ఇక్కడ అలా జరుగుతోంది!

అజో-విభో-కందాళం సంస్థ పాతికేళ్లకు పైగా ఏటా నాటక పోటీలని నిర్వహిస్తోంది. ఒక ఏడాది “చదువు” అన్న అంశంపై నాటకాలని రాయాలన్న నిబంధనని ఆ సంస్థ పెడితే, వచ్చినవాటిలో అధికభాగం, చదువు అనేది, అది వచ్చినవాళ్లు రానివాళ్ళని మోసంచెయ్యడానికి ఉపయోగపడుతున్న పరికరంగా మలచినవట! ఇది గుర్తురావడానికి కారణం, అమెరికాలో 2016లో జరిగిన అధ్యక్షుని ఎన్నికలలో, చదువుకున్నవాళ్లు, పెద్దపెద్ద కళాశాలల పట్టభద్రులు ఎంతోకాలంగా రాజకీయాలలో ఉంటూ కూడా తమ ప్రయోజనాలని పట్టించుకోలేదని కినుక వహించిన గ్రామీణ ప్రాతం వాసులే గాక, పట్టణాల్లోని పారిశ్రామికులు కూడా తమ వోట్లని బిలియనీర్ ట్రంప్ కి వేసి గెలిపించడం. అయితే, ఎంతో సృజనాత్మకత కలిగిన మానవ మేధ ఇప్పటిదాకా ఇలాంటి పరిస్థితిని ఊహించకుండా ఉంటుందంటే నమ్మగలమా? అంటే, “లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్” అన్న నానుడిని ట్రంప్ నిజంచేశాడు అనేటట్లయితే ఆ “ఆర్ట్” పూర్వాపరాలు ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. దానికి జవాబు, బడ్ షుల్బర్గ్ రాసిన “యువర్ ఆర్కాన్సా ట్రావెలర్.” ఈ లింకులో మూడవ పేజీలో మొదలవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో పైపైకి ఎదగాలంటే బాగా పేరు తెలిసిన వంశం నించైనా రావాలి, డబ్బులో మునిగితేలుతూ అయినా ఉండాలి, లేదా సినిమా స్టార్ అయినా అయివుండాలి. అక్కడక్కడా, తమ వాక్చాతుర్యంతోనో లేదా తమకే పరిమితమయిన విపరీతాభిప్రాయాలని పెద్ద గొంతుతో వెలిబుచ్చినప్పుడు దానికి మార్కెట్లో గిరాకీ దొరకడంతోనో కూడా అది సంభవమే. ఆ చివరి అంశానికి ఉదాహరణగా అమెరికాలోని రష్ లిమ్బాగ్ అనే వ్యక్తిని చెప్పవచ్చు. అతను మూడు దశాబ్దాలకి పైగా రేడియోలో పెద్ద గొంతుక పెట్టి తన స్వంతం చేసుకున్నాడు. అతను ఏం మాట్లాడినా గంగిరెద్దులా తలలూపే శ్రోతలకి “డిటో హెడ్స్” అని పేరు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కెరీర్ తో మొదలుపెట్టి తరువాత ముఖ్యమంత్రు లయిన రొనాల్డ్ రీగన్, ఎన్టీఆర్, ఎమ్జీఆర్ లలాగా, డోనాల్డ్ ట్రంప్ రియలెస్టేట్ బిజినెస్ లో మొదలుపెట్టి తరువాత టీవీలో పేరు మోగించుకుని, చివరికి ఎకాయెకిన తిన్నగా దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి, 2016లో అనూహ్యంగా గెలిచాడు. రష్ లింబాగ్ రేడియో పర్సనాలిటీలో కొంత భాగాన్నీ, పరిస్థితులు పైకి ఎగరేసిన అలలమీద సర్ఫ్ చేసిన ట్రంప్ చరిత్రనీ కొంత కలబోస్తే, “యువర్ ఆర్కాన్సా ట్రావెలర్” లోని ల్యారీ (లోన్‌సమ్) రోడ్స్ అవుతాడు.

ఒక మూడు, నాలుగు దశాబ్దాల వెనక్కు వెడితే, పెళ్ళిళ్ళల్లో అందరినీ ఆకట్టుకునేలా కబుర్లు చెబుతూ, నవ్విస్తూ, కవ్విస్తూ చుట్టాల్లో ఒకళ్లు మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తారు. అలాంటివాళ్లకి మైక్ ఇచ్చి, అది ఊరూ, వాడా మాత్రమే గాక జిల్లా పరిధి కూడా దాటి, రాష్ట్రపు పొలిమేరలు దాటి దేశ మంతటా వినిపించే అవకాశాన్ని కల్పిస్తే, అది లోన్‌సమ్ రోడ్స్ చరిత్రకు పునాది మాత్రమే కాక గోడలు, తలుపులూ, కిటికీలూ కూడా అవుతుంది. అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రంలోని ఫాక్స్ అన్న చిన్న పట్టణంలోని ఒక రేడియో స్టేషన్లో పనిచేస్తున్న మార్ష అన్న ఒకామె ముందు పనిచెయ్యని ఒక గిటార్ పట్టుకుని లోన్‌సమ్ రోడ్స్ ప్రత్యక్ష మవుతాడు. ఆర్కాన్సా రాష్ట్రంలోని రిడిల్ అన్న చిన్న ఊరి నుంచీ వచ్చానని చెబుతాడు.  370.5 మనుషులున్న రిడిల్ లో (ఆ సగం ఏమిటంటే, అతని అంకుల్ ఒకతనికి రెండు తలలు! అతను భార్యతో పోట్లాడ్డానికి ఆ రెండు తలలూ అవసరమట!) పధ్నాలుగవ ఏట మూడవ తరగతి పాస్ అయినందుకు అతన్ని “పర్ఫేసర్” అన్నారు.

శ్రోతల్ని ఆకట్టుకునేలా పాడే మాట అటుంచి మాట్లాడే శక్తి కూడా మార్షకు అతనిలో లేదు అని అనిపించినా గానీ, అతని పాట అద్భుతంగా ఉన్నదో లేదా దరిద్రంగా ఉన్నదో ఆమెకు తెలియలేదు గానీ, దాన్ని, దాని మధ్యలో అతను చెబుతున్న కబుర్లనీ వింటూనే ఉన్నది. ఆమె దృష్టికోణంనుంచీ  చెప్పిన ఈ కథలో “He was boisterous and effective and he had a certain animal charm that made me feel uneasy.” అని ఆమె అనుకుంటుంది. అంతలో అక్కడికి వచ్చిన ఆ రేడియో స్టేషన్ ఓనర్ కి రోడ్స్ ఫోక్ సింగింగ్ లో “అమరికనిజం” నచ్చి పగటివేళ ఒక అరగంట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిస్తాడు. అది శ్రోతల నుంచీ విశేష ఆదరణని గుప్పించిన ఉత్తరాల ద్వారా తెలియపరచడంతో గంట నిడివితో రోజుకు మూడు సార్లు అతని కార్యక్రమానికి దారితీసింది. He’s smart. That’s what’s wrong about him. … He has to prove what a helluva fella he is every five minutes. And he seems madly in love with Lonesome Rhodes. అనుకుంటుంది మార్షా. “It’s my natural magnetism,” he explained, “my God-given magnetism.” ఈ వాక్యాలు చదవగానే ట్రంప్ గుర్తుకు రావడం సహజమే! తేడా అల్లా, రోడ్స్ అబద్ధాలు చెప్పలేదు, ఎవరినీ మోసం చెయ్యలేదు. తేడా ఇంకొకటి కూడా ఉన్నది: షరీఫ్ పదవికి అతణ్ణి పోటీ చెయ్యమన్నప్పుడు చెయ్యను అంటూ, తనకు చదవడం, రాయడం రాదనీ నిజాయితీగా చెప్పడం. He said the only difference between him and the other fella was that he, Lonesome, admitted that he didn’t know nuthin’.

రేడియోలో రోడ్స్ ఏకెయ్యగా అప్పటిదాకా ఎదురులేకుండా ఎన్నికవుతున్న షరీఫ్ ఆ ఎలక్షన్లలో ఓడిపోవడంతో రోడ్స్ టైం మాగజీన్ పేజీల కెక్కాడు. ఆ పత్రిక అతణ్ణి అప్పటికే ప్రఖ్యాతి చెందిన విల్ రోజర్స్ కి కుర్రాడి అవతారంగా అభివర్ణించింది. అది అతణ్ణి షికాగో నగరానికి పంపించడానికి సహకరించింది. చదవడం, రాయడం తనకి రాదని చెప్పిన రోడ్స్ ఆ షికాగో కాంట్రాక్ట్ ని తనకు కావలసినట్లుగా ఎలా రాయించుకున్నాడో ప్రత్యక్షంగా చూసిన మార్షాకి అతని తెలివితేటల గూర్చి అర్థమవుతుంది. (Where he got that adding-machine mind I don’t know, but he was never a cowhand when it came to finance.) అతనితోబాటు ఆమె కూడా షికాగో చేరుతుంది.  అక్కడ అతని షోకి చేసిన నామకరణమే ఈ కథకు శీర్షిక: యువర్ ఆర్కాన్సా ట్రావెలర్”.

ఆ షోలో ప్రపంచంలోని ప్రతి అంశం మీదా – న్యూ యార్క్ నగరంలోని ట్రాఫిక్ సమస్యకి పరిష్కారాల నుంచీ యునైటెడ్ నేషన్స్ ని అభివృద్ది చెయ్యడానికి మార్గాల దాకా దాకా అతను ఉపన్యసిస్తాడు. ‘He was rushing in where not only angels but a majority of fools would fear to tread.’ అంటుంది కథకురాలు మార్షా. (ఆ వర్ణన ప్రస్తుతం ఎన్నికలలో ఓడిపోయినా గానీ ఆఫీసు వీడని దేశాధ్యక్షునికి వర్తిస్తుంది కదా అని ఎవరయినా ప్రశ్నిస్తే దానికి జవాబు అవసరం ఉన్నదా?) పెళ్లి చేసుకొమ్మనమని అతను ఎన్నిసార్లు అడిగినా ఆమె తిరస్కరిస్తుంది.

రోడ్స్ ఎవరికయినా సహాయం కావలసివచ్చిందని తెలిస్తే వెంటనే తనకు చేతనయినంతలోనో లేదా రేడియోలో ఆ సంగతి ప్రస్తావించో సహాయం అందేలా చేస్తాడు. అలా సహాయం చెయ్యడంకోసం రోడ్స్ ఫౌండేషన్ని స్థాపిస్తాడు. విరాళాల నివ్వని పెద్దపెద్దవాళ్ల పేర్లు రేడియోలో చెప్పల్లా వాళ్లు చెక్ బుక్కుని  తెరిచేలా చేస్తాడు కూడా. పైసా ఇచ్చి మిలియన్లు ఇచ్చినట్లుగా హడావుడి చేసిన ట్రంప్ కీ రోడ్స్ కీ పెద్ద తేడా ఇది. “Never leave a first love just to have the last word,” అని ఆర్ద్రంగా పాడి వేల పెళ్ళిళ్ళని నిలబెట్టినవా డవుతాడు. అతని పేరు ఇంకా మార్మ్రోగిపోతుంది.

‘Lonesome was described as a cross between the Lord Jesus and Santa Claus with the better features of both,’ అని వ్యంగ్యంగానే పొగిడినట్లున్నా, “In the sheep’s clothing of rural Americana, he was a shrewd businessman with a sharp eye on the main chance. He was a complicated human being, an intensely self-centered one, who chose to wear the mask of the stumbling, bumbling, good-natured, “Shucks-folks-you-know-more-about-this-stuff-‘n-I-do” oaf.” అన్నది మార్షా అతణ్ణి గూర్చి చేసిన నిర్మొహమాట మయిన విమర్శ. ట్రంప్ గుర్తు కొస్తూనే ఉండాలి ఈ వాక్యాలు చదువుతున్నంతసేపూ. తన గూర్చి రోడ్స్ అభిప్రాయం: He could commit murder with that haw-haw-haw and everybody would think he was being a laugh riot. “నేను న్యూయార్క్ ఫిఫ్త్ ఎవెన్యూలో నిల్చొని ఎవర్ని కాల్చి చంపినా జనాలు నాకు వోటువేసి గెలిపిస్తారు” అని 2016 ఎన్నికల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్య గుర్తుకొచ్చిందా?

రోడ్స్ కి అంతకు ముందరే పెళ్లయిందని అతని భార్య వల్ల మార్షాకి తెలుస్తుంది. రోడ్స్ గూర్చి ఆమె అభిప్రాయం: “Not only is Mr. Rhodes a bastard,” Mrs. Rhodes went on, “Mr. Rhodes is a crazy bastard. A psycho-something or other. His skull thumper told me.” ఆమె పరిభాషలో skull thumper అంటే  mind doctor. ట్రంపుకు భార్య లెందరు?

షికాగోలో వచ్చిన ఖ్యాతి అతణ్ణి న్యూయార్కుకు లాక్కుని తీసుకెళ్లి ఇంకా ఎక్కువ పేరు పొందేలా చేస్తుంది. టీవీలో కూడా అతని ప్రోగ్రాములు రావడం మొదలవుతాయి. ఆర్కాన్సాలో లేడీ డ్రమ్మర్ల  పోటీకి వెళ్లి అక్కడ ఒక డ్రమ్మర్ యువతిని పెళ్లిచేసుకొస్తాడు. ఆమె టాలెంట్ కూడా అతని టీవీ ప్రోగ్రాముకు సహకరిస్తుంది.

తరువాత ఏమవుతుంది, మార్షా అతనితోనే ఉంటుందా అన్న ప్రశ్నలకి కథని చదివి జవాబులు తెలుసుకోవడం ఉత్తమం. అయితే, ఒకటి మాత్రం చెప్పవచ్చు. రోడ్స్ ఎలాంటి ఎన్నికలలోనూ నిలబడడు.

1953లో ప్రచురించిన ఈ కథ ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పరిస్థితిని గూర్చి ముందరే వార్నింగ్ నిచ్చినట్లుగా భావించవచ్చు. అయితే, తెలివిగలవాళ్లు చేసే తప్పేమిటంటే, ఇలాంటి పరిస్థితి వచ్చే సమస్యే లేదన్న భ్రాంతితో ఉండడం. ఆనాడే కాక నాలుగేళ్ల క్రితందాకా ఈ కథని చదివినవాళ్లు ఎవరూ కూడా ఊహించని పరిస్థితిని అమెరికా  ఎదుర్కొన్నది. 2016లో ప్రెసిడెంట్ ఒబామాని యూరోప్ లోని కొందరు నాయకులు ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడా అని అడిగితే, దేశప్రజలగూర్చి తనకున్న అపార నమ్మకంతో, ‘అలా అయ్యే ప్రసక్తే లే’దని ఆయన జవాబు చెప్పారు. ఈనాడు ఎన్నికలలో ఓడిపోయినా కూడా తనే గెలిచా డన్నట్లు ప్రవర్తిస్తున్నట్లున్న ట్రంప్ ని చూసి, ప్రజాస్వామ్య మనుగడకి తిలోదకాలిస్తున్నట్లున్న అతని రాజకీయ పార్టీని చూసి అమెరికన్లే కాక ప్రపంచ మంతటా ప్రజలు దిగ్భ్రాంతి చెందుతున్నారు అనడం అతిశయోక్తి కాదు.

ఈ కథని “ఎ ఫేస్ ఇన్ ది క్రౌడ్” అన్న పేరుతో తీసిన సినిమాకి రచయితే స్వయంగా స్క్రీన్‌ప్లే రాశారు. అది 1957లో విడుదల అయింది. ట్రంప్ అధ్యక్ష పదవి నలంకరించిన తరువాత ఈ కథని చర్చించడం జరిగింది గానీ ఈనాడు అలా జరగదు అన్న ఆశాభావాన్ని ఆ వ్యాసం వ్యక్తం చేసింది. “ఇక్కడ అలా జరగదు” అన్నది ఆ వ్యాసం శీర్షిక. ఎన్నికలలో ఓడిన తరువాత కూడా స్వార్థపూరిత ప్రయోజనాలని ఆశించి ఆ నియంతకి తల వంచుతూ వెన్నెముక లేనట్లు ప్రవర్తించే అతని పార్టీవాళ్ల వల్ల కూడా అతని ప్రవర్తన సాధ్యమవుతుందని ఆ వ్యాసకర్త ఊహించలేదు.

రచయిత పరిచయం:

బడ్ షుల్బర్గ్ (మార్చ్ 27, 1914 – ఆగస్ట్ 5, 2009)  నవలా రచయిత, స్పోర్ట్స్ రైటర్, స్క్రీన్‌ప్లే రైటర్, సినిమా నిర్మాత. మార్లన్ బ్రాండోకి పేరు తెచ్చిన “ఆన్ ది వాటర్ ఫ్రంట్” సినిమాకి ఆయన కథ, స్క్రీన్‌ప్లేలని సమకూర్చారు.  ఆ సినిమా పన్నెండు కాటగిరీల్లో నామినేట్ చెయ్యబడి, ఉత్తమ నటుడు, సినిమాలతో కలిపి ఎనిమిది ఆస్కార్ అకాడెమీ అవార్డులని గెలుచుకుంది. ఈనాడు బ్రతికుంటే తన రోడ్స్ కారక్టర్ గూర్చి ఏమనేవారో?

*

తాడికొండ శివకుమార శర్మ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు