అన్నీ అందరికీ కుదరవు!

“స్త్రీ-పురుష సంబంధాలు డబ్బుతోనూ, జయాపజయాలతోనూ మాత్రమే ముడిపడి వుంటాయా?” అని ప్రశ్నించినవాళ్లని చిన్నచూపు చూస్తూ, “కాదు, వాళ్ల మధ్య నుండే ప్రేమతో మాత్రమే!” అని కోట్లమంది తేలిగ్గా జవాబు చెబుతారు. ముఖ్యంగా సందేశాత్మక, ప్రబోధాత్మక కథల్లో. బాగా డబ్బులున్న అరవయ్యేళ్ల సెలబ్రిటీ మగాడు తన వయసులో సగం కూడా లేని అందమైన స్త్రీని పెళ్లిచేసుకుంటే అసూయపడే మగాళ్లు అలాంటి స్త్రీలని “ట్రోఫీ వైఫ్” లంటారు. ఇంకొందరు ఆ స్త్రీలని “గోల్డ్ డిగ్గర్స్” అంటారు. అయితే, ఆ పురుషుడి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎలాంటివో ఆ జీవితంతో ఏమాత్రం సంబంధం లేనివాళ్లకు తెలిసే అవకాశం శూన్యం – అలాంటి జీవితాల అస్తిత్వ కథలని ఎవరయినా రాయగా చదివితే తప్ప.ఇషుగురో రాసిన “క్రూనర్” కథ అలాంటి జీవితాలని అర్థంచేసుకునే టందుకు సహకరిస్తుంది. ఈ కథ, Nocturnes: Five Stories of Music and Nightfall అన్న పుస్తకంలోని అయిదు కథల్లో ఒకటి.

చూడడానికీ, వినడానికీ సెలబ్రిటీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది గానీ, ఆ లైఫ్ గడుతుపున్నవాళ్లకే అందులోని సాధకబాధకాలు తెలుస్తాయి. ఉదాహరణకి, సినీ నటులని తీసుకోండి. సినిమా రంగంలో దిగగానే మొదటి సినిమాని జయం వరించిందా, ఇంక తనకి తిరుగు లేదన్న ఆత్మవిశ్వాసాన్ని ఆ వ్యక్తి – హీరో గానీ, హీరోయిన్ గానీ – పొందుతారు. అపజయం ఎదురయితే మాత్రం, తరువాతి సినిమా తప్పకుండా విజయవంత మవుతుందన్న ఆశతో తరువాతి అవకాశం కోసం ఎన్ని తిప్పలయినా పడతారు. నాలుగు సినిమాలు విజయవంత మయితే ఇంకా ఇబ్బంది. తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని అవి కలుగజేసి, తరువాత రెండు, మూడు వరుసగా దెబ్బ తిన్నా గానీ, దానికి కారణాన్ని వేరొకరికి అంటగట్టడంకోసం ప్రయత్నిస్తారు. హీరోయిన్లకు పాపం పెద్ద ఛాయిస్ ఉండదు గానీ, హీరోల తరఫున వకాల్తా తీసుకుని హీరోయిన్ అచ్చిరాలేదని ప్రచారం చేస్తారు. తమ హీరో వేశాడని సినిమా ఎలా వున్నా చూసేవాళ్లతో మాత్రమే నిర్మాతలు తమ కనీస ఖర్చులు రాబట్టుకో గలిగితే ఏ బాధా ఉండదు గానీ, అలా కుదరకపోవడం వల్లే సమస్యలన్నీ వచ్చేది.

“ఎన్నిసార్లు జన్మ నిచ్చినా గానీ ఆయమ్మకు తరువాతి కాన్పుకు కూడా పురిటి నెప్పులు తప్పనట్లే, ఎన్ని అవధానాలు చేసినా గానీ మళ్లీ అవధానం చేయబోతున్నప్పుడు దాన్ని విజయవంతం చెయ్యమని కోరుతూ ఈ సరస్వతీ ప్రార్థన,” అన్నారు గరికపాటి నరసింహారావు గారు కొన్నేళ్ల క్రితం ఫిలడెల్ఫియా నగరంలో అవధానానికి శ్రీకారాన్ని చుడుతూ. అవధానికీ సినిమా నటుడికీ తేడా ఏమిటంటే, అవధానం విజయవంతం అవడం పూర్తిగా అవధాని నైపుణ్యం మీద ఆధారపడుతుంది. సినీ నటుడు ఒక విధంగా నిమిత్తమాత్రుడు. అతడు ఎంత గొప్పగా నటించినా గానీ సవాలక్ష కారణాల వల్ల ఆ సినిమా పరాజయాన్ని పొందవచ్చు. అంటే, సినిమా జయాపజయాలు ఆ సినిమాతో సంబంధం ఉన్నవాళ్లకి ఏమాత్రం పరిమితం కాకుండా ఎలాంటి సినిమాలు కావాలో తమకే పూర్తిగా తెలియని ప్రేక్షకుల పైన ఆధారపడివుంటా యన్నమాట. ఇది అన్ని కళలకూ వర్తిస్తుంది గనుక, సినీ నటుడి స్థలంలో పెయింటర్ నీ, గాయకుడినీ, రచయితనీ ఊహించుకోవచ్చు. అన్నీ విజయాలనే చవిచూసిన రచయిత రెండు మూడు రచనలు అపజయాలని పొందినప్పుడు పడే బాధని గూర్చి యండమూరి వీరేంద్రనాథ్ “ఆనందో బ్రహ్మ”లో వర్ణిస్తారు.

“క్రూనర్” కథలో టోనీ గార్డ్‌నర్ ఒక గాయకుడు – ఫ్రాంక్ సినత్రా లాగా మృదువుగా పాడతాడు. హనీమూన్ కి భార్య లిండీతో కలిసి ఇటలీలోని వెనిస్ నగరానికి వచ్చిన ఇరవయ్యేడేళ్లకు ఆమెతో కలిసి మళ్లీ వచ్చాడు. సెయింట్ మార్కోస్ స్క్వేర్ లో ఒక కఫే ముందర ఒంటరిగా కూర్చుని దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. అయినా గానీ, ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగి ఎన్నో రికార్డులని రిలీజ్ చేసిన అతన్నక్కడ గుర్తుపట్టింది జానెక్ అనే గిటారిస్ట్ మాత్రమే. అది కూడా, అతని తల్లి గార్డ్‌నర్ పాటలని ఎంతో ఆనందించినదన్న గుర్తు వల్ల. జానెక్ ధైర్యం చేసి దగ్గరకు వెడితే, గార్డ్‌నర్ తలతిప్పి చూసి మాట కలుపుతాడు. కాసేపటికి లిండీ అక్కడకు వస్తుంది. భార్యాభర్తల సంభాషణలో ఘర్షణ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆమె వెళ్లిన తరువాత గార్డ్‌నర్, లిండీని సెరనేడ్ చెయ్యడం కోసం ఈ గిటారిస్ట్ సహాయాన్ని కోరతాడు. అంటే, ఆమె హోటల్లో తన గదిలో ఉన్నప్పుడు పక్కనే పారుతున్న కాలవలో పడవలో అతను కూర్చుని ఆమె వినడంకోసం పాడడ మన్న మాట. (“పడోసన్” సినిమాలో పక్కింట్లో ఉన్న హీరోయిన్ని ఉద్దేశించి కిషోర్ కుమార్ పాట, లేదా, “పక్కింటి అమ్మాయి”లో బాలు పాట కూడా ఇదే కోవకు చెందుతాయి.) గార్డ్‌నర్ కోరిన సహాయం, అతను పాడుతున్నప్పుడు జానెక్ గిటార్ వాయించాలి.

అనుకున్నట్లుగానే గార్డ్‌నర్ పాడాడు కానీ, జానెక్ కు అర్థం కానిదల్లా, అతను పాడితే ఆమె ఎందుకు దుఃఖిస్తూ కిటికీ పక్కనించీ వెళ్లిపోయిందీ అని. అతను అడిగినప్పుడు గార్డ్‌నర్ లిండీ పూర్వ జీవితం గూర్చీ, తన భూత, భవిష్యత్ జీవితాల గూర్చీ చెబుతాడు. ఆ వివరాలు విన్న తరువాత జానెక్ మాత్రమే కాక పాఠకులు కూడా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే, పాపులర్ సింగర్స్ వరుసగా కొన్ని హిట్స్ ని ప్రజలకు అందించిన తరువాత ఇంకొక హిట్ ని సంపాదించుకాకపోతే ఎంత బాధపడతారో తెలుస్తుంది. సినిమాల్లో గానీ లేదా బయట ప్రైవేట్ గా గానీ తెలుగు, హిందీ పాటలు పాడేవాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. దానికంటే బాస్ ని ఎంత తిట్టుకున్నా గానీ జీతాన్నిచ్చే ఉద్యోగానికి రోజూ వెళ్లిరావడం ఎంత సుళువయిన పనో ఎరుకలోకి వస్తుంది. కానీ అందరూ చెయ్యలేని పనిని కొందరే చెయ్యగలరు. వాళ్ళు, కళాకారులు. వాళ్లకు ఆ బాధలు తప్పవు.

ఇక్కడ, గార్డ్‌నర్ మొదటిసారి లిండీని చూడగానే ప్రేమలో పడ్డానని చెబుతాడు. కానీ, పెళ్లయిన కొన్నేళ్లకు గానీ ఆమె తనను ప్రేమించడం మొదలుపెట్టలేదని చెబుతాడు. అంటే, ఆమెకి కొద్దిగా “గోల్డ్ డిగ్గర్” వ్యక్తిత్వాన్ని అంటగడతాడు. అతను చెప్పిన కథ కాబట్టి లిండీ తరఫున వకాల్తా తీసుకోవడానికి, ఆమె ఏమనుకుని ఉంటుందో తెలుసుకోవడానికి ఆస్కార మేమీ లేదు.

ఇక్కడ, వెంటనే యండమూరి వీరేంద్రనాథ్ రాసిన “టాస్” కథ గుర్తుకు రావాలి. ఆ కథలో, హీరో మొదటిసారి పవర్ఫుల్ వెస్ట్ ఇండీస్ తో ఇండియా ఆడుతున్న క్రికెట్ మాచ్ లో మొదటిసారి బాట్ చెయ్యడానికి ఓపెనర్ గా బరిలోకి దిగినవాడు. అతని గర్ల్ ఫ్రెండ్ అతనికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికే వచ్చింది గానీ, అతను మొదటి ఇన్నింగ్స్ లో తేలిగ్గా అవుటవడాన్నీ, ఫీల్డింగ్ లో తప్పులు చెయ్యడాన్నీ, అలాంటి చిన్నబుచ్చే అతని పెర్ఫార్మెన్స్ గూర్చి ఆమె తట్టుకోలేకపోవడాన్నీ అతనితో ఆమె పంచుకుంటుంది. అయితే, రెండవ ఇన్నింగ్స్ లో అతను బాగా ఆడగానే ఆమె సంతోషపడుతుంది గానీ, అతనికి ఆమె అంటే తెలియ జెప్పిన ఆ మాచ్ తరువాత తనకు కావలసింది అపజయాలలో తోడుండే వ్యక్తి అని ఆమెకు చెప్పి బై చెపుతాడు. “అతడికి తెలుసు తన గెలుపుకిది ప్రారంభం అని. ఇక అంతా విజయ పరంపరే కావచ్చు. తన చుట్టూ ఇక జనం చేరతారు. అభినందిస్తారు. ఐ లవ్యూ అంటారు. తను కనుక్కోలేడు తనని ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారో – ఎవరు తన కళని ప్రేమిస్తున్నారో – ఎవరు తన గెలుపుని ప్రేమిస్తున్నారో!” అని అతను ఆలోచిస్తాడు.

అందుకే, స్త్రీ-పురుష సంబంధాల గూర్చి టీనా టర్నర్ “వాట్స్ లవ్ గాట్ టు వితిట్” అని 1984 లో పాడిన పాట ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని అనిపిస్తుంది “క్రూనర్” చదివిన తరువాత. అంటే, “నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నింపుటకు, నేనున్నాని నిండుగ పలికే తోడు” దొరకడం కొందరికి ఎండమావేనా? ఏమయినా గానీ, ఈ అస్తిత్వ కథ కొన్ని జీవితాలని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.

 

రచయిత పరిచయం:

కజుఒ ఇషిగురో నాగసాకి, జపాన్ లో 1954 లో పుట్టారు. అయిదేళ్ల వయసులో యునైటెడ్ కింగ్డం కి వలస వెళ్ళారు. 2005 లో రాసిన “నెవర్ లెట్ మి గో” అన్న నవలని టైం మాగజీన్ 1923-2005 మధ్యలో వచ్చిన నూరు నవలల్లో ఒకదాన్నిగా పేర్కొంది. 2017 లో నోబెల్ బహుమతి నందుకున్నారు. 2018 లో “సర్” బిరుదాన్ని బ్రిటిష్ రాణి నుండీ పొందారు.

తాడికొండ శివకుమార శర్మ

వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. ఐ.ఐ.టి. మద్రాసులో బాచెలర్స్ డిగ్రీ తరువాత రట్గర్స్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. వాషింగ్టన్, డి.సి., సబర్బ్స్ లో పాతికేళ్ళకి పైగా నివాసం. మొదటి కథ "సంశయాత్మా వినశ్యతి" రచన మాస పత్రికలో 2002 లో వచ్చింది. ఇప్పటి దాకా యాభైకి పైగా కథలు పలు పత్రికల్లో వచ్చాయి, కొన్ని బహుమతుల నందుకున్నాయి. "విదేశ గమనే," (జనవరి 2016 లో) "స్వల్పజ్ఞుడు" (జనవరి 2018 లో) అన్న కథా సంకలనాలు వెలువరించారు. "అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ" ధారావాహికగా వాకిలి వెబ్ పత్రికలో, ఆ తరువాత అదే శీర్షికతో నవలగా వెలువడింది. అయిదు నాటికలు రచించారు, కొన్నింటికి దర్శకత్వం వహిస్తూ నటించి, డెలావర్ నాటక పోటీల్లో ప్రదర్శించారు. "ఇది అహల్య కథ కాదు" ప్రదర్శన అజో-విభో-కందాళం వారి వార్షిక ఉత్సవాల్లో నిజామాబాదులో 2006 లో, తరువాత 2007 లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ, అస్తిత్వ కథ, మా జీవితాలను కొంత అర్ధం,చేసుకుడానికి కొంత దోహద పడిందనే చెప్పవచ్చు.. అభివందనలు, రచయిత కు!💐.మాకు బాగా నచ్చింది. ఈ కథ..!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు