ఎక్కడో ఒకచోట

ఎక్కడో ఒకచోట

1

ముద్రపు అలల్లాగా ఎగసిపడుతున్న ఆలోచనలు

ఎక్కడో ఒకచోట నిన్ను చూడగానే

భారంగా వెనక్కి వెళ్లిపోతాయి.

 

రెక్కలు లేకున్నా తేలికగా ఎగురుతున్న మనసుకి

ఎక్కడో ఒకచోట నీ తాలూకు అక్షరం

వేటగాడు గురి చూసి కొట్టిన బాణంలా తగులుతుంది.

ఒక్కసారిగా  రెక్కలు రెండు విరిగిపోయి

పాతాళంలోకి కూరుకుపోతాను.

 

ప్రవాహంలా సాగుతున్న ప్రయాణంలో

ఎక్కడో ఒకచోట నీ గుర్తులు

పెద్ద రాళ్ళ వాన కురిసినంత అలజడి సృష్టిస్తూన్నప్పుడు

నాటి వెచ్చదనపు జ్ఞాపకాలతో

నేడు ఒళ్ళంతా తడిగా మారుతుంటే

మౌనంగా నిల్చుంటాను.

 

నాలోన ఒక నిశబ్ద యుద్ధం  మొదలవుతుంది.

ఒక్కసారిగా గతమంత కళ్ళముందు కొస్తుంది.

జ్ఞాపకాల గుర్తులన్ని పోగుచేసి

మళ్లీ తెరవకూడదంటు

అటక మీద దాచిపెట్టిన అట్ట డబ్బాని తెరవాలనిపిస్తుంది.

 

అడుగు తీసి అడుగు వేస్తుంటే

మోయలేనంత బరువుగా అనిపిస్తుంది.

 

అట్ట డబ్బాని ముట్టగానే

దానిమీద పేరుకుపోయిన దుమ్మంతా

చేతివేళ్ళకు అంటుకుంటుంది.

 

తుడుచుకోవడానికి మనసు ఒప్పదు

తెరవడానికి ధైర్యం సరిపోదు.

 

తెరవలెక జ్ఞాపకాల డబ్బాని

అలాగే అటక మీద పెడుతుంటే

బరువు మాత్రం గతం కంటే  ఇంకా పెరిగినట్టు

ఈ సారి మరింత స్పష్టంగా  తెలుస్తుంది.

*

కాగితపు పడవల్లా

 

ఎప్పుడు పుట్టిందో తెలీదు

కానీ వయసులో మాత్రం నాకంటే పెద్దదని అనిపిస్తుంటుంది.

 

చీకటి పల్చగా మొదలై

చిక్కనవడంతో మా రోజులు మొదలయ్యేవి

డాబా మీద వెల్లకిలా పడుకొని

ఆకాశం నుండి జారిపోతున్న చుక్కల సాక్షిగా…

ఎన్నోసార్లు నిశితంగా  గమనించాను…

అర్థం చేసుకోవాలని ప్రయత్నించాను …

 

వెన్నెల రాత్రుల్లో చెప్పడం మొదలెట్టేది

చెప్పిందే చెప్పేది, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పేది

చెబుతూనే నవ్వేది, నవ్వుతూనే చెప్పేది

తను చెబుతుంటే నే చంటి పిల్లాడిలా మారగా

నా కళ్ళని మెరిసేవి, మెరుస్తూనే  తడిసేవి

 

నా మౌనంలోని మాటలన్ని చెవులు రిక్కించుకొని మరీ వినేది

నా అంతరంగాల్లోని ప్రశ్నల వర్షానికి

తెరచాప పరిచి ఓదార్పునిచ్చేది

 

నే ఆకాశానికి నిచ్చెన తో బాట వేస్తే

ఎర్ర చందనం ముక్కల్లా మారిన పాదాలతో

ఒక్కొక్క మెట్టు పైకెక్కాలని  ప్రయత్నించేది

 

వర్షంమంటే తనకెందుకoత ఇష్టమో తెలీదు

వర్షమొస్తే తనని మరిచిపోయి ఆడేది పాడేది

ఎన్నాళ్ళో నుండో తనలో  అనుచుకున్న భాదనంత వర్షపు చినుకుల్లో కలిపేసేది

 

కాలం గడుస్తున్నా కొద్దీ తన సాంగత్యంలో

మనసుకు కలిగిన సాంత్వన మాత్రం మరచిపోలేను.

 

జ్ఞాపకాలన్నీ బుగ్గల మీద నుండి జారుతూ

కాగితపు పడవల్లా వాన నీటిలో తేలుతూ

ప్రవాహంలో కొట్టుకుపోతుంటే

ముక్కలుగా ముక్కలుగా చినిగి మునిగిపోతూ ఉంటే

కళ్లార్పకుండా చూస్తూ

కాలాన్ని ముందుకు వెళ్ళనీయడం తప్ప

ఇంకేం చేయగలను…??

*

నా పేరు శ్రీపతి పవన్, భాగ్య-లక్ష్మీ నారాయణ గార్ల రెండో కొడుకును. కరీంనగర్ ( జగిత్యాల) జిల్లాలోని సహజమైన గ్రామీణ వాతావరణంలో పుట్టి  పెరిగాను. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక ఇబ్బందుల్ని కాస్త తొందరగా  అధిగమించాలనే ఉద్దేశ్యంలో భాగంగా వ్యవసాయ వృత్తి విద్యని ఎంచుకొని ప్రస్తుతం అదే శాఖలో విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాను.కేవలం చదువు మాత్రమే దిగువ మధ్య తరగతి జీవితాల ముఖ చిత్రాల్ని మార్చి ఒక కొత్త తరానికి పునాదులు వేస్తుందని చేయాలనుకున్న దాని పట్ల దృఢ నిశ్చయం,నిబద్దత,  కష్టపడే తత్వమే మనల్ని  ఒకరోజు మనల్ని మంచి స్థాయిలో  నిలబెడుతుంది అని నమ్ముతాను. సాటి మనుషుల పట్ల ప్రేమ,అభిమానం, ఆప్యాయత
సాటి జీవుల పట్ల దయ ,కరుణ,స్పందించే గుణం సమాజం పట్ల అవగాహన, మనవంతు తోడ్పాటు, బాధ్యత ఈ లక్షణాలే అనాగరికం నుండి నాగరిక మనుషులుగా మారుస్తాయి,రక్త మాంసపు ముద్దల నుండి పరిపూర్ణమైన మనిషిగా రుపుదిద్దుతాయని విశ్వసిస్తాను.
సాహిత్యంతో పరిచయానికి ముందు-తర్వాత నాలో మార్పు అనేది నాకు స్పష్టంగా తెలుస్తుంది.
సాహిత్యంలో  నాలో ఎన్నో కోత్త ప్రశ్నలు రేకెత్తించింది పాత ప్రశ్నలకి సమాధానాలు దొరికేలా చేసింది.
కొన్నిసార్లు తీవ్రమైన అలజడి, సంఘర్షణలకి లోను చేస్తే ఇంకొన్ని సార్లు ఎవరు ఇవ్వలేని సాంత్వనని ఇచ్చింది. సమాజాన్ని, సమాజంలోని మనుషులని చూసే, అర్థం చేసుకునే విధానంలో మార్పుల్ని తీసుకొచ్చింది. ఆలోచనల్లో పరిణితిని,అభిప్ర్రాయాల్లో నమ్మకాన్ని తీసుకొచ్చింది.

శ్రీపతి పవన్

2 comments

Leave a Reply to Anusha Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు