ఈ మాదిగోళ్ళకు ఏమి కొమ్ములొచ్చినాయని!!

ది వేసవి కాలం. పాలిటెక్నిక్ ప్రొద్దుటూరులో చదువుతూ వేసవి సెలవులకు మా వూరొచ్చాను. ఇంట్లో పడుకొని ఏదో చదువుకుంటున్నాను. మధ్యాహ్న సమయమనుకుంటాను. వేసవి అనగానే మా వూర్లో నాకు గుర్తొచ్చేది చెట్లకింద, పందిళ్ళ కిందా మంచాలు వేసుకొని సేద తీరే జనమే! బోలెడన్ని విషయాలు వాళ్ళ మద్య దొర్లిపోతూ వుంటాయి. గొడవలకు కూడా అవి ఒక్కోసారి కారణమవుతూ వుంటాయి.

బయటేదో ఎవరో అరుస్తున్నట్లు, తిడుతున్నట్లు వినిపించటంతో బయటకు వచ్చాను. మా యింటి ఎదురుగా వున్న ఇంటి బయట పందిరి కింద పిచ్చాపాటీ మాట్లూడుతూ వుండిన పెద్దలు అటుగా వెలుతున్న ఓ దళిత యువకుడిని బూతులు తిడుతూ అరుస్తున్నారు. ఆ యువకుడిదీ ఇంచుమించు నా వయసే. వాళ్ళు నలుగురన్నదమ్ములు. మిగతావారిలా కూలీ నాలీ చేసుకుని వూరిని నమ్ముకొని వుండకుండా వీడు కొంత పట్నపు వాసన చూసిన వాడు. పల్లెటూరి అమాయకత్వం కాకుండా అంతో ఇంతో లోకజ్ఞానం తెలుసుకున్న వాడు. వాన్ని వీళ్ళు తిడుతున్నారు. కారణమేంటయ్యా అని కనుక్కుంటే అతనో, అతడి నాన్నో అప్పు తీసుకొని ఇంకా ఇవ్వలేదట! అది తీర్చమని అడిగితే…”ఇదిగో అదిగో తీరుస్తామని..” చెబుతున్నాడట! అది వాళ్ళ కోపానికి కారణం. మాదిగోడే కదా ఏమి తిడితే ఏమవుతుందిలే అని వాడిమీద బూతు మాటలు వాడారు. అదే వూర్లోనే బతుకుతున్న మాదిగలైతే “మా రైతే గదా…” (మా అమ్మే గదా అనుకున్నట్లు) అనుకొని దులుపుకొని పోయేవారే, కానీ వాడు పట్నం వాసన తగిలిన వాడు కదా, కోపం పట్టలేక తిరిగి వాళ్ళను తిట్టాడు.

కథ అక్కడితో అయిపోయిందనుకుని నా పాటికి నేను చదువుకోవడానికి లోపలికి వెళ్ళి పోయాను. అయితే ఓ మాదిగోడు రైతును తిట్టిన వింత ఆనోటా ఈనోటా పడి పనుల్లేక పందిళ్ళకింద ముచ్చట్లు పెట్టుకున్న ప్రజలందరికీ తెలిసి పోయింది.

“నా చిన్నప్పటి నుండీ చూస్తూనే వున్నా మా కాలంలో మాదిగోళ్ళు ఎలా వున్నారు? ఇప్పుడెలా వున్నారు? కండకావరం పెరిగి పోయింది. పెద్దా చిన్నా అనే తేడా లేకుండా పోయింది.”

“ఇదిగో ఈ గవర్నమెంటుకు వాళ్ళు దేవుడి బిడ్డలట! ఇళ్ళు కట్టించి ఇచ్చిరి, ఎనుములు (గేదెలు) కొనిచ్చి ఇచ్చిరి. వాళ్ళ పనులు వాళ్ళకుండె, ఇక మనకు పనికేం వస్తారు? మనలను ఏం లెక్కపెడతారు?”

ఇలా తలా ఒకరు మాట్లాడి ఒకళ్ళలో ఒకరికి పౌరుషాలు ఎగదన్ని వీన్ని ఉపేక్షిస్తే ఇంకొందరు ఇలాగే తయారవుతారని… ఆ దళిత యువకున్ని శిక్షించడానికి బయలు దేరారు. అతన్ని మందీమార్బలంతో వెళ్ళి పట్టుకొని తెచ్చి గుంజకు కట్టేసి కొట్టారుట.

పనులకు వెళ్ళి ఆ సాయంత్రం ఇంటికొచ్చిన దళితవాడ వారందరికీ జరిగిన అన్యాయం తెలిసింది.

“తెలిసో తెలియకో ఉడుకు రక్తంలో వాడు ఒక మాట తిడితే మాత్రం పెద్ద మనుషులందరూ పట్టుకొని పిల్లగాన్ని కొడతారా?” అని ఒకరికి ఒకరు చెప్పుకొన్నారు. పోలీసు రిపోర్టు ఇద్దామని కూడా బయలుదేరారని వినికిడి. (కానీ ఇవ్వలేదు). తప్పు చేసిన పిల్లోన్ని దండించకుండా (వీళ్ళ దండన చాల్లేదని) పోలీసు రిపోర్టు అంటారా అని వుర్ళొ రైతులు మరింత ఆవేశపడ్డారు. “తమ వూర్లో నుండీ గానీ, తమ పొలాల్లో నుండీ గానీ మాదిగోళ్ళు నడవకూడదు” అని పెద్దలంతా తీర్మానించారు. వూరూ, వూరు చుట్టు పక్కల పొలాలన్నీ రైతులవే అయినప్పుడు ఈ మాదిగలు దాసోహమనక ఏమి చేస్తారనే పట్టుదల పెద్దలది.

కానీ మరుసటిరోజు మాదిగోళ్ళంతా పోలీసు రిపోర్టిస్తే చాలా కథ జరుగుతుందని భయపడి రైతులంతా ఓ రెడ్డి దగ్గరకు పంచాయితీ చెప్పమని వెళ్ళారు. ఈ రెడ్డి పులివెందుల నుంచీ వచ్చి మా వూరి దగ్గర “కంకర మిషన్” పెట్టాడు. దానికి కావలిసిన కూలీలంతా మా వూరు, దళితవాడ నుంచే వెళతారు. ఆయన మీద ఆధారపడిన వారు గనక ఆయన చెబితే వింటారని రైతులు వెళ్ళి ఆయనను పిలుచుకొచ్చి ఆ మరునాటి రాత్రి పంచాయితీ పెట్టించారు.

ఆ పంచాయితీకి నేనూ వెళ్ళాను. మా వూర్లో గానీ, పొలాల్లో గానీ అడుగు పెట్టొద్దన్నారని దళితులెవ్వరూ ఈ పంచాయితీకి రాలేదు. పంచాయితీ అంతా ఒకే పక్షం అయ్యారు. ఒక్కొక్కరు దళితుల చేతిలో పడ్డ బాధలు చెబుతున్నారు.

“ఆ కర్రోడు మొన్న ఎద్దులబండి తోలుతూ ఎదురు పడ్డాడు. కనీసం దిగనూ లేదు. కలియుగం నాయనా కలియుగం.”

“మొన్న కూలీలను పిలుద్దామని పల్లెలోకి వెళితే, ఆ లచ్చిగాడు మంచంమీద కూర్చుని సద్దన్నం తింటాండు. చూసినా చూడనట్టే లేవకుండా తింటున్నాడు. ఆ పక్కకు వెళ్ళాలంటేనే మొహం చెల్లట్లేదు.”

“ఈ మాదిగోళ్ళకు ఏమి కొమ్ములొచ్చినాయని!! ఈ పిచ్చి గవర్నమెంటు కొంపలిచ్చె, కోళ్ళిచ్చె, భూములిచ్చె. ఇక వాళ్ళు మనకేం పలుకుతారు? అప్పుడెప్పుడో బ్రంహ్మం గారు చెప్పలా మాదిగోడు రాజ్యమేలతాడని…అక్షరాలా జరుగుతోంది.”

ఇలా తలో మాటా విసురుతున్నారు. అందరి మద్యలో మంచం మీద కూర్చున్న రెడ్డి “ఇది తప్పే, మాదిగోడు రైతును తిట్టడం తప్పే” అన్నాడు.

నాకు ఆవేశం వచ్చింది. అంత ఆవేశం ఇంతకు ముందు మా వూరి పోలింగ్ బూతులో అన్నకు (తెలుగుదేశానికి) ఓటు వేయనీకుండా కాంగిరేసు గూండాలు వచ్చి రిగ్గింగ్ చేస్తుంటే వచ్చింది. “వాన్ని వీళ్ళు తిట్టినందుకే గదా వాడు వీళ్ళని తిట్టాడు? అంతటితో పోనియ్యక మళ్ళీ వాన్ని పట్టుకొచ్చి ఎందుకు కొట్టినట్లు? ఎద్దుల బండిలో వాడి దారిన వాడు పోతున్నప్పుడు ఈయనొచ్చాడని ఎందుకు బండి దిగాలి?” అని ప్రశ్నించాను.

“చదవేస్తే వున్నమతి పోయిందట” అంది ఓ అక్క.

“చదువుకున్నోడి కంటే చాకలోడు మేలనేది ఇందుకే” అంది ఓ పెద్దమ్మ.

“ఇంటికి వెళ్ళనీ… నా కొడుకుని..రెండురోజులు అన్నం పెట్టకుండా మాడిస్తే…” అంది మా అమ్మ.

మొత్తానికి ఏవేవో మాట్లాడుకొని, తీర్మానించుకొని సమావేశం ముగించారు. కొన్నాళ్ళకు అంతా సద్దు మణిగి, యధా ప్రకారం నడిచింది.

*

ప్రసాద్ చరసాల

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గ్రామాలలో ఇన్కా ఈ పరిస్థితి వుంది. మార్పు ఎన్తో రావలసి వుంది. ఇరు పక్షానికి

    • అవునండి. మార్పు తగినంత రానేలేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు