ఏమయ్యారు వీళ్ళంతా?!

మయ్యారు వీళ్ళంతా
రోడ్డుని అడ్డదిడ్డంగా ఆటోతోనో
లాగుడుబండితోనో తొక్కేవాళ్ళు
ఎగజిమ్మే చికాకుల లావాను కాస్త చాయో కాఫీతో చల్లార్చే వాళ్ళు
వెల్డింగ్ ఆర్క్ లతోనో,సుత్తిదెబ్బలతోనే
చెమటకు చెమటపట్టించేవాళ్ళు
ఏమయ్యారు వీళ్ళంతా
మొరాయించిన బళ్ళను  నిభాయించేవాళ్ళు..
దోసెలతో ఉదయాలను వేయించి
సాయంత్రాలను
పునుగులతోనో బజ్జీలను ఘుమఘుమలాడించేవాళ్ళు
ఏమయ్యారు వీళ్ళంతా
ఐస్ క్రీం చల్లదనంతో
ఏప్రిల్ ఎండను మరిపించేవాళ్ళు
వాళ్ళూలేరు…
కామత్ తాజ్ మహల్ ల సాక్షిగా
డీల్స్ ని నంజుకునే వాళ్ళు లేరు.
‘బసంతి ఇత్నా  సన్నాటా క్యోం హై’ అన్న
‘షోలే’ ఇమామ్ సాబ్ లా నడిచిపోతున్న
ఒంటరి బాటసారి విసిరిన చూపు
‘కొరోనా’పై పడుంటే అక్కడే మాడిమసైపోయేది…
అవును ఇప్పుడంతా నిశ్శబ్దమే
భరించలేని రోడ్డు మూగరోదనవింటున్నాను
గాయాలుమాన్పే రేపు తీయనిది
కొత్త వెలుగులకు తలుపుతీయునది
అంత్యప్రాసల పంక్తులా…అన్నపుమెతుకుల శోధనా… సమాధానంలేని ప్రశ్న
పక్షిగామారి వెలుగు స్నానంలో నిమగ్నమయింది
దగ్ధమయ్యే ధైర్యం తోడువెతుకుతోంది.
*

సి.యస్.రాంబాబు

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • లాక్ డౌన్ ను బాగా మలుచుకుని వ్రాశారు. అభినందనలు సర్ మీకు

  • కళ్ళకు కట్టినట్టు చిత్రించారు. అభినందనలు. ధన్యవాదాలు.

  • చాలా చాలా బాగుంది రాంబాబు గారూ
    నిజమేనండీ స్మశాన నిశ్శబ్దం లా వుంది భాగ్యనగరం
    కాదండీ కాదు కాదు
    భాగ్యనగరం కాదు భారనగరం
    భారంగా నడుస్తోంది హైదరాబాదీ జీవనం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు