ఎవరి తలకెంత వెల?  

వస్తువులను, డబ్బునీ ప్రేమించేవాళ్లలో యాంత్రికమైన మనస్తత్వం ఉంటుందనుకుంటాం, కానీ పట్టుదలగా ఒక వ్యాపారాన్ని నడిపించిన మనిషి దానిమీద ప్రేమ పెంచుకోకుండా ఎలా ఉంటాడు?

      పైపైనె సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణా అని అన్నమయ్య పాటలో మాట విన్నప్పుడు… అన్నీ నువ్వే కట్టుకుని, ఆ బాధలో తప్పు నీదికాదని తప్పించుకోవటానికి ఎవడో కట్టాడని నిందించటమే జీవితమా? అనిపించేది. ఏమో మరి అన్నమయ్య ఏం చెప్పాలనుకున్నాడో నాకెప్పుడూ అర్థం కానట్టే ఉండేది.

    ఇదిగో ఒక్కొక్కతలకూ ఒక్కొక్కవెల అనే ఈ పుస్తకం ఇప్పటివరకూ ఉన్న కొన్ని అనుమానాలని తీర్చింది. మరి కొన్ని కొత్త ప్రశ్నలనూ ఇచ్చింది. బతికి ఏదో సాధించామనుకున్నవాళ్లలో అధికశాతం “ఆ సాధించింది ఏమిటీ?” అంటే… ఆస్తుల వివరాలనో, బధువులలో మంచిపేరో చెప్పటం మాత్రమే విన్నాను. సాధించినది…సంపాదించినదీ సమానమా? ఎట్లా ఈ రెండూ సమానమవుతాయి? ఎక్కడో వీళ్లంతా పొరపాటుపడుతున్నట్టుగా అనిపించేది.

అరవయ్యేళ్ళు దాటిన శివస్వామికి సొంత ఇల్లు కల, తన పిల్లలకి మంచి జీవితం అందుతుందా లేదా అనే ఆందోళన. ఉద్యోగంకోసం ఘజియాబాద్‌లోనే ముప్పయ్యేళ్ల జీవితాన్ని గడిపిన కన్నడిగుడు శివస్వామి. రిటైర్‌మెంట్ తరవాత జీవితాన్ని గడపటానికి బెంగుళూరులో ఇల్లుకావాలనుకుంటే, ఫ్లాట్ ఇస్తానన్న బిల్డర్ ఇంకా ఎక్కువ డబ్బు కడితే తప్ప ఫ్లాట్ ఇవ్వలేనంటాడు. అరవై దాటిన వయసులో ఎనిమిదిలక్షల అవసరానికి ఉద్యోగంలో చేరటానికి ఇంటర్వ్యూకి వెళతాడు. పైకి కథ చెబుతూనే రియల్ ఎస్టేట్, బిల్డర్స్ మాఫియా ఎలా ఉంటుందో చెబుతూ పోతాడు రచయిత అయితే ఇది ఏమాత్రమూ సమాచారాన్ని ఇరికించినట్టుగా అనిపించదు. సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో వ్యాపార నియమాలూ, లొసుగులూ ఎలా ఉంటాయో. మిగతా వ్యాపారాలకన్నా ఈ కొత్త రకం వ్యాపారమూ, దాని పద్ధతులూ, అక్కడ నియమాలూ ఎలా ఉంటాయో తెలుస్తుంది. రోజురోజుకీ మనుషుల మీద మోపబడుతున్న భారాలనీ, దానివల్ల మధ్యతరగతి వాడి జీవితం మీద భయాన్నీ అర్థం చేసుకుంటాడు పాఠకుడు.

శివస్వామి ఉద్యోగం చేస్తున్న కంపెనీ యజమాని ధావల్‌దీ ఇంచుమించు అదే వయసు. ఇతను ఉద్యోగం నుంచి రిటైరయ్యాడు, అతను తన సొంత వ్యాపారాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. శివస్వామిని ఇంటర్వ్యూ చేసిన ముగ్గురూ అతన్ని రిజెక్ట్ చేస్తే కావాలనే ఇతన్నే ఎంచుకుని మరీ ఉద్యోగంలోకి తీసుకున్న ధవల్ శివస్వామి ముందు ఒక ప్రపోజల్ పెడతాడు. అది శివస్వామి చేయలేని పనే అయినా ధవల్ చెప్పినట్టే చేయాలనుకుని ఆ కంపెనీలోకి అడుగుపెట్టాడు. చీరల వ్యాపారి కొడుకుగా జీవితాన్ని మొదలు పెట్టి మహా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన దావల్‌కి తన కంపెనీ ఏమైపోతుందో, ఈ కోట్లాది సంపదా, పేరూ ఎక్కడ పాడైపోతాయో అని ఆందోళన. సొంత కొడుకు చేతిలో కంపెనీని పెట్టాలన్నా ధవల్‌కి భయం…
“పిల్లలు పెద్దయ్యాక నా లెగసీ ముగిసిపోతుందన్న” భయం. డబ్బున్నవాడికి ఎంత కష్టం, ఎన్నో సాధించినవాడికీ ఎంత భయం. ఈ భయాన్ని తన కంపెనీలో హెచ్.ఆర్గా చేసిన శివస్వామితో చెప్పుకున్నప్పుడు. ఈ మధ్యతరగతి ముసలివాడు ఆ మహా ధనవంతుడైన ముసలాడికి ఒక మాట చెబుతాడు. “కొన్ని భ్రమలు నిజాలలాంటి మెరుపును కలిగి ఉంటాయి. వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలి” అని.

తాను ఈ కంపెనీలో చేరటానికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతన్ని ఏమాత్రం ఇష్టపడని ధావల్ కొడుకు రవి, ధావల్‌ని రిటైర్మెంట్ తీసుకొమ్మనటానికి ఈ శివస్వామినే ప్రయోగిస్తాడు. రిటైర్మెంట్ తర్వాత ఇతనికి ఉద్యోగం ఇచ్చిన వాన్నే రిటైర్మెంట్ చేయించే బాధ్యత ఇప్పుడు శివస్వామిది.కంపెనీ మొత్తాన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్న ధవల్, తాను సృష్టించిన సామ్రాజ్యాన్ని వదులుకోలేకపోవటం, ప్రతీ విషయంలోనూ పొసెసివ్‌గా ఫీలవటం అందరినీ బాదిస్తోందనీ, ఆ విషయాన్ని ఎలాగైనా ధవల్‌కి చెప్పాలనీ శివస్వామికి చెప్పినప్పుడు… “పండుటాకు ఒకటి ఇంకా చెట్టునుంచి రాలిపడటంలేదంటే అది ఏదో తనదైన కర్తవ్యాన్ని ఇంకా నిర్వహిస్తోందని అర్థం. అది మిగతా పచ్చని ఆకులకు, చెట్టుకూ ఆఖరికి ఆ పడుటాకుకు కూడా తెలియకపోవచ్చు.” అంటాడు.

వస్తువులను, డబ్బునీ ప్రేమించేవాళ్లలో యాంత్రికమైన మనస్తత్వం ఉంటుందనుకుంటాం, కానీ పట్టుదలగా ఒక వ్యాపారాన్ని నడిపించిన మనిషి దానిమీద ప్రేమ పెంచుకోకుండా ఎలా ఉంటాడు?

అలాగే ఇప్పుడు ధవల్ సొంత వ్యాపారం కుటుంబ వ్యాపారమయ్యాక ఏదో ఒకరోజున అతని కొడుకు చేతిలోకి వెళ్లాల్సిందే అనే విషయాన్ని ధవల్‌కి తెలిసేలా చేయాలి. కానీ అది మాట చెప్పినట్టుగా ఉండకూడదు. ఆ అవకాశాన్ని స్వయంగా ధవల్ కల్పించుకున్నాడు. ధర్మస్థల, గోమఠేశ్వర తీర్థం సందర్శిస్తున్నప్పుడు ధవల్ తనని తాను తరచి చూసుకుంటాడు.కన్నడనుంచి బసవలింగేశ్వరుడే కాక అల్లమ ప్రభువు కూడా ఉన్నాడని గుర్తు చేస్తూ. ఆ అల్లమ ప్రభుని వచనాలనివాడటం, వాటిని అత్యంత ప్రభావవంతమైన సన్నివేశాల్లో ఉపయోగించిన తీరు మెచ్చుకోదగ్గది. పాఠకున్ని కూడా తన సొంత జీవితంలోకి తిరిగి చూసుకునేంత చాకచక్యంగా వాడటం కథని అత్యంత అద్బుతంగా మార్చింది. “ఇచ్చిన గుర్రాన్నే అధిరోహించటం తెలియక మరో గుర్రాన్ని కోరుకునే వాళ్లు వీరులూ కాదు, శూరులూ కాదు.”, “అరటివనంలో ప్రవేశించాక, మీరు బయటపడే మార్గం తెలుసుకోవాలి. మాయామోహాల సంసారంలో దూరిన తరవాత కూడా బయటపడే మార్గాన్ని వెతుక్కోవాలి.” అనే వచనాలని చదివాక నిజంగా కాసేపు పుస్తకాన్ని వదిలి మరేదో ఆలోచనలోకి వెళ్ళిపోతాం.

***         ***           ***

తారాబాయి లేఖ నవలతో తెలుగు పాఠకులకు పరిచయమైన ఎం.ఆర్. దత్తాత్రి కన్నడలో రాసిన ఈ నవలని తెలుగులోకి అనువదించిన రంగనాథ రామచంద్రా రావు ఎక్కడా ఇది అనువాదమనే అనుమానమే రాకుండా జాగ్రత్తగా తన పని చేశారు. నేరుగా తెలుగు పుస్తకమే చదువుతున్నట్టుగా ఉంటుంది ఈ అనువాదం. టైటిల్ చూస్తే ఏదో మాఫియా కథ అని అనిపిస్తుంది, కవర్ పేజ్ చూస్తే మరేదో ఆధ్యాత్మిక కథేమో అనుకుంటాం.

పుస్తకంలోకి ప్రవేశించాక మరేదో అద్బుతాన్ని కనుగొంటాం. ఇంతకీ ఒక్కొక్క తలకీ ఒక్కొక్క వెల ఎవరి నిర్ణయించారు? ఈ కథలో చివరికి తెలిసిందేమిటి? ఇంతకీ శివస్వామి ఏంచేశాడు? ధవల్ ఏమయ్యాడు? అమెరికాలో ఉన్న కూతురు ఆరోగ్యం, కొడుకు చదువు, ఎనిమిది లక్షలు కడితే కానీ చేతికి రాని ఇల్లూ… ఇన్ని సమస్యల మధ్య ఈ ముసలి శివస్వామి. ఆ ఇంకో ముసలాన్ని ఏ వైపు తీసుకుపోయాడు? ఏ తలకు ఎంత వెల? ఏ తలలో ఏముందో దానికెంత వెల? ఆ తలని మోసిన శరీరానికీ, ఆ శరీరం సాధించిన, సంపాదించిన జీవితానికెంత వెల? సమాధానం దొరకాలంటే ఈ పుస్తకాన్ని మరోసారి తెరవాల్సిందే, మళ్ళీ చదవాల్సిందే. ప్రతీసారీ కొత్త విషయమేదో నా తలలోకి చేరుతోంది… మొత్తంగా నా తలకి ఎంతవెల నిర్ణయించబడుతుందో మరి…

*

నరేష్కుమార్ సూఫీ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి ఇంట్రడక్షన్. పుస్తకం తప్పక చదవాలి అని అనిపించింది.

  • సమీక్షకులు, సంపాదకులకి ఒక చిన్న సూచన.

    అచ్చు పత్రికలలో స్థలాభావం కారణంగా పుస్తక సమీక్ష తో పాటు పుస్తకం ఎక్కడదొరుకుతుందో తెలియజేయకుండా ‘అన్ని ప్రముఖ పుస్తక దుకాణలలో లభ్యం’ అని ఒక ముక్క అనేసి వూరుకుంటారు.

    వెబ్‌జైన్స్‌కి ఆ ’స్థలాభావం’/ స్పేస్ ఇబ్బంది లేదు. పైగా ఈ రోజుల్లో పుస్తకాలు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో వుంటున్నాయి. కాబట్టి
    పుస్తక విక్రేత పేర్లు, చిరునామా, ఫోన్ నెంబరు, వారి (i)ఆన్‌లైన్ వెబ్సైట్ లింక్ ‌తో పాటు పుస్తకం ధర కూడా తెలియజేస్తే పాఠకులకి పుస్తకాన్ని మరింత చేరువగా తీస్తుకెళ్లవచ్చు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు