శిశిర

రాన్రానూ శిశిర నాకు శత్రువో, మిత్రురాలో అర్థం అయ్యేది కాదు.

ట్రైన్ దిగి బయటకి వస్తుండగా ఎవరిదో చేయి భుజం మీద పడినట్లనిపించి తల తిప్పి చూసాను.

నాన్న!

నవ్వుతూ చూసి నా చేతిలో బేగ్ తీసుకున్నారు.

“మీరెప్పుడొచ్చారు నాన్నా. అమ్మమ్మ చెప్పనేలేదు, మీరొస్తున్నారని!” ఆశ్చర్యంగా అడిగాను.

“రాత్రే వచ్చాం రా. అప్పటికప్పుడు బయల్దేరమని హడావిడి చేసింది అత్తయ్య. ఎక్కడివక్కడే వదిలేసి వచ్చేసాం”   అన్నారు నాన్న

“ఏమై ఉంటుందీ??” నాకు పజిల్ గా అనిపించింది.

ఏ విషయంలోనూ హడావిడి పడదు అమ్మమ్మ. ఎవరినీ కంగారు పెట్టదు. ఆలోచనలు  సాగుతుండగానే ఇంటికి వచ్చేసాం. రైల్వే స్టేషన్ కి చాలా దగ్గర్లో కొత్తగా డెవెలప్ అవుతున్న కాలనీ అది, నడిచి రాగలిగినంత దగ్గర.  గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంటే ఎదురొచ్చింది అమ్మ. విషయం ఏమిటన్నట్లు కళ్ళెగరేసాను. మౌనంగా లోపలికి వెళ్లిపోయింది, నా బాగ్ తీసుకుని. నేను లోపలికి వెళ్ళకుండా బయట వరండాలో ఉయ్యాలలో కూర్చుండి పోయాను.

తాతయ్య అర్థాంతరంగా చనిపోయేటప్పటికి అమ్మ, వాసు మామయ్యల చదువు పూర్తవ్వలేదు. ఆయన వెళ్లిపోయాక ఉన్న దాన్లోనే ఒబ్బిడిగా పిల్లల్ని పెంచుకుంది. అమ్మ పెళ్ళి అయ్యాక, మామయ్య బాధ్యత నాన్నే తీసుకున్నారు. “నా పెద్ద కొడుకు” అని మురిసిపోయేది అమ్మమ్మ. మామయ్యకి చదువు పూర్తవుతుండగానే ఉద్యోగం వచ్చింది. దూరంగా కొన్నాళ్ళు చేసినా అమ్మమ్మ కోసం, ఆ ఊరికే కోరి బదిలీ చేయించుకుని వచ్చేసాడు మామయ్య.  తన సేవింగ్స్ తో పాటు కొంత లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. దాదాపు 400 గజాల స్థలం అది. మామయ్య చాలా ఇష్టపడి తన టేస్ట్ ప్రకారం కట్టుకున్న ఇల్లు. ఒక  మూలగా ఇల్లు కట్టి మిగిలినదంతా తోటకి వదిలేసాడు.

గేట్ దగ్గర నుంచి ఇంట్లోకి వచ్చే దారి కొంత గచ్చు వేసి ఉంది.  అటూ ఇటూ కనకాంబరాలు! మంచు విడుస్తున్న ఫిబ్రవరి మొదటి రోజులు. కనకాంబరాలన్నీ మొగ్గలేస్తున్నాయి. వరండా పక్కగా మల్లె తీగ చిగుర్లేసి వేసంకాలానికి ఆహ్వానం పలుకుతోంది. ఆకు సంపెంగ గణుపు గణుపుకీ మొగ్గలేసింది. మామయ్యకి చాలా శ్రద్ధ మొక్కలంటే. ఒక పక్కగా పారిజాతం అంత ఎత్తున పెరిగింది. నేలంతా పూలు, నక్షత్రాల్లా పరుచుకుని ఉన్నాయి.

“అదేం చిత్రం మామయ్యా, పారిజాతాలు సంవత్సరం పొడుగూతా ఉంటాయి!” అనేవాడిని ఆశ్చర్యంగా.

“అవంతేరా శిశిరకి అవంటే ఇష్టం, అందుకే అవి ఎప్పుడూ పూస్తాయి.” అంటూ నవ్వేవాడు మామయ్య!

ఎంత అందంగా నవ్వేవాడో. తాను మోసే బాధలన్నిటినీ తన గుండె ఎక్కడ తొక్కిపెట్టేదో ఏమిటో కానీ అసలు బాధ అంటే తెలియని మనిషి నవ్వులా వీసమెత్తు కూడా కల్మషం లేకుండా వెన్నెల పూలు పరచినట్లు  ఉండేది ఆ నవ్వు. ఎలా మాయం అయిపోతారు మనుష్యులు! వాసు మామయ్య గుర్తుకు రాగానే కళ్ళలో ఊరిన తడి తోటనీ, పూలనీ కమ్మేసింది.

“అక్కడే కూర్చుండి పోయావా నాన్నా, ఫ్రెష్ అయిరా” కాఫీ కప్పుతో వచ్చింది అమ్మమ్మ.

“ఎలా ఉన్నావమ్మమ్మా?” అడగాలనుకున్న మాట బయటకి రాక ముందే లోపలికి వెళ్ళి పోయింది అమ్మమ్మ. అమ్మమ్మ కళ్ళల్లో సంఘర్షణా… మాటల్లో ఆనందం తెలుస్తూ ఉంది.

చిన్నగా నిట్టూర్చి, కప్పు క్రింద పెట్టి బయటే ఉన్న బాత్రూంలో దూరి ఫ్రెష్ అప్ అయి  వచ్చాను. కాఫీ తాగుతుండగా అమ్మొచ్చింది వరండా లోకి. చేటలో ఇంత చింత చిగురు వేసుకుని వలుస్తూ కూర్చుంది. ఏదో  చెప్పబోతోంది అని అర్థం అయింది.

అంతకన్నా  ముందే అడిగాను. “అత్తేదమ్మా”.

“హైదరాబాద్ లోనే ఉందటరా. పిల్లల్ని కూడ అక్కడే చేరుస్తుందట!” తలెత్తకుండానే చెప్పింది అమ్మ.

“ఓహ్” కొంత అర్థం అయీ కానట్లు అనిపిస్తోంది. ఇందాక అమ్మమ్మ కళ్ళల్లో కనిపించిన సంఘర్షణ కొంచెం కొంచెం  అర్థం అవుతూ  ఉంది. కొడుకు పిల్లల భవిష్యత్తు కోసం ఈ ముది  వయసులో తను పడే ఆరాటాన్ని ఆమె కళ్ళు దాయలేకపోతున్నాయి. మామయ్య జ్ఞాపకాలు ఆ ఇంట్లో, తాతయ్య జ్ఞాపకాలు ఆ ఊర్లో ఉన్నాయి తనకి. ఎక్కడికెళ్తుంది ఇప్పుడు? చాలా కష్టం కదా…!

“శిశిర వచ్చింది.”

ఉలిక్కి పడి చూసా అమ్మ వైపు. తలెత్తకుండా దీక్షగా చింత చిగురు వలుస్తూ చెపుతోంది. ఎప్పుడొచ్చారో నాన్న కూడా అక్కడే కూర్చుని పేపర్ లోకి తొంగి చూస్తున్నారు. కళ్ళే పేపర్ లోకి తొంగి చూస్తున్నాయి కానీ అక్షరాలు లోపలికి వెళ్ళట్లేదని అర్థం  తెలిసిపోతోంది.

“రమణమ్మా,” గట్టిగా కేకేసాను.

అమ్మమ్మ మీద ప్రేమ ఎక్కువ వచ్చినా, ఉద్వేగంగా అనిపించినా తన పేరుతో పిలవడం అలవాటు నాకు.

“పనిలో ఉన్నా… ” లోపలినుంచే బదులిచ్చింది అమ్మమ్మ.

ఓహో అదన్న మాట సంగతి…  దాదాపు రెండేళ్ళ తర్వాత ఈ ఇంటి మనుష్యుల్లో కదలికా… వంటగదిలో హడావిడీ… అమ్మమ్మలో హుషారూ, అమ్మ కళ్ళల్లో కొంత మెరుపూ! ఇవన్నీ “ఆమె” కోసమన్న మాట.  ఎందుకీ మనుష్యులకి ఆమె అంటే అంత ఇష్టం?

శిశిర!

ఆరేళ్ళ క్రితం చూసా తనని మొదటిసారి.

ఆ సంవత్సరం మామయ్య పుట్టినరోజు ఆదివారం వచ్చింది.  సోమవారం దీపావళి. వరుసగా మూడురోజులు శెలవులు వచ్చాయని మామయ్య పుట్టినరోజు సరదాగా చేసుకుందామని అందరినీ కూడేసింది అమ్మ. అప్పటికప్పుడు రిజర్వేషన్ దొరక్క రెండు బస్ లు మారి, నర్సాపురం వచ్చేటప్పటికి రాత్రి అయింది. కొంచం తేరుకుని పిల్లలతో ఆడుకుంటూ కూర్చున్నానో లేదో, సుడిగాలిలా వచ్చాడు మామయ్య. ఎవరితోనూ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి తన ట్రావెలింగ్ కిట్  సర్దుకుంటుంటే లోపలికి వెళ్ళింది అత్తయ్య. మొదటినుంచీ వాళ్ళిద్దరి మధ్యా పెద్దగా మాటలున్నట్లు అనిపించేవి కాదు. లోపలికి వెళ్ళి తను ఏం మాట్లాడిందో తెలియదు.

అమ్మమ్మ  ఏమిటి అన్నట్లు చూసిన చూపుకి “శిశిరకి బాలేదట,” అభావంగా చెప్పి వంట గదిలోకి వెళ్లి పోయింది.

“శిశిర???”

అయోమయంగా అమ్మమ్మ వేపు చూసి ఏదో అడగబోయిన నాకు అమ్మ, అమ్మమ్మ మొహంలో కంగారు మరీ ఆశ్చర్యం అనిపించింది. నాలుగేళ్ళు అమెరికాలో ఉండి ఈ మధ్యే వచ్చానేమో ఇక్కడ జరుగుతున్నవేమీ తెలీదు నాకు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే మామయ్య ఇంకొంచెం  మెరిసే కళ్ళతో  తిరగడమే తెలుస్తోంది.

శిశిరకి బాలేదట అని అత్తయ్య చెప్పినదగ్గర్నించి అమ్మమ్మ హడావిడి అంతా ఇంతా కాదు. దేవుడి గదిలోకి వెళ్ళి గబగబా దణ్ణం పెట్టుకుని ఇంత కుంకుమ తీసుకుని బయటకి వచ్చి మామయ్యకి ఇచ్చింది.

మామయ్య వెనక వెనకే తిరుగుతోంది అమ్మ. అన్నీ సర్దుకుని హెల్మెట్ తీసుకుని మామయ్య బయటకు వస్తుంటే,  “బండి మీదా? ఎక్కడికి ఇప్పుడు…” తెల్లబోయి అడిగాను.

“ఇప్పటికిప్పుడు బస్‌లూ, ట్రైన్‌లూ ఎక్కడుంటాయిరా. మీ అమ్మమ్మ కారు ఏమన్నా కొందా?” సహజ శైలిలో గట్టిగా నవ్వుతూ వెళ్ళబోతున్న మామయ్య వెనక, “నేనూ వస్తున్నా…” అంటూ అరుస్తూ పరిగెత్తా.

“అప్పుడు  టైం రాత్రి 10గంటలు. అక్కడినుంచి వైజాగ్ వెళ్ళాలంటే కనీసం 5 గంటలు పడుతుంది. రేపు తన పుట్టినరోజు. అసలు శిశిర ఎవరు? అంత ఇంపార్టెంట్  పర్సనా?. చిన్నప్పటి నుండి స్నేహితుడిలా చూసిన వాసు మామయ్య,  రాక రాక వచ్చిన నన్ను కూడా పట్టించుకోకుండా ఆమె  కోసం ఆరాట పడుతూ అన్నీ వదిలేసి మామయ్య ఇలా పరిగెడతాడేంటి?. నాకన్నా తను అంత  ఎక్కువా?’ ఆలోచిస్తుంటే  తెలియకుండానే ఆమె అంటే చిన్న అసూయ మొదలు అయ్యింది నాలో.

నా ఆలోచనలతో సంబంధం లేనట్లు బుల్లెట్ తీసి స్టార్ట్ చేస్తుండగానే పరిగెత్తుకెళ్ళి వెనక కూర్చున్నా. అది మొదలు, మళ్ళీ వైజాగ్ వెళ్ళాకే ఆపాడు బుల్లెట్ ని. తనని అంత ఆందోళనగా, అంత సీరియస్ గా ఎప్పుడూ చూడలేదు నేను. అసలు  ఎవరీ శిశిర? వీళ్ళ మధ్య స్నేహం ఏంటి?

హాస్పిటల్ కి వెళ్ళాక పరిగెడుతున్నట్లే వెళ్ళాడు లోపలికి. రిసెప్షన్ లో అడుగుతాడేమోనని నేనటువైపు అడుగులు వేసేలోపే ఐసియు వేపు పరిగెత్తాడు. ఐసియు బయటే ఒక నడివయసు వ్యక్తి మామయ్యని చూడగానే ఎదురొచ్చాడు. వాళ్ళిద్దరిని చూస్తేనే అర్థమయిపోతోంది చాలా దగ్గర పరిచయం ఉందనీ . నాకిదంతా అయోమయంగా, తల పగిలిపోతోంది.

ఉండబట్టలేక మామయ్యతో పాటు లోపలికి వెళ్ళాను. అక్కడ నేను చూసిన దృశ్యం ఇప్పటికీ నా కళ్ళముందు కట్టినట్లు ఉంది. నలిగిన మల్లె చెండులా పడి ఉంది శిశిర.  ముక్కులో గొంతులో ఏవో ట్యూబులు. బలహీనంగా చేతులెత్తిన శిశిరని వారిస్తూ దగ్గరకి తీసుకున్నాడు మామయ్య.

“నిన్ను చూస్తాననుకోలేదు…” అంటున్న ఆమెని మాట్లాడొద్దన్నట్లు ఆపాడు గానీ, మామయ్య కళ్ళల్లో నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఇంతలో బయట కనిపించిన వ్యక్తి వచ్చాడు లోపలికి.

“బావా! నా మేనల్లుడు వంశీ.” నన్ను పరిచయం చేసాడు మామయ్య .

అతను పలకరింపుగా నవ్వి, చెప్పడం మొదలు పెట్టాడు. ఏదో మాలిగ్నన్సీ. రెండు నెలలనుంచి ట్రీట్‌మెంట్ అవుతోంది. నాలుగు రోజులక్రితం ఆపరేషన్ చేసారట. ముందు రోజు హెచ్‌బీ లెవెల్స్ పడిపోయి ఇబ్బంది అయిందట. మామయ్యకి ఈ రెండు రోజుల డెవలప్‌మెంట్స్ తెలీవు.

“నాకు అస్సలు తెలీదు,” ఫిర్యాదుగా అన్నాడు మామయ్య.

“నాకేం తెలుసు. అదే పనిగా మాటల్లోనే ఉంటారు కదా స్నేహితులిద్దరూ…  నీకు తెలియకుండా శిశిర ఊపిరైనా తీయదనుకున్నా!” నవ్వుతూ అన్నారు ఆయన.

“రెండు రోజుల్నించి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఏదో ఒక రీజన్ చెప్తోంది. ఒక సారి మీటింగ్ అనీ.. ఒక సారి పనిలో ఉన్నా అని. అప్పుడైనా అనుమానం రాలేదు నాకు. అసలు మీకు చేయాల్సింది ఒకసారి…” బాధగా అంటున్నాడు మామయ్య.

సిస్టర్ ఇంక వెళ్లిపోమని వత్తిడి తెస్తుంటే వదల్లేక వదల్లేక మామయ్య వస్తుంటే, చేయి పైకెత్తి రమ్మని సైగ చేసింది శిశిర.

దగ్గరకి వెళ్ళిన మామయ్యని ఇంకా దగ్గరకి రమ్మని తల ఊపి.. తన నోటి దగ్గరగా చెవి పెట్టాక “హ్యాపీ బర్త్‌డే” అస్పష్టంగా చెప్పిందామె.

అప్పటిదాకా ఆందోళనతో చిన్నబోయినట్లున్న మామయ్య మొహం పుచ్చపువ్వులా విచ్చుకుంది. తన సహజ శైలిలో పెద్దగా నవ్వాడు.

“అభి న జావో చోడ్‌కే ఏ దిల్ అభీ భరా నహీ”. ఐసియు అని కూడా మర్చిపోయి రఫీ పాట మనసుని దాటుకుంటూ వచ్చేసింది .

ఆమె కనుకొలకల్లోంచి కన్నీళ్ళు ధారగా కారుతుంటే అపురూపంగా పట్టుకుని మెత్తగా తుడిచి వెనక్కి పడుకోపెట్టి నిద్రపోయే వరకూ పక్కన కూర్చుని వచ్చేసాడు. అప్పటికీ ఇప్పటికి శిశిర అనగానే మర్చిపోలేని అద్భుత దృశ్యం అది.

ఆ తర్వాత చాలా తెలిసాయి వాళ్ళిద్దరి గురించి. శిశిర మామయ్య కొలీగ్. ఒక చోట ఎప్పుడూ పని చేయలేదు వాళ్ళిద్దరూ. ఏదో ఒక వర్క్‌షాప్‌లో పరిచయం. చాలా త్వరగానే వదల్లేనంత క్లోజ్ అయిపోయారు.  వాళ్ళెంత దగ్గరి స్నేహితులో అర్థమయింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉండేవాళ్ళు. గంటలు గంటలు కబుర్లు చెప్పుకునే వారు. అంతగా ఏం ఉంటాయి!!

అసలు “శిశిర మామయ్యకి ఏం అవుతుందీ?”

మామయ్య జీవితంలో నాకు తెలీని రహస్యాలేమన్నా ఉన్నాయా అని తరచి తరచి వెతికేవాణ్ణి. ఊహూ. ఏమున్నట్లు అనిపించేది కాదు; చాలా ఉన్నట్లూ అనిపించేది.

వీటన్నిటి కన్నా శిశిర స్నేహితులు, ఆమె సోషల్ లైఫ్ మరీ ఆశ్చర్యంగా ఉండేది. మామయ్య అంత దగ్గరి స్నేహితులు తనకి చాలా మంది ఉన్నారు. అసలు ఆమె నైజమే అంత. మామయ్యకి మాత్రం వేరే ప్రపంచం ధ్యాస ఉన్నట్లు ఉండేది కాదు.  అమ్మమ్మ, అమ్మ మాటల్లో “శిశిరా శిశిరా” అదే మాట. అత్తయ్య పెద్దగా ఏం మాట్లాడేది కాదు. తనకి ఇదంతా నచ్చుతోందో లేదో తెలీదు. నచ్చక గొడవలు పడుతున్నారేమో అనిపించేది. ఒక వేళ గొడవలు పడితే బాగుండనుకుంటున్నానా, గొడవలు రానందుకు నిరాశ పడుతున్నానా…  అని ఆశ్చర్యపోయేవాడిని ఒక్కోసారి.

ఆ తర్వాత నేను మళ్ళీ అమెరికా వచ్చేసాక ఇక శిశిర గురించి ఫోన్ లో వినడమే. అమ్మమ్మకి ఫోన్ చేసినప్పుడల్లా అక్కడ విశేషాలతో పాటు శిశిర కబుర్లు చెప్తూనే ఉండేది. సగం కబుర్లు శిశిరవీ, ఆమె చేస్తున్న పనులు అవే మాటలు.

“ఒరే శిశిర ఒకమ్మాయిని డబ్బులు కట్టి చదివిస్తోంది,” చెప్పింది ఒకసారి.

“గొప్పే లేవే, నేనూ చాలా మందిని చదివించా” విసుక్కున్నా.

రాన్రానూ శిశిర నాకు శత్రువో, మిత్రురాలో అర్థం అయ్యేది కాదు.  మామయ్యకి నాకన్నా బయట వాళ్ళు ఎవరో ఎక్కువవ్వటం ఏమిటి అంటూ నాలో బయటకి కనిపించని అహమేదో నా ఆలోచనలని నియంత్రించేదనుకుంటా…

ఇంటికి కాల్ చేసినప్పుడల్లా తన కబుర్లు తెలుస్తాయేమోనన్న ఆసక్తి ఉండేది. తీరా  అమ్మ గానీ, అమ్మమ్మ గానీ చెప్పడం మొదలు పెట్టగానే విసుక్కునే వాడిని. ఎప్పుడన్నా మామయ్య చేస్తే శిశిర గురించి అడిగేవాణ్ణి. నవ్వేవాడు మామయ్య అంతే.

“తను అచ్చం నీలాగే ఆలోచిస్తుందిరా… ” అనే వాడు. “నాలాగా కూడా…” అనేవాడు మళ్ళీ. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఏం అవుతారు!! నా మనసు లో ఇదే ప్రశ్న… ఒకటి మాత్రం అర్థం అయ్యేది… వాళ్ళిద్దరే కాదు రెండు కుటుంబాలూ అంత దగ్గర అయిపోయాయని.

మళ్ళీ శిశిరని చూసింది మామయ్య చనిపోయినప్పుడే. బైక్ ఏక్సిడెంట్‌లో స్పాట్‌డెడ్ అని తెలిసి అప్పటికప్పుడు పరిగెత్తుకొచ్చేటప్పటికి మూడురోజులు. నా కోసమే ఉంచారు. అమ్మమ్మని, అమ్మని పట్టుకోలేక పోయాం. అత్తయ్య అయితే పిచ్చిదయిపోయింది, ఇద్దరు చిన్న పిల్లలు.

అందరికీ దూరంగా బొమ్మలా కూర్చున్న శిశిరని చూసి నా గుండె తరుక్కుపోయింది. కానీ ఆ ఫీలింగ్ ఒక్క క్షణం మాత్రమే. ప్రపంచం కోల్పోయినట్లు నిస్తేజంగా కూర్చున్న తన దగ్గరికి మాత్రం వెళ్ళాలనిపించలేదు.  వాళ్ళ అబ్బాయి అనుకుంటా పక్కన కూర్చున్నాడు. శిశిర భర్త దూరంగా నాన్న దగ్గర నుంచుని చేయాల్సిన కార్యక్రమాలు చూస్తున్నాడు. అంత దుఃఖం లోనూ అమ్మమ్మ శిశిర ఏమీ తినలేదనీ తన ఆరోగ్యం అసలే బాగోదని కంగారు పడుతుంటే, వచ్చిన వాళ్ళు అదోలా చూస్తుంటే నాకే విసుగ్గా అనిపించింది.

అనుకోకుండా రావడం వల్ల నేనూ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. ఆ తర్వాత అమెరికా వదిలి బెంగళూరు వచ్చేదాకా ఇక్కడి కబుర్లు పెద్దగా పట్టించుకునే తీరిక దొరకలేదు నాకు. మధ్య మధ్యలో మామయ్య బెనిఫిట్స్ సెటిల్ అవ్వడం…  పిల్లల గురించి శిశిర తీసుకున్న కేర్… ఇవన్నీ వింటున్నా… తన మీద నా మనసులో ఉన్న  ఏదో అయిష్టత పోయేది కాదు నాకు. ఆ స్నేహాలు, బంధాల పట్ల నాకంత నమ్మకం లేదా, గౌరవం లేదా అనిపించేది. మామయ్య సంవత్సరీకం అని అమ్మ ఫోన్ చేసినా ఎందుకో రాలేకపోయాను.

ఇదిగో ఇప్పుడు మళ్ళీ హడావుడిగా అమ్మమ్మ కబురు. పరిగెత్తుకొచ్చేటప్పటికి అమ్మ నాన్న గారు ఇక్కడ ఉండడం.. శిశిర రావడం… ఏదో జరగబోతున్నట్లు అనిపించింది. ఎక్కడున్నారు ఆవిడ? అమ్మని అడిగాను. మాట్లాడకుండా పారిజాతం చెట్టు వైపు చూపించింది.

అక్కడే పడక కుర్చీలో కూర్చుని ఉందామె.

ఎలాంటి శిశిర! ఎలా అయిపోయింది… అంతకు ముందు రెండు సార్లూ తనని అనుకోకుండానే చూసానేమో పరిశీలనగా చూడలేదు. అయినా కొన్ని రూపాలు అలా ముద్రించుకు పోతాయి. అందులోనూ నాకు చాలా చాలా ఇష్టమైన మామయ్య! తనని నాకు దూరం చేసిందన్న పొజెసివ్‌నెస్ ఉందేమో నాకు మరీ గుర్తుండిపోయింది. అయితే అప్పటి శిశిరకీ ఇప్పుడు చూస్తున్న మనిషికి అసలు పొంతన లేనట్లు ఉంది.

కళ్ళక్రింద ఇంతింత నల్ల మచ్చలు. చిక్కి పోయి, మనిషి పాలిపోయినట్లు ఉంది. పారిజాతాలు లెక్కపెడుతున్నట్లు ఒక్కొక్కపూవు తీసి ఎడమ అరిచేతిలోంచి కుడి గుప్పెట్లోకి వేసుకుంటోంది. గొణుగుతున్నట్లు పాడుతున్న పాట. “అభి నా జావో చోడ్‌కే. ఏ దిల్ అభీ భరా నహీ…” పాడుతూనే నన్ను చూసి ఆపేసింది. వెక్కిళ్ళు మింగేస్తూ రెండు చేతుల్లో మొహం దాచుకుంది. ఎంత దుఃఖం.

ఒక మనిషి లోటు ఇంత తినేస్తుందా. మేమంతా దాదాపుగా దుఃఖం లోంచి బయటకి వచ్చాం. పిల్లల బాధ్యత అత్తయ్యని బయటపడేసింది. ఈ మనిషేంటి… అనారోగ్యం తినేసి… కళ్ళల్లో ఊపిరి నిలుపుకున్నట్లు ఉంది. పలకరించడానికి మాటలు పెగలట్లేదు నాకు. అభావంగా కూర్చుండిపోయా.

అమ్మమ్మ వచ్చి పక్కన కూర్చుంది. “వైజాగ్ వెళ్లిపోదామనుకుంటున్నాం రా… ” అంది.

ఉలిక్కి పడ్డాను.

“రమణమ్మా…” అన్నాను.

ఇంతకీ ప్లూరల్ టెన్స్ ఏంటి? అనుమానంగా అమ్మ వేపు చూస్తుండగానే, ఇద్దరూ దగ్గరకి వచ్చి “మేం కూడా” అన్నారు.

నాకు అసహనంగా అనిపించింది.

ఎవరీ శిశిర? ఎలా వచ్చేసింది మా జీవితాల్లోకి. ఈ నిర్ణయాలేంటి. గట్టిగా ఏదో అనబోతున్న నన్ను ఆపి, నాన్న చెప్పడం మొదలు పెట్టారు.

మామయ్య కన్న కలలు! అర్థాంతరంగా తను వెళ్లిపోతే శిశిర ముందుకు తీసుకెళ్తోంది. వీధి పిల్లల చదువు కోసం స్థలం కొంది. అవసరం అయిన డబ్బుల కోసం వీఆరెస్ తీసుకుంది.

“అమ్మమ్మ కూడా ఇల్లు అమ్మేస్తానంది రా. కాని శిశిర వప్పుకోలేదు. మామయ్య పిల్లల కోసం అవసరం అంది. మమ్మల్నీ ఏమీ కదల్చనివ్వట్లేదు. రేపు నీ భవిష్యత్తు కూడా చూడాలిగా అంటోంది,” అమ్మ చెప్తుంటే అవాక్కయి వింటున్నా.

ఇంతలో శిశిర అందుకుంది. మేం ఇద్దరం మాట్లాడుకోవడం అదే మొదటిసారి.

“వంశీ!!…

వాసుకి చాలా ఆశలుండేవి. తన కళ్ళు ఎప్పుడూ ఏవేవో స్వప్న లోకాల్లో విహరిస్తున్నట్లు ఉండేవి. మేం ఇద్దరం చాలా అనుకున్నాం.  అయితే తను వెళ్లిపోయాడు. తన ఆశయాలు పోకూడదు. నాకు వేరే బాధ్యతలు లేవు వంశీ. నా అనారోగ్యమే నన్ను తినేస్తోంది. ఎక్కువ సమయం లేదనిపిస్తోంది. నా భర్త కూడా నాతో ఉన్నారు.  అయితే ఇది చాలదు వంశీ. నాకు కొంచం సపోర్ట్ కావాలి. నాన్న రిటైర్ అయ్యారు కాబట్టి తను నాతో ఉంటారు.  నాకు అమ్మా, అక్కా కావాలి. ఇచ్చేస్తావా?” ఉద్వేగంగా అడుగుతోంది తను.

ఇన్ని రోజులూ శిశిర ఎందుకు నచ్చలేదు నాకు? మామయ్య నాకు దూరం అయిపోయాడని పొజెసివ్ గా ఫీల్ అయ్యానా? వాళ్ళ మధ్య బంధం ఏమిటన్నది అర్థంకాలేదా నాకు? ఒక వేళ అది ఎలాంటి బంధం అయినా, నేనెందుకు జడ్జ్ చేయాలనుకున్నాను?

శిశిర గురించి అడిగినప్పుడల్లా… వెలిగిపోయే మామయ్య కళ్ళు గుర్తొచ్చాయి.  మౌనంగా ఉండిపోయే మామయ్య, “తను అచ్చం నీలా ఆలోచిస్తుందిరా…” అనడం గుర్తొచ్చింది.

మామయ్య అర్థంతరంగా ఆగిపోయిన  స్నేహాన్ని ఇలా కొనసాగించాలనుకుంటున్నాడేమో అనిపించి

మొదటిసారి తన వేపు స్నేహంగా చూసి నవ్వాను. చేయి చాచి తన చేత్తో కలుపుతూ “ఫ్రెండ్స్!” అని నవ్వాను.

**           **           **

చిత్రం: సత్యా బిరుదరాజు

ఉమా నూతక్కి

ఉమా నూతక్కి

వృత్తి రీత్యా ఎల్ఐసి లో Administrative Officer ని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఉమగారూ! కథ చదువుతూంటే మనస్సుని హత్తుకుంటూ, ఏదో తెలియని కుతూహలాన్ని రేకెత్తిస్తూ ,సాగిపోయింది.అనురాగాలు,అనుబంధాలకు కారణాలు ఏం వెతకగలమూ ,ఎలా వెతకగలమూ! అంతే అవి! ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు!

  • కథ బాగుంది, ఉమాగారు!💐,నాకు శరత్ చంద్ర,గుర్తుకు వచ్చారు!..బాగరాశారు.!

  • కొన్ని కొన్నిటిని మరిచిపోలేము ఎన్నటికీ. మాటలే తోచట్లా చదివాకా. మనసు నిండిపోయింది ఉమా.

  • కొన్ని బంధాలంతేనేమొ– ఏమవుతరో తెలియదు ఎందుకు ఏర్పడతయో అంత విడదీయరాని అనురాగాలు–ఏ జన్మవరాలో కన్నవాళ్ళమీద కట్టుకున్న బంధాలమీద కూడ ఎర్పడనంత గాఢంగా– నాకు తెలియకుండనే కళ్ళలో నీళ్ళు ఇంతకన్న చెప్పేదేముంది

  • ఉమా, ……అచ్చం నాకు నచ్చినట్లు ఇష్టంగా ఉంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు