నగరంలో కొన్ని రాత్రులు మిగిలుంటాయి
అవి ఏ రద్దీ లేని పాత రోడ్డు వారగా ఉంటాయి
మరీ పాత కాలం ఇళ్ళు ఒకటి కూలిపోయి
ఊత కర్ర లేని ముసలి దానిలా ఉంటుంది
దాని పై ఒక కుందేలు రెక్కలు విసురుతూ ఎగురుతూ ఉంటుంది
నేల పై చెరపబడ్డ సమాధిపై
ఒక ముక్కు పుడకాకు పువ్వు
మిణుగురై మెరుస్తూ ఉంటుంది
జిత్తులమారి నక్క వాకిట్లో కట్టేసిన గుర్రాన్ని
సంతలో అమ్మేస్తుంది
మొసలి, కోతి గుండె కాయ నిప్పులో
కాలుస్తూ ఉంటుంది
చీమల పుట్టలో పాము పురుడోసుకుంటుంది
ముంగిస మంత్రసాని
ఆకాశంలో కోడి, పిల్లల్ని వెంటేసుకుని
గింజలు ఏరుకుంటూ తింటుంది
బ్బో బ్బో బ్బో బ్బో బ్బో…
పిరికెడు నూకలు చల్లగానే కుక్కపిల్లలా కాళ్ళమ్మటిగా మెసిలిద్ది
ఎందుకో
ఈ కథలు ఆ రాత్రి ఇక నిద్ర పోనివ్వవు.
*
Add comment