అమ్మకీ అడవికీ నడుమ సంఘర్షణ

మహిళా కోణంలోంచి మూసకు ఒదగని విప్లవకథ ‘కాంత పున్నం వెన్నెల’

రెండు అంశాలు  తెలుగుకథను తాకవలసినంతగా తాకలేదే అనే అసంతృప్తి ముప్పయి ఏళ్లుగా నన్ను వెంటాడుతూనే ఉంది. విశాలమైన సముద్ర తీరం ఉన్నా సముద్రంతో ముడిపడ్డ జీవితం తెలుగుకథలో నమోదు కాలేదు. అదేవిధంగా సుదీర్ఘకాలంగా సాయుధపోరాటాలు జరుగుతున్నా, ఆ జీవనసంఘర్షణ నమోదు కావలసినంత సున్నితంగా కథాసాహిత్యంలో నమోదు కాలేదు. మొదటిదాన్ని తెలుగుకథ పట్టుకోలేదు. రెండవది తెలుగుకథకు పట్టుబడలేదు. సముద్రం సాహిత్యానికి లొంగాలంటే, దాని ఆటుపోటుల్లో పడిలేవాలి. బయటిచూపు ఇందుకు సరిపోదు. లోపలినుంచి కథకులు పుట్టలేదు. ఆ ప్రయత్నం మనమూ చేయలేదు. ఏసీ హోటళ్లలో జరిగే రైటర్స్‌మీట్‌లూ, విరసం, వారి మిత్రులూ అనే గిరిలో జరిగే వర్క్‌షాప్‌లూ ఇందుకు ఉపయోగపడలేదు. అందుకే తెలుగుకథ తాకనివెన్నో మిగిలే ఉండిపోయాయి.

1970లో విప్లవపోరాటాలు తెలుగుకథాసాహిత్యాన్ని ఒక ఊపువూపేసినా, అవి ఒక మూసను నిర్మించి తెలుగు కథను కట్టడిచేశాయి. విప్లవకథ అనే ముద్ర 1990ల తర్వాత ఒక విడి పాయగా మిగిలిపోయింది. పాపులర్‌ పత్రికల్లోంచి జారిపోయి, విప్లవముద్రగల అచ్చు, వెబ్‌ పత్రికలకే ఈ కథలు పరిమితం అయిపోయాయి. ఈ పరిణామం, తెలుగుకథాసాహిత్యానికి చేస్తున్న నష్టం పెద్దదే. 70ల నాటి మూసను బద్దలు చేసుకునే ప్రయత్నాలు 90ల నుంచే మొదలైనా 2000 తర్వాతి కథల్లోనే బలంగా కనిపిస్తాయి. అజ్ఞాత ఉద్యమంలో భాగం అయినవారూ, లేదా దగ్గరగా ఉన్నవారూ రాస్తున్న కథల్లో ఈ తేడా కనిపిస్తోంది. దాదాపు 50 ఏళ్లుగా తెలుగు నేలను ఇంత ప్రభావితం చేసిన నక్సల్బరి ఉద్యమం నుంచి సాహిత్యం పరిమాణంలో నిజానికి తక్కువేమీ రాలేదు. గుణాత్మకంగా చూసినపుడు మాత్రం వెలితి కనిపిస్తుంది. వర్గశత్రువు దుర్మార్గాలనూ, దోపిడీనీ, పోరాటాలనూ, త్యాగాలనూ చూపినంతగా, జీవనసంఘర్షణను చిత్రించలేదే అనే విచారం కలుగుతుంది. అంతర్జాతీయ స్థాయి వస్తువు మనదగ్గర ఉన్నా, కథను ఆ స్థాయికి ఎందుకు తీసుకువెళ్లలేకపోయామో వివేచించుకోవాల్సి ఉంది.  విప్లవకథ అనగానే పక్కన పెట్టేసే పాఠకతరం పెరుగుతోందని గ్రహిస్తే, కథానిర్మాణంలో మరింత సునిసితత్వంకోసం ప్రయత్నం జరుగుతుంది. అటువంటి ఒక ప్రయత్నం జరుగుతూనే ఉందనే ఆశను ఇటీవల కొందరు కథకులు కలిగిస్తున్నారు. దురదృష్టవశాత్తూ దశాబ్దాలుగా బుర్రల్లో పేరుకుపోయిన మూసముద్ర వల్ల అటువంటి కథలను మిస్సవుతున్నాం.

కాంతం పున్నం వెన్నెల అనే కథ 2015లో అచ్చయ్యింది. తర్వా ఒక చిన్న బుక్‌లెట్‌ రూపంలోనూ వెలువడింది. పుస్తకాల అరలో తరచూ నా చేతికి  ఈ బుక్‌లెట్‌ తగిలేది. అయినా 2020లో  ‘అపురూప’ కథాసంపుటిలో వచ్చాకగానీ నేను ఆ కథను చదవలేదు.  చాలా కథలను నేను కోల్పోతున్నానని ఈ కథ చదివాక బలంగా అనిపించింది. ‘కథలపంట’, ‘విప్లవకథ’ పేర్లతో వచ్చిన సంకలనాలూ, పద్మకుమారి, షాహిద, మిడ్కో, అనూరాధ వంటివారు రాసిన కథలనూ ఆబగా వెతుక్కుని చదవడానికి ‘కాంత పున్నం వెన్నెల’ కథ నన్ను ఉత్సాహపరిచింది. కొన్ని కథలు నిట్టూర్పునే మిగిల్చినా, కొన్ని కథలు కొత్త ఆశను రగిల్చాయి. ఒక వర్గానికి విస్మృతకథలుగా ఉండిపోతున్నాయనే దిగులును పెంచాయి. 70ల నాటి మూసను తెంచుకోవడానికి చేస్తున్న పెనుగులాట ఈ కథల్లో కనిపిస్తోంది.

పద్మకుమారి రాసిన ‘కాంత పున్నం వెన్నెల’ కథలోని వస్తువు నిజానికి కొత్తదేమీ కాదు. తెలంగాణసాయుధ పోరాటం నేపథ్యంగా ఉప్పల లక్ష్మణరావు రాసిన (1975) ‘గెరిల్లా’ కథకూ, అజ్ఞాతసూరీడు రాసిన (1988) ‘విప్లవంలో మాతృత్వం’ కథకూ కొనసాగింపే ‘కాంత పున్నం వెన్నెల’ కథ. విప్లవోద్యమాల్లో ఆడవాళ్లు ఎదుర్కొనే సంఘర్షణ ఇది. మాతృత్వం ఒక మిత అని మాటలతో కొట్టిపారేయచ్చుగానీ, అమ్మతనపు బంధాన్ని తెంచుకోవడం అంత తేలిక మాత్రం కాదు. అజ్ఞాత పోరాట దళాల్లో ఉండే ఆడవాళ్లకు ఇదొక పెద్ద సవాలు. తుపాకి పట్టిన చేతులతో మరణాన్ని స్వీకరించడానికి సిద్ధపడినంత సులువుగా, కడుపులో మోసి కన్న బిడ్డను వదుల్చుకోలేరు. ‘మమకారం’ అనే ఒక్క మాటతో ముడిపెట్టి చూడగలిగిన అంశం కాదు ఇది. ‘త్యాగం’ అనే గుణంతో తెంచుకోదగిన బంధమూ కాదు. ఉద్యమమా, మాతృత్వమా అని త్రాసులో తూయగలిగినదీ కాదు. ఈ సంఘర్షణ అంతా కాంత పాత్రలో కనిపిస్తుంది.

అడవి అంచు పల్లెలోని ఒక పేద దళిత కుటుంబంలోని అమ్మాయి కాంత. పాటల కోయిల. పొలాల్లో, బతుకమ్మ పండుగల్లో ఊరిజనం కాంత పాటకి దాసోహం అయ్యేవారు. షావుకార్లు, అధికార్ల వేధింపుల నుంచి కూలినాలి జనానికి రక్షణ కవచంలా దళాలు ఉండేవి. ఎప్పుడో  ఏ అర్థరాత్రివేళో తూపాకులతో వచ్చిపోయే దళాలపట్ల యువతకి ఆసక్తి, అభిమానం. కాస్త వయసుకు రాగనే కాంత దళంలోకి వెళ్లిపోయింది. ఇక అప్పటినుంచీ పొలంపాట పల్లెల్ని రగిలించడం మొదలైంది. దళంలో ఆదివాసి యువకుడు పున్నంతో స్నేహం, ప్రేమ సాహచర్యంగా మారింది. ఒంటిమీద యూనిఫారం, భుజాన తుపాకీ, గొంతులోంచి తన్నుకొచ్చే పాట, గుండెల్లో దాచుకునే అడవి, ఆదివాసిజనం ప్రేమాభిమానాలు.. దళజీవితం కాంతకు అద్భుతంగా ఉంది. ఆనందంగా ఉంది. పున్నం చేయించుకున్న వేసెక్టమీ ఆపరేషన ఫెయిలయి గర్భవతి కావడంతో దళజీవితంలో కనిపించని ఇరుకు కాంతను ఇబ్బంది పెట్టడం మొదలైంది. పోలీసులు, దాడులు నడుమ అడవి దాటే అవకాశం రాలేదు. అబార్షనకి సమయం మించిపోయింది. కిట్‌, తుపాకీ మోత, మైళ్లకు మైళ్లు రోజూ నడక, దళ బాధ్యతలు.. కాంతకు బరువుగా మారాయి. శరీరం సహకరిచేది కాదు. నీరసం ఆవహించేది. ఇక అబార్షన అసాధ్యం, తల్లి ప్రాణానికి ప్రమాదం అని తేలిపోయింది. రోజువారీ దళచర్యల్లో ఇమడలేని ఆందోళన. లోపల పెరుగుతున్న బిడ్డమీదకు మళ్లుతున్న ఆలోచనలు.. దాంతోపాటూ కలుగుతున్న ఆనందం. ఈ స్థితిలోనే అడవిదాటే వీలు దొరికింది. ఇప్పుడేం చేయాలి? రిస్క్‌ తీసుకుని అబార్షన చేయించుకోవడమా? బయటే ఉండి బిడ్డను కనడమా? నిర్ణయం కాంతకే వదిలేసింది పార్టీ.

‘ఉద్యమకారులు మాతృత్వం వంటి వాటికి లొంగిపోకూడదు.’ దళాన్ని వీడి బయలుదేరే సమయంలో కాంతతో, సహచరుడు పున్నం అన్న మాటలు ఇవి. ఇది పున్నం నోటి వెంట వచ్చిన పార్టీ మాట. నిర్ణయం నీదేనంటూనే ‘ఏ కొంచెం అవకాశమున్నా డాక్టర్‌ని అడిగి తీసేయించుకోవడమే మంచిదేమో’ అని కూడా అతను సలహా ఇచ్చాడు. విప్లవ జీవితానికీ, వ్యక్తిగతజీవితానికీ నడుమ సంఘర్షణలో ఏమీ తేల్చుకోలేని స్థితిలోనే కాంతం ఆసుపత్రికి వెళ్లింది. ‘అబార్షన కష్టం. తప్పదంటే మీ ఇష్టం’ అని డాక్టర్‌ స్పష్టం చేసింది. కాంతం నిర్ణయం తీసుకుంది. బిడ్డను కనింది. నల్లని వెంట్రుకల మెత్తని ఆ బుల్లిపిల్ల స్పర్శ కాంతను ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తోంది. తనకెంతో ప్రియమైన అడవి జీవితాన్ని మరపిస్తోంది. ఈ కొత్త సంఘర్షణ, కాంతను కలవరపెట్టింది. అడవి ఒడిలోకి మళ్లీ  చేరిపోతే తప్ప బయటపడలేను అనుకుంది. నెలకూడా నిండని పసికందుతో అడవిలోకి బయలుదేరింది. తొలిసారి తను యూనిఫారం ధరించి, తూటాల మాల నడుముకి బిగించి కట్టుకుని, తుపాకి చేతుల్లోకి తీసుకున్న గూడెంలోకి ఈసారి పాపతో అడుగుపెట్టింది. గూడెంలోని వ్యక్తి సాయంతో దళాన్ని కలుసుకోవడానికి నడక మొదలైంది. అడవి దారిలో ఏదో అలికిడి. రక్షణగా వచ్చిన వ్యక్తి రైఫిల్‌ను పొజిషనలోకి తీసుకుంటూ బాటపక్కన పొదల్లోకి తప్పుకున్నాడు. ఎందుకో ‘పాప కేరుమని ఏడుపందుకునింది. అతను ఆందోళనగా కాంత వైపు చూశాడు. అప్రయత్నంగానే ఆమె చేయి పాప పెదాలమీదకు అడ్డుగా వెళ్లింది. ఊపిరి ఆడక ఆ చిన్ని ప్రాణం గిలగిలలాడుతూ, కాళ్లతో నిగ్గతన్నుతూ పెనుగులాడింది. బిడ్డ చెంపల్లోకి రక్తం ఎగజిమ్మింది.’ ఆదివాసీ రైతులు ఆ దారెంట వెళ్లిపోయాక, బాటమీదకు వచ్చారు. పాప ఏడుపు ఆపింది కానీ, ఆ బిడ్డ యాతన చూసిన కాంత గుండెల్లో సలుపుతున్నదేదో చల్లారనే లేదు.

నడిచి, నడిచి పాపతో సహా దళాన్ని చేరుకుంది కాంత. చేయి చేయి కలిపి బిగిపిడికిలితో చెప్పుకునే స్నేహచాలనంలో ఏదో తేడా. భుజాన తుపాకి లేదు. చేతుల్లో ‘మెత్తటి పువ్వులాంటి పాప’. ఈ ‘కొత్త కామ్రేడ్‌’ రాక దళంలోనూ సందడి తెచ్చింది. ‘ఆ కారడవిలో, తుపాకులు వేసుకున్న గెరిల్లాల చేతుల్లో పసిపాప అమాయకంగా, పిడికిళ్లు బిగించి, చెవులు రుద్దుకుంటూ, కళ్లూ, నోరూ మూస్తూ తెరుస్తూ, మధ్యమధ్యలో కదిలి కేర్‌ మంటూ..’  పాపతో ఆడుకోవడం సకల కుటుంబ సంబధాలనూ తెంచుకుని వచ్చిన విప్లవకారులకు సంబరంగా ఉంది. అయితే ‘తుపాకులను శుభ్రం చేసినంత సులభం కాదు పిల్లలపని చేయడం’ అని దొడ్డికి పోయిన పాపను కడగడానికి అవస్థపడుతున్న, ఆ బిడ్డ తండ్రి పున్నంను చూస్తే అందరికీ అర్థం అవుతోంది. అన్నలకూ, అక్కలకూ అమ్మ ఒడిలాంటి అడివి, ఆ పసికందుకు భద్రం కాదని తేలిపోయాక పాపను అడవి దాటించాలనే నిర్ణయానికి వచ్చారు కాంతం,పున్నం కలిసి. కానీ, ఆ నిర్ణయం ఆమెకు దుఃఖాన్ని కలిగిస్తోంది. అయినా పాపను పున్నం వాళ్ల అమ్మకి అప్పగించేయాలని అనుకున్నారు. పాపను అప్పగించి, కాంతను తిరిగి అడవిలోకి తీసుకువచ్చే బాధ్యతను జిల్లా కమిటీ సభ్యుడు రవికి అప్పగించారు. గూడెం దగ్గర్లోని మొక్కజొన్న చేనులో పున్నం కుటుంబాన్ని కలుసుకున్నారు. తన కొడుకు బిడ్డను చూసి మురిసిపోయి, పోలికలు వెతుక్కుంటున్న పున్నం తల్లికి ఒక ఆశ కలిగింది. పాపనీ, కొడల్నీ ఇంట్లో ఉంచేసుకుంటే కొడుకు కూడా అడవి వదలి వస్తాడని. అయితే బిడ్డని వదిలి కోడలు తిరిగి అడవికి వెళ్లిపోతుందని తెలిసిన తర్వాత, ‘ఈ పసిగుడ్డును నేనెట్ల సాదుకొనేది? కూలి పనికి పోకపోతే ఎల్లదాయె. తల్లి లేకుండా పిల్లని సూసుకొనుడు నా వల్ల యాడైతది?’ అని ఆమె ఏడుస్తూ తేల్చేసింది. పాతికేళ్ల కొడుకును దూరం చేసుకున్న తల్లి దుఃఖం అది.  నెలబిడ్డ తల్లి కాంత కూడా అత్తతో కలిసి బొరోమని ఏడ్చేసింది.

బిడ్డతో కాంత ప్రయాణం మళ్లీ మొదలైంది. అడవిలో ఏ రాత్ర వేళ అయినా దళానికి దారి చూపే పైలెట్‌గా నడిచిన కాంతకు,  చీకటిపడుతున్న సమయంలో పాపతో నడక కష్టంగా ఉంది. వాగు దగ్గర ఆగి ఊళ్లోకి కబురు పంపింది. ‘పాపకు పాలిస్తూవుంటే తన ప్రాణాన్ని పాపలోకి పంపుతున్నట్టుగా ఉంది’ కాంతకి. రాత్రి చీకటి మాటున కాంత చెల్లెలు నీల ఇంటికి చేరారు. ‘తుపాకి పట్టుకున్న చేతుల్లో పసిబిడ్డను చూడడం అందరికీ వింతగా ఉంది.’  పాపని నీలకి పెంపకానికి ఇచ్చేసి వెళ్లాలన్నది కాంత ఆలోచన. ‘నాకేడైతదక్కా. కొన్నేళ్లు నీవు బయటే ఉండు’ అని చెల్లెలు చెప్పేయడంతో కాంత నీరుగారిపోయింది. తెలతెలవారుతుండగా మళ్లీ అడవిలోకి ప్రయాణం మొదలైంది, పాపతోనే.

దళంలోకి తిరిగి చేరుకున్నా మునుపటిలా లేదు కాంతకి. ఏదో వెలితి. ఎలా దాటాలో తెలియదు. పాప కోసం అడవినీ, పార్టీ కోసం పాపనీ వదులుకోలేని అశక్తత. పిల్లల్తో కలిసి చేసే ప్రయాణం కాదు. పాప వల్ల దళానికీ, దళజీవితంలో పాపకీ ప్రమాదమే. సానుభూతిపరులకు పాపని అప్పగించేసి ఉద్యమంలో ఉండిపోవచ్చు కదా అన్నది పున్నం కోరిక. అయితే కామ్రేడ్‌ కాంతలోని అమ్మే గెలిచింది. పార్టీ అప్పగించిన పనులు బయట నుంచి రహస్యంగా చేసేలా పాపతో  కలిసి అడవిని వదిలేసింది.   ఈ సమయంలోనే సహచరుడు పున్నం ఎనకౌంటర్‌ అయిపోయాడు. ఊళ్లో కూలిపనులు చేసుకుంటూ, పాపను పెంచుకుంటూ అడవి బయట కాంత జీవనపోరాటం మొదలుపెట్టింది. పాప కాస్త పెరిగాక, చెల్లెలికి అప్పగించేసి మళ్లీ దళంలోకి వెళ్లిపోవాలన్న నిశ్చయం నెమ్మదిగా సడలిపోయింది. పాపతో పెనవేసుకుంటూ పెరిగిన అనుబంధం ఇక కదలనివ్వదని అర్థమైపోయింది. అట్లా అని రాజీపడలేకపోతోంది. అమ్మకీ అడవికీ నడుమ సంఘర్షణతో సతమతమయ్యేది. బయట ఉన్నా అప్పుడప్పుడూ కామ్రేడ్‌ రవిని కలిసే అవకాశం దొరికేది. అతని మాటలు కొంత ఊరటనిచ్చేవి. ఉద్యమంలో మరణించినవారి కుటుంబసభ్యులు ఏర్పాటు చేసుకున్న ప్రజాసంఘంలో పనిచేయమని అతను సలహా ఇచ్చాడు. ఎంతైనా అది దళబాధ్యతలతో పోల్చదగిన పని కాదు. ఈలోగా రవి కూడా ఎనకౌంటర్‌ అయిపోయాడు. జీవితం అంతా రాజకీయాలే అనుకుని అడవిలోకి వెళ్లిన కాంత, జీవితంతో రాజీపడిపోయింది. పాపే జీవితంగా మారిపోయింది. అయినా అడవి ఆమెను వెంటాడుతూనే ఉండేది. అడవిలోని అన్నలనూ, అక్కలనూ కలవాలన్న ఆరాటంతో తిరుగులాడేది. వేరు తెగిన చెట్టులా విలవిలలాడేది. ఈ సమయంలోనే కామ్రేడ్‌ రవి సంస్మరణ సభ జరుగుతోందని తెలిసి,  ఏడేళ్ల పాప వెన్నెలతో కలిసి బయలుదేరింది కాంత.  ఈ ముగింపులో రచయిత్రి కాంతను ఉద్యమానికి చేరువ చేసిందనే సూచన ఉన్నా, ఆమెలోని సంఘర్షణకు ఇది పరిష్కారం అని మాత్రం చెప్పలేదు. పడికట్టు పరిష్కారాలు చూపకపోవడమే ఈ కథ ప్రత్యేకత. కథ తొలినుంచీ చివరిదాకా తల్లిగా ఒక విప్లవకారిణిలోపల జరిగే సంఘర్షణను పద్మకుమారి చిత్రించారు. మహిళా కోణంలోంచి నడిపే క్రమంలో పార్టీ గీతను కథ ఎక్కడ దాటిపోతుందో అనే ఆందోళన, రచయిత్రిలో ఉందని అక్కడక్కడా చేసిన వ్యాఖ్యలు పట్టిస్తాయి.  అయినా మూసకు ఒదగని విప్లవకథగా ‘కాంత పున్నం వెన్నెల’ నాకు నచ్చింది.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు