అరటి పండ్లతాత

ప్పుడిప్పుడే సాహిత్యం దాని ప్రభావాన్ని అర్థం చేసుకుంటున్న సాహిత్య విద్యార్థిని నేను. నేను పోరుమల్లలో పుట్టినా, మేము ఇప్పుడు రాయికల్ లో ఉంటున్నాము. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ‘ఇంటిగ్రేటేడ్ మాస్టర్స్’ పూర్తి చేసి ప్రస్తుతం తెలుగు శాఖలో పరిశోధన చేస్తున్నాను. సాహిత్యం భిన్న మనస్తత్వాల కలయిక అని నమ్ముతాను. అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకుంటాను. అలాగే ఇప్పుడిప్పుడే పుస్తకాలతో స్నేహం చేయడం ప్రారంభించాను. మాటల కన్న  పనులు చేయడం ముఖ్యమనిపిస్తుంది. మనసులోని విషయాలు స్వేచ్ఛగా పంచుకునే నలుగురు మనుషులు. చుట్టూ కొన్ని చెట్లు, కొంత ప్రకృతి, మనకంటూ కొంత సమయం చాలనుకుంటాను.

జీవితం ఎప్పుడు ఒక జ్ఞాపకాల గంప. ఆ జ్ఞాపకాలలోనే మనం దాటి వచ్చిన మన జీవితం గమనం కనిపిస్తుంది. అందులో కొన్ని మనల్ని ముందుకు నడిపించేవి మరికొన్ని అక్కడే కట్టిపడేసేవి. అలాంటి కొన్ని జ్ఞాపకాల్లో నను ముందుకు నడిపించే ఒక ఆలోచన రూపమే ఈ కథ. మనందరికి ఎదో ఒక రకంగా సమస్యలనేవి మన చుట్టూ ఉంటూనే ఉంటాయి. వాటి రూపం మారుతుందంతే! కానీ వాటిని దాటుకుని పోవడానికి ప్రతి మనిషికి కొంత తమదైన ధైర్యం ఒకటి కావాలి. దాన్ని ఏ విధంగా ఏర్పరచుకుంటరాన్న దానిపైనే మన జీవిత ప్రయాణం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది మానవ స్వభావం వల్లేనేమోగాని మన చుట్టూ వుండే మనషుల నుండే అలాంటి ధైర్యాన్ని పొందుతారు. అలా నాకు స్పూర్తినిచ్చే పేరు తెలియని ఒక వ్యక్తి గురించినదే ఈ కథ.

*

 

పేరు కూడా తెల్వదు తాతది “అరటి పండ్లతాత” అని దప్ప. నా మనస్సుల మాత్రం సిన్నప్పటిసంది గూడుకట్టినట్లు అ తాత రూపం అట్ల నిల్సిపోయింది. ఎందుకో నేనేపుడన్న సూపర్ మార్కెట్ కో, రోడ్ మీద పోతున్నప్పుడో ఏ అరటి పండ్ల బండి సూసిన ప్రతిసారి ఆ తాత రూపం మదిల మెదల్తనే ఉంటది.

ఒక పెద్ద అట్లాస్ సైకిల్ ఎనక, అప్పుడే బట్టిలోంచి తెచ్చిన పండ్లను బుట్టల వెట్టుకొని, హైండిల్ కి అటో వైపు, ఇటోవైపు కాలి సంచులు ఎస్కోని, పగటికి తినడానికి ఇంత సద్ది వెట్టుకోని ఒక యుద్ధానికి పోయే జవాన్ లాగా పోద్దుగాల్లనే బయలేల్లెటోడు. ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరికి రోజు అచ్చి, పొద్దంతా తిరిగి పైసలకో, అడ్లకో, మక్కలకో లేదా బీర్ సీసాలకో ఆ బుట్టను కాలిచేసి తన కష్టనంతా నింపుకొని పోయేటోడు పొద్దుగూకె సరికి. మా నాన్న నడిపే చాయ్ హోటల్ గుడిసేనే అ తాతకి పగటి పూట తినడానికి నీడనిచ్చే చెట్టు.

తాత పొద్దుగల్ల మా ఊళ్ళేకు రాంగనే, ఎంట తెచ్చుకున్న సద్దిని, నాన్న చాయ్ వెట్టె టేబుల్ పక్కకున్న గుంజకు తగిలేయడం ఫస్టు చేసే పని. ఎంటనే మా నాన్న చేతి ఒ సింగిల్ చాయ్ కడుపులేసుకొని, జీవితాన్ని ఎదురీదడానికి పోయేటోడు. నాకప్పుడు ఏడో, ఎనిమిదో యేండ్లుంటై అనుకుంటా. బడికివోయేటప్పుడు మధ్యలో అప్పుడప్పుడు హోటల్ కాడికి వోయేటోన్ని. తాత కనిపించంగనే మస్తు సంబురమయితుండే నాకు! నన్ను సూడంగనే మనుమనోలే ఎత్తుకొని బంతిముద్ద లాంటి బుట్ట దగ్గరికి తీసుకపోయి, పండు తీసిచ్చేటోడు. అది జూసి కేతిరి కింద నుంచచ్చే బొగ్గురవ్వల్లో మా నాన్న మొఖం సంతోషంతో ఎలిగిపోయేది. ఇగ నేనేమో అ అరటిపండుని మురిపెంగ బడిదంక తినుకుంట వోయేటోన్ని.

పేరుకే అరటిపండ్లు అమ్ముతడు గాని ఊరంతా సుట్టాలే తాతకి. ఇంట్ల టైంకి పైసల్లేకపోయిన, పనికోయేటోల్లు ముసల్లోల దగ్గర వదిలేసిన పోరగాండ్లు ఎవ్వలన్న, పండ్లు కావాలని ఎప్పుడన్నా ఏడ్సిన ఆళ్ళకు ఉద్దేరకే ఇచ్చిపోయేటోడు. ఊళ్ళే అందరికి ఇంట్ల మనిషిలేక్క కల్సివుంటెండె తాత. ఊళ్ళేకు ‘ఆర్ టి సి’ బస్సన్న రాకపోయేదేమో గాని తాత రాకుంట వుండేటోడు గాదు. ఎప్పుడన్నా జరం అత్తనో, పండగత్తేనో రాకపోయేటోడు గంతే. ఏవ్వలన్న పోలంకాడికి వోయేటోల్లకి పండ్లు కావలనిపిత్తే మా నాన్నకు పైసలిచ్చి పోయేటోల్లు కొనుంచుమని. అరటిపండ్ల తాత రోజు మా హోటల్ కాడ అగుతడని వుల్లెందరికి తెల్సు.

మా ఊరు, మండలంలోనే బాగా పెద్ద ఊరు. పదిహేను యేండ్ల కిందనే ఐదు ఆరు వేలకు ఎక్కువనే ఉండేది జనాభా. ఊళ్ళే వుండే పోస్ట్ మాస్టర్ కన్న తెల్వవేమో తాతకు తెల్సినన్ని సందులు. సూర్యుడు ఎవరో చాచికొట్టినట్టు వుండే మండుతున్న ఎండకాలంలో కూడా పండ్లమ్మి, అ చేమటతోనే తానం జేసినట్టుటుండే తాత.

నేనేప్పుడన్నా ఊళ్ళనే ఉన్న మా అమ్మమ్మోళ్ళ ఇంటికి వోయేటోన్ని. మద్యలేడన్నా తాత అమ్ముకుంట కనిపించిన, కేలపండ్లు అనే అరుపు ఇనిపించిన సాలు, వుర్కుంట సైకిల్ పొంట వోయేటోన్ని కనిపిత్తే ఎట్లైనా అరటిపండు ఇత్తడనే ఆశతో.

***

కొంచెం పెద్దగైనంక నేను నాన్నను తాత గురించి అడిగితే సెప్పిండు.

“ఆ తాతకి పిల్లలు వొళ్ళు లేరు. సిన్నప్పుడే సచ్చిపోయిర్రు. ముసలవ్వతోని బతుకుడు కష్టమై, అ సిటీ లా ఉన్న తాతకు సరైన పని దొరకకపోతే, సైకిల్ మీద మానురుకి అచ్చి తిరుక్కుంట అరటిపండ్లు అమ్ముడు చాల్ జేసిండు” అని ఇగ అట్లా జెప్పినంక, నన్ను సూడంగనే తాత ఎందుకు ఎత్తుకుంటుండెనో అర్థమయ్యింది.

కొన్నిరోజులకు మేముగూడ హోటల్ నడవకుంట అయిందని, మా సదువులకని, నాన్నకు ఏదన్న పని దొరుకుతదని పక్కనున్న మండలంకు వలస పోయినం. తర్వాత నేను పై సదువులకని హైదరాబాద్ రావడం. సెలవులల్ల ఎప్పుడో ఒక్కసారి ఇంటికి పోతుండే గాని మా ఊరికి పోవుడు మాత్రం బాగా తక్కువైంది.

ఎప్పుడన్నా కొన్నిసార్లు అనిపిత్తది ఇప్పటికి. ఎంత సదువుకున్నా. ఎన్ని జూసినా. జీవితం గురించి ఎప్పుడూ ఒక బెంగగానే వుంటది. చిన్న చిన్న కష్టాలకే అతలాకుతలం అయిపోతాం మనంగాని. అప్పుడు ఆ తాత రోజు దాదాపు యాభై కిలోమీటర్లు రాంగనెమో బుట్టనిండ అరటిపండ్లు, పొంగానెమో అదే బుట్టనిండ పండ్లమ్మంగా అచ్చిన మక్కలు, అడ్లు, అమ్ముతే ఆఠనా అచ్చే ఖాలీ బీర్ సిసలు ఎసుకొని సైకిల్ మీద తోక్కుకుంటా ఎట్ల వోయేటోడని. అన్ని కష్టాలున్నా మొఖంలో మాత్రం చిరునవ్వు చెదరనిచ్చేటోడు కాదు.

నేనోసారి ఇంటికి వోయినప్పుడు యాదికుంచుకుని నాన్నను అరటిపండ్ల తాత గురించి అడిగితె.

“నడుమొసారి ఊళ్ళేకు వోతే కల్సిండు తాత” అన్నాడు.

“ఎట్లున్నాడే?” తాత అంటే

“బాగా దివాలయిండు, మునుపటిలెక్క లేడు పెద్దమనిషి” అన్నాడు.

“ఏమన్నడే?” అని అడిగిన ఉండబట్టలేక.

“మునుపటి లెక్క పండ్లేడ కొంటుండ్రె? కొంటలేరు. అడ్లు మక్కల పంటలు రాంగానే బీట్లనే వోసి అమ్మవట్రి, ఇండ్లల్ల ఇత్తులు ఒళ్ళు వున్చుకుంటలేరాయే, పోల్లగాన్లమో దుకాన్ల పొంట ప్లాస్టిక్ కవర్లల దొరికే అదేదో ఆలుగడ్డ సిప్సట, ఏమో కుర్ కురే లాట, ఇంకా థమ్సప్ స్ప్రైట్లాట కూల్ డ్రింకులని అవ్విటికే బాగా అల్వటుయిండ్రు. పండ్లమ్ముడు పోతలేవే” అని బాగా బాధవడ్డడు అని సెప్పిండు.

“నేనేం పనిజేత్తున్న అన్ని అడిగిండు. నువ్వు గిట్ల హైద్రాబాద్ లా సదువుతున్నడు ఇప్పుడు అని సెప్తే, బాగా సంబురపడ్డడు, సూడంగ సూడంగానే పెద్దగయిపోయిండు కదా మనుమడు” అన్నాడట.

నాగ్గూడ ఒక్కసారి తాతని సుత్తె మంచిగుండు అనిపించింది. కానీ ఇగ ఇంటికాడ వుండే టైం లేక తొందర్నే హైదరాబాద్ బస్సెక్కిన బతుకు బండి కోసం.

***

కొన్నిరోజులకు ఫోన్ జేసి మాట్లాడుతున్నప్పుడు సెప్పిండు నాన్న ఒకరోజు. ఊళ్ళేకెళ్ళి అచ్చినోల్లు కల్తే వోల్లో నాన్నకు సేప్పిన్రంట.

ఒక్కసారి పండ్లుమ్ముకొని కొద్దిగా లేట్ గా ఇంటికోతుంటే ఎదో గుద్ది, తాతకు ఆక్సిడెంట్ అయిందంట. కుడికాలు ఇరిగి చాలా రోజులు నడవకుంట అయిండట. ఆళ్ళ ముసల్దే సాతనయింతల అర్సుకున్నదట. కానీ తాత ఇగ బాగా బక్కగై ఒక రోజు పానమిడ్సిడంట. అది ఇనంగానే గుండెల కలుక్కుమన్నది ఒక్కసారి నాకు. ఆ నొప్పికి గుర్తుగానేమో తెల్వకుంటనే కండ్లల్ల నీళ్ళు అచ్చినయి.

ఆ రోజు నాన్నను తాత గురించి అడిగింది యాదికొచ్చింది. మారిపోయిన రోజులన్నీ కండ్లముందు మేదిల్నై.

నేనే తాతోల్ల ఊరికివోయన్న సాతగాకుంట అయినప్పుడు ఒక్కసారన్న సుడకపోతిని. సిన్నప్పుడు తాత సేత ఎన్నో అరటిపండ్లు తిన్న నేను, తాతకు కనీసం ఒక్కసారన్న అరటిపండ్లు కూడా తిస్కవోకవోతి గదా అని బాగా బాధ అనిపించింది.

కానీ ఇప్పటికి ఎప్పుడన్నా నాకు జీవితం గురించి బెంగ ఏసిన. కష్టాలు అస్తే ఎట్లా అనిపించినప్పుడు, రోడ్ మీద ఎవరన్న ముసలోళ్ళు అరటిపండ్లు అమ్మంగ కనిపించిన అ తాత రూపమే కనిపిత్తది. అరటిపండ్ల బుట్ట ఎంబడ పోయిన నా బాల్యం యాదికొస్తది…!!

*

పక్కనే కూచుని అప్పటి ఙాపకాన్ని చెప్పినట్టుగా

అరటిపండ్ల తాత, బన్ రొట్టెల తాత, ఐస్క్రీం అమ్మే తాత ప్రతీ బాల్యానికీ ఇలాంటి తాతో అవ్వో దాదాపుగా ఉంటారు. కామన్ గా ఈ తాతలు ఎక్కువగా ముసల్మానులే అయి ఉంటారు. ఈ కేల పండ్ల తాత కూడా అలాంటి వాడే. నిజానికి ఈ కథ చెయ్యితిరిగిన రచయిత రాసీనట్టు అనిపించలేదు. ఒక చిన్ననాటి స్నేహితుడెవడో పక్కనే కూచుని అప్పటి ఙాపకాన్ని చెప్పినట్టుగా అనిపించింది. పక్కా తెలంగాణా భాష. చదువుతున్నప్పుడు కూడా ఆ యాసలోని స్వీట్నెస్ ని ఏమాత్రం మిస్ అవకుండ అందించిన రాత అద్బుతంగా అనిపించింది. ఇది ఒక నోస్టాల్జియాలోకి తీసుకు పోయి పడేసిన కథ…

 

-నరేష్కుమార్ సూఫీ

*

శ్రీపతి మారుతి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హాయ్ మారుతి కథ బాగా రాసినవు…. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినవు…అక్కడున్న ఏ ఉద్యోగం చేసినా పుట్టిన ఊరికి పోతున్నాం అంటే వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేం…….. నీ సాహిత్యంతో ఇట్లాంటి కథలు ఇంకెన్నో రాయాలని కోరుకుంటున్నాను

  • మిత్రమా నాకు నా కథనే చదువుతునట్టు ఉంది మనందరి జీవితంలో ఇట్లాంటి తాతలు, అవ్వలు ఉంటారు. ఏళ్ల తరబడి ఏమోయ్ ఎట్లున్నావ్ అని అడగుతా పోయేటోళ్ళు, కొందరివైతే కనీసం పేర్లు కూడా తెలియదు. నువ్వు కధ రాసినాక ఒక్కసారి అందరూ కళ్ళ ముందర తిరిగిర్రు.

  • Maruthi chala sahajanga rasavu. Alochinpa chesavu. Naaku kallamundu balyam kadaladindi. Manam em cheyyaledane badha ventadindi.

  • చాలా కదిలించే కధ . బాగా రాసారు. ఈ కధ చేయితిరిగిన రచయిత కి తక్కువకాకుండా రాసారు.

  • డియర్ మారుతి శ్రీపతి, నువ్వు రాసిన కథ ఇప్పుడే చదివాను. కన్నీళ్లొచ్చాయి.‌ వాస్తవిక జీవితానికి కళాత్మకతను బాగా మేళవించావు. మారుతున్న కాలంలో ఒకనాటి చిరువ్యాపారులెలా ఇబ్బందులు పడుతున్నారో ఈ కథ ద్వారా వివరించాను. తెలంగాణ స్వచ్చమైన భాష వల్ల నేటివిటీ ఉట్టిపడుతూ కథలో తాదాత్మ్యం అయ్యేటట్లు చేస్తుంది. కథను ముగించడం లో తాతని చివరి చూపు చూడలేదనే బాధ మానవీయవిలువలపట్ల ఉండాల్సిన కనీసం ధర్మాన్ని గుర్తించేలా చేసింది. మొట్టమొదటి కథ అయినా, చేయి తిరిగిన కథకుడిలా కథాకథనం సాగింది. నువ్వు మరెన్నో మంచి కథలు రాయాలని, రాయగలవని, ఆ దిశగా కృషి చేయాలని సూచిస్తూ, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను…. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 15.7.2020

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు