లోపలి నాదమే పాటకి ప్రాణం: మల్లాది సూరిబాబు

కొంచెం సంగీత జ్ఞానం కలిగి ఉన్న నాకు రేడియో ఒక క్రొత్త ప్రపంచం తలుపులు తీసింది.

ఆయనకు సంగీతమే ప్రపంచం, సంగీతమే ప్రవృత్తి. సంగీత సాధనే లక్ష్యం. ఆయన సంగీతానికి ఎల్లలు లేవు. శుద్ధశాస్త్రీయ కర్ణాటక సంగీతమైనా, హిందుస్థానీ అయినా, గజల్ అయినా, కాశ్మీరీ జానపదమైనా, రఫీ హిందీ పాటైనా, సాలూరు వారి తెలుగు బాణీ అయినా అంతే ఆనందించగలరు. ప్రతి పాటలోని సంగీతపు పోకడలకి అబ్బురపడే మనస్తత్వం ఆయనది. సంగీతం నేర్చుకోవడానికి వయస్సు సమయాభావం ఏవీ అడ్డం రావని నిరూపించిన సంగీత ప్రయాణం ఆయనది. ఆ ఇష్టం, ఆ కృషి ఈనాడు వారిని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “కళారత్న” బిరుదుతోను, ఈనాడు భారత ప్రభుత్వం కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారంతో గౌరవించిన మల్లాది సూరిబాబు గారితో కొన్ని ముచ్చట్లు.
ప్రసూన : నమస్కారమండి. మీకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించినందుకు మా హృదయ పూర్వక అభినందనలు
మ.సూ : నమస్కారం కృతజ్ఞతలు.
ప్రసూన : మీరు ఈ స్థాయి చేరుకొనేందుకు పడిన శ్రమ, చేసిన కృషి ఎంతో స్పూర్తి దాయకం. మీ సంగీత ప్రస్థానం గురించి కొన్ని సంగతులు తెలియజేయగలరా?
 నా సంగీత ప్రస్థానానికి మొదట బీజం వేసింది మా నాన్నగారు. నిజానికి మా నాన్న గారి కుటుంబం సంగీతంతో పరిచయం ఉన్న కుటుంబం కాదు. కానీ ఆ సరస్వతీదేవి కటాక్షమో ఏమో నాన్న గారికి సంగీతం పై అభిరుచి ఉండేది. ఆ రోజుల్లో హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణ దాసుగారి హరికథ వినడం తటస్థించిందట. ఆ సంగీతానికి ముగ్ధుడైన నాన్నగారు సంగీత దర్పణం వంటి పుస్తకాలు సేకరించి విన్న జ్ఞానంతో సంగీతం పాడడం మొదలు పెట్టారు. ఆ సంగీతమే ఆయన సంతానమైన మా అయిదుగురికి నేర్పించారు. ఈ సంగీతం వెనుక శాస్త్రం ఆయనకి తెలీదు. అందువలన మాకూ ఆ దృష్టి లేదు. ఆయన ఉత్సాహంగా మా చేత రేడియోలో కూడా పద్యాలు, పాటలు పాడించడం, ఏకపాత్ర అభినయాలు చేయించడంతో మా మొదటి అడుగు ప్రారంభం అయింది. గురువు దగ్గర శాస్త్రబద్ధంగా నేర్చుకోవడం మాకు కుదరలేదు. 1970లో నేను ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సరుగా చేరాను. ఆ చేరిక నా జీవితంలో పెద్ద మలుపు అని చెప్పాలి.
ప్రసూన : అప్పుడు మీ వయస్సు ఎంత?
నేను పుట్టింది 1945లో 1970 అంటే నాకప్పుడు 25 సంవత్సరాల వయస్సు. కొంచెం సంగీత జ్ఞానం కలిగి ఉన్న నాకు రేడియో ఒక క్రొత్త ప్రపంచం తలుపులు తీసింది. 1972 ప్రాంతంలో AIR వివిధ భారతి కార్యక్రమాలు మొదలు పెట్టాయి. చిన్న వాళ్ళం, క్రొత్తగా చేరిన మమ్మల్ని ఆ విభాగంలోకి అనౌన్సర్లుగా పంపారు. వివిధ భారతి సంగీత మయమైన కార్యక్రమం. అది సినిమా పాటలకే పరిమితం కాలేదు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, గజల్స్, వేరు వేరు ప్రాంతాల, వేరు వేరు భాషల సంగీతం, కాశ్మీరు, భోజపురి, అస్సాం, గుజరాతీ వంటి అనేక పాంత్రాల వారి జానపద సంగీతం ప్రసారమవుతూ ఉండేది. నా అభిరుచికి ఈ ఉద్యోగం సరిపోయింది. ఆయాచితంగా ఒక నిధి దొరికి నట్లయింది. ఆ నంగీత సముద్రం ముందు నిల్చుని ఆనందించడం, ఆ లోతులకి, అందాలకి అబ్బురపడడం నా వంతయింది.
ప్రసూన : మీరు అదే కాలంలో సంగీత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజుల్లో సంగీత శిక్షణ దక్షిణ భారతదేశమంతా విని ఆనందించి, హర్షించిన కార్యక్రమం..
 “సంగీత శిక్షణ” కార్యక్రమంలోకి నా ప్రవేశం చిత్రంగా జరిగింది. తీరిక సమయాల్లో రేడియో స్టేషన్లోనే ఉంటూ పాటలు వింటూ ఉండేవాడిని. అలా ఒక రోజు మహమ్మద్ రఫీ పాడిన ఒక సినిమా పాట “దేఖా హై తేరీ ఆఖో మే ప్యార్ హి ప్యార్ బేషుమార్” అనేది నన్ను బాగా ఆకర్షించింది. ఆ పాట స్వరం చూడండి “నీ..సాస నీ సాస దసదమాగరిగపా” అనే పల్లవితో మొదలవుతుంది. తలుపులు వేసుకుని నేనూ ఆ పాటతో స్వరం కలిపి బిగ్గరగా పాడుకుంటున్నాను. నాకు బయట ప్రపంచం దృష్టి లేదు. అదే సమయానికి వోలేటి వేంకటేశ్వర్లు గారు అక్కడికి వచ్చి వినడం తటస్థించింది. వారి మనస్సులో కలిగిన దయ వల్ల నన్ను పిలిపించుకొని ఒక ప్రశ్న వేసారు. “నీ గొంతు బాగుంది. సినిమా పాటలు పదే పదే రిపీట్ చేస్తూ పాడడం వల్ల నీ పరిధి పెరగదు. నువ్వు క్లాసికల్ సంగీతం వైపు ఆసక్తి చూపవచ్చుగదా అని”. అంత గొప్ప విద్వాంసుల ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు.” నేను మా నాన్న గారి దగ్గర కొంత Classical సంగీతం నేర్చుకున్నానండి. ఇంకా ఏమి చేయమంటారు” అని అడిగాను. వారు ఒక నిమిషం ఆలోచించి “వారానికి రెండు రోజులు సంగీత శిక్షణ అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. దానిలో నువ్వు కూడా శిష్యునిగా చేరగలవా?” అని అడిగారు. అది నాకు దేవుడిచ్చిన వరం. అది నా డ్యూటీ కాదు. అయినా నేను అందుకు ఒప్పుకున్నాను. అలా నేను సంగీత శిక్షణలోకి
వచ్చాను.
ప్రసూన:“సంగీత శిక్షణ”లోకి వచ్చేసరికి NCV జగన్నాధచార్యులు గారు శిష్యులు గాను, వోలేటి వేంకటేశ్వర్లు గారు గురువుగా ఆ పోగ్రాం నడిచింది.
అవును. ఒక రెండు మూడు వారాలు ఇద్దరం శిష్యులుగా ఉన్నాము. తరువాత జగన్నాధచార్యులు గారు ఆ కార్యక్రమం నుండి ఇద్దరు అవసరం లేదని తప్పుకున్నారు. గురువుగారు వోలేటి గారు శిష్యుడిగా నేను ఈ కార్యక్రమం తర్వాత 25 సంవత్సరాలు ప్రసారం అయింది. ఇది నా జీవితంలో నాకు దొరికిన సువర్ణావకాశం. అప్పటికి నేను సంగీతం ఓనమాలు మాత్రమే దిద్దాను. అన్న విషయం అవగతం అయ్యింది. నేను మొట్టమొదటి నేర్చుకున్న కీర్తన స్వాతి తిరునాళ్ రచించిన “సతతం తావక పద సేవన” అని ఖరహరప్రియ రాగంలోది ఒక పద్దతిగా రాగ స్వభావం తెలియడం కొరకు ఒక్కొక సంగతి ఒక క్రమబద్ధంగా పేర్చడం, నేర్చుకున్నాను. నాకు అప్పటి స్వరం చదవడం రాదు. వోలేటి గారిని అనుకరిస్తూ అది కూడా నేర్చుకున్నాను. ఆ విధంగా నెలకొక కీర్తన చొప్పున నేర్చుకున్నాను. ఈ అవకాశం దొరకడం, వోలేటిగారి లాంటి విద్వాంసులు ఆయాచితం గురువుగా దొరకం నా పూర్వ జన్మసుకృతం, పెద్దల ఆశీర్వాద బలం, మా నాన్నగారి సంగీతం పై ఆసక్తి కున్న బలం అని నేను విశ్వసిస్తూన్నాను.

ప్రసూన: అవునండీ. ఇది ఒక గొప్ప విశేషమే. ఇలా నేర్చుకొనే అవకాశం దొరకడం పెద్దల ఆశీర్వాద బలమే. ఈ కార్యక్రమంలో ఏమైనా ఒడిదుడుకులు ఎదురయ్యాయి?

25 సంవత్సరాల ప్రయాణంలో రెండుసార్లు ఇబ్బంది పడ్డాను. కీర్తనలోని మాటలకి రాగసౌందర్యం ఆవిష్కరించడానికి సంగతులు వేస్తాం. అవి సూక్ష్మంగా గ్రహించి పాడగలగాలి. ఒకసారి దర్బారు రాగంలో వేసిన సంగతులు నాకు తొందరగా అర్థం కాలేదు. సరియైన గమకం పడితే భాషకున్న అందం ఇనుమడిస్తుంది. ఆ భావంలోని తీవ్రత శ్రోతకు చేరుతుంది. ఆ రెండు పర్యాయయాలు వోలేటిగారు కార్యక్రమం అయిపోయినా కూడా దగ్గరుండి ప్రేమతో ఒకటికి రెండుసార్లు నేర్పించారు. వోలేటి గారు ఆ కార్యక్రమంలో నేర్పినవన్నీ Rare కృతులే. ఇవి గాక ముత్తుస్వామి దీక్షితార్ నవావరణ కృతులు, నవగ్రహకృతులు నేర్చుకున్నాను.

ప్రసూన: మీ అనుభవంలో ఈ పాఠాల వల్ల మీరు ముఖ్యముగా నేర్చుకున్నది ఏమిటి?
 ఏ కీర్తనకైనా నాద పోషణ ముఖ్యమైనది. ప్రతివారి పాటలోనూ అది ఉండదు. నాదం కీర్తనలోనే హారంలో దారంలాగా ఒక మాటని వేరొక మాటకి ముడి పెడుతూ అంతర్లీనంగా సాగుతూ ఉంటుంది. మాట ఒక్కటే పాడి లోపల ఉన్న నాదాన్ని మనం పైకి తీసుకరాలేకపోతే ఆ పాట పేలవంగా ఉంటుంది. హృదయాన్ని తాకదు. రసపోషణ జరగదు. కీర్తనలన్నీ నాదాన్ని మోసుకు వస్తాయి. అది గ్రహించి గాయకుడు ఆ నాదపోషణ చేయాలి. త్యాగరాజస్వామి “ప్రక్కల నిలబడే” అనే కృతిలో నువ్వు నమస్కారము ఎలా చేస్తున్నావు అని ప్రశ్నించారు. “తనువు చేత వందనము ఒనరించుచున్నావా అని అడిగారు. శరీరం లాంటి మాట కాక అందులో ఆత్మలాంటి నాదం మనం గ్రహించాలి. ఈ విషయం నేను మా గురువులు వోలేటి గారి దగ్గర, పినాకపాణి గారి వద్ద తెలుసుకున్నాను.
ప్రసూన:: మీరు చాలా లలిత గీతాలకు సంగీతం కంపోజ్ చేశారు. అలాగే శాస్త్రీయ సంగీతంలోని కృతులు రచించి రాగం, న్వరం నిర్ణయించి వాగ్గేయకారులయ్యారు. శాస్త్రీయ సంగీతం పాడేవారు లలిత సంగీతం పాడేలేరని, ఆ ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయని విమర్శిస్తారు. మరి మీరు ఈ ప్రక్రియలు రెండూ విజయవంతంగా ఎలా చేయగలిగారు?
ఇది నాకు వోలేటిగారి సహచర్యంలో నేర్చుకుని అలవాటు పడ్డాను. వారు శాస్త్రీయ సంగీతం ఎంత విస్తరించి రాగ రంజితం చేయగలరో కుదించి లలిత సంగీతం అలాగే పాడగలరు. భావం ముఖ్యం, కాని రాగం కూడా సూక్ష్మ రూపంలోనైనా స్పష్టంగా ఉండాలి. లలిత సంగీతంలో సాహిత్యంకు తగిన రాగం ఎన్నుకోవడం, రాగస్వరూపం మారకుండా సంగీతం సమకూర్చడం అనేది నేను చేసిన ప్రయత్నం. ఉదాహరణకు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి “అందాల ఆమని ఆనంద దాయిని” అనే పాట అందమైన తేలిక మాటలతో కూర్చిన పాట. దీనికి సంగీతం పేలవంగా ఉంటే ఆ పాట అందం శ్రోతలకు అందదు. ఎంత సంగీతం ఉండాలో అంతే ఉంచి భావం తెలిసేలా ఉంటే చాలు. రాగంలోని అందం లలితగీతాలలో ఎందుకు తెలియకూడదూ?
ప్రసూన : ఆ పాటే కాదు. “రాదారి పడవలా సాగాలి జీవితం” “హాయిలో నేల ఎదకింత హింస” అనే లలిత గీతాలు చాల ప్రాచుర్యం పొందాయి. “హాయిలో నేల ఎదకింత హింస” అనేది గజల్. ఈ ప్రక్రియలో మీరు చేసిన ప్రయోగాలు తెలియజేయండి.
రేడియోలోని Archives లో గొప్పవారి సంగీతం నిక్షిప్తమై ఉండేది. అందులో ఈ గజల్స్ నన్ను చాలా ఆకర్షించాయి. మెహదీహసన్, గులాంఆలీ వంటి మహాగాయకులు పాడిన గజల్స్ వింటూ ఉండేవారం. నేనే కాదు – వోలేటిగారు, రజనీ కాంతరావు గారు కూడా ఈ గజల్స్ కి ఆకర్షితులయ్యి తరచూ వింటూ వుండేవారు. ఇదే పోకడలో ఒక పాటకు సంగీతం సమకూర్చాలి, అనే ఈ ఉబలాటానికి ఆలంబనగా రజనీగారి శతపత్ర సుందరిలో గజల్ అనే శీర్షికతో “హాయిలో నేల ఎదకింత హింస” అనే గేయం కనపడింది. అది తీసుకుని హిందుస్థానీ గజల్ పద్దతిలో సంగీతం కూర్చిపాడాను. ఇది జనామోదం పొందింది. రజనీకాంతరావుగారికి ఈ పాట వినిపించగానే వారు చాలా ఆనందించి “నీ పాట విన్నాక నా ట్యూన్ మర్చిపోయానోయ్” అన్నారు. రజనీ గారికి మాట పాట కలిసే వస్తాయి గదా! ఇది నాకు పెద్ద కాంప్లిమెంట్ ఆమోద ముద్ర.
ప్రసూన : జావళీలు, పదాలలో మీరు పాడినవి గురించి మాతో…..
 క్షేత్రయ్య పదాలు నేను పినాకపాణి గారి దగ్గర నేర్చుకున్నాను. పినాకపాణి గారి వద్ద శిష్యరికం చేయాలని ఆ కురువృద్ధుని వద్ద కొన్ని మెళకువులు అభ్యసించాలని నా కోరిక. నాకు అప్పటికే పొదిలి బ్రహ్మయ్య శాస్త్రిగారని విశాఖపట్నం కె.జి హస్పటల్ లో ప్రొఫెసరు, సంగీత రసికలు, పినాకపాణి గారి ఆత్మీయులు – వీరితో పరిచయం ఉంది. వీరికి నా కోరిక తెలియజేసి సిఫారసు చెయ్యిమని అర్థించాను. ఆయన వెంటనే సిఫారసుతో పాటు పాణిగారు పాడిన క్షేత్రయ్య పదాలు, కీర్తనలు జావళీలు ఉన్న 5 క్యాసెట్లు పంపారు. అందులోని క్షేత్రయ్య పదం “నేను చూసి నాలుగు నెలలు” అనే పున్నాగవరాళిలో పాణి గారు పాడింది నా హృదయాన్ని కదిలించి వెంటనే వీరి దగ్గరకు వెళ్ళాను. పాణిగారి వయస్సు అప్పటికి 90 సంవత్సరాలు. వెన్నుముక్కలో ఏదో సమస్య ఉండి ఒక గంట కూర్చుంటే రెండుగంటలు పడుకోవల్సి వచ్చేది. అలాంటి స్థితిలో కూడా ఆయన పాఠం చెప్పేవారు. “ఎక్కడి
నేస్తం, ఎక్కడి నెనరు ఎవరికెవ్వరే” అనే పదం నేర్పారు.
ప్రసూన: పాణిగారి సంగీతం వోలేటిగారి సంగీతం బాణీలు ఒకటే గదా? ఏదైనా వైవిధ్యం ఉందా?
 ఉంది. పాణిగారి పాడే విధానం వేరు, వోలేటిగారిది వేరు. వోలేటి గారి పాట శైలిలో కొంచెం హిందుస్థానీ ఛాయలు ఉండేవి. అవి కర్ణాటకంలో అందాన్ని మరింత పెంపొందించేవి. Richness of Carnatic Music, రాగభావన వచ్చే సంగతులు పాణిగారు Maximum Extent క పాడేవారు. రాగ విస్తరణ ఆయనలా ఎవరు చేయరు. ప్రతి అక్షరానికి రాగం అద్దేవారు ఉదాహరణకి “బాలకనకమయచేలా” అనే కీర్తనకి ప్రతి అక్షరంకి గమకంలో అరాణా రాగం ప్రతిబింబిస్తుంది. ఇంత గొప్పవారు దగ్గర నేర్చుకున్నందు వల్ల నాకు సంగీతం వచ్చు అనే అహంకారం లేదు. ఏ అవార్డులు, రివార్శలుకి నేను ప్రయత్నించలేదు, ఆశపడలేదు. సంగీతం కోసం సంగీతం నేర్చుకున్న అలాగే జీవించిన మహానుభావుల దగ్గర నేర్చుకున్న జీవిత పాఠం
ఇది.
ప్రసూన: ఒకే కుటుంబంలో సంగీతంలోనూ సాహిత్యంలో కాని తండ్రికొడుకులు అంతేవాసులుగా ఉండడం అరుదు. కాని మీ ఇంట్లో మీ పిల్లలిద్దరు “మల్లాదిబ్రదర్స్” శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ప్రఖ్యాతి గడించారు. ఈ సంగీత సామ్రాజ్యంలో సుస్థిర స్థానం వారిది. మీ మనవళ్ళు, మనమరాళ్ళు, అంతే శ్రద్ధతో విద్యని అభ్యసిస్తున్నారు. ఇది ఎలా మీరు నేర్పగలిగారు?
నా గురువుల నుంచి సంక్రమించిన విద్యను నేను నా పిల్లలకు అందించాను. పిల్లలు కూడా అందుకొనే నేర్పుగలిగి ఉన్నారు. అది భగవదనుగ్రహం. ఇంట్లోని సంగీత వాతావరణంతో మనవళ్ళు, మనమరాళ్ళు కూడా అదే దారిలో నడుస్తున్నారు.
*
Avatar

ప్రసూన బాలాంత్రపు

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రసూనగారూ
    గంధర్వ లోకపు ప్రసూనాలు అందించారు
    కృతజ్ఞతలు

  • ప్రసూన గారు! ఒక మహా సంగీతరత్నాన్ని పరిచయం చేశారు.చదివి చాలా సంతోషమే సింది ! ధన్యవాదాలు !!

  • అమ్మా , చాలా ఏళ్ల నుండి సూరిబాబు గారిని వింటూనే వున్నా – వారి గురించి , సూరి బాబు గారి సంగీత స్వరాల ప్రయాణం గురించి – మంచి. Interview / మాటలాట – మీ ద్వారా చదివే అవకాశం దొరికింది ,
    పెద్దలు సూరిబాబు గారికీ ., మీకూ – కృతజ్ఞతాభివందనాలు .,,

  • Wonderful interview Prasuna. Thank you for bringing it to the readers. శాస్త్రీయ సంగీతానికి లలిత సంగీతానికి సూరిబాబు గారు ఇచ్చిన విశ్లేషణ నాకు సంగీతానికి మాధుర్యముయెలా వస్తుందో తెలియ చేసింది. ఆందుకు వారికి నా ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు