ఎనిమిదో సముద్రం

ఒక వేళ స్మిత, ఇతడు చెప్పే సముద్రం వైపు వెళ్లిందేమో! అక్కడకి వెళ్లి వెతికితే దొరుకుతుందేమో!

నాపై ఎవరో కొరడా ఝళిపించిన చప్పుడు. కొస చెళ్లున తగిలింది. ఉలిక్కిపడి లేచాను. ఉన్నపళంగా మెలకువ రావటానికి కారణం? చీడపురుగులా విడవకుండా మెదడుని కొన్నాళ్లనుంచి తొలుస్తున్న ఒక పీడకల.

నాలో ఉన్న వెలుగేదో తేలిపోతూ, తొలగిపోతున్న అనుభూతి. ఇన్నాళ్లూ నాలో అంతర్భాగమయిన ఆమె  నాకు వీడ్కోలు చెపుతున్న భావన. వెళ్లిపోతున్న విషయం నేను గమనిస్తున్నానో లేదో చూడటానికన్నట్లు, ఆమె మాటిమాటికీ వెనక్కి చూస్తోంది. వెళ్లకుండా ఆపటం కోసం ఆమె వెనక పరిగెడుతున్నాను. ఆమె దగ్గరకి చేరటానికి నా వేగం సరిపోవటం లేదు. నేను వేగం పెంచినకొద్దీ, తన వేగం రెట్టింపు అవుతోంది. దాంతో, క్షణక్షణానికీ మా ఇద్దరి మధ్య దూరం క్రమంగా పెరుగుతోంది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె రూపం కనుమరుగయింది.

ఊపిరందక నేను ఉక్కిరిబిక్కిరవుతున్నాను. ఇక ముందుకు సాగలేక ఆగిపోయాను.

నా మనసును ‘ఇక నేను ఒంటరిని’ అన్న ఆలోచన ఒక్కసారిగా ఆవరించింది. ఉప్పెనలా దుఃఖం కమ్ముకుంది. దాన్ని ఆపటం నా వల్ల కాలేదు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాను. గొంతు పగిలిపోతోంది. రక్త నాళాలు చిట్లిపోతున్నాయి. విషాదం ఇంత బీభత్సం సృష్టిస్తుందా?

***

మెలకువ వచ్చి కళ్లు తెరిచాను. తేరుకుని చుట్టూ చూశాను. ఇంటి తలుపులు వేసినవి వేసినట్లే ఉన్నాయి. తడిమి చూశాను. నాతో ఉండాల్సిన స్మిత స్పర్శ తగల్లేదు. మరోసారి కళ్లు నులుముకుని పరిసరాలని గమనించాను. అరచేతులకి తడి తగిలింది. అయితే నేను నిజంగానే ఏడ్చానన్నమాట! కలలో కలిగిన ఒక అనుభవానికి, కలలో ఉండి మానసికంగానే కాకుండా, వాస్తవంలో కూడా భౌతికంగా స్పందిస్తామా?

గబగబా మంచంమీంచి దిగి నిలువుటద్దంలో నా ప్రతిబింబం చూసుకున్నాను. ముక్కలు ముక్కలుగా కనపడుతున్న పీక్కుపోయిన ముఖం. కళావిహీనమైన కళ్లు.  కళ్లక్రింద కన్నీటి చారికలు. తడారి పొడిబారిన పడ్డ పగిలిన పెదాలు. అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం. తైలసంస్కారం లేని జుట్టు. నన్ను నేనే గుర్తుపట్టేలా లేను. విరక్తిగా ఒక నవ్వు నవ్వుదామని ప్రయత్నించాను. విస్మతదేహభాషని వ్యక్తపరచటం నా వల్ల కాలేదు.

నాకు చెప్పకుండానే స్మిత, నన్ను నిజంగా వదిలి వెళ్లిపోయిందా? తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు. నాకొచ్చిన కల వస్తూండగానే నిజమయిందా? ఎదురవబోయే నిజమే సమాంతరనైజంతో  స్వప్నమయిందా? ఏది జరిగినా ఫలితమొకటే! నా మెదడు ఒక్కసారిగా స్తంభించినట్లనిపించింది.

నా జీవితంలో తాను తప్ప నా మనసుకు దగ్గరయిన వారు ఎవరూ లేరు. నేను హృ‘దయ’పూర్వకంగా కావాలనుకున్న కరుణ నన్ను ఇష్టపడలేదు. నన్ను ఇష్టపడిన శాంతిని నేను వద్దనుకున్నాను. స్మితయినా నాతో మిగులుతుందనుకున్నాను. ఇప్పుడు ఆమె కూడా దూరమయింది. నన్ను వదిలేసి తాను ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్లుంటుంది? ఇప్పుడు తనకోసం ఎక్కడ వెతకాలి?

ఒకటొకటిగా మెదడులో బద్దకంగా ఒడలు విరుచుకుంటున్న తలపులు. ఆ విరుపుల్లో రాత్రి మా ఇద్దరికీ జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది.

***

ఉన్నదేదో తిని మంచం మీద వాలాను. నాలోకి పరీక్షగా చూస్తూ తాను.

“ఇంతకు ముందున్న ఉత్సాహం మీలో ఇప్పుడు కనపడటం లేదేం?” పరధ్యానంగా ఉన్న నా భుజం మీద చెయ్యి వేసి అడిగింది స్మిత.

“ఏం లేదు. అలసటగా ఉంటోంది,” నిస్సత్తువగా నేను జవాబు చెప్పాను. అపస్వరాలు పలుకుతున్న నా స్వరంలో నా మానసిక పరిస్థితి నాకే తెలుస్తోంది.

వారం రోజుల్నుంచీ ప్రతిరోజూ సాయంత్రం తానలా అడుగుతూనే ఉంది. ఏదో ఒక జవాబు చెప్పి నేను తప్పించుకుంటున్నాను. ఇంతకు ముందు నేను చెప్పింది ప్రశాంతంగా వినేది. ‘నువ్వు చెప్పేది నిజం కాదని నాకూ తెలుసు’ అన్నట్లు చూసి ఊరుకునేది.  అంతకు మించి రెట్టించేది కాదు. ఈ రోజు పరిస్థితి మారింది.

“ఇన్నాళ్లనుంచి నేను మీతో ఉంటున్నాను. అలసటకీ, నిరుత్సాహానికీ తేడా తెలుసుకోలేనా?” అడిగింది. ఆమె గొంతులో నా పట్ల సహానుభూతి.

“అసలు విషయం చెప్పేద్దామా?” అని ఒక్క క్షణం అనిపించింది. చెపితే తాను తట్టుకోగలదా?

“మన భవిష్యత్ గురించే నా ఆందోళనంతా!”

“ఇప్పుడేమయిందని?”

“ఏం కాలేదని అడుగు,” అన్నాను.

“ఇలా ఉన్నాం, చాలు అనుకుంటే దిగులే లేదు. అలా ఎందుకు లేం? అన్న ప్రశ్న వేసుకుంటేనే సమస్య. ఉండటం అనేది సాపేక్షికం. లేదు అనుకుంటే ఎంతైనా సరిపోదు,”

“నువ్వు చెప్పినంత తేలిక కాదు, అలా అనుకోవటం,”

“నా సహాయం తీసుకోండి. ఏ సమస్యనైనా తేలిగ్గా తీసుకోగలరు,”

నా గుండె బరువుని దించుకోవటానికి ఎన్నాళ్లు తనమీద ఆధారపడటం? వేరే గత్యంతరం లేదా? నా నిస్సహాయత మీద నాకే కోపం వచ్చింది. దాంతో పాటు ఆపుకోలేనంత దుఃఖం కూడా వచ్చింది. తాను ఏమనుకుంటుందో అని కూడా చూడకుండా కాసేపు వెక్కివెక్కి ఏడ్చాను.

“ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని అంతలా ఏడుస్తున్నారు. అలా ఏడవకండి! నేను మీ తోడుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరా పని చేయటం నాకు నచ్చదు,” ఓదార్చటానికి ప్రయత్నించింది.

అయినా నా కన్నీళ్లు ఆగలేదు. ఒకప్పుడయితే, నా దుఃఖం ముందే తెలుసుకుని, కన్నీళ్లు బయటికి రాకుండా అడ్డుపడేది.  ఈసారి తనవైపునుంచి అలాంటి ప్రయత్నం ఏమీ లేదు. నాతో తాను విసిగిపోయిందా? తనకి తెలియకుండా నేను తలకెత్తుకున్న మోయలేని బరువు నా అంతట నేను దించుకోటానికి ఒక అవకాశం ఇస్తోందా? ఇంక నన్ను ఓదార్చటం తన శక్తికి మించిన పని అనుకుంటోందా? నాకేమీ అర్థం కాలేదు. తాను మాత్రం మౌనంగా చూస్తూ నాకు దూరంగా జరిగింది. అది జాలో, సానుభూతో నాకు తెలీలేదు.

***

నిన్నటి జ్ఞాపకంలోంచి నేటి అనుభవంలోకి వచ్చి పడ్డాను.  కట్టుకున్న లుంగీ లాగి మంచం మీద పడేసి గబగబా బట్టలు మార్చుకున్నాను. ఉన్నా లేకపోయినా ఒకటే అనిపించే తాళం వేసి మేడ మీద ఉన్న నా గదిలోంచి బయటపడ్డాను. మెట్ల మీదనుంచి దూకుతున్నట్లుగా క్రిందకు దిగాను.

ఇంటావిడ గేటు ముందు ముగ్గు వేస్తోంది. స్మిత వెళ్లటం తాను చూసిందేమో? అడిగి చూస్తే?

“స్మిత కనపడటం లేదు. ఎటు వెళ్లిందో తెలీదు. తాను మెట్లు దిగి వెళ్లటం మీరేమన్నా చూశారా?”

“లేదే! వారం రోజుల క్రితం నీతో చూడటమే ఆమెని. అయినా నువ్వు లేకుండా తాను ఒంటరిగా ఎక్కడికీ వెళ్లదుగా,” నా వంక అనుమానంగా చూస్తూ జవాబిచ్చింది ఆమె.

“నిజమే! నాకూ అదే ఆశ్చర్యంగా ఉంది,” అంటూ నడక సాగించాను. నాలుగు అడుగులు వేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను. అప్పటిదాకా నాతో మాట్లాడిన ఇంటావిడ ఇప్పుడక్కడ లేదు. ఆమె గీసిన ముగ్గూ కనపడటం లేదు. ‘చిత్రంగా ఉందే’ అనుకుంటూ క్షణాల్లో మెయిన్ రోడ్డు మీదకి చేరుకున్నాను.

***

“సముద్రం! సముద్రం!” అరుస్తున్నాడు ఒకతను ఒక రథం పక్కన నిలబడి.  సారథి అనుకుంటాను. రథం నిండా రకరకాల వయసున్న జనం క్రిక్కిరిసి ఉన్నారు. వాళ్ల రూపాలు విషాదానికి ప్రతిరూపాల్లా ఉన్నాయి. రథానికి పూన్చిన కాలవర్ణ జవనాశ్వాలు పరిగెట్టటానికి ఆయత్తమవుతున్నాయి.

ఇదేంటి? ఇతనిలా అరుస్తున్నాడు. సముద్రం వైపు రథం వెళ్తోందనీ, అటు వైపు వెళ్లదలుచుకున్నవాళ్లు తన రథం ఎక్కొచ్చనా అతని ఉద్దేశం. ఈ ఊర్లో సముద్రమే లేదు. అది కూడా తెలీదా? ఇతడికి.

“ఈ ఊళ్లో సముద్రం ఎక్కడుంది?” అడిగానతన్ని. అడుగుతూ అతని కళ్ల వైపు ఒక్కసారి చూశాను. అవి మూతపడటం లేదు. నా ప్రశ్న విని, నా వంక అదోలా చూశాడు. తర్వాత వికృతంగా నవ్వాడు.

“సముద్రం ఎక్కడుంటుంది? అది ఊళ్లో ఉంటే జనం ఉండలేరు. అది తనకి ఇష్టం ఉండదు. అందుకని ఊరు బయట ఉంటుంది. అంతమాత్రం తెలీదా?” అతడి దగ్గర్నుంచి ఎదురుప్రశ్న ఎదురయింది.

“నాదిదే ఊరు. నాకు తెలిసి ఈ ఊళ్లో కాదు కదా, వంద కిలోమీటర్ల దరిదాపులో ఎక్కడా సముద్రం లేదు. నిన్నటి దాకా లేని సముద్రం ఒక్క రాత్రిలో ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చింది?” అన్నాను.

“నిన్న లేనిది ఇవ్వాళ ఉండకూడదని లేదు. నిన్న ఉన్నది ఇవ్వాళ ఉండాలనీ లేదు. నిత్యనిరంతరపరిణామం ప్రకృతిసహజం. మీరు లేదనుకునే సముద్రం ప్రజలు ఉన్న ప్రతి ఊర్లోనూ ఉంటుంది. నా మాట నమ్మండి. అనవసరమయిన అనుమానాలూ, అందులోంచి పుట్టుకొచ్చిన ప్రశ్నలు. అనవసర కాలయాపన.  మీరు అక్కడకి వెళ్లాలనుకుంటే రథం ఎక్కండి. అక్కడ మిమ్మల్ని దింపే పూచీ నాది,” అతడు విసుగ్గా అన్నాడు.

నా మనసులో ఒక ఆశ తళుక్కున మెరిసింది. ఒక వేళ స్మిత, ఇతడు చెప్పే సముద్రం వైపు వెళ్లిందేమో! అక్కడకి వెళ్లి వెతికితే దొరుకుతుందేమో! మనసు బలహీనమయినపుడు అనుమానం విశ్వాసం అవుతుంది.

రథం ఎక్కి కూచున్నాను. నా చుట్టూ ఇరుక్కుని కూచున్న వాళ్లని పరీక్షగా చూశాను. కొందరు ఒంటరిగా. మరికొందరు చిన్నచిన్న గుంపులుగా. మూసపోసినట్లు, అందరి మొహాల్లోనూ ఒకేరకమయిన హావభావాలు.

మధ్యలో ఓసారి రథం ఆపి సారథి క్రిందకు దిగాడు. ఆకాశం వంక తేరిపార చూశాడు. అలా ఎందుకు చూస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఓ నిమిషం తర్వాత వచ్చి మళ్లీ రథం ఎక్కాడు.

“ఎందుకు ఆకాశం వంక చూశారు?’ అడిగాను.

“భూకంపం వస్తుందో లేదో తెల్సుకోటానికి,”  జవాబిచ్చాడు.

నేను నిర్ఘాంతపోయాను. పది నిమిషాల్తర్వాత రథం ఆగింది.

తోసుకుంటూ, ఒకళ్లనొకళ్లు తొక్కుకుంటూ రథం లోపలి జనం క్రిందకు దిగుతున్నారు. దిగినవాళ్లు దిగినట్లు సముద్రం వైపు పరిగెడుతున్నారు.

“ఈ ఊళ్లో సముద్రమే లేదన్నారుగా! చూడండి ఎంత పెద్దగా ఉందో?” సారథి రథం ఆపి నా వంక చూస్తూ  అంటున్నాడు. జనం అందరూ దిగిపోయింతర్వాత, రథం వెనక్కి తిప్పుకుని ఎక్కుపెట్టిన విల్లునుంచి విడివడినట్లు శరవేగంగా వెళ్లిపోయాడు. సారథి చూపెట్టిన వైపు తేరిపారా చూశాను.

అతడు చెప్పింది నిజమే! నాకెదురుగా వినీల విశాల సముద్రం. ఎడతెగని నిద్రలో కలల్లా ఎగసిపడుతోన్న అలలు. విఫలమైన ఆశల్లా ఇసుకతిన్నెలు. కొంతమంది మిగిలిన వాళ్లకి దూరంగా ఒంటరిగా మునిగి తేలుతున్నారు. మరికొందరు సమూహంగా ఒక్కసారిగా మునిగి బయటకి వస్తున్నారు.

సముద్రం జనసముద్రంలా ఉంది. రోదన లాంటి రొద మిన్నంటుతోంది.

“మీరు రారా లోపలికి,” నా చెయ్యి పట్టుకుని ఒకతను దీనంగా అడుగుతున్నాడు.

అతనికేం జవాబు చెప్పాలో తెలీలేదు నాకు. అతని చెయ్యి విదిలించుకుని, నాడుల్లో ఉన్న బలమంతా కూడదీసుకుని నడవటం మొదలు పెట్టాను. ఎంత వేగంగా నడుద్దామని ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. అలా బరువుగా అడుగులేస్తూనే కాసేపు తిరుగుతూ వెతికాను. వెతుకుతూ తిరిగాను. ఫలితం కనపడలేదు. ఇక చేతకాక నడవటం ఆపేశాను. ఇక స్మిత తనకు ఇక్కడ కనపడనట్లే!

చెలియలికట్ట. అక్కడిదాకా వేగంగా వచ్చి వెనక్కి మళ్లుతున్న అలలు. నా అన్వేషణకి, తుది ఫలితానికీ ఇది పోలికా? సాగరఘోష కన్నా ఎక్కువగా భవిష్యత్ భయపెడుతోంది.

చివరికొక చోట కూలబడ్డాను. ఏడ్పు రాబోయి గొంతులోనే ఆగిపోతోంది.

***

ఎవరో భుజం మీద చెయ్యి వేసినట్లనిపించి పక్కకి తిరిగి చూశాను. ఓ అపరిచిత.

“మీరు ఎవరికోసం వెతుకుతున్నారో నాకు తెలుసు,” అంది ఆమె.

“నీకు తెలుసా?” విస్మయంగా అడిగాను.

“నేను మిమ్మల్ని మీరు అంటున్నాను,”

“మీకు తెలుసా?”

“తె…లు…సు,” అక్షరాలని వొత్తి పలుకుతూ చెప్పింది.

“ఎలా?”

“ఇంతకుముందు ఆమే, నేనూ మీతోనే ఉండేవాళ్లం. నిజానికి ఆమె లేకుండా నేను లేను. తాను బయటికి కనపడేది. నేను కనపడేదాన్ని కాను.  నా ఉనికికి మీరు క్రమంగా విలువ లేకుండా చేయడంతో వారం క్రితం మీకు తెలీకుండానే మీలోంచి బయటపడ్డాను. అప్పటినుంచే మీలో మార్పు మొదలయింది. ఆ తర్వాత మీ ప్రవర్తన చూసి, ఆమె కూడా విసిగిపోయింది. నా నిష్క్రమణం తర్వాత మీ దగ్గర తన అస్థిత్వానికి అర్థం లేదని గ్రహించింది. అందుకనే, మీకు చెప్పకుండా ఈ ఉదయం మిమ్మల్నొదిలేసి అయిష్టంగానే బయటికి వచ్చింది,”

ఈ అపరిచిత నాలో ఉండేదా? నాకు తెలీకుండా బయటికి వచ్చేసిందా? అదెలా సాధ్యం? అంతా అయోమయంగా ఉంది. అది తర్వాత తేల్చుకోవచ్చు. ముందుగా తెలుసుకోవాల్సింది స్మిత గురించి.

“ఇప్పుడు తానెక్కడుందో మీకు తెలుసా?”

“తెలుసు. ఈ రోజు ప్రొద్దున్నే నా దగ్గరకి వచ్చింది. ఆమె కళ్లల్లో ఇంతకుముందు నేనెన్నడూ చూడని భయం. అయోమయం. వ్యగ్రగా మారినట్లు, వ్యాకులచిత్తంతో ఉన్నట్లు అనిపించింది. ‘ఏంటి? అతడిని వదిలేసి ఇటు వైపు వచ్చావు’ అని లాలనగా అడిగాను.  మిమ్మల్ని లొంగతీసుకుని, తన్ను కనుమరుగు చేయటానికి ఇన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న ఆగర్భశత్రువుతో ఇక పోరాడలేనని అంది. దానికి లొంగిపోయి మీనుంచి శాశ్వతంగా దూరమవుతానని చెప్పింది. ఆమెని ఆపటానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. మీ నుంచి అదృశ్యం కావాలనుకున్న ఆమె నిర్ణయాన్ని ఆఖరి క్షణంవరకూ ప్రయత్నించి అతికష్టం మీద మార్చగలిగాను,”

విభ్రాంతినుంచి తేరుకుని “ఇప్పుడెక్కడ ఉంది?” అని అడిగాను.

“నా రక్షణలోనే ఉంది. విశ్రాంతి తీసుకుంటోంది. ఒకసారి చూస్తారా?”

“చూడటం కోసమేగా వెతుక్కుంటూ వచ్చింది,” అంటూ, “మీరామెను ఒంటరిగా ఎందుకు వదిలేశారు?  మీరు వద్దని వారించిన ప్రయత్నం ఆమె మళ్లీ చేస్తే?” అడిగాను.

“ఆ ఆలోచన మానేస్తానని వాగ్దానం చేసింది. తన మనస్తత్వం నాకు బాగా తెలుసు. అన్న మాట తప్పదు,“ అపరిచిత గొంతులో అంతులేని నమ్మకం ధ్వనించింది.

అనుమానంగానే అపరిచిత వెంట నడిచాను. ఇసుకతిన్నెల మీద మున్నెన్నడూ నా చూపులు చవి చూడని వన్నెచిన్నెల వెలుగు. వాటి మధ్యలో నాకు చిరపరిచిత సుపరిచిత రూపం. అపరిచిత నిజమే చెప్పింది. స్మిత బ్రతికే ఉంది. నా వంక అనిమేషంగా చూస్తోంది. ఒక్కసారిగా వెళ్లి ఆమెని అక్కున చేర్చుకున్నాను.

“మీరిద్దరూ కాక ఇంకొకళ్లు ఇక్కడ ఉన్నారు,” అపరిచిత సున్నితంగా హెచ్చరించింది.

స్మితకి దూరంగా జరిగి ఆమె వైపు తల తిప్పాను. “మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు,” గద్గదస్వరంతో హృదయపూర్వకంగా అన్నాను.

స్మిత నెమ్మదిగా తన గొంతు విప్పింది.

“తనకి మీ కృతజ్ఞతలు అవసరం లేదు,” అనునయంగా అంది.

“అలాగే! పద, మన ఇంటికి వెళ్దాం,” ఆమె చెయ్యి పట్టుకుని లాగాను.

“వస్తాను కాని ఒక షరతు మీద. నాతో పాటు అపరిచిత కూడా మీతో వస్తుంది. ఇంతకుముందు లానే, తాను కూడా మనతో కలిసే ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెని త్యజించకూడదు,”

“సరే!” అప్రయత్నంగా అన్నాను.

“మాటవరసకి మాట ఇవ్వకూడదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి,”

“నిలబెట్టుకుంటే…”

“తానూ, నేనూ మీ దగ్గర్నుంచి వెళ్లటం, మీరు మా కోసం వెతుక్కోవటం, ఈ తిప్పలేవీ ఉండవు,” అంది.        అవునన్నట్లు తల ఊపింది అపరిచిత. కుదరదని చెప్తే బాగుండు అన్నట్లు నా వంక ఆకలిగా, ఆత్రంగా చూస్తోంది నాకు ఎదురుగా నోరు తెరుచుకునున్న ఎనిమిదో సముద్రం.

*

 

 

టి. చంద్రశేఖర రెడ్డి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ బావుంది సర్, స్మిత అంటే చిరునవ్వూ, అపరిచిత పేరు సంతోషమూనా?

  • ఆరో పేరాలో విస్మృతదేహభాష బదులు విస్మతదేహభాష అని ఉంది. అక్షరదోషాన్ని సవరించి చదువుకోవాల్సిందిగా సహపాఠకులకి మనవి.

    భవానీ ఫణి గారికి,

    కథ నచ్చినందుకు సంతోషం. మీ అంచనాలో రెండో భాగం కథ ముగింపుకి నేననుకున్నది కాకుండా మరో పార్శ్వం కల్పించింది. కృతజ్ఞతలు.

    టి. చంద్రశేఖర రెడ్డి

  • సరి కొత్త ఆలోచనలను రేకెత్తించే మంచి కథను అందించినందుకు మిత్రులు శ్రీ టి. చంద్ర శేఖరరెడ్డి గారికి అభినందనలు! ఈ కథలో Allegory టెక్నిక్ ని వాడటం జరిగింది. కాబట్టి – ఈ ప్రతీకలకు ‘కరెక్ట్ ‘ అర్థం ఏమిటని ఆలోచించడం అర్థం లేని పని. ప్రతీకలు వాడటం ద్వారా రకరకాల వ్యాఖ్యలకు తలుపులు తెరవడం జరిగింది.
    ఈ కథను చదివి శ్రీమతి భవానీ ఫణి గారికి ఒక అర్థం తోచింది. అలానే ఇతర పాఠకులు కూడా వారికి తోచిన అర్థాలను వెతుక్కుంటారు. ఇవేవీ కథారచయిత ఉద్దేశించిన అర్థం తో సరిపోవాల్సిన అవసరం లేదు. రచయిత ఉద్దేశించిన అర్థం కూడా మరో పాఠకుడి ఇంటర్ ప్రిటేషన్ లాంటిదే! రచయిత ఉద్దేశించిన అర్థానికి అంతకంటే ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు.
    ఒకే పాఠకుడు ఇలాంటి కథలను మరొక సారి చదివి భిన్నమైన ఇంటర్ ప్రిటేషన్లలకు రావచ్చు. అందువలన వీటికి కరెక్ట్ అయిన ఇంటర్ ప్రిటేషన్లు అంటూ ఉండటానికి వీలులేదు. అదే ఈ టెక్నిక్ లోని బలమూ, బలహీనతా కూడా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు