అమెరికా అనసూయ గారు!

క అమెరికా వచ్చాక, 1996 లో అనసూయ గారు “తట్టుకోలేక” తన మొదటి వ్యాసం “వృద్ధాప్యం” వ్రాశారు. “ఇక్కడ “తట్టుకోలేక” అనే పదం వాడడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటిది అమెరికాలో ఇంకెక్కడా లేని విధంగా ఆవిడకి మా హ్యూస్థన్ లోనే అనిలూ, నేనూ, వసంతా, నారాయణ రావు గారు మొదలైన వాళ్ళతో సాహిత్యం మీద మాట్లాడుకోవడం జరిగేది. అత్యంత ప్రతిభావంతులైన సాహితీవేత్తలతో ఎంతో సాన్నిహిత్యం ఉన్న అనసూయ గారికి ఎప్పుడూ పెద్ద పీట వేసి, ఆవిడ చేత ఆ కబుర్లు చెప్పించుకునే వాళ్ళం. రెండోది మేము నడుపుతున్న “మధుర వాణి” పత్రిక కి ఏదైనా వ్రాయమని నేను వేధించే వాడిని. “గంట మొదిలి గరిటె పట్టె మంత్రి” అన్నట్టుగా ఈ వయసులో నేను సంగీతం మానేసి రచయిత్రి అవమంటావా అనే వారు అనసూయ గారు. మొత్తానికి అప్పటికి 66 ఏళ్ల క్రితం సి.ఆర్. రెడ్డి గారు ఇచ్చిన స్పూర్తితో ఈ నాడు తన జీవిత చరిత్రకి నాందీ ప్రస్తావనగా వ్రాసిన ఆ “వృద్దాప్యం” అనే వ్యాసాన్ని మధుర వాణిలో ప్రచురించాం. అంతే కాదు, ఆ ఏడు జరిగిన మా టెక్సస్ సాహితీ సదస్సులో ఆమె చేత ఆ వ్యాసం చదివే ఏర్పాట్లు చేశాను. ఆవిడ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఎప్పుడూ, ఏదో ఒక కళాత్మక వ్యాపకం ఉంటే గానీ ఆవిడకి తోచేది కాదు.

అప్పుడు ఆమె వయసు 87….అంటే 2007 సంవత్సరం…

అప్పటి నుంచీ..అంటే తన 76 వ ఏట మొదలు పెట్టి అనసూయ గారు తన సృజనాత్మకతకి పదును పెట్టారు. వ్యాసాలే కాకుండా కథలు కూడా వ్రాయడం మొదలు పెట్టారు. నేను ఎప్పుడు అడిగినా కాదనకుండా వ్రాయడం ఒక ఎత్తు అయితే, తనంతట తనే అంచెలంచెలుగా రచనా వ్యాసంగంలో ఎంతో ఎత్తుకి ఎదిగారు. జానపద, లలిత సంగీతాల మీదా, తన జీవితానుభవాల మీదా ఆమె వ్రాసిన వ్యాసాలూ, కథలూ మా “మధుర వాణి” లోనే కాక అమెరికాలో అనేక పత్రికలలో ప్రచురించ బడ్డాయి. అవన్నీ ఒక పుస్తకానికి సరిపడా తగిన సంఖ్యకి వచ్చాయి అని నాకు అనిపించగానే అప్పటికే వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా పుస్తకాల ప్రచురణలో అనుభవం సంపాదించుకున్న నేను అవన్నీ ఒక పుస్తకంగా వేద్దాం అని అనసూయ గారితో అనగానే ‘నీకేమన్నా మతి పోయిందా, రాజూ” అని ఆవిడ విస్తు పోయారు. అన్నానే కానీ ఉన్న ఇబ్బంది నాకు బాగానే తెలుసును. ఎందుకంటే అప్పటికి అంత గొప్పగా లేని ఆమె కథలు ఐదారు కంటే లేవు కానీ బాగా వ్రాసిన వ్యాసాలు తగినన్ని ఉన్నాయి. మొత్తానికి తర్జన, భర్జన పడి అన్నింటినీ “నేనూ-నా రచనలూ” అనే పేరిట 2003 లో మా 22వ ప్రచురణగా వెలువరించాం. అప్పటి నుంచీ అనసూయ గారికి రచనా వ్యాసంగం మీద ఆసక్తి పెరిగి ‘సుజన రంజని” లోనూ, కౌముది లోనూ ధారా వాహికలు వ్రాశారు. వాటిల్లో కొన్నింటిని దాని పుస్తక రూపంగా ప్రచురించే అవకాశం “మా రాజు దే” అని నాకే ఇచ్చారు. “గతానికి స్వాగతం” అనే పేరిట అది 2007 లో ప్రచురణ అయింది. ఆ తరువాత “ఎందరో మహానుభావులు” అనే పుస్తకంలో అనేక మంది గొప్పవాళ్ళతో తనకున్న పరిచయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరొక పుస్తకం వ్రాశారు అనసూయ గారు. అది ఇండియాలో రచన శాయి గారు ప్రచురించారు.

అప్పుడు ఆమె వయసు 89…అంటే 2009

ఆ ఏడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున హైదరాబాద్ లో రెండవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించాం. అప్పుడు అనసూయ గారు మద్రాసులో ఉన్నారు అని తెలియగానే సహజంగానే ఆవిడని ప్రధాన అతిధిగా ఆహ్వానించాం. అప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే….ఒక నెల వ్యవధిలో అనసూయ గారు మద్రాసు నగరంలో ఉన్న పది మంది తెలుగు యువగాయనీ గాయకులని పోగేసి, వాళ్ళ కి పదో, పదిహేనో జానపద గేయాలు, ప్రసిద్ధ కవుల లలిత సంగీత గేయాలు ..అన్నీ తన బాణీలే….నేర్పించి వాళ్ళందరినీ విమానం లో హైదరాబాద్ తీసుకుచ్చారు. మొదటి రోజు ఆమె స్వయంగా హార్మోనియం లో ఆయా పాటలు వాయిస్తూ వాళ్ళ చేత పాడించిన ఆ అపురూప కార్యక్రమం….న భూతో న భవిష్యతి….ఆ రెండవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో వేదిక వెనకాల బేనర్ మీద ఆమె ఫోటో ముద్రించి అనసూయ గారికి “జీవన సాఫల్య పురస్కారం” ఇచ్చి మాకు మేమే గౌరవం చేసుకున్నాం. అప్పటి ఫోటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను.

అప్పుడు ఆమె వయసు 95….

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆవిడని సతాయించి ఆవిడ చేత ఆత్మ కథ రాయించడం ఒక ఎత్తు. 2014 లో ..అంటే ఆవిడ 94 ఏళ్ల వయసులో కాలిఫోర్నియా లో ఉండేటప్పుడు నేను ప్రతీ వారం పిలవడం “ఏమండీ మీ ఆత్మ కథ ఎంత వరకూ వచ్చింది?” అనేదే నా సతాయింపు. “మూడ్ లేదయ్యా” అని ఒక సారీ, “ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు” అని మరొక సారీ “తేదీల వారీగా రాయాలా, సంఘటనల వారీగా రాయాలా?” అని మరొక సారీ ఆవిడ రకరకాల కారణాలు చెప్తూ వస్తే నేను ఒకే సలహా ఇచ్చే వాడిని “అమ్మా, మీరు పెన్నూ, కాగితం తీసుకుని ఏం జ్ఞాపకం వస్తే అది రాసెయ్యండి. మీరు చెప్పదలచుకున్నవి అన్నీ చెప్పెయ్యడమే , కాగితం మీద పెట్తెయ్యడమే. వాటిని ఎలా వెయ్యాలో నేను చూసుకుంటాను” అనే వాడిని. మొత్తానికి 2014 నవంబర్ లో ఒక నోట్ పుస్తకంలో “అసామాన్య అనసూయ” అని పేరు పెట్టి తన ఆత్మ కథ రాయడానికి శ్రీకారం చుట్టారు 94 ఏళ్ల అనసూయ గారు. అలా రెండు నోట్ పుస్తకాలలో ఇంచు మించు 9 నెలలలో తన సుదీర్ఘ జీవితంలో అప్పటిదాకా ఎక్కడా చెప్పని, కొన్ని చెప్పకూడని విషయాలతో సహా తన జీవితానుభావాలని వ్రాశారు అనసూయ గారు. చేతివ్రాతలో ఉన్న ఆ కథ నీ, ఫోటోలనీ కంప్యూటర్ లో నిక్షేపించి నాకు పంపించి సుభాష్ అనే యువకుడు ఎంతో పుణ్యం చేసుకున్నాడు. అప్పటి నుంచీ నాకు అనసూయ గారి ఆత్మ కథ,…చాలా చోట్ల ఆత్మ ఘోష ..ని ఒక పద్ధతి లోకి తీసుకు రావడానికి ఆరు నెలలు పట్టింది.కొన్ని కొన్ని వివాదాస్పదం, మరీ వ్యక్తిగతం లా ఉన్న వాటిల్లో ఏవి ఉంచాలీ, ఎంత వరకూ ఉంచాలీ అనే విషయం మీద నేనూ, అనసూయ గారూ చాలానే   దెబ్బలాడుకున్నాం. పుస్తకం మకుటం కూడా మార్చి, మొత్తానికి అనసూయ గారి 95 సంవత్సరంలో “అసమాన అనసూయ” -నా గురించి నేనే” అనే పేరిట ఆవిడ ఆత్మ కథ మా 60వ ప్రచురణ గా వెలువరించాం. అనేక ఫోటోలూ, అనసూయ గారు సేకరించిన ఆటోగ్రాఫుల తో జ్యోతి వలబోజు (జే.వి పబ్లిషర్స్) ఆ పుస్తకాన్ని చాలా బాగా రూపొందించింది. నా జీవితం, నాకే కాక అనసూయ గారికీ, ఆమె కుటుంబానికీ కూడా నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది ఆ పుస్తక ప్రచురణ.

ఆ వయసులో ముత్యాల లాంటి చేతివ్రాత తో, అతి తక్కువ కొట్టి వేతలతో, తన అసాధారణ జ్ఞాపక శక్తి ఆధారంగా ఏక ధాటిగా వ్రాసిన అనసూయ గారి ఆ రెండు నోట్ పుస్తకాలూ నా దగ్గర పదిలంగా ఉన్నాయి. అందులోంచి మొదటి పేజీ, 1937 లో కలకత్తాలో కె.ఎల్. సైగల్ ఇంటికి వెళ్లి అతని ముందు పాడి ప్రశంసలు పొందిన సంఘటన వివరించిన అనుభవంలాంటివి  అనేకం. అనసూయ గారి ఆత్మ కథ “అసమాన అనసూయ” పుస్తకం ఎలక్రానిక్ ప్రతి ఈ క్రింది లంకెలో దొరుకుతుంది…అద్దేకీ….కొనుక్కోడానికీ…ముద్రణ ప్రతి కావలసిన వారు నన్ను సంప్రదించండి. మా హ్యూస్టన్ లో ఈ గ్రంధావిష్కరణ జరిగినప్పటి ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను.

http://kinige.com/book/Asamana+Anasuya

ఇక అనసూయ గారి హాస్య చతురత కి, ఆవిడ అనర్గళంగా గంటల తరబడి చెప్పే కబుర్లకీ అంతే లేదు. ఆవిడ చెప్పిన ఆకాశ వాణి ప్రారంభం, దేవులపల్లి వారి బ్రహ్మ సమాజం పాటలకి ట్యూన్స్ కట్టి అన్ని సభల్లోనూ పాడడం, బెజవాడ గోపాల రెడ్డి గారి పెళ్లి, గాంధీ గారు కాకినాడ వచ్చినప్పుడు భోరున వర్షంలో హార్మోనియం మీద గుడ్డ కప్పి “హే భారత జననీ” పాడడం, కాంచనమాలతో స్నేహం, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, రాధాకృష్ణన్ మొదలైన వారి ముందు కచేరీలు, రత్నపాప బారసాల నుంచి అరంగేట్రం సంగతులు, ……ఒకటేమిటి ఒకదాని కంటే మరొకటి భలే ఆసక్తికరంగా ఉండేవి. ఈ సంగతులు అన్నీ ఆవిడ ఆత్మ కథలో ఉన్నాయి.

60, 70 ఏళ్ల క్రిందట పెదాలకి రంగే కాకుండా, వేసుకున్న బట్టలూ, నగలూ, జోళ్ళు, వేళ్ళ రంగూ అన్నీ ఖచ్చితం గా మేచింగ్ గా కుదిరితేనే కానీ బయటకి రాకుండా మొత్తం మేకప్ కల్చర్ ని తెలుగు నాట ప్రవేశ పెట్టిన మొదటి మహిళగా అనసూయ గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అది ఆవిడకి చాలా గర్వ కారణంగా ఉండేది. అప్పుడే కాదు. మొన్న 99 ఏట పరమ పదించే దాకా కూడా ఆవిడ పూర్తి మేచింగ్ లేకుండా బయటకి రావడం ఎప్పుడూ ఎవరూ చూడ లేదు. దానికి సంబంధించిన చిన్న చురక…1977 లో ఆంధ్రా యూనివర్శిటీ వారు అనసూయ గారికీ, అక్కినేని నాగేశ్వర రావుకీ “కళా ప్రపూర్ణ” బిరుదు ప్రదానం, ఆనరరీ డాక్టరేట్ ఒకే సారి ఇచ్చినప్పుడు ఒక చిన్న తమాషా జరిగింది. బిరుదు ప్రదానానికి ముందు వరసలో అక్కినేని గారూ, పక్కనే అనసూయ గారూ కూచున్నారు. పూర్తి మేకప్ లో ఉన్న అనసూయ గారు తన హేండ్ బేగ్ లో దేని కోసమో వెతుకుతూ ఉంటే “ఏమిటి అనసూయ గారూ, లిప్ స్టిక్ మర్చిపోయారా?” అని అక్కినేని వేళాకోళం చేశారు. వెంటనే అనసూయ గారు “కాదు, లిప్ స్టిక్ ఉంది కానీ అద్దం మర్చిపోయాను. కాస్త ముందుకు వంగు. లిప్ స్టిక్ సరి చేసుకుంటాను” అన్నారు అనసూయ గారు తక్షణం. అక్కినేనిది అప్పటికే నిగ నిగలాడే బట్ట తల కదా….అదీ అక్కడ అనసూయ గారి చమత్కారం.

అనసూయ గారు చెప్పిన మరికొన్ని విశేషాలు..ఆవిడ మాటలలోనే:

మామయ్య గొంతు కాన్సర్ తో బొంబాయి హాస్పటల్లో ఉన్నప్పుడు, నేను పక్కన ఏడుస్తూ కూర్చున్నాను. ఆయనకు గొంతు ఆపరేషన్ చేసి స్వర పేటిక తీసేశరు. ఒకసారి ప్రముఖ కాన్సర్ స్పెషలిస్ట్ హీరానందాని గారు రౌండ్స్ కి వచ్చారు. పరీక్షించటమైపోయాక, “Mr. Sastry, I heard that you are a great poet, can you give me some poetry, Anasuya, I also heard you are great singer, can you sing his poetry” అని అంటే, కాగితం, కలం ఇమ్మని సైగ చేసాడు మామయ్య. ఇలా రాశాడు –

“మాట తీసుకుని మౌనమొసిగినావు

మౌనమందుకుని గానమివ్వమంటావ”

హీరానందాని గారు అర్ధం అడిగి తెలుసుకున్నారు. అంత విచారములో కూడా పాడక తప్పింది కాదు.

మరొక పిట్ట కథ:

నేనూ S.V. రంగారావు గారు కాకినాడ P.R. College లో సహాధ్యాయులము. నేను, BA 1st year, ఆయన BSc 1st year. ఇద్దరిదీ ఇంగ్లీష్ క్లాసు ఒకటే. S.V. రంగారావు గారు హాస్టల్ లో ఉండేవాడు. రాత్రి గోడ దూకి నాటకాల రిహార్సల్స్ కి వెళ్లేవాడు. మొత్తానికి నాటకం వేసారు. అది కూడా రాత్రి పూట. మళ్లీ గోడ దూకి వెళ్లారు. ఆ నాటకానికి హాస్టల్ వార్డెన్ గారు కూడా ఆ నాటకాన్ని చూడడానికి వెళ్లారు. ఆ నాటకం చూస్తున్నంతసేపూ ఆయనకి కొంత అనుమానంగానే ఉంది. రెండవ రోజున కాలేజీలో S.V. రంగారావు గారిని పట్టుకుని, “ఒరే రాత్రి నాటకంలో ఫలానా పాత్ర వేసింది నువ్వే కదరా”, అని అడిగారు. రంగారావుగారు తడుముకోకుండా, “లేదండీ, నేను హాస్టలులోనే ఉన్నాను. మేము కవలలము. చూడడానికి ఒకరకంగానే ఉంటాము కానీ, వాడికి బుద్ది తక్కువ, చదువు రాదు. చిన్నప్పటినించి వాడి అల్లరితో, వేషాలతో నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి” అని నమ్మబలకేటట్టు నటించి తప్పించుకున్నారు.

మరొక మచ్చు తునక:

బులుసు సాంబమూర్తి గారిని “ఆంధ్ర గాంధి”, “మహర్షి సాంబమూర్తి” అనేవారు. కొల్లాయి కట్టి, గాంధీ మార్గంలో నడుస్తూ, అతి నిరాడంబరముగా, స్వాతంత్ర్య సమర దీక్షలో పాల్గొనేవారు. 1926 లాహోర్ కాంగ్రెస్ లో పూర్ణ స్వరాజ్యం ప్రతిపాదించిన మొదటి వ్యక్తి. 12 ఏళ్ల అమ్మాయి గుమ్మిడిదల దుర్గాబాయిని (తరువాత దుర్గాబాయి దేశ్ ముఖ్) ప్రభావితం చేసి స్వాతంత్ర్య సమరంలోకి దింపిన వ్యక్తి, బులుసు సాంబమూర్తి గారు. అయితే ఆయనకి వాక్చాతుర్యం తక్కువ. ఆయన ఏమి చెప్పినా, కొంత నవ్వు వచ్చేది. ఒకసారి సభలో దుర్గాబాయమ్మగారి గురించి చెప్పబోతూ, ఇలా అన్నారు:

“నేను కాకినాడలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూంటే, ఎవరో ఒక అమ్మాయి తలుపు చాటునుంచి చప్పట్లు కొట్టింది. నేనూ ఆసక్తితో చూసి దగ్గరకు వెళ్లాను. నేను లోపలికి వెళ్లగానే ఆ అమ్మాయి తలుపు వేసింది”. ఇది వినగానే వేదిక పైన ఉన్నవాళ్లు కంగారు పడటం, వేదిక కింద ఉన్నావాళ్లు ఆసక్తి పెంచుకుని వినటం జరిగింది. “అప్పుడు, దుర్గాబాయి, తన వంటి మీద ఉన్న నగలన్నీ తీసి నాకిచ్చి, స్వాతంత్ర్య సమర యుద్దానికి విరాళమని చెప్పింది” అన్నారు. అందరూ హమ్మయ్య అని గాలి పీల్చుకున్నారు. అలాగే, “ఆంధ్ర మహిళా సభ” ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తూ – “ఈ సభకు దుర్గాబాయి తల్లి లాంటిదైతే, నేను తండ్రిలాంటి వాడిని” అన్నారు. సభికులందరూ ఘొల్లున నవ్వారు.

అనసూయ గారూ- తెలుగు సినిమా వాళ్లూ

ఇక సినిమా వాళ్ళు తనకి చేసిన అన్యాయాలు అనసూయ గారు చెప్తూ ఉంటే వినాల్సిందే. ఉదాహరణకి ‘మల్లీశ్వరి’ లో భానుమతి పాట “మనసున మల్లెలు” అనసూయ గారు 1937 లో రికార్డు ఇచ్చిన “చందన చర్చిత” పాట కి అనుకరణే. మల్లీశ్వరి సిమిమాకి నాలుగు బాణీలు ఇచ్చారు అనసూయ గారు. ఆ మాట భానుమతే చాలా సభల్లో చెప్పిందిట. కానీ ఆవిడపేరు వెయ్య లేదు. అలాగే ‘రోజులు మారాయి’ లో “ఏరువాకా సాగారో” పాట అనసూయ గారు 1932 లో…..అంటే తన 12వ ఏట ఇచ్చిన రికార్డులో ‘చుక్కాల చీర కట్టుకునీ” పాట బాణీ యే. ఇక ‘బంగారు పాప ‘ సినిమా విషయాని కొస్తే అనసూయ గారు గంటల కొద్దీ మాట్లాడే వారు. అన్ని పాటలకీ తన చేత బాణీలు కట్టించుకుని, తను ఊళ్ళో లేనప్పుడు ఆ మ్యూజిక్ కండక్ట్ చేసిన అద్దేపల్లి రామారావు పేరు సంగీత దర్శకుడి గా బి.ఎన్. రెడ్డి గారు వెయ్యడం అనసూయ గారిని చాలా బాధించేది. ఆ నాటి బంగారు పాప సినిమా యూనిట్ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.

ఇన్ని జరిగినా…దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి మహిళా సినీ సంగీత దర్శకురాలు అనసూయ గారే. అది మహాత్మా కబీర్ అనే కన్నడ సినిమా. ఆ తరువాత అగ్గి రాముడు, కనక దుర్గ మహాత్మ్యం, పెంకి పెళ్ళాం, బొమ్మ రిల్లు మొదలైన సినిమాలకు ఆవిడ సంగీతం సమకూర్చారు.

అలనాటి నుంచి ఈ నాటి దాకా తెలుగు నాట సినిమాలలో కానీ, ఎటువంటి సంగీత కార్యక్రమాలలో నైనా జానపద బాణీ వినపడితే అది అనసూయమ్మ గారి పాద ధూళి నుంచి జాలువారినదే. గొంతు ఎవరిదైనా వినపడేది అనసూయమ్మ గారి బాణీయే..ఆవిడ స్వరమే…. కేవలం ఆవిడ గళం, స్వయంగా అలవోక గా వాయించే హార్మోనియం, డప్పు ..అంతే…

ఇక ఆవిడకి ఎంతో ఇష్టమయిన మరో విషయం ఆటోగ్రాప్స్ ..అంటే ప్రముఖుల సంతకాలూ, చేతివ్రాతలూ, ఆత్మీయ సందేశాల సేకరణ. ఉదాహరణకి ఆవిడ సేకరణలో మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చందబోస్, టంగుటూరి ప్రకాశం పంతులు’, బడే గులాం ఆలీఖాన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, పృధ్వీరాజ్ కపూర్, చిత్తూరు నాగయ్య, విజయలక్ష్మీ పండిట్, కాంచనమాల, విశ్వనాధ, హరీంద్రనాథ్ ఛటోపాద్యాయ, రాయప్రోలు, బళ్ళారి రాఘవ, సైగల్, దుర్గాబాయ్ దేశముఖ్, సి.ఆర్. రెడ్డి, ..ఒకరేమిటి….అనేక మంది ప్రముఖులతో తన పరిచయానికి చిహ్నంగా ఆమె దాచుకున్నవన్నీ చూసి ప్రచురించిన అదృష్టం నాదే.

బాపు గారు, బాలూ గార్లతో మా ఆత్మీయ సమావేశాలూ, నాకు మా హ్యూస్టన్ వారు తెలిసో తెలియకో నన్ను “తెలుగు తేజం” గా గుర్తించి ఆమె చేతుల మీదుగా పురస్కారం ఇప్పించిన సందర్భం మొదలైన కొన్ని అపూర్వ ఘట్టాల ఫోటోలు ఇందుతో జతపరుస్తున్నాను.

మహా గాయని, తెలుగు సంగీత ప్రపంచంలో తొమ్మిది దశాబ్దాలు ధృవతారగా నిలిచి, చరిత్ర సృష్టించిన మా ‘అసమాన అనసూయ” గారితో నా జీవితకాల అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ, పరిపూర్ణ జీవితం అనుభవించి అమరలోకాలకి తరలి వెళ్ళిన ఆ అనురాగ మూర్తికి నా నివాళులు అర్పిస్తున్నాను.

*

 

 

వంగూరి చిట్టెన్ రాజు

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అసమాన అనసూయాదేవి గారి గురించి రాసి మావంటి వారికి ఒక జాతి రత్నాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు రాజు గారూ.
    బాల్యంలో వారి జాన పద గీతాల వినే భాగ్యం కలిగింది
    కాని ఇంతటి ప్రఙా శాలి అని తెలియదు.

    • మీ స్పందనకి ధన్యవాదాలు, కళావతి గారూ

  • అసమాన అనసూయ గారి గురించి తప్పక చదవాల్సిందే. అంత గొప్పవారినెరిగిన మీరు నాకు తెలియడం నాకెంతో గొప్పగా అనిపిస్తోంది! నిజం!

    • భలే దానివే. ఇక మనిద్దరం సెల్ఫీ తీసుకునే సమయం వచ్చింది..!!!!!

  • వేళ్ళమీద లెక్కపెట్టగల సంఖ్యలో ఉండే మహిళా సంగీతదర్శకురాలై , సుసంపన్నమైన జీవితానుభవం మూటగట్టుకున్న అనసూయగారు అసమానురాలే… మన తెలుగు నారీలోకపు అనర్ఘరత్నం. లలితసంగీతలోకపు ప్రశస్త తారామణి ఆన అనసూయ గారిని గురించి తెలిపినందుకు అనేకానేక ధన్యవాదములండీ… ఆవిడ రచనలను తప్పక చదువుతాను…

    • తప్పకుండా చదవండి. ఆ తరం ఎలా ఉండేదో తెలుస్తుంది.

  • శాస్త్రీయ, లలిత, జానపద సంగీత త్రివేణి సంగమం; మన జాతి రత్నం; అనురాగ మూర్తి; అసమాన అనసూయాదేవి గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ వారిని నేటి తరం పాఠకులకు పరిచయం చేస్తున్న వంగూరి చిట్టెన్ రాజు గారికి కృతజ్నతలు

    డా. అవసరాల ( వింజమూరి ) అనసూయదేవి గారి ఆత్మ కథ “అసమాన అనసూయ” పుస్తకం ప్రింటు కాపీలు నవోదయ బుక్ హౌస్, కాచీగూడా, హైద్రాబాదు వారి వద్ద లభ్యం :

    https://www.telugubooks.in/products/asamaana-anasuya-naa-gurinchi-nene

    • ధన్యవాదాలు, మహాశయా

  • రాజు గారు! మీ సారంగ ద్వారా మాకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు మేము తెలుసుకోగలుగుతున్నాం. మీకు ధన్యవాదాలు!🙏💐🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు