అడవి గుండెలో కొమ్మల చప్పుడు లేని వేళ చీకటి చీర కప్పుకొని నెమ్మదిగా జారే నీడలా
ఎగిరి పోయేను ఎలిబొంత
చినుకు గీతాలు వింటూ గాలితో మాట్లాడే
అడవి చిన్న కొడుకతడు
రాతిరి నీడన నెలవంక పొదలపై జారినప్పుడు
చెట్టు గుండెల్లో కదిలే చిన్న ఊపిరి
ఎండిన ఆకుల వీణపై పాదాల సంగీతం పలికిస్తూ
గాలి కంటే వేగమై చీకటిలో దారులు నేస్తాడు
భూమి గర్భంలో గింజల కలలు దాచుకొని
రేపటి ఆకలికై శ్రమను నాటే శ్రామికుడతడు
ఆకలి అగ్గిని గుండెల్లో మోస్తూ జీవనకావ్యాన్ని రాస్తాడు
బతకాలి బతికించాలనె తనలోని తపన
విప్లవ మేనని నేర్పుతాడు
అడవి కనురెప్పల మధ్య జారిపడిన నిశ్శబ్ద స్వప్నం
మట్టి ఊపిరిలో మొలిచిన చిన్న గుండె చప్పుడు
చీకటి ఒడిలో వెలిగే బతుకు మినుగురు
అడవి రహస్యాలన్నీ 2
తన రెక్కల మాటున దాచుకొని
పొదల భాషలో రాత్రితో కవిత్వం అల్లినట్టు
బతకడమే పోరాటమైనప్పుడు గింజల గాధలు మోస్తూ
గూటికి జీవం పోసే సంజీవుడతడు
గూళ్ళన్ని కనులైన గూటికి చేరని ఎలిబొంత
పడమర సూర్యుడు దాగి చెట్ల నీడలు పొడవైన
“ఎదురు చూపులకు తెలవారని చీకటి”
గూటి బాధ్యత రెక్కల పై నెత్తుకుని
“ఏకూ వచ్చే….పోకు అంటే” గుగ్గూ గూ అని వారించిన
రెక్కలులేని మాంసపు ముద్దలను కన్నుల్లో నింపుకొని
పరిచయమే లేని ఆపదలకు అడ్డునిలిచి
ఆకలి పోరులో అమరత్వాన్ని పొందినట్టు
అతడి మరణానికి అడవి సాక్ష్యమైందేమో!
ఆమె కన్నీటికి ఆకులే సాక్షాలుగా నిలిచెనేమో!
పడమర సూర్యుడు దాగి చెట్ల నీడలు పొడవైన
ఎదురుచూపులకు తెలవారిని చీకటి
దుఃఖ గీతాన్ని ఆలపిస్తూ ఆడపచ్చి
గూటి గుమ్మంలో కళ్ళతోరణాలు కట్టినట్టు
*








Add comment