తెలంగాణ సాయుధ పోరాటానికి ఎత్తిన ఎర్రజెండా!

కథంతా అయిపోయిన తరువాత మన చేతిలో కథ ఉండదు. కథ చేతిలోనే మనం ఉండిపోతాం. లౌకిక ప్రపంచంలో కాక కథలో మనం కూడా ఒక అదృశ్య పాత్రగా కథ వెంట ఉద్విగ్నంగా సాగిపోతాం.

రాసిన ఒక్క కథతోనే తెలుగు కథా సాహిత్యంలో శిఖరాయమానమైన కీర్తినీ, ప్రాచుర్యాన్ని పొందిన బహుభాషావేత్త, ఏ సమస్యనైనా మౌనంతోనే పటాపంచలు చేసే అపర చాణక్యుడు, భారత మాజీ ప్రధానమంత్రి పి. వి. నరసింహారావు. రాజకీయాల్లోకి రాకుండా అలాగే సాహిత్యంలో కొనసాగి ఉంటే తెలుగు వారికి మరో జ్ఞానపీఠాన్ని అందించడానికి గల సమర్ధతలన్నీ ఉన్న ప్రతిభా సంపన్నులు పి. వి. అనువాదకుడు, నవలా రచయిత అనేది జగద్విఖ్యాతం. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయిపడగలు’ను ‘సహస్రఫణ్’ పేర హిందీలోకి అనువదించడమే గాక మరెన్నో ఇతర అనువాదాలను చేసిన సంగతి తెలుగు పాఠకులకు విదితమే.  Insider (‘లోపలి మనిషి’ –  తెలుగు అనువాదం.)      పి. వి. రాసిన రాజకీయ నవల ఎంతో సంచలనం సృష్టించింది.

ప్రపంచ పోరాటాల చరిత్రలో సువర్ణాక్షరాల్లో రాయదగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని (1946-51) తెలుగు సాహిత్య కళాజీవులు పోరాటంలోని ప్రతి మలుపును ఏదో ఒక ప్రక్రియలో రికార్డు చేశారు. ఇందులో పాట తరువాత అత్యధిక సంఖ్యలో వచ్చినవి కథలే. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వస్తువుగా తీసుకొని తెలుగులో సుమారు 100 కథలైనా వచ్చి ఉంటాయి. వీటిలో 70 కథలు మనకు ఇప్పుడు లభ్యమౌతున్నాయి. వీటిలో ఆంధ్ర ప్రాంత కథకులు రాసిన కథలే ఎక్కువ. అయితే అవి సహజత్వానికి దూరంగా, అతిశయోక్తులతో ఉండడం గమనార్హం. తెలంగాణ కథకులు ప్రొఫెషనల్ కథకులు కాదు. వారు ఉద్యమంలో నిండా మునిగిన పోరాట వీరులు. ఉద్యమావసరంగా అప్పుడప్పుడే కలం పడుతున్న ఆరంభ రచయితలు కావడం మూలంగా వీరు రాసిన కథల్లో శిల్పం కాస్తా తక్కువైనా పోరాటాన్ని ఉన్నది ఉన్నట్లు చిత్రించిన కథలు. అయితే రాసిన కథలను ప్రచురింపజేయడం కూడా పెద్ద సమస్య. అప్పటికే ‘మీజాన్’ పత్రిక మూత పడడం కథా సాహిత్యానికి పెద్ద లోటు. దాశరథి రాసిన ‘నిప్పు పూలు’, పి. వి. నరసింహారావు రాసిన గొల్ల రామవ్వ కథలు కథ, కథాకథనం, శిల్పం, భాష, సామాజిక చిత్రణ పరంగా మేలిమి కథలు. ఇందులో పి. వి. రాసిన ‘గొల్ల రామవ్వ’ కథ తుపాకి మొనలాంటి కథ. ఈ కథ ఒక్కటి సాయుధ పోరాట కథల్లో మందు పాతరలాంటి కథ. కవితాత్మకంగా సాగిన కథ కూడా. ఈ కథ 15 సెప్టెంబర్ 1949లో కాకతీయ పత్రికలో ‘విజయ’ అనే పేరుతో ప్రచురింపబడింది. తర్వాత 1955లో శ్రీపతి చొరవతో పి. వి. నరసింహారావుదని నిర్ధారణ అయ్యింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పలు ప్రసిద్ధ తెలంగాణ కథలను నాటకాలుగా మార్చి ప్రదర్శించడంలో భాగంగా ‘గొల్ల రామవ్వ’ కథను కూడా నాటకంగా మార్చి రవీంద్రభారతిలో ఎన్నో సార్లు ప్రదర్శించింది.

అవి తెలంగాణ అంతటా నిజాం పోలీసులు, రజాకార్లు, భారత యూనియన్ సైన్యాలు విస్తరించి పల్లెలన్నింటిని గజగజ వణికిస్తున్న రోజులు. ప్రజలు భయభ్రాంతులై ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు మూలకు నక్కి నక్కి బతుకులీడుస్తున్న కాలం. కమ్యూనిష్టులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా దళాల్ని నిర్మించి నిజాంకు, దొరలకు, దేశముఖ్ లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజలందరినీ అందులో భాగస్వాములను చేసి సాయుధ పోరాటానికి తెర లేపిన సందర్భం. నిజాం పోలీసుల అరాచకత్వం, విచక్షణ రహిత కాల్పుల వల్ల పల్లెల్లో రాత్రుళ్లు చాలా అలజడిగా గడిచి పోయేవి. వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో ఒకానొక రాత్రి ‘ఢాం…ఢాం.. ఢాం..’ అని మూడు సార్లు తుపాకి పేలిన చప్పుడు వినిపించింది. ఒక్కసారిగా పల్లె అంతటా అలజడి వ్యాపించింది. “ఇంత అలజడి చెలరేగినా బజార్లు మాత్రం నిర్మానుష్యంగా ఉన్నవి. లోపలి నుండి తలుపుల గొళ్ళాలు తీసి చూతామనుకున్నవారి చేతులు కూడా గొళ్ళాల మీదికి పోగానే ఎక్కడివక్కడ జలదరించి నిలిచిపోయినవి. చికాకు వల్ల కీచుకీచుమని అరుస్తూ తత్తరపాటుతో అటూ ఇటూ లేచిపోయే పక్షుల రవం, వాటి రెక్కల తటతట, ఊరి చుట్టూ పెరండ్లలో కుక్కల అరుపు, దొడ్లలో నిశ్చింతగా నెమరు వేస్తున్న పశువుల గిజగిజ, అక్కడక్కడ దొడ్ల కంపను విరగదొక్కి ఊళ్ళో తోచిన దిక్కల్లా పరిగెత్తే దున్నపోతుల గిట్టల రాపిడి- ఇవి మాత్రమే ఆ తదుపరి వినిపించినవి. అంతేగానీ ఒక్కసారి గొల్లుమన్న గ్రామస్తులు మాత్రం అదేదో దివ్య జ్ఞానబోధ కలిగిందా అన్నట్లు మళ్ళీ కిమ్మనలేదు… కిమ్మనలేదు నిజమే కానీ బొడ్డూసిన కూన పర్యంతం ఎవ్వరు నిద్ర కూడా పోలేదు… ఏవో గుసగుసలు… ఏవో సైగలు… ఏవో అసహాయ దృక్కులు… ఏవో వినపడని మొక్కులు… తల్లులు పిల్లలకు  శ్రీరామ రక్ష తీశారు. పిల్లల దడుపుకుపాయాలు యోచించే తల్లులకు తమ దడుపుకే ఉపాయం దొరక లేదు… అదొక విచిత్ర ప్రళయం… అదొక క్షణిక మృత్యు తాండవం, అదొక అస్థిరోత్పాతం…”

ఇట్లా ఒక గంట గడిచింది. ఆ రాత్రి ఆ పల్లెలోని గొల్ల రామవ్వ ఒడిలో తల పెట్టుకొని పడుకున్న వివాహిత అయిన ఆమె మనవరాలు మల్లమ్మ “అవ్వా అప్పడిదేం చప్పుడే” అని అడిగింది. నీకెందుకే మొద్దు ముండా అని గొల్ల రామవ్వ కసురుకుంది. ఇంతలో ఆ గుడిసెకున్న చెదలు పట్టిన కిటికీ తలుపుల్ని బలవంతంగా తెరిచి దాని గుండా ఒక ఆగంతకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. అంతే గొల్ల రామవ్వ, ఆమె మనవరాలు భయ కంపితులయ్యారు. తన ప్రాణం పోవడం, తన మనవరాలి మానం పోవడం ఖాయం అనుకుంది గొల్ల రామవ్వ. ఇప్పుడెవరు కాపాడుతారు? కరణం కూతుర్ని బలాత్కారం చేసి ఎత్తుకుపోతేనే ఎవరేం చేయలేకపోయారు. ఇక మమ్మల్ని కాపాడేదెవరు? అని నానా విధాలా ఆలోచిస్తుంది. విధి లేక ఆ యువకుని కాళ్ళు పట్టుకుంటుంది. కానీ వచ్చిన వాడు తన వల్ల ఏమీ అపాయం లేదని తాను సాటి తెలుగు వాణ్ణేనని స్పష్టమైన తెలుగులో మాట్లాడుతాడు. గొల్ల రామవ్వకు అతని మాటల పైన విశ్వాసం కలుగుతుంది. కాళ్ళు పట్టుకున్నదల్లా పైకి లేస్తూ ఆ అపరిచితుని దేహామంతా తడిమి చూస్తుంది. వాని శరీరమంతా పల్లేరుగాయలు, జిట్టిరేగు ముండ్లు కుచ్చుకొని ఎండిపోయిన రేగటి మన్ను అంటుకొని ఉంటుంది. అంత చీకట్లో కూడా గొల్ల రామవ్వకు చేతులకు ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని గాయాలు రక్తమోడుతున్నాయి. ఆ అపరిచితుడు తనను కొంత సేపు ఇక్కడ దాచిపెట్టమని, తరువాత తన దారిన తాను పోతానని వేడుకుంటాడు. గొల్ల రామవ్వకు పరిస్థితి అంతా అర్థమైంది. వెంటనే తన మనవరాలు మల్లమ్మను పురమాయించి దీపం ముట్టిచ్చి వాని ఒంటి మీది ముళ్లన్నీ తీసివేయించి, సాంత్వన పరిచి కొంచెం గట్కా, సల్లా కలిపి నోటికి అందిస్తుంది.  కొంత తేరుకున్న తరువాత తను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ను అని, నైజాం రాజుతోని స్టేట్ కాంగ్రెస్ తో పాటు ప్రజలు కూడా పోరాడు తున్నారని చెప్తాడు. నీకెందుకురా పోలీసోళ్లతోని కైలాట్కం మీ పార్టీలో పెద్ద పెద్ద నాయకులంతా ఏమైండ్రు? అని ప్రశ్నించి సరేగాని కొద్ది సేపు కన్ను మలుపుకో అంటుంది.

తెల్లవారుతోంది… ఆ యువకుడు తప్ప గ్రామంలో ఎవరూ నిద్ర పోలేదు. ఊరంతా ఊపిరి బిగపట్టింది. కొద్ది సేపటికి కాంగ్రెస్ వాలంటీర్లను వెతుక్కుంటూ పోలీసులు రానే వచ్చారు. యువకుడు దిగ్గున లేచి కూర్చొని తన రివాల్వర్ తో బయటకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ గొల్ల రామవ్వ వెళ్ళనీయదు. ఈలోపే పోలీసులు గొల్ల రామవ్వ గుడిసె తలుపుల మీద దబ దబ బాదుతుంటారు. వెంటనే గొల్ల రామవ్వ ఆ యువకునికి గొల్ల వేషం వేయించి ఓ మూలకు పడుకోమని చెప్తుంది. తన మనవరాలు మల్లమ్మను కూడా ఆ యువకుని పక్కనే పడుకోమని చెప్తుంది. తలుపు మీద చప్పుడు ఇంతకింత పెరిగిపోతుంది. అంతా సర్దుకున్నాక గొల్ల రామవ్వ తిట్టుకుంటూ తలుపు తీస్తుంది. తనలో తాను మాట్లాడుకుంటూ చంపుతే? చంపుండ్రి. ఇంకా బతికినన్ని రోజులైతే బతకను. నన్నే కాదు అక్కడ పడుకున్న ఇద్దర్ని కూడా ఒకేసారి చంపుండ్రి అంటుంది. పోలీసోళ్ళు ఆ యువకుని వంక చూసి “వాడెవడు? కాంగ్రెసోడా యేం?” అని ప్రశ్నిస్తారు. ఎవన్ని పడితే వాణ్ని పక్కలో పడుకోబెట్టుకోవడానికి మేమేమన్న బోగమోల్లమనుకున్నవా? నిన్ను గిట్లే అడిగితే ఊకుంటావా? అని ప్రశ్నిస్తుంది. పోలీసోళ్ళకు ఏం మాట్లాడాలో అర్థం కాక బిత్తర పోయి వెళ్లిపోతారు.

“అవ్వా నీవు సామాన్యురాలువు కావు. సాక్షాత్ భారత మాతవే!’ అన్నాడు యువకుడు భావలీనతతో కడ్లు మూసి.”

“దోడ్త్! కొంటె పోరడా! నాకే పేర్ల బెడుతున్నావ్? నా పేరు గొల్ల రామి! గంతే! ఇగ నువ్వెల్లు… మల్లిని అత్తోరింటికి తోలుకపోతా.. పొద్దెక్కుతాంది. ఊ యెళ్ళు…” అంటుంది.

కథంతా అయిపోయిన తరువాత మన చేతిలో కథ ఉండదు. కథ చేతిలోనే మనం ఉండిపోతాం. లౌకిక ప్రపంచంలో కాక కథలో మనం కూడా ఒక అదృశ్య పాత్రగా కథ వెంట ఉద్విగ్నంగా సాగిపోతాం. కథ సాంతం అయిపోయేదాకా గుండె చెరువు గట్టు మీద నిలబడి రక్తం ఊపిరి బిగపట్టి చూస్తుంది. కథంతా పూర్తయిపోయిన తరువాత కూడా కథ తాలూకు ప్రకంపనలు మన నరాల్లో అలాగే మిగిలిపోతాయి. కథ, వర్ణన, వాతావరణ కల్పన, సంభాషణలు, పాత్రల ప్రవేశ, నిష్క్రమణలు, సన్నివేశకల్పన అన్నీ ఎంతో సహజంగా నడుస్తుంటాయి.  నవలంతటి పెద్ద కాన్వాస్ మీద రాయాల్సిన కథను పి. వి. చాలా గాఢంగా, క్లుప్తంగా రాసి కథా లక్షణాల్ని చాలా గొప్పగా పాటించారు. ఏ కాలంలోనైనా ఉద్యమకారుల్ని ప్రజలెంతగా కడుపులో పెట్టుకొని చూసుకుంటారో చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ. ధైర్యం, తెగువ, అమాయకత్వం, సమయస్ఫూర్తి, విషమ పరిస్థితులను అధిగమించే నేర్పు తెలంగాణ ప్రజల నెత్తురులో ఎలా కల్సిపోయి ఉంటాయో కూడా అర్థం అవుతాయి గొల్ల రామవ్వ పాత్రలో. తన ప్రాణాల్ని, మనవరాలి శీలాన్నీ ఫణంగా పెట్టి ఒక పోరాట వీరుడ్ని కాపాడుతుంది గొల్ల రామవ్వ. తెలంగాణ తెలుగును పుక్కిట పట్టిన భాషామతల్లి ఈమె. ఈ పాత్ర నిర్మాణంలోనే కథ విజయమంతా దాగి ఉంది. నిగమశర్మ అక్కకు తెనాలి రామకృష్ణుడు పేరు పెట్టనట్టే ఈ కథలోని యువకునికి కూడా పి. వి. పేరు పెట్టలేదు. గొల్ల రామవ్వే ఆ యువకుడ్ని ‘కొంటె పోరడా!’ అంటుంది. కథలోని మరో పాత్ర గొల్ల రామవ్వ మనవరాలు మల్లమ్మ. ఈ పాత్ర లేకుండా కూడా కథ నడిపించొచ్చు కానీ ఈ పాత్ర వలన కథకు మరింత నాటకీయత, జీవం కలిగాయి. ఆనాటి  తెలంగాణలో నెలకొని ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను వర్ణించడంలో రచయిత నూటికి నూరు పాళ్ళు కృతకృత్యులయ్యారు. కథ ఎత్తుగడలోనే అప్పటి వాతావరణం తొంగి చూస్తుంది. కథలోని యువకుని వద్ద ఒక రివాల్వర్ ఉంటుంది. దాన్ని చూసి గొల్ల రామవ్వ “ఎందుక్కొడుకో తుపాకీ! మమ్మల్ని గిట్ల చంపుదామనుకున్నవా యేంది?” అంటుంది. లేదవ్వా! మిమ్మల్ని చంపే వాళ్ళను చంపేందుకది. ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హతమార్చాను. మొన్న మీ గ్రామంలోని నలుగురు నిర్ధోషుల్ని కాల్చి చంపిన పోలీసుల్నే” అంటాడు. “ఇద్దరా?? కానీ ఇంకిద్దరు మిగిలిన్రు కొడుకా! సగం పనే చేసినవు” అని అనడంలో గొల్ల రామవ్వ పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది. కథ కొనసాగిన శైలీ, శిల్పం, వాడిన భాష పాఠకుడిని కట్టిపడేస్తాయి. కథలో తుపాకీ ఉంటే కథ పూర్తయ్యేలోపు అది పేలాలంటాడు చెకోవ్. ఈ కథ తుపాకీ పేలుడుతోనే ప్రారంభమవుతుంది. సాయుధ పోరాటంలో బీసీలు ఎంతగా మమేకమయ్యారో ఈ కథ చూపెడుతుంది. తెలంగాణ కథ శిల్ప ఔన్నత్యానికి, భాషౌన్నత్యానికి, పి. వి. రచనా పటుత్వానికి ఈ కథ ఒక మచ్చు తునక. సాయుధ పోరాట కథల్లో ఈ కథ ఒక ఎగరేసిన ఎర్రని జెండా.

                                                                           *

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • ఏ ఉద్యమంలోనైనా పాటలదే ప్రధాన పాత్రగా ఉంటుంది.. దానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా మినహాయింపు కాదు.

  • ఈ వ్యాసం తో కథా సాహిత్యానికి కొత్త నిర్వచనం అందింది.

    గొల్ల రామవ్వ కథను వెలికి తీసిన విధం చెప్పడం ఆసక్తి కలిగించింది.

    అద్భుతమైన విశ్లేషణ. ఆసక్తి కరమైన కథనానికి ఆత్మ ల సంఘర్షణ ను‌ ఆవిష్కరించారు.

    well done వెల్దండ గారు.

    పత్రికకు కృతజ్ఞతలు.

  • కథా విశ్లేషణ చాలా బావుంది. మాజీ భారత ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావుగారు ఈకథను రాశారని తెలియడం, ఆకథ తెలంగాణా సాయుధ పోరాటానికి చెందినదై గొప్పగా ఉండడం విశేషం. శ్రీ వెల్దండి శ్రీధర్ గారు కథను, మంచి విశ్లేషణను చక్కగా మిళితం చేసి పాఠకులకు దాన్ని ప్రత్యక్ష అనుభవంలోకి తీసుకొచ్చారు. తద్వారా వాళ్లలో మనసుల్లో దానికొక స్థానం కల్పించారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. కథా కచ్చీరుకై సారంగకు ధన్యవాదాలు.
    – డా.కే.వి.రమణ రావు

  • రాసిన ఒక్క కథతోనే తెలుగు కథా సాహిత్యంలో శిఖరాయమానమైన కీర్తినీ, ప్రాచుర్యాన్ని పొందిన బహుభాషావేత్త, ఏ సమస్యనైనా మౌనంతోనే పటాపంచలు చేసే అపర చాణక్యుడు, భారత మాజీ ప్రధానమంత్రి పి. వి. నరసింహారావు.

    శ్రీధర్ గారూ, కథానిలయంలోనే పీవీ రాసిన ఇన్ని కథలున్నాయి.

    http://www.kathanilayam.com/writer/852?sort=katha

  • ప్రపంచ పోరాటాల చరిత్రలో సువర్ణాక్షరాల్లో రాయదగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపధ్యము లో పి. వి. నరసింహారావు గారు రాసిన మేలిమి కథ “గొల్ల రామవ్వ ” కథను; . . . . ఏ కాలంలోనైనా ఉద్యమకారుల్ని ప్రజలెంతగా కడుపులో పెట్టుకొని చూసుకుంటారో ఒక ఉదాహరణగా చూపిన కథను పరిచయం చేసిన శ్రీధర్ వెల్దండి గారికి ధన్యవాదాలు.

  • గొల్ల రామవ్వ కథ గురించి ఎవరు చెప్పినా ఒళ్ళు పులకరిస్తుంది. శ్రీధర్ గారి విశ్లేషణ కథకు మరింత తావిని అద్దింది. తేనెలూరే ఉత్తర తెలంగాణాన్ని రామవ్వ స్వరంలో నింపి రసానుభూతి కలిగించారు. కేవలం ఆ మాండలికం కోసమే పలు మార్లు కథను చదువుతాను. గ్రేట్ స్టోరీ ! థాంక్యూ శ్రీధర్ గారూ !

  • ” ధాంక్యూ తహిరో గారూ” అని కాకుండా ” ధాంక్యూ గొరుసన్నా ” అని మీరంటే ( తెలంగాణా మాండలీకం లో అద్భుతమైన గజయీతరాలు కధలు రాసిన గొరుసు జగదీశ్పర రెడ్డా అని మీరంటే ) మాలాంటి నేలక్లాసు పాఠకులకు కూడా సానా సంబురమైతది డా. శ్రీధర్ వెల్దండి గారూ. జమ్మిచెట్టు మీద దాచిన తన కలాన్ని గొరుసన్న ఇంకా తీయకున్నా, కాలం నాడు తను పాఠకుల గుండెలకు చేసిన ‘కొన్ని గాయాలు ఇంకా రక్తమోడుతున్నాయి’ పాలమూరు వలసపక్షుల సాచ్చీకంగా.

  • “గొల్ల రామవ్వ” కథ పరిచయ చేసిన మీకు ధన్యవాదాలు, శ్రీధర్‌గారు! ఇప్పటిదాకా నాకు తెలియని చాలా విషయాల్లో పి.వి.నరసింహారావుగారు కథలు రాస్తారన్న విషయం ఒకటని నాకిప్పుడే తెలిసింది. కథలో సంభాషణలు మాత్రం మాండలికంలో వుండడం బాగా నచ్చింది – నాకు చదివి అర్థం చేసుకోవడానికి సులువుగా అనిపించింది. మీ విశ్లేషణ చదివిన తర్వాత కథ చదవడంతో కథ ఇంకా బాగా నచ్చింది. మొత్తానికి నాకు గొల్ల రామవ్వ చాలా చాలా నచ్చింది. నిజంగా అలాంటి మనిషుంటే ఒకసారి వెళ్ళి కలవాలనేంతగా.

  • మంచి విమర్శన వ్యాసం
    శ్రీధర్ గారికి ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు