ఇండ్ల ఏమున్నది? జీవితమున్నది!

మందలిత్తె మందైతరు. ముట్టుకుంటె అమురుకుంటరు. పల్లె తల్లుల తీరే అంత. అలుపు దెల్వకుంట కొలుపుబెడుతరు. దుక్కం కండ్లదీత్తరు. ధైర్నంగ వీపు నిమురుతరు. మనిషి ఉనికిని చాటి చెబ్తరు. బీరపువ్వు సుల్కు మొఖం గల్లోల్లు. సక్కదనాల ముసలవ్వలు. కండ్లబడితె కాళ్ళనద్దుకోబుద్దయితది. గసొంటి ముసలవ్వకు-కవికి జరిగిన ఏకవాక్య సంభాషణ సృష్టే -సాఫల్య జీవన కావ్యం” కవిత. రాసింది నలిమెల భాస్కర్.
*
సాఫల్య జీవన కావ్యం
~
“అమ్మా!జాగ్రత్త!!
కరోనా కాలం…జెర్ర పైలం”
ముందున్న పోర్షన్ లో అద్దెకుంటున్న
ముసలమ్మ తో అన్నాను
“అయ్యా!
అగ్గెనగాండ్ల బొండిగె పిసికినట్లు
పెండ్లైన ఎనిమిదేండ్లకే
పెనిమిటి జచ్చిండు
కండ్లల్ల కెల్లి
చెర్వులు అల్గులు దుంకినై
పల్లేరు కాయల్ల
బొర్లిచ్చినట్లయి పాయె బత్కు
అవ్వగారింటికి పోదామంటే
ఆడ అన్నదమ్ముల
నెత్తుల మీద జెట్టక్కనే కూసునె
పిడాత పానం దీసుకుందామంటే
కడ్పుల పుట్టిన మూడు కొమ్మలుండె
ఇగ…గుండె దైర్నం జేసుకున్న సారూ
రెక్కలు ముక్కలు జేస్కోని
పిల్లల్ని సాది సవరిచ్చిన
ఉన్నొక్క ఆడివిల్లను
ఎదురు సూడని ఇంటికిచ్చిన
మొగ పోరగాండ్లకు
వర్దచ్చిన జూడకుంట
మంచి కాన్దాన్ ల కెల్లి
ఇంటిదీపాలు నిల్పుకున్న
అందరి కడ్పులు పండి
మన్మలు మన్మరాండ్ల తోటి
నా తీగె పెద్దగైంది బిడ్డా
దిక్కు మల్లె మొగబాయి గాల్ల లోకంల
నియ్యతిగ బత్కిన నాయినా
ఈ మాయదారి దుర్జెట్ట రోగం పాడుగాను
ఇప్పుడు నా పికరంత
నా కోసురం కాదు తండ్రీ
బత్క పుట్టినోల్ల గురించి బాద
ఈ గండంల కెల్లి గడ్డకు పడి నేను
ఒగాల్ల ఉంటినా…నా బల్గానికి కండ్ల సల్వ
దబ్బన పోతినా…నా బత్కే ఒగ ఇల్వ
ఎటైనా మా బాగ్యమే సారూ”అంది నిమ్మలంగ
ఎంత తన్నుకున్నా ఒక రసాత్మక వాక్యం
ఏనాడూ కాలేక పోయిన నా ముందు
అలవోకగా ఓ గొప్ప దార్శనిక కావ్యం
“ఎటైనా మా బాగ్యమే”కురిసి
వెళి పోయింది ఆ గొంతు
*
ఇండ్ల ఏమున్నది? జీవితమున్నది. జీవితంలోని ఆటుపోట్లున్నయి. వాటిని తట్టుకుని నిలవడ్డ మొండిదైర్నం వున్నది. జిద్దుకు పోరగాండ్లను సాదుకున్న కన్నపాయిరమున్నది. కలోగంజో తాపి సంసారం సవురిచ్చిన తెలివిడున్నది. బత్కిన బతుక్కొక ఇల్వున్నది. చెప్పుకున్నోల్లకు చెప్పుకున్నంత, ఇన్నోల్లకు ఇన్నంత, సూశినోల్లకు సూశినంత కండ్ల సల్వ ఈ కవితని చెప్పొచ్చు. బహుభాషావేత్త నలిమెల భాస్కర్ ‘తెలంగాణ పదకోశం’ కూర్చినప్పటికీ తన కవిత్వసంపుటి “సుద్దముక్క” లో పలుకుబడిలో రాసిన కవితలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. ఈ కవితలో నుడికారపు ఛాయలు అగ్గలించినట్టుండి ఒక స్థాయిని సమకూర్చిపెట్టినట్టు అనిపిస్తుంది. కవిత శీర్షికను గమనిస్తే “సాఫల్య జీవన కావ్యం” లో అర్ధప్రాధాన్యతను చూడొచ్చు. సాఫల్యతకు ప్రాధాన్యమివ్వడం కవి ఉద్ధేశ్యమై వుండడం వల్ల అది ముందు చెప్పబడింది. సాధారణంగా ‘జీవన సాఫల్య కావ్యం’ అనొచ్చు. పాఠకుడికి నేటిసమాజంలో ప్రచారంలో వున్న ‘సంతాన సాఫల్యకేంద్రం’ అనే మాట కూడా స్ఫురించవచ్చు. అది వేరే సంగతి.
*
కవితలో వాడిన పలుకుబడులను గమనించినపుడు “అగ్గెనగాండ్ల బొండిగె పిసికినట్లు” అనే నానుడి సిరిసిల్ల ప్రాంతంలో ఎక్కువవాడుకలో వుంది. అగ్గెనగాండ్ల (అగ్గి-ఎన-కాండ్లు/కాడు)=అగ్గి అంటుకున్న అడవిలో అనే అర్ధం స్ఫురిస్తుంది. అడవిలో వదలడం అనేది కొంత భయాన్ని కలిగిస్తే, అగ్గి అంటుకున్న అడవి మరింత భయోత్పాపాన్ని సృష్టిస్తే, అగ్గి అంటుకున్న అడవిలో బొండిగె పిస్కటం అనేది ఎంత తీవ్రమైన పరిస్థితిని చెబుతుందో అర్థంచేసుకోవచ్చు. పాల్కురికి సోమనాథుని ‘బసవపురాణం’ లో “అగ్గలము, అగ్గలించిన, అగ్గలికము” అనే పదాలు కనబడుతాయి. వీటికీ “అగ్గెనగాండ్ల” పదానికేమైనా సంబంధం వుందా? అనేది భాషాపరిశోధకులు తేల్చాల్సిన విషయం. “పిడాత” అనే పదం (పిడుగు+వాత)నుండి వచ్చింది. బతకించడానికి ఎటువంటి అవకాశం లేనివిధంగా పానం దీసుకోవడం అని చెప్పడానికి వాడటం జరిగింది. ‘జెట్టక్క’ అనే పదం జనవ్యవహారంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల్లో ‘దరిద్రం’ అనే ఒకే అర్ధంలో వాడడం గమనిస్తాం. నెత్తిమీద జెట్టక్క కూసున్నదన్నా, పోశవ్వ కూసున్నదన్నా, ఇనుపగజ్జెల తల్లి అన్నా ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇక్కడ ఇంట్ల తిండిలేక కుండలు కొట్టుకునే పరిస్థితిని చెప్పడానికి కూడా కవి వాడినట్లు అర్ధంచేసుకోవచ్చు. “దుర్జెట్ట” రోగం అన్నప్పుడు (దుర్+జెట్ట) ఇంకెంత దరిద్రానికి సూచికగా చెప్పబడిందో అన్వయించుకోవచ్చు. కవి చెప్పదల్చుకున్న విషయాల్ని మరింత బలంగా దేశీ పదాల వాడకం ద్వారా చెప్పడం కవితకు అదనపు శక్తిని చేకూర్చినట్టయింది. అభివ్యక్తిలోని గాఢతను, సాంద్రతను సాధారణంగానే పల్లె పలుకుబడులు నిక్షిప్తం చేసుకొని వుండడాన్ని పరిశీలించవచ్చు. “వర్ధచ్చిన” అంటే ‘వరునికి ఇచ్చే దక్షిణ’ అని అర్థం. ఇప్పుడు మనం ‘వరకట్నం’ అని వాడుతున్నం. “మొగబాయి గాల్ల” లోకం అన్నప్పుడు తేమిడిబెట్టినట్టు ఒకకాడ కుప్పబోసినట్టు కనిపించడం లేదా ‘ఆడెక్కల ముచ్చట్లు’ అనే సంబోధనలోనూ ఒకేరకమైన అర్థం ధ్వనించడం గమనించొచ్చు. “కోసురం” అనే పదం కన్నడపదం ‘ఓస్కర’కు ‘ము’ ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడి వుంటుంది. “నా కోసురం గాదు/నా కోసం గాదు”గా చదువుకోవచ్చు. “కా(ఖా)న్ధాన్” అనేది ఉర్దూ పదం. దానికి వంశచరిత్ర అనే అర్ధముంది. పెండ్లిళ్ళు చేసేటప్పుడు ‘అటేడు తరాలు ఇటేడు తరాలు’ సూశి సంబంధం కల్పుకునేటోల్లు. జన్యుశాస్త్రవేత్త ‘మెండల్’ బఠానీ మొక్కలపై చేసిన పరిశోధనల ప్రకారం చూస్తే మానవుల DNA కూడా వారి పూర్వీకుల మానసిక దౌర్భల్యాలను, లక్షణాలను, ప్రవర్తనలను మోసుకుతిరుగుతుంటుందని నిర్ధారించబడింది. మంచి కాన్ధాన్ల నుంచి ఇంటిదీపాలను(కోడల్లు)నిల్పుకోవడంలో ఇదే విషయం దాగుంది. “కోరి కోరి బావను జేసుకుంటె కుంటోడు బుట్టిండని” ఊరోల్ల సామెత. జానపదుల అనుభవాలను సామెతల రూపంలో, శాత్రాల రూపంలో దాచిపెట్టి ముందుతరాలకు అందించిన సంగతి శాస్త్రీయకోణంలో పరిశీలించి, అవగాహనపర్చుకుని,అన్వయించుకునే ప్రయత్నం చేయాల్సి వుంది.
*
చెప్పే పద్ధతిని అనుసరించి కథనంలో కొన్ని పద్ధతులున్నాయి.అవి సరళ కథనం(లైన్ నరేటివ్), సరళంకాని కథనం(నాన్ లైనర్ నరేటివ్), సంభాషణాత్మక కథనం(కాన్వెర్సివ్ నరేటివ్), సంలీనాత్మక కథనం(ఇంటరాక్టివ్ నరేటివ్)మొ.నవి. (కవితారూపం-సరళకథనం/ఎం.నారాయణశర్మ). ఇద్దరి మాటల్ని ఒక్కరే చెబుతున్నట్టుగా వుంటే దాన్ని శర్మ చెప్పినట్లు ‘పాక్షిక సంభాషణాత్మక కథనం’గా తీసుకోవచ్చు. ఈ కవితలో అనుసరించిన పద్ధతి అసోంటిదే. తను మాట్లాడిన విషయాలు, ముసలమ్మ మాట్లాడిన విషయాల్ని తనే చెప్పడం ఇక్కడ గమనించవచ్చు.
*
“ఎటైనా మా బాగ్యమే” అన్న ముగింపు వాక్యమే ఇక్కడ “సాఫల్య జీవన కావ్యం”గా చెప్పబడింది. ఎంత విపత్కర పరిస్థితినైనా తమాయించుకునే గుండె నిబ్బరం జానపదులకు ఎట్ల అబ్బివుంటుంది? ఆశ్చర్యమనిపిస్తుంది. ‘జర పైలం’ అన్నందుకు ‘ఎటైనా మా బాగ్యమే’ అన్న ప్రతిచర్యగా వచ్చిన మాటల్ని ఆధారంగా చేసుకుని కవి ఒక జీవితాన్ని చిత్రించిన తీరు, వాడిన భాష చూసినపుడు నిజంగానే కండ్లసల్వ అనిపిస్తుంది. కవిత రాసిన భాస్కర్ సార్ కూ, రాయించేలా ఉత్ప్రేరకమైన ముసలమ్మకూ శనార్తులు.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం 

బండారి రాజ్ కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు