నిరంతరం ప్లస్ నిలకడ అనేది కత్తిసాము. చాలా మంది కొంతకాలం రాసి, అలసిపోతారు. రాసినా, నిలకడ లేకుండా వడలిపోతారు. అనిల్ డానీ ఈ స్థితిని ఛాలెంజ్ చేస్తున్నాడు. కవిగానూ, విమర్శకుడిగానూ గట్టిగా నిలబడే రచనలు చేస్తున్నాడు. ఈమధ్య అందుకున్న కాశీభట్ల అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నాడు. అనిల్ తో చిన్న సంభాషణ-
ఇన్నేళ్ల ప్రయాణం తరవాత అనిల్ డ్యాని అంటే ఎవరు అంటే ఏం చెప్తారు?!
అది నేను చెప్పడం కంటే నా పాఠకులూ, సహకవులూ చెబితేనే బాగుంటుంది. పదేళ్ల క్రితం ఒంటరిగా మొదలు పెట్టిన ప్రయాణం ఈనాడు ఇక్కడిదాకా వచ్చాను. ఎన్నో ఒడిదుడుకుల ప్రయాణం ఇది. ముందు రెండు లైన్ల కవిత్వం రాస్తే చాలు అనుకున్నాను, ఆ తర్వాత కవి సంగమం లో కవిత్వం నలుగురు చదివితే చాలు అనుకున్నాను. అలా మొదలైన ప్రయాణం ఇవాళ మూడు కవితా సంపుటాల దాకా చేరింది. ఈ ప్రయాణం అందరికీ తెల్సిందే. ఇవాళ అనిల్ డ్యాని అంటే కవి, కథకుడు, సాహిత్య సమీక్షకుడు అనే భావన కలిగించడానికి, ఇన్నేళ్ల ప్రయాణమే ఆలంబన కదా. ఇంకా చాలా దూరం వెళ్ళాలి.
ఎన్నో సందర్భాలు మిమ్మల్ని నడిపించి వుంటాయి. కానీ, ఒక ఒక్క సందర్భం మీ దారిని మార్చిన సందర్భం ఏది?
చాలా ఉన్నాయి కానీ రోహిత్ వేముల మరణం నన్ను నాదారిని మార్చింది. జీవితంలో ఒక మలుపు అంటారు కదా నా సాహిత్య ప్రయాణం ఆ సంఘటన తర్వాత, నా దృక్పధాన్ని, నా చూపుని మరింత స్పష్టం చేసింది. సమాజాన్ని అసలైన కోణంలోనుంచి చూసే అవకాశం చిక్కింది.
అప్పటిదాకా నాతో కలసి నడిచిన మిత్రులు ఉన్నట్టుండి దూరం జరగడం మొదలు పెట్టారు.
అంబేద్కరైట్ ఆలోచనా సరళిని అందిపుచ్చు కోవడానికి అధ్యయనం చేయడానికి మార్గం సుగమం అయింది.బహుశా అప్పటినుంచే నేను రాయాలనుకున్న భావాలన్ని కవిత్వంలో పొదగడానికి అవకాశం దొరికిందని నేను అనుకుంటాను.
మీరు కవిత్వమూ, విమర్శ రెండూ రెండు చేతులా రాశారు? కానీ, అనిల్ చిరునామా ఏది అంటే ఏం చెప్తారు?
అనిల్ ఎప్పటికీ కవే. విమర్శకుడు కాదు కూడా. అయితేగియితే సమీక్షకుడినే . ఎందుకంటే యాకుబ్, శ్రీరామ్ కలిపి చేసిన కుట్రలో నన్ను లోకం విమర్శకుల జాబితాలో చేర్చింది. కానీ వ్యాసాలు రాస్తున్నంత సేపు చెప్పాల్సిందే చెప్పాలనుకుంటున్నాను. విమర్శకు చాలా తెలిసి ఉండాలి. అనేక పరికరాలు అవసరం. నేను అకాడెమీషియన్ కాను. కేవలం కవిని మాత్రమే. కొన్ని సందర్భాల్లో కథకుణ్ణి కూడా.
మీరు చూస్తూ వుండగానే కొత్త తరం దూసుకు వస్తోంది కదా?! ఈ సన్నివేశం మీకు ఎలా అనిపిస్తోంది?
రావాలి కదా కొత్త తరం రాకపోతే ఎలా..? కాగల కార్యాన్ని పూర్తి చేయవలసింది కొత్త తరమే. నిన్ననే చూసాం కదా, ప్రభుత్వం మెడలు వొంచింది కొత్త తరమే, అలాంటి తరం వస్తేనే కవిత్వానికి మేలు జరిగేది. చాలా మంది కుర్రవాళ్లు మేలైన కవిత్వం రాస్తున్నారు. వీలైనంత వరకు వాళ్ల పుస్తకాలు చదివి తిరిగి వాళ్ళతో మాట్లాడుతాను.
వాళ్ళ లో ఉండే ఆవేశాన్ని మనం అర్థం చేసుకోవాలి..! సాహితీ వేత్తల మీద నాకున్న కంప్లైంట్ ఒకటే కొత్త తరాన్ని చదవడం లేదు అని. ఏ కొద్దిమంది మాత్రమే చదివి వాళ్ళ గురించి ప్రస్తావన చేస్తున్నారు కానీ మిగతావాళ్లు ప్చ్..
ఇన్ని సంక్లిష్ట అవరోదాల మధ్యన కూడా కొత్త తరం ఈ సమాజం పట్ల తమకున్న బాధ్యత తో కవిత్వాన్ని హత్తుకుని వదిలిపెట్టడం లేదు. ఈ విషయాన్ని మిగతా కవులు కూడా గమనించాలనేది నా కోరిక.
రేపటి అనిల్ ఎలా వుండవచ్చు?!
నిన్నటి నేనే ఇవాళ్టి నాకు అర్థం కావడంలేదు. ఇక రేపటి ప్రస్తావన అంటే అది ఎవరం చెప్పలేం.
*








మెత్తటి కత్తి. తెగిందో లేదో కూడా తెలవనంత మెత్తటి కోత.
అభినందనలు అనిల్..
థ్యాంక్యూ అన్నా