…. ఒకటే రూపం.అనేక ప్రతిబింబాలు

తారలా ఎగిసి, కవితకై వగచి, వాయులీన గానమై పరవశించి, కవిత్వపు మరుభూముల్లో వెన్నెలై విరిసి, ఉల్కలా అర్ధాంతరంగా ముగిసి రాలిపోయిన సైదా, కాల్రిడ్జ్  గురించి లాంబ్ అన్నట్టు “an archangel a little damaged” గా అనిపిస్తాడు!

ఆవేదనతో జీవితపు చీకటి పార్శ్వాల్ని తడుముకొంటో, ఆశించినదేదో పోగొట్టుకుంటో, పోగొట్టుకోవడంలోనే విషాదాన్ని వెతుక్కొంటో, విషాదంలోనే నిషా పూని పలవరించిన సైదా నిజానికి విషాదుడేకానీ, నిషాదుడవ్వని పేదరికం నిరంతరం నీడలా వెంటాడినమాట నిజం!

సైదా కవిత్వాన్ని సిప్ చేసిన వారెవరూ ‘ఫిదా’ కాకండా ఉండటమే కాదు ఒక నైరాశ్యపు తెరేదో ఏ సందె వేళో చూరుకింద దూరేప్పుడు మొహంమీద అంటుకున్న సాలెగూడులా విదిలించుకున్నామనుకున్నా ఒక పట్టాన వదలని కవిత్వపు నైరాశ్యాన్నేదో హింటిస్తాడు! కవిత్వం అతుక్కుపోయే సాలీడుగూడే కాదు, హత్తుకుపోయే మత్తు కూడా! చదివి తరించే అందరి మొహానికి అంతోఇంతో కవిత్వాన్నద్ది అహాన్ని సంతృప్తి పరచుకోడమే సిసలైన కవిత్వం. కవిత్వపు ప్రవాహ ఉధృతిలో కొట్టుకెళ్లీ కూడా, రోలింగ్ స్టోన్లా యే ‘మాసూ’ పోగేసుకోని కవిత్వం కవిత్వమేకాదు. పయోధర ప్రచండఘోషనో, ఝన్ఝూనిల షడ్జధ్వానమో వినిపించకపోయినా పర్లేదుగానీ…కనీసం కాసేపు కట్టిపడేశాలానో, లేదా అసలే నెట్టిపడేసే దానిలానో ఉండాలి కదా! సైదా చేసిన పనదే!

కవికో  తనదైన లోకం వుంటుంది. ఆ మంత్ర నగరి సరిహద్దుల్లో గిరిగీసుకొని, మంత్ర కవాటం మూసుకొని,

చీకటి గుహలో కూచుని, అంతర్నేత్రం తెరుచుకొని రాసుకుంటూ వెళతాడు. అది రాజుకుంటుందా, తననే దహిస్తూ పోతుందా తనకి అప్రస్తుతం.

సైదా హృదయ సామ్రాజ్యంలో స్త్రీ ఒక అబ్సెషన్! ఆ స్త్రీ లోకంలో కారుణ్య స్త్రీలు, కన్నీటి స్త్రీలు,అనాగరిక దేవతలు, నాగరికరాక్షసులు, స్కిజోఫ్రీనియాలూ, నిలువెత్తు హిస్టీరియాలూ, దుఃఖోత్ప్రేరకులు, నిర్దయులు, సహచరీ, ప్రేయసీ, బిడ్డా, తల్లీ, అమ్మా ఇంకా ఈ ప్రపంచంలో ఏ కవీ పలవరించనంతమంది విభిన్నముఖాల, వక్షోజాల, గర్భాల, దేహాలతో అసంఖ్యాకంగా, అంతూ పొంతూ లేనంతగా! ఈ గాజుపలకల, చవిటినేలల, అగ్నిపర్వతాల్లాంటి, మంచుముత్యాల్లాంటి స్త్రీ కవికి “నిజానికొక ప్రతీక… ఎంతకూ చేరలేని ఒక నిర్మానుష్య ద్వీపం, నిరంతరం ఒక సమాధానం లేని ఒక ప్రశ్న, తనకితానే తెలీని ఒక నిర్లజ్జాపూరితఉనికి…ఒంటికి సూర్యవస్త్రాన్ని చుట్టుకున్న చీకటితేజం, చీకటి మెరుపుల్ని ఆపాదించుకున్న భయాన్విత అగ్నిశూన్యం.” స్త్రీ హృదయకవాటాల్లో అలలుఅలలుగా వెల్లువెత్తే రుధిరప్రవాహఝురినీ, వ్యక్తావ్యక్తాలాపనల్నీ, సంస్పందల్ని ఒకటేమిటి స్త్రీలోకం చుట్టూ అల్లుకున్న విశ్వజనీనమైన, అందమైన అనుభూతుల పారవశ్యాల్నే కాదు, అమర్యాదల నిందాస్థితులూ, స్తుతులూ సైతం ఉన్నాయ్ సైదా కవితాత్మలో! అందుకే ఆమెబొమ్మలో నీలంరంగు మాయలా ‘ఆమే’ సర్వాంతర్యామిలా ప్రతి పదంలో చొరబడి, ప్రతిపాదంలో కలబడి, సర్వవ్యాపమై, తన్ను తాను సంభావించుకోవడం చూస్తాం! అందుకే ఆమె తన బొమ్మ కాకండా ఉండలేని అబ్సెషన్!

Because I couldn’t stop for death లో ఎమిలీ డికెన్సన్ మృత్యు శకటాన్ని ఇంటికి పిలిపించుకుని, మరణం పక్కేకూచుని, ఇహలోకపు అనుభూతుల్ని ఇంట్లోనే వొదిలేసి, తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లేందుకు, ‘తాత వొళ్ళోకూచుని పల్లెవెళ్లేప్పుడు అమ్మని కూడా సంతోషంగా వదిలేసివెళ్లే ఆరేళ్ళబిడ్డ ఆనందపు వీడ్కోలిస్తూ చేతులు ఊపుతున్నట్టే,’ ఎక్కడా విషాదపుఛాయే తోచకండా, వెళ్లి బండిలో కూచోడానికి సిద్ధపడుతుంది ఎమిలీ! ఎమిలీ నిజంగా నిజజీవితంలో కూడా మృత్యువుని వరిస్తుంది! ఈ మృత్యుప్రేమి తన అంతిమయాత్రని శోభాయమానంగా జరుపుకునేందుకు బతికుండగానే శవపేటికని ధవళ కాంతులీనే వస్త్రాల్లో నిజంగానే అలంకరించిన చందంగా, సైదా కవితానుభూతుల్లో మృత్యు ప్రతీకలు అనవరతంగా వచ్చాయో, అవసరార్ధంగా వచ్చాయో తెలీదుగానీ, మృత్యువు తనని వేళకానివేళలో కబళిస్తుందేమోనన్న దురూహ అనునిత్యం వెంటాడుతూఉండటం గమనించకుండా వుండలేం!  బోదలేర్ జీవితాదర్శమో, బుకోవిస్కీ ఇచ్చిన “we are here to laugh at the odds and live our lives so well that Death will tremble to take us”  ధైర్యవచనమో తెలియదుగానీ, ఒక నిరంతర నైరాశ్యపు మృత్యు ప్రతీక లేవో అలలై, చితి చెయ్యమని అడగడం లోనో, కోర్కెల కాష్టాన్ని కోరుకోవడంలోనో, మృత్యు పుష్పపు గంధాల్ని  ఆస్వాదించాలనుకోవడం లోనో, పీనుగెళ్లే బొందల్లో, కాలుతున్న శవాల్లో, చితా భస్మాల్లో, ఎగిసే శ్మశానాల్లో, ముందు వెంట్రుకల్లో తొంగిచూసి, చర్మంలోకీ, రక్తంలోకీ, మాంసంలోకీ నిర్దయగా అడుగు వేసే మృత్యువు పై ఈ వలపు ప్రతి తలపులోనూ తలుపుతట్టడం యాదృచ్చికంగా జరిగిందా ఏభయ్ లైనా చూడకుండానే చరమ శాంతి కోసం ఈ ‘కర్మ భోగి’, ఈ ‘భ్రష్ట భోగి’ నిజంగానే  వేగిర పడ్డాడా అనిపిస్తుంది ఇవన్నీ చూశాక.

బోదెలేర్ ని కడదాకా వెంటాడిన పేదరికమూ, మత్తుకూ, మందుకూ, బానిసై అచేతనంగా పడివుండడమూ తల్లి హృదయాన్ని ఎంత క్షోభ పెట్టిందో తెలియదుగానీ ఆ దుఃఖపు తెరలేవో ‘రైసు మిల్లులో తవుడు రాలుతున్నట్టు’ అమ్మని తలుచుకున్నప్పుడో, ‘ఇంత భూమికొనుక్కో కొడకా’…అని ఆర్ధ్రంగా అడిగినప్పుడో, అమ్మని కొట్టిన నాయన్ని ద్వేషించడం లోనో, మరో స్తన్యం తడిమినప్పుడు గుచ్చుకున్న గడ్డపు ముళ్ళ గగుర్పాటు లోనో, అమ్మ కొంగుముడి దాకా రాని చిల్లిగవ్వల్ని తలుచుకున్నప్పుడో, సంసారపు అమ్మ కంటే సంచారపు తల్లిని కోరుకున్నప్పుడో అమ్మతనపు కమ్మదనంలో పలవరిస్తున్నప్పుడో, తీయని వేదనేదో అంతర్లీనంగా స్పృశిస్తుంది.

సైదా నాష్టాల్జిక్ తలపుల్లో వృత్తిప్రతీకలు కోకొల్లలు. చాలా కవితల్లో జ్ఞానాన్ని మేసిన జ్ఞాపకాల్లో, ధ్వజ స్తంభాల ఊసులూ, ఇత్తడి గంగాళాలూ, మైలారం బిందెలూ, కొలిమి నిప్పులూ, రవ్వా, ఎలిగారాలూ, కళాయి పూతలూ, నార్సం వేసి నాలుకలు చీల్చుకోవడాలూ, కుంభం పోసి తొక్కడాలూ, శానాలూ, పోగర్లూ, కొప్పెర్లూ, సలాకలూ, బ్రహ్మం తత్వాలూ, కాలజ్ఞానాలూ, రుంజనాదాలూ కనిపిస్తాయి, వినిపిస్తాయ్. బువ్వ గ్యారెంటీ ఇవ్వని వృత్తి ఒకవైపూ, వాయులీనంతోనో, వాక్కునమ్ముకోవడంతోనో, నమ్ముకొని బతికే తెలివే తెల్లారని ప్రవృత్తి మరోవైపూ,  రెండింటి సంఘర్షణల మధ్య నిరంతరం నలిగి, కెంపు మైకంలోనో, చలికి వణుకుతున్న బీరుబుడ్లతో ఉదరోష్ణం చల్లార్చుకొని ‘చివరివిందు’ కుడిచి సేదతీరక తప్పని జీవన ప్రయాణం నిరంతరం ప్రతిబింబిస్తుంది చాలా కవితల్లో.

అందరికీ బాల్య స్మృతి ఒక నవ నవోన్మేషపు అనుభూతుల ఆటవిడుపైతే, సైదాకు అదొక చేదు జ్ఞాపిక. చిన్న చిన్న అంగాల్నీ, శరీరాన్నీ చూసుకొని సిగ్గుపడి, న్యూనతపడి నెట్టుకొచ్చిన బాల్యం భరించరానిదై, తిండికోసం,ఆనందం కోసం, కోరికల కోసం, నచ్చని వాణ్ణి తన్నడం కోసం, కలలుగన్న యవ్వనం కోసం పరితపించినంత సేపు పట్టలేదు, కౌమారపు భగ్న స్వప్నాల్నీ, దగ్ధ కాలాల్ని వొదులు కోవడమూ, మోసపూరిత ప్రియురాళ్ళ, నిష్ఫల కాంక్షల, నిరీక్షణలో కడతేరిన కాంక్షలు, ఎంగిలిలో అంతమైన అనుభవాలతో అంతం! వృద్ధాప్యం వద్దనుకొని నేరుగా మృత్యువుని కలగన్నాడు సైదా ఎందుకో ఏమో! “తథాస్తు” అంది విధి!

ఏభయ్ అయినా నిండకుండానే, “ముందు వెంట్రుకల్లోకి తొంగి చూడకుండానే, చర్మంలోకీ, రక్తంలోకీ, మాంసంలోకీ ఒక్కొక్క అడుగువేసుకొని” రాకుండా ఉండదని అనుకున్నాడు గానీ,  ఇలా ఆదాటుగా వచ్చి ముంగిటవాలి “దా, సైదా, వెళ్లిపోదాం!” అంటుందని వూహించ లేదనుకుంటా! మరీ ఇంత తొందరగా కాక పోవచ్చు! కానీ తరచూ పలవరించిన ‘పాడే’ ఎదురుగా  నిలబడింది. అర్ధాంతరంగా అర్ధ జీవితం కూడా గడవక మునుపే డాక్టర్ ఫాస్టస్ ను మెఫిస్టోఫలిస్ భూతం ఆక్రమించుకున్నట్టు గద్దలా తన్నుకెళ్లిపోయింది! ఇది తెలుగు నియో నవీన కవిత్వానికొక ట్రాజిక్ షాక్!

మోహ పారవశ్యమూ, బోదలేర్ బాధలూ, బుకోవిస్కీ మృత్యువుతో ఆడిన పరాచికాలూ, అయిల సైదాచారి కవిత్వపు వీచికల్లో దోబూచులాడతాయ్! “We’re all going to die, all of us,what a circus! That alone should make us love each other but it doesn’t. We’re terrorized and flattened by trivialities: we’re eaten up by nothing”  అంటాడు బుకోవిస్కీ ఓ చోట! విషయం ఏమిటంటే చావు కాదు అసలు భయంకరమైంది, బతికే మనుషుల బతుకే, చచ్చేవరకూ బతకలేని తనమే భయంకరమైన విషయం! బీరు తాగడానికొచ్చాం మేం ఇక్కడికి, యుద్ధాన్ని అంతం చేయడానికొచ్చాం మేం ఇక్కడికి, అడ్డొచ్చే వాటి మొహం మీద నవ్వేసి, మా బతుకు బతకడానికొచ్చాం, యెంత బాగా అంటే, చేరువకి చేరడానికి, చావుక్కూడా వణుకు పుట్టాలి! మరి సైదాకి అలానే అనిపించిందా? డెబ్భైలు కూడా దాటిపోయినవాడు బుకోవిస్కీ. ఏభయ్ అయినా చూడని వాడు సైదా!

“సమయంలేదు

మట్టిలో మొలిచిన మాంసం

మట్టిలో కలిసే సమయం

దూరంగా లేదు

చేతుల్లో లేదంటే లేదనుకొనే”   సైదాచారి  వేదనలో  తాను తాత్వికంగా కలవరించే బుకోవిస్కీ లేడేమో అనిపిస్తుంది.

“ఇంకేమీ లేదు…నేనూ నా కట్టె.

అంతా ఇక నిశ్శబ్దం. పాడె మీద శవం కట్ల వత్తిడి…

ఎప్పుడో బొంద లో కూర్చున్న నా శవం పెదవుల రహస్య కదలిక

“మట్టి- మృత్యువు-కవి

ఒకటే రూపం. అనేక ప్రతిబింబాలు”

 యెంత వద్దనుకున్నా ఏదో ఒకచోట మృత్యువు దోబూచులాడుతున్న కలవరం. అదే నిజం! “చివర్లో కొన్ని కాకులు కొట్లాడుకున్నా, కొట్లాడుకోకపోయినా!”

                                      *****

 

వి. విజయకుమార్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హృదయాన్ని కదిలించి రగిలించింది మిత్రమా

  • మంచి విశ్లేషణ సర్. కవిత్వాన్ని సుదీర్ఘ ంగా వివరించారు. గుండెలోతుల్లో చెప్పలేని బాధ చదువు తున్నంతసేపూ ఉంది. చదివేశాక ఆబాధవెంటాడుతుంది. ఆయన కవిత్వం చదనవాలనే ఆకాంక్ష కలిగించారు.ధన్యవాదాలు సర్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు