ఒడుసు గాలీ.. వలస పడవ!

ఓటితెప్పల్లాటి ఊరి మెరకల్లో
వలలు పొత్తుతున్న యిసక దిబ్బల్లో
అమ్మోరు మోడులాటి బతుకు..
ఎన్ని శేర్ల సెమట నీళ్లతో సల్జేసినా
ఉలకదూ.. పలకదూ..!

యానాం సకం అంతరం దేవినా సకా
పగటిపూట కష్టం దక్కదు
పడవ నీడలు సూత్తే ఎటు పారిపోతాయో..
సీకటి ఉయ్యాట్లో మాగన్నుగా ఉన్నప్పుడే
సేపలు రూపాయలై వలకు సిక్కుతాయి
సముద్రం నాడి సరిగ్గా సూడాలి
గడసరి గంగమ్మను అడ్డాట్లో బజ్జోబెట్టుకొని
గాయిగాయని అద్దరాతిరి జోకొడుతున్నపుడే
బతుకు పడవకి లంగరెత్తాలి

ఒడుసు గాలితో ఉలుకెత్తే కడలికి
కత్తావతో కళ్ళెం యేసే మొనగాళ్ళుండాలి
తెరల గుర్రం మీద పడవ జీనెక్కి
సుడుల సవ్వారికి సిద్ధమవ్వాలి
నీలి కుప్పల్లాటి నీటిరాశుల్లంట
నీసి కూనలు ఎదికి పట్టుకోవాలి
నీళ్లదారలిచ్చి పడవెక్కి పెతీసారీ
నిండు పేణాలను పణం పెట్టాలి
మరొక తెరువూ నేదు ఇంకొక యిరితీ రాదు
గంగమ్మే నేప్పోతే మరొక్క ఆదరువూ నేదు

పరిచిన వలలా ఎన్ని బారల ఆశ ఉన్నా
యేట మిగిలించేది ఎలితి శిక్కామే!
కరవాక కంటి రెప్పల మీద తెల్లారి
దిబ్బతోటల దీగూట్లో దినంగూకే ఊళ్ళలో
ఉప్పు నీళ్లంట పొర్లడమే పొద్దు వాలకం
ఎటూ జరగని కాడికి అప్పు కన్నంలో
బతుకు రొప్పడమే బుడగొట్ల బాగోతం

ఏటలో నీటి రూపాన మాటుగాసే సావు
పడవ మీది పేణాలకు వల యిసిరినా
ఊపిర్లు సిక్కుబడకుండా ఇప్పదియ్యాలి
అలల పంటి కింద నుజ్జుగాకుండా
తెరల తుంపర జీబు తెడ్లతో ఒర్జుకుని
నీటిపువ్వుల పంట వలలోకి దులుపుకొని
మైరావణుల్లా సాగరాన్ని గెలిచి రావాలి
పరిగ మూటల పడవ ఒడ్డు జేరాలి

ఇటు తూరుపు తీరపు మొగ జూత్తే
తరాలుగా తెప్పలై తిరిగి కమురు పట్టిన
కష్ట జీవుల దేహంలా కనిపిస్తుంది
అటు పడమర పొద్దుని జూత్తే
కరావళి తీరం నుండో వీరావల్ ఒడ్డు నుండో
బేగిరమ్మని ఆశపెట్టే ఎర పిలుస్తుంది
ఏ మరమం తెలియని మరపడవలా
ఎటుకేసి రమ్మంటే అటుకేసి సాగడమే
నయమనిపిస్తుంది

‘ఉన్న ఊరినీ ఆలుబిడ్డల్నీ ఒగ్గీసి
ఐటైటికీ అరేబియా తీరాలకు
వేట కెళతారెందుకూ..’ అని అడగొద్దూ..
‘మా ఊరికి దరిదాపల్ల జెట్టీల్లేవు గదయ్యా
హార్బర్లు లేవుగదా సారూ
ఎట్టికెళ్లిన యేట గిట్టుబాటే కాదు
ఏటి తిని బతకాలి కుటమాముతోటి?’
తిపిరి గాలికి తిరగాలబడ్డ తెప్పలా
                              ఎదురు ప్రశ్న!
ఏ ఒడ్డు చేరుస్తుందో ఎవరు చెప్పాలీ
                             వలస పడవ!?

*
చిత్రం: సృజన్ రాజ్ 

కంచరాన భుజంగరావు

2 comments

Leave a Reply to సిరికి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు