స్టేడియం దగ్గర యమకోలాహలంగా ఉంది. మెయిన్ రోడ్ నుండి స్టేడియంకు వెళ్ళే రెండు కిలోమీటర్ల రోడ్డంతా బంతిపూల తోరణాలతో అందంగా, ఆడంబరంగా అలంకరించబడి ఉంది. ప్రతీ పదిహేను అడుగులకీ ‘అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, పేదప్రజల ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగారికి స్వాగతం… సుస్వాగతం’ అని రాయబడ్డ రంగురంగుల బేనర్లు— పెద్దపెద్దవి— అట్టహాసంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి.
స్టేడియం ప్రవేశద్వారం దగ్గర ఏకంగా యాభై అడుగుల ఎత్తున్న ముఖ్యమంత్రిగారి ‘మచ్ లార్జర్ దేన్ లైఫ్’ కటౌట్లు రెండు, మెడనిండా పెద్దపెద్ద పూలమాలలతో అలంకరింపబడి, గేటుకు అటువేపూ, ఇటువేపూ అమర్చబడి ప్రత్యేక ఆకర్షణగా అలరారున్నాయి.
జిల్లాకు చెందిన మంత్రివర్యులూ, ఎమ్మెల్యేలూ, ఇతర రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులూ, జిల్లా కలక్టరువారూ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసువావారూ, ప్రొహిబిషన్ ఎండ్ ఎక్సైజ్ సూపరింటెండెంటుగారూ వంటి ఉన్నతోద్యోగులూ ముఖ్యమంత్రిగారి ఆగమనానికై ఆతృతగా ఎదురుచూస్తూ వేచి ఉన్నారక్కడ.
మరి కొద్దిసేపట్లో జరగబోయే ‘వినూత్నమైన, విలక్షమైన’ కార్యక్రమం ఒకదానిలో పాల్గొనే ఉద్దేశ్యంతో వందల సంఖ్యలో అక్కడకు తీసుకురాబడ్డ పౌరులుకూడా ముఖ్యమంత్రిగారి రాక కొరకు ఎదురుచూస్తున్నారు— వేయికళ్ళతోనూ, ఒకింత ‘అసహనం’గానూ!
అంతమంది ప్రముఖులూ, పౌరులూ సమావేశమైనచోట ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా కాపాడే సత్సంకల్పంతో పోలీసులు అధికసంఖ్యలో మోహరించడ్డారు అక్కడ. వారంతా తమ బాధ్యతను బహుజాగ్రత్తగా, డేగకళ్లతో నిర్వర్తిస్తున్నారు.
ఇంతలో ‘సర్క్యూట్ హౌస్’ నుండి ముఖ్యమంత్రిగారి కాన్వాయ్ బయల్దేరిందన్న వార్త అందడంతో పెద్దలందరూ ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యారు. కార్యకర్తల్లో హడావుడి మొదలైంది. “ప్రియతమ ముఖ్యమంత్రిగారికీ జా…య్!” “పేదప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు జయహో!” అన్న నినాదాలు ఒక్కసారిగా మిన్ను ముట్టాయి.
కార్యకర్తల ఉత్సాహాన్ని వీక్షించిన మంత్రిగారు కొంచెం చిరాకుపడ్డారు. అయితే అది బయటకు ప్రదర్శించడం అంత తెలివైన పని కాదన్న ఇంగితజ్ఞానం ఉన్నవారు కావడంతో మొహంపై నవ్వు పులుముకొని, “ప్రియతమ ముఖ్యమంత్రిగారు ఇక్కడకు చేరుకోవడానికి ఇంకా అరగంట సమయం పడుతుంది గనుక అంతవరకూ ఎటువంటి నినాదాలూ చేయకుండా, సుశిక్షితులైన సైనికులవలే క్రమశిక్షణతో వేచి ఉండమని” తమ యోధులకు హితబోధ చేసారు. వారిలో పెల్లుబుకుతున్న వీరావేశాన్నీ, అత్యుత్సాహాన్నీ అదుపు చేసే ప్రయత్నం గావించేరు. అందులో కొంతవరకూ విజయం సాధించేరు కూడా.
అరగంట తరవాత ‘బొయ్—’మని సైరన్ మోగించుకుంటూ ‘సర్ర్—‘మంటూ దూసుకొచ్చి ఆగింది పోలీస్ ఎస్కార్ట్ వేన్. దాని వెనకే మరో మూడు నిమిషాల్లో ముఖ్యమంత్రిగారి పదకొండు కార్ల కాన్వాయ్ కూడా వచ్చి ఆగింది. వాటిలో అన్నింటికీ మధ్యనున్న ఆరో కారులోనుండి ముఖ్యమంత్రిగారు దిగారు హుందాగా.
తన కొరకు అక్కడ వేచియున్న ప్రముఖులకు మామూలుగానూ, కార్యకర్తలకు ఎంతో అభిమానంగానూ అభివాదం గావించారు. అది చూసిన కార్యకర్తలు సంతోషంతో పులకించిపోయారు. వారిని నియంత్రించే వారెవరూ లేకపోవడంతో ఆవేశంతో రెచ్చిపోయారు. చెవులు బద్దలయ్యేలా జయజయధ్వానాలు గావించారు. కేకలూ, ఈలలూ వేశారు. డాన్సులు కూడా చేశారు. వీటన్నింటితో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అవన్నీ వీక్షించిన ముఖ్యమంత్రిగారి హృదయం, శరీరం రెండూ పులకించిపోయాయి.
వేచియున్న ప్రముఖులందరూ ముఖ్యమంత్రిగారికి గౌరవపూర్వకంగా స్వాగతం పలికి, భక్తితో వారి చేతులూ పాదాలూ, ఎవరి వీలును బట్టి వారు కళ్ళకద్దుకొని, గజమాలతో సత్కరించి, స్టేడియం లోపల ‘పోడియం’ వద్దకు సగౌరవంగా వారిని తోడుకొని వెళ్లారు. వారు అక్కడకు చేరుకోవడానికి పట్టిన పదినిమిషాలూ వందలాదిమంది కార్యకర్తలూ, ప్రజలూ దిక్కులు పిక్కటిల్లేలా జయజయధ్వానాలు గావిస్తూనే ఉన్నారు.
మరో పదినిమిషాల సమయం అలా ఉత్సాహంగా గడిచిన తరవాత, సందడి సద్దుమణిగింది. అందరూ ఎంతో ఉత్కంతతో ఎదురుచూస్తున్న సమావేశం మొదలైంది.
వేదికనలంకరించిన ప్రముఖులందరూ— కలక్టరుగారి దగ్గర నుంచి, మంత్రిగారి వరకూ, ఎమ్మెల్యేలతో సహా, ఉపన్యాసాలు గావించారు. చివరిగా ముఖ్యమంత్రిగారు తమ సందేశాన్ని అందించడానికి ఆయత్తమయ్యారు.
ఆయన తమ స్థానంనుండి చిరునవ్వుతో లేచి నిలబడ్డ మరుక్షణం స్టేడియం అంతా చప్పట్లతోనూ, నినాదాలతోనూ మళ్ళీ హోరెత్తిపోయింది. ఆయన మైకు వద్దకు అడుగులు వేస్తున్నప్పుడూ, చేరుకున్న తరవాత కూడా హోరెత్తిపోతూనే ఉంది.
శాంతించమని ప్రజలకు వారనేక పర్యాయాలు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. అప్పుడుగాని ప్రజల ఉద్రేకం, ఉత్సాహం తగ్గుమొహం పట్టలేదు. కరతాళధ్వనులు ఆగలేదు. పూర్తిగా ఆగిన తరవాతగాని, ముఖ్యమంత్రిగారు తమ ఉపన్యాసాన్ని ప్రారంభించలేదు!
వారు గావించిన మహోపన్యాసంలో ‘తాగునీటి దగ్గర నుండి తాగడానికి మద్యం’ వరకూ— అన్నీ అతి తక్కువ ధరకు— అల్మోస్ట్ ఉచితంగా— అందించే ప్రజానాయకుడు ఈ దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంమీద తను తప్ప వేరొకరు ఎక్కడా లేరన్న విషయాన్ని శ్రోతలకు వినమ్రంగా విన్నవించుకున్నారు!
ప్రజల బాగోగులు బొత్తిగా పట్టని ప్రతిపక్షాలు విదేశీశక్తులతో చేతులు కలిపి వారందించే పథకాలకు గండికొట్టాలన్న దుష్టయత్నాలెలా సాగిస్తున్నాయో— ఆ విషయం కూడా వారు శ్రోతలకు వివరంగా తెలియజేశారు. దాని గురించి వివరిస్తున్నప్పుడు అదుపు చేసుకోలేని భావావేశానికి గురయ్యారు వారు. కన్నీరు కూడా పెట్టుకున్నారు.
తన కంఠంలో ప్రాణం ఉండగా ఆ దుర్మార్గుల కుటిలయత్నాలు సాగనివ్వననీ, ఆ ప్రయత్నంలో అవసరమైతే ప్రాణత్యాగం చెయ్యడానికైనా సిద్దమేననీ ఎంతో ఎమోషనల్ గా డిక్లేర్ చేశారు. తమకు అత్యంత ప్రీతిపాత్రులైన ప్రజలపై ప్రమాణంకూడా చేశారు.
చివరిగా ఆనాటి కార్యక్రమము యొక్క ప్రత్యేకతనూ, విశిష్టతనూ వివరిస్తూ “ఎండనకా, వాననకా కాయకష్టం చేసే నా సహోదరులు — కొంతమంది చెల్లెళ్ళు కూడా— ఆకలిదప్పులూ, వెతలూ వేదనలూ మరచిపోయి రోజులో కనీసం కొన్ని గంటలైనా నిష్పూచీగా జీవించాలనీ, హాయిగా నిద్రపోవాలనీ ఆశించి, ఎంత కర్చైనా వెనుదీయక వారికి ఎంతో నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాననీ, ఆ విషయమై ప్రజలు తమ సంతృప్తినీ, సంతోషాన్నీ, రెండుసార్లు తమనే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ద్వారా వ్యక్తపరిచారనీ, అది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు మేము అందిస్తున్న మద్యం పరమనాసిరకమైనదనీ, విషతుల్యమనీ దుష్ప్రచారం గావించడమేకాక, దాన్ని నిజం చేసే దురుద్దేశంతో ప్రభుత్వ మద్యంసీసాలలో కల్తీ మద్యంసీసాలను కలిపివేస్తున్నారనీ, ఆ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే, దట్టమైన అడవుల్లో వారు ఏర్పాటు చేసుకున్న రహస్యగిడ్డంగులపై మెరుపుదాడులు చెయ్యించాననీ, వేలాది సంఖ్యలో కల్తీ మద్యంసీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందనీ… వాటిని ఇప్పుడు, ఇక్కడ మీ సమక్షంలో, రోడ్డు రోలర్స్తో మట్టించి ధ్వంసం చేయబోతున్నామనీ— తద్వారా కుట్రలూ, కుతంత్రాలూ తన పరిపాలనలో సహించబడవన్న బలమైన సందేశం ప్రజావ్యతిరేకులకూ, దేశద్రోహులకూ అందించ సంకల్పించాననీ— ఈ కార్యక్రమ్యాన్ని జయప్రదం గావించడానికి మీరందరూ పెద్దసంఖ్యలో ఏతెంచడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నదనీ” ఊపిరి పీల్చుకోకుండా, గుక్కతిప్పుకోకుండా ప్రకటించి— తమ ఉపన్యాసాన్ని ముగించారు.
*****
ముఖ్యమంత్రిగారి ప్రసంగంలోని ముగింపు మాటలు సమావేశానికి హాజరైన వారి ప్రియ సహోదరుల ఆశలపై సీసాలతో ‘మందు’ గుమ్మరించాయి! ఆజ్యం తోడైన అగ్గిమంటలా కుతకుతలాడుతున్న వారి కడుపుమంట అనగా అసంతృప్తి ప్రళయాగ్నిలా నాలుకలు చాచి ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశాయి. వారి మనోభావాలను భయంకరంగా దెబ్బతీసాయి. మనవాడనుకున్న ఆత్మీయుడే పచ్చిమోసానికీ, నయవంచనకూ గురి చేసినట్టు బాధపడేలా చేశాయి!
పర్యవసానంగా, ‘జయహో’లూ, జయజయధ్వానాల స్థానంలో వారి ‘రైచస్ ఇండిగ్నేషన్’ అనగా ‘ధర్మాగ్రహం’ కట్టలు తెంచుకొని, ‘సద్యోజనితము’గా అనగా ‘స్వచ్ఛందం’గా పోటెత్తి ప్రవహించింది.
వారిలో నాయకత్వలక్షణాలు చిగురు తొడుగుతున్న యువకిశోరాలు పదిమందికి తమలో వెల్లివెత్తుతున్న ఆగ్రహావేశాలను నియంత్రించుకోవడం సాధ్యపడలేదు పాపం! దానితో కోపంగా లేచి నిలుచొని, ఉద్రేకంతో ఊగిపోతూ “పేదప్రజల నోటి దగ్గర మందు దొంగిలించే దొంగల ప్రభుత్వం నశించాలి; ఆ దొంగల ముఠా నాయకుడైన ముఖ్యమంత్రి డౌన్ డౌన్” అన్న నినాదాలు చేయసాగారు ఆవేశంతో ఊగిపోతూ.
వారి చూసి ఇన్స్పైర్ అయిన మిగిలిన ప్రజలుకూడా వారిలానే చిందులేస్తూ అవే నినాదాలు మరింత గట్టిగా ఉద్ఘోషించసాగారు.
అంతవరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయిందక్కడ. ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో అక్కడున్న అధికారులకు అర్దమయ్యేలోపే తాడి ప్రమాణాన లేచిన సునామీ కెరటంలాగా ఎగిసిపడ్డ ప్రజానీకం పహరా కాస్తున్నా ‘పోలీస్ కార్డన్’ను ఛేదించడంలో విజయం సాధించారు. రోడ్డు రోలర్లచే తొక్కించబడడానికి అందంగా, ఆర్టిస్టిక్ గా అమర్చబడ్డ మద్యంసీసాలపై మూకుమ్మడిగా దాడి చేసారు. ఎవరికి దొరికిన సీసాలు వారు చేజిక్కించుకొని బయటకు పరుగు తీసారు.
స్టేడియం మొత్తం అయిదంటే అయిదు నిమిషాల్లో ఖాళీ అయిపోయింది!
*****
ఒకవైపు— అనూహ్యంగా సంభవించిన ఆ దుర్ఘటనలో ముఖ్యమంత్రిగారికీ, మంత్రిగారికీ, ఇతర ప్రముఖులకూ ఎటువంటి ప్రమాదమూ సంభవించనందుకు అధికారులందరూ నిశ్చింతగా నిట్టూర్చి, ఆనందించి, ఒకరినొకరు కౌగలించుకొని అభినందనలు తెలుపుకొని, వారిని అక్కడనుండి తరలించే పనిలో పడితే—
మరోవైపు— జరిగిన తొక్కిసలాటలో జస్ట్ పదిమంది సామాన్యప్రజలు— అనగా అలగాజనాలు— మాత్రమే అసువులు బాసిన అల్పమైన విషయాన్ని అనవసరంగా ‘సెన్సేషనలైజ్’ చేసి, ప్రభుత్వాన్ని ‘అన్నెసెసరీ ఎంబారెస్మెంట్’కు గురిచేసే అనాలోచితచర్యలకు పాల్పడకుండా న్యూస్ పేపర్లనూ, టీవీ ఛానళ్లనూ ‘మేనేజ్’ చేసే పనిలో పడ్డారు ఎమ్మెల్యేలూ, ఇతర ఛోటామోటా నాయకులూ!!
(మధ్య భారతంలో ఏదో రాష్ట్రంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా)








Add comment