం డాక్టర్‌ ఇచ్చిన బాటిల్‌ తీసుకుని కళ్ళల్లో చుక్కలు వేసుకుని సోఫాలో వెనక్కు వాలిపోయాను.

* * * * *

చిత్రం: సృజన్ రాజ్ 

కోడూరి విజయకుమార్

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • 1. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి కథ.

    2. చాలా కాంప్లెక్స్, విస్తృత కంటెంట్ ని అలవోకగా రాసి అర్థమయ్యేలా రాశారు.
    3. వరదరాజులు…. లాంటి వారిని పట్టించుకోని పాపం ఇప్పటికే మనని తాకింది సార్.

    ముగింపు లో ఏదైనా ఆశాభావం ఇచ్చే చిన్న మార్పు ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఒక మంచి కథ రాశారు.

    మార్క్వెజ్ కథ చదివిన ఫీలింగ్ కలిగింది

    అభినందనలు సార్. 💐💐💐💐

    • thanks Chandu …. మరింత నిరాశాజనకంగా పరిస్థితులు ఏర్పడిన కాలంలో ముగింపుని ఆశాజనకంగా రాయలేకపోయా !

  • ఈ కథ ఒక కొరడా. ఒక కాగడా!
    అభినందనలు విజయ్ గారు

  • Looks more relevant and sounds very closely to current situation. Father is right, it is no curse, it is a ploy to drive people out to grab the land. Very good story.

  • కథ మంచి ఆసక్తికరంగా నడిచింది. ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టింది.

  • రియాలిటీ కథ, పఠనం ఆసక్తిగా వుంది,అభినందనలు కోడూరి గారు

  • ప్రియమైన కోడూరి విజయకుమార్ గారూ ! తాతయ్య చెప్పిన కథ చివరి వరకూ చదివేటప్పటికి నా కంటి చూపు మసకేసింది.

    చుట్టూ వున్న సమాజం , రాజకీయాలు, హేతుబద్ధంగా వ్యవహరించని మనుషులూ ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయి అని నిర్భయంగా ప్రకటించిన విజయకుమార్ గారూ! యీ కధను మీరు ఇష్టపడే ప్రజా కవి కాళోజీ కి చూపలేకున్నా … “మా భూమి” సినిమా తీసిన బి. నరసింగరావు గారికి కానీ… సాహిత్య సృజనని సామాజిక బాధ్యతగా భావించిన ఉత్తరాంధ్రకు చెందిన ప్రజా రచయిత అట్టాడ అప్పల్నాయుడు గారికి కానీ చూపించాలనిపిస్తోంది.

    శిధిలమైయ్యిందని అనుకుంటున్న భూస్వామ్య వ్యవస్థ కాలానుగుణంగా తన రూపు మార్చుకున్నదే కానీ దోపిడీ ఇంకా కొనసాగుతున్నదని సున్నితంగా చెప్పిన తీరుకి నెనర్లు.

    1) లోకమంతా గత్తరొచ్చి, గంజి నీళ్ల కోసం జనాలు అల్లాడిపోయిన కరువు కాటకాలు వచ్చినా తన ధాన్యపు రాసులు నుండి గింజల తీయకుండా… శిస్తులు కట్టలేక ఇద్దరు రైతులు ఉరేసుకుని చచ్చిపోయినా కరగని భూస్వామి

    2) నాలుగు అక్షరమ్ముక్కలు నేర్పించే బడి కట్టిస్తే పిల్లలు బాగుపడతారని బామాలుకున్నా, గుడి కట్టిన భూస్వామి

    3) పట్నం నుండి పల్లెకొచ్చి రైతులు, ఇతర కులవృత్తుల వాళ్ళతో కలిసిపోయి రాత్రి పూట చెట్ల కింద దీపాల వెలుగులో ఊళ్ళో వాళ్ళకు చదువు చెప్పి చైతన్యవంతులుగా చేస్తున్న వరదరాజులు, సాయన్న, శీనయ్యల అడ్డుతొలగించుకున్న భూస్వామి

    4) అడవి మొదట్లో దేవుడి విగ్రహం వెలిసిందని జనాల్ని నమ్మించి అడవి ప్రాంతాన్ని పెద్ద పుణ్యక్షేత్రంగా మార్చి అడివి లోని కోయలను వెళ్లగొట్టి గుడి, గుడికి సంబంధించిన సత్రాలు, స్థలాలు పేర అడవిని ఆక్రమించిన …

    5) ఊరి బావి నీళ్ళలో ఏదో మందు కలిపించి, చూపు పోయేలా చేసి … వరదరాజులు, సాయన్న, శీనయ్యల తల్లుల శాపం తగిలిందని ఊరిలోని జనాలు భయపడి, ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాలా చేసి అటు అడవితో పాటు ఇటు ఊరిలోని భూమిని కూడా ఆక్రమించిన భూస్వామి

    6) భూస్వామి కుటుంబం రాజకీయాలలోకి కూడా ప్రవేశించి తమ ఊరు, చుట్టుపక్కల వున్న పదిహేను ఊళ్లు ప్రజలు తమ ఏలుబడిలో, తమ అజమాయిషీలో ఉండేలా చూసుకున్న వైనం

    • రామయ్య గారు … ధన్యవాదాలు … విలువైన మీ స్పందన కొత్త శక్తిని ఇచ్చింది నాకు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు