ఐ హేట్ ఇండియన్ రైల్వేస్!

1980 లో కాకినాడ కాలేజీలో ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు ఓ రోజు నాన్న ఇంట్లోకొస్తూ చెప్పిన విషయం తనకి ఉద్యోగం పోయిందని. దాదాపు ముఫ్ఫై సంవత్సరాలు వేట్లపాలెం సగ్గుబియ్యం ఫ్యాక్టరీలో ఒళ్ళు దాచుకోకుండా పనిచేసాక, బిజినెస్ బాగోలేదనే పేరుతో ఉద్యోగం లోంచి తీసేసారుట. సాగో ఫ్యాక్టరీలో పనిచేసిన రోజుల్లో అమ్మకాలకీ, కొనుగోళ్ళకీ ఇటు మద్రాసు నుంచి అటు ఢిల్లీ వరకూ, ఈ పక్క బాంబే నుంచి కలకత్తా వరకూ రైళ్లలో చెడ తిరిగిన నాన్నకి ఓ రెండు నెలల ముందు చెప్పారు. సగ్గుబియ్యం ఫ్యాక్టరీ ఓనర్ కూడా వయసైపోతోందని చెప్పి ఉన్న వ్యాపారాలన్నీ అమ్మేసో, కట్టేసో కాకినాడ వెళ్ళిపోతున్నాడు డాక్టర్ కొడుకు దగ్గిరకి. ఉద్యోగం పోయేనాటికి నాన్నకి ఉన్న ఆస్తి ఓ రెండెకరాల పొలం, అమ్మ మెడలో రెండు కాసుల పుస్తెల తాడూ, ఇంజినీరింగ్ చదివే నేనూ, ఇంటర్మీడియట్ చదువుతున్న చెల్లెలూను.

అప్పటికి ఇంకా రెండేళ్ళ పైచిలుకు ఉంది నా చదువు. వేట్లపాలెం సామర్లకోటకి పక్కనే కానీ గోదావరి కాలవ రూట్లో రాజమండ్రి వెళ్ళే దారిలో ఉంది. పొద్దున్నే కాలవ – లేక ఆర్ టి సి వారి భాషలో కెనాల్ – రూట్లో బస్సు ఎక్కి కాకినాడ వెళ్తే సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేసరికి దాదాపు ఆరు, ఏడూ అయ్యేది. ఇప్పటిదాకా నాన్న ఉద్యోగం ఉండేది మరి ఇప్పుడు ఎలాగా అనే ప్రశ్న ఉదయించేసరికి నాన్నే చెప్పేడు, “మరో రెండు నెలలు ఫర్వాలేదురా, ఈ లోపున మరో దారి చూద్దాం గానీ నువ్వు ఏదైనా…” ఆగి నా మొహంలోకి చూసాడు నేను ఏమైనా అనుకుంటానేమోనని.

“చెప్పండి, నేనేం చేయాలి?”

“ఊళ్ళో కుర్రాళ్ళకి ప్రేవేట్లు చెప్పుకోవచ్చు. నాకూ ఓపిక తగ్గుతోంది కనక నువ్వు ఓ చేయి వేసావంటే ఇద్దరం కల్సి నీ డిగ్రీ అయ్యేదాకా బండి లాగించవచ్చు.”

“తప్పకుండా అలాగే చేద్దాం, నేను సాయంత్రం వచ్చేసరికి ఆరూ, ఏడూ అవుతోంది. అప్పుడు మొదలుపెడితే రాత్రి ఎనిమిదిన్నర దాకా చెప్పగలను. ఆదివారం అయితే మరికొంచెం వీలవుతుంది.” ఆ మాత్రం తట్టనందుకు నన్ను నేను తిట్టుకుంటూ చెప్పేను.

అలా మొదలైందే మా వేట్లపాలెం ట్యూషన్ సెంటర్. మొదట్లో పల్లెటూరి జనం డబ్బులివ్వకపోయినా, ఏ కూరో నారో తెచ్చిపెట్టేవాళ్ళున్నారు. ఆరు నెలలకి కాస్త గాడిలో పడింది బండి. మరో రెండు సంవత్సరాలుంది నా చదువు. చెల్లి కి పెళ్ళి చేయాలి. నా చదువు అయ్యి, చెల్లి పెళ్ళి అయ్యేలోగా ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుంటే అదే చాలు. చెల్లికి అనపర్తిలో తను చదువుతున్న కాలేజీలోనే బి.ఏ లేకపోతే బి.ఎస్సీ లోనో సీటొస్తుంది. దానిష్టం ప్రకారం తర్వాత బి.ఎడ్ లో సీటు వస్తే ఒక్క సంవత్సరంలో ఏదో చోట టీచర్ ఉద్యోగం వస్తుందనే ఆశ.

ఓ రోజు పేపర్లో ఇంజినీర్లకి ఉద్యోగాలెలా ఉన్నాయా చూస్తున్నప్పుడు కనిపించాయ్ రెండు ప్రకటనలు – ఒకటి ఆర్మీ వారిది, రెండోది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిదీను. ముందు అప్లికేషన్ పంపించాలి, తర్వాత తీరుబడిగా పిలుస్తే పిలుస్తారు లేకపోతే లేదు. ఆ తీరుబడి అనేది వానరాకడ, ప్రాణం పోకడ లాంటిది. దీని గురించి కూడా వాళ్ళే రాసారు ప్రకటనల్లో – ముందు ఇలా అప్లికేషన్ లు తీసుకుంటాం, ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఖాళీ అవుతాయో అప్పుడు వీలుబట్టి పిలుస్తాం కనక ఇంజినీరింగ్ చదువుతున్న కుర్రాళ్ళు అందరూ అప్లికేషన్ లు పెట్టుకోవచ్చు అని. ప్రస్తుతానికి ఓ కాయితం మీద ఊరూ, పేరూ, బయోడాటా అదీ పంపిస్తే చాలు. అన్నింటికన్నా ముఖ్య విషయం – దేనికీ ఉత్తర ప్తత్యుత్తరాలు లేవు, కాళ్ళూ చేతులూ, మిగతా శరీరంలో ఏం అవకరం ఉండరాదు. సరే పోయిందేమీ లేదు కనక ఈ ఆర్మీకీ, ఆ ఎయిర్ ఫోర్స్ కీ తలో అప్లికేషన్ పారేసి మళ్ళీ ట్యూషన్లు, కాలేజీ చదువులో పడ్డాను. దీని గురించి అమ్మతో కానీ నాన్నతో కానీ చెప్పలేదు. ఒక్కడే కొడుకుని కనక వద్దనే ఛాన్సే ఎక్కువ – అసలే బార్డర్ లో గొడవలు అవుతున్నాయి, ఏదైనా యుధ్ధం వస్తే అక్కడకి పంపిస్తారేమో అనే చింత ఉంటుంది కదా. అసలు ఈ అప్లికేషన్ ఎవరైనా చూసి నన్ను ఇంటర్వ్యూ కి రమ్మని పిలిస్తే, గిలిస్తే అప్పుడు చూసుకోవచ్చు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు లేవా?

నాలుగో సంవత్సరం అవుతుండగా ఉద్యోగాలకి అప్లికేషన్ లు పెట్టేటప్పుడు తెలిసివచ్చిన విషయం నేను చదివిన ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ కి హైద్రాబాద్, మద్రాసు లాంటి నగరాల్లో తప్ప మరోచోట ఉద్యోగం వచ్చే అవకాశం సున్నా. ఈ పల్లెటూరు వేట్లపాలెం లో కూర్చుని అప్లికేషన్ పెట్టడం, తర్వాత ఇంటర్వ్యూలకి పిలుస్తారేమో అనుకుంటూ చూడడం, ఎవరైనా పిలిస్తే వెళ్ళి అది వస్తుందనుకోవడం. ఈ ప్రహసనంలో మళ్ళీ ప్రయాణాలకి ఖర్చులు. అసలే నాన్నకి ఉద్యోగం లేనప్పుడు ఆయన్ని డబ్బులడగడం ఎలా? హైద్రాబాద్ లో రెండు ఇంటర్వ్యూలకి వెళ్ళాక ఇంక మరోచోటకి వెళ్ళడం అనవసరం అనిపించే రోజులొచ్చాయి. ఉన్న ఊళ్ళోనే ‘ఏరా, ఉద్యోగం వచ్చిందా, అంత చదువూ చదివేవ్? ట్యూషన్ లు చెప్పుకోవడానికి ఇంజినీరింగ్ చదవాలా?’ అని వెక్కిరించే జనం తయారయ్యేరు, ఇంట్లోంచి బయటకి అడుగుపెడితే. అటు నుయ్యీ ఇటు గొయ్యీను. కాకినాడలో నా సీనియర్లకే ఉద్యోగాలు అంతంత మాత్రంగా వస్తున్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను?

* * * * * * *

డిగ్రీ చేతికి వచ్చిన మూడు నెలలక్కూడా నేను నిరుద్యోగినే. అయితే ఎవరి మీదా ఆధారపడకుండా ట్యూషన్లు చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను. ఇటూ అమ్మ అంటూనే ఉంది, “ఈ ఇంజినీరింగ్ వద్దు అంటే విన్నావు కాదు ఇప్పుడు ఉద్యోగంలేదు, అటు చెల్లికి పెళ్ళి చేయాలి, నాన్న ఉద్యోగం పోయింది. మా ఇద్దరికీ కరచరణాలు ఎంతకాలం ఆడతాయో” అంటూ. నాన్న పైకి ఏమీ అనకపోయినా లోపల బాధపడుతున్నాడని తెలుస్తూనే ఉంది. చెల్లికి రోజూ కాలేజీకి వెళ్ళి రావడానికి ఏదో విధంగా డబ్బులు సర్దగలుగుతున్నాం. నా ఉద్యోగం ఒకటే ఏమీ తేలని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఏదైనా ఉద్యోగం వచ్చితీరుతుందనుకునే నేను అసలు జీవితం లో నాకు ఉద్యోగం వస్తుందా లేకపోతే సివిల్ ఇంజినీరింగ్ చదివి కిళ్ళీకొట్టు పెట్టుకున్న మా ఊరి వీర్రాజులా తయారౌతానా అనే అనుమానం మనసులోకి అప్పుడప్పుడూ చొరబడుతోంది ఎంత వద్దనుకున్నా. ఆఖరికి రోజూ ఉత్తరాలు తీసుకొచ్చే పోస్ట్ మాన్ మస్తాన్ కూడా నన్ను చూసి వంకరగా నవ్వుతున్నాడు; ఆ నవ్వులో ‘ఆఖరికి ఎనిమిదో క్లాస్ చదువుకున్న నాకైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కానీ ఇంజినీరింగ్ చదువుకున్న నీకేం ఉద్యోగం లేదు’ అనేది కనిపిస్తూనే ఉంది.

మే నెలలో రోహిణీ కార్తె దాటుతున్నప్పుడు ఓ రోజు మస్తాన్ రెండు ఉత్తరాలు పారేసి వెళ్ళాడు. విప్పి చూస్తే ఎప్పుడో అప్లికేషన్ లు పంపించిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రెండింటినుండీ ఇంటర్వ్యూకి రమ్మని సమాచారం. వెంఠనే వెళ్ళి కేలండర్ లో తారీఖులు చూస్తే గుండె ఆగినంత పనైంది. భోపాల్ రెజిమెంట్ నుంచి వచ్చిన లెటర్ ప్రకారం మే 21న ఇంటర్వ్యూ ఇండోర్ లో. మే 23న ఎయిర్ ఫోర్స్ వారి ఇంటర్వ్యూ హైద్రాబాద్ లో. ఇంటర్వ్యూ కి వచ్చినందుకు ఆర్మీ వారు దారి ఖర్చులు ఇస్తారు. ఎయిర్ ఫోర్స్ వారు డబ్బుల గురించి ఏమీ చెప్పలేదు ఉత్తరంలో; అంటే ఇవ్వరనే అనుకోవడం. ఉత్తరం వచ్చిన రోజు మే 18. అంటే మూడురోజుల్లో ఇండోర్ లో ఉండాలి. భోపాల్ అంటే తెలుసు. మరి ఇండోర్? అసలెలా వెళ్ళడం అక్కడకి? ఈ రెండింటికీ వెళ్ళడం ఎలాగా కుదరదేమో ఏదో ఒకటే చూసుకుందాం అనుకునేలోపుల నాన్న ఈ ఉత్తరాలు చూసీ కాసేపు ఇంట్లో ఉన్న ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ అనే పుస్తకం చూసీ చెప్పేడు, “నువ్వు కనక ఈ రెండింటికీ వెళ్తానంటే ఓ దారి ఉంది.”

ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు అంటే మొదట్లోనే వద్దు అంటాడనుకున్న నాన్న, సాగో ఫాక్టరీ ఉద్యోగం నిమిత్తం ముఫ్ఫై ఏళ్ళు ఇండియా అంతా ఇండియన్ రైల్వేస్ లో బాగా తిరిగాడని గుర్తు రాక బుర్ర పనిచేయని నాకు ఒక్కసారి తెలివి వచ్చి అడిగేను, “ఎలా కుదురుతుంది?”

నాన్న మరోసారి ట్రైన్స్ ఎట్ ఏ గ్లాన్స్ తిరగేసి చెప్పేడు, “రేపు పొద్దున్నే – అంటే పంతొమ్మిదో తారీఖు – ఆరింటికి రాజమండ్రిలో కోణార్క ఎక్స్ ప్రెస్ ఎక్కి పదీ పదకొండు గంటల మధ్య విజయవాడలో దిగుతావు. మధ్యాహ్నం రెండింటికి మద్రాస్ నుంచి ఢిల్లీ వెళ్ళే తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ ఎక్కితే 20వ తారీఖు పొద్దున్న ఆరింటికి భోపాల్. రెండు గంటల తర్వాత భోపాల్ లో బయల్దేరే పాసెంజర్ ఎక్కితే మద్యాహ్నం మూడింటికి ఇండోర్. అంటే 20 సాయంత్రం ఎంత ఆలస్యం అయినా ఏడింటి లోపున ఇండోర్ చేరిపోవచ్చు. ఇంటర్వ్యూ 21 పొద్దున కదా? ఏదో ఒక చోట ఎక్కడో కాసేపు పడుకుంటే పొద్దున్నే ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు.”

“ఏదో ఒక చోట అంటే?”

“రైల్వే స్టేషన్ లో విశ్రాంతి గదులుంటాయిరా, అక్కడున్న కుర్రాళ్ళకి ఏదో ముట్టచెపితే పడుకోనిస్తారు. పొద్దున్న ఇంటర్వ్యూ కి వెళ్ళేటపుడు అక్కడే క్లోక్ రూమ్ అనే చోట సామాను పెట్టుకోవచ్చు చవగ్గా.”

“అంటే హైద్రాబాద్ లో ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూ 23న పోయిట్టేనా?”

“లేదు, లేదు. 21న సాయంత్రంలోపున నీకు ఇండోర్ లో పని అయిపోతే వెంఠనే బయల్దేరి అదే రోజు, అంటే 21న రాత్రి 11 గంటలకి భోపాల్ లో ఎ.పి ఎక్స్ ప్రెస్ ఎక్కితే మర్నాడు 22 సాయంత్రం లోపున సికిందరాబాద్ చేరవచ్చు. నేను అత్తకి ఇప్పుడే ఓ కార్డు ముక్కరాస్తా నువ్వు హైద్రాబాదు 22 సాయంత్రం వస్తున్నట్టూ. 23న ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూ అయ్యాక వీలు చూసుకుని హైద్రాబాదులో గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కావంటే రాజమండ్రిలో దిగవచ్చు.”

“ఇందులో ఏ ఒక్కటి తప్పినా మొత్తం అన్నింటికీ పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరే.”

“అలా ఎందుకనుకుంటున్నావ్? నేను దాదాపు ఇరవై, ముఫ్ఫై ఏళ్ళు తిరిగాను వీటిమీద, నువ్వు ఎక్కే ట్రైన్స్ అనీ దాదాపు గంటలోపు ఆలస్యంగా నడుస్తాయి. గంటా రెండుగంటలు లేట్ అయినా ఇంటర్వ్యూలకి చేరిపోవచ్చు. అయితే ఒకటి మాత్రం తప్పదు – రిజర్వేషన్లూ అవీ దొరకవు కానీ ఏ టి.టి.ఈ నో పట్టుకుంటే పడుకోవడానికి బెర్త్ లేకపోతే ఎక్కడో ఓ చోట కూర్చోడానికి జాగా సంపాదించవచ్చు. నీకు ఆ ఓపిక ఉంటే నువ్వు బయల్దేరాల్సింది రేపు పొద్దున్నే. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం పొద్దుటే నాలుగింటికి మొదటి బస్సు ఉంది రాజమండ్రికి. అది కాని పోయిందా నువ్వు కోణార్క్ పట్టుకోవడం కల్ల. దాని తర్వాత మరో ట్రైన్ ఉంది – ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ విజయవాడకి. కానీ అది ఎప్పుడూ మూడు గంటలు లేట్ గా రావడం నాకు తెలుసు. ఈస్ట్ కోస్ట్ విజయవాడ చేరేసరికి తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ వెళ్ళిపోతుంది.”

“అసలు ఇన్ని ట్రైన్ లకి ప్రతీ స్టేషన్ లోనూ దిగి టికెట్లు కొనుక్కోవద్దూ?”

“అఖ్కర్లేదు. నువ్వు రాజమండ్రిలోనే ఇండోర్ దాకా టికెట్ అడిగితే ఇస్తారు. ఇండియన్ రైల్వే వారి రూల్ ప్రకారం ఏ స్టేషన్ లో అయినా సరే ఎక్కడినుంచి ఎక్కడికైనా సరె టికెట్ తీసుకోవచ్చు. అయితే రిజర్వేషన్ అనేది వేరే విషయం. ఓ వెయ్యి రూపాయలు చేత్తో పుచ్చుకుని బయల్దేరాల్సి ఉంటుంది.”

“అంత డబ్బు వేస్ట్ కాదు నాన్నా?”

“ఒరే రామ్మూర్తీ, డబ్బు ఖర్చు పెట్టకుండా ఏ పనీ అవదు. నీకు వెళ్ళాలని ఉంటే బయల్దేరు. ఉద్యోగం ఒకటి వస్తే ఈ వెయ్యి రూపాయలు ఎంత? అసలే నీకు ఉద్యోగం లేదు. ఇప్పుడొచ్చిన ఇంటర్వ్యూలు కూడా అఖ్ఖర్లేదనుకుంటే నాదేం లేదు కానీ ఓ సారి ఆలోచించు. ఎంతకాలం ఇలా ట్యూషన్లు చెప్పుకుంటూ కూర్చుంటావు ఈ వేట్లపాలెంలో?” సరిగ్గా కొట్టవల్సిన చోట గురి చూసి కొట్టేడు దెబ్బ నాన్న.

* * * * * * *

“దయచేసి వినండి, నెంబర్ నైన్ టీన్ ట్వంటీ కోణార్క్ ఎక్స్ ప్రెస్ కొద్ది నిముషములలో మూడో నెంబర్ ప్లాట్ పారం మీదకి వచ్చుచున్నది.” ఇదీ నేను రాజమండ్రి స్టేషన్ చేరేసరికి మైకులో వస్తున్న ఎనౌంన్స్ మెంట్. వెంఠనే పరుగెట్టుకుంటూ వెళ్ళి కొనడానికి ఇండోర్ కి టికెట్ అడిగేను. పొద్దునే కదా అంత జనం లేరు కానీ కౌంటర్లో ఆయన కొత్తగా జేరినట్టున్నాడు ఇండోర్, భోపాల్ అనే విషయాలు ఏమీ అర్ధమైనట్టూ లేదు. అవతల బండి వచ్చేస్తోంది. ఇది చూసి నన్ను దిగపెట్టడానికి కూడా వచ్చిన నాన్న చెప్పేడు, “ఇంక ఇక్కడ కాలాయాపన చేస్తే కోణార్క వెళ్ళిపోతుంది. విజయవాడలో మూడు గంటలు టైమ్ ఉంటుంది, అక్కడ రైల్వే వారికి ఇంకా బాగా తెలుస్తాయి విషయాలు. ఇండోర్ టికెట్ అక్కడ కొనుక్కోవచ్చు.”

అలా విజయవాడకి టికెట్ తీసుకుని నాన్నని బయటే కౌంటర్ దగ్గిర వదిలేసి మూడో నెంబర్ మీదకి పరుగెట్టాను చేతిలో సూట్ కేసుతో. కాస్త అరగంట లేట్ అయినా బావుణ్ణు కోణార్ రాజమండ్రి వచ్చేసరికి కానీ ఇలా ఎక్కానో లేదో కోణార్క స్పీడు అందుకుంది ఏవో కొంపలు మునిగిపోతున్నట్టూ. పొద్దున్నే మూడింటికి లేచి బయల్దేరిన ప్రాణం అప్పుడే ఉసూరుమంటోంది. ఇంతలోనే బండి గోదావరి మీద బ్రిడ్జి దాటుతోంటే హాయిగా చల్లని గాలి కిటికీలోంచి; నాన్న పొద్దుటే పూజ చేస్తూ చెప్పే మంత్రం గుర్తొస్తూంది. కలశస్య ముఖే విష్ణుః …. గంగేచ యమునైచేవ గోదావరీ సరస్వతీ… గోదావరి పేరు మనసులో మెదులుతూంటేనే గుండెల్లోంచి అదో రకమైన ఉద్వేగం; ఇన్నాళ్ళబట్టీ ఆ నీళ్ళు తాగుతున్నందుకేనా?

నిడదవోలు వచ్చేసరికి బాగా తెల్లవారింది. ఎక్కిన జనరల్ కోచ్ లో కూర్చోడానిక్కాదు కదా నించోడానిక్కూడా చోటుకు అవస్థ పడాల్సిందే. తాడేపల్లిగూడెంలో కాస్త చోటు దొరికింది కూర్చోవడానికి ఒరిస్సా లో ఎక్కి రాత్రి అంతా కునికి పాట్లు పడుతున్న జనం ఒక్కొక్కరూ లేస్తూంటే. మొత్తానికి విజయవాడ చేరేసరికి పదిన్నర అవుతోంది. దిగి కనుక్కుంటే తెల్సిన విషయాలు – సూపర్ ఫాస్ట్ తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం రెండింటికి. వచ్చేది మద్రాసు నుంచి కనక లేట్ అవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇండోర్ కి టికెట్ కౌంటర్లో అమ్ముతారు; వెళ్ళి కొనుక్కోవచ్చు. వెళ్ళేది భోపాల్ కనక రిజర్వేషన్ దొరుకుతుందా అనేదానికి అదో నర్మ గర్భంగా నవ్వు. అది నాకు అర్ధంకాలేదని తెల్సిన రైల్వే ఆయనే చెప్పేడు సమాధానం చిన్న గొంతుకతో, “ప్లాట్ ఫారం నెంబర్ సెవెన్ మీదకి వెళ్ళండి. అక్కడ ఏ రైల్వే కూలీని అడిగినా ఏం చేయాలో చెప్తాడు.”

ఇండోర్ కి టికెట్ కొనుక్కుని ప్లాట్ ఫారం నెంబర్ సెవెన్ మీద చేరాక నేను మాట్లాడిన రైల్వే కూలీ తీసుకెళ్ళి మరొకాయనని చూపించాడు నాకు – ‘ఈయనే మా మేస్త్రీ ఏం కావాలో ఆయననే అడగండి’ అంటూ. మేస్త్రీ అంటే తర్వాత తెలిసొచ్చిన విషయం – ఆయన ఈ కూలీలకి యూనియన్ లీడరు. ఎక్కడ ఎవరికి ఏం కావాల్సొచ్చినా – రైల్వే వారి కొండమీద కాకి నుంచి పట్టాలు విరిగిపోయి బండి సముద్రంలో పడిపోయినా అందులో సామానుతో సహా – నిముషాలమీద రప్పించగలిగిన బహుముఖ ప్రజ్ఞావంతుడు. అన్నింటికన్నా పెద్ద విషయం, మేనేజర్ కొత్తగా జేరిన ఉద్యోగస్తులతో మాట్లాడినట్టూ ఎవరినైనా సరే ‘నువ్వు’ అనగల, అనే సమర్ధుడు ఈ మేస్త్రీ. అక్కడనుంచి ఆయన నన్ను తీసుకెళ్ళినది టి.టి.ఈ లు రాత్రి బస చేసే – విజయవాడ స్టేషన్ కి ఆనుకుని ఉండే రైల్వేవారి గెస్ట్ హౌస్ లోపలి గదుల్లో – ముగ్గురు టిటిఇ ల చతుర్ముఖ పారాయణం మధ్యలోకి.

వచ్చిన పని మూడు నిముషాల్లో అవగొట్టేడు మేస్త్రీ. ఒకటే మాట, “ఏమోయ్, కుర్రాడికి తమిళ్ నాడులో రిజర్వేషన్ కావాలి. ఏ కోచ్ లో ఎక్కించమంటావ్?” మీరు, గారు అనడం లేదు, పేరు పెట్టి పిలవడమూ లేదు.

నన్ను ఎగాదిగా చూసిన ఓ మంచం మీద వ్యక్తి చెప్పేడు, “ఎస్-నైన్, నేను వచ్చి రిజర్వేషన్ రాస్తాను. బండి ఎక్కాక పలకరించు. బెర్త్ కి పదిహేను.”

మళ్ళీ నడుచుకుంటూ మేస్త్రీ తో సహా వెనక్కొచ్చాక అతను అడిగిన పది రూపాయలూ ఇచ్చి “ఆ టిటిఇ పేరు ఏమిటి?” నేను అడగబోయేను.

“వెంకట్రావు. నేను మళ్ళీ బండి వచ్చేటపుడు వస్తా,” ముందుకి కదిలేడు మేస్త్రీ. మేస్త్రీకి పదీ, రిజర్వేషన్ కి పదిహేనూ వెరసి పాతిక రూపాయలు పోతే పోయాయి కానీ హమ్మయ్య ఓ పని అయిపోయింది. బండి ఎక్కగానే ముసుగు తన్ని పడుకోవచ్చు.

అప్పుడు గుర్తొచ్చింది – నేను వెళ్ళేది ఇంటర్వ్యూకి అనే సంగతి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో తెలిసిన విషయాలు, ఏమేమి అడగవచ్చో గుర్తుచేసుకోవడం మొదలుపెట్టాను. మరీ అతి చిన్న ఓమ్స్ లా లాంటి విషయాలలాంటివి అడక్కపోయినా, సర్క్యూట్ బ్రేకర్, హై వోల్టేజ్ ట్రాన్స్ ఫార్మర్ లాంటివీ, ఎలక్ట్రానిక్స్ ఇప్పుడిప్పుడే అన్నింటిలోనూ వస్తున్నాయి కనక ఏ ట్రాన్సిస్టర్, థైరిస్టర్ గురించో అడిగి తీరుతారు. ఆ మధ్యన తన కూడా చదివిన రమణ ని హైద్రాబాద్ లో ట్రాన్సిస్టర్, మైక్రోప్రోసెసర్ గురించి అడిగారుట. తాను వెళ్లబోయేది ఆర్మీలో ఇంజినీరింగ్ ఉద్యోగానికి. ఇక్కడేం అడుగుతారో? రాత్రంతా సరిగ్గా నిద్రలేదు. వచ్చే బండీ, పోయే బండీ, ఎక్కే దిగే జనాలతో, ఇడ్లీ, వడల వాసనతో విజయవాడ రైల్వే స్తేషన్ గణగణలాడుతూంది. టైమ్ పన్నెండు. మరో రెండు గంటల్లో బెర్త్ మీద పడుకోవచ్చు.

దాదాపు రెండింటికి మేస్త్రీ వచ్చి ఎస్-నైన్ లో ఎక్కించాక తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ కదిలింది. ఏమాటకామాట చెప్పుకోవాల్సిందే. లంచం తీసుకున్నా, మాట తప్పకుండా టిటిఇ వచ్చి అడిగిన పై బెర్త్ ఇచ్చి వెళ్ళేడు. సూట్ కేసు పైకి చేర్చి ఇంట్లో అమ్మ సర్ది ఇచ్చిన భోజనం తినేసరికి నిద్ర ముంచుకొచ్చింది.

* * * * * * *

దాదాపు సాయంత్రం అయిదు అవుతూంటే కాబోలు బలార్షా స్టేషన్. మరాఠీ, హిందీ కలిపిన భాష ఏదో వినపడుతోంది ఎక్కే దిగే జనాలతో. రాత్రి నుంచీ టెన్షన్ వల్లా నిద్రలేమి వల్లా తలనెప్పి. టీ తాగి బండి కదిలేసరికి రాత్రి భోజనానికి ఎలాగా అని ఆలోచిస్తూంటే మీల్స్ టికెట్ అంటూ అమ్మకానికి వచ్చేడు. ఏ స్టేషన్ లో భోజనం పట్టుకొస్తాడో అడిగిన నన్ను ఓ పిచ్చివాడిలా చూసి చెప్పేడు, “ఈ బండిలో పాంట్రీ కార్ ఉంది. ఏడూ, ఎనిమిది గంటల మధ్య ఇక్కడకే భోజనం పంపిస్తాం.”

పాంట్రీ కార్ అనేది ఎప్పుదూ వినని నేను వెర్రిమొహం వేసేసరికి పక్కనాయన చెప్పేడు, “బండికి తగిలించిన ఓ కోచ్ లోనే వంటలన్నీ వండుతారు. కావాలిస్తే వెళ్ళి చూడొచ్చు.” తర్వాత వడ, ఇడ్లీ, బజ్జీలూ అంటూ పాంట్రీకార్ లో వండిన అనేకానేక రకాల చిరుతిళ్ళు కూడా అమ్మకానికి రావడం కనిపిస్తూనే ఉంది. రాత్రి భోజనం అవగానే మర్నాటి గురించి ఆలోచన. భోపాల్ లో దిగాక ఇండోర్ ట్రైన్ ఎలా ఉంటుందో? అది అసలే పాసెంజర్ అంటున్నారు. మళ్ళీ నిద్ర.

పొద్దున్న మొహం కడుక్కుని తయారయేసరికి తెలతెలవారుతోంది. పాంట్రీకార్ కుర్రాడు ఒకడు కనపడితే అడిగేను వచ్చే స్టేషన్ పేరు. “భోపాల్, ఇవాళ బండి బాగా సరైన టైమ్ కే నడుస్తోంది.”

సరిగ్గా టైమ్ కి చేరిన భోపాల్ లో దిగాక తెల్సిన విషయం. ఇండోర్ పాసెంజర్ ఎనిమిదిన్నరకి. అది ఇండోర్ చేరేసరికి రెండు అవుతుంది. మళ్ళీ వెయిటింగ్. ఈ సెక్షన్ లో రిజర్వేషన్ అక్కర్లేదు. మరోసారి హెచ్ ఎమ్ టి వాచ్ చూసాను. 20 తారీఖు. ఇంటర్వ్యూ 21న కనక ఈ రోజు రాత్రిలోపుల ఇండోర్ చేరిపోవచ్చు.

పాసెంజర్ కుంటుకుంటూ ప్లాట్ ఫారం మీదకి వస్తూంటేనే తెలిసిపోయింది అది ఎలాంటి బండో. పొగలు కక్కే బొగ్గుల స్టీమ్ ఇంజిన్, తలుపులు, కిటికీలకి అద్దాలు కూడా లేని ఆరు కోచ్ లు. మహా అయితే గియితే కోచ్ కి ఇరవై మంది ఉన్నారు. తొమ్మిదింటికే ఎండ చురుక్కుమనిపిస్తోంది. ఎక్కిన జనం చాలామటుకు చిరు గెడ్డం, టోపీలు కాకపోతే నల్లటి గుడ్డతో కళ్ళు తప్ప మరోటి కనిపించని, ముస్లింలు. తట్టా, బుట్టా మామూలే.

ఏమీ తోచనపుడు కూడా తెచ్చుకున్న ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ పుస్తకం చూస్తే ఈ బండి ఆగే స్టేషన్ లు ఆరో ఏడో ఉన్నాయి, అందులో ఇండోర్ ముందు వచ్చే – ఏడో క్లాసు పుస్తకంలో చదివిన – ఉజ్జయిని ఒకటి. అప్పుడు గుర్తొచ్చింది – ఇండోర్ వెళ్ళడానికి పాసెంజర్ సరే, రేపు వచ్చేటప్పుడు ఇదే పాసెంజర్ ఉందని నాన్న చెప్పేడా? లేకపోతే నేను మర్చిపోయేనా? ఒక్కసారి చేతిలో పుస్తకం తిరగేశాను. ఎక్కడా వెనక్కి వచ్చే బండి టైమ్ కనిపించలేదు. గుండె గుబుక్కుమంది. ఏమైనా నిండా దిగాక ఇంక చలేమిటి? ఏదో విధంగా వెనక్కి రాలేనా?

నత్తలాగా కదిలిందో లేదో బండి, పది నిముషాలకి మళ్ళీ ఆగింది. ఆ ఆగిన స్టేషన్ నేను తెచ్చుకున్న పుస్తకంలో లేదు. ఇదేమిటా అని చూడబోయేంతలో నామొహం చూడగానే తెల్సిందిలా ఉంది సౌత్ ఇండిన్ ని అని, ఓ మళయాళీ కుర్రాడు కాబోలు ఇంగ్లీషులోనే పలకరించాడు.,

“ఈ చిన్నచిన్న స్టేషన్ లు అందులో ఉండవు. ఈ బండి ఇలా ప్రతీ చోటా ఆగుతుంది.”

“అవునా, మీరు ఎంతదాకా?”

“ఉజ్జయిన్. నేను అక్కడ కాలేజీలో ఎమ్ ఎస్సీలో జేరాను.”

“ఈ బండి టైమ్ కి వెళ్తుందా?”

నవ్వు. “మూడూ నాలుగు లోపుల ఎప్పుడూ ఉజ్జయిని వెళ్ళదు. అది నా గ్యారంటీ. మీరెక్కడకి?”

“ఆర్మీ ఇంటర్వ్యూకి ఇండోర్. రేపు పొద్దున్నే వెళ్ళాలి.”

“రేపు కదా? ఫర్వాలేదు. సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు.”

అలా బయటకి చూస్తూ, కుర్రాడితో కబుర్లు చెప్తూంటే మధ్యాహ్నం ఒంటిగంట. ఆకలి నకనకలాడుతోంది. తినడానికి కచోరి, పోహా అంటూ ఏవో అమ్మకానికి వస్తున్నాయ్. ఆ అమ్మేవి ఏవిటో, అవి తింటే కడుపులో ఏమౌతుందో? ఆఖరికి మక్సి అనే స్టేషన్ దగ్గిరకి వచ్చేసరికి నేను తినగలిగే పూరి కూర కనిపించాక ప్రాణాలు లేచి వచ్చాయి. కూడా తెచ్చుకున్న బాటిల్ లో నీళ్ళు నింపుకున్నాక మళ్ళీ ప్రయాణం మొదలు. ఒంటినిండా ఇంజిన్ లోంచి వచ్చే బొగ్గు దుమ్ము, ఛుక్ ఛుక్ రైలు, ఇప్పటికే గంటన్నర లేటు. వేసవి ఎండ నిప్పులు కురిపిస్తోంది.

అప్పుడొచ్చింది అసలు కష్టం. దారిలో లైన్ పాడయింది, కాసేపు ఆగుతుంది బండి అని రైల్వే వారి ఉవాచ. ఆ ఆగినది కూడా ఏదో స్టేషన్ లో కాదు, ఊరికి బయట ఏదో బీడు భూముల మధ్య. అసలే మే నెల, బొగ్గు ఇంజిన్ దుమ్మూ, ధూళీ, ఏనాడైనా అసలు కడిగారో లేదో తెలియని, నీళ్ళు ఉన్నాయో లేవో అనిపించే టాయ్ లెట్ల కంపు. కూర్చుంటే కోచ్ లోపల వేడి, దిగితే బయట వేడి. ఫేన్ లు తిరిగే ప్రశ్నే లేదు. పాసెంజర్ కనక ఎవరికీ ఈ బండి అన్నా, అందులో వెళ్ళే జనం అన్నా, ఆ జనాల టైమ్ అన్నా లెక్కలేదు. మళ్ళీ కదిలే సరికి మధ్యాహ్నం మూడున్నర. ఎంత లేట్ అయినా ప్రతీ స్టేషన్ లోనూ ఆగవలిసిందే కదా? ప్రతీ స్టేషన్లోనూ మళ్ళీ లేటు – సిగ్నల్ ఇవ్వలేదనీ, బొగ్గు లోడింగ్ అనీ, ఇంజిన్ కి నీళ్ళు పట్టుకోవడానికనీ రకరకాల కారణాలు.

సాయంత్రం ఆరింటికి ఉజ్జయిని చేరాం. ఒళ్ళు హూనం అయినట్టుంది, ఇంకా రెండు గంటల ప్రయాణం ఉంది. మళయాళీ కుర్రాడు దిగిపోతూ చెప్పేడు, “ఫర్లేదు, రాత్రి ఎనిమిదీ తొమ్మిదిలోపు ఇండోర్ వెళ్ళిపోవచ్చు. కంగారు పడకండి.”

అక్కడ్నుంచి ఇంక గుండెల్లో గుబులు. ఏ అర్ధరాత్రో, అపరాత్రో ఇండోర్ వెళ్తే ఎలా? ఏ కోచ్ లోనూ లైట్లు లేవు. గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్టూ రాత్రి ఎనిమిదీ తొమ్మిదీ అవుతున్నా ఇంకా వెలుతురు ఉంది. అదృష్టమే, మరెక్కడా ఆలశ్యం లేకుండా రాత్రి దాదాపు తొమ్మిదింటికి ఇండోర్ చేరాను. విజయవాడనుంచి భోపాల్ వెయ్యి కిలోమీటర్లకి పదిహేడు గంటలు అనుకుంటే అయితే భోపాల్ నుంచి ఇండోర్ కి దాదాపు రెండు వందల కిలోమీటర్లకి పన్నెండు గంటలు. ఐ హేట్ ఇండియన్ రైల్వేస్. నాన్న ఇన్నాళ్ళూ ఎలా నెట్టుకొచ్చాడో? క్లోక్ రూం గురించి కనుక్కుని వెయిటింగ్ రూం కుర్రాడికి డబ్బులిచ్చి లోపల పడుకున్నానన్నమాటే కానీ వచ్చిన దారీ, దుమ్మూ అదీ కలిపి చూసుకుంటే ఇక్కడ ఉద్యోగం వచ్చినా వేట్లపాలెంలో ట్యూషన్లు చెప్పుకోవడం మంచిదే కాదూ? కలగా పులగం ఆలోచనల్తో నిద్ర.

* * * * * * *

మర్నాడు లేచేసరికి ఆరున్నర. పొద్దున్న తొమ్మిదింటికి ఇంటర్వ్యూ. ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. స్నానం చేసి బయటకొచ్చేక తెలిసింది – ఎక్కడికైనా వెళ్ళాలంటే రెండే రెండు సాధనాలు – టెంపో ఎక్కడం, లేకపోతే ఆటో. అన్నింటికన్నా దారుణం తాగుదామంటే కాఫీ నీళ్లకి గతిలేదు. ఎక్కడ చూసినా పొద్దున్న తాగేది టీ. వేట్లపాలెంలో వేసవి ఎండ మండుతుంది అనుకుంటే ఇక్కడ హడలు ఎత్తించేస్తోంది. రోడ్డు మీద అడుక్కొక ‘గన్నే కా రస్’ లేదా చెరుకురసం స్టాల్. పొద్దున్న ఎనిమిదింటికి కూడా జనం టీ, చెరుకురసం తాగుతారా?

ఆర్మీ ఆఫీసుకు వచ్చేసరికి అంతా హడావుడిగా ఉంది అక్కడ. దాదాపు మూడు వందలమందికి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అన్నీ మధ్యాహ్నం రెండులోపున అవుతాయిట; ముందో ఇంటర్వ్యూ తర్వాత మరో మెడికల్ టెస్ట్. ఒక్కో టీం కి ఒక్కో ఆఫీసర్. ఆంధ్రానుంచి వచ్చినవాళ్ళు కొంతమంది ఉన్నా కాకినాడ, రాజమండ్రి నుంచి ఎవరూ ఉన్నట్టులేదు. దాదాపు ముప్పాతిక మూడొంతులు పంజాబ్ నుంచి వచ్చారన్నట్టూ వాళ్ల తలపాగాలే చెప్తున్నాయి. దక్షిణాన్నుంచి వచ్చినవాళ్ళు మహా అయితే పాతిక మంది ఉండొచ్చు.

చూచాయగా అందరూ అనుకుంటున్న, తెలిసిన విషయం, ఈ ఉద్యోగం వచ్చేది కాదు. వచ్చినా నేను ఈ దేశంలో బతకలేను. ఈ దుమ్మూ ధూళీ, నిన్నరాత్రి నిద్రలేకుండా చేసిన భోపాల్-ఇండోర్ పాసెంజర్ బండీ, ఈ ఎండలూ అబ్బే లాభంలేదు. భోపాల్, ఇండోర్ వంటి చోట్లకి పరుగెట్టి పాలు తాగడంకన్నా వేట్లపాలెంలో నించుని నీళ్ళు తాగడం బెటర్. నాకెలాగా ఉద్యోగం రాదని తెలిసిపోతూనే ఉంది ఈ వచ్చిన పంజాబీలని చూస్తూంటే. ఇంటర్వ్యూ కానిచ్చేసి వాళ్ళిస్తామన్న దారి ఖర్చులు పుచ్చుకుని కనీసం హైద్రాబాద్ లో జరిగే ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం కోసం ఎవరి కాళ్ళో పట్టుకోవడం మంచిది.

టైమ్ ప్రకారం కుర్రాళ్లని లోపలకి పిలుస్తున్నారు. నా వంతు వచ్చేసరికి పదకొండు. గుండెలు అదురుతుండగా లోపలకి వెళ్ళాను. మూడు తలపాగాలు, రెండు బట్టతలలూ, మరో మూడు కళ్ళజోళ్ళూ. ఒకాయన కట్టుమీసంతో మళయాళీలాగ ఉన్నాడు; అందరిదీ ఆర్మీ డ్రెస్. కూర్చోగానే ఒకాయన అడిగేడు, “వేట్లపాలెం. ఈ పేరు ఎక్కడా వినలేదు. ఎలా వచ్చారు ఇక్కడకి?”

కావాలని నవ్వుతున్నాడా లేకపోతే వెక్కిరిస్తున్నాడా? అర్ధంకాలేదు కానీ సమాధానం కోసం చూస్తున్నాడు కనక చెప్పాలి, “మా ఊరి పక్కనున్న రాజమండ్రి స్టేషన్ మద్రాస్ కలకత్తా రూటు మీద ఉంది; అక్కడనుంచి విజయవాడ, అలా భోపాల్, ఇండోర్. మూడు బళ్ళు మారి నిన్నరాత్రి వచ్చానండి.”

“విజయవాడ గురించి విన్నా. నేను ఆర్మీలో జేరాక ఓ సారి అటువైపు మద్రాసు వెళ్తూంటే దారిలో చూసాను. సరే, మీరు గ్రాడ్యుయేట్ అయి మూడు నెలలవుతోంది, ఏం చేస్తున్నారు?”

ఊహించని ప్రశ్న. “ఇంకా ఉద్యోగం గురించి ప్రయత్నమే. ఈ లోపున ఇంటి దగ్గిర కుర్రాళ్లకి ట్యూషన్స్ చెప్తున్నా. రెండు మూడు ఇంటర్వ్యూలకి వెళ్ళాను. ఇంకా వాళ్ళేమీ చెప్పలేదు.”

అటు పక్కనుంచి బుల్లెట్ లాగా వచ్చింది ప్రశ్న, “ఏ.సి సర్క్యీట్ కి డి.సి కి మధ్యన తేడా చెప్పగలరా?”

ఇది తేలిక, “డి.సి కి వెనక్కి వచ్చే కేబుల్ ఉండదు. ఏ.సి అయితే అదో సర్క్యీట్; వెనక్కి తిరిగి వస్తుంది.”

“వెరీ గుడ్, మరి మనం రోజూ వాడే ఫేన్, టివిలలో వాడేది ఏ.సి కదా? డి.సి ఎక్కడ వాడతాం?”

హమ్మయ్య, మొదటి మెట్టు ఎక్కినట్టేనా?, “ఫేన్, టివి ఎందులోనైనా సాధారణంగా వాడేది డి.సి. మనం గోడకి కనెక్ట్ చేసేది ఏ.సి. ఈ గోడకీ, టి.వి, ఫేన్ ల మధ్యలో ఏ.సి ని డి.సి గా మార్చడానికి ట్రాన్స్ ఫార్మర్ తో సహా కన్వర్టర్ వాడాల్సి ఉంటుంది. ఫేన్ లో అయితే ఎసి లేదా డిసి మోటార్ రెండింట్లో ఏదో ఒకటి వాడవచ్చు అవసరం బట్టీ.”

“అవునా, అయితే ట్రాన్స్ ఫార్మర్ ఎ.సి ని డి.సి గా మారుస్తుందా?”

“లేదండి. అది స్టెప్ అప్, స్టెప్ డౌన్ లాగా వోల్టేజ్ ని మార్చగలదు. మిగతా కన్వర్టర్ సర్క్యీట్ వాడాలి డిసి కోసం.”

మళ్ళీ ప్రశ్నలు, ఈ సారి ట్రాన్సిస్టర్ గురించీ అది ఏంప్లిఫైర్ గా అటెన్యుయేటర్ గా పనిచేయగలదా, నలుపు తెలుపు టివిని కలర్ టివిగా ఎలా మార్చవచ్చు అంటూ. కొన్ని తెలిసినవి. చాలామటుకు తెలియనివి. పదినిముషాలు అనుకున్న ఇంటర్వ్యూ అరగంట గడిచేసరికి చివర్న మళయాళీ అడిగేడు, “ఈ ఉద్యోగం గురించి మీకేమైనా ప్రశ్నలున్నాయా? అడగండి.”

“నాకు భోపాల్ రెజిమెంట్ నుంచి ఉత్తరం వచ్చింది, ఇంటర్వ్యూ ఇండోర్ లో పెట్టారు. ఉద్యోగం ఎక్కడండి?”

“మొదట ట్రైనింగ్ ఇండోర్ లో. ఉత్తరోత్తరా పనిచేసేది దేశంలో ఈ మూలనుంచి ఆ మూల దాకా ఎక్కడకి పంపిస్తే అక్కడ చేయాల్సి ఉంటుంది. మీకేమైనా అభ్యంతరమా?”

నాకీ ఉద్యోగం ఎలాగా రాదు కాబట్టీ, వస్తే గిస్తే ఎలాగా ఇక్కడకి నేను జేరడానికి రాను కాబట్టీ, నాకు ఏదైనా అభ్యంతరం ఉంది అంటే ముందే ఎలాగా ఉద్యోగం ఇవ్వరు కాబట్టీ చెప్పేసేను వెంఠనే, “ఏమీ లేదు.”

తర్వాత ఇంకేమడగాలో తెలియక నోరు మూసుకున్నప్పుడు పెద్దాయన చెప్పాడు, “సరే బయట వెయిట్ చేయండి పన్నెండున్నరలోపు మీపేరు లిస్ట్ లో ఉంటే గంటలోపు మెడికల్ టెస్ట్ చేస్తారు. ఈ లోపున దారి ఖర్చులు ఇస్తారు తీసుకోండి. రెండు లోపున వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే తర్వాత మేము మీకు తెలియజేస్తాం.”

ఎంత టెన్షన్ తో లోపలకి వెళ్ళానో అంత హాయిగా బయటకొచ్చాను. వెనక్కి తిరిగి చూసుకుంటే, వాళ్లడిన ప్రశ్నల్లో నాకు తెలియనివి దాదాపు డభ్భై శాతం. ఈ ఉద్యోగం రావడం అసంభవం. దరిద్రం వదిలింది, ఉద్యోగం వచ్చి ఉంటే, ఈ ప్రయాణం, దుమ్మూ, ధూళీ, భోపాల్ నుంచి ఇండోర్ పాసెంజర్. ఆహ్లాదంగా గల గలా పారే ఎక్కడి గోదావరీ, ఎండలు మండిపోయే గన్నే గా రస్ దేశం ఎక్కడి ఇండోర్?

టికెట్ చూపిస్తే దారి ఖర్చులు ఇస్తున్నారు బయట. రిజర్వేషన్ కి ఇచ్చిన డబ్బులూ, మరో లంచం అవీ ఇవ్వరు. సరిగ్గా వేట్లపాలెం – రాజమండ్రి – విజయవాడ – భోపాల్ – ఇండోర్ టికెట్ ఖరీదు నూట పదిహేను రూపాయలు. రానూ పోనూ రెండు వందల ముఫ్ఫై. అంతకన్నా పైసా ఎక్కువ ఇవ్వరు. ఇప్పటివరకూ రిజర్వేషన్ కీ, రైల్వే వారి లంచాలకీ నేను ఖర్చుపెట్టినది దీని మీద మరో నలభై. వెనక్కి వెళ్ళేటప్పుడు ఎంతివ్వాలో? అవి ఇవ్వరు, వాటికి నీళ్ల ధారే.

మంచినీళ్ళు తప్ప ఎక్కడా ఏమీ లేవు తినడానిక్కానీ తాగడానిక్కానీ. పన్నెండున్నరక్కాదుకానీ ఒంటిగంటకి లిస్ట్ వచ్చింది. నాపేరు ఎలాగా ఉండదనుకున్న నాకు షాక్ ఇస్తూ, అందులో నా పేరు చివరిలో ఉంది – వెయిటింగ్ లిస్ట్ అనే చోట ఆరుగురిలో నాది నాలుగో పేరు – రామమూర్తి పానుగంటి. కనుక్కుంటే చెప్పినదేమంటే మొదటి లిస్ట్ తో పాటు వెయిటింగ్ వారికి కూడా మెడికల్స్ ఉన్నాయి. పై లిస్ట్ లో ఎవరైనా జేరకపోతే వెయిటింగ్ వారికి అవకాశం. ఇదెక్కడి దరిద్రం, సెలెక్ట్ అవలేదు ఫో అంటే ఇంటికెళ్ళిపోవచ్చనుకున్న నాకు మరో దెబ్బ. మధ్యాహ్నం మెడికల్ అయ్యేసరికి రెండు. నా దృష్టి అంతా రాత్రి భోపాల్ లో ఎక్కబోయే ఏ. పి ఎక్స్ ప్రెస్ మీద. దాన్ని పట్టుకోకపోతే నేను ఆశలు పెట్టుకున్న 23న హైద్రాబాద్ లో ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూ పోయినట్టే.

రెండున్నరకి బయటకొచ్చాను అన్ని దరిద్రాలు వదిలించుకుని; మనసులో మరోసారి నిశ్చయించుకున్నది ఇది – ఈ ఉద్యోగం రావడం అసంభవం. వెయిటింగ్ లిస్ట్ దాకా రావాలంటే సెలెక్ట్ అయిన లిస్ట్ లో కనీసం నలుగురు జేరకూడదు. అద్భుతం జరిగితే తప్ప ఈ ఉద్యోగం నాకు రాదు. నాకు కావాల్సిందీ అదే – ఇక్కడకి నేను రాను. ఈ దుమ్మూ, ఈ ధూళీ, ఈ భోపాల్, ఇండోర్ పాసెంజర్ బండీ. నో, నో, నో. ఐ రియల్లీ రియల్లీ హేట్ ఇండియన్ రైల్వేస్.

* * * * * * *

బయటకి వచ్చాక మళ్ళీ రైల్వే స్టేషన్ కి. మరోసారి గుండెల్లో గుబులు. రాత్రిలోపుల భోపాల్ వెళ్ళే ట్రైన్ ఏదైనా ఉందా అసలు? క్లోక్ రూంలో సామాను తీసుకుని కనుక్కుంటే రాత్రి ఎనిమిది దాకా అసలు భోపాల్ వెళ్ళే బండే లేదు. అన్నీ జాగ్రత్తగా చెప్పిన నాన్న ఇది కూడా చెప్పాడా లేకపోతే కంగార్లో చూసుకోలేదా? రాత్రి పది లోపున భోపాల్ స్టేషన్ లో ఉండకపోతే ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూ కి తిలోదకాలే. ఉన్న మరో దారి కనుక్కుంటే కనుబొమలు ఎగిరే సమాధానం వచ్చింది. మూడున్నరకి ఇండోర్ – భోపాల్ ఎక్స్ ప్రెస్ బస్ ఉంది. మూడు గంటల్లో భోపాల్ చేరవచ్చు. ఏమిటేమిటీ? మూడు గంటలా? ఇండోర్ నుంచి భోపాల్ కా? మతి ఉండే మాట్లాడుతున్నాడా?

అనుకున్న టైమ్ కి బస్సు బయల్దేరింది. డ్రైవర్ కుర్రాడు కాదు కానీ ఈ ఇండోర్ భోపాల్ బస్సుని తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ లా నడుపుతున్నాడు. రోడ్డు కూడా బాగున్నట్టుంది. వేట్లపాలెం, కాకినాడ పరిసరాల్లో మోకాలి లోతు గోతుల రోడ్లు మీద ప్రయాణం చేసిన నాకు ఇది వింతే. ఇండియాలో రోడ్లు కూడా ఇంత బాగుంటాయా? మరోసారి నిన్నటి ప్రయాణం, దాని తాలూకు దుమ్మూ ధూళీ, దరిద్రం. ఎంత తప్పు! నిన్న భోపాల్ లో బస్సు ఎందుకెక్కలేదు? నా ఖర్మ కాకపోతే విజయవాడలో డైరక్ట్ గా ఇండోర్ కి ట్రైన్ టికెట్ కొని 200 కిలోమీటర్లకి 12 గంటలు తగలేసాను స్టీమ్ ఇంజిన్ బండి ఎక్కి. దరిద్రపుగొట్టు ఇండియన్ రైల్వే ఎప్పటికీ బాగుపడదనేది తెలుస్తూనే ఉంది.

దాదాపు ఆరింటికి సెహోర్ చేరింది బస్సు. మరో గంటలో భోపాల్. ఎ.పి ఎక్స్ ప్రెస్ రావడానికి అప్పటికి ఇంకా దాదాపు నాలుగు గంటల టైమ్. విజయవాడలో దొరికినట్టూ ఏ మేస్త్రీనో పట్టుకుంటే రిజర్వేషన్ దొరకదా? అప్పుడే అనుకోని ఉపద్రవం; డబ, డబ చప్పుడు. బస్ ఆపిన డ్రైవర్ చెప్పేడు. కిందన ఉన్న డ్రైవ్ షాఫ్ట్ రాడ్ విరిగిపోయింది. బండి కదలదు. మరెలా? మరో బస్ వచ్చేదాకా ఇక్కడ కూర్చోడమే? అయినా కంగారెందుదు, ఇంకా అయుదు గంటలు టైమ్ ఉంది ఎ.పి ఎక్స్ ప్రెస్ కి.

డ్రైవర్ చెప్పేడు, “ఓ మెకానిక్ ని పట్టుకుని బాగు చేయిస్తా, రెండు గంటలు పడుతుంది. వెంఠనే వెళ్ళిపోదాం.”

డ్రైవర్ ఎవర్నో మెకానిక్ ని పట్టుకుని రిపేర్ బాటలో ఉండగా, దిక్కులు చూడ్డం. కడుపులో ఎలకలు. కచోరీ, పోహా, టీ తప్ప మరొకటేదీ దొరకని ఎడారా ఈ మధ్యప్రదేశ్? వాచ్ ఏడు చూపిస్తోంది. ఎనిమిదయ్యేసరికి కాస్త కంగారు. దాదాపు తొమ్మిదిన్నరకి రిపేర్ పూర్తయింది. వెంఠనే మళ్ళీ తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ లాగా డ్రైవింగ్. భోపాల్ చేరేసరికి పదీ యాభై. పదకొండింటికి ఏ.పి ఎక్స్ ప్రెస్! ఆటో ఎక్కి బస్ స్టాండ్ నుంచి స్టేషన్ కి వెళ్ళే దారిలో గుండె దడ దడ లాడటం బయటకి ప్రస్ఫుటంగా వినిపిస్తోంది. ఆరింటికి ఇక్కడుండవల్సినవాణ్ణి ఇప్పుడు నిముషాలు లెక్కపెట్టుకుంటున్నా.

స్టేషలోపలకి పరుగు. టికెట్ కొనడం మాట తర్వాత చూద్దాం, బండి ఉందా, వెళ్ళిపోయిందా?

“అబ్బే ఇంకా లేదు, అరగంట లేటు.” ఎవరిదో సమాధానం.

ధన్యవాద్ ఇండియన్ రైల్వేస్. టికెట్ కోసం కౌంటర్ దగ్గిర క్యూ చూస్తే రెండు మైళ్ళ పొడవుంది. ఆ లైన్లో నుంచుని టికెట్ కొనేసరికి పొద్దున్న నాలుగు అవుతుంది. ఎలా? అవతల బండి వచ్చేస్తోంది. ఎలా?

“మీరు వెళ్ళేది హైద్రాబాదా?” ఎవరో కుర్రాడు చదువుకున్న వాడిలాగే ఉన్నాడు ఇంగ్లీష్ లో అడుగుతున్నాడు.

“అవును, అదీ యమా అర్జెంట్ గా వెళ్ళాలి.”

“రిజర్వేషన్ కావాలా?”

“టికెట్టే లేదు భాయీ. బండి వెళ్ళిపోతోంది అవతల.”

“నేను చదువుకునేది వరంగల్ ఇంజినీరింగ్ కాలేజీలో. నా పేరు అమిత్ మిశ్రా, ఇదిగీ ఐ.డి. నేను ఈ రోజు వెళ్ళాల్సి ఉంది కానీ వెళ్ళలేను. మీకు కావాలిస్తే ఈ టికెట్, రిజర్వేషన్ తీసుకోండి. రిజర్వేషన్ చార్ట్ లో పేరు ఉంది చూపిస్తా. నాకు కావాల్సింది నేను రిజర్వేషని కి ఇచ్చిన రైల్వే ఖర్చు. పైసా ఎక్కువ ఇవ్వక్కర్లేదు.”

“నేను వెళ్ళాల్సింది హైద్రాబాదు తమ్ముడూ. వరంగల్ కాదు.”

ముసి ముసి నవ్వు, “ఈ టికెట్ ఖాజీపేట దాకానే, బండి వరంగల్ వెళ్లదు. ఖాజీపేట నుండి వరంగల్ నేనూ వెళ్ళాలి..”

“నా చెవిలో పువ్వు పెడదామనా ప్రయత్నం? భలేవాడివే, నేను ఖాజీపేటలో దిగి మరో టికెట్ కొనుక్కునే సరికి ఈ బండి ఉడాయించదూ? అక్కడ నుంచి ఎలా?”

ఈ సారి నోరంతా విప్పి నవ్వు. “బండిలో టిటియి ని పట్టుకుని టికెట్ హైద్రాబాద్ కి ఎక్స్ టెండ్ చేయమని చెప్తే ఆయనే రాస్తాడు. బండి దిగే పనిలేదు.”

“నిజమా? జోకులు వేయకు, నేనసలే కంగార్లో ఉన్నా.”

“ఎందుకు అబద్ధం? నేనే చాలాసార్లు చేసానలా?”

“సరే అయితే, ఎంత టికెట్?”

“ఎ. పి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ బండి కనక దీనికి రిజర్వేషన్ తో కలిపి నూట యాభై ఆరు.”

కుర్రాడు రిజర్వేషన్ చార్ట్ లో పేరు చూపించి, నేను డబ్బులిచ్చాక టికెట్ చేతికిచ్చి లోపలకెళ్ళబోయే ముందు నన్ను మరోసారి హెచ్చరించాడు, “సాధారణంగా ఎవరూ అడగరు కానీ అడిగితే మీ పేరు అమిత్ మిశ్రా, మర్చిపోకండి.”

“థాంక్స్ భాయీ. నీకు తెలియక పోతే చెప్తున్నాను విను; నా కోసం నువ్వో దేవుడు పంపిన దూతవి.”

నేను ప్లాట్ ఫారంమీదకి చేరేసరికి ఏ.పి. ఎక్స్ ప్రెస్ మహారాజులా నడుచుకుంటూ వచ్చింది. కోచ్ నెంబర్ ఎస్ – సెవెన్, బెర్త్ 47 అమితా మిశ్రా, వయసు 20. నన్ను దేనికీ అనుమానించడానికి లేదు. రిజర్వ్ చేసిన టికెట్ చేతిలో ఉండగా ఎవడైనా మహా అడిగితే నువ్వేం చేస్తున్నావ్ అనే కదా? వరంగల్ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం.

అమిత్ మిశ్రా అనే నేను – రామ్మూరి పానుగంటి – బెర్త్ మీద మీదకి చేరాక ఏ.పి. ఎక్స్ ప్రెస్ హుందాగా కదిలింది నాగ్ పూర్ వైపు. పొద్దున్న దగ్గిర్నుంచీ జరిగినది తలుచుకుంటే బయల్దేరిన ముహుర్తం మహత్తరమైనది. అమిత్ మిశ్రా, ఏ.పి ఎక్స్ ప్రెస్ అన్నింటినీ నాకోసమే అట్టే పెట్టినట్టున్నాడు భగవంతుడు. అంటే రేపొద్దున్న హైద్రాబాద్ వెళ్ళాక 23న ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది కాబోలు. మరి కాస్త ముందుకి ఆలోచిస్తే ఇండోర్ రావడానికి అనేకానేక అడ్డంకులు – ఆఖరికి ఈ భోపాల్ ఇండోర్ పాసెంజర్ తో సహా, దుమ్ము, ధూళీ, స్టీమ్ ఇంజిన్! కానీ హైద్రాబాద్ వెళ్ళడానికి సూపర్ స్పీడ్ బస్సు, అది పాడయ్యి లేట్ అయితే తనకోసమే వెయిట్ చేస్తున్న అమిత్ మిశ్రా, తాను ఆలశ్యంగా వచ్చినా తనకోసమే అన్నట్టూ లేట్ అయిన ఏ. పి ఎక్స్ ప్రెస్. ఏం తెలుస్తోంది ఇదంతా చూస్తే? ఇండోర్ తో కాదు నా కున్న ఋణం. హైద్రాబాద్ లోనే ఉద్యోగం వచ్చేలా ఉంది….

“బెర్త్ 47, టికెట్ ప్లీజ్,” టిటిఇ చేత్తో తట్టి లేపుతూ అడుగుతున్నాడు.

“ఇదిగో,” జేబులోంచి తీసి ఇచ్చాను.

“మీ పేరేమిటండి? ఖాజీపేట్ దాకానా?”

ఆ మాత్రం చెప్పకపోతే ఎలా? “అమిత్ మిశ్రా, అవును ఖాజీపేట్ దాకా; వరంగల్ ఇంజినీరింగ్ కాలేజీకీ.”

“వరంగల్ కా? కాలేజీలు తెరుస్తున్నట్టున్నారే? అప్పుడే?”

“అవును, వచ్చే సోమవారం నుంచీ. ఈ లోపున హాస్టల్ లో దిగాలి కదా?”

“సరే గుడ్ నైట్” సంతకం పెట్టి ఇచ్చేసాడు టిటీఇ. భగవంతుడు దయామయుడు. పొద్దున్న దాకా ఢోకా లేదు. రేపు పొద్దున్న లేచాక ఈ టిటిఇ మారి మరొకడు వచ్చినప్పుడు హైదరాబాద్ కి టికెట్ పొడిగించమని అడగడమే. ఏ.పి. ఎక్స్ ప్రెస్ ఈజ్ గ్రేట్. ఇంతకుముందు ఎప్పుడైనా ఇండియన్ రైల్వేస్ అంటే అసహ్యించుకున్నానేమో కానీ ఇప్పుడు కాదు. ఐ లవ్ ఇండియన్ రైల్వేస్. ఐ రియల్లీ డూ లవ్ ది గ్రేట్ ఇండియన్ రైల్వేస్! భారతదేశము నా మాతృభూమి… భారతీయులందరు నా సహోదరులు… నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము…..ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును…. నా దేశము పట్లను, నా ప్రజల పట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధులే …అలసిపోయిన శరీరం నిద్రలోకి జారిపోయింది, అప్పటిదాకా తిండి నీళ్ళూ ఏమీ లేవన్న విషయాలు అన్నింటినీ మర్చిపోయి.

* * * * * * *

ఆరింటికి నాగపూర్ చేరాక మొత్తం బండి ఖాళీ. మహా అయితే నా కోచ్ లో మరో ముగ్గురున్నారు అదీ, ఖాజీపేట్ దాకా. మళ్ళీ నిద్ర. పదకొండింటికి టికెట్ చూడ్డానికి వచ్చిన టిటిఇ ని పట్టుకుని హైద్రాబాద్ దాకా టెకెట్ రాయించుకున్నాను. అసలు పని అయిపోయింది. ఈ రోజు రాత్రిలోపున అత్త ఇంటికి చేరిపోతే రేపు ఇంటర్వ్యూ చూసుకుని తీరిగ్గా వేట్లపాలెం వెళ్ళిపోవచ్చు.

సికింద్రాబాద్ చేరేసరికి సాయంత్రం ఆరున్నర. ఆటో దిగుతూంటేనే అత్త బయటకి వచ్చి అడిగింది, “రా, రా, ఇదేనా రావడం? ఉత్తరం రాస్తే మావయ్యని స్టేషని కి పంపించేదాన్నిగా?”

“నాన్నరాసిన కార్డు చేరలేదా?”

“కార్డా? లేదే? ఎప్పుడు రాసాడో?” నవ్వులు.

అప్పుడు చెప్పాను కధ మొత్తం. వేట్లపాలెం నుంచి, రాజమండ్రీ, విజయవాడ, భోపాల్, ఇండోర్, మళ్ళీ భోపాల్, హైద్రాబాద్ సంగతీ, మర్నాటి పొద్దున్న ఎయిర్ ఫోర్స్ సంగతీను.

నోర్లు వెళ్ళబెట్టుకుని కథంతా విన్నాక మావయ్యే చెప్పేడు, మర్నాడు ఎయిర్ ఫోర్స్ అకాడెమీకి ఎలా వెళ్ళాలో.

23 తారీఖున ఎయిర్ ఫోర్సు ఇంటర్వ్యూ ఇండోర్ లో ఆర్మీ చేసినట్టే ఉంది. ముందు ఏదో టెస్టు. అది పాసైతే ఇంటర్వ్యూ, తర్వాత మరోటీ మరోటీ. ఈ మధ్యలో ఖాళీ దొరికినప్పుడు టీ తర్వాత మరో టీ. ఇంటర్వ్యూకి వచ్చిన అహ్మద్ అనే మరో ఉస్మానియా యూనివర్సిటీ కుర్రాడూ నేనూ కబుర్లలో పడ్డాం. దాదాపు మూడింటికి చెప్పిన విషయం ఇద్దరం టెస్ట్ లో పాసయ్యాం. సెలెక్ట్ అయితే తర్వాత చెప్తారు. సెలెక్ట్ అవకపోతే ఎప్పటి లోపున తెలుస్తుంది? దానికి సమాధానం ఎయిర్ ఫోర్స్ వారు చెప్పినదే – సెలెక్ట్ అవకపోతే ఏమీ సమాచారం రాదు.

మరి ఎలా తెలుస్తుంది ఎంతకాలం ఆగాలో? మౌనం. మౌనమే నీ భాష ఓ మూగ మనసా… ఓ మూగ మనసా…

ఇళ్ళకి పోయేటప్పుడు అహ్మద్ చెప్పేడు, “మీకు సెలెక్షన్ వస్తే ఈ ఎడ్రస్ కి నాకు టెలిగ్రాం ఇవ్వండి. నాకు వస్తే నేను మీ ఎడ్రస్ కి టెలిగ్రాం ఇస్తా.” అలా కనీసం మనకి ఏదో ఒకటి తెలుస్తుంది కదా?”

“ఇద్దరికీ రాకపోతే?”

“అప్పుడు నేనో కార్డు ముక్క రాస్తాను లెండి, అయినా మనిద్దరం బాగా చేసాం కదా, వస్తుందనే ఆశ.”

ఎడ్రస్ లు ఇచ్చి పుచ్చుకుని బయల్దేరాం. పోస్టల్ వారు అందర్నీ నవ్వించడానికే పుట్టారా అన్నట్టూ నాన్న అత్తకి రాసిన కార్డు ముక్క – నా ఇంటర్వూలు రెండూ అయిపోయిన మర్నాడు నేను హైద్రాబాద్ లో ఉండగానే చేరింది. మరో రెండు రోజులు ఆగి నేను సికింద్రాబాద్ నుంచి గోదావరి ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రి బయల్దేరాను. రిజర్వేషన్ దొరికే ప్రసక్తేలేదు కనక మళ్ళీ జనరల్ బోగీ. కాసేపు కూడా తెచ్చుకున్న సూట్ కేస్ మీద కూర్చున్నాక కాస్త చోటు. ఈ లోపుల అత్త ఇచ్చిన పేకెట్ భోజనం కానిచ్చేసరికి ఖాజీపేట. అక్కడనుంచి కునికిపాట్లు. పొద్దున్న అయుదో ఆరో దాటుతుంటే రాజమండ్రి. అక్కడ్నుంచి కాకినాడ వెళ్ళే బస్ పట్టుకుని తొమ్మిదింటికి వేట్లపాలెం ఇంట్లో దిగాను.

దాదాపు వారం నుంచీ తిరుగుడు. నిద్రలేమి. వళ్ళు తూల్తోంది. ఓ గంటలో అన్నీ నాన్నతో చూచాయగా మాట్లాడి, మళ్ళీ లేచేవరకూ లేపవద్దని చెప్పి వెంఠనే మంచం ఎక్కాను. వళ్ళు అటూ ఇటూ ఊగుతున్నట్టుంది ఇంకా ప్రయాణంలో ఉన్నట్టూ. తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ పాంట్రీకార్ లో తిన్న వడా, భోజనం అన్నీ గుర్తుకొస్తున్నై. తలనెప్పి, భోపాల్ ఇండోర్ దుమ్మూ ధూళీ, బొగ్గు బండి, ఐ హేట్ రైల్వేస్. పొద్దున్న ఎనిమిదింటికి టీ లేక గన్నే కా రస్! అదా జీవితం? ఐ రియల్లీ హేట్ ఇట్ ఆల్! లేదు రాంబాబూ, అమిత్ మిశ్రా, ఏ.పి ఎక్స్ ప్రెస్, ఐ లవ్ ఇండియన్ రైల్వేస్, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము అని కదూ… కళ్ళు మూసుకుపోయేయి.

నాలుగింటిక్కాబోలు మెలుకువొచ్చింది. మొహం కడుక్కుని టీ తాగుతూ అప్పుడు మొత్తం కధ – రాజమండ్రీ నుంచి బయల్దేరాక మళ్ళీ వేట్లపాలెం వచ్చేవరకూ – చెప్పాను; ఏ.పి. ఎక్స్ ప్రెస్ లేట్ అవడం, అసలు అమిత్ మిశ్రా అనే అతను రిజర్వేషన్ ఎలా ఇచ్చాడో అన్నీను. ‘బయల్దేరిన వేళావిశేషం మంచిదే’ అమ్మ అంటూంటే, రైల్వేస్ లో బాగా తిరిగిన నాన్న వేదాంత ధోరణిలో చెప్పేడు, “అదృష్టం కొద్దీ, ఒక్కొక్కప్పుడు అలా జరుగుతుంది. అది అలా ఉంచు కానీ రెండింట్లో ఒక ఉద్యోగం రావచ్చా?” నాన్న మాటల్లో వెనకనున్న నా ఉద్యోగపు ఆదుర్దా కనిపిస్తూనే ఉంది.

“హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూ బాగా చేసాను. అందులో వస్తుందనుకుంటున్నా. ఇండోర్ ఆర్మీలో వచ్చినా నాకు అంత దూరం వెళ్ళడానికి ఓపిక లేదు. నాకు అక్కడ నచ్చనూ లేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నల్లో ఢభ్భై శాతం నాకు తెలియనివే. అదీగాగ వచ్చినవాళ్ళూ, ఇంటర్వ్యూ చేసినవాళ్ళలో చాలామంది పంజాబీలు. వెయిట్ లిస్ట్ లో నలుగురు జేరకపోతే నా దాకా వస్తుంది. ఈ రోజుల్లో అది అసంభవం అని తెలుసు కదా?”

అంతా విన్నాక నాన్న వేదాంతం గుమ్మరించేడు, “నేను చదువుకున్నది కాకినాడలో అయినా దాదాపు జీవితం అంతా వేట్లపాలెంలోనే ఉన్నాను. మనం బాకీ ఉండి కట్టవలసిన అప్పులకీ, మనకి బాకీ ఉన్న జనం దగ్గిర పుచ్చుకోవాల్సిన డబ్బులకీ మనకెక్కడ ఋణం ఉంటే అక్కడకి వెళ్ళి తీరాలి. చూద్దాం నీకు ఎక్కడ ఉద్యోగం వస్తుందో? నీకు ఈ రెండింట్లో ఒకటి వచ్చినా, రెండూ రాకపోయినా మన చేతుల్లో ఏమీ లేదు. మనం చేయాల్సింది చేసాం. ఎక్కడా ఏ బండీ మిస్ అవకుండా వెళ్ళావు కదా, సంతోషం. ఇండియన్ రైల్వేస్ బాగా పనిచేస్తున్నట్టే లెక్క.”

నాన్న, నేనూ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే మస్తాన్ వచ్చి రెండు టెలిగ్రాం లు చేతిలో పెట్టాడు. అవి విప్పడానికి చేతులు వణుకుతున్నయి. మొదటిది భోపాల్ ఆర్మీ రెజిమెంట్ నుంచి వచ్చినది – సెలెక్టెడ్ ఫర్ ఇంజినీరింగ్ ట్రైనీ. రిపోర్ట్ ఆన్ జూన్ 18. లెటర్ ఫాలోస్” రెండోది తప్పకుండా ఎయిర్ ఫోర్స్ దగ్గిరనుంచే అనుకున్న నాకు అది విప్పాక తెలిసింది, నాకూడా హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూ కి వచ్చిన కుర్రాడు అహ్మద్ దగ్గిర్నుంచి, “నాకు ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం వచ్చింది. నీకు కూడా వచ్చిందనుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం.”

అంటే నేను అనుకున్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం రాలేదు కానీ మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఇండోర్ వెళ్ళకూడదనుకున్న నాకు ఇండోర్ లోనే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆ ఇండోర్ ప్రయాణం మర్చిపోదామనుకుంటున్న నాకు మరోసారీ, మరోసారీ అదే దారిలో వెళ్ళే పని పడింది. అదీ మెడమీద చేయి పెట్టి వేట్లపాలెం ఇంట్లోంచి గెంటుతున్నట్టూ – ఒకటే ఉద్యోగం రావడం వల్ల. ఇప్పుడు వచ్చిన ఉద్యోగంలో జేరకపోతే కుటుంబ స్థితిగతులూ, చెల్లెలి పెళ్ళీ అన్నీ కళ్ళ ముందు కదుల్తున్నై. వెళ్ళితీరాల్సిన పరిస్థితి. పొద్దున్నే కోణార్కలో రాజమండ్రీలో ఎక్కితే మర్నాడు పొద్దున్నకి ఒళ్ళూహూనం అయ్యాక భోపాల్. ఇదో ప్రహసనం అనుకుంటే భోపాల్ నుంచి పదకొండు గంటల బొగ్గు బండి ప్రయాణం, దుమ్మూ, ధూళీ, వేడి, ఖాళీ కడుపుతో కొట్టుమిట్టాడ్డం. మనసులో వెళ్ళవద్దు అనే ఆగని సాగరఘోష. ఎదురుగా పెళ్ళికాని చెల్లెలూ, రాక రాక ఉద్యోగం వస్తే జేరనంటావా అనే అమ్మా, నాన్నలూ. హతోస్మి!

ఐ హేట్ ఇండియన్ రైల్వేస్! ఐ రియల్లీ డూ.

 

 

 

ఆర్. శర్మ దంతుర్తి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జీవితంనుంచి వచ్చిన‌కధలు చాలా బావుంటాయి
    ఏకబిగిని చదివేను..
    మీకు అభనందనలు

  • Enjoyed reading it. I could relate to it as I have just seen the light at the end of the tunnel in my job search. At the end of the story I was curious what adventures Ramamurthy would have in Army ?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు