చదవండి… హాయిగా నవ్వుకోండి!

యుద్ధం అనగానే వీరోచితంగా పోరాడి గెలిచినవాళ్ల పేర్లని వినడం సాధారణమే. “ఆరంభింపరు నీచ మానవులు” అన్న భర్తృహరి తిరస్కృతి ఉండనే ఉన్నది గనుక యుద్ధం అనగానే వెనుకంజ వేసినవాళ్లని గూర్చి వినే అవకాశమే లేదు. మరి, రెండింటికీ మధ్యలోవాళ్ల సంగతేమిటి? అంటే, వీళ్లు యుద్ధంలో పాల్గొందామన్న ఊపుతో రెండడుగులు ముందడుగు వేస్తే వేసివుండొచ్చు. తరువాత నాలుగడుగులు వెనక్కి వేసినా గానీ ఆ వైఫల్యం గూర్చిన వివరాలను చెప్పే అవకాశాన్ని కొందరి కయినా ఇవ్వాలా, వద్దా? ఇవ్వాలి, అన్న జవాబుతో మొదలవుతుంది మార్క్ ట్వెయిన్ కథ “ది ప్రైవేట్ హిస్టరీ ఆఫ్ ఎ కాంపెయిన్ దట్ ఫెయిల్డ్” (http://www.classicshorts.com/stories/phctf.html). మార్క్ ట్వెయిన్ కి ఉన్న పేరునిబట్టీ ఇందులో నవ్వొచ్చే అంశాలకి కొదువ ఉండదు అని అనుకునే పాఠకులను ఈ కథ నిరాశపరచదు.

పంధొమ్మిదవ శతాబ్దంలో అమెరికాలో యూనియన్, దక్షిణ ప్రాంతాల మధ్య జరిగిన అంతర్యుద్ధం (సివిల్ వార్) ఆరు లక్షలకు పైగా జనాలని పొట్టన పెట్టుకుంది. (ఇక్కడ యూనియన్ అంటే సంయుక్త రాష్ట్రాలు.) అయితే, ఆ యుద్ధానికి కారణం, నల్లజాతివాళ్లని బానిసత్వం నించీ విముక్తి చెయ్యాలన్న ఉత్తరప్రాంతంవాళ్ల పట్టుదలకి దీటుగా ప్రాణాలొడ్డయినా సరే, వాళ్లని బానిసలుగా మాత్రమే ఉండేలా చూడడం మా హక్కు అన్న దక్షిణప్రాంతంవాళ్ల మొండితనం. 1776 లో తెచ్చుకున్న దేశ స్వాతంత్ర్యం తరువాత అన్ని రాష్ట్రాలూ ఈ దేశంలో భాగస్వాములే. అయితే, ఈ యుద్ధం కారణంగా దేశం రెండుగా విడిపోయే పరిస్థితి ఏర్పడింది. అబ్రహాం లింకన్ అధ్యక్షతన, యులిసిస్ గ్రాంట్ నాయకత్వంలో ఎట్టకేలకు యూనియన్ సైన్యం దక్షిణాది మూర్ఖత్వాన్ని కాలరాచి బానిసత్వాన్ని రద్దుచేసింది. దక్షిణాది తరఫున యుద్ధం చేసి అసువులు బాసినవాళ్ల సంతతిలో కొందరు, ఆ చరిత్రతో సంబంధం లేకపోయినా మరికొందరు, ఇంకా పాత “బంగారు రోజులని” తలచుకుంటూ ఆనాటివాళ్లకి విగ్రహాలని ప్రతిష్ఠిస్తూ, శ్వేతజాతీయత గొప్పదని రాలీలు నిర్వహిస్తూ, చెదపురుగుల్లాగా తమపని తాము చేస్తున్నారు. దానిని దేశంలోని రెండు పార్టీల్లో ఒకటి ఎప్పటినించో పరోక్షంగా ప్రోత్సహిస్తూనే ఉన్నా, ఈనాటి అధ్యక్షుని ఎన్నికలో వాళ్ల బలాన్ని తెలియజేయ్యడానికి అది ఎంత ఉపయోగపడిందో ప్రత్యక్షంగా కనిపించింది. నూటయాభై ఏళ్ల తరువాత కూడా పాతకాలపు వాసనలు ఈనాడు దక్షిణాన కనిపిస్తాయని మూణ్ణెల్ల క్రితం జార్జియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలవల్ల తెలిస్తుంది – ముఖ్యంగా నల్లజాతివాళ్లని కొందరిని ఎన్నికలలో తమ వోటు హక్కుని వాడనీయకుండా ఉండడానికి ఆ రాష్ట్రం అమలు జరిపిన కొన్ని శాసనాలవల్ల.

సివిల్ వార్ జరిగిన కాలంలో దక్షిణప్రాంతంవాళ్లకీ ఫిరంగులూ, తుపాకులూ ఆయుధాలున్నాయి. (అందుకే, తుపాకీని పట్టుకోవడం నా జన్మహక్కుగా రాజ్యాంగంలో రెండవ అధికరణం నిర్దేశించింది – అని ఈనాటికీ కొందరు ఎలాంటి తుపాకుల నయినా సరే, వాటిని కొనడం మీద ఎలాంటి అంక్షలూ చెయ్యనీకుండా అడ్డుపడుతూంటారు.) వాటికి మించి, ఆత్మగౌరవమనే ఆయుధం ఏనాడూ ఆయుధాలు చేపట్టనివాళ్లని కూడా చేతిలో ఒక తుపాకీని పెట్టి ముందుకు తోసింది. అలాంటి కొందరు తమకు తాముగా  చిన్నచిన్న గుంపులుగా తయారయి యూనియన్ సైన్యాన్ని ఎదుర్కొనడానికి తయారయ్యారు. 1861 వేసంకాలంలో యూనియన్ సైన్యం మిసోరీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల మీద విజయాన్ని సాధించిన తరువాత ఆ రాష్ట్ర గవర్నర్ యాభైవేలమంది సామాన్య ప్రజలని ఆయుధాలని చేపట్టి యూనియన్ సైన్యాన్ని తిప్పికొట్టమని పిలుపునివ్వడం దానికి కారణం. ఆ పిలుపు ననుసరించే కథకుడు అలాంటి మిలిషియాలో చేరడం, ఆ సైన్యం యుద్ధంలో తన పాత్రని ఎలా నిర్వహించిందో తెలియజెయ్యడం ఈ కథాంశం.

కథకుని చిన్నగుంపులో ఎవరికీ యుద్ధంలో ఎలాంటి అనుభవమూ లేకపోయినా, ఆ పదిహేనుమందికీ సైన్యంలో ఒక గుంపుకు కావలిసిన హంగులు మాత్రం ఉన్నాయ్ – అంటే నాయకుడిని, ఉపనాయకుడిని నిర్ణయించడంతో సహా. మామూలుగా సైన్యంలో చేరినవాళ్లకి నాయకుడికి ఎదురుచెప్పకపోవడాన్ని క్రమశిక్షణలో భాగంగా నేర్పుతారు. ఇక్కడ ఎవరికీ అలాంటి సంకెళ్లు లేవు. నాయకుడితో కలిపి అందరూ సమానమేనన్న అభిప్రాయం ప్రతి ఒక్కరికీ ఉన్నది. ఇంకొకడి చేత సేవ చేయించుకోవాలని అందరికీ ఉన్నది కానీ ఏ ఒక్కరూ ఆ సేవచేయ్యడానికి సిద్ధంగా లేరు. తినడానికి తిండి కావాలి కానీ ఎవరూ తమని వంటవాడుగా కేటాయించబడడాన్ని ఒప్పుకోరు. చివరికి కడుపు కాలిన తరువాత అందరూ కలిసి ఒక చెయ్యి వేసి వంట చేసుకుంటారు.

యుద్ధంలో వీళ్ల ప్రతాపం గూర్చి ఏం ఆశించవచ్చు? “They did as well as they knew how, but really, what was justly expected of them? Nothing I should say. And that is what they did.” అంటాడు రచయిత. (ఇలాంటి వాక్యాలవల్ల రచయిత, కథకుడు పాత్రలు అప్పుడప్పుడూ కలిసిపోతుంటాయి.)  ఆ ఏమీ చెయ్యనితనంలోనే కనిపిస్తుంది హాస్యమంతా. ఉదాహరణకి, ఒక సైన్యం నించీ ఒక గ్రామ ప్రజలు ఆశించే దేమిటి? ఆ సైన్యం గ్రామసరిహద్దుల్లో పొంచివుండి, శత్రుసైన్యాన్ని అక్కడే నిలిపి, చేతనయితే ఓడించి, గ్రామాన్ని ముప్పు నుండీ రక్షిస్తారని కదా? ఈ మిలిషియా మాత్రం ఒక రైతు ఇంట్లో బస చేసి, ఆ ఆతిథ్య మిచ్సినవాళ్ల కుటుంబంలో నుంచీ ఒకళ్లని ఊరు పొలిమేరలో కాపు కాయించి, శత్రుసైన్యం దరిదాపుల్లోకి వస్తోంది అంటే ఆ సమాచారాన్ని ఆఘమేఘాల మీద అందజేసుకుని తోకముడిచే అవకాశాన్ని చేతపుచ్చుకుంది. అది కూడా పరమానందయ్య శిష్యుల లాగా. ఈ సైన్యపు ప్రవర్తన ఇలా ఉంటుందన్న విషయాన్ని వాళ్లు కలిసి కదలడం మొదలుపెట్టగానే మొదటే తెలియజేస్తాడు రచయిత. వాళ్లకి ఆ రాత్రి మొదటగా ఎదురయింది అయిదుగురు యూనియన్ సైనికులు ఉన్నారన్న సమాచారం వచ్చిన ఒక రైతు ఇల్లు. నాయకుడు ఆ యింటిని చుట్టుముడదా మన్నాడు. సైన్యం మాత్రం, నీకు కావాలంటే నువ్వు ఆ పని చేసుకో, మేము మాత్రం నీతో రాము అన్నారు. చివరకు అందరూ కలిసి ఆ ఇంటికి దూరంగా నడుస్తూ దాన్ని దాటి వెళ్లారు. పైగా, ఎదురయిన సమస్యని బుద్ధిపూర్వకంగా దాటగాలిగామని వెన్ను చరుచుకున్నారు కూడా.

ఒక గ్రామంలో రైతులు వీళ్లకు మ్యూల్స్ నీ, గుర్రాలనీ ఇచ్చారు యుద్ధం జరుగుతున్నంత కాలం వాటిని ఉపయోగించుకోవడానికి. ఈ సైన్యంలో ఎవరికయినా వాటిని ఎక్కడం వస్తేగా!  ఆ జంతువులతో ఈ సైన్యం పడిన పాట్లని కథ చదువుతూ నవ్వుకోవలసిందే.

“For a time, life was idly delicious. It was perfect. There was no war to mar it.” అద్భుతమయిన చివరి వాక్యం.  ఇంతలో వాళ్లకొక పుకారోస్తుంది – యూనియన్ సైన్యం తమవైపు తరలి వస్తోందని. అది పుకారే గనుక మనం ఎక్కడికి కదలవలసిన అవసరం లేదన్నాడు నాయకుడు. అతని సైన్యం వింటేగా! “Lyman was not for retreating at all in these uncertain circumstances but he found that if he tried to maintain that attitude he would fare badly, for the command were in no humour to put up with insubordination.” మామూలుగా సైన్యం వినవలసింది నాయకుని మాట. ఇక్కడ సైన్యం నాయకుణ్ణి, నువ్వు మా మాట వినకపోతే కుదరదు అంటోంది. ఇక్కడ రచయిత అసమాన ప్రతిభ పాఠకుడిని కడుపుబ్బ నవ్వించక మానదు.

మార్క్ ట్వెయిన్ ప్రతిభకి మచ్చు తునక ఈ కథ. చదవండి. హాయిగా నవ్వుకోండి. తెలుగు కథల్లో ఈనాడు కనుమరుగయిన హాస్యం గూర్చి జాలిపడండి.

రచయిత పరిచయం:

ఆంగ్ల సాహిత్యంతో పరిచయ మున్నవాళ్లకి ఏమాత్రం పరిచయం అవసరం లేని రచయిత. Samuel Langhorne Clemens (November 30, 1835 – April 21, 1910) అసలు పేరయినా మార్క్ ట్వేయిన్ అన్న కలం పేరుతో ప్రసిద్ధుడు. అడ్వెంచర్స్ ఆఫ్ టాం సాయర్, అడ్వెంచర్స్ ఆఫ్ హకల్బెరీ ఫిన్ అతని ప్రసిద్ధ నవలలు.  వీరి గౌరవార్థం, 1998 లో మొదలుపెట్టి, వాషింగ్టన్, డి.సి., లోని కెనెడీ సెంటర్ ప్రతీ ఏటా హాస్య పురస్కారాన్ని అందజేస్తోంది.

Photographer: A.F. Bradley in his studio.

తాడికొండ శివకుమార శర్మ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు