కొమాలా

 రచయిత గురించి

మలయాళ వర్ధమాన కథకులలో ఒకరైన సంతోష్ ఏచ్చిక్కానం 1971లో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో జన్మించారు. మలయాళ భాషలో డిగ్రీతో పాటు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. ఉపాధ్యాయ వృత్తితో మొదలుపెట్టి, అటు కథారచయితగాను, మరోవైపు టీవీషోలకు, సినిమాలకు రచయితగానూ కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఏడు సినిమాలకు పని చేసి అందులో కొన్నింటికి కథ, మరికొన్నింటికి కథనం, మాటలు రాశారు. కథకుడిగా బిర్యాని, కొమాలా(comala) కథలు ఆయనకు పేరు తెచ్చాయి. సినీరచయితగా ‘అన్నయుమ్ రసూలుమ్, బ్యాచిలర్ పార్టీ’ సినిమాలు గుర్తింపునిచ్చాయి. తన కథలతో పుస్తకాలనూ వెలువరించారు. సాహిత్యరంగంలో ఆయన కృషికి కేరళ సాహిత్య అకాడెమీ పురస్కారంతోపాటు, మరెన్నో పురస్కారాలను అందుకున్నారు.

కథ గురించి..

సాటి మనిషికి మేలు చేయడం మంచిది అని నమ్మే మనిషి కొన్నిసార్లు ఆ మేలు వలనే తన జీవితాన్ని తెలియక ఇక్కట్లలోకి నెట్టుకుంటాడు.అది ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకువెళ్లినా ఏదో విధంగా మరో సాటి మనిషి ఆ ఇక్కట్ల నుండి మనల్ని బయటపడేసి కాస్త చేయూతనివ్వడా అని ఏ కొశానో ఆశావహ దృక్పధంతో ఎదురుచూస్తుంటాడు. వాస్తవానికి మనలో ప్రతిఒక్కరం ఏదోవిధంగా మరొకరికి ఋణపడే ఉంటాము. కానీ మనిషి  కొన్నిసార్లు తన అవసరానికి మాత్రం ఎదుట వ్యక్తి నుండి సహాయం పొంది, అవతలి వ్యక్తి విషయం వచ్చేసరికి అతడిని ఇక్కట్లలో వదిలేసి తన స్వార్ధం తాను చూసుకుంటూ కృతజ్ఞతారహితుడిగా ప్రవర్తిస్తాడు.అటువంటి ఒక స్థితి మానవ సంబంధాల మీద మనకున్న నమ్మకాన్ని పూర్తిగా చెరిపేస్తుంది.

అటువంటి స్వార్ధం నిండిన మనుష్యుల మధ్య ఒక మనిషిని విడిచి ఇది మృతనగరం అని మనుష్యులలో వట్టిపోయిన మానవత్వం గురించి చెబుతూనే, మరో పక్క చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే వ్యక్తికి రెండు చుక్కుల నీరు అందించి మనుష్యులలో మానవత్వం ఇంకా ఎంతో కొంత సజీవంగానే ఉందని చెప్పకనే చెబుతాడు రచయిత.

ఈ కథకు గాను 2008 లో కేరళ సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నాడు సంతోష్ ఏచ్చిక్కానం.

కొమాలా

“అప్పుల బాధ తట్టుకోలేక వచ్చే ఆగస్టు నెల 15 వ తేది అర్ధరాత్రి 12 గంటలకు కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకోబోతున్నాను” అన్న ప్రకటనా బోర్డును తన ఇంటి ముందు వేలాడదీసి దాని ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించాడు 45 ఏళ్ల గుండూరు విశ్వన్.ఈ బాహాటమైన ఆత్మహత్య ప్రకటన ప్రస్తుతం కేరళ ఎదుర్కొంటున్న వ్యాపార, సామూహిక,మానసిక వివక్షలను ఎత్తి చూపే ప్రకటనా బోర్డు కూడా.విశ్వన్ ఆత్మహత్య చేసుకుంటాడా…లేదా…

మన నిద్రను చెదరగొట్టే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు విశ్వన్ మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు.

“భారతదేశపు 59 వ స్వాతంత్ర దినంలో ఇటువంటి విచిత్రమైన బెదిరింపు నిజమైతే గనుక దాని పర్యవశనం ఏమైయుంటుంది. ఇందులో దోషులు ఎవరెవరు? వెళ్లూరు కోపరేటివ్ బ్యాంకా లేక 50,000 రూపాయలు లోన్ పొందేందుకు  విశ్వన్ ని హామీదారునిగా చేశాక, కనిపించకుండా పోయిన అతని ప్రాణ స్నేహితుడు, వెళ్లూరు తూర్పు వీధి నంబర్ 1256/83 లో నివాసముండే కుంజమాన్ కొడుకు సుధాకరన్ ఆహ్? కేరళ యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సమస్య అనేక కోణాల గురించి వివాదించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మానసిక నిపుణుడు, సామాజికవేత్త,రచయిత అయినటువంటి డాక్టర్ C.నంద కుమార్,వెళ్లూరు కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్ మాధవన్ నాయర్ గారు,నేషనల్ క్రైమ్ రెకార్డ్ రీసెర్చ్ బ్యూరో చీఫ్ ఆఫీసర్ అలెక్స్ పున్నూస్ గారు మొదలైనవారు, వీరితో పాటు ఫోన్ లైన్ లో గుండూరు విశ్వన్, అడ్వకేట్  ఫాతిమా బేగం గారు ఉన్నారు. ‘న్యూస్ టైమ్’ కొనసాగుతోంది. అంతకు ముందు ఒక షార్ట్ బ్రేక్.”

మీ కలల ఇల్లు నిజమయ్యేందుకు ఇదిగో మీతోపాటు మేము ఉన్నాం.

మూళూరు టవర్స్ – రెసిడెన్సీ… బెటర్ లొకేషన్, బెటర్ లైఫ్ స్టైల్ క్రియేషన్స్ ఫర్ జెనరేషన్స్.

“న్యూస్ టైమ్ కొనసాగుతుంది… గుండూరు విశ్వన్ గారు సరిగ్గా వినబడుతుందా… నిజానికి ఏం జరిగింది,చెప్పండి..? మీ కుటుంబ పరిస్థితుల గురించి కాస్త షార్ట్ గా చెబుతారా..”

“నా పేరు విశ్వన్… గుండూరు నుండి మాట్లాడుతున్నాను.”

“అవును… వినిపిస్తోంది…చెప్పండి విశ్వన్…”

“నాకు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు… తిండీ తిప్పలు మానేసి,కాయ కష్టం చేసి సంపాదించి ఈ ఏడున్నర సెంట్ల భూమి,ఇల్లు కొనుక్కున్నాను. ఇంకా సిమెంట్ కూడా పూయలేదు.కాంక్రీట్ పని ఎలాగో పూర్తి చేసి,గత కార్తీక మాసంలో ఇంట్లోకి దిగాం.దీన్ని కూడా బ్యాంక్ వాళ్లు లాగేసుకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి తెలియడం లేదు”.

“విశ్వన్ ఎలా మీరు ఈ అప్పు సమస్యల్లో ఇరుక్కున్నారు”

“ఇరుక్కోలేదు… ఇరుక్కునేలా చేసాడు.. నా మిత్రుడు సుధాకరన్. రెండేళ్లకు ముందు కుటుంబం తో పాటు గుండూరుకు తరలి వచ్చాము.ఇద్దరం ఎనిమిదో క్లాస్ వరకు వెళ్లూరు గవర్నమెంట్ స్కూల్ లో ఒకే బెంచ్ లో కూర్చుని చదువుకున్నవాళ్లం.అన్యులకు మేలు చేయడం పుణ్యమని మా ఉపాధ్యాయుడు నేర్పించింది నేను ఇంకా మర్చిపోలేదు.ఒకరోజు ఉదయం వాడు మా ఇంటికి ఏడుస్తూ వచ్చి, బాధపడితే ఆ అప్పు పత్రం మీద మొదటి హామీదారుడుగా నా సంతకం తీసుకొని వెళ్లేముందు నా అరచెయ్యిని చూసి వాడు చెప్పింది కూడా అదే మాటనే. “అన్యులకు మేలు చేయడం పుణ్యం,అన్యుణ్ణి హింసించడం పాపం.ఈ మేలు నేను మర్చిపోనురా విశ్వన్…”సుధాకరన్ తన కళ్లు నులుముకున్నాడు. ఆపై నీకు ఏ సాయం కావాలన్నా మర్చిపోకుండా నన్ను అడుగు అన్నాడు. మూడేళ్లు దాటాక అసలూ వడ్డీ కలిపి 50,000 రూపాయలు కట్టాలని ఒక బ్యాంక్ నోటీస్ ఇంటిని వెదుక్కుంటూ వచ్చినపుడు నేనడిగా,సుధాకరన్ నాకు ఇద్దరు ఆడ పిల్లలు.నువ్వు మమ్మల్ని వీధికి తోయకు…”

“సరే మిస్టర్ విశ్వన్ మనం మళ్లీ మాట్లాడుదాం.ఈ విషయం గురించి మాట్లాడేందుకు వెళ్లూరు కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్ మాధవన్ నాయర్ మన మధ్య ఉన్నారు.మిస్టర్ నాయర్,మీరు మేనేజర్ పదవిలోనున్న బ్యాంక్ కారణంగా నిరపరాధైన ఒక మనిషి ఆత్మహత్య చేసుకోబుతున్నాడు.దీన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి?”

“మా కోపరేటివ్ బ్యాంక్ చట్టం ప్రకారం మాత్రమే యాక్షన్ తీసుకోగలం.లోన్ తీసుకుంది సుధాకరన్.అతను లోన్ కట్టలేని పక్షంలో అసలూ వడ్డీ కలిపి తొంభై వేల మూడు వందల నలభైయైదు రూపాయల వరకు హామీదారుడు తిరిగి చెల్లించే తీరాలి. లేకపోతే విశ్వన్ ఇంటిని, తోటని, జప్తు చేయడం తప్ప బ్యాంక్ కి వేరే మార్గం లేదు.”

“ఇది ఇంత సీరియస్ విషయం అని విశ్వన్ కి తెలియపరిచారా?”

“ఖచ్చితంగా, రిజిస్టర్ నోటీస్ మొదలుకొని అన్నిరకాల రూల్స్ ని అనుసరించాం.జప్తును వాయిదా వేసేందుకు మా వలన సాధ్యమైనంత  వరకు ప్రయత్నించాం.డబ్బులు ఏర్పాటు చేసుకునేందుకు విశ్వన్ కి కావలసినంత సమయం కూడా ఇచ్చాము.అయితే ఆయన తిరిగిచ్చింది కేవలం ఏడువేల రూపాయలు మాత్రమే.అప్పు ఇప్పుడు అసలూ వడ్డీ కలిపి తొంభై వేలు అయిపోయింది”

“మనం విశ్వన్ తో మళ్లీ మాట్లాడదాం. హలో విశ్వన్.బ్యాంక్ అధికారి చెప్పింది మీరు గమనించారా?”

“అవును, ఆయన చెప్పింది నిజమే.కేవలం ఏడు వేలే అని ఆయన వెటకారంగా చెప్పొచ్చు.అయితే మూడు నాలుగేళ్లు మిషన్ కుట్టుకుంటూ ఇంత డబ్బు చేర్చేందుకు నా రాధ ఎంత కష్టపడిందో తెలుసా? ఆఖరికి మోకాలు వాచిపోయి నడవలేకుండా ఒక వారం పాటు డాక్టరిచ్చిన మందులు వేసుకోవాల్సి వచ్చింది.నాలో ఒక నిష్కల్మషమైన మనిషున్నాడు సార్. అందువలనే కదా ఏడు వేలంటే, ఏడువేలైనా తీసుకెళ్లి మేనేజర్ దగ్గర ఇచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాను.ఒక మనిషి ఇంకో మనిషి ముందు చేతులు జోడించి నిలపబడటం కంటే పెద్ద అవమానం ఈ ప్రపంచంలో వేరే ఉంటుందా? సుధాకరన్ కోసం నేను దానిని కూడా సహించాను.ఇక నా చేతిలో ఈ ఇల్లు,తోట తప్పించి మరేదీ లేదు.”

“మాధవన్ నాయర్ గారు,ఇంతటి గౌరవస్తుడైన హామీదారుని విషయంలో వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం లాంటివి మీ బ్యాంక్ తరుపు నుండి ఎదురుచూడొచ్చా?”

“కన్నీటిని బట్టి రుణాలను పూర్తిగా మాఫీ చేయడం మొదలుపెడితే ఆపై బ్యాంకుని మూసేసి ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సిందే. మనుష్యుల ప్రాణాలను కాపాడే బాధ్యత బ్యాంకులకు లేదు.డబ్బు ఇవ్వడం,తీసుకోవడం మాత్రమే బ్యాంకుల పని.ఇచ్చిన అప్పు తిరిగిరాకపోతే విశ్వన్ ఆస్తిని మేము జప్తు చేస్తాము.”

“ఈ సమస్యలో బ్యాంకు తరపు వాదాన్ని వివరించారు మాధవన్ నాయర్ గారు.అయితే గుండూరు విశ్వన్ జీవితమో ఒక  త్రాసులో ఊగిసలాడుతోంది.నందకుమార్ గారు ప్రముఖ మానసిక నిపుణుడు, సామాజికవేత్త అయినటువంటి మీరు ఏం చెబుతున్నారు? విశ్వన్ ఆత్మహత్య చేసుకుంటాడా?”

“చేసుకోవచ్చు,చేసుకోకుండా కూడా ఉండొచ్చు. ఎలాగైనా ఆత్మహత్యకు పధకం ప్రకారం ఏర్పాట్లు విశ్వన్ మనసులో ముందుగానే రూపొందే ఉంటాయని అర్థం చేసుకోవాలి.అయితే మరణం గురించి ఆలోచించే ఒకడిని జీవితం తిరిగి వెనక్కి లాగి తీవ్రంగా ఆశ చూపిస్తుంది.అది వాడికి అదనపు భయాన్ని కలిగిస్తుంది.ఉదాహరణకు ఉరిశిక్ష వేయబోయే నేరస్థుడి చివరి ఆశను అడగటం లేదా..?”

“అవును, డాక్టర్ చెప్పండి…”

“తాడును బిగించి తీర్మానించబడ్డ మరణం ముందు కూడా వారు నిశ్చలంగా ఉండటం లేదు.మంచి ఆహారం…బట్టలు… ఫోన్ లో ఒక మాట…అయినా సరే మనిషి ఆశలకు హద్దు లేదు.విశ్వన్ విషయంలో కూడా అదే జరిగింది. అతడు ఆత్మహత్య చేసుకునే తీరాలి. అయితే మరణం కంటే అతిపెద్ద భయం ఒకటి అతడి మనసులో మరో చోట మూలుగుతుంది. జీవితపు ఆకర్షణలు భయంకరమైనవి.మోహపు అంచుల వరకు మనల్ని కట్టిపడేసి గట్టిగా బిగిస్తాయి.ఒక మట్టి కుండలా మనం సౌకర్యవంతమైన సుఖంలోకి దిగివెళ్లి నీటి స్థావరాలకు నడుమ వాటి తాకిడిని అనుభవిస్తూ మనల్ని ఎరగకుండా నిద్రించి ఒక కలలా మారిపోతాం.కొన్నిసార్లు ఒక ప్రాణ స్నేహితుని హక్కుతోటి అది మనల్ని భుజాలకి ఎక్కించి ఒక మార్గం గుండా తీసుకువెళుతుంది.ఆపై ఏదో ఒక కారడవిలో వదిలేస్తుంది.ఎవరూ కూడా ఇంతవరకు ముట్టుకోని మొక్కల,మట్టి యొక్క కఠినమైన వాసన మనల్ని ఒక సీతాకోకచిలుకలాగా మారుస్తుంది.వయసైన చెట్ల మౌనానికి మీదగా వాటి త్యాగాన్ని సృజిస్తూ ఒక పడవలా మనం పయనిస్తాం.వీటన్నింటిని దాటి వెళ్లూరు బ్యాంక్ కి అప్పుపడ్డవాడిగానో, రాధా అనే ఆడ టైలర్ భర్తగానో విశ్వన్ గనుక కొనసాగ గలిగితే అతడు ఆత్మహత్య చేసుకోగలడు.ఇది నిశ్చయము…”

“డాక్టర్ నందకుమార్…మనం సమస్యకు వద్దాం.”

“Yes…Yes.. I’m coming to that aspect. చచ్చిపోవాలి అని నిర్ణయించుకున్న మనిషి దాన్ని అలాగే చేసేసి ఉండొచ్చు కదా? అయితే విశ్వన్ విషయంలో జరిగింది ఏంటి? చనిపోయేందుకు అతడు స్వాతంత్ర్య దినాన్ని ఎంచుకున్నాడు. ఇంటికి ముందు పెద్ద అక్షరాలతో బెదిరింపు ప్రకటనను రాసి ఉంచాడు. చచ్చేందుకు కాదు,చావకుండా ఉండేందుకే ఇలా చేశాడు.నేను ఇంతకు ముందే ఎత్తిచూపినట్టు అతడు మరణంలాగే, జీవితాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. whatever it is, the problem is very serious.right to live with personal liberty is fundamental.అది కూడా నిరాకరించబడితే ఏం చెయ్యాలి… ఇక్కడ నెలకొన్న సోషల్ సెటప్ వక్రత్వాన్నే విశ్వన్ మన ముందు రాసి ఉంచుతున్నాడు. కేవలం వెళ్లూరు కో-ఆపరేటివ్ బ్యాంక్ తోపాటు పక్కన పెట్టేసే విషయం కాదిది…”

“డాక్టర్,విశ్వన్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఆయన చనిపోవాలా?వద్దా?”.

“దీనికి సమాధానం వెదకవలసింది నేను కాదు. తరువాత…ఇందులో ఇంకో నిజం ఉండడాన్ని మనం మర్చిపోకూడదు.సమాజం ముందు ఒక విషయం విశ్లేషించబడాలి అంటే అందుకు ఒక త్యాగి ఖచ్చితంగా ఉండి తీరాలి.”

“ఓకే సార్.. చర్చను కొనసాగిద్దాం… దానికి ముందు ఈ రోజు ముఖ్యవార్తలు…”

అణుశక్తి పరిశోధనా సహకారం శక్తివంతం చేసేందుకు ఇండియా- అమెరికా ఒప్పందం.

అమ్యూస్మెంట్ పార్కులకు పన్ను వసూలు చేసేందుకు  Entertainment Tax Bill ను చట్టసభ అంగీకరించింది.

శబరిమలైకి రాకపోకలు రేపు నిషేధించబడుతాయి.

Ashesh cricket series లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 190 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.

“గుండూరు విశ్వన్ సమస్యను మనోతత్వ రీతిలో పరిశీలన చేసిన డాక్టర్ నందకుమార్ ఈ చర్చలో కొత్త మలుపులకు తెరలేపారు.ఆత్మహత్యకు సంబంధించిన చట్టాలను గురించి మాట్లాడేందుకు ఉన్నత న్యాయస్థాన అడ్వాకేట్ శ్రీమతి ఫాతిమా బేగం ప్రస్తుతం లైన్లో ఉన్నారు.హలో… అడ్వాకేట్ ఫాతిమా బేగం…”

“యెస్”

“న్యూస్ టైం కి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం,నమస్కారం.ఇక్కడ ఇంతవరకు వివాదించిన విషయాలను మీరు కూడా గమనించి ఉండి ఉంటారు అని నమ్ముతున్నాం, మేడమ్”

“ఖచ్చితంగా”

విశ్వన్ ఆత్మహత్య చేసుకుంటాడా? లేదా అనే విషయం అలా ఉంచుదాం. మేడమ్, మీ దగ్గర మేము వినాలనుకుంది ఆత్మహత్య చట్టపూర్వక చర్యల గురించే. తనని చంపుకునేందుకు సిద్ధంగా ఉండే ఒకడు చట్టపూర్వకంగా ఎదుర్కోవలసిన సమస్యలు ఎటువంటివి?”

“….”

“హలో..హలో…హలో..క్షమించగలరు. సాంకేతిక ఇబ్బంది కారణంగా లైన్ సరిగ్గా దొరకడం లేదు.మళ్లీ ప్రయత్నించండి.అంతకు ముందు,కేరళలో ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న ఆత్మహత్యలు గురించి మాట్లాడేందుకు అఖిల భారతదేశ క్రైమ్ రికార్డ్స్ రీసెర్చ్ బ్యూరో (AICRB) ఉన్నత అధికారి అలెక్స్ పున్నూస్ గారు మనతో పాటు ఉన్నారు.సార్ మేము ఇప్పుడు చెప్పిన విషయం కరెక్టేనా?”

“చాలా చాలా కరెక్ట్. Kerala is the highest rate of suicide in the country.National Wide చూస్తే కేరళ చాలా అపాయకరమైన పరిస్థితుల వైపుగా వెళుతుంది అనే చెప్పొచ్చు.మద్యపానం, నేరచర్యల వంటి విషయాలలోను ఇదే పరిస్థితి. 2004 లెక్కల ప్రకారం 11300 మంది కేరళలో ఆత్మహత్య చేసుకున్నారు.ఒక్కో ఏటా ఆత్మహత్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఇంకొక విషయం వినాలా… మీకు షాకింగ్ గా ఉంటుంది. సమీప కాలంలో తీసిన ఒక గణాంకాలో 11000 స్కూల్ విద్యార్థులలో,ఎంత? Eleven thousand! అందులో 27 శాతం మంది అన్ని వేళలా ఆత్మహత్య గురించే ఆలోచిస్తున్నారంటా.

16 శాతం విద్యార్థులు తాము ఎలా చావాలి అని దాదాపుగా నిర్ణయించుకున్నారు. 8 శాతం విద్యార్థులు ఆత్మహత్యకు సంబంధించి మొదటి ప్రయత్నాన్ని చేసి చూశారంట.ఇలాగే పోతే ఇంకా 10 లేక 20 ఏళ్లలోపు కేరళ మృతుల రాష్ట్రంగా మారిపోబోతుంది.ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత హువాన్ రూల్ఫో (Juan Rulfo) “పెడ్రో పరామో” (Pedro paramo) అనే నవలలో వచ్చే “కొమాలా” (comala) అనే నగరంలా మన కేరళ మారిపోతుంది. నేనూ,మీరూ అందరూ చనిపోయినవాళ్ళం…హా…హా… హా.. కేరళ-కొమాలా,కొమాలా-కేరళ హా…హా…హా…”

“మనిషి ఎందుకు సార్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు?”

” ఈ ప్రశ్నను మీరు డాక్టర్ నందకుమార్ దగ్గర అడగాలి, మా వద్ద “డేటా” మాత్రమే ఉంది. అయినాసరే చెబుతున్నా వ్యాధి, అప్పుల బాధ, ప్రేమ వైఫల్యం,మానసిక ఒత్తిడి వంటి అనేక కారణాలు దీని వెనుక పనిచేస్తున్నాయి.

విశ్వన్ విషయంలో అప్పుల బాధ అని చెప్పొచ్చు. అయితే అప్పుల సమస్య మాత్రమే అని ఖచ్చితంగాను చెప్పనూ లేము. దాని కంటే ముందు విశ్వన్ ని రుణస్తుడ్ని చేసిన సమాజ నిర్మాణాన్ని అధ్యయనం చేయాలి. అలా చూస్తే అప్పు ఒకటే నిజమైన కారణం అని స్పష్టమవుతుంది.ఒక వ్యక్తిని రుణస్తుడ్ని చేసేది ఈ దేశపు రాజకీయ నిర్మాణమే. ఉదాహరణగా…”

“సార్, మనం తరువాత తిరిగి మాట్లాడుదాం. ఇప్పుడు అడ్వాకేట్ ఫాతిమా బేగం లైన్లోకి వస్తున్నారు. హలో మేడమ్, కొంతసేపటి క్రితం ఆత్మహత్య చట్టపూర్వక చర్యల గురించి నేను అడిగాను. కాస్త వివరంగా చెబుతారా?”

“IPC 307 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా యత్నమే నేరమూ. పది ఏళ్ల వరకు జైలు శిక్ష వేసి,జరిమానా విధించేందుకు న్యాయస్థానానికి అధికారం ఉంది.ఆత్మహత్యా యత్నం మాత్రం కాదు, ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా అతిపెద్ద నేరమే.ఆగస్టు 15 వ తేది కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని బోర్డు రాసి పెట్టిన విశ్వన్ ఈ ప్రయత్నంలో విఫలమైతే పైన పేర్కొన్న రెండు నేరాలు ఆయన మీద మోపబడుతాయి అని కూడా చెప్పొచ్చు.”

“ఆత్మహత్య నేరం కాదు అని ఇంతకముందు ఒకసారి న్యాయస్థానం తీర్పు ఇచ్చిందిగా?”

“అది మహారాష్ట్ర న్యాయస్థానం తీర్పు. ఆ తీర్పు తరువాత సుప్రీం కోర్టు రద్దు చేసింది.”

” అప్పుడు మీ వాదన ప్రకారం విశ్వన్ అనే వ్యక్తి కుటుంబంతో పాటు మరణించే తీరాలి అంటున్నారా?”

“అలా చెప్పను అయితే ఈ ప్రయత్నంలో ఆయన విఫలం అయితే నూటికి నూరు శాతం శిక్షకు గురవుతాడు.”

“సరే మేడమ్.మళ్లీ గుండూరు విశ్వన్ దగ్గరకి వద్దాం…హలో విశ్వన్…”.

“అవును, నేనే.. విశ్వన్…”

“మీ సమస్య గురించి వివరంగా ఒక ఇక్కడ పెద్ద చర్చే జరిగింది.విశ్వన్ ఈ సమస్యలో మీరు ఏదైనా ముఖ్యంగా చెప్పవలసింది ఉందా? షార్ట్ గా చెప్పాలి. న్యూస్ టైమ్ సమయం పూర్తి కాబోతుంది, తక్కువ మాటలలో…. ఓకే చెప్పండి, విశ్వన్…”

“నాకు పెద్ద చదువో, జ్ఞానమో, మనసులోది ఉన్నదున్నట్టు చెప్పే తెలివో లేదండి.జప్తికి,మరణానికి మధ్య నేనూ,నా కుటుంబము ఒక తాడు మీద నడుస్తున్నాం. ఈ పదిహేను సంవత్సరాలలో నేను ఎన్నో కష్టాలు పడ్డవాడ్ని.సొంత అనుభవం నుండే కదా ఒకడు అన్ని పాఠాలు నేర్చుకుంటున్నాడు. రేపు మరొక మనిషి హామీదారుడుగా నిలబడి మోసగించబడడానికి ముందే అతని వద్ద నేను రెండు విషయాలు చెప్పవలసి ఉంది”

“త్వరగా చెప్పండి..టైమ్…”

“ఎంతగా చెప్పినా ప్రపంచంలో మనం ప్రతిఒక్కరం ఒంటరి మనుష్యులమే. చెరువులోకి విసిరినా, కొలిచి విసరాలి అని ఒక సామెత ఉంది. అందువలన కన్న తల్లి దగ్గర ఉన్నప్పటికీ డబ్బు విషయంలో సరిగ్గా రాసి పెట్టుకోవాలి. లెక్కలు మాట్లాడేందుకు కాదు. రేపు ఇతరులు మనల్ని అలా మాట్లాడేలా చేసేటప్పుడు మర్యాదగా సమాధానం చెప్పేందుకు ఏదైనా ఆధారం వద్దా?

రెండవదిగా, దగ్గర మిత్రులకు మధ్య డబ్బు మార్పిడి చేయకూడదు.

మూడవదిగా, ఎవరికి 5000 వేల రూపాయలకు పైన అప్పుగా ఇవ్వకూడదు.అలా ఇచ్చినా సరే postdated cheque, ఒప్పంద పత్రం రాసి పెట్టి ఉంచుకోవాలి. లేకపోతే రేపు డబ్బు విషయంగా సమస్య వస్తే మీలో మాట మాట పెరిగి గొడవ అవుతుంది. దృఢమైన స్నేహం అని తియ్యగా ఒకరికొకరు చెప్పుకొని నాక్కోవచ్చు.అయితే చిన్నదొక వివాదం వస్తే ఏ బంధమైనా ఒక నిముషంలోపు పగిలి చిన్నాభిన్నమవుతుంది.

నాల్గవదిగా, తన సంరక్షణా, జీవితమూ ఎటువంటి   స్థితిలో ఉంది అని ఆలోచించుకోకుండా ఒక పైసా కూడా ఎవరికి సాయంగా ఇవ్వకూడదు.మనం కొంత స్వార్ధపరుడని ప్రతిఒక్కరూ మొదట చెవులు కొరుక్కున్నా సరే, అలా ఖచ్చితంగా ఉంటే ఇప్పుడు కనీసం స్నేహమైనా మిగిలివుంది కదా అని తరువాత అర్ధమవుతుంది.అప్పులు తలకు మించి చేరి,బ్రతికేందుకు దారి లేని మీకు కల్లు కొనిచ్చేందుకు చాలా మంది ఉంటారు.అయితే ఒక కేజీ బియ్యం కొనేందుకు డబ్బులు అడిగితే ఒక్కడు తిరిగి చూడడు.

“టైమ్ అవుతుంది విశ్వన్…”

“చివరిగా ఒక విషయాన్ని చెప్పేస్తాను సార్. ఒకడు చాలా ప్రేమను కురిపిస్తూ, వాగ్దానాలు చేస్తూ మీ వెంట వస్తున్నాడంటే కాస్త పరీక్ష చేసేలా డబ్బును అప్పుగా అడిగి చూడండి. మరుసటి రోజు నుండి ఆ మనిషి నీడను కూడా చూడలేరు.

“సరే విశ్వన్, ఒక వ్యక్తికి హామీదారుడుగా నిలబడినందుకు మీరు గొప్ప విషయాలన్నింటిని అర్ధం చేసుకున్నారు.డాక్టర్ నందకుమార్, మాధవన్ నాయర్ గారు,అడ్వాకేట్ ఫాతిమా బేగం, అలెక్స్ పున్నూస్ గారు, విశ్వన్, ఈ చర్చలో పాలుపంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు.

“గుండూరు విశ్వన్ ఆత్మహత్య తప్పనిసరా? అభిప్రాయల ఎన్నికలో పాలుపంచుకునే ప్రేక్షకులు అరబ్ దేశాల నుండి అయితే 6798 అన్న నంబర్ కి, ఇండియా లోపల నుండి అయితే 2354 అనే నంబర్ కి మాకు SMS చేయవచ్చు.”

తన విషయంలో ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటని తెలుసుకునేందుకు కుతూహలంగా మరుసటిరోజు న్యూస్ టైమ్ కి అరగంట సమయం ముందుగానే విశ్వన్ ఇంటి నుండి బయలుదేరాడు. తలకి గొడుగులాగా అడ్డు పెట్టుకున్న చేతి మీద కురుస్తున్న సన్నని వర్షంలో గ్రంధాలయంలోకి వెళ్లినపుడు టీవీ ముందు సాధారణంగా ఎప్పుడు ఉండే వారి కంటే ఎక్కువ సంఖ్యలో జనం ఉన్నారు. అయితే ఎదురుచూసిన విధంగా ఎవరూ కూడా ముందు రోజు జరిగిన చర్చ గురించి విశ్వన్ దగ్గర ఏదీ అడగలేదు. బదులుకి వాళ్లు బంగాళాఖాతంలో చోటు చేసుకున్న తుఫాను గురించి బాధతో సిగరెట్ తాగుతున్నారు.

న్యూస్ టైమ్ మొదలైంది.

సాధారణంగా, ముందురోజు  జరిపిన ఓట్ల లెక్కింపు ప్రకారం అభిప్రాయాల శాతం ఎంత అని రాసి చూపించి వీక్షకుల ఎదురుచూపుల గురించి, ప్రభుత్వం ఈ విషయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యల గురించి ఒక పూర్తి నివేదికను టీవీ చానెల్ తరపున నివేధించడం జరుగుతుంది. అయితే ఆ రెండు విషయాలు జరగలేదు. ఆరోజు న్యూస్ ఛానెల్ కార్యక్రమంలో ఎడిటర్ ఇలాగే మొదలుపెట్టాడు.

“గుండూరు విశ్వన్ ఆత్మహత్య బెదిరింపుకు సంబంధించి నిన్న జరిగిన చర్చలో విశ్వన్ ఆత్మహత్య చేసుకోవాలా? వద్దా అన్న మా ప్రశ్నకు వీక్షకుల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. న్యూస్ టైమ్ కు సంబంధించినంత వరకు ఇది ఒక కొత్త అనుభవం. డిస్కవరీ రోదసీ నౌక కొలంబియా నుండి మళ్లీ వెళుతుందా? ఈరోజు చర్చను ప్రారంభించే ముందు ఒక చిన్న బ్రేక్.”

విశ్వన్ తరువాత అక్కడ నిలబడలేదు. వర్షంలోకి దిగి నడిచి వెళ్లే ముందు గ్రంధాలయ ఇంచార్జ్ రమేష్ వద్ద “పెడ్రో పరామో” అన్న పుస్తకం గురించి విచారించాడు.దట్టమైన పాత అలమరలో నుండి పేజీలు చెదలు పట్టి రాలుతున్న ప్రసిద్ధి చెందిన ఆ మెక్సికన్ నవలను తీసుకొని విశ్వన్ దగ్గర ఇచ్ఛేటపుడు రమేష్ నవ్వుతూ “విశ్వన్ అన్న, మీరు చనిపోబోతున్నారు కదా? ఇది చనిపోయిన వారి పుస్తకం…” అని చెప్పాడు. ముందురోజు చర్చలో అలెక్స్ పున్నూస్ చెప్పిన “కొమాలా” అనే ఊరి కోసం తెలుసుకునేందుకు విశ్వన్ కి కుతూహలం ఎక్కువైంది. రాత్రిలో అందరూ పడుకున్నాక హరికేన్ లాంతరు సన్నని కాంతిలో అతడు నవల పేజీలను తిప్పాడు. నవలను గొప్పగా అర్ధం చేసుకోదగిన వ్యక్తి కాకపోయినా ‘కొమాలా’ చనిపోయినవారి ఆత్మల ఊరు అన్నది అతడికి తేలికగా అర్ధమైంది.

Juan Preciado అనే యువకుడు తన తండ్రి అయినటువంటి pedro paramo ని వెదికి కొమాలాకి వచ్చే తరుణంలో నవల మొదలవుతుంది. కరువు నిండిన ఊరు మొత్తం మరణించినవారి గొంతులు ప్రతిధ్వనిస్తాయి. అక్కడకు వచ్చి చేరిన కొన్ని రోజులలో Juan Preciado కూడా మరణిస్తాడు. నవలలో ఒక చోట     ఒక పాత్ర కొమాలా గురించి చెప్పిన మాటల క్రింద విశ్వన్ పెన్నుతో గీత గీసుకున్నాడు.

“…ఇక్కడ ఏమి లేదు. ఎక్కడ చూసినా కనబడే పులిసిపోయిన దుర్గంధం తప్ప. ఈ గ్రామమే ఒక దురదృష్టమే.కేవలం దురదృష్టమే…”

ఒక్క రాత్రిలో చదివి ముగించి పుస్తకాన్ని కింద పెట్టినప్పుడు దాని సంక్లిష్టమైన నిర్మాణం, విషయము విశ్వన్ ని మేఘాలలోకి తీసుకువెళ్లింది.తన జీవితం కూడా కొమాలా లాగా వట్టిపోయిందని, సహించలేనిదని అతడు అర్ధం చేసుకున్నాడు. కిటికీలో నుండి వీచే వర్షపు తుంపరలు చూస్తూ చాలాసేపు అతడు ఏడుస్తూ ఉన్నాడు.తరువాత లాంతరు ఒత్తిని ఆర్పేశాడు.

ఉదయం లేచినపుడు మరణానికి , జీవితానికి మధ్య ఎక్కడో తనను కోల్పోయినట్లు అతనికి అనిపించింది. చేతిలో టీ తో వచ్చిన భార్య, డోరోత్తి* లాగా ఇంతకుముందే మరణించిందేమో ఆమె అని భయపడ్డాడు.

ముందురోజు రాత్రి బంగాళాఖాతంలో చోటు చేసుకున్న తుఫాను పెరటిలోనున్న లవంగం మొక్కల ఆకులన్నింటిని పెకళించింది.ఎలాగైనా సుధాకరన్ ని వెదికి కనిపెట్టాలని ఆలోచించాడు. అయితే కనుమరుగైన ఒకడిని ఎక్కడని విచారించడం? విశ్వన్ బయటకి నడిచి వెళుతుండగా ” సుధాకరన్ ని మీరు ఎన్నటికీ కనిపెట్టలేరు” అంది అతడి భార్య.

“అది కూడా నిజమే” అన్నాడు అతడు. చెప్పులో అంటుకొనున్న వర్షపు నీటిని విదిల్చాడు.తరువాత “ఆగస్టు 15 అయ్యేందుకు ఇంకా ఒక వారం ఉంది. చనిపోయేందుకు నిర్ణయం తీసుకోవడం వలనో ఏమో  నాకు చాలా బోర్ కొట్టడం మొదలయింది. ఇక మిగిలి ఉన్న ఏడు రోజులలో ఊరికే ఒక ప్రయాణం. సుధాకరన్ వద్దకు వెళ్లాలని నమ్మకం ఉంది. ఒకవేళ చూడలేకపోయినా పర్వాలేదు. అనేక నమ్మకాలపైనే ఈ ప్రపంచమే పరిగెడుతుంది?” అన్నాడు.

ఒక్క రాత్రిలో విశ్వన్ చాలా మారిపోయినట్టుగా అతడి భార్యకు అనిపించింది. ఆత్మహత్య ప్రకటన రాసి ఉంచిన బోర్డు గాలిలో కిందకు జారింది.అది బాగా మట్టిలో ఆనుకొన్నప్పుడు ఇంటివైపు చూస్తూ ” భయపడకు చనిపోయే సమయానికి  తిరిగొచ్చేస్తాను” అని చెప్పాడు. భార్య తలూపి ఇంటి ముందుగుమ్మం తలుపుని మూసింది.

సుధాకరన్ ని వెదికి విశ్వన్ అనేక దిక్కులలో సంచరించాడు. నిజం చెప్పాలంటే మరణానికంటే ముందుగా చోటు చేసుకున్న శూన్యాన్ని లేకుండా చేసే ఒక ఊహాత్మక లక్ష్యం మాత్రమే సుధాకరన్ అనొచ్చు. అనేకమంది దగ్గర సుధాకరన్ గురించి విచారించాడు.వాళ్లో, తమను మోసం చేసిన ఇతరులనేకమందిని ఎదురుచూస్తూన్నారు.

ప్రయాణపు ఐదవ రోజు సమయం చాలా సేపు దాటగా విశ్వన్ రహదారిలో లారీలకు చెయి చూపించి నిలబడ్డాడు.వాహనాలు అతడిని గమనించకుండా దాటేళ్లుతున్నాయి. చాలా రోజుల ప్రయాణపు దుమ్మూ, చెమటా అతడి షర్ట్ కాలర్ లో మురికిగా అంటుకునున్నాయి.అతడు జంక్షన్ లో నిలబడ్డాడు. అక్కడ క్రాసింగ్ లైన్స్ అనేకం ఉండి కూడా ఆ సమయంలో ఒక తోపుడు బండి మాత్రమే నడుస్తుంది. దాని చుట్టూ అనేక మంది నిలబడి ఉన్నారు. టీ కెటిల్ పెట్టి ఉంచిన స్టవ్ గుర్రుమనే శబ్దం తప్పిస్తే సాధారణంగా ,అక్కడ అందరూ మరణించినవారి కంటే నిశ్శబ్దంగా ఉన్నారు.ఎందుకంటే వేగుతున్న మాసం వైపుగా వారి చేతిలోనున్న ప్లేట్లు ముందుకెళ్ళాయి. కొమాలాలోనున్న మనుష్యులు కూడా ఇంచుమించు వీరిలాగే అని ఆలోచించాడు విశ్వన్. ఎగ్ బజ్జీని తీసుకుని నోట్లో వేసుకునేవాడు *అబున్ థియో గా వుండి ఉండొచ్చు.చేతిని కడిగి కర్చీఫ్ కి తుడుస్తూ బిల్లును ఇచ్చే వాడు టోనియా * ఎదుహేజ్ గా ఉండి ఉండొచ్చు.

అతడికి బాగా ఆకలేసింది. లారీ డబ్బులు పోగా షర్ట్ జేబులో కొన్ని నాణేలు మాత్రమే మిగిలాయి.

“పాలు లేని కాఫీ ఒకటి” అన్నాడు అతడు. వేడి నీటిలో కాఫీ పొడి వేసి స్పూన్ తో శబ్దం వచ్చేలా తిప్పి తోపుడు బండి వాడు, విశ్వన్ వైపుగా గ్లాసును ఉంచాడు. కాఫీని పెదవులపై పెట్టిన సమయం రోడ్డులో బ్రేక్ శబ్దం అరుస్తూ డమాల్ అనే ఉరుము శబ్దము విని విశ్వన్ తిరిగి చూసాడు. ఒక మనిషి ప్రాణం విసిరి వేయబడి గాలిలో తలక్రిందులుగా నేలపైకి వచ్చి తలను గుద్దుకొని పడ్డాడు. నుజ్జయిపోయిన మోటార్ బైక్ చక్రం బురదలో వేగంగా తిరిగింది. తరువాత మెల్లగా తగ్గింది. అతడికి ఎటువంటి దిగ్భ్రాంతి కలుగలేదు. ఇది ఇంతకు ముందెపుడైన జరిగి ఉంటే అతడు ఆ వేడైన కాఫీని పక్కన పెట్టి సహాయక చర్యలలో ముమ్మరంగా పాలుపంచుకునేవాడు.

దెబ్బలుతగిలినవాడిని ఎవరైనా వెళ్లి పైకి లేపి, ఆ దారి వెంబడి వెళ్లే వాహనాలకై చేతులు చూపిస్తారు అని అనుకొని కొంచెం కొంచెంగా ఊదుతూ తాగాడు. అయితే అక్కడ చేరినవారి దగ్గర నుండి ప్రమాదానికి లోనైన దురదృష్టవంతుణ్ణి ఆదరించే విధంగా ఒక చూపు కూడా మరలలేదు. వారు శవం లాగా కేవలం తినడంలో గురిగా ఉన్నారు.

నిజంగానే ఇది కొమాలానేనా?

తను చూస్తున్నది మరణం గురించిన ఒక షార్ట్ ఫిల్మా అని కూడా విశ్వన్ ఆలోచించాడు. రాత్రి భోజనం తినే వీరంతా తనలాగా రాబోయే కొన్ని రోజులలో మరణించేందుకు నిర్ణయం తీసుకున్నవారో? మరణపు పురుగు వారి లోపల ఉన్న ఆకులన్నింటిని తిని ముగించివేసిందో? వారు ప్రతిఒక్కరు పురుగులతో నిండిన ఒక్కొక్క వృక్షమో? ఒక లారీ అతివేగంగా దూసుకువెళ్లగా విశ్వన్ కాలి వద్ద వెచ్చగా ఏదో వచ్చి తడి చేసింది.

రక్తం!

ఆ యువకుని రక్తం పైన లారీ టైర్లు ఎగిరి దూసుకెళ్ళాయి. రక్తంతో నిండిన మట్టి ముద్దలను కలిపి రోడ్డులో రుద్దేటపుడు వచ్చే శబ్దాన్ని అతడు సహించలేకపోయాడు.విశ్వన్ పరుగెత్తికెళ్లి ఆ యువకుని లావైన శరీరాన్ని రక్తం నుండి లాగి బయట పడవేశాడు.దాటి వెళ్లే వాహనాల హెడ్ లైట్ వెలుతురు ముందు పెద్ద ఒక నీడలాగా నిలబడి , “కాపాడండి…కాస్త ఆగండి…సహాయం చేయండి…” అని అనేక సార్లు బిగ్గరగా అరిచి చేతులను అనేక సార్లు ఆకాశం వైపుగా పైకెత్తాడు.వాహనాల అద్దపు కిటికీలలోను, బానెట్ పైనా చేతితో తట్టాడు.

తోపుడు బండి వాడు మరిగించే పాత్రలో నుండి నీటిని అంతటిని మట్టిలో పోసి కొట్టును మూసశాడు.తరువాత విశ్వన్ వైపు వచ్చి వెటకారంగా నవ్వి, ” సార్ ఇదంతా ఇక్కడ మామూలే…తరువాత…మీకు చాలా అవసరంగా కావాలనుకుంటే మెడికల్ కాలేజ్ వరకు తీసుకువెళ్లేందుకు ఒక బండి ఏర్పాటు చేస్తాను. అద్దె మీరే ఇవ్వాల్సి ఉంటుంది. తనతో పాటు తోడుగా వచ్చేందుకు సిద్ధంగా లేనని ఖచ్చితంగా చెప్పేసి తన తోపుడు బండిని తోసుకుంటూ అతడు చీకట్లో కనుమరుగయ్యాడు.

పది నిముషాలలో ఒక జీప్ వచ్చింది. ఆ యువకుని పగిలిపోయిన తలను ఒకసారి తాకేందుకు కూడా ప్రయత్నించక డ్రైవర్ బయలుదేరేందుకు అవసరపడ్డాడు.

“ఈ చోటు కొమాలానే…ఇది నరకపు ద్వారం…” అని విశ్వన్ తనలో తను చెప్పుకున్నాడు.

హఠాత్తుగా ఒక మధ్యవయసు వ్యక్తి చంకలో ఒక నల్ల సంచితో పాటు జీప్ వైపుగా పరుగెత్తుకొచ్చాడు.

“నేనూ వెంట వస్తాను” అన్నాడు అతడు. విశ్వన్ కి అది అర్ధం చేసుకోవడం సాధ్యపడలేదు.అతడు మనసులో ఒక విధమైన తీవ్రమైన చలి చోటు చేసుకుంది. ఈ కొమాలాలో వట్టిపోని కొన్ని చోట్లు ఇంకా మిగిలివున్నాయేమో! గాయపడ్డ వాడి కాళ్లను జరిపి విశ్వన్ అనుమతి కోసం ఎదురుచూడకుండా కాస్త ఉండేందుకు చోటును సరి చేసి అతడు కూర్చున్నాడు. జీప్ బయలుదేరింది. ప్రమాదం జరిగినందుకు ఏర్పడ్డ పరిస్థితి,యువకుని చిరునామా మొదలైన వాటి గురించి ఆ మధ్యవయస్కుడు ప్రయాణమంతటా మాట్లాడుతూ వచ్చాడు. దీనికి మధ్యలో విశ్వన్ దగ్గర పరిచయం ఏర్పరచుకోవడం కూడా అతడు మర్చిపోలేదు.ముందురోజు “న్యూస్ టైమ్” అతడు చూశాడు.అయితే ఆ విషయంలో తలదూర్చలేదు. విశ్వన్ చనిపోవడం గురించో, జీవించడం గురించో అతడు బాధపడినట్లు తెలియలేదు.

శ్వాసను పీల్చేందుకు అవస్థపడుతుండగా ఆ యువకుడు కాస్త కిందకు వంగాడు. విశ్వన్ అతడి గుండెలపై బలంగా నొక్కాడు. అరచేతిని పట్టుకొని అతడి శరీర వేడిని పెంచే ప్రయత్నం చేశాడు. అతడి శరీరం మరణంపై ఊగిసలాడుతోంది. అతడు ఏదో చెప్పే ప్రయత్నం చేసినట్లు ఉంది.

హఠాత్తుగా మధ్యవయస్కుడు డ్రైవర్ భుజం తాకాడు.”కాస్త ఆపు బాబు…ఇక్కడ దిగాలి”

బండి ఆగింది. మధ్యవయస్కుడు తన సంచిని వెదికి తీసి చంకలోకి తోసి దూకి దిగిపోతూ చెప్పాడు: “క్షమించాలి, అదిగో అక్కడ వెలుతురు కనిపిస్తుందే, అదే నా ఇల్లు. రోడ్డులో బండి దొరకక అవస్థపడుతున్నపుడే ఈ జీపును చూశాను.మీరు ఎక్కించుకోవడం వలన సౌకర్యవంతంగా వచ్చి చేరాను.Thanks,good night”

ఆ మనిషి చీకట్లో నడిచి కనుమరుగయ్యాడు. జీప్ బయలుదేరింది.

మనం వేసే లెక్కలన్నీ ఎంత త్వరగా తలక్రిందులై కుప్పకూలుతాయని ఆలోచించాడు విశ్వన్. మనసు ఒక కల్లాకపటం లేని రాతి శిల్పి.కొద్ధి నిముషాల ముందు పరిచయమైన ఒక వ్యక్తి చుట్టూ మంచి గుణాల రాళ్లతో అయినటువంటి ఒక  ఊహను నిర్మించింది! అయితే ఆ అందాన్ని ఆస్వాదించే లోపే కాస్త పటుత్వం లేని ఒక రాతి కుప్పలా కూలిపోయింది! మనిషి ఆ స్థితిలో నవ్వడమో, ఏడవడమో చేయొచ్చు. విశ్వన్ కి ఏమిటో నవ్వాలని మాత్రమే అనిపించింది. శబ్దం బయటకు వినబడనంతగా కళ్ళలో నీరు కారే వరకు నవ్వాడు.

యువకుని పెదవులు మెల్లగా తెరుచుకున్నాయి. దాని అంచులో ఉమ్ము జిగురులా అంటుకునుంది. దాని ద్వారా అతడి పళ్లు బయటకు తెలిశాయి. కనుపాపలు వెనుకకు వాల్చాడు.

మరణపు వేడి అతడిని వశపరచుకొంది.

విశ్వన్ డ్రైవర్ భుజంపై మెల్లగా తట్టి “ఆపు బాబు” అన్నాడు, డ్రైవర్ బ్రేక్ పై కాలును నొక్కి పట్టి అతడిని తలెత్తి చూశాడు.

” ఈ వ్యక్తి చనిపోబుతున్నాడు, కాస్త మంచినీళ్లు ఇవ్వాలి” అని చెప్పి విశ్వన్ జీప్ లో నుండి బయటకు దిగాడు. బండిలో వుంచిన వాటర్ బాటిల్ ని తీసుకుని అందులో ఒక చుక్క నీరు కూడా లేదని తెలిపేందుకు డ్రైవర్ దానిని తలకిందులుగా పట్టుకున్నాడు.బాటిల్ తీసుకుని విశ్వన్ నడిచాడు.డ్రైవర్ బండిని ఒక పక్కగా ఆపాడు.

చీకటిలో అక్కడ చాలా చెట్లు నింగిని అంటుకున్నట్లు నిలబడటం విశ్వన్ గమనించాడు.ఠక్కున దాని మీద చంద్రుని కాంతి పడింది.చల్లగాలి వీచింది. చెట్లకు మధ్య నడిచి, దిగువకు వెళుతుండగా ఎక్కడో నీటి కదలిక అతడికి కనిపించింది.అడవి పొదలలో పడి, ఆకుల కొనలను తడిపి గులకరాళ్లకు పైన ఒక అద్దపు పొర లా అది మెల్లగా ప్రవహిస్తున్నది,చనిపోతున్న ఆ యువకుడి కోసం.

తనలాగే అతడు ఎక్కడెక్కడ ప్రయాణించాడు; ఎవరెవరి దగ్గర మాట్లాడాడు; పోటీ పడ్డాడు; ఒడిపోవడుమూ, బాధపడటమూ, గెలవడమూ, ఆనందపడటమూ చేశాడు; ప్రేమించడమూ, ద్వేషించడమూ, పడటమూ, లేచి నిలబడటమూ చేశాడు; అతడు తన శరీరాన్ని కోరికలతో దహించడమూ, విసర్జించే వ్యర్ధాలలో నుండి శుభ్రపరచుకోవడం చేశాడు.

అతని గురించి ఎంతమంది కలిసి మాట్లాడారు. అభిప్రాయాల ఎన్నిక జరిపారు అప్పుడంతా అతడు తనని ఎరుగక వెతుకుతున్నదేమిటో ఇదిగో తన కాలి వేళ్ళు అదిమి వుంచిన ఈ చిన్న వాగులోని రెండే రెండు చుక్కల నీటినే కదా…!

అతడి అన్ని దాహాలు, వేటలు, ఇక్కడ ముగిసిపోతున్నాయి. విశ్వన్ ఆ యువకుడి పెదవులలో నీటిని చుక్క చుక్కలుగా వదులుతున్నాడు.నిస్సత్తువ ఆవహించిన అతని చేతులును గుండెకు చేర్చాడు.

అతడు మరణించాడు.

అంతవరకు ఎటువంటి విషయానికి చలించక నిలబడి ఉన్న డ్రైవర్,యువకుని మరణముతో వెలవెలబోయాడు.బాటిల్ లో మిగిలిన నీటిని విశ్వన్ తాగాడు.

ఒక విధంగా చూస్తే మనుష్యులు ప్రతిఒక్కరు బాకీపడ్డవారే అని చెప్పొచ్చు.

అతడు చల్లగాలిలో నడిచాడు.

రెండు చుక్కల నీరు మాత్రమే నా బాకీ… దానిని నేను కొద్దిసేపటి క్రితం పూర్తిగా తీర్చేశాను.

తను ఇంతకు ముందు రాసుంచిన ఆ ఆత్మహత్య ప్రకటన ఉందే. అదొక పెద్ద మూర్ఖత్వం అని అతడికి అనిపించింది. అప్పుడు వెనువెంటనే ఆ ప్రకటనను అక్కడ నుండి తొలగించాలనుకున్నాడు.

*

*Pedro paramo అన్న నవలలోని పాత్రలు – మరణించినవారు.

శ్రీనివాస్ తెప్పల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు