ఒక గుండె ఆశ

కథలు కొన్ని మనం రాయకుండానే పుట్టుతాయి. వాటి ముగింపు మనం నిర్ణయించలేము — వాటి గుండె ధ్వని, వాటి జీవన శబ్దమే చెబుతుంది.
ఆ క్రిస్మస్ రాత్రి, ఒక గుండె ఆగింది. మరొకటి జీవితం కోసం స్పందించిడం మొదలుపెట్టింది .

నేను పనిచేసే హార్ట్ హాస్పిటల్‌లో నిశ్శబ్దం అనేది దాదాపు అసాధ్యం. మ్రోగే మానిటర్లు, పరుగులు తీసే నర్సులు, నిరంతరం జరిగే శస్త్రచికిత్సలతో ఆసుపత్రి ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. ప్రతి రోజూ ఒక గుండె ఆగిపోతుంది, మరొకటి మళ్లీ కొట్టడం మొదలవుతుంది. ఆ ప్రాణాల సమరంలో మేము, వైద్యులు, జీవిస్తాం.

కార్డియాక్ సర్జరీలో అనేక రకాల ఆపరేషన్లుంటాయి. వాటిలో అరుదైన, సంక్లిష్టమైనది హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్—గుండె మార్పిడి. ఇది కొన్ని ప్రత్యేక ఆసుపత్రుల్లోనే జరుగుతుంది. ఎమర్జెన్సీ సర్జరీ కావడంతో చాలాసార్లు ఇది అర్ధరాత్రి తర్వాతే మొదలవుతుంది. ముందుగా డోనర్‌ను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించాలి. లంగ్స్,లివర్ , పాంక్రియాస్ వంటి అవయవాలు సరిపోలిన బ్లడ్ గ్రూప్, HLA గ్రూప్ ఉన్న రోగులకు వేర్వేరు ఆసుపత్రులకు చేరతాయి. మా ఆసుపత్రిలో రోగికి గుండె మ్యాచ్ అయితే, ఆ గుండె మంచు పెట్టెలో ముడుచుకుని మా ఆపరేషన్ థియేటర్‌కు చేరుతుంది.

ఈ కథ మా కార్డియాక్ ICUలో ఉన్న అతడి నుంచి మొదలైంది. నలభై ఐదు ఏళ్లు దాటని అతని శరీరం అరవై ఏళ్ల వృద్ధుడిలా కనిపించేది. ఒక్క అడుగు వేయడం అతనికి యుద్ధం. మంచంపై కూర్చోవడానికి నలుగురి సహాయం కావాలి. ఆక్సిజన్ మాస్క్ లేకుండా ఒక్క నిమిషం గడవదు. అతని గుండె పనితీరు (LV ఈజెక్షన్ ఫ్రాక్షన్) సాధారణంగా 60% ఉండాల్సినది 15%కి పడిపోయింది. ఈ సంఖ్య వైద్య పుస్తకంలో ఒక పంక్తి మాత్రమే, కానీ అతని ఊపిరిలో అది భారమైన శబ్దం.

అతని కళ్లలో ఒకే ప్రశ్న: “డాక్టర్, నాకు కొత్త గుండె ఎప్పుడైనా వస్తుందా?” నేను ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పేవాడిని: “ఆశ ఉందని నమ్మండి.” ఆశను మేము సృష్టించము; కేవలం కాపాడతాం.

నాలుగు నెలలుగా అతడు హార్ట్ ఫెయిల్యూర్‌తో ICUలో ఉన్నాడు. అతని భార్య రోజంతా మంచం పక్కనే కూర్చుంటుంది. ఆమె కళ్లలో బైబిల్ లేకపోయినా ప్రార్థన కనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి, తండ్రి గదిలో ఒక మూలలో హోంవర్క్ చేస్తూ, అప్పుడప్పుడు వెనక్కి తిరిగి తండ్రిని చూస్తారు—ఆ చూపులో పాఠ్యపుస్తకాల కంటే పెద్ద పరీక్ష ఉంటుంది. ఒకసారి అతడు నా చేతిని పట్టుకుని చెప్పాడు: “నా వల్ల వాళ్ల భవిష్యత్తు వృధా అవుతోందేమో.” అతని కళ్లలో నీళ్లు . ఇలా అడిగిన ప్రతిసారి నా కళ్లు చెమర్చలేను కాబట్టి గుండె తడిసి ముద్దయిపోతుంది

క్రిస్మస్ రాత్రి :


       చలిగా ఉన్న ఆ డిసెంబరు. క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24). హిందువునైన నాకు కాల్ డ్యూటీ పడింది. ఇంట్లో పిల్లలతో క్రిస్మస్ ట్రీ కింద గిఫ్ట్ బాక్స్‌లు సిద్ధం చేస్తుండగా, ఫోన్ కాల్ వచ్చింది—డోనర్ హార్ట్ అవైలబుల్. అది అతడి బ్లడ్ గ్రూప్‌తో మ్యాచ్ అయిందని తెలిసింది. ఆసుపత్రిలో కలకలం మొదలైంది. థియేటర్ సిద్ధం, మానిటర్లు చెక్, మెడికేషన్లు, బ్లడ్ ప్రాడక్ట్స్ సిద్ధం. రాత్రి 11 గంటలకు ఆపరేషన్ మొదలైంది.

అనస్థీసియా పర్మిషన్ కోసం అతని గదిలోకి వెళ్లాను. అతడు చిన్న నవ్వు నవ్వాడు—యుద్ధానికి వెళ్లే సైనికుడి నవ్వు. “మీరు ఒంటరిగా లేరు,” అని అతని భుజంపై చెయ్యి వేసి చెప్పాను. నర్సులు మానిటర్లతో సహా అతడిని ఆపరేషన్ రూమ్‌కు తీసుకెళ్లారు. అతని తల్లిదండ్రులు, అన్న చెల్లెలు వచ్చారు. “సాంటా మీకందరికీ అత్యంత విలువైన క్రిస్మస్ కానుక తెస్తున్నాడు,” అని చెప్పి నేనూ థియేటర్‌కు బయలుదేరాను.

అనస్థీసియా ఇచ్చే ముందు అతడు అడిగాడు: “డాక్టర్, నేను మళ్లీ నడుస్తానా?” “ఆశతో నిద్రపోండి,” అని చెప్పాను. అతని కళ్లు మెల్లగా మూత పడ్డాయి  డోనర్ హాస్పిటల్ నుంచి హార్ట్ బాగుందని ఫోన్ వచ్చింది. సర్జన్ ఫెయిల్ అయిన గుండెను తొలగించడం మొదలుపెట్టాడు. ఎన్నోసార్లు చూసిన దృశ్యమైనా, అది ఎప్పుడూ కొత్త శోకగీతమే. పాత జీవితాన్ని గౌరవంతో వీడ్కోలు చెప్పి, కొత్త జీవితాన్ని జాగ్రత్తగా ఆహ్వానిస్తాం.
మంచు పెట్టెలో వచ్చిన కొత్త గుండెను జతచేస్తూ సూచర్లు వేశాం. రక్త ప్రసరణ మొదలైంది.

అందరి కళ్లు మానిటర్‌పైనే.  క్రొత్తగా ఇంప్లాంట్ చేసిన హార్ట్ ఎప్పడు బీటు మొదలెడుతుందా అని . కొత్త గుండె తడబడుతూ కదిలింది. ముందుగా ఒక బీటు తరువాత ఇంకో బీటు … ఇంకోటి… ఇలా ఒకదాని తరువట మరొకటి —బలంగా. మానిటర్‌పై  బీప్ లతో EKG  నాట్యం చేయడం,ఆ దృశ్యం తో మాస్క్ ల వెనకనున్న అందరి పెదాలపైన చిరునవ్వు కళ్ళల్లో కనిపించింది.పనిచేస్తున్న చేస్తున్నా చేతులన్నీ ఒక్కసారిగా ఆ నిశ్శబ్దంలో చప్పట్లు కొట్టాయి. అప్పటి దాకా సన్నగా వినబడుతున్న క్లాసికల్ మ్యూజిక్ స్టేషన్ మార్చి  స్టేయింగ్ అలైవ్ పాట పెట్టింది నర్సు,ఒక్కసారిగా ఆరేషన్ రూమ్ మూడ్ మారిపోయింది.గుండె బాగా పనిచేస్తోందని నిర్ధారణ అయ్యాక, చెస్ట్ క్లోస్ చేసి, పేషెంట్‌ను ICUకి తరలించాం.

పునర్జన్మ కానుక :

తెల్లవారుతుంది, క్రిస్మస్ రోజు. అతని భార్య గదిలోకి వచ్చింది. అతని చేతిని తాకగానే ఆమె కళ్లలో ధైర్యం నాట్యం చేసింది. కన్నీళ్లు నిండాయి—పునర్జన్మ కన్నీళ్లు. ఒక చిన్న కాగితం నాకు అందించింది. “నిన్న రాత్రంతా రాసిన ప్రార్థన. ఇది నాకు ధైర్యం ఇచ్చింది,” అంది. ఆ కాగితంపై: “ఒక హృదయం ఆగిపోతే, మరో హృదయం దాని బీట్ నేర్చుకుంటుంది.” ఆ మాటలు హృదయానికి చల్లగా తగిలాయి.

ఆపరేటింగ్ రూమ్ బట్టలు మార్చుకుని కారు పార్కింగ్ లాట్‌కు చేరాను. క్రిస్మస్ స్పిరిట్‌తో నర్సులు, డాక్టర్లు విషెస్ చెబుతున్నారు. కానీ నా చెవుల్లో ఒకే శబ్దం—కొత్త గుండె బీట్. క్రిస్మస్ అంటే పిల్లలకు బహుమతులు, పెద్దలకు సెలవులు. నాకు, ఆ రాత్రి నుంచి, క్రిస్మస్ దాతృత్వం పేరు. ఒక అనామక కుటుంబం తమ శోకాన్ని బహుమతిగా మలిచిన రోజు. ఒక ఇంట్లో దీపాలు ఆరిన వేళ, మరో ఇంట్లో యంత్రాల వెలుగు జీవితానికి రంగు పూసిన రాత్రి.

క్రిస్మస్ సెలెబ్రేట్ చేయని నేను ఏటా డ్యూటీకి వాలంటీర్ చేసేవాడిని. ఈసారి క్రిస్మస్ నాకు కొత్త అర్థం ఇచ్చింది—పుస్తకాల్లో, సినిమాల్లో కాదు, ఆపరేషన్ థియేటర్‌లో తెలిసిన అర్థం. ఉదయం రోడ్లు ఖాళీగా ఉండటంతో తొందరగా ఇంటికి చేరాను. పిల్లలు క్రిస్మస్ ట్రీ దగ్గర నా కోసం ఎదురుచూస్తున్నారు.

కథలు కొన్ని మనం రాయకుండానే పుట్టుతాయి.

వాటి ముగింపు మనం నిర్ణయించలేము — వాటి గుండె ధ్వని, వాటి జీవన శబ్దమే చెబుతుంది.
ఆ క్రిస్మస్ రాత్రి, ఒక గుండె ఆగింది. మరొకటి జీవితం కోసం స్పందించిడం మొదలుపెట్టింది .
ఆ క్షణంలో, నా హృదయం కూడా కొత్త అర్థాన్ని నేర్చుకుంది —

క్రిస్మస్ అంటే పండుగ కాదు, అది ఒక కుటుంబం తమ శోకాన్ని మరొక కుటుంబానికి ఆశగా ఇచ్చే దాతృత్వం.

*

సూర్యం గంటి

14 comments

Leave a Reply to Mohana Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరు ఒక అద్భుతమైన వైద్యుడిగా ప్రాణాలు కాపాడుతూ, ఇప్పుడు రచయితగా హృదయాలను తాకుతున్నారు! ఈ కథలో మీ అనుభవాలు, ఆశలు, దాతృత్వం అంతా అద్భుతంగా చిత్రించారు. క్రిస్మస్ రాత్రి గుండె మార్పిడి ద్వారా జీవితాన్ని పునర్జన్మించిన మీ కథ, మనసును కదిలించి, ఆలోచింపజేసింది. వైద్య రంగంలో మీ సేవలు ఎంతో విలువైనవి, మీ రచనా ప్రతిభ కూడా అంతే అమూల్యమైనది. మరిన్ని ఇలాంటి కథలు రాస్తూ, మరిన్ని హృదయాలు గెలవాలని కోరుకుంటున్నాను! 👏❤️

    • BSR, మీ వ్యాఖ్యతో నాకు అర్ధం అయినదేమిటంటే ఇవాళ సూర్యం మనకు చూపిన పార్శ్వం మీలో కూడా దాగి ఉందని. మీ అనుభవాలు, వాటితో ముడిపడిన కథలెన్నో. ఒకసారి ప్రయత్నించండి.

  • నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఏ వృత్తిలో ఉన్నవారు ఆ వృత్తికి సంబంధించిన తమ అనుభవాలను కధా రూపంలో పాఠకులకు అందించండి. సామాన్య ప్రజలకు తెలియని ప్రపంచాన్ని తెలియజేయండి అని.
    మా తమ్ముడు సూర్య గంటి ఆపనే చేశాడు. శైలి చాలా బాగుంది. అభినందనలు.

  • సంక్రాంతి శుభాకాంక్షలు సూర్యం.
    చాలా బాగా రాసావు. మేము కూడా అక్కడ ఉన్నట్లు అనిపించింది. ఇంకా రాస్తూ ఉండాలి.

  • సూర్యం తనకు వృత్తి పరంగా ఎదురైన ఒక అనుభవాన్ని కథావస్తువుగా ఎంచుకుని చక్కని కథనంతో పాఠకులను ఆపరేషన్ థియేటర్ లోనికి వెళ్ళాడు. ప్రాణం పోసుకుని తిరిగి స్పందించిన గుండె సవ్వడి మనకు వినిపించి మన మనసుని స్పృశించాడు. తన అనుభవాలతో అల్లబోయే కథల పరంపరకు ఇది నాంది అని ఆశిస్తున్నాను.

  • ఈ కథ చదివిన తర్వాత ఒక వైద్యుడి చేతుల్లో ఉన్న స్టెతస్కోప్ మాత్రమే కాదు, ఆయన హృదయమూ ఎంత జీవంతో కొట్టుకుంటుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేవలం ఒక హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కథ కాదు — ఇది ఆశ, శోకం, దాతృత్వం, మానవత్వం కలిసి కొట్టుకున్న హృదయ ధ్వని.

    రచయిత ఒక ప్రాక్టీసింగ్ ఫిజిషియన్ అయినప్పటికీ, వైద్య పుస్తకాల భాషలో కాకుండా మనిషి ఊపిరి భాషలో ఈ కథను చెప్పారు. ICUలోని మానిటర్ల శబ్దం, ఆపరేషన్ థియేటర్ నిశ్శబ్దం, భార్య కళ్లలోని ప్రార్థన, పిల్లల చూపుల్లోని భయం — ఇవన్నీ చదువుతున్న మన హృదయాన్నే ICUకి తీసుకెళ్లి నిలబెట్టాయి. గణాంకంగా ఉండాల్సిన “15% ఎజెక్షన్ ఫ్రాక్షన్”ను మన ఊపిరి భారంగా అనిపించేలా చేయగలిగిన రచన ఇది.

    ప్రత్యేకంగా క్రిస్మస్ రాత్రి భాగం — వైద్యుడి వ్యక్తిగత జీవితం, వృత్తి బాధ్యత, మానవత్వం మూడు ఒకేసారి ఢీకొన్న క్షణం — అసాధారణంగా హృదయాన్ని తాకుతుంది. “ఒక హృదయం ఆగిపోతే, మరో హృదయం దాని బీట్ నేర్చుకుంటుంది” అనే వాక్యం ఈ కథకు మాత్రమే కాదు, మొత్తం వైద్య వృత్తికే ఒక మానిఫెస్టోలా నిలుస్తుంది.

    ఈ రచయితకు కథ చెప్పడం ఒక కళ అయితే, ప్రాణాలను కాపాడటం ఒక తపస్సు. ఆ రెండూ కలిసినప్పుడు ఇలాంటి కథలు పుడతాయి — మనల్ని నిశ్శబ్దంగా చేసి, లోపల ఏదో మృదువుగా మార్చేసే కథలు. సినిమాటిక్ హైప్ లేకుండా, భావోద్వేగాలను అతిగా పిండకుండా, నిజాయితీతో రాసిన ఈ కథ తెలుగులో అరుదైన అనుభవం.

    ఈ కథ చదివిన తర్వాత క్రిస్మస్ అర్థం మారిపోతుంది. ఇది పండుగ కాదు; ఇది ఒక కుటుంబం తమ శోకాన్ని మరొక కుటుంబానికి ఆశగా ఇచ్చే మహత్తర దాతృత్వం అని మన హృదయమే అంగీకరిస్తుంది.

    ఇలాంటి కథలు మరిన్ని రావాలి. రచయితకు హృదయపూర్వక అభినందనలు — వైద్యుడిగా మాత్రమే కాదు, మనసుల్ని మళ్లీ మానవత్వం వైపు తిప్పిన కథకుడిగా కూడా.

  • సూర్యం తనకు వృత్తి పరంగా ఎదురైన ఒక అనుభవాన్ని కథావస్తువుగా ఎంచుకుని చక్కటి కథనంతో పాఠకులను ఆపరేషన్ థియేటర్ లోనికి తీసుకెళ్ళి, ప్రాణం పోసుకుని తిరిగి స్పందించిన గుండె సవ్వడి వారికి వినిపించాడు. వారి మనసులను స్పృశించాడు. తనకు ఇలాంటి అనుభవాలు ఎన్నో, వాటితో ముడిపడిన కథలెన్నో? ఆ అనుభవాలతో అల్లబోయే కథామాలికలో ఈ కథ తొలి కుసుమం అని ఆశిస్తున్నాను.

  • చాలా బాగుంది .ఇంకొన్ని కథలకు స్వాగతం 🌺

  • ఒక డాక్టర్‌గా తన వృత్తి ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, భావోద్వేగాలతో పాటు తనలో దాగి ఉన్న కళాత్మక భావాలను అక్షరరూపంలో సునిశితంగా ఆవిష్కరించిన సూర్యుని ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం. ఈ రచనను చదివే ప్రతి హృదయానికీ సహజంగానే స్పందన కలుగక మానదు.

  • I can see both sides of suryam in this story/situation as a physician and as a human observer.He conveyed beautifully (as it is) human suffering,hope and sadness to all of us in our language.congratulations suryam.👏sorry I couldn’t type in Telugu.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు