ఘోస్ట్ స్టోరీ

 “ఎవరదీ?”

“ఘోస్టుని”

“ఘోస్టా! అంటే దెయ్యానివా? ఘోస్ట్ ముందే మరో ఘోస్ట్ పరాచికాలా?”

“హహ్హా..” బిగ్గరగా నవ్వులు.

“ఆ నవ్వులేంటి? ఈ రోజుల్లో ఘోస్ట్ అంటే భయపడడాలు ఉండవమ్మా.. ఎల్లెల్లవమ్మా”

“నా నవ్వులు నీకు ఆడదెయ్యంలా అనిపిస్తున్నాయా? నేను మేల్ ఘోస్టుని”

“అయితే ఏంటి? ఇప్పుడు నేను పొలోమని నీకు భయపడి సుస్సు పోసుకోవాలా? అయితే పట్టు నీ అరచేతుల్లో పోస్తాను”

“పోస్తావా? హహ్హా…” బిగ్గరగా నవ్వేస్తూ ఘోస్ట్ దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంటే రంగాబత్తుల సుబ్బారావు గజగజా వణికిపోతూ నోట్లో పెట్టుకున్న దుప్పటిని పరపరా కొరికేస్తున్నాడు, దారాలు లాగేస్తున్నాడు.

“నో.. నా దగ్గరికి రావొద్దు. నన్నేం చెయ్యొద్దు ప్లీజ్!” అంటూ నోట్లో కరుచుకున్న దుప్పటిని బయటకు తీసి చూశాడు. ఎలుక కొరికినట్టు దానికి కన్నాలు పడ్డాయి, దారాలు చిక్కుపడ్డ వెంట్రుకల్లా ఉన్నాయి. వాటిని చూసి షాక్ అవుతూనే ఘోస్ట్ వస్తున్న వైపు చూస్తూ బిక్కుబిక్కుమంటున్నాడు.

ఇంతలో అతనికి తానే ఓ ఘోస్టును కదా అనే విషయం గుర్తొచ్చి గుండెల్లోకి ధైర్యం వచ్చేసి ఛాతి నిండా గాలిని బిగ్గరగా పీల్చి, పైనున్న దుప్పటిని కాలితో ఒక్క ఉదుటున తన్నేసి స్థిమితంగా ఎదురుగానే చూస్తున్నాడు. శూన్యం తప్పితే ఏంలేదు. ఘోస్ట్ తన దగ్గరికి వస్తున్న సడి అవుతోంది.

ఇంతలో ఘోస్ట్ చటుక్కున ఆగిపోయినట్టు అనిపించి రంగారావు ముఖంలో చిరుగర్వం తొణికిసలాడింది. దెయ్యాల తాతల చిడతలు వాయించిన మొనగాడిలా అతని నరనరాల్లో గర్వం వాడివేడిగా సరసరా పారుతున్న ఫీలింగ్ కలుగుతోంది. వెంటనే అతను హుందాగా నవ్వడం ప్రారంభించాడు.

ఇంతలో ఏదో అలికిడి అయింది. దబ్బున బెడ్డు మీద నుంచి లేచి కూర్చున్నాడు. అటుఇటు దిక్కులు చూస్తున్నాడు. “ఓరినీయమ్మ బడవా.. ఇందాక నేను కన్నది కలా?” అనుకుని పెదవుల మీద చిలిపి దరహాసాన్ని పొదవి పట్టుకుని అలా వాల్ క్లాక్ వైపు చూశాడు. సరిగ్గా ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలు అవుతోంది. తెలతెలవారడానికి సమయం దగ్గరపడుతోంది.

“పొద్దున్నే పడే కలలు నిజం అవుతాయి అంటారు కదా?” అనుకుని సెల్‌ఫోన్ వంక చూశాడు. “పొద్దున్నే దాన్ని చూశానంటే అంతే సంగతులు” అనుకుని దాన్ని ముట్టే సాహసానికి పోకుండా గమ్మున ఊరుకుని పక్కనే భార్య లక్ష్మి ఉందనుకుని చేత్తో పుణికాడు. అప్పటికి గాని ఆమె ఊరెళ్లింది, పిల్లలిద్దరూ యూఎస్‌లో మాస్టర్స్ చదువుకోవడానికి వెళ్లిన విషయం బోధపడలేదు.

కనుబొమ్మలు అలా పెకెత్తి, నోరు బార్లా తెరుస్తూ పెద్దగా సౌండ్ చేస్తూ దీర్ఘంగా ఓ ఆవులింత తీశాడు. అక్కడే గ్లాసులోని నీళ్లను గటగటా ఐదు గుటకలు తాగేసి రిలాక్స్ ఫీలయ్యాడు. ఇవాళ పనేంలేదు కాబట్టి చక్కా ముసుగుదన్నేద్దాం అనుకుని దుప్పటిని సరిచేసుకుంటుండగా మళ్లీ భీకర నవ్వులు. ఇందాక కల్లో వినిపించిన నవ్వుల్లానే తోస్తున్నాయి అతనికి. ఆగకుండా కంటిన్యూగా నవ్వులు!

ఈసారి మరింత షాకవ్వక తప్పలేదు అతనికి? “ఎవరు నువ్వు? కల్లోనే అనుకుంటే నిజంగానూ తగలడ్డావా?” అన్నాడు తెల్లబడ్డ తన మీసం, గడ్డానికి ఇవాళ రంగు వేయలేదనే సోయిని కలగజేసుకుంటూనే.

“అని నువ్వు అనుకుంటే సరిపోతుందా రంగారావు? నేను నిజంగానే వచ్చాను. ఇందాక నువ్వు నాతో మాట్లాడిదంతా నిజమే. కానీ నువ్వు దాన్ని కల అనుకుంటున్నావు” ఘోస్ట్ వాయిస్ స్పష్టంచేసింది.

తొట్రుపాటులో పడ్డాడు సుబ్బారావు?! “అవునా.. ఇంతకీ తమరెవరు మేల్ ఘోస్ట్ గారూ?” అన్నాడు.

“గుర్తుపట్టు చూద్దాం”

గదవకి వేలు ఆన్చుకుని ఆలోచనలో పడ్డాడు రంగారావు. అంతలోనే అతనికెవరో తట్టింది. కళ్లు ఉష్ట్రపక్షి గుడ్డంత పెద్దవి చేస్తూ.. “నువ్వా పరాంకుశం?” అన్నాడు.

“అవును.. చచ్చి పక్షం రోజులే కదా అవుతోంది. ఇలా ఘోస్టుగా మారి నీ దగ్గరికి వచ్చాను. నీకు చాలా విషయాలు చెప్పాలని వచ్చాను. అలాగే చివరిసారిగా నీకు సారీ కూడా చెప్పెళదాం అని వచ్చాను” అంటూ అతని ముందు పొగ మాదిరి తెల్లగా ప్రత్యక్ష్యం అయ్యాడు.

శుక్ర కణానికి ఎక్కువ, సినిమాల్లో చూపించే దెయ్యం ఆకారానికి తక్కువ అన్నట్టుంది ఆ ఆత్మ రూపం. చూసి కాస్త జడుసుకున్నాడు. ఆశ్చర్యం, ఆనందం ఆ తడవే బాధతో అతని గుండె బరువెక్కి వెక్కాడు.

పరాంకుశం కూడా బాధతో ముఖం మాడ్చుకున్నాడు. “బాధపడకు రంగారావు. ఒకరి క్రెడిట్ కొట్టేసి డైలాగ్ కింగు, డైలాగ్ మచ్చ, డైలాగ్ డాక్టర్ అని వీర లెవల్ బిరుదులు పొంది విమాన ప్రమాదంలో దిక్కులేని చావు చచ్చి ఇదిగో ఇలా అటు స్వర్గానికి వెళ్లక, ఇటు నరకానికి వెళ్లక ఆత్మగా మారి తచ్చాడుతున్నాను” జీరగా అన్నాడు పరాంకుశం.

“ఒకర్ని అన్యాయం చేస్తే ఇదే గతి పడుతుంది పరాంకుశం” ముక్తసరిగా అన్నాడు రంగారావు.

“ఒప్పుకుంటాను రంగారావు. నటుడిని అవ్వాలని సినిమా ఫీల్డుకి వచ్చాను. కానీ నటించే అవకాశాలు రాలేవు సరిగదా తెలంగాణ స్లాంగ్ నేర్పించాలని ఓ డైరెక్టర్ సినిమా సెట్లో నాకో జాబ్ ఇచ్చేశాడు. అప్పుడే నా రైలు పట్టాలు తప్పింది. నన్ను స్లాంగ్ నేర్పించే టీచర్ అనుకున్నవాళ్లు కాస్తా రైటర్ అనుకోవడం ప్రారంభించారు. వరుసబెట్టి తెలంగాణ సినిమాలకు నన్ను గైడ్‌లా వాడుకోవడం ప్రారంభం అవుతూనే ప్యారలల్‌గా మాటలు రాయాలని ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. మనకు కీబోర్డు మీద వేలుపెట్టి రాయడం అంటేనే గుండ్రాయిని ఎత్తినంత భారం. కొత్తగా ఆలోచించి దానికో రూపం ఇస్తూ రాయాలంటే పురిటి నొప్పులంత సలపరం. ఎలా రాస్తాం? కానీ వచ్చిన ఆఫర్‌ను తిరస్కరిస్తే సర్వైవ్ అవడం ఎలా? భార్యాపిల్లల్ని పోషించుకోవడం కష్టం కదా అనిపించింది? అకౌంట్ పరిస్థితి జీరోకొచ్చింది. అప్పుడు నాకు దిక్కూదివాణంలా వాట్సాప్ డీపీలో నీ దర్శనం అయింది. నీకు ఫోన్ చేశాను. ఘోస్ట్‌గా చెయ్యమని ఆఫర్ ఇచ్చాను. చివరికి నేనిలా ఘోస్టును అయ్యాను” అంటూ వలవలా ఏడ్చేస్తున్నాడు.

అతని బాధ చూడలేక రంగారావుకి కూడా బాధ ఎగదన్నుకొచ్చింది. ఓదార్చేందుకు బెడ్డు మీద నుంచి లేచి ఘోస్ట్ దగ్గరికి వెళ్లి చేతులు చాచాడు కానీ ఆ గాలి రూపంలోంచి అతని చేయి అటుగా వెళ్లిపోయింది. నిచ్చేష్టుడై ఉండిపోయాడు.

“బాధపడకు పరాంకుశం. నేను అన్యాయం అయిపోయానే అనే బాధ ఉంది. కానీ నువ్వు ఆ టైంలో కాల్ చెయ్యకపోయి ఉంటే నేను తట్టాబుట్టా సర్దుకుని ఊరెళ్లిపోయేవాణ్నే. లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాణ్ని. బతికుంటే లక్ష్యం నెరవేరలేదని జీవితాంతం బాధపడిపోయేవాణ్ని. ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా రైటర్‌గా ఎక్కడా అవకాశాల్లేవు. చిన్నా చితక పనులు చేసుకుంటూ సినిమాల్లో ట్రై చేస్తున్నా అవకాశాల్లేవు. బుట్టి దుకాణం సినిమాలకు రాయించుకున్నా డబ్బులు అరకొరే. కొందరికి లైన్లు చెప్పాక వాళ్లు నేపథ్యం మార్చుకుని ఆ లైన్లను దొబ్బేసినా.. నా దగ్గర రైటర్ కార్డు లేక, కథను సెల్ఫ్ మెయిల్ లేదా సెల్ఫ్ పోస్ట్ చేసుకోవాలనే ధ్యాస లేక అలా బాధపడిపోయిన సందర్భాల్లో కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఫీజులు, రెంట్లు కట్టలేని ధీనావస్థ? ఏం చెయ్యాలి? నా లక్ష్యం కోసం నా ఫ్యామిలీని బలిచేస్తున్నాననే ఫీలింగ్. అప్పుడే నువ్వు కాల్ చేసి ఘోస్ట్ రైటర్ ఆఫర్ చేశావ్. డబ్బు చాలా అవసరం. పిల్లల చదువులు ఆగొద్దు అనుకుని నీ ఆఫర్‌ను మనసు చంపుకుని ఓకే చేశాను. నువ్వు నాకు డబ్బులిచ్చావ్. నా ఆర్థిక కష్టాలన్నీ తీరాయి, పిల్లల చదువులు సాగాయి, సొంతిల్లు కొనుక్కున్నాను. కానీ మనసులో మాత్రం అస్థిత్వం లేనోడిలా, పేరు లేని వెన్నెలలా నిత్యం నరకం అనుభవించాను. రిలీజైన పెద్ద పెద్ద టాప్ మోస్ట్ సినిమాలకు స్క్రీన్‌ప్లే, మాటలు నీ పేరు ఉంటుంది. అవి రాసింది నేనే అని ఎలా చెప్పను? చెప్పినా ఎవరు నమ్ముతారు? నేనొక అనఫిషియల్ రైటర్‌ని కదా? స్క్రీన్ మీద నా పేరు చూసుకోవాలని, సక్సెస్‌ఫుల్ రైటర్‌గా ఎదగాలని ఎన్ని కలలు కన్నాను? కానీ నా కలలు ఇలా కల్లలుగా నిజం అవుతాయని ఎవరికి తెలుసు? సినిమా రంగానికి వచ్చినవాళ్లంతా ఒకటి అవాలనుకుని ఇంకొకటి అవుతారని అంటారు. కానీ ఇలా ఘోస్టుగా మారడం కన్నా పెద్ద నరకం ఏదీ ఉండదు. ఆర్థిక అవసరాలన్నీ తీరుతాయి. కానీ మానసికంగా ఎంత వేదన ఉంటుందో అది అనుభవించినవాళ్లకే తెలుసు” అంటున్న అతని కళ్లు చిప్పిల్లాయి.

రంగారావు బాధను చూసి పరాంకుశం కళ్లు కూడా ఛెమ్మగిల్లాయి. “క్షమించు డియర్. అవసరాలు ఆశాయాల్ని చంపేసి మనల్ని ఏయే తీరాలకి తీసుకెళ్తాయో చెప్పడానికి మనిద్దరి జీవితాలే నిలువెత్తు నిదర్శనం. నేను నటుడిని అవ్వాలని వచ్చాను. కానీ ఫేక్ రైటర్‌ని అయ్యాను. నేనొక తోపు రైటర్‌ని అని ఈ ప్రపంచానికి తెలుసు. కానీ నేను అది కాదని నా మనసుకు మాత్రమే తెలుసు. అంతా నీ పెన్ పవర్ వల్లే ఈ బల్బ్ వెలిగింది. ఇంత పేరు, ప్రతిష్ఠ, అవార్డులు, రివార్డులు వచ్చాయి. అంతా నీ భిక్షే. ఇంత పెద్ద పేరు, పలుకుబడి ఉన్నా మనసులో నీకుమల్లే నాకూ సంతృప్తి లేదు. ఎందుకంటే నేను అనుకున్న పని చెయ్యకుండా అనుకోని పని చేసి ఒకరి క్రెడిట్‌ను నాదిగా వేసుకున్నాను. ఇది చాలా పెద్ద ద్రోహం. కానీ కీర్తి కండూతి, సినిమా రంగంలో ఎలాగైనా నిలదొక్కుకోవాలనే దుగ్దతో నాలా చాలామంది పేరు, సిరి గడించారు. నీలాంటివాళ్ల త్యాగాలు మా అంతస్తులకు పిల్లర్లుగా నిలిచాయని ఎవ్వరికీ తెలియదు” అంటున్న పరాంకుశం కన్నీళ్ళు జారుతుండగా అవి నేలమీద పడితే వాటికి ఫిజికల్ రూపం ఉంటే చూడాలని ఆబగా చూశాడు. కానీ అవి నేలరాలుతున్నట్టే మాయమవుతున్నాయి.

“నువ్వు నటుడివి కాలేదు, నేను రచయితను కాలేదు. డబ్బు సంపాదించుకున్నాం. నీ దయవల్ల నేను ఆర్థికంగా నిలబడ్డాను. పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చాను”

“నీ దయవల్ల నేనూ ఫేక్ కీర్తిని గడించాను కదా? ఫైనాన్షియల్‌గా బాగా స్ట్రాంగ్ అయ్యాను”

“అది కేవలం నీకూ, నాకు మాత్రమే తెలుసు కదా? మూగగా వింటున్న ఈ నాలుగు గోడలకు తెలుసు అంతే! ఇప్పుడవన్నీ తలుచుకుని బాధపడడం తప్పితే ఏంచేస్తాం చెప్పు?”

“కనీసం నీకు ఇప్పుడు రైటర్‌గా ప్రయత్నించి నీ సొంత సిగ్నేచర్‌ను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నీ క్రెడిట్‌ను డేగలా తన్నుకుపోయే నేను చచ్చి ఊరుకున్నాను కాబట్టి” అంటూ నవ్వాడు.

“నీమీద నువ్వే జోకులు వేసుకుంటున్నావా?”

“రియలైజేషన్ ఎంత బాగుంటుందో. నువ్వు ఇస్తున్న సపోర్టుతో ఇండస్ట్రీలో నాపేరు మారుమోగిపోతోంది. అప్పుడే నాకు గర్వం వచ్చేసింది. నీముందు కూడా చాలా బీరాలు పోయాను. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాను. ఎన్నిసార్లు నేను కానిదాన్ని నాదిగా భావిస్తూ లేని నవ్వుని, తృప్తినివ్వని ఆనందాన్ని, త్రేన్పునివ్వని సిరిని అనుభవిస్తూ, ఆరగించుకుంటూ అబద్ధపు మాయలో నిండా కూరుకుపోయాను. చివరికి ఈ అసత్యపు బతుకులో తేమ, వాస్తవికత లేదని చచ్చాకే తెలిసింది. అందుకే చచ్చాక అయినా ఇలా నిజాలు నిగ్గదీసుకుంటూ నన్ను నేను నిందించుకుంటూ నిన్ను కీర్తించాలని ఇలా నీ ఇంటికి వచ్చాను ఆత్మగా. అప్పుడు నువ్వు ఘోస్టువి, ఇప్పుడు నేను ఘోస్టుని. చూశావా కాలం ఏదీ ఉంచుకోకుండా గోడకు కొట్టిన బంతిలా ఎలా ఇచ్చి పడేస్తుందో? టిట్ ఫర్ టాట్‌లా ఎలా బుద్ధి చెబుతుందో?” భారంగా నిట్టూర్చాడు పరాంకుశం.

“పర్లేదులే.. నీది కాని పాత్రలో పరకాయం ప్రవేశం చేసినట్టు మేనేజ్ చేసుకున్నావ్. నువ్వు స్క్రీన్ మీద నటించలేకపోయుండొచ్చు. కానీ జీవితంలో ఇది నేను రాసిన కథ అని, డైలాగ్స్ అని నటించేశావ్‌. అలాగైనా నేను నటుడినే అని సాటిస్ఫై అవ్వొచ్చు కదా? నేను రాసిచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు అవుతుంటే.. థియేటర్‌కు వెళ్లి స్క్రీన్ మీద నా పేరు లేదని బాధపడ్డాను. కానీ పాకెట్‌లో మనీ చూసుకుని తెరిపిపడ్డాను. భార్యాపిల్లలకు ఏలోటూ లేదు కదా. వాళ్ల ఆనందం ముందు నా త్యాగం ఎంతటిది? నా లక్ష్యం ఏపాటిది అని సర్దుకున్న సందర్భాలు అనేకం. ఒకపక్క నువ్వు బాగుపడ్డావ్, నన్ను బాగుపడేలా చేశావ్. ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా ఒరిగేది ఏంలేదు. నీ ఖాతాలో పడ్డ క్రేజ్, క్రెడిట్ నాది ఎప్పటికీ అవదు. అది అంతే! దాన్నెవరూ మార్చలేరు!! నువ్వన్నట్టు కష్టపడితే నేను రైటర్‌ను అవుతానేమో. కానీ యాభైకి దగ్గరపడ్డాను. ఈ వయసులో ట్రెండ్‌ను అందుకోలేనేమో అని నన్ను పక్కన పెట్టొచ్చు. హాఫ్ ఏజ్ క్రాస్ అయ్యాక కూడా ఇంకా సినిమాలు ఏంటని ఎద్దేవా చెయ్యొచ్చు. అది సాధ్యమయ్యే పని కాదేమో పరాంకుశం” నిర్లిప్తంగా అన్నాడు రంగారావు.

అతని మాటలు పచ్చినిజాలు అనిపించి పరాంకుశం మనసులో మరింత అతలాకుతలం అయ్యాడు. అలా ఇద్దరూ కాసేపటి వరకు పూడ్చలేని శూన్యంలోకి చూస్తూ నిరుత్తరులుగా ఉండిపోయారు??

కాసేపటికి రంగారావు కల్పించుకుంటూ.. “నీ ఆత్మకు శాంతి కలగాలంటే ఏం చేద్దామంటావ్ పరాంకుశం?” అన్నాడు.

“నన్ను యాక్టర్‌గా పెట్టి ఒక సినిమా తియ్ సరిపోతుంది” అదుర్దాగా అన్నాడు పరాంకుశం.

“అదెలా సాధ్యం?”

సమాధానం లేక నీళ్లు నమిలాడు పరాంకుశం. ఇంతలో రంగారావుకి స్పార్కులాంటి ఓ ఐడియా వచ్చింది. ఇంతెత్తున ఎగిరి గంతేస్తూ.. “హేయ్..” అన్నాడు. దెబ్బకు ఉలిక్కిపడి చెవి పిండుకుని వీపులో మూడుసార్లు బాదుకోవడం పరాంకుశం వంతైంది!

“ఏఐ టెక్నాలజీ ఉండగా దిగులెందుకు మిత్రమా? సీజీ కూడా తోడుంది కదా!” అన్నాడు. అది విని మ్రాన్పడిపోయాడు పరాంకుశం.

“అవును కదా.. నా ఫేస్‌తో ఏఐలో సినిమా తియ్యొచ్చు. వండర్ఫుల్ ఆప్షన్” అన్నాడు ఆనందం తట్టుకోలేనట్టు.

“అవును. నీ ఫోటోతో నీ ఫిగర్ ఫైండౌట్ చేసి మొత్తం సినిమా నడిపించొచ్చు. కథ రెడీచేస్తా” అంటున్న రంగారావు మాటలకు అడ్డుపడుతూ.. “ప్రొడ్యూస్ నేనే చేస్తా?” అన్నాడు.

“ఎలా? నువ్వు ఘోస్టువి అన్న విషయం మర్చిపోతున్నావ్”

“నేను ఘోస్టుగా మారి నీకు కనిపిస్తున్నాను అని మా ఆవిడకు చెప్పి పనులు కానిద్దాం” ఐడియా ఇచ్చాడు.

“ఐడియా బాగుంది. నేను రైటర్‌గానే కాకుండా డైరెక్టర్‌గా కూడా బయటపడతాను. స్క్రీన్ మీద రైటర్‌గా నాపేరు చూసుకోవడమే కాకుండా డబుల్ బొనాంజాలా డైరెక్టర్‌గా కూడా నాపేరు చూసుకుంటాను. లైఫ్‌లో అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఇదొక నిదర్శనం కదూ” అంటూ ఎక్కడలేని ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు.

అంతే ఆనందంలో పరాంకుశం కూడా ఉన్నాడు. కల్లలు చెదిరి కల నిజమౌతున్నట్టు వారి ఆనందం వర్ణణాతీతంగా ఉంది!

“అంతా బాగానే ఉంది కానీ నువ్వు నాకొక చాలా పెద్ద అన్యాయం చేశావ్” అన్నాడు సుబ్బారావు వరదలా పొంగుకొస్తున్న ఆ ఆనందాన్ని బ్రేక్ చేస్తూ.

“అన్యాయమా?”

“ఓహో అప్పుడే మరిచిపోయావా? మొన్న రిలీజైన ‘మొనగంటి’ సినిమా కథ నాది. కానీ దానికి నీపేరు కూడా వేయించుకోకుండా బిగ్ డీల్ మీద ఆ క్రెడిట్ డైరెక్టర్‌కే ఇచ్చేసినట్టున్నావ్? మరీ ఇంత డబ్బు యావ మంచిది కాదు” అంటున్న అతని మాటలు విని ఖంగుతిన్నాడు పరాంకుశం.

మళ్లీ తనే కంటిన్యూ చేస్తూ.. “నాపేరు లేకపోయినా నీ పేరైనా పడిందిలే అనే తృప్తి ఉండేది. అది కూడా లేకుండా కనీసం నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా డబ్బులకు ఆశపడి నన్ను మరింత మోసం చేశావ్. అందుకే ఇలా దిక్కులేని ఆత్మలా తిరుగుతున్నట్టున్నావ్”

“అయ్యో.. ఇందులో నా తప్పేంలేదు డియర్. ఎడిటింగ్ టైంలో క్రెడిట్‌లో నేమ్ స్పెల్లింగ్ అడిగి మరీ వేశాడు. అలా ఎలా చేస్తాడు రాస్కెల్?” పళ్లు నూరాడు.

“అవునా.. నువ్వు చచ్చిపోయావ్ కదా? చచ్చాక నీ పేరు వెయ్యకున్నా నువ్వేం పీకలేవని అలా చేసుంటాడు. నీమీద వల్లమాలిని నమ్మకంతో నేను ఆ కథను కనీసం సెల్ఫ్ మెయిల్, సెల్ఫ్ పోస్ట్ కూడా చేసుకోలేదు”

ఆ మాట విని ఏదో ఐడియా వచ్చినవాడిలా.. “నేను అన్నీ కథలు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ దాన్ని మాత్రం చెయ్యలేదు కానీ.. సెల్ఫ్ మెయిల్ చేశాన్రోయ్. ఆ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ నీకు చెబుతాను. మా ఆవిడ సహాయంతో కోర్టులో కేసు వెయ్” అన్నాడు.

***

ఆ మర్నాటి నుంచి పరాంకుశం ఆత్మ పక్కనుండి ఇస్తున్న గైడెన్స్ ఆధారంగా ఆయన సతీమణి రమణి సహాయంతో మెయిల్ ఓపెన్ చేసి కథ డ్రాఫ్ట్ తీసుకున్నారు. మంచి లాయర్‌ను మాట్లాడి కోర్టులో కేసు వేశారు.

రంగారావును సొంత అన్నయ్యలా భావించే రమణి అతను చెప్పింది నమ్మింది. తన భర్త క్రెడిట్ దొంగ అని ఆమెకూ తెలుసు. కానీ ఎదురించి ఏమీ అనలేకపోయింది. దాన్నిలా దిద్దుకునే అవకాశం రావడాన్ని సాదరంగా ఆహ్వానించింది.

ఒకపక్క కోర్టులో కేసు, మరోపక్క పరాంకుశం ప్రధాన పాత్రలో కథను వండివార్చేశాడు రంగారావు. ఆ తర్వాత ఏఐ, గ్రాఫిక్స్ పనులకు పూనుకున్నాడు.

***

ఏడాది తిరిగింది. అటు కోర్టులో కేసు గెలిచింది. రమణి చెప్పినట్టుగా కథ, మాటలు రంగారావు పేరును రీప్రింట్‌లో యాడ్ చేశారు. దానికి సమ ఉజ్జీగా పరాంకుశం ఏఐ సినిమా ‘రవ్వలడ్డూ’ కూడా రిలీజైంది.

రైటర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న పరాంకుశానికి రవ్వలడ్డూ సినిమా గ్రేట్ ట్రిబ్యూట్ అని టాలీవుడ్ గొంతెత్తి శ్లాఘించింది. ఏఐ టెక్నాలజీ మాయని విచిత్రంగానూ, వైవిద్యంగానూ స్వీకరిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు!

పనిలోపనిగా సినిమాను హిందీలోకి కూడా డబ్ చేశారు. అక్కడ కూడా బంపర్ హిట్ అయింది.

థియేటర్‌కు వెళ్లిన పరాంకుశం ఆత్మ తననితాను తెరమీద చూసుకుని ఆనందాన్ని ఉగ్గబట్టలేక ఆనందభాష్పాలు కార్చాడు. రంగారావును గట్టిగా హత్తుకున్నాడు కానీ గాలిలా తేలిపోతున్నాడు. అయినా తాను నటుడిగా తెరమీద కనిపించాను, తాను వంచించిన రంగారావు రెండు సినిమాలకు రైటర్‌గా, డైరెక్టర్‌గా ఒక సినిమాకు టైటిల్ కార్డ్ వేసుకోవడంతో మనసు నిండా సంతృప్తి, హాయి, పూడ్చుకున్న వెలితి!

రంగారావు జీవితం కూడా వంద శాతానికి ఫుల్ ఫిల్ అయనట్టు.. నిండా నీళ్లతో తొలుకుతున్న కుండ ఫీలింగ్ గుండెల నిండా!!

అలా పరాంకుశం ఆత్మ సంతృప్తితో ‘టాటా.. బైబై!’ చెబుతూ నింగికి ఎగిసింది.

***

స్వర్గలోకపు ద్వారం తెరుచుకుంది. ఆనందంగా స్వర్గంలోకి వెళ్తున్నాడు పరాంకుశం. అంతలోనే ఆగిపోయాడు. “దేవేంద్రా.. ఇది అన్యాయం. భూమ్మీద నా ఫ్రెండ్ క్రెడిట్ కొట్టేసి ఫేక్ ఖ్యాతి పొంది ఇక్కడికొస్తే నన్ను నరకపు మంటలో వేసి కాల్చాలి, పెనం మీద తాల్చాలి కానీ అలా చెయ్యకుండా ఇలా స్వర్గంలోకి ఎలా తీసుకొస్తారు?” గట్టిగా అరిచినట్టు మాట్లాడుతున్నాడు పరాంకుశం.

ఇంద్రుడు అతని ముందుకు వచ్చి “నాయనా.. నువ్వు రంగారావును మోసం చేశావు అనుకుంటున్నావు. కానీ అతను కష్టాల్లో ఉన్నప్పుడు ఘోస్ట్ రైటర్ ఆఫర్ ఇచ్చి అతనికి అండగా నిలిచావు. తిరిగి రైటర్, తిరుగులేని డైరెక్టర్‌ను చేశావు. నీ కుత్సిత బుద్ధిని డామినేట్ చేసేలా ఎంతో ఉన్నతమైన పనులు చేశావనే నీకు స్వర్గప్రాప్తి కలిగించాను నాయనా” ప్రసన్నవదనంతో అన్నాడు ఇంద్రుడు.

“నేను ఒప్పుకోను. మీరు అనుకున్నంత మంచోణ్ని నేను కాను. నాకు నరకమే కరెక్ట్. నమ్మిన మిత్రునికి చేసిన పాపానికి, ద్రోహానికి ప్రక్షాళన జరగాలంటే నాకు నరకప్రాప్తియే కరెక్ట్ దేవేంద్రా. దయచేసి నాకు శిక్షలు వెయ్యండి” బెట్టుగా అన్నాడు.

ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు. తన వాహనం అయిన ఐరావతాన్ని చూశాడు. తెల్లగా మెరిసిపోతున్న అది కన్నుకొట్టింది.

“సరే నువ్వన్నట్టే చేద్దాం. నేనొకసారి యముడితో కాంటాక్ట్ అవుతాను. అప్పుడు తేల్చుతాను. అప్పటివరకు నువ్వు స్వర్గలోకపు స్వర్ణపుష్ప పానుపు మీద శయనించు నాయనా” సాలోచనగా అన్నాడు. స్థిమితపడ్డాడు రంగారావు.

బృందావనంలో ఉన్న భార్య శచీదేవీ వద్దకు పరుగున వెళ్లిన ఇంద్రుడు పరాంకుశం చిట్టా అంతా చదివి వినిపించాడు. ఏం చెయ్యాలో తోచట్లేదని అన్నాడు. ఆమె క్షణకాలం ఆలోచించి నవ్వింది.

“ఇంత చిన్న విషయానికే మీరిలా అయిపోతే ఎలా స్వామీ.. ఒక ఉపాయం” అని ఆయన చెవిలో గుసగుసగా ఏదో చెప్పింది. ప్రసన్నవదనంతో వెలిగిపోయాడు ఇంద్రుడు.

అలా దీవిస్తున్నట్టు చేయి చాచాడు. అందులోంచి ఓ కిరణం వెళ్లి స్వర్ణపుష్ప పానుపు మీద శయనిస్తున్న పరాంకుశాన్ని తాకింది. అంతే అతను భూలోకంలోని గతాన్నంతా మరిచిపోయాడు.

గతం మరిచిపోతే పేచీయే లేదు కదా అని శచీదేవి చెప్పిన మాటతో ఇంద్రుని పెదవులు దరహాసంతో విచ్చుకున్నాయి!

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

హుమాయున్ సంఘీర్

5 comments

Leave a Reply to హుమాయున్ సంఘీర్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సరదాగా అయినా… బాధగా ఉంది కథ. అంటే చదవడం బాధ అనికాదు. ఘోస్ట్ రైటర్స్ గా ఎంతమంది రంగారావులు దారుణంగా ఊరూపేరూ లేనివారిలా ఉండిపోతున్నారో కదా అన్న బాధ. సంఘీర్ గారూ 👍

    • అవును సర్. ఘోస్ట్ రైటర్స్ గా తెలియనివారు ఎందరో. వారి బాధల్ని గమనించి ఈ కథ రాశాను. మీ విలువైన స్పందనకు చాలా చాలా ధన్యవాదాలు సర్.

  • అవును సర్. ఘోస్ట్ రైటర్స్ గా తెలియనివారు ఎందరో. వారి బాధల్ని గమనించి ఈ కథ రాశాను. మీ విలువైన స్పందనకు చాలా చాలా ధన్యవాదాలు సర్.

  • హాస్యంతోనే ఒక విషాదకరమైన నిజాన్ని, సినీ రంగంలో జరిగే వికృతమైన విన్యాసాలనీ కళ్ళ ముందుంచారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు