గౌహర్ జాన్ …ఆ పేరే ఒక మలయమారుతం!

ది 1910 ప్రాంతం.

కలకత్తా లోని 49చిత్పూర్ రోడ్డంతా కోలాహలంగా వుంది. ఇంతకీ విషయమేమంటే ప్రఖ్యాత గాయనీ, నర్తకీ అయిన ఒకావిడ ఇంట్లో ఆమె పెంపుడు పిల్లి నీళ్లాడింది. దానికి ఆవిడ ఇరవై వేల రూపాయలు ఖర్చుపెట్టి పెద్ద ఉత్సవం చేస్తోంది. కలకత్తా చుట్టుపక్కల వున్న పెద్ద పెద్ద విద్వాంసులూ, జమీందారులూ హాజరయ్యారు. పెంపుడు పిల్లికోసం అంత ఖర్చుపెట్టి ఆడంబరంగా వేడుక జరపడాన్ని గురించి అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు.

ఆ గాయని పేరు గౌహర్ జాన్.

అసలు గౌహర్ జాన్ తీరే అంత ,ఆడంబరానికీ,విలాసానికీ వెనుకాడకుండా తాను ఖర్చుపెట్టడమే కాదు,తాను చేసే కచేరీలకు కూడా   ఇతరుల నుండీ అత్యధిక మొత్తాన్ని వసూలు చేసేది. అంతే కాదు అనేక సౌకర్యాలు  సమకూర్చాలని డిమాండ్ చేసేది.

ఒక సారిమధ్యప్రదేశ్ కి లోని దాతియా అనే ప్రాంతానికి చెందిన మహారాజా భవానీ సింగ్ బహాదూర్  గాయనిగా గౌహర్ జాన్ పేరు ప్రతిష్ఠలు విని ఆమెను తమ దర్బారులో కచేరీ చేయమని ఆహ్వానించాడు. దాతియా ఒక చిన్న రాజ్యమని పొరపాటు పడ్డ గౌహర్ కచేరీ చేయనని తిరస్కరించింది. అప్పుడా రాజా గారు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా వున్న ఒక బ్రిటిషర్ సహాయంతో ఆమె మీద వత్తిడి తీసుకు వచ్చాడు. అప్పుడామెకు ఒప్పుకోక తప్పలేదు. అయితే ఆమె తనకి రోజుకి రెండువేల రూపాయలు చెల్లించాలనే షరతుతో పాటు, తనతో పాటు వచ్చే నూట పదకొండు మంది పరివారానికి కూడా ప్రయాణ సౌకర్యమూ, నివాస సౌకర్యమూ కల్పించాలని కోరింది.

అప్పుడా మహారాజా ఆమెకూ,ఆమె పరివారానికీ యేకంగా పదకొండు బోగీలతో వున్న ఒక ట్రెయినే పంపాడు. అదీ ఆమె విలాసం. ఆమె ఒక్కొక్క కచేరీకీ ఆరోజుల్లోనే వెయ్యినుండీ మూడు వేల వరకూ డిమాండ్ చేసేది. ఆమె తొలి గ్రామఫోన్ రికార్డ్ గాయని , 78rpm రికార్డ్ ల మీద సుమారు పది భాషలలో 600 రికార్డులు ఇచ్చింది. ఒక్కొక్క రికార్డు పాడటానికి రు”3000 వసూలు చేసేది.మామూలుగా కొన్ని గంటలపాటు సాగే సంగీత కచేరీని స్వారస్యం చెడకుండా గ్రామఫోన్ రికార్డు కోసం మూడున్నర నిముషాలకి కుదించి పాడటంలో గొప్ప నేర్పు చూపేది గౌహర్ జాన్ (ఇది ఆమె తర్వాత  రికార్డులకి పాడిన గాయకులకు ఒక ఒరవడిగా ఉపయోగ పడింది)రికార్డ్  చివరలో “మైనేమ్ ఈజ్ గౌహర్ జాన్ “అనే ప్రకటన కూడా ఆసక్తిగా వినేవారందరూ.

ఆ కాలంలో ఆమె ఫోటోలు పోస్ట్ కార్డుల మీదా,అగ్గిపెట్టెల మీదా ముద్రించే వారంటేనే అర్థమవుతుంది ఆమె యెంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో!

ఇంత వైభవంగా విలాసవంతంగా జీవితం గడిపిన గౌహర్ జాన్ అసలు పేరేమిటీ? ఆమె మూలాలు యెక్కడున్నాయి? చివరి వరకూ ఆమె వైభవం కొనసాగిందా? ఆమె చివరి దశ యెలా గడిచిందీ? తెలుసుకుంటుంటే చాలా ఆశ్చర్యంగానూ,విచిత్రంగానూ,బాధగానూ కూడా వుంటుంది.

నేను గౌహర్ జాన్ పేరు సుమారు పది పదిహేనేళ్ల క్రితం యెక్కడో చదివాను. అప్పటి నుండీ ఆమె గురించిన సమాచారం యెక్కడ కనిపించినా ఆసక్తిగా చదివేదాన్ని. సామల సదాశివ గారి “మలయమారుతాలు” పుస్తకంలో కొద్ది సమాచారం దొరికింది.

కానీ విక్రమ్ సంపత్ రాసిన “మైనేమ్ ఈజ్ గౌహర్ జాన్”పన్నెండేళ్ల క్రితం కొని చదివిప్పుడు అద్భుతంగా అనిపించింది. అతనిచ్చిన సమాచారం సమగ్రంగానూ, సంపూర్ణం గానూ వుండటమే కాక అది ఒక రీసెర్చ్ థీసిస్ కి యేమాత్రమూ  తీసిపోకుండా వుండటం గొప్ప విషయం. ప్రస్తుతం నేను రాస్తున్న వ్యాసానికి ఈ పుస్తకం ఒకటే కాక అంతర్జాలంలో లభిస్తున్న వ్యాసాలూ, ఆమె గురించి చెప్పే వీడీయోలూ,ఆమె పాడిన వీడియోలూ కూడా ఆధారం.

గౌహర్ జాన్ అసలు పేరు ఎలీన్ ఏంజలినా ఇయోవార్డ్.

గౌహర్ జాన్ మూలాలు తెలుసుకోవాలంటే  ఆమె అమ్మమ్మ దగ్గరనుండీ మొదలు పెట్టాలి. గౌహర్ జాన్ అమ్మమ్మ పేరు రుక్మిణి. ఆమె భారతీయురాలు. ఇంగ్లండ్ కి చెందిన హార్డీ హెమ్మింగ్స్ ను వివాహం చేసుకుంది. అది జరిగింది 1855ప్రాంతంలో.

ఆ కాలంలో ఈస్టిండియా కంపెనీ తరఫున భారతదేశానికి ఉద్యోగార్థులై వచ్చిన బ్రిటీషు యువకులు భారతీయ మహిళలని తాత్కాలిక వివాహం చేసుకోవడం గానీ, సహజీవనం చేయడం గానీ చేసేవాళ్లు.  అలా మిలటరీ ఆఫీసరైన హార్డీ హెమ్మింగ్స్ ఉత్తర ప్రదేశ్ లోని అజామ్ ఘర్ లో(ఇది అలహా బాద్ కీ బెనారస్ కీ మధ్య వుంది), రుక్మిణినితాత్కాలిక  వివాహం చేసుకున్నాడు.  ఇద్దరు పిల్లలు జన్మించారు వారికి. రుక్మిణి మతం మార్చుకుని ఎలీజా హెమ్మింగ్స్ అయింది.

వారి ఇద్దరు పిల్లలలో పెద్దపిల్ల పేరు అడీలీన్ విక్టోరియా హెమ్మింగ్స్, ముద్దు పేరు బికీ. ఈమే మన గౌహర్ జాన్ తల్లి. సరే రెండో అమ్మాయి పేరు బేలా.

హార్డీ హెమ్మింగ్స్, రుక్మిణీ చాలా అన్యోన్యంగా వుండేవారు. దురదృష్ట వశాత్తూ పిల్లలు చిన్నవాళ్లుగా వున్నప్పుడే హార్డీ హెమ్మింగ్స్ కాలంచేశాడు. జరిగింది తాత్కాలిక వివాహం కావడంతో రుక్మిణికీ,పిల్లలకూ ఆస్తులేమీ దక్కలేదు. ఒక్క సారిగా కుటుంబం దిక్కులేనిదైంది. ఆర్మీ ఆఫీసర్ భార్యగా పెద్ద బంగళాలో సర్వసౌకర్యాలకు అలవాటు పడిన ఆమె హఠాత్తుగా నిరు పేదరాలై పోయింది. అజామ్ ఘర్ లోని డ్రయి ఐస్ ఫాక్టరీలో  రోజువారీ కూలీగా జీవితం ప్రారంభించింది.

వచ్చే ఆ కొద్ది  జీతం తోనే పిల్లలిద్దరినీ ఒద్దికగా పెంచసాగింది. పెద్దపిల్ల విక్టోరియా హెమ్మింగ్స్ చిన్నప్పటినుండీ చురుకుగా వుండేది.కవితలు రాస్తూ,తియ్యని గొంతుతో పాటలు పాడుతూ వుండేది.శిక్షణా సౌకర్యాలు పెద్దగా లేకపోయినా చక్కగాపాడే ఆమెని చూసి చాలా సంతోషపడేది రుక్మిణి.

అలా కొంతకాలం గడిచాక, డ్రయి ఐస్ ఫాక్టరీలో ఇంజన్లను పర్యవేక్షించే సూపర్వైజర్ గా పనిచేసే రాబర్ట్ విలియమ్ ఇయోవార్డ్ అనే ఆర్మీనియన్ రుక్మిణికి పరిచయమయ్యాడు. అతనిని ఇంటికి ఆహ్వానించింది రుక్మిణి. మొదటి చూపులోనే అతనిని ఆకర్షించింది విక్టోరియా హెమ్మింగ్స్. అతనామెను 1872లో వివాహమాడాడు. రుక్మిణికీ , పిల్లలకీ కష్టాలు గట్టెక్కాయనిపించింది. విక్టోరియా హెమ్మింగ్స్ 1873 జూన్ 26వ తేదీన ఎలీన్ యాంజలీనా (Eleen Agelina yeoward) ఇయోవార్డ్ కి జన్మనిచ్చింది. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఆనందంగా జీవిస్తున్నారు.

అయితే రాబర్ట్ విలియమ్ ఇయోవార్డ్ కి దగ్గరలో వున్న వేరే ఊరి లో నీలిమందు ఫాక్టరీలో సూపర్ వైజర్ ఉద్యోగం దొరకడంతో, భార్యాబిడ్డలని అజాంఘర్ లోనే వుంచి అతనొక్కడే అటూఇటూ తిరగ సాగాడు. విక్టోరియా ఖాళీసమయాలలో పక్కనే వుంటున్న జోగేశ్వర్ భారతి అనే ఆయన దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకోసాగింది, తల్లి అనుమతితో. అయితే చుట్టుపక్కల వారందరూ వీరిద్దరి సంబంధం గురించి చెవులు కొరుక్కోవడం, రాబర్ట్ చెవిని కూడా పడింది. అతనామెను కట్టడి చేయసాగాడు. ఆమె అతని మాట విన్నట్టుగానే వుంటూ, అతను లేని సమయంలో జోగేశ్వర భారతిని కలవడం కొనసాగించింది. ఇది గమనించిన రాబర్ట్ ఆమెతో విడాకులు తీసుకున్నాడు. పెళ్లయిన ఏడేళ్ల కే (1879) అంతా ముగిసిపోయింది.

మళ్లీ కుటుంబం దిక్కులేనిదయింది. డ్రై ఐస్  ఫాక్టరీకూడా మూతపడటంతో రుక్మిణి చేసే ఆ చిన్న ఉద్యోగం కూడా ఊడిపోయింది.దానితో వారు కనీసావసరాలకోసం కూడా కటకటలాడిపోయారు.విక్టోరియా చెప్పే సంగీత పాఠాలు కొంతవరకూ ప్రాణాలు నిలుపుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఈ లోగా యాంజలీనా సరైన తిండిలేక ,ఇన్ఫెక్షన్ కి గురయి తీవ్రమైన అనారోగ్యం  పాలు అయింది. కనీస వైద్య సౌకర్యం కూడా కరువైంది.

ఈ దశలోవిక్టోరియా సౌందర్యం పట్ల ఆకర్షితుడైన ఖుర్షిద్ అనే  ముస్లిమ్ పెద్దమనిషి, ఆకుటుంబాన్ని ఆదుకొనడానికి ముందుకొచ్చాడు. విక్టోరియాకు బిడ్డను రక్షించుకోడానికీ, కుటుంబాన్ని కాపాడుకోవడానికీ వేరే దారిలేకపోయింది. అతనికి లొంగిపోయింది.

యాంజెలినా కు మంచి చికిత్స దొరికింది. ప్రాణాపాయం నుండీ బయటపడింది.కుటుంబానికి యే లోటూ లేకుండా జరుగుబాటు అవుతోంది.  అయితే ఖుర్షిద్ ,విక్టోరియాల సంబంధం గురించి అజాంఘర్ లో నివసించే  చుట్టుపక్కల వారి సూటీపోటీ మాటలు తట్టుకోవడం కష్టం అనిపించి కుటుంబం అంతా దగ్గరలోని బెనారస్ కి మకాం మార్చింది. కేవలం మకాం మారడమే కాదు  పేర్లు కూడా మారిపోయాయి. బెనారస్ చేరుకున్నాక విక్టోరియా ఇస్లాం మతం స్వీకరించి తన పేరు మల్కా జాన్  గానూ, యాంజలీనా పేరు గౌహర్ జాన్ గానూ మార్చింది.

ఖుర్షిద్ మల్కాజాన్ కి పర్షియన్ భాషలోనూ, ఉర్దూలోనూ చక్కని తర్ఫీదు ఇప్పించాడు. దానితో ఆమెలో కవిత్వం చెప్పగలిగే శక్తి మరింత పదునెక్కింది. అంతేకాదు ఆమెకు సంగీతంలోనూ,నాట్యంలోనూ ఉత్తమమైన గురువుల వద్ద శిక్షణ ఇప్పించడంతో మల్కాజాన్  ఒక తిరుగులేని కళాకారిణిగా తయారయ్యింది. నెమ్మదిగా కచేరీలు చేయడం ప్రారంభించింది.ఆమె ప్రతిభ బెనారస్  లోని రసికుల దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు ధనవంతుల ఇళ్లల్లోనూ, జమీందారుల ఇళ్లల్లోనూ మారు మోగడం మొదలైంది.

ఆరోజులలో కవిత్వంతోనూ, నృత్యగానాలతోనూ  అలరించే స్త్రీలను “తవైఫ్ “లు అనే వాళ్లు. వీరు వ్యభిచారులు కారు. వీరు కావాలంటే ఒక ధనవంతుడినో, రసికుడనో  తాత్కాలికంగా పెళ్లి చేసుకోవచ్చు. ఈ తవైఫ్ లకు పెద్ద పెద్ద కోఠాలుంటాయి. ఇప్పుడు మల్కాజాన్   కూడా బెనారస్ లో తవైఫ్ గా తన కొత్తజీవితం ప్రారంభించింది.

బెనారస్ లో డబ్బూ పేరూ వున్నపెద్ద మనుషులందరూ మల్కా జాన్  ప్రదర్శనల కోసం తహతహలాడిపోసాగారు. బెనారస్ వచ్చేనాటికి గౌహర్ జాన్ ఆరేళ్ల పిల్ల. ఆమెకు అజాంఘర్ జీవితం  పెద్దగా గుర్తు లేదు. ఆమెను కూడా కవిత్వంలోనూ, సంగీత నాట్యాలలోనూ తీర్చిదిద్దసాగింది మల్కా జాన్ గౌహర్ కూడా మంచి ప్రతిభ కనపరచ సాగింది ఈ రెండు విద్యలలోనూ.

కొంతకాలం తల్లి దగ్గర నేర్చుకున్నాక బెనారస్ లో పేరొందిన పండిట్ బేచూమిశ్రా వద్ద ఖయాల్, ఠుమ్రీ, టప్పా, తరానా లలో శిక్షణ తీసుకోసాగింది. బేచూ మిశ్రా నే ఆమెకు సంగీతంలో మెలకువలన్నీ నేర్పి ఆమె గాయన శైలిని తీర్చి దిద్దింది. ఆ తర్వాత ఆమె అనేకమంది గురువుల వద్ద  అనేక విషయాలు గ్రహించి తన గాన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంది. తల్లీ కూతుళ్లిద్దరూ కలిసి ముజ్రాలలో పాడ సాగారు. ప్రేక్షకులు యూరోపియన్ పోలికలు కలగలిసిన అద్భుత సౌందర్య రాశి  గౌహర్ జాన్ ని చూసీ, ఆమె గానంవినీ మంత్ర ముగ్థులయ్యారు.

గౌహర్, మల్కాజాన్ ల ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఖుర్షిద్ కూడా యేదో చీరెల వ్యాపారం చేస్తూ వీరిని బాగా చూసుకుంటున్నాడు. ఇదే సమయంలో మల్కాజాన్ తల్లీ,గౌహర్ కి అమ్మమ్మ అయిన రుక్మిణి కాలం చేసింది. అజాంఘర్ నుండీ వీరి తో పరిచయం వున్న ఆషియా బేగం తన కొడుకు భగ్లూ తో కలిసి వీరి ఆశ్రయం కోరి వచ్చి , వీరికి చేదోడు వాదోడు గా వుండ సాగింది. మల్కా జాన్ భగ్లూ ని బాగా ఆదరించి తన సొంత కొడుకు లాగే చూసుకునేది.అతను కూడా ఆమెను “బడీమా ” అని పిలిచేవాడు.

అలా ఒక నాలుగు సంవత్సరాలు బెనారస్ లో గడిపాక వారు 1883 లో కలకత్తాకు మకాం వెళ్లిపోయారు. ఆ రోజుల్లో ఆర్టిస్టులందరి చూపూ కలకత్తా వేపే వుండేది. ఎందుకంటే అప్పట్లో అది దేశ రాజధాని అవడం, కళలను ఆదరించే అవధ్ మహారాజు వాజిద్ ఆలీషా  లక్నో విడిచి కలకత్తాలో వుంటూ వుండటం ఈ రెండూ కారణాలు. ఆయనను ఆశ్రయించి చాలామంది కళాకారులుండేవారు.

సరే అలా గౌహర్, మల్కా జాన్ లు ఖుర్షీద్ తోనూ, ఆషియా  బేగం, భగ్లూ లతోనూ కలిసి 1883 లో కలకత్తా వచ్చేశారు. మల్కాజాన్ కి వాజిద్ ఆలీషా కొలువులో మంచి ఆదరణ లభించింది. తవైఫ్ గా ఆమె కీర్తి ప్రతిష్ఠలు కలకత్తా అంతటా మార్మోగ సాగాయి. కలకత్తా లోని బడాబాబులందరూ ఆమె నాట్య గానాలు చూసి పరవశించి పోయారు. కలకత్తా చేరిన మూడుసంవత్సరాల లోపే మల్కాజాన్ 49 చిత్పూర్ రోడ్డులోని మూడు అంతస్థుల భవంతిని నలభైవేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది.ఈనాడు దానిని చిత్పూరు రోడ్డు అనడం లేదు, రవీంద్ర సారణి అంటున్నారు.

ఇక గౌహర్ జాన్ విషయానికి వస్తే—

సుమారు పదేళ్ల వయసులో కలకత్తాలో ప్రవేశించింది గౌహర్ జాన్. ఆమె తల్లి ఆమెకు నాట్య, గానాలలోనూ,  కవనం అల్లడంలోనూ శిక్షణ ఇవ్వడానికి సుశిక్షితులైన పండితులను నియమించింది కలకత్తాలో.  కథక్ నాట్యం నేర్పడానికి బిందాదిన్ మహరాజ్  కోరి గౌహర్ ను తన శిష్యురాలిగా యెన్నుకున్నారు. ఆయన బిర్జూ మహరాజ్ కి తాత వరస. ఆయన శిక్షణ చాలా కఠినంగా వుండేది రోజుకి కనీసం పధ్ధెనిమిది గంటలు సాధన చేయించే వారు. అయినా గౌహర్ సహనంతో శ్రధ్ధగా నేర్చుకుంది. ఆమెకు హిందూస్థానీ సంగీతం నేర్పిన గురువులు పాటియాలా ఘరానాకు చెందిన కాలేఖాన్, కాలూ ఉస్తాద్, ఉస్తాద్ ఆలీబక్ష్ జర్నైల్ ఇంకా రబీంద్ర సంగీత్  లో శిక్షణనిచ్చిన వారు చరణ్ దాస్. ద్రుపద్ ,థమార్ లను నేర్పింది సృజన్ బాయ్.

ఆమె కవిత్వం రాయడం లో కూడా మంచి పట్టు చూపేది.”హమ్ దమ్ ” అనే పేరుతోనూ, “గోహర్ పియా” అనే పేరుతోనూ కవితలూ, గజల్సూ రాస్తూ వుండేది. ఈ లోగా వారి జీవితాల్లో అనుకోని కష్టం వచ్చి పడింది.

కలకత్తా చేరిన తర్వాత ఖుర్షిద్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. మల్కాజాన్ పట్ల యెంతో అనురాగంతో మెలిగే అతను తరచుగా ఇంటికి దూరంగా  కాలం గడప సాగాడు.  కొన్ని అసాంఘిక శక్తులతో సహవాసం కూడా వుండేది. అదే అతని కొంపముంచింది.  1885 ప్రాంతాలలో ఖుర్షిద్ హత్య చేయబడ్డాడు. ఈ వార్త  మల్కాజాన్ కు పిడుగుపాటులా తోచింది. గౌహర్ జాన్ ఇన్నాళ్లూ ఖుర్షిదే తన సొంత తండ్రి అనుకుంటూ వుంది కాబట్టి ఆమె దుఃఖానికి అంతులేకుండా పోయింది.

అదుగో సరిగ్గా అప్పుడే ఖుర్షిద్  గౌహర్ సొంత తండ్రి కాదనీ, ఆమె తండ్రి ఒక ఆర్మీనియన్ అనీ తెలియపరిఛింది మల్కాజాన్. ఇది గౌహర్ పాలిట ఇంకో అశని పాతంలా పరిణమించింది. మల్కాజాన్, గౌహర్ జాన్ లు ఇద్దరూ నెమ్మదిగా ఆ దుఃఖం నుండీ తేరుకోసాగారు. ఈలోగా ఇంకో విపత్తు యెదురయింది.

కలకత్తాలో మంచి పేరు ప్రతిష్ఠ లార్జించిన మల్కాజాన్ ఇంట నృత్యగానాలకు విందు వినోదాలకు లోటుండదు కదా. గౌహర్ జాన్ కి  సుమారు పదమూడేళ్ల వయసు వున్నప్పుడు  వారింట జరిగిన ఒక ఉత్సవంలో అందరూ ఆదమరచి వున్న సమయంలో, ఒక ముసలి మహారాజా చేతిలో అత్యాచారానికి గురయ్యింది. ఫలితంగా యేమెరుగని ఆ పసిప్రాయంలో గర్భవతి అయింది. మల్కాజాన్ ఆమెను దూరప్రాంతాలకి పంపి కానుపు జరిపించింది. నెలలు నిండకుండానే ఒక ప్రాణంలేని బిడ్డను ప్రసవించిందామె. ఈ విషాదాన్నంతా మరచిపోవడానికి సంగీతాన్నే ఆశ్రయించింది గౌహర్ మరింతగా తన సాధనని తీవ్రతరం చేసింది.

మల్కాజాన్ కూతురి దుఃఖాన్ని మరపించడానికి చాలా ప్రయత్నాలు చేసేది. తనతో పాటు కచేరీలకు తీసికెళ్లేది సహ గాయనిగా. క్రమంగా ఆమె కి స్వతంత్రంగా కచేరీలు చేసే సామర్థ్యం వచ్చిందని గ్రహించి, దర్భంగా సంస్థానానికి తనకు మారుగా కచేరీ చేయమని 1887లో  గౌహర్ ని పంపింది మల్కాజాన్.   దర్భంగా రాజాస్థానంలో  కచేరీని అద్భుతంగా రక్తి కట్టించింది గౌహర్. దర్భంగా మహారాజా ఆమెను సముచితంగా సత్కరించడమే కాదు ఆమెను తమ ఆస్థాన విద్వాంసురాలిగా కూడా ప్రకటించాడు. ఆనాటినుండీ ఆమెను అందరూ ఉత్త గౌహర్ అనికాక” గౌహర్ జాన్” అని పిలవసాగారు.

గౌహర్ జాన్ పేరు ప్రఖ్యాతులు దేశమంతటా వ్యాపించ సాగాయి. ఆమెను భారతదేశపు “మొట్టమొదటి డాన్సింగ్ గర్ల్ ” అని పిలవ సాగారు. అనేకమంది మహారాజాలూ, జమీందారులూ, వ్యాపారవేత్తలూ ఆమె  ప్రదర్శనల కోసం  తహతహ లాడేవారు.

అది సుమారు 1887వ సంవత్సరం.

యవ్వనారంభ సమయంలో అందరి లాగే ప్రేమ లో పడింది గౌహర్ జాన్. బనారస్ కి చెందిన ఛగ్గన్ రాయ్ అనే యువరాజాని చూసి ఆకర్షితురాలయింది. ఆయన కూడా ఈమె పట్ల అనురాగం చూపి  బనారస్ కి ఆహ్వానించాడు.

తల్లిని కలకత్తాలో వదిలి గౌహర్ జాన్  తిరిగి బనారస్ పయనమయ్యింది.అక్కడ ఒక రెండు సంవత్సరాల పాటు చాలా ఆనందంగా గడిచింది.పరస్పరం సంగీత సాహిత్యాలకి సంబంధించిన విషయాలు పంచుకోవడం తో పాటు,ఆమె కొత్త కొత్త కవిత్వాలు  కూడా అల్లుతుండడంతో కాలమెలా గడిచిందో కూడా తెలియలేదు.

కానీ మనం ఊహించనిది జరగడమే జీవితం! వీరి అనుబంధం చూసి ఓర్వలేని అతని బంధువులూ స్నేహితులూ, గౌహర్ మీద తప్పుడు కేసులు బనాయించి కోర్టుకీడ్వడమే కాక,అతనికి వేరొక అందమైన చదువుకున్న అమ్మాయిని తెచ్చి పెళ్లిచేశారు. క్రమంగా అతని ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. గౌహర్ తో గడిపే సమయం తగ్గిపోయింది యేవేవో సాకులు చెప్పసాగాడు. మనసు విరిగి విసిగి పోయిన గౌహర్ 1891 లో కలకత్తాకు తిరిగి వచ్చింది.

(ఇంకా వుంది)

*

రొంపిచర్ల భార్గవి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Tooooo సినిమాటిక్ రియల్ story యుగయుగాలుగా ఎన్ని కన్నీటి కథలు ఎన్ని కళలు వున్నా ఎపుడు కాలము కిందకే తోసింది రక్షించి ఘంటసాల, బాల మురళి,లతా, సుశీల, జానకి, వాణి జయరాం sp లాంటి వారి lives బంధాలు ఎలా వున్నా కనీసం వారి కళకు break పడలేదు

  • కల్పితమైన కథల్లో కూడా కనిపించని twists and turns గౌహర్ జాన్ జీవితంలో .ఎప్పటిలాగే మీ శైలి అక్షరమక్షరం చదివిస్తుంది భార్గవీ .👍👍

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు