అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు సియాంగ్ జిల్లాలో పసీఘాట్లో మామంగ్ దాయి 23.02.57న ఆది అనే ఆదివాసీ కుటుంబంలో జన్మించింది. షిల్లాంగ్లో ఆమె బాల్య విద్యాభ్యాసం పూర్తయ్యాక, గౌహతి యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలయ్యింది.
1979లో ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు అరుణాచల్ రాష్ట్రం నుంచి ఎన్నికైన మొదటి మహిళ. కానీ రాజీనామా చేసి జర్నలిస్టుగా స్థిరపడి, ద టెలీగ్రాఫ్, హిందూస్థాన్ టైమ్స్, ద సెంటినల్ వంటి ఆంగ్ల వార్తాపత్రికల్లో పని చేసింది.
రచయిత్రిగా మామంగ్ దాయి 2003-04 మధ్య అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన జానపద కథలను మూడు సంపుటాలుగా వెలువరించింది. 2006లో ఆమె తన ఆదివాసీ జాతి ఆది గురించి మొదటి కాల్పనిక సాహిత్యం కథల సంపుటి వెలువరించింది. ఆ తరువాత రెండు కథల సంపుటులు, ఒక నవల, నాలుగు కవితా సంపుటులు వెలువరించింది.
2017లో ఆమె నవల ద బ్లేక్ హిల్ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, రాష్ట్ర స్థాయిలో అనేక పురస్కారాలు అందుకొంది. 2011లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఈ సంవత్సరమే ఆమె నవల ద బ్లేక్ హిల్ తెలుగులోకి అనువాదమైంది. మిష్మీ కొండలు శీర్షికతో కె.వి.యస్. మూర్తి గారు అనువదించారు.
*
కానీ, నాదంటూ ఏ స్వప్నం లేదు!
దినం అంటే ఏమీ లేదు
నిశ్శబ్దంగా మొక్కలు ఆకులు పెరగటమే
నిశీధిలో ఏదో ఒక ఉల్క రాలటమే
ఓ చిరుతపులి తన పద చిహ్నాలు విడిచి పెట్టడమే
కానీ, నాదంటూ ఏ స్వప్నం లేదు
ఒక్కోసారి సమీరం
నా కన్నులని తాకి వెళ్ళిపోతుంది
నా హృదయాన్ని కుదిపేస్తుంది
సుందరంగా, ప్రశాంతంగా
ఉన్న భూమిని చూడమంటుంది
కానీ, నాదంటూ ఏ స్వప్నం లేదు
నేను నిశ్చలంగా కూర్చున్నప్పుడు
విశాల పర్వతాల నిశ్శబ్దంలో లీనమైపోగలను
సూర్యుడు కనిపించకపోయినా
పర్వతాలు అతడి వెలుగులో స్నానిస్తాయి
నది సంగీతం పాడుతుంది
ప్రేమ ప్రవహిస్తుంది
ప్రేమ ప్రవహిస్తుంది
కానీ, నాదంటూ ఏ స్వప్నం లేదు.
-మూలం ఆంగ్లం : మామంగ్ దాయి
అంత దూరంలో నా పెళ్ళి చేయకు నాన్నా!
నిర్మలా పుతుల్ జార్ఖండ్ రాష్ట్రంలో నిరుపేద సంతాళీ ఆదివాసీ కుటుంబంలో 1972లో జన్మించింది. సామాన్య స్కూలు చదువు తరువాత, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు నర్సింగ్ కోర్స్ చదివినా, తరువాత ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలు అయ్యాక రెండు శతాబ్దాలకు పైగా ఆదివాసీల పునరావాసం, మానవాధికారాల కోసం పోరాటం చేస్తూనే ఉంది.
మాతృభాషైనా సంతాళీలో ముందు కవితా రచన ప్రారంభించినా, తరువాత హిందీ భాషలో కూడా కవితా రచన చేస్తోంది. రెండు భాషలలోనూ ఇప్పటి వరకు మూడు కవితా సంపుటాలు వెలువరించింది. కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు అనేక రాష్ట్రీయ, ఇతర సాహిత్య పురస్కారాలు అందుకుంది. 2010లో ఆమె జీవితంపై తీసిన డాక్యుమెంటరీ “బురు-గారా” (Hilly River) రాష్ట్రీయ స్థాయిలో ఉత్తమ డాక్యుమెంటరీగా పురస్కారం పొందింది.
నాన్నా!
నన్ను కలుసుకునేందుకు
మేకలు అమ్మేయాల్సినంత
దూరపు సంబంధం తెచ్చి నా పెళ్ళి చేయకు
మనుషుల కన్నా దేవుళ్ళే
ఎక్కువ నెలవైన దేశంతో
నా వివాహ బంధాన్ని ముడిపెట్టకు
అడవి, నది, పర్వతాలు
ఎక్కడ లేవో అలాంటి ప్రదేశాలలో
నాకు వివాహ సంబంధం వెతకకు
రోడ్లపై మనసు కన్నా వేగంగా
సంచరించే ప్రయాణ సాధనాలు
ఎత్తైన భవనాలు, విశాలమైన దుకాణాలు
ఉన్న ప్రదేశంలో అస్సలు సంబంధాలు వెతకకు
కుదురైన వాకిలి లేని
పొద్దున్నే కోడి కూతలు వినబడని
సాయంత్రమైతే పెరటి నుంచి
కొండ వెనుక అస్తమించే సూరీడు కనబడని
ఇంటికి నన్ను కోడలుగా పంపించకు
ఎన్నడూ తన చేతులతో ఒక మొక్క నాటని
తన కష్టంతో పంట పండించని
కష్టంలో ఉన్నవారికి ఎన్నడూ చేయూతనివ్వని
అడగకుండానే భారం మోసేందుకు ముందుకు ఉరకని
వ్యక్తిని నాకు వరునిగా ఎంపిక చేయకు
నువ్వు ఉదయం పాదచారివై
బయలుదేరి తిరిగి సాయంత్రానికి
మన ఇంటికి మరల గలిగేంత దాపులో నా పెళ్ళి చేయాలి
ఎప్పుడైనా దుఃఖం పొరలి
నదీ గట్టున కూర్చొని నేను ఏడిస్తే
అవతలి ఒడ్డున స్నానం చేసే నీకు
నా దుఃఖం వినబడేంత దూరంలో నా పెళ్ళి చేయాలి.
-హిందీ మూలం: నిర్మలా పుతుల్, ఆదివాసీ కవయిత్రి








Add comment