అట్లూరి పిచ్చేశ్వరరావు గారి రచనా ప్రపంచంలోకి…..!

‘అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు’ వారి కుమారుడు అట్లూరి అనిల్ సంపాదకుడిగా నవంబర్ 2021లో వెలుగుచూసింది. దాదాపు మొదటి ప్రతికి చెందిన కాపీలు అయిపోయి రెండో ముద్రణకు సిద్ధంగా వుందని మిత్రుడు అనిల్ ద్వారా తెలిసింది. ఇది చిన్న విషయం కాదు. 1954లోనే పిచ్చేశ్వరరావు గారు ‘నెత్తురు కథ’, ‘విముక్తి’, ‘ఆగస్ట్ 15న’, ‘వెర్తి కాదు వేదాంతం’, ‘చిరంజీవి’, ‘డొంకల వంకల మనసులు’, 1957లో ‘వసుంధర’ లాంటి గొప్ప కథలు రాశారు. ఈ సంపుటిలోని ‘చిరంజీవి’ కథలా వీటికి మరణం లేదు. ఇప్పటికీ సజీవంగా వున్నాయి.

ఇలాంటి రచనలను సాహితీలోకంలో వున్న ప్రముఖులు అనిపించుకునేవారు గుర్తించటం అసలు సమస్య. దాదాపు 7 దశాబ్దాలకు ఆ పనిని ఆయన కుమారుడు తలకు ఎత్తుకోవటం ఇక్కడి ప్రధాన అంశం. సాహిత్యంలో అరుదుగా జరుగుతున్న విశేషం కూడా. అందులోనూ అనిల్ రచయిత అయివుండి తను సంఖ్య రీత్యా ఎక్కువ కథలు రాయకపోయినా వాటిని పుస్తకరూపంలో తీసుకురావటానికి ఇష్టపడకుండా ఈ కర్తవ్యం నిర్వహించాడు. అందుకు కొన్ని సంవత్సరాలు శ్రమించాడు. అతని కష్టాన్ని, వేదనను నేను దగ్గరగా చూశాను.

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు అని ముఖచిత్రం మీద ప్రకటించినా ఈ పుస్తకం కథలకు మాత్రం పరిమితం కాలేదు. పిచ్చేశ్వరరావు గారు రాసిన పుస్తక సమీక్షలు వున్నాయి. ‘మై డాడ్ డైడ్ యంగ్’, ‘నాన్న పుస్తకాలూ, కొన్ని జ్ఞాపకాలూ!’, ‘స్టోరీ బోర్డ్’. అనిల్ రాసుకున్న’చివరి మాటలు’  కూడా వున్నాయి.

అనేక మందికి తెలియని విషయం పిచ్చేశ్వరరావు గారు ‘త్రిపురనేని రామస్వామి’ గారి అల్లుడు అని. ప్రఖ్యాత రచయిత ‘గోపీచంద్’ గారికి బావగారని. అలాగే పిచ్చేశ్వరరావు గారి శ్రీమతి ‘చౌదరాణి’ మంచి రచయిత్రి, అనువాదకురాలు అని. (మద్రాసులో దాదాపు మూడు దశాబ్దాలు ప్రత్యేకంగా తెలుగు పుస్తకాల కోసం ‘రాణి బుక్ సెంటర్’ని స్థాపించి, నిర్వహించారావిడ.) గోపీచంద్ గారిలా పిచ్చేశ్వరరావు గారు కూడా చలన చిత్రాలకు పనిచేశారని. సహజంగా అలాంటి లెగసి వున్నప్పుడు ఎవరయినా తమకు చెందిన వారి పేర్లను ప్రకటించుకోవటానికి ఇష్టపడతారు. ఆ రకంగా కీర్తిని పంచుకోవాలనుకుంటారు. పిచ్చేశ్వరరావు గారికి అలాంటి తాపత్రయం లేదు. గోరంత సృష్టించి కొండంత కీర్తికి కాదు కనీస గుర్తింపుకి ఆయన పాకులాడలేదు. తన పనిని తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోయారు. వారిని గురించి తెలుసుకున్నప్పుడు అత్యంత గౌరవం కలిగింది. అప్పట్లోనే ఈ కాలపు క్షుద్ర విద్యల అస్తిత్వపు ఛాయలు బయటపడుతున్నాయి. అయినా వాటికి దూరంగా వుండటానికి ఎంత నిబ్బరం, ఎంత విశాల హృదయం వుండాలి!

అట్లూరి పిచ్చేశ్వరరావు గారి రచనలు పరిశీలిస్తే రష్యన్-తెలుగు అనువాదాలు అయిదు, హిందీ-తెలుగు అనువాదాలు మూడు. అందులో కిషన్ చందర్ ‘ఒకానొక గాడిద ఆత్మకథ’. ప్రేమ్ చంద్ ‘గోదాన్’, ‘పేకముక్కలు’ అరిగే పూడి రమేశ్ చౌదరివి వున్నాయి. వెండితెర నవలలు -కథలు – సంభాషణలు 10 వున్నాయి. లఘు చిత్రాలు రెండు. కథలూ – నాటికలూ -వ్యాఖ్యానాలు – ఇతరాలు మూడు. ఇవీ ఆయన మనకు వదిలి వెళ్లిన సంపద. 1966లో నలభైయేళ్లకు కొంచెం ఎక్కువ వయసులో ఆయన చనిపోయారు. బతికి వుంటే ఇంకెంత వైవిధ్యంగా రచనలు చేసి వుండేవారో అనిపిస్తుంది. అనిల్ కుటుంబమే కాదు వారి మృతితో సాహితీలోకం ఎంతో నష్టపోయింది.

పిచ్చేశ్వరరావు గారు భారత నౌకాదళంలో పనిచేశారు. అది బ్రిటీష్ వారి ఆధీనంలో వున్న రాయల్ ఇండియన్ నేవీలో. 1946లో తెల్లదొరల పెత్తనం మీద భారతీయ నావికాదళం నావికులు తిరగబడ్డారు. దానిని భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (R. I. N Mutiny)గా పేర్కొంటారు. ఆ తిరుగుబాటులో పాల్గొన్న వారిలో పిచ్చేశ్వరరావు కూడా వున్నారు. అరెస్టయ్యారు.

స్వాతంత్ర్యం వచ్చాక ఇండియన్ నేవీలో కొలువు కొనసాగించి, కాంట్రాక్ట్ ముగిశాక నేవీ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత విశాలాంధ్ర సంపాదక వర్గంలో చేరారు. ఇవన్నీ అనిల్ చెప్పిన విశేషాలు.

‘కథకుడుగా పిచ్చేశ్వరరావు’ అని 1967లో కొడవగంటి కుటుంబరావు గారు ముందుమాట రాశారు. ‘ధ్యేయం’ పేరుతో ఆరుద్ర గారు 1993లో రాశారు. 2021లో ‘కథా చిరంజీవి’ అని ‘ఓల్గా’ ముందు మాట రాయటం జరిగింది.

నాకు ఈ పుస్తకం అందినప్పటి నుంచి వరుసగా కథలు చదవటం మొదలు పెట్టి నోట్స్ రాసుకుంటూ వచ్చాను. ఈ కథల మీద ఓ ఆర్టికల్ రాస్తానని ‘అనిల్’కి ప్రామిస్ చేశాను. అందులోనూ తనని బలవంతం చేసి నా ‘విపరీత వ్యక్తులు’ నవలకు ముందు మాట రాయించాను. రకరకాల పని ఒత్తిడితో ఆలస్యమే కాకుండా ఆ నోట్స్ కూడా మాయం అయింది. ఇంకా నా బాధ చెప్పటానికి లేదు. మళ్లీ మొదటి నుంచి ఆరంభించాలి.

ఇప్పుడు నేను ఈ కథల గురించి మాట్లాడదలుచుకోలేదు. అది మొదలు పెడితే ప్రత్యేక గ్రంథం అవుతుంది. ఉబుసుపోక రాసిన కథలు ఇందులో లేవు. అయినా నేను ప్రతి కథ మీద ఆలస్యంగానైనా వివరంగా రాస్తాను.

ఇందులో ప్రయోగాత్మక కథలు ఎన్నో వున్నాయి. ఏ కథనూ మామూలుగా చెప్పాలని రచయిత అనుకోలేదు. రచయితకు వర్తమానం, భూత, భవిష్యత్ కాలాల పట్ల స్పష్టమైన అవగాహన వుంది. తన పరిమితులు తనకు తెలుసు. అందుకే తొలి దశలోనే ఎక్కువ స్వరం పెంచి మాట్లాడలేదు. అలా మాట్లాడి తర్వాత కాలంలో అభాసుపాలయిన వారిని మనం చూస్తున్నాం. మహానుభావుడు సుందరయ్య గారు ఓ సారి అన్నారు. “నేను చనిపోయే వరకు పతనం కాకుండా ఇలానే వుంటే అప్పుడు చిన్న అభినందనని అందించండి” అని. ఇవే మాటలు కాదు. సారాంశం అది.

అది నిన్నటి తరంలో, ఈ తరంలో అరుదుగా చూస్తాం. ఇప్పుడు ధబాయింపు, నిస్సిగ్గు, అన్ని విలువలనూ విడిచిపెట్టి స్వంత ప్రయోజనాలకు పాకులాడే వారు గౌరవాలు పొందుతారు. వేదికల మీద ప్రవచిస్తారు. అంతరాత్మలని సైతం గొంతు నొక్కేస్తారు.

అట్లూరి వారు నేవీకి చెందిన ఐదు కథలు రాశారని ఆరుద్ర అన్నారు. ఓల్గా గారు ‘ఆయన కథలు వాస్తవికత నుండి అధివాస్తవికతా, మార్మిక వాస్తవికతా ఛాయలు నింపుకుని వాటిని దాటి సోషలిస్టు వాస్తవికతా కథలు స్ధిరంగా నిలబడ్డాయి’ అన్నారు.

ఈ కథలను చదువుతున్నప్పుడు నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి. సోషలిస్టు వాస్తవికతను ప్రతిబింబించని ఈనాటి కొందరి రచనలను ఈ మహా విమర్శకులు ఎందుకు తలకి ఎత్తుకున్నారు. అపవిత్ర కలయికల వల్లనా-అలాంటి వాస్తవికత అనేది నిన్నటి కల అనా? శిల్ప లౌల్యంలో పడా? నిన్నటి తరానికి వున్నంత అధ్యయనం, దృష్టి లేకపోవటం వల్లనా? పాలక వర్గాలకు అంటకాగటం వల్లనా? వయసుడగటమా? ఇంకేమన్నానా?

ఒకప్పటి విశాల దృక్పథం ప్రాంతానికి, కులానికి, మతానికి ఎందుకు పరిమితం అయింది? అస్తిత్వం అంటే అంత సంకుచితమా? ఇది ఏ మార్పుకి? అస్తిత్వం అనేది కొందరి వ్యక్తుల ప్రయోజనాలకా? అస్తిత్వం గాని మరొకటి గాని కులంతో, కుటుంబంతో ఆగదు. అది వ్యక్తినే నిట్టనిలువుగా, అడ్డంగా చీరేస్తుంది. ప్రతిదానికీ పరిమితులుంటాయి. అవి గ్రహించలేని వారు చివరకు విధ్వంసం సృష్టించి అందులోనే ఆహుతి అవుతారు.

*    *    *

ఈ పుస్తకం ప్రచురించటమే ఓ చర్చ కోసం. ఈ తరం వారికి ఓ మార్గదర్శనంగా వుండటం కోసం. అందుకే ఈ కథల్లోని అంశాలపట్లా – అలానే కథన రీతుల మీద కూడా చర్చ జరగాల్సి వుంది. వస్తువుని విడిచిపెట్టి కథనం మీద, కథనం లేని వస్తువు మీద మాత్రమే ప్రశంసలు కురిపిస్తే లక్ష్యం నెరవేరదు.

అప్పట్లోనే ఆరుద్ర చిత్రవిచిత్ర ప్రయోగాలు చేశారు. నాలాంటి వారికి అవి అర్థం కావు. తెలంగాణా పోరాటం వంటి గొప్ప సందర్భంలో ‘త్వమేవాహం’ అని రాశారాయన. అందుకు ఎంచుకున్న శిల్పం సామాన్యులకే కాదు ఓ స్థాయి వున్న వారికి కూడా బోధపడదు. తెలంగాణా పోరాటాన్ని భారతదేశంలో జరగబోయే భవిష్యత్తు విప్లవ పోరాటాలకు డ్రెస్ రిహార్సల్ అని కమ్యూనిస్టులు అభివర్ణించారు. ఇక్కడ కవిత్వం రాసేటప్పుడు మార్మికతలు అవసరం లేదు. అత్యంత సరళమైన వాక్యాలు రాసినా ఆ పోరాటాన్ని చూపిస్తాయి. ఆ సంఘటనలు ఉద్వేగపరుస్తాయి. అయినా శిల్పం మాటున ఎందుకు దాక్కోవాలి. జరగాల్సిన చర్చ విప్లవ పోరాటాల మీదా? కవుల శిల్ప లౌల్యాల మీదా? తర్వాత కాలంలో ‘త్వమేవాహం’ రచనలోని రహస్యాలను బయటకు తీసి గొప్ప రచన అన్నవారున్నారు.

ఓ రచన బయటకు వచ్చాక ప్రశంస – విమర్శ రెండూ వుంటాయి. ఎవరి హక్కునూ ఎవరూ కాదనలేరు. మనకు అర్థం కానంత మాత్రాన ఓ రచనను మొత్తంగా తిరస్కరించటం సమంజసం కాదు. అలా అని ఒక్క నిట్టూర్పుని, అసహనాన్ని వ్యక్తం చేయకపోవటం కూడా సరైంది కాదని నేను అనుకుంటాను.

అసలు అత్యంత నిర్బంధకాలంలో కవులూ, రచయితలూ నర్మగర్భంగా రచనలు చేసే పరిస్థితి వుంటుంది. ఆ కాలంలోనూ వాటిని లెక్కచేయకుండా స్పందించేవారుంటారు. అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లిస్తారనేది వేరే విషయం.

నా వరకు నేను అనుకునే విషయాలు కొన్ని వున్నాయి. తోటి వారి ప్రభావం రచయితల మీద వుంటుంది. విదేశీ సాహిత్య అధ్యయనాల అంశం రచయితలను ఉత్సాహ పరుస్తాయి. ఆ నాటి విమర్శకులు అప్పుడు ఎవరిని పట్టించుకుంటున్నారనేది వుంటుంది. ఈ మాత్రం రచనలు మనం చేయలేమా అనుకుంటారు. అందుకని రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. నేను కూడా కొన్ని రచనలు అలాంటి తాపత్రయంతో చేశాను. అయితే ఇది ఎల్లకాలం వుండదు. కీర్తిని దాటుకుని బయటకు వస్తారు. తాము రాసింది ప్రజలకు అర్థం కావాలనుకుంటారు. ఎక్కువ భాగం రచనలు పిచ్చేశ్వరరావు గారు అధివాస్తవికత, మార్మిక వాస్తవికతా ఛాయలు నింపుకున్నవి చేశారు. తర్వాత సినీ రంగ ప్రవేశం జరిగింది.

సినిమాల్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే చేతులు కాలిపోతాయి. అందుకే ఆరుద్ర గారు కూడా ‘తీసుకో కోకాకోలా, ఏస్కో రమ్ముసారా’ అని పాటలు రాశారు. అలా రాస్తేనే అక్కడ వుంటారు. ప్రయోగాలు చేసే సమస్యలను చిత్రీకరించాలనుకున్నప్పుడు మాత్రమే ఏ కవికయినా రచయితకయినా అవకాశం వస్తుంది. ‘కలకానిది విలువయినది’, ‘జగమే మాయ బతుకే మాయ – వేదాలలో సారమింతేనయా’ ఇలాంటి పదాల్లోనే అనంతమైన తత్వాన్ని రంగరిస్తారు. భువి నుండి దిగిరానిది భావ కవులే కాదు!

పిచ్చేశ్వరరావు పిన్న వయసులో మరణించారు. లేకుంటే తర్వాత పరిణామక్రమం ఏ రకంగా వుండేదో. కొ.కు. గారి మాటల్లో ‘ఏ కారణం చేతనో అతనికి కథలు రాయాలన్న అభిలాష క్రమంగా తగ్గిపోయింది’ అనటం వుంది. బతికి వుంటే రాసి వుండే వారేమో. ఏది ఏమైనా ఏ రచయిత (త్రి) నయినా ఒకటి రెండు రచనలతో తూయకూడదు. మొత్తం కంట్రిబ్యూషన్ని చూడాలి. అప్పుడు మాత్రమే సాహిత్య ప్రయోజనం కంటే వ్యక్తిగత శిల్ప, ప్రయోగాల లౌల్యం ముఖ్యం అనుకున్న వారిని వెలికి తీయటం జరుగుతుంది.

ఈ తరం వారు గుర్తించాల్సిన అంశం ఒకటుంది. తమకే స్పష్టం గాని అంశాల జోలికి పోకుండా వుండటం మంచిది. స్త్రీ – పురుషుల సంబంధాల్లోకి దూరిపోయి వికృత వ్యాఖ్యానాలు చేయకపోవటం మంచిది. ఇవన్నీ తాత్కాలికం అని గుర్తిస్తే సాహిత్యానికి, సమాజానికి కూడా మరీ మంచిది. అయితే ఇది స్వేచ్ఛా సమాజం, ఎవరి భంగిమలు వారివి. ఎవరి ధోరణులు వారివి. సమాజంలో అభ్యుదయ, విప్లవ ధోరణులు వెనకబాటు పట్టినప్పుడు వచ్చే వికృత పరిణామాలివి.

ఇంక నా వరకు నేను నన్ను పిచ్చేశ్వరరావు గారిలో చూసుకున్నాను. ఆయన రచనలు నన్ను ఆలోచింపచేశాయి. ఎలా రాయాలో నేర్పుతున్నాయి. కథలకు ఆయన ఎంచుకున్న పేర్లు, కొన్ని వాక్యాలు అద్భుతం. ఇవి అడుగడుగునా వున్నాయి.

‘ఫ్రీడమ్ పగిలింది. పగుల్లో పర్వతం నిలిచింది.’

‘చివరల్లేని నిచ్చెనల చివర సిగ్గూ శరమూ, చీమూ నెత్తురు..’
‘శీతాకాలంలో జెర్సీ తొడుక్కున్నట్లు అయింది. శరీరమంతా విశ్రాంతిని తొడుక్కుంది, నన్నూ శాంతినీ కలిపి కుట్టేశాడు.’
‘కదిలే నీడలు కత్తులు పుచ్చుకున్నాయి’ … ఇలాంటివి ఎన్నో… ఎన్నెనో…

ముందే చెప్పినట్లు పిచ్చేశ్వరరావు గారి కథల మీద ‘ధీసిస్’ ఎవరో ఒకరు సబ్‌మిట్ చేయాలి.
మీరు రచయితలయితే ఈ రచనలు చదివాక మరిన్ని రచనలు చేస్తారు. పాఠకులయితే ఆగ్రహ పడతారు. ఆవేదన చెందుతారు. వ్యంగ్యానికి హేట్సాఫ్ అంటారు. సమాజం ఎప్పటికయినా మారాలన్న ఆయన కలను ముందుకు తీసుకుపోవాలనుకుంటారు.
ఓ రచయితకు అంతకు మించిన గౌరవం, విజయం వుండదు.

25.09.2022

(అట్లూరి పిచ్చేశ్వరరావు గారి వర్థంతి సందర్భంగా)

పి చంద్రశేఖర ఆజాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు