కవిత్వం ఒక ఔషధం: కొప్పర్తి

సంస్కృతం మూలభాషల్లో ఒకటి అయినా మాతృ భాష ని మింగేసిందనడానికి సందేహించను. ఇంగ్లీషు చేస్తున్న నష్టం కన్నా ఇది ఎక్కువ.

కొప్పర్తి కవిత్వం చదువుతున్నంత సేపూ పాతికేళ్ళనుంచీ ఈ చరిత్ర బోధించే కవిలో ఏం రసాయనిక చర్యలు జరిగితే ఇన్ని వైవిధ్యమైన కవితలు పుట్టాయన్న సందేహం వస్తుంది. అవును. అతనిలో అక్షరాక్షరానికీ మధ్య ఒక్కో నూరేళ్ళ జీవితాన్ని గడిపిన అనుభవం కనిపిస్తుంది. కృష్ణాజిల్లా చిలకలపూడిలో పుట్టిన ఈ కవిప్పుడు విశ్రాంత చరిత్ర లెక్చరర్. ప్రిన్సిపాల్. పిట్ట పాడే పాట కోసం, విషాద మోహనం, యాభై ఏళ్ళ వాన ఆయన కవితా సంకలనాలు.

ఇతని కవిత్వాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డు (1991), ఉమ్మడిసెట్టి (2003), ఆంధ్ర సారస్వత సమితి అవార్డు (2003), సినారె (2004), ఫ్రీవర్స్ ఫ్రంట్ (2008), తిలక్ పురస్కారం (2010) వరించాయి. 17 వ తారీఖున పిఠాపురం లో డా: ఆవంత్స సోమసుందర్ కవితా పురస్కారాన్ని స్వీకరించారు. ఆ సందర్భంగా కొన్ని ముచ్చట్లు

1. ఇన్నేళ్ళ జీవితం గడిచాక కవిత్వం పై మీ నిర్వచనాలేమన్నా మారాయా ?
• తొలిదశ లో కవిత్వం ఒక ఆయుధం. మలిదశ లో అదొక పనిముట్టు. ఇప్పుడది ఔషధం.
2. మీరు చాలా తార్కికంగా కవిత్వం రాస్తారు. ప్రాధమికంగా మీ ఆలోచనాత్మక, తాత్విక శైలి కవిత్వాన్ని హృదయసంబంధి అని ఎలా అనుకోవాలి ?
• ఆలోచనాత్మక, తార్కికశైలి అని మీరే అంటున్నారు కాబట్టి, శైలి తప్పకుండా కవిత్వమే అవుతుంది. సున్నితమైన అంశాల్ని కవిత్వీకరించడం, తత్వీకరించడం హృదయమే చెయ్యగలదు. తర్కం, తత్వం రెండూ కవిత్వ ప్రయోజనాన్ని instant గా ఇనుమడింపచేస్తాయి. కవిత్వం గుర్తుండిపోతుంది. మననానికి ఆస్కారం ఏర్పడుతుంది. పదే పదే గుర్తుకు రావడం కవితో పాఠకుడికి ఏకీభావం కలిగిస్తుంది. కవిత్వప్రయోజనాల్లో అది కూడా ఒకటి.
3. ఆన్లైన్ పత్రికలు, కవిసంగమం, సోషల్ మీడియా – ఇన్నింటి మధ్య వస్తున్న వర్తమాన వచన కవిత్వాన్ని మీ రెట్లా వ్యాఖ్యానిస్తారు ?
• కవిత్వం ఏ మీడియా లో వచ్చినా కవిత్వమే. కవిత్వమా కాదా అన్నదే ప్రశ్న. ఆన్ లైన్ కవిత్వం రాకముందు ఖచ్చితంగా కవిత్వానికి ప్రమాణం ఉంటేనే ప్రచురితమయ్యేది. వస్తున్న కవిత్వస్థాయిని అంచనా వేసుకుని కవి తన స్థాయి ని నిలబెట్టుకుంటేనో పెంచుకుంటేనో మాత్రమే నిలబడేవాడు. కవిత్వప్రచురణ కోసం నెలల తరబడి ఎదురుచూడడం ఉండేది. సీనియర్ కవులతో పోటీ ఉండేది. ఇప్పుడు కవి తన కవిత్వానికి తనే తక్షణ ప్రకాశకుడు. ఒక కవి ఒక గుంపు లో ఉంటాడు. కవిత రాయగానే గోడకు తగిలిస్తాడు. ఆ గుంపు తక్షణ చర్చ చేసి నిగ్గు తేల్చేస్తుంది. ఆక్షణాన చూడకపోతే అది మాయమౌతుంది. స్థిమితమూ నిలకడా ఉండవు. ఆన్ లైన్ కవి తొందరగా అలసిపోయి నిష్క్రమించే ప్రమాదం ఉంది. గమనించండి. రెండు మూడేళ్ల క్రితం ఉధృతంగా రాసిన కవులు ఇప్పుడు లేరు. ఆన్ లైన్ లో మంచి కవిత్వం రావడం లేదని అనను. గత యాభై యేళ్ల jargon నుంచి కవిత్వం బయటికి వచ్చింది. సున్నితమైన ప్రకంపనలు, సరళమైన శుభ్రపరచిన భాషను ఈ కవులు వాడుతున్నారు.
4. చరిత్ర, సాహిత్యం — రెండింటిలో మీ జీవనాస్తిత్వం ఎందులో ఎక్కువ ప్రతిఫలిస్తుంది ?
• చరిత్ర మౌలిక సూత్రాల ప్రభావం నా కవిత్వం మీద ఉంది. ముఖ్యం గా facts are sacred అనే మాట నా కవిత్వ చోదక శక్తి. అట్లాగే objective గా ఉండడం కూడ. చరిత్ర సజీవమైన వ్యక్తుల ఆలోచనల మేరకు నడుస్తుంది కాబట్టి determinism కు ఆస్కారం లేదని క్రమం గా గుర్తించాను. ఇది వ్యక్తి గా నన్ను , సమాజాన్ని చూసే దృష్టిని విశాల పరిచింది. ఐతే చాలా మంది భావించినట్టు గా ‘చరిత్ర ‘ అనే మాటను కవిత్వం లో వ్యక్తం చేసిన సందర్భం లో ఈ ప్రభావం ఉండదు మొత్తం గా వ్యాపించి ఉంటుంది.
కాగా,సాహిత్య ప్రభావం చరిత్రమీద స్వల్పమే. చరిత్ర శాస్త్రం. సాహిత్యం కళ. తనను కళాత్మకంగా చెప్పడాన్ని చరిత్ర క్షమించదు. అందువల్ల తరగతి గది లో ఉన్నంతసేపూ సాహిత్యకారుడి గా కన్న శాస్త్రవేత్త గా ఉండడానికే ఇష్టపడ్డాను.
ఐతే నా జీవనాస్తిత్వం మాత్రం సాహిత్యం లోనే ఉంది. ఎందుకంటే నిజ జీవితం లో ఎంత తార్కికంగా ఉన్నా మార్దవాన్ని కోల్పో లేదు.
5. నన్నయ్యని మూసేసి నన్నెచోడుణ్ణి తెరుస్తున్నా అన్నారు. ప్రస్తుత మీడియం చర్చల నేపధ్యం గా మీ సమాధానమేమిటి ?
• సంస్కృతం నా దేశ మూలభాషల్లో ఒకటి అయినా నా మాతృ భాష ని మింగేసిందనడానికి సందేహించను.  ఇంగ్లీషు చేసిన చేస్తున్న నష్టం కన్నా ఇది ఎక్కువ. 2005 లో కేరళ లో జరిగిన దక్షిణాది భాషా కవిసమ్మేళనం లో పాల్గొన్నాను. వాళ్లు  తల్లి భాషలొ కవితాపఠనం చేయమన్నారు. నేను కవిత్వాన్ని చదివినపుడు ఇతరభాషా కవులు నా కవిత వారికి చాలామేరకు అర్థమైందన్నారు. నేను సంతోషించవలసింది పోయి ఆలోచన లో పడ్డాను. నా వ్యక్తీకరణలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉండడమే దానికి కారణమని తెలిసివచ్చింది. ఎంతగా సంస్కృతీకరించ బడితే అంత మంచి తెలుగు అయ్యింది. నా భాష distinctiveness ని కోల్పొవడం చారిత్రకవిషాదం. అందుకే నన్నయ్యని మూసేసి నన్నెచో డుడ్ని తెరవడం.
ఇప్పుడు భాష కేవలం సంస్కృతికాంశం కాదు. ఆర్థికాంశం. ప్రభుత్వానికి విధానం లేకపోతే ప్రజలు ఆర్థికం వైపే మొగ్గుతారు. కొందరికి ఇంగ్లీషు, కొందరికి తెలుగు అనేది ఆర్థికవ్యత్యాసాలను కొనసాగించి  సామాజిక వ్యత్యాసాలను శాశ్వతం చేసే ప్రమాదం ఉంది.
6. అస్తిత్వ ఉద్యమాల పట్ల సాధారణీకరణ వైపు (సహానుభూతి) మొగ్గి, స్వానుభవ నిర్దిష్టతని విమర్శించారు. బహుజన కచ్చీర్ల నేపధ్యంలో – నిర్ధిష్టత, సహానుభూతుల పట్ల ఇప్పుడు మీ వైఖరి ?
• స్వానుభవ నిర్దిష్టత ను నేను వ్యతిరేకించలేదు. సహానుభూతి ని శీలపరీక్ష కు పెట్టడాన్ని ఖండించాను. ఒకరి తరఫున మాట్లాడడం అమర్యాదకరమైన పని అన్న ఆధునికానంతరవాద దృక్పథాన్ని అంగీకరిస్తాను. డెరిడా, ఫుకో రచనల అధ్యయన నేపథ్యం లోనే తెలంగాణా ఆవిర్భావాన్ని సమర్థించాను. స్వానుభవ నిర్దిష్టత తొంభైతొమ్మిది శాతమైనా సహానుభూతి ఒక్కశాతం కలవక పోతే అది అసంపూర్ణమే అవుతుంది.
బహుజన కచ్చీరులను స్వాగతిస్తాను. ప్రాతినిథ్యం ఇరవైఒకటో శతాబ్దపు లక్షణం. కచ్చీరులు దాని సాధనా మార్గాలు.
7.  మీ మూడు కవితా సంకలనాల్లో మీ కిష్టమైన సంకలనం ఏది ? ఎందుకు ?
• నా తొలిసంపుటి ‘పిట్టపాడేపాటకోసం’ లో కవిత్వం కరవాలం అయ్యింది. 70 ల కల్లోల దశాబ్దం లో కవిత్వం లోకి  కళ్లు  తెరిచిన మాతరానికి ఇది దాదాపు అనివార్యం అయ్యింది. రెండవ సంపుటి విషాదమోహనం లో మానవసంబంధాల విచ్చిన్నం పట్ల concern వ్యక్తం అయ్యింది. మూడవదైన యాభైయేళ్లవాన లో నన్ను నేను declassify చేసుకునే ప్రయత్నం చేసుకున్నాను. నాకు బహువచన వద్దాన్నాను. కృతకమైన మధ్యతరగతి భాష స్థానం లో యాస నాశ్వాస కావాలన్నాను. పురుషుడిగా స్త్రీ తర్వాతి స్స్థానం స్వీకరించడానికి సిద్ధపడ్డాను. ఈ పరిణామం కొన్ని కవితల్లొ మాత్రమే వ్యక్తమైనా నా ప్రయాణం సరైన దిశ లోనే నడుస్తున్నదనిపిస్తుంది. యాభైయేళ్లవానే ఇప్పటికి నా ఇష్టకవితా సంకలనం.
8. సోమసుందర్ కవితా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మీ అనుభూతి ఎలా ఉంది ? ప్రస్తుత పురస్కార పరంపరల పై మీ కామెంట్ ?
• సోమసుందర్ కవి గా చారిత్రత్మక పాత్రను నిర్వహించాడు. జీవితకాలమూ అభ్యుదయ దృష్టి కి కట్టుబడ్డాడు. ఆయన పేరిట ఇస్తున్న పురస్కారం అందుకోవడం గౌరవం. నిజాయితీ గా ఇస్తున్న కొన్నిటిని మినహాయించి మిగిలిన కవితాపురస్కారాలు క్విడ్ ప్రొ కొ పద్ధతిలో జరుగుతున్న రోజుల్లో నానుంచి పొందడానికి  ఏమీ లేదని తెలిసీ పురస్కారం ఇస్తూన్న సోసు లిటరరీ ట్రస్టు కు ధన్యవాదాలు.
9. మీరు కవిత రాసి దాదాపు ఐదేళ్ళైంది. మీ భవిష్యత్ ప్రణాళికలేమిటి ?
• అవును. ఐదేళ్లుగా కవిత్వం కోసం ఎదురుచూస్తున్నాను. ఎదురువెళ్లడం అలవాటులేదు. ప్రణాళికలు ఏమీ లేవు, ఎదురుచూడడం తప్ప.

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి ప్రశ్నలు సంధించారు. ఇంకా మంచి జవాబులు రాబట్టారు. అభినందనలు.

  • ఆన్లైన్ పత్రికలు, కవిసంగమం, సోషల్ మీడియా – ఇన్నింటి మధ్య వస్తున్న వర్తమాన వచన కవిత్వాన్ని మీ రెట్లా వ్యాఖ్యానిస్తారు ?
    good question and good answer also.

    ilanti manchi interviews ma lanti readers ki chala manchidhi . thanks sriram sir

    kopparthi sir.. this comments are great.. తొలిదశ లో కవిత్వం ఒక ఆయుధం. మలిదశ లో అదొక పనిముట్టు.
    ఇప్పుడది ఔషధం.

  • కవికీ కవిత్వానికీ సంబంధించి వివరణ బాగుంది. ఒక కవికి కాలమాన పరిస్థితి కి సంబంధించిన అవగాహన విషయంపై వేసే ప్రశ్నలు సందేశాత్మకంగా అనిపించింది. ఏవో గుర్తింపు కోసం ప్రశ్నలు వేయటం వాటికి అలాంటి జవాబులు రాబట్టుకోవటం కాకుండా సాహితీ పరమైన ప్రశ్నలు వేయటం దానికి సరయిన సమాధానాలు బాధ్యత గా కొప్పర్తి గారు అందించటం వల్ల చాలా విషయాల్ని పాఠకులు తెలుసుకొనే అవకాశం కలిగింది. ఇద్దరు కవులకూ అభినందనలూ ధన్యవాదాలూ.

  • కవిని ఆవిష్కరించారు. మూడు సంకలనాల వృద్ధ యువ కవి ఆలోచనాలోచనాల్ని క్రోడీకరించి, అభిప్రాయాలను సమీకరించారు. ధన్యవాదాలు.

  • విశిష్టమైన కవి కొప్పర్తి గారు వారికి సోమసుందర్ గారి పురస్కార సందర్భంగా వారి మనసులో మాటలు పంచారు… నాకు నచ్చిన వారి మాట”””’ కవి ఒక గుంపు లో ఉంటాడు. కవిత రాయగానే గోడకు తగిలిస్తాడు. ఆ గుంపు తక్షణ చర్చ చేసి నిగ్గు తేల్చేస్తుంది. ఆక్షణాన చూడకపోతే అది మాయమౌతుంది. స్థిమితమూ నిలకడా ఉండవు. ఆన్ లైన్ కవి తొందరగా అలసిపోయి నిష్క్రమించే ప్రమాదం ఉంది. గమనించండి. రెండు మూడేళ్ల క్రితం ఉధృతంగా రాసిన కవులు ఇప్పుడు లేరు””👌👌👌👌వ్యాసకర్త శ్రీరామ్ గారికి అభినందనలు💐💐💐💐

  • కొప్పర్తిగారితో ముఖాముఖిలో మీరు సంధించిన ప్రశ్నలు, రాబట్టిన సమాధానాలు ఎంతో ఉపయుక్తంగాఉన్నాయి.
    కవి ముఖ్యంగా పురుషుడిగా స్త్రీ తర్వాత స్థానం స్వీకరించడానికి సిద్దపడ్డానని చెప్పడం,స్వానుభవ నిర్దిష్టత తొంభై తొమ్మిది శాతమైనా సహానుభూతి ఒక్కశాతం కలవకపోతే అది అసంపూర్ణమవుతుందంటూ తన వైఖరిని స్పష్టం చేయడం,
    చరిత్ర,సాహిత్యం రెంటిలో తన జీవనాస్తిత్వం మాత్రం సాహిత్యంతోనే వుందని చెప్పిన తీరు,మరీ ముఖ్యంగా నేటి ఆన్‌లైన్ కవిత్వం, కవులపై చెప్పిన అభిప్రాయం ప్రతీకవి ఆలోచించుకునేలా చేసింది..ఇలాంటి ఇంటర్వ్యూల వల్ల
    జరిగే సాహితీ చర్చలు నేటితరం కవులకు పాఠాలు..

  • ప్రశ్నలు, జవాబులు తెలుగు కవిత ప్రయాణం ను తేట పరిచాయి… కొప్పర్తి వారి కి నమస్సులు
    మీకు ధన్యవాదాలు

  • ఆలస్యంగా చదివినందుకు చాలా చింతిస్తున్నాను. ఎంత సహజమైన ప్రశ్నలో అంతే ఆలోచనాత్మకమైనవి. ఆ ప్రశ్నలకు ఒక సీనియర్ కవిగా కొప్పర్తి గారి సమాధానాలు చాలా ఆలోచింప చేశాయి. నిజంగా కవిత్వం ఇప్పుడు ఇన్స్టంట్ వస్తువు అయిపోయింది. అనిపించడం, టైప్ చేయడం , కామెంట్స్ తీసేసుకోవడం గొప్ప కవినని మురిసిపోవడం. అంతా క్షణాల్లో లేదా రోజుల్లో. ఎవరికి వారితోనే పోటీ. అదీ అతి స్వల్ప కాలం. గిర్రున తిరిగే కాలంలో ఎవరూ శాశ్వతం కాదు అలాగే ఏ కవితా శాశ్వతంగా నిలబడటం లేదు.
    ముక్తాయింపు గా కొప్పర్తి గారి సమాధానం “కవిత్వం కోసం ఎదురుచూస్తున్నాను. ఎదురెళ్లడం ఇష్టం లేదు” చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఎంత మంచి పేరు తెచ్చుకున్న కవి అయినప్పటికీ తనంతట తాను గా వచ్చే కవిత్వం కోసం ఎదురుచూడటం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నచ్చింది. కవిత్వం అంటే అదే కదా
    ” తన పుట్టుక తానే రాసుకోగల రసగంగా ప్రవాహం.
    ఏ బలవంతాలకి, ఏ ప్రోద్బలాలకీ లొంగని సిసలు అక్షరామృతం”
    శ్రీరామ్ సర్ మీకు శత సహస్ర ధన్యవాదాలు. మంచి కవి ని పరిచయం చేయడమే కాక మదిలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చూపారు.
    అలాగే కొప్పర్తి గారికి మనఃపూర్వక అభినందన మందారాలు. మరలా కవిత్వం వారిని వెతుక్కుంటూ రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    ధన్యవాదాలు

  • ఎన్నో కొత్త ప్రశ్నలు..ఆసక్తికరంగా సాగింది సార్ ఇంటర్యూ…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు