ఉర్దూ నుంచి నేరుగా మంటో…

ఉర్దూ నుంచి తెలుగులోకి సాహిత్యానువాదాలు చేయడంలో మెహక్ హైదరాబాదీ సుప్రసిద్ధులు. సీనియర్ పాత్రికేయుడిగా వివిధ  దినపత్రికల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో డిప్యూటి న్యూస్ ఎడిటర్ హోదాలో ఉన్నారు. ప్రఖ్యాత ఉర్దూ సాహితీవేత్త జిలానీ బాను కథలను గతంలో తెలుగులోకి అనువదించి రెండు సంపుటాలు ప్రచురించారు. తెలుగు సేతకి ఉర్దూ నుడికారపు మాధుర్యాన్ని జోడించడంలో అందెవేసిన కలం ఆయనది. ఇప్పుడు మళ్ళీ సాదత్ హసన్ మంటో కథలను ఉర్దూ నుంచి తెలుగులోకి అనువదించారు. నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన ఈ కథల సంపుటి ప్రత్యేకత గురించి, ప్రస్తుత తరుణంలో మంటో సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత గురించి మెహక్ హైదరాబాది మాటల్లోనే తెలుసుకుందాం.

*

 సాదత్ హసన్ మంటో కథలను ఇపుడు కొత్తగా తీసుకురావడానికి కారణం, ప్రేరణ ఏమిటి?

మంటో స్వాతంత్ర  కాలం నాటి ప్రముఖ ఉర్దూ రచయిత. మతపరంగా భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన అభ్యుదయ కథకుల్లో అగ్రగణ్యుడు. ఆయన అనువాద కథలు తెలుగులో ఇప్పటికే  రెండు,మూడు సంకలనాలు వచ్చాయి. కొన్ని కథలు మ్యాగజీన్లలో కూడా అచ్చయ్యాయి. అయితే వాటి గురించి నేనేమీ వ్యాఖ్యానించను. మంటో కథలను ఉర్దూ నుంచి నేరుగా అనువదిస్తే బాగుంటుందని మందలపర్తి కిషోర్, రెంటాల జయదేవ, మెహెర్ వంటి సాహితీ మిత్రులు సూచించడంతో దీనిపై దృష్టి పెట్టాను. అంతేకాదు, సాదత్ కథా సాహిత్యం తెలుగులో రావాల్సిన స్థాయిలో విస్తృతంగా  రానందున ఈ పని సంకల్పించాను.

మంటో అద్భుతమైన కథలు రాయడంతోపాటు, అంతేస్థాయిలో వివాదాస్పద కథలు కూడా రాశాడు. కొన్నింటిని ప్రభుత్వాలు నిషేధించగా, కొన్నింటిపై కోర్టు కేసులు నడిచాయి. ఈ తొలి సంకలనంలో వేటికి ప్రాధాన్యమిచ్చారు?

సాదత్ తన 42 ఏళ్ళ చిన్న జీవితంలో పెద్దవీ, చిన్నవీ కలిపి సుమారుగా 300 కథలు రాశాడని ఒక అంచనా. మంటోని చాలామంది విభజన విషాద కథకుడుగానే  చూస్తారు. పాకిస్తాన్ లో అయితే అతనిపై ‘అశ్లీల’ రచయిత అన్న ముద్ర వేశారు. మంటో కథా సాహిత్యాన్ని స్థూలంగా ఏడు కేటగరీలుగా వర్గీకరించవచ్చు. విభజన కథలు, వేశ్యల కథలు, మానవ స్వభావ కథలు, సంవాద కథలు, హాస్య,వ్యంగ్య కథలు, ప్రేమ కథలు, బొంబాయి స్టోరీలు.  అతను రాసిన వాటిలో ఆరు కథలపై ‘అశ్లీల’ సాహిత్య అభియోగాలు మోపి కోర్టులలో కేసులు వేశారు. ఒక కేసులో కోర్టు జరిమానా కూడా విధించింది. నా తొలి సంకలనంలో అన్ని రకాల కథలనూ చేర్చాను. మంటోని కోర్టుల చుట్టూ తిప్పిన ఆరింటిలో మూడు వివాదాస్పద కథలు(‘వాసన’, ‘సకీనా…ఓ సకీనా…’, ‘పైనా…కిందా…మధ్యలో’) కూడా ఇందులో ఉన్నాయి. అయితే, మానవ స్వభావం, మానవ సంబంధాల కథలకు అధిక ప్రాధాన్యమిచ్చాను. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, రిటైర్డు ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ దీనికి ముందుమాట రాశారు. ఆయనీ మధ్యనే పోయారు. మంటో కథా సంకలనం అచ్చు కావడం ఆనందం కలిగిస్తే, ముందు మాట రాసిన నరేంద్ర లూథర్ పుస్తకం చూడకుండానే కన్నుమూయడం బాధను మిగిల్చింది.

మంటో అనువాద కథలు ఇప్పటికే ఇంగ్లిషు, హిందీ భాషలలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. తెలుగులోనూ కొన్ని అచ్చయ్యాయి. ఇంటర్నెట్, ఇతర మీడియాలోనూ వచ్చాయి. మరి మీరు అనువదించిన కథలకు ఒరిజినల్ ఉర్దూ వెర్షన్ ను ఎక్కణ్ణుంచి తీసుకున్నారు?

సాదత్ మంటో అనువాదకులు తమ అభిరుచి మేరకు రకరకాల పేర్లతో ఇంగ్లిషు, హిందీలో కథా సంకలనాలు ప్రచురించారు. ఆయన  సాహిత్యం ఇపుడు చాలా విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. తెలుగులో మాత్రం కాదు. ఉర్దూ వ్యాప్తికి ఎంతో కృషి చేస్తున్న ‘Rekhta’ పోర్టల్ అయితే మంటో చాలా కథలను తన పోర్టల్ లో పెట్టింది. 98.3 ఎఫ్.ఎం. రేడియో మిర్చిలో ‘ఏక్ పురానీ కహానీ’ పేరుతో visualsతో  అనేక కథలు ప్రసారమయ్యాయి. ఖుష్వంత్ సింగ్, ఆకార్ పటేల్, ఆతిష్ తాసీర్ వంటి ప్రముఖులు కూడా ఇంగ్లిష్ లోకి కొన్ని అనువాదాలు చేశారు. ఆయన జీవిత చరిత్రఫై ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.  కొందరు కొన్ని కథలఫై షార్ట్ ఫిల్ములు నిర్మించారు. cinematic angleలో  కొందరైతే మూల కథను మార్చి అదనపు జోడింపులు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కథల ఇతివృత్తాలతో నాటికలు ప్రదర్శించారు. ఇంటర్నెట్ వేదికగా కొంతమంది ఉర్దూ సాహితీవేత్తలు కథా పఠనం చేశారు. నిజానికి మంటో తెచ్చిన ఒరిజినల్ ఉర్దూ పుస్తకాలు ఇపుడు పాత  లైబ్రెరీలలో తప్ప బయట దొరకడం లేదు. ఝార్ఖండ్ లోని వినోబా భావే యూనివర్సిటీ లో ఉర్దూ ప్రొఫెసర్ డాక్టర్ హుమాయూన్ అష్రఫ్… సాదత్ హసన్ మంటో సాహిత్యంపై ఎంతో పరిశోధన చేసి ‘కులియతే మంటో ‘ (మంటో కథా సర్వస్వం) పేరుతో మూడు భారీ గ్రంథాలు తెచ్చారు. దిల్లీ లోని ఎడ్యుకేషనల్ పబ్లిషింగ్ హౌస్ ఈ సంపుటాలను ప్రచురించింది. ఒక్కొక్క సంకలనంలో సుమారు 90 చొప్పున మొత్తం 270కి పైగా కథలు, మినీ కథలతో పాటు, ఆయన జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఎంపిక చేసిన  27 కథలతో తొలి సంపుటిని నవచేతన పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది. హుమాయూన్ అష్రఫ్ సంకలనం చేసిన పుస్తకాలలోని కథలను ప్రామాణికంగా తీసుకోవచ్చు.

మంటోఫై ఎవరి ప్రభావం ఉంది? కథా వస్తువు, శిల్పం విషయంలో ఆయన అనుసరించిన పంథా వివరించండి?

ఇరవై ఏళ్ల వయసులో మంటోకు ప్రముఖ రచయిత అబ్దుల్ బారి అలీగ్ తో పరిచయమయ్యింది. ఆయన ప్రోత్సాహంతో మంటో రష్యన్, ఫ్రెంచ్ సాహిత్యాన్ని బాగా చదివాడు. ఫ్రెంచ్ రచయిత  విక్టర్ హుగో రాసిన ‘The last day of a Condemned Man’ నవలను ఉర్దూలోకి అనువదించాడు. 1934లో అలీగఢ్  ముస్లిం యూనివర్సిటీలో చేరిన మంటో భారత అభ్యుదయ రచయితల సంఘ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. అక్కడే అలీ సర్దార్ జాఫ్రీతో పరిచయం. ఆయన ప్రభావంతో రాసిన  ‘ఇంక్విలాబ్ పసంద్’ కథ ఆ వర్సిటీ మ్యాగజీన్ లో అచ్చయ్యింది.

ఇతివృత్తం, కథా సంవిధానం, పాత్ర చిత్రణలో ఇతర ఉర్దూ రచయితలతో పోల్చితే మంటో ప్రత్యేకత ఏంటి?

సాదత్ మంటో కథా వస్తువు చాలా భిన్నంగా ఉంటుంది. నిజానికి అతని కథా కాన్వాస్ ఎంతో విస్తృతమైనది. సమాజంలో తాను పరిశీలించిన ప్రతి అంశంపైనా రచనలు చేశాడు.  ప్రేమ, ద్వేషం, అసహ్యం, అందం, కురూపం, కపటత్వం, మోసం, ఆత్మ వంచన, ఆదర్శం, ఆచరణ… ఇలా అన్నింటిపైనా కథలు రాశాడు. హిందూ, ఇస్లాం మతాలలోని దొంగ స్వాములనూ, బురిడీ బాబాలనూ, నకిలీ పీర్లనూ, దైవం పేరిట వారు  చేసే మోసాలను, ప్రేమ, శృంగార విషయాలలో స్త్రీ, పురుషుల మధ్య ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టాడు. ఆద్యంతం పాత్రల పేర్లు లేకుండా కేవలం సంభాషణలతో కథను రక్తి కట్టించడంలో ఆతను చేయి తిరిగిన రచయిత. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆసక్తికర సంవాదాలతో మంటో కొన్ని ‘సంసారపక్ష’ కథలు కూడా రాశాడు. కుక్కలు, ఎలుకలు, దొంగలు, ఆడాళ్ళు వేసుకునే జాకెట్లు, బాత్రూమ్ లో జరిగే ఘటనలు, అవినీతి, లైంగిక దోపిడీ ఇలా అన్నింటిపైనా కథలు రచించాడు. సామాజిక కట్టుబాట్లు, శారీరక వాంఛల నడుమ మనిషి ఘర్షణను చిత్రిక పడతాడు. కొన్ని కథల ద్వారా పాఠకుడిని తనలో తననే తొంగి చూసుకునే పరిస్థితి కల్పిస్తాడు. విభజన విషాదం, హిందూ-ముస్లింల మధ్య సంబంధాలు, వేశ్యల కథలతోపాటు మద్యం, మగువ, డబ్బు, మనుషుల్లోని విపరీత ధోరణులు, మానసిక సమస్యలపై కథలు రాశాడు. ప్రధానంగా సాదత్ కథనం ఉత్తమ పురుష(First Person)లో సాగుతుంది. పాఠకుడితో నేరుగా సంభాషిస్తూ  చెపుతున్నట్టు ఉంటుంది. కొన్ని కథలలో ధైర్యంగా తన పేరుతోనే పాత్రను సృష్టించుకున్నాడు. చిన్న వాక్యాలతో, అద్భుతమైన వర్ణనలతో, బిగువైన కథనంతో అతని శైలి పాఠకులను ఉరకలెత్తిస్తుంది. కథను కడదాకా చదివిస్తుంది.

మంటో కథలను అనువదిస్తున్నప్పుడు మీలో ఎలాంటి భావాలు ముప్పిరిగొన్నాయి? మీకు కలిగిన కొత్త ఎరుక ఏంటి?

ఈ కథలను నేనెంతో passion గా, సీరియస్ గా అనువదించాను. అత్యాధునిక భావాలు, విశిష్ట  శైలి గల మంటో భాషాపరంగా చాలా పాత ఉర్దూను రాశాడు. అందులో కొన్ని పదాలు ఇప్పుడు వాడుకలో లేవు. నిఘంటువులలో కూడా అర్థాలు దొరకవు. ఉర్దూ కథలలో పంజాబీ పదాలూ  ఎక్కువే. ఈ పని పెద్ద సవాలుగా అనిపించింది. వీటి కోసం చాలామందిని సంప్రదించాను. ఉర్దూ నుడికారాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోడానికి ఇది ఉపకరించింది. సాదత్ కథలు చదవడమంటే  చరిత్రతో సంభాషించడమే! భారత ఉపఖండ రాజకీయాలు, సమాజాలు, మనుషుల గురించి తెలుసుకోవడమే! పాఠకుడు  పాకిస్తాన్ వెళ్లకపోయినా పాక్ దర్శనం చేయిస్తాడు. మంటో బతికున్నప్పుడు వెలి వేసిన పాకిస్తాన్ పౌర సమాజం, ప్రభుత్వాలు, కోర్టులు  చాలా కాలం తర్వాతనే అతని గొప్పతనాన్ని గుర్తించాయి. ఆ విషయానికి వస్తే భారత్ లోని  ఉదారవాద సమాజం పాక్ కన్నా ఎంతో ముందు ఉందని చెప్పొచ్చు.

 రచయితగా మంటో దృక్పథం అతని కథలలో ఎలా ప్రస్ఫుటమయ్యింది?

సమాజం పట్ల చిత్తశుద్ధి, మనుషుల ఆలోచనా ధోరణులపై ఎంతో అవగాహన ఉన్న మంటో తనకు నచ్చిన పంథాలోనే రచనలు చేశాడు. అనేక ప్రచురణ సంస్థలు అచ్చు వేయడానికి నిరాకరించినా, తన పధ్ధతిలోనే రాశాడు. ‘నా కథలు అసహ్యంగా, రోత పుట్టించే విధంగా ఉంటే, మీరు ఆ రోత సమాజంలో ఉన్నట్లే’ అని తన రచనల గురించి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. కథ చెప్పడంలో ఏనాడూ రాజీ పడలేదు. దేశ విభజన నేపథ్యంలో మత కలహాలు మొదలుకొని బొంబాయి కథలదాకా అన్ని రచనలలోనూ అతని భావజాలం స్ఫుటంగా కనిపిస్తుంది.

 మంటో సాహితీ జీవితం ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది?

మంటో కథలలో ఎలాంటి సందేశాలూ, ఉపదేశాలూ, సూక్తులూ, నీతులూ ఉండవు. తాను రాయాలనుకున్నది రాసేశాడు. అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత! ఇక ఎస్టాబ్లిష్ మెంట్ ను ఎదిరించిన వారికి, సంప్రదాయ,మూఢ సమాజాన్ని ధిక్కరించిన వారికి కష్టాలు తప్పవు. రచయితగా మంటో ఈ బాధలన్నీ పడ్డాడు. సాహితీ జీవితంలో అతను చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. రాడికల్ దృక్పథంతో రచనలు చేసేవారికి ఈ ఎదురుదెబ్బలు సహజమే!

మంటో 20 శతాబ్దపు రచయిత. దాదాపు 70 ఏళ్ళ క్రితం నాటి ఆయన కథలను ఇపుడు మళ్ళీ ఎందుకు చదవాలి?

నిజమే! భారత్ విభజన, ఆ తర్వాత సాగిన హిందూ-ముస్లిం మత కలహాలు, దారుణ హింసాకాండకు తీవ్రంగా చలించి సాదత్ హసన్ మంటో రచనలు చేశాడు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడాన్ని అతను బాగా వ్యతిరేకించాడు. మహమ్మద్ అలీ జిన్నాపై మంటోకు ఉన్న contempt కొన్ని కథలలో స్పష్టంగా కనిపిస్తుంది. 1947లో రగిలిన రావణ కాష్ఠం భారత్-పాకిస్తాన్ ల మధ్య ఇంకా ఆర లేదు. హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలు, అపోహలు, అపనమ్మకం కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దులలో ఉద్రిక్తతలు సరేసరి. కేంద్రంలో బీజేపీ పాలనలో గత ఏడేళ్ళుగా సంఘ్ పరివార్ అజెండా జోరుగా అమలవుతోంది. అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు, తక్షణ తలాక్, పౌరసత్వ సవరణ చట్టాలు, జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, మూక హత్యలతో ఈ దేశంలోని  ముస్లింలు మున్నెన్నడూ ఎరుగని విధంగా అభద్రతా భావనలో ఉన్నారు. దేశ విభజన, మూడు యుద్ధాలు భారత్, పాకిస్తాన్ లకు పరిష్కారం చూపకపోగా, సమస్యలను మరింత సంక్లిష్టం చేశాయి. మంటో మహాశయుడు భయపడినదంతా అయ్యింది. ఈ నేపథ్యంలో అతని కథలు స్వాతంత్ర సమర కాలంకన్నా ఇపుడే ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మంటో కాలంకన్నా ముందు నడిచిన రచయిత!

ప్రశ్న: మీ భవిష్యత్తు ప్రణాళికలేంటి? మరిన్ని అనువాదాలు చేయనున్నారా?

జవాబు: మంటో కథలను మరిన్ని తర్జుమా చేసి ఇంకో రెండు సంపుటాలు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఉర్దూలోని  మంచి కథా సాహిత్యాన్ని తెలుగువారికి అందించాలన్న ఆలోచన ఉంది.

*

ఒమ్మి రమేష్ బాబు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ” దేశ విభజన నేపథ్యంలో మానవీయ కోణంలో మంటో రాసిన కథలు దిగ్భ్రమ కలిగిస్తాయి. అధికారం, మతం ఎంత క్రూరంగా ఉంటాయో మనిషి ఎన్ని భిన్న స్వభావాల సమాహారమో చెప్పాలంటే మంటోని చదవాలి ” ”

    ఆధునిక ఉర్దూ కథా సాహిత్యానికి మూల స్తంభాలయిన నలుగురు రచయితలలో ఒకరైన సాదత్ హసన్ మంటో ( ఇస్మత్ చుగ్తాయి, కిషన్ చందర్, రాజిందర్ సింగ్ బేడి మిగిలిన ముగ్గురు ) కథలను ఉర్దూ నుంచి తెలుగులోకి అనువదించిన మెహక్ హైదరాబాదీ గారికి హృదయపూర్వక కృతజ్నతలు. మంటో కథలను మరిన్ని తర్జుమా చేసి ఇంకో రెండు సంపుటాలు తీసుకురావాలని అనుకుంటున్న వారి ఆశయం త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నా.

  • గొప్ప రచయిత. ఆయన రాసిన స్కెచెస్ నేను అనువాదం చేస్తే సారంగలో మే నెల 2020 నుంచి మూడు చొప్పున ఆగష్టు వరకు ప్రచురితమయ్యాయి.

  • చరిత్ర తో సంభాషించే 70ఏళ్ల నాటి సాదిత్ కధ లను అనువదించి, మా కు.అందించిన రచయిత కు, ధన్యవాదాలు..!

  • ఈ కాలానికి పనికి రాని రచన మరే కాలానికీ పనికి రాదు
    — జీన్ పాల్ సర్త్
    *****
    వర్తమాన సామాజిక పరిస్థితులలో చదివి తీరాల్సిన మంటో కథలను తెలుగులో అందించారు. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు