అమెరికనైజ్ద్ పాత స్నేహితులు???

వంగూరి జీవిత కాలమ్-61

మెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజు గడిచాక ఆ వారాంతం మా తమ్ముడు “జీవీ రమణ ఇంటికి వెడదాం, ఇప్పటికే నాలుగు సార్లు పిలిచాడు” అన్నాడు. “సరే” అని మా వాడి   1968 ఫోర్డ్ కస్టం గేలక్సీ 500 కారులో “గేస్ కొట్టించుకుని” అనే కొత్త అమెరికన్ తెలుగు మాటని ఆచరణ లో పెట్టాం. అంటే అది ఇప్పటిలా “మనకి మనమే గేస్ కొట్టుకోవడం” కాదు. ఆ “గేస్” ఖరీదు గేలన్ కి 0.249…. అనగా 25 సెంట్లు,,కాస్త అటు, ఇటూగా. ఇప్పటికీ ఇండియాలో అమలులో ఉన్న పధ్ధతిలో మనం దర్జాగా కారులోనే కూచుంటే ఆ గేస్ స్టేషన్ లో పని వాడే గేస్ కొట్టడం అనమాట. అదీ “ఓ వంద రూపాయలు కొట్టు” అని కాకుండా చాలా మంది “ఫుల్ టాంక్” కొట్టించుకుంటారుట…కానీ మా అప్పటి ఆర్ధిక పరిస్థితి ప్రకారం “మూడు డాలర్లు కొట్టు” అనగానే ఆ కొట్టువాడు నన్నూ, మా తమ్ముడినీ అప్పుడే మెక్సికో నుంచి దిగుమతి అయిన “వెట్ బేక్” గాళ్ళ లా చూసి విసురుగా, విసుగ్గానే ఆ గేస్ కొట్టాడు. ఎందుకంటే మేఁము ఎలాగా టిప్పు ఇవ్వలేము కదా అని. అప్పుడు మా తమ్ముడు ఆ టిప్పు ఇవ్వగానే వాడికి మొహం ఎలా పెట్టాలో తెలీ లేదు పాపం. ఈ “వెట్ బేక్” అన్నది కూడా నాకు సరి కొత్త అమెరికా పదమే. అలాంటి de నల్లవారిని ఉద్దేశించిన పదాలూ వాటి వెనకాల అర్ధాలూ, అపార్ధాలూ, వెటకారాలూ అన్నీ తరవాత, తరవాత అర్ధం అయ్యాయి. ఇక రెండో, మూడో డాలర్లు కొట్టించడం లో రహస్యం ఏమిటంటే…ఈ జీవీ రమణ ఉండేది ఎక్కడో డౌన్ టౌన్ లో సొంత “కాండొ” లోట. అక్కడికి వెళ్ళి రావడానికి గేస్ ఖర్చు ఐదు డాలర్లనమాట. ఈ “కాండో” ఎపార్ట్మెంట్”, సబ్-డివిజన్, రోడ్డుకి కుడి పక్క డ్రైవింగూ, కార్లలో స్టీరింగ్ ‘తప్పు’ వేపు ఉండడం కూడా నాకు మాటలూ, కొత్త విషయాలే. అప్పటి మా తమ్ముడి కారు ఫొటో ఇక్కడ జతపరిచాను. అందులో ఉన్న కె.ఎస్ మూర్తి, చంద్ర శేఖర్ల గురించి ముందు ముందు చెప్తాను.

ఇంతకీ ఈ జీవీ రమణ మా కాకినాడ లో లక్కరాజు సుబ్బారావు గారి మనవడే కానీ గంజాం వారికి దత్తత వెళ్ళిన బాగా ధనంతుడు. ఆ కుటుంబం వాళ్ళు అప్పుడు వంట గేస్ సిలిండర్లకి కాకినాడ లో డిస్ట్రిబ్యూటర్లు..ఇప్పుడు కూడా అనుకుంటాను. మాకు కుటుంబ స్నేహితులు. అంతే కాదు. రంగరాయ మెడికల్ కాలెజ్ లో మెడిసిన్ చదివినప్పుడు అతను వాళ్ళ క్రికెట్ టీమ్ కి బేట్స్ మన్ అయితే నేను ఇంజనీరింగ్ కాలేజ్ కి ఆడేవాడిని. అలాగే ఏ.వీ రమణ అనే అతను వాళ్ళకి ఓపెనింగ్ బౌలర్. అలా ఏవీ రమణ, జీవీ రవణా జంట కవుల్లా ఉండే వారు. అతను ఇప్పుడు చికాగో లో ఆర్థోపీడిక్ సర్జన్. నేనూ, మా తమ్ముడూ అతని కాండో కి వెళ్ళే సరికి అతని అమెరికన్ చెలికత్తె…అదే గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంది. మన వాళ్ళు అమెరికన్ అమ్మాయిల తో తిరుగుతారు అనీ, లేదా అమెరికన్ అమ్మాయిలు మన ఇండియన్స్ అంటే “పడి చచ్చిపోతారు” అనే అసంబధ్దమైన చవక బారు అభిప్రాయాలు అప్పుడూ, ఇప్పుడూ కూదా ఉన్నాయి. ఆ నేపధ్యం లో తూ.గో. జిల్లా అగ్రకుల సంజాతుడు అమెరికన్ అమ్మాయి తో అంత కులాసాగా ఉండడం చూడడం నాకు అదే మొదటి సారి. మా ముగ్గురి మధ్యా ఆ కబుర్లూ, ఈ కబుర్లూ, అవుతూ ఉండగా ఆ అమ్మాయి అదేదో పదార్ధం తయారు చేసింది తినడానికి. అది కూడా కుంపటి మీద కాల్చీ, వేయించీ కాదు. నేను భారత దేశం లో చూడని “అవెన్” అనే పొయ్యి లోకి ఒక పళ్ళెం లో దాన్ని తేసేసి, అరగంట సేపు అయ్యాక పొగలు గక్కుతున్న దాన్ని బయటకి తీసి, త్రిభుజాకారం లో ముక్కలు గా కత్తిరించి అందరికీ తలో రెండు ముక్కలూ పంచిపెట్టింది. దాని పేరు ‘పిజ్జా’ అంటారుట. నమ్మండి, నమ్మక పొండి….నేను బొంబాయి లో ఎనిమిదేళ్ళు ఉండి ఏదో పెద్ద ఎత్తులో ఉన్నాను అని అనిపోకపోయినా, ఈ పిజ్జా తినుబండారం పేరు    విననే లేదు. ఆ పిజ్జా అమెరికాలొ భారతీయులకే కాక, ఇప్పుడు భారత దేశం లో కూడా ప్రధాన ఆహార పదార్ధం అవుతుంది అని ఆనాడు కలలో కూడా ఊహించ లేదు. ఆ పిజ్జా తినగానే నాకేమీ పెద్ద అభిప్రాయం అటూ, ఇటూ కానీ కలగ లేదు. నిజానికి ఆహార పదార్ధాల విషయాలలో నాకు ఆవకాయా, గోంగూరా, మామిడికాయ పప్పూ ఎంత ఇష్టమైనా, కంగ్ ఫూ యాంగ్, హేలపీనో పిజ్జా, ఎగ్ ప్లాంట్ పర్మజాన్, ఎంచిలాడాల లాంటి ఇతర దేశాల ఆహార పదార్ధాల మీదా ఏ మాత్రం అయిష్టం కానీ, వ్యతిరేకత కానీ లేదు. అన్నీ చల్తా హై. తీరా మేము ఆ పిజ్జాలు కాగితం కంచాల మీద పెట్టుకుని తిన్నాక అవి చెత్త బుట్ట లో పారేసినా, ఆ పిజ్జా పళ్ళెమూ, చెంచాలూ అన్నీ పాపం ఆ అమెరికా పిల్ల సబ్బు తో కడిగి శుభ్రం చేస్తుంటే, ఆ అమ్మాయి పేరు లిండాయో, బ్రెండాయో, గుర్తు లేదు కానీ …. మా తమ్ముడు “ఆగాగు. నేను చేస్తాను ఉండు, లిండా”  అన్నాడు. అప్పుడు జీవీ రవణ “కడగనీ రా….ఈ అమ్మాయి బాబూ, అమ్మల ప్లేట్లు మన అమ్మా, బాబులు కడిగారు 400 ఏళ్ళ పాటు…ఇప్పుడు మన వంతు….కోర్స్ రివర్స్” అన్నాడు. ఇక్కడ చెప్పదల్చుకున్న మరో చిన్న విషయం ఏమిటంటే….మేము ఇండియాలో 1960 ప్రాంతాలలో క్రికెట్ ఆడేటప్పుడు “ఏమండీ, జీవీ గారూ” అని నేనూ, “చిట్టెన్ రాజు గారూ, బాగా ఆడారు” అని జీవీ అని సంబోధించుకునే వాళ్ళం…అలాంటిది ఈ రోజు అమెరికాలో కలుసుకున్న మొదటి రోజే “ఏరా, చిట్టెన్ రాజూ. ఎలా ఉన్నావ్?, అమెరికాకి స్వాగతం రా” అని జీవీ నన్ను “ఒరేయ్” అని ఆప్యాయంగా పిలవడం నేను గమనించనే లేదు. అలా భారత దేశం లో నాకు ఏనాడో తెలిసిన స్నేహితులు నన్ను అమెరికాలో చూడగానే ఆనందంతో అక్కున చేర్చుకున్న వారు చాలా మంది ఉన్నారు.

దీనికి విరుధ్ధమైన అనుభవం మరొకటి కూడా చెప్తాను. ఇది కూడా ఇంచుమించు ఆ మొదటి వారం లోనే జరిగింది. ఆ శనివారమో, ఆదివారమో మా తమ్ముడు” ‘జరామూర్తి’ ని చూద్దాం..ఇప్పుడే అతడిని పిలిచాను” అన్నాడు. అతని పూర్తి పేరు చెప్పదల్చుకో లేదు కానీ ఈ జరామూర్తి నాకు కాకినాడలో ఒకటి, రెండేళ్ళు జూనియర్. ఆ బేచ్ లో కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ అనుకుంటాను. అప్పటికి అమెరికా వచ్చి పి.హెచ్. డి పూర్తి చేసి పోస్ట్-డాక్టొరల్ లాంటి మధ్యంతరం పరిస్థితిలో ఉన్నాడు. ఇండియాలో ఉన్నప్పుడు నాతో బాగానే ఉండే వాడు కానీ ఎక్కువ పరిచయం లేదు. నేనూ, మా తమ్ముడూ అతని ఎపార్ర్ట్మెంట్ కి వెళ్ళగానే మరి కొందరు మిత్రులు కూడా చేరారు. అమెరికా వారాంతాలలో బ్రహ్మచారుల సామూహిక బీర్ మరియు పిజ్జా కార్యక్రమాల తొలి నిర్ఘాంత అనుభవం అదే నాకు. కాస్సేపు ఆ మాటలూ, ఈ జోకులూ అయ్యాకా ఆ జరామూర్తి “నువ్వెలా వచ్చావ్ అమెరికాకి” అన్నాడు. ఆ ధ్వని నాకు సరిగ్గానే వినపడింది. ఆ వెటకారం నన్ను దాటిపో లేదు. “ఎలా, ఏముందీ, బొంబాయి లో చదువు అయ్యాక ఇక్కతీసి డికి రావాలి అనిపించింది. అంతే” అన్నాను. “అక్కడ డాక్టరేట్లు కూడా ఇస్తున్నారా?” జరామూర్తి తరవాతి ఉవాచ. ఇలా జరిగిన ఐదు నిముషాల సంభాషణ లో నాకు అర్ధం అయినది ఏమిటంటే “నాబోటి ఎంతో ప్రతిభావంతులు అమెరికా రావాలి కానీ నీ బోటి గాళ్ళు వచ్చి పరువు తీసేస్తున్నారు” అని అతని అభిప్రాయం. ఆ మాటల్లోనే నాకు తెలిసిన పరమ రహస్యం అతను ఇంకా సరి అయిన వీసా లేక అవస్థ పడుతున్నాడు అని అర్ధం అయింది. అతడి ధాటీని నివారించడానికి ఇక నాకు తప్పక “ఏమో నాకు తెలీదు కానీ, ఇదిగో అమెరికా వాళ్ళు నాకు బహూకరించిన గ్రీన్ కార్డ్” అని నా వాలెట్ లోంచి  తీసి చూపించాను. పాపం, అతను నిర్ఘాంత పోయాడు. అతనే కాదు. ఆ గదిలో ఉన్న ఐదారుగురూ కూడా నిర్ఘాంత పోయారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏదో ఎఫ్ 1 వీసా మీదో, స్టూడెంట్ వీసా మీదో ఉండి గ్రీన్ కార్డ్ కి అప్లై చెయ్యడానికి భయపడుతూనో, అప్లై చేసి అది వస్తుందో, రాదో అనో సంకట కాలం లో ఉన్న వారే. అలాంటింది తిన్నగా భారత దేశం నుంచి ఏకంగా గ్ర్రీన్ కార్డ్ తో అమెరికా లో అడుగుపెట్టిన నన్ను చూసి ఆశర్యపోయారు. పైగా అదేదో ఫేమిలీ వలన వచ్చినది కాదు. అమెరికాలో మా తమ్ముడి ది కూడా అప్పుడు ఎఫ్ 1 వీసాయే. నా గ్రీన్ కార్డ్ ఆ అందరికీ ఉన్న డిగ్రీల లాంటి డిగ్రీ లని బట్టే….ఆ తరవాత నేను అమెరికాలో మళ్ళీ ఎక్కడో అత్యవసరమైన చోట తప్ప ఆ గ్రీన్ కార్డ్ ని ఎక్కడా అలా చూపించవలసిన అవసరం రాలేదు. పైగా అంత “గీర” గా చెప్పుకోవలసినంత అవసరం అస్సలు రాలేదు. అమెరికా రాగానే కొంత మంది ప్రవర్తన ఎలా మారుతుందో నేను తొలి వారం లోనే గమనించడానికి ఈ జీవీ రమణ, జరామూర్తి ల ఉదంతాలు ప్రస్తావించాను. పాత స్నేహితుడు అమెరికాలో కనపడగానే ఆప్యాయంగా పలకరించి పెన వేసుకున్న వాడు ఒకడూ అయితే, అదే పాత స్నేహితుడు ఇక్కడ కూడా దాపరించి నా పరువు తీసీశాడు అని విచారించిన వాడూ మరొకడూ. అదీ తేడా!. ఎప్పుడో 1975 జనవరి లో ఈ ఉదంతాలు జరిగాక నేను మళ్ళీ వారిని కలవ లేదు. జీవీ రమణ చనిపోయి కొన్నేళ్ళయింది. జరామూర్తి ఎక్కడో ప్రొఫెసర్ గా ఉన్నాడు అని ఎవరో చెప్పగా విన్నాను. అన్నట్టు, నా ఇండియా డాక్టరేట్ ని కొట్టిపారేసి, నన్ను ఘోరంగా అవమానించిన పెద్దాయన మరొకరు ఉన్నారు. ఆయన ప్రస్తావన ఇప్పుడప్పుడే రాదు…

ఇక నేను అమెరికా వచ్చిన మొదటి వారం లో నేను గమనించిన ప్రధానమైన విషయం ఇక్కడి ప్రశాంతత. నిశ్శబ్దం. షాపింగ్ మాల్స్, రైళ్ళు ఇలా అన్నిచోట్లా వందల కొద్దీ జనం ఉన్నా రణగొణ ధ్వనులు, అరుపులూ, కేకలూ లేకుండానే అన్నీ జరిగిపోవడం మొదలైనవి ఒక ఎత్తు. నాతో కానీ, ఒకరి ఒకరు కానీ గొంతు పెంచకుండా మర్యాదని అతిక్రమించకుండా విషయం ఏదైనా సరే సామరస్యం గానే, సరి కొత్తవాళ్ల తో కూడా  సహజంగానే, నవ్వుతూనే మాట్లాడడం నాకు అన్నింటికన్నా నచ్చినదీ, ఆశ్చర్యం కలిగించినదీ మరొక ఎత్తు. ఆ సమాజ సంస్కారం అమెరికా పట్ల నాకు ఎంతో గౌరవం కలిగించినది.  ఈ స్వీయానుభవాలు ఎలా కలిగాయో…త్వరలోనే…

*

వంగూరి చిట్టెన్ రాజు

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంతకూ ఆ లిండా ఏమైంది గురువు గారూ? విచిత్రమేమిటంటే, నేను మొదట తిన్న తిండి కూడా పిజ్జా నే. పిజ్జా ఇన్ లో తిన్నాను (రైస్ యూనివర్సిటీ పక్కన ఉండేది). ఇండియాలో తిన్నదానికి దీనికి అసలు పొంతనే లేదు!

    • ఇంత కధలో మీకు మిగతావి నచ్చలేదాండి? లిండా గురించే అడుగుతున్నారు? నేను మీ కామెంట్ చదివి పగలబడి నవ్వుకుంటున్నాను – నిజంగానే. 😉

    • ఆ రోజుల్లో పిజ్జా హట్, పిజ్జా ఇన్ అని రెండే ఉండేవి, రామారావూ. ఆ మధ్య నేను ఇండియా వెళ్ళినప్పుడు తిన్న పిజ్జా కీ అమెరికాలో మనం తినే పిజ్జా కీ అస్సలు పొంతన లేదు. ఇక నిజంగా ఇటలీ లో ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పాలి.

  • హా హా అదరగొట్టారు. నేను ఇక్కడకి వచ్చిన చాలా రోజులకి కానీ పిజా తినలేదు. మొదట తిన్నది డోనట్ – వచ్చిన వారానికి ఎవరో షాపింగ్ కి తీసుకెళ్తే కొనిపించినది అది (నేను వద్దంటూనే ఉన్నా వాళ్ళు వినిపించుకోలేదు, అలా కాదు ఇది ఉండాలి పొద్దున్నే తినడానికి అన్నారు). ఆ తర్వాతది టాకో బెల్ లో బీన్ బురిటో. 🙂 తినేటపుడు అదేమిటో కూడా తెలియదు అందులో మాంసం ఉందేమో అనే అనుమానం వదల్లేదు. మనవాళ్ళ గురించి సరిగా చెప్పారు. ఇటువంటివి కొన్ని నాకూ ఉన్నాయి.

  • అప్పుడే ఏం ఉంది, శర్మ గారూ ..ఇంకా చాలా ఉంది. ..మన వాళ్ళ గురించి చెప్పడానికి ….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు