సద్దిమూటకు దక్కిన గౌరవం….

రోజూ వాగులు, చెరువులు చూస్తూ ఒక్కసారిగా సముద్రాన్ని చూస్తే ఎట్లుంటది? చెన్నై ప్రయాణం  అలాంటి అనుభూతిని మిగిల్చింది.
కేంద్ర సాహిత్య యువ పురస్కారం సభ ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో జరుగుతుంటుంది.పోయిన సారి కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. ఈసారి తమిళనాడులో. మొదటి సారి విమానమెక్కే అవకాశం ‘దండకడియం’ కవిత్వం ద్వారా కల్గినందుకు ఎంతో సంబురపడిన. నేను, మా గురువు రాజవర్ధన్ రెడ్డి సార్ , నా స్టూడెంట్ భాస్కర్ లతో కలిసి మే 29 నాడు షంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరినం. అమ్మను వెంట తీసుకొని పోవాలని ఉండే గానీ కొన్ని అనారోగ్య కారణాల వలన రాలేకపోయింది.
నాగార్జున సాగర్ పోయినప్పుడు, కల్వకుర్తి కాలేజిలో చేరేటపుడు, టి.టి.సి చదివేటపుడు నాతోడు వచ్చిన రాజు సార్ఈ  అపురూప సందర్భంలో నాతో పాటు  ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
చిన్నపుడు ఎక్కడ విమానం కనబడ్డా అన్నం తినేది విడిచి పెట్టి విమానం చూడడానికి ఎగబడే వాళ్ళం. అది పోయిందాక కదలకుండా నిలబడి ఎటు దిక్కు పోతుందో మాట్లాడుకునే వాళ్ళం. విమానం చూసినామన్న తృప్తి కడుపు నింపేది. ఈ రోజు ఏయిర్ పోర్ట్ లో  అడుగు పెట్టగానే ఎన్నో జ్ఞాపకాలు మలుపు మలుపుకు గుర్తు కొచ్చినయి. విమానం ఎక్కబోతున్నం అనే మాటనే గొప్ప కవితావాక్యంగా తోచింది. సరిగ్గా మూడున్నరకు విమానమెక్కి కూర్చునం .పై నుంచి చూస్తే సైన్స్ ఫెయిర్ కోసం అట్టలతో  పిల్లలు తయారు చేసిన చిన్న చిన్న ఇండ్లలాగ కనబడుతున్నాయి. ఇంకా ఒక పైకి పోయినపుడు కొండబాట తప్ప ఏవీ కనిపించలే. విమానం పైకి పోతున్న కొద్ది మేఘాల మీదంగ నడుస్తున్నట్లుగా తోచింది. గుట్టలు గుట్టలుగా పత్తిని పోసినట్లు ఎక్కడ చూసిన మేఘాలు.సాయంత్రం నాలుగున్నరకు విమానం చెన్నైకి చేరుకుంది. ఒక ఆటో తీసుకొని మా కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్సి హోటల్ కు  పోయినం. పది అంతస్తుల బిల్డింగులతో కూడిన పెద్ద హోటల్. చైన్నెలో మంచి పేరున్న హోటలు ఇది.
1
మార్చి30, 2022.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పురస్కార సభ . అప్పటి వరకు చెన్నైలో ఏదైనా చూడాలని అనుకున్నం. మాకు తోడు ఉమిత్ కిరణ్ అన్న కూడా వచ్చిండు. మద్రాసు విశ్వ విద్యాలయంలో తెలుగు వారి ఉగాది కవిసమ్మేళం ఉండె.  మాడభూషి సంపత్ కుమార్ సార్ అక్కడికి పిలవడం వలన  ఆ కార్యక్రమానికి వెళ్ళినం. “మా వాళ్ళు”అనే దగ్గరి తనం కల్గింది. సినీగేయ రచయిత భువనచంద్ర గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి. ఉగాది అంటే రాబోయే రోజులకు ముందే సిద్ధం చేసుకొనే బడ్జెట్ లాంటిదని చెప్పడం ఎంతో నచ్చింది. మాడభూషి సంపత్ కుమార్ గారి కవిత్వ సంపుటి “మొదటి అబద్దం ” ,నేతి శివరామ శర్మ గారి ఉన్నమాట శతకం పుస్తకాలను ఈ సభలో ఆవిష్కరించారు. శిఖా ఆకాష్, సరికొండ నరసింహ రాజు సుధా మురళి మొదలైన మన తెలుగు కవులు చాలా మంది కలిశారు. సభ ఐదు గంటలకు కాబట్టి తొందరగానే  హోటల్  చేరినం. అవార్డు గ్రహీతలందరిని బస్సులో ఎక్కించుకొని SRM యునివర్సిటికి తీసుకెళ్ళిండ్రు. ఒక వైపు ఒక సన్నాయి వాయిద్యాలు. మరొక వైపు అవార్డు గ్రహీతల ఫోటోలు. ఎవరి ఫోటోలను వారు చూసుకొని మురిసిపోతూ ఆ ఫొటోల ప్రక్కన నిలబడి ఫొటోలు దిగిండ్రు. అంతా సందడి సందడి. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఎన్నో ఎండ్ల పరిచయంలాగనే కలిసిపోయి మాట్లాడుకున్నం. కొంతమంది కవులు  ఆయా రాష్ట్రాల సంస్కృతిని చూపించే విధంగా ప్రత్యేకమైన వేషధారణతో వచ్చారు.
ఒక్కో కవి గురించి, తన రచనల గురించి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు సార్ సభలో చదివి వినిపించారు. మాధవ్ కౌషిక్ సార్ పూల మాలతో సత్కరించిండ్రు . కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, జ్ఞానపీఠ్  పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార్ గారి చేతుల మీదుగా  ఒక్కో భాషలో గెలుపొందిన వారికి అవార్డు అందజేసిండ్రు. పూలమాల అల్లినంత  సహజంగా, ప్రశాంతంగా కార్యక్రమం సాగిపోయింది. అందరి ముఖాల్లో ఎంతో వెలుగు. అవార్డు తీసుకున్న కవులందరిని చూసి మాధవ్ కౌషిక్  సార్ “యంగ్ ఇండియా మొత్తం ఈ వేదిక మీద ఉంది. భవిష్యత్తు యువ కవుల చేతుల్లో ఉంది “అని తన ప్రసంగంలో చెప్పారు. భారతీయతను చూపించే  భిన్నత్వంలో ఏకత్వమనే వాక్యం మనస్సులో మెదిలింది.
2
మార్చి 31, 2022 రోజు ఉదయం పది గంటలకు ‘పోయిట్స్ మిట్’ ఏర్పాటు చేసిండ్రు. ప్రతీ కవి తన అనుభవాలను పంచుకోవడానికి ఏర్పాటు చేసిన సభ ఇది. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మాతృభాషలో ఒకటి రెండు నిమిషాలు మాట్లాడి కొంతమంది ఇంగ్లీష్ లో ,ఇంకొంత మంది హిందీలో తమ ఉపన్యాసాలను చదివి వినిపించారు. మాతృభాషకు తాము ఇచ్చిన గొప్ప గౌరవం ఇది.
“దండకడియం కు ఈ పురస్కారం రావడం అంటే గొర్లను కాసుకుంట చెరువుగట్టు మీద సద్దిమూట విప్పే  నాయిన, తాతలకు దక్కిన గౌరవం. తెలంగాణ తంగేడు పూలకు దక్కిన గౌరవం. చెమట బొట్లను చిందించే తెలుగు ప్రజకు దక్కన గౌరవం” అని నేను కూడా నా కవిత్వం గురించి, దండ కడియం ఆత్మను తక్కువ మాటల్లో చెప్పి  ఇంగ్లీష్ లోని నా ప్రసంగాన్ని చదివి వినిపించిన.
తమిళుల కట్టుబొట్టు, భాషాభిమానం నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. తమిళులు హింది, ఇంగ్లీష్, కన్న తమిళంలోనే ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడ్డారు. మొదటి రోజు తమిళనాడులో ప్రముఖ కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సి.రామకృష్ణన్ అతిధిగా వచ్చారు. తన ఉపన్యాసమంతా తమిళంలోనే సాగింది. పెరుమళ్ మురగన్ రాసిన నవలను తెలుగులోకి పూనాచ్చి (ఒక మేక పిల్ల కథ)’ పేరుతో అనువాదం చేసిన గౌరీ కృపానందన్ గారిని కలుసుకునే అవకాశం దొరికింది. నేను మాట్లాడినంక చాలా బాగా మాట్లాడినావని అని మెచ్చుకోవడం ఒక మరిచిపోని  గుర్తు.
ఈ సారి కవిత్వంలో ఎనిమిది మందికి, కథల్లో ఎనిమిది మందికి, నవలల్లో నలుగురికి, నాటకం ఇతర ప్రక్రియల్లో నలుగురికి యువ పురస్కారం లభించింది. కథలు, కవిత్వం రాసే వారి సంఖ్య ఎక్కువగా వుంది.
కన్నడ సాహిత్యంలో దళితవాద ఉద్యమాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కన్నడంలో అవార్డు పొందిన లక్ష్మి నారాయణ స్వామితో మాట్లాడినంక తెలిసింది. మహా భారతాన్ని కర్ణుడి కోణంలో రాసిన రచన ‘తోగల చీలడ కర్ణ ‘కు ఈ పురస్కారం వచ్చింది.  పంపన గురించి, పాల్కురికి సోమనాథుని రగడల గురించి మాట్లాడుకున్నం. పంపకవి మా తెలుగు వాడే అని అంటే మా కన్నడ ఆది కవి అని గర్వంగా చెప్పిండు.
యువ పురస్కారం పొందిన వారిలో మొదట పరిచయం అయ్యింది  నేపాలి కవి మహేష్ దహల్. ప్రసాద్ మూర్తి సార్ ఇంతకు ముందే ఈ కవి గురించి చెప్పి  కలువని చెప్పిండ్రు. అలా మొదట కవి మహేష్ ను కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్న. చాలా పరిణితి ఉన్న కవిగా తను మాట్లాడుతుంటే అనిపించింది.
అవార్డు పొందిన వారిలో ఇద్దరు రచయితలు తెలుగు ప్రాంతంలో పనిచేస్తుండడం వలన తెలుగు బాగా మాట్లాడారు. సంతాలీ భాష నుండి పురస్కారం పొందిన ఒరిస్సా రచయిత “‘ కునా హంసాది’ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్   పని చేస్తున్నాడు. సంతాలీ ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవనం గురించి రాసిండు. ఒరిస్సా లో గ్రామీణ ఆచారాలకు వ్యతిరేకంగా పెళ్ళి చేసుకున్న ఇద్దరి ప్రేమికుల కథను “సాగై గనాడే ” నవలగా రాశాడు. ఇద్దరు చనిపోవడం ఎంతో బాధ కలిగించింది.
సంస్కృతంలో అవార్డు పొందిన కథల పుస్తకం ‘ కథాకల్పలత ‘.రచయిత్రి శ్వేతపద్మ శతపతి  గారు National Sanskrit  University  తిరుపతిలో అధ్యాపకులుగా పని చేస్తున్నారు.
తమిళ భాష నుండి పురస్కారం పొందిన కార్తిక్ బాలసుబ్రమణ్యం రాసిన కథల పుస్తకం నక్షత్ర వాసిగల్. సాఫ్ట్ వేర్ జాబ్ అనగానే పెద్ద సంఖ్యలో జీతం, విలాసవంతమైన జీవితం అనుకుంటాం గానీ ఉండే ఆ జీవితాల్లో. అభద్రత గురించి ఈ నవల వివరించింది. అస్సామీ గ్రామీణ జీవితాలను కథలుగా రాసిన  పుస్తకానికి  27 ఏండ్ల వయస్సులోనే  అభిజిత్ బోరాకు ఈ పురస్కారం లభించింది. అస్సామీ గ్రామీణ పాటల పట్ల మంచి పట్టున్న రచయిత. అస్సామీ గ్రామీణ జానపద పాటలు ఎలా ఉంటాయో పాడించుకొని విన్నాను.
యువ పురస్కారం పొందిన ఒక్కో జీవిత అనుభవాలు విన్నాక: 1.తమ జీవితాలనే నవలలుగా, కథలుగా, కవిత్వంగా మలిచిన సందర్భాలు ఎక్కువగా కనబడ్డాయి. 2. వాళ్ళ సాంస్కృతిక మూలాలోంచి ఎక్కువగా రాశారు. 3.ఉత్తర భారతదేశంలోని కవులందరికీ హింది వచ్చిన వాళ్ళు తమ సొంత మాతృ భాష డోగ్రి, కొంకణి, నేపాలీ, సంతాలీ మొదలైన భాషల్లోనే రాసి ఆ భాషలకు వొక గుర్తింపు తెచ్చారు.
మార్చి 31 రాత్రి చెన్నై వీధులను చూసి  వచ్చినం. టీ- నగర్, పాండి బజార్, వాణి మహల్ చూసుకుంటూ హైద్రాబాద్ తో పోల్చుకుంటూ చెన్నై రోడ్ల మీద నడిచినం. దిల్ సుఖ్ నగర్ లెక్క పాండీబజార్, త్యాగరాయ గాన సభ లాగ వాణిమహల్ చెన్నైలో కనిపించాయి. టీ నగర్ చూస్తున్నంత సేపు తెలుగు హీరోలు మద్రాసుకు వచ్చి పడిన కష్టాలు గుర్తొచ్చినయి. మహానటి  సావిత్రి మేడల మీది నుంచి అభిమానులకు నమస్కారాలు చెప్పె కొన్ని దృశ్యాలు గుర్తొచ్చాయి.
ట్యాంక్ బండి విగ్రహాల లాగనే మెరీనా బీచ్ ను ఆనుకొని రోడ్డు వెంబడి కొంత మంది విగ్రహాలు కనబడ్డాయి. అవి తమిళనాడులోని కవుల ,సంఘసంస్కర్తల విగ్రహాలు. వాటిల్లో కన్నగి విగ్రహం ఒకటి. మెరీనా బీచ్  దగ్గరలోనే సినిమాల్లో , రాజకీయ రంగంలో పేరుమోసిన తమిళ నాడు ముఖ్యమంత్రులు ఎం.జీ.ఆర్, జయలలిత గార్ల సమాధులు ఉన్నాయి. ఈ సమాధులు పూలతో అలంకరించబడి ఉన్నాయి. ఎంతో మంది జయలలితను అమ్మగా కొలవడం చూసిన.
అదే రోజు సాయంత్రం మెరీనా బీచ్ జ్ఞాపకాలను, చెన్నై వీధులను గుర్తు చేసుకుంటూ రైలు ఎక్కినం. చెన్నపట్నం పోయోస్తుంటే మళ్ళీ నా బతుకంతా కండ్లముందట కదిలింది.
*

తగుళ్ళ గోపాల్

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తగుళ్ల గోపాల్ గారికి, యువ సాహితీ పురస్కారం పొందిన మీకు మా అభినందనలు. మనస్సులో ఉన్న దానిని అలాగే వ్యక్తీకరించారు. మీ సాహితీ ప్రయాణం మరింత ఉజ్వలంగా కొనసాగాలని కోరుకుంటున్నాము.

    • మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు మేడం. మిమ్మల్ని కలువడం గొప్ప జ్ఞాపకం నాకు.

      • శుభాకాంక్షలు మిత్రమా… మీ మొత్తం ప్రయాణంలో మీ వెంట ఉన్నంత ఫీలింగ్ కలిగింది చదువుతుంటే…. ఏది రాసిన గుండె లోతుల్లో అనుభూతి చెంది రాయటం మీ ప్రత్యేకత….

  • నిన్ను ఎప్పుడూ కళ్ళారా చూడలేను.నీ ఫొటో, వాక్యం, అసలు పేరు చదవగానే కళ్ళలో తడి పొర కమ్ముతుంది.తప్పిపోయి దొరికిన చిట్టి తమ్ముని లాగా అనిపిస్తావు. గోపాల్.అమ్మకు నమస్సులు.మీ దోస్తులందరకు. ఒక కొత్త చోటికి,కొత్త వాహనంపై వెళ్లి,కొత్త వారిని కలుసుకుని ఊరిని తలుచుకున్నావు చూడూ ….అంతే హాయిగా రెండు నీటి బొట్టు కిందకు రాలినై. మనసు దూదిపింజ ఐపోయింది.
    శుభాకాంక్షలు, శుభాభినందనలు.గర్వం గా ఉంది తెలుగు కవీ!

  • బావుంది అనుభవాలన్నీ కళ్ళముందు తిరిగినట్టు రాయడం నచ్చింది. శుభాకాంక్షలు అన్నా☺️💐

  • తమ్ముడు గోపాల్… అభినందనలు

  • నీవు ఎదురుగా నిలబడి మాట్లాడినట్టు వుంది గోపాల్.. మనసును అక్షరాలుగా పరుస్తావు. నీలోని ఈ స్వచ్చత ఎప్పటికీ నిన్ను వదిలిపోదన్న నమ్మకం నాకున్నది ఒకింత సేడతీరి ఇక కొత్త పుటలో నీ సంతకం చెయ్యి..

    • అమ్మా…మీ మాటలు ఎంతో ధైర్యం. థ్యాంక్యూ అమ్మ

  • పురస్కారసభ విశేషాలను చదవుతుంటే నీ పక్కనే ఉన్నంత అనుభూతి, నీతో కలిసి విమాన ప్రయాణం చేసిన అనుభవం కలిగింది గోపాల్. అద్భుతంగా రాశావు.

    • అవార్డు తీసుకున్నాక మొదట మిమ్ములనే కలిసిన. ఎంతో గొప్ప జ్ఞాపకం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు