ఎవరికి చూపని కొన్ని అక్షరాలు ఉన్నాయి.
ఎవరూ చూడని కొన్ని వెలివేసిన వర్ణమాలలు ఉన్నాయి
వాటి శ్వాసల నిండా
దహనమైన స్వప్నాల కమురు కంపు
అవి
కన్నీటి దండెం పొడుగునా గుచ్చుకున్న పచ్చిగాయాల చర్మాలు
వేదనా తోరణానికి వేలాడదీసిన ప్రాణ స్వరాలు
చీకటిపిట్టలు పొడిచిన
మాంసపు ఉదయాలు
ఆకలి పురుగులు తొలిచిన శిథిల పేగు సమాధులు
ఎప్పటి నుండో
ఆకుపచ్చగా నవ్వే వెన్నెల వాక్యాల్లో ఉనికిని పొదువుకోవాలని తపిస్తున్న అక్షరాలే!
ఎప్పటికప్పుడు
బతుకుపొల్లు విరిగి బావురుమంటున్నాయి
రాదారి ముళ్ల కంపల్లో
విసరబడ్డ అనాధ విత్తులై కొట్టుకులాడుతున్నాయి
జీవం తోడేయబడ్డ హృదయబావుల్లో
పోగుబడ్డ శూన్యపు పూడికతో చితివేదికను నిర్మిస్తున్నాయి
ఎంత తరిగినా తరగని వెతల రాత్రుల్ని మోస్తున్న కొన్ని ఆకాశాలున్నాయి
ఎంత ఇగిర్చినా ఇంకని నెత్తుటి చెలమల్ని
స్రవిస్తున్న కొన్ని దగాపడ్డ భూములున్నాయి
నిషేదించబడ్డ జీవిత పుస్తకాల్లో
ఎవరూ స్పృశించని కొన్ని ఒంటరి అక్షరాలున్నాయి
లిపి చెరపబడ్డ భాషాగోసలున్నాయి
ఎంతకీ తేరుకొని కొన్ని దుఃఖపు నదులున్నాయి
నువ్వూ, నేనూ ఎరుగని వెలివేతల బండల్ని
మోస్తున్న ఆదిమ హృదయాలున్నాయి
పడగలెత్తిన అభివృద్ధి
విషోగరపు నీడలో ఆక్రోశిస్తున్న
చెట్టునీ,పుట్టనీ నమ్ముకున్న
అమాయకపు బతుకులున్నాయి
మతోన్మాదమో…
వాణిజ్య ఒప్పందమో
విప్పిన చీరల మాటున
చితికిన అవయవాలున్నాయి
నిన్నూ నన్నూ నిత్య ప్రశ్నలై
దహించే రగులుతున్న అరణ్యపు గుండె కాగడాలున్నాయి
నిజాల నిప్పుల్ని దోసిట పట్టి
హత్తుకునే తెగువ
నీలో నాలో ఎప్పటికీ చెరగని సందేహ చిహ్నమే
ఎందుకంటే మనం సంస్కరించబడ్డ అక్షర వారసులం
ఆదిమ భాష మరచిన మాయా నిఘంటువులం
*
చిత్రం: సుమనస్పతి రెడ్డి








Add comment