కొందరిని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఎలా సాధించారు అని. అలాంటిదే పూర్ణిమా దేవి బర్మన్ విజయం. చాలా మంది ఇలాంటి విషయాలపైన దృష్టి అసలు పెట్టరు. కొందరు మాత్రం చాలా అరుదైన అంశాలపైన తమ దృష్టినిసారిస్తారు, అదే ప్రధాన అంశం అవుతుంది, జీవన పరమార్థంగా కూడా మారుతుంది. గ్లోబల్‌గా టైమ్స్ మ్యాగజైన్‌లో ‘ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ‘ గా గుర్తింపు రావటంరావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి గుర్తింపు సాధించిన పూర్ణిమా దేవి బర్మన్ కథ ఇది.
పూర్ణిమా దేవి బర్మన్ జీవితం మారిపోయిన రోజు ఆమెకు బాగా గుర్తుంది. 2007లో ఆమెకు ఒక ఫోన్ వచ్చింది – తన రాష్ట్రమైన అస్సాంలో పెద్ద కొంగలు నివసించే చెట్టును కొట్టేస్తున్నారని. బర్మన్ అక్కడికి చేరుకున్నప్పుడు, ప్రమాదంలో ఉన్న కొంగ పిల్లల గూడు నేలమీద పడి ఉంది. షాక్ అయిన ఆమె, చెట్టు నరికిన వ్యక్తిని అడిగింది: ఇలా ఎందుకు చేశారు? అతను చెప్పాడు –
ఈ పక్షి చెడ్డ శకునం, పేదరికం, జబ్బులు తెచ్చేది అని. ఈ కొంగకు స్థానికంగా “హార్గిలా” అని పేరు – అంటే ఎముకలు మ్రింగేది.
ఎందుకంటే ఇది చెత్తకుప్పల దగ్గర తిరుగుతుంది. ఆమె ఆ మనిషిని ప్రశ్నించడం చూసి చుట్టూ ఉన్న వాళ్ళంతా కోపంగా ఉన్నారు.

“అందరూ నన్ను చుట్టుముట్టారు, ఈల వేయడం మొదలెట్టారు,” అని 45 ఏళ్ల జీవశాస్త్రవేత్త, వన్యప్రాణుల పరిరక్షకురాలు గుర్తు చేసుకుంది. కానీ ఆమె మనసంతా తన చిన్న కవల కూతుళ్ళ ఆలోచనే. ఆ కొంగ పిల్లలలాగే, వాళ్ళు కూడా చాలా చిన్నవాళ్ళు. బర్మన్‌కు ఆ పక్షులను రక్షించాలనే తపన కలిగింది. వాటి గుండె కొట్టుకోవడం అనుభవించి ఆమె కదిలిపోయింది. “మొదటిసారిగా నాకు అర్థమైంది – ప్రకృతి పిలుపు అంటే ఏమిటో,” తను అంటుంది “ఆ రోజు నుండి, నా లక్ష్యం మొదలైంది.” అని.
అప్పట్లో ఆ ప్రాంతంలో దాదాపు 450 పెద్ద కొంగలు మాత్రమే మిగిలి ఉన్నాయని అంచనా. 2023లో, బర్మన్ పని వల్ల, అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం వర్గీకరణలో ఈ కొంగ “ప్రమాదంలో ఉన్న” స్థాయి నుండి “దాదాపు ప్రమాదంలో ఉన్న” స్థాయికి మార్చబడింది. అస్సాంలో వాటి సంఖ్య 1,800 కంటే ఎక్కువకు పెరిగింది.
బర్మన్ తన “హార్గిలా ఆర్మీ” లేకుండా ఇది సాధించలేదు –
దాదాపు 20,000 మంది మహిళల బృందం పక్షుల గూళ్ళను కాపాడుతూ, దాదాపు ఐదడుగుల ఎత్తున్న ఈ అద్భుతమైన చెత్త తినే పక్షుల అందం గురించి ఇతరులకు తెలియజేస్తుంది. ఈ సంఘం నిరంతరం విస్తరిస్తోంది. అస్సాంలోనే కాదు, భారతదేశమంతటా, ఇప్పుడు కంబోడియాలో కూడా. ఫ్రాన్స్‌లో ఉన్న పాఠశాలలు కూడా విద్యార్థులకు ఆమె పని గురించి నేర్పిస్తున్నాయి.
ఈ రోజుల్లో, బర్మన్ గర్వంగా తన సాంప్రదాయ దుస్తులు, హార్గిలా ఆర్మీ సభ్యులు నేసిన కొంగల బొమ్మలతో అలంకరించిన శాలువాలు ధరిస్తుంది. వాటిని అమ్మి ఆ మహిళలు జీవనోపాధి సంపాదిస్తున్నారు. బట్టలు కానీ, పాటలు కానీ, కొత్త పిల్లలకు సీమంతం చేసుకోవడం కానీ అంటూ, “ఇప్పుడు ఈ పక్షి మా సంప్రదాయం, సంస్కృతిలో భాగమైంది,” అని బర్మన్ చెబుతుంది.
ఒకప్పుడు చెడ్డ శకునంగా, అపశకునంగా భావించిన పక్షిని ఈ రోజు ప్రజలు గౌరవిస్తున్నారు. ఇది కేవలం కొంగల సంఖ్య పెరగడం మాత్రమే కాదు – ఇది మనుషుల ఆలోచనలు, నమ్మకాలు మారిన కథ. బర్మన్ చూపించింది – అవగాహన, ప్రేమ, నిబద్ధత ఉంటే, తరాలుగా పాతుకుపోయిన మూఢనమ్మకాలను కూడా మార్చవచ్చని.
ఒక్క మహిళ తీసుకొచ్చిన ఈ మార్పు ఇప్పుడు 20,000 మంది మహిళల శక్తిగా మారింది. హార్గిలా ఇప్పుడు అస్సాం సంస్కృతిలో గర్వకారణం – ఇది కేవలం పక్షి రక్షణ కాదు, జీవితాన్ని చుట్టూ ఉన్నవాటితో వేడుక చేసుకోవటం, అటు పక్షి జాతికి, ఇటు మనుషులకి అందరికి కొత్త సంస్కృతిని చూపెట్టి మనుగడ కలిగించటం ఒక అందమైన మానవీయం.
*








Add comment