రైతుల పండగ

2004 వ సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో అనుకుంటాను.

అప్పటి ప్రసారభారతి సి.ఈ.ఓ.గా ఉన్నటువంటి సీనియర్ ఐయ్యేస్ అధికారి కె.ఎస్.శర్మ గారు మా స్టేషన్ డైరక్టర్ మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారికి ఫోన్ చేసి వ్యవసాయకార్యక్రమాలు చూసే ప్రోగ్రాం ఆఫీసర్ ను ఢిల్లీకి పంపండి, ఫలానారోజు అగ్రికల్చరల్ ప్రోగ్రామ్స్ చూసేవారికి వర్క్ షాపుంది అన్నారు.

హడావుడిగా తమిళ్ నాడు ఎక్స్ప్రెస్ లో బయల్దేరాను(ఎవరిద్వారానో ఎమర్జన్సీ కోటాలో బెర్తు సంపాదించి.)

ఇంతకీ అక్కడ వర్క్ షాపు ఒక్కరోజే జరిగింది. 

దేశం మొత్తంమీద పదిహేనుకేంద్రాలను ఎంపికచేసి , ఆ కేంద్రాలనుంచి వ్యవసాయ కార్యక్రమాలను చూసేవారిని పిలిపించారు.ప్రసారభారతి సి.ఈ.ఓ. కె.ఎస్.శర్మగారితో పాటు, ఆలిండియారేడియో డైరక్టర్ జనరల్, డైరక్టర్ ఆఫ్ పాలసి, ఫార్మ్ అండ్ హోం ప్రోగ్రామ్స్ చూసే డైరక్టర్, ఇలా వీరందరితో సమావేశం ఏర్పాటుచేశారు.

స్థానిక ఆకాశవాణి కేంద్రాల్లో త్వరలో కిసాన్ వాణి కార్యక్రమం మొదలుపెట్టబోతున్నారు.ముందుగా దేశమ్మొత్తమ్మీద పదిహేను కేంద్రాలను ఎంపికచేశారు.కార్యక్రమాలు సాయంత్రంపూట గంటసేపు ఉండాలి.ఎలా ఉంటే బావుంటుందో చెప్పారు.వెంటనే మీరు జిల్లా కలెక్టర్ ను, అభ్యుదయరైతులను స్టూడియో ప్రాంగణంలో సమావేశం ఏర్పాటుచేసి, ఆకార్యక్రమాన్ని లైవ్ గా ప్రసారం చేయండి.ఇదంతా రిపోర్టుగా డి.జి. ఆఫీసుకు పంపించండి.

విస్త్రృతంగా ప్రచారం కల్పించండి.మీ కేంద్రాలలో కిసాన్ వాణి కార్యక్రమానికి లభించిన పాపులారిటీ బట్టీ మిగిలిన కేంద్రాల్లో ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలియచేశారు.దక్షిణభారతదేశం నుంచి తమిళనాడు నుంచి ఒక స్టేషన్ అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కేంద్రాన్ని ఎంపిక చేశారు, ఈ ప్రయోగార్థం.

తిరిగి వచ్చిన తర్వాత నేను, మిత్రుడు అనిల్ ప్రసాద్ కలిసి వందమంది అభ్యదయరైతులకు ఫోన్ చేసి ఆహ్వానించాం.

అలా ఫిబ్రవరి పదిహేనవ తేదీన కిసాన్ వాణి దేశవ్యాప్తంగా పదిహేను కేంద్రాలలో ప్రారంభమయ్యింది.

అప్పటి జిల్లాకలెక్టర్ ఎన్.శివశంకర్ కిసాన్ వాణి ప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారు.ఒక పండగలా జరిగింది.రేడియో స్టేషన్ మమ్మల్ని పిలిచిందని రైతులు పొంగిపోయారు.చక్కటి ఇంటరాక్షన్ జరిగింది. స్థానిక మీడియా చక్కటి కవరేజ్ ఇచ్చింది.ఒకవిధంగా ఇది వరంగల్ కేంద్రంచేపట్టిన రేడియో ప్రచారసభకు గుర్తింపు.

అంతే కాకుండా ఈవిధంగా రేడియో ప్రచార సభలను మీరుకూడా నిర్వహించండని డైరక్టరేట్ అన్నికేంద్రాలకు ఒక సర్క్యులర్ జారీచేసింది.

ఇది జరిగిన తరవాత దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ రేడియో స్టేషన్లు ప్రతిరోజూ రాత్రి ఏడుగంటల పదిహేను నిముషాలకు ప్రసారం చేసే వ్యవసాయ కార్యక్రమాలను “కిసాన్ వాణి” కార్యక్రమంగా నామకరణం చేశారు.అవన్నీ ఇప్పుడు కేంద్ర వ్యవసాయశాఖ గైడ్ లైన్సుకు అనుగుణంగా ప్రసారాలు మొదలెట్టాయి.రైతులకు పనికొచ్చే అనేక అంశాలను జోడించారు.ఒక ఏకరూపతను కార్యక్రమంలో సాధించారు.

అంతేకాకుండా ప్రతిసంవత్సరం ఫిబ్రవరి పదిహేనవతేదీని కిసాన్ దివస్ గా జరిపే సంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టింది. అదిప్పటికీ కొనసాగుతోంది.

కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో అవార్డులు ప్రకటిస్తుంది.2004వ సంవత్సరానికో ప్రత్యేకత ఉన్నది.ఆ సంవత్సరం డిసెంబర్ లో కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించిన పురస్కారాలలో తెలుగు భాషలో ఆ సంవత్సర పురస్కారం అంపశయ్య నవీన్ గారి కాలరేఖలు

నవలకు లభించింది.ఐప్పుడు కొద్దిరోజులు డా.పుట్టపర్తి నాగపద్మిని గారు స్టేషన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు.నన్ను, మిత్రుడు సీనియర్ కొలీగ్ జయపాల్ రెడ్డిని పిలిచి అంపశయ్య నవీన్ గారికి సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా వరంగల్లు నగరంలోని రచయితలను పిలిచి నవీన్ గారితో ఇష్టాగోష్ఠి చేద్దామన్నారు.

అదొక మరపురాని జ్ఞాపకం.ఎంతోమంది ప్రముఖులు వచ్చారు.ఇంతకుముందే చెప్పాను, వరంగల్ రచయితలకు కళాకారులకు పుట్టినిల్లులా ఉంటుందని.

అదో మంచి కార్యక్రమం.ఆనాడు ఆ ఇష్టాగోష్ఠిలో శ్రీయుతులు ఆచార్య పేర్వారం జగన్నాధం, ఆచార్య మాదిరాజు రంగారావు, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య కాత్యాయనీ విద్మహే, రామా చంద్రమౌళి, నమిలికొండ బాలకిషన్ రావు, డా.ఎల్.ఎస్.ఆర్.ప్రసాద్, నాగిళ్ళ రామశాస్త్రి, వి.ఆర్.విద్యార్థి, డా.టి.శ్రీరంగస్వామి తదితరులు పాల్గొన్నారు.అంపశయ్య నవీన్ రాసిన కాలరేఖలు నవలను రేడియో నాటకంగా మార్చి ధారావాహికగా ప్రసారం చేసింది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.ఆ  ధారావాహికను అన్ని కేంద్రాలు ప్రసారం చేశాయి.

వరంగల్ లోని సాహిత్యసంస్థల్లో సహృదయ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది.ఆ సంస్థకు జి.గిరిజామనోహరబాబు కార్యదర్శిగా ఉండేవారు.డా.కె.ఎల్.వి.ప్రసాద్ అధ్యక్షులు.సభ్యులందరూ సుశిక్షితులైన సైనికుల్లా ఉండేవారు.ఆ సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుండది.కథ, నవల, కవిత్వం ప్రక్రియల్లో ప్రతి సంవత్సరం అవార్డులిస్తుండేది.ఇది కాకుండా నాటకాల పోటీలు నిర్వహిస్తుండేది.ఈ కార్యక్రమాలకు వచ్చిన అతిథులను, అవార్డుగ్రహీతలను స్టూడియోకు తీసుకొచ్చి రికార్డు చేస్తుండేవాళ్ళం.ఇలా రికార్డుచేయాలంటే నిర్ణీత సమయాల్లోనే అంటే ఆఫీసు వర్కింగ్ అవర్సు మాత్రమే అని పెట్టుకుంటే వీలు కాదు.అది వేరే విషయం అనుకోండి. 

వాళ్ళందరినీ రికార్డు చేసినప్పుడో సంతృప్తి ఉండేది.

వరంగల్ జిల్లా వర్దన్నపేట అనే మండల కేంద్రంలో భారతీయ నాటక పరిషత్తు అనే నాటక సమాజముండేది.ఎంతో గొప్ప చరిత్ర కలిగిన సంస్థ.శివరాత్రి సమయంలో వాళ్ళు నాటికల పోటీలు నిర్వహించేవారు.ఒక పండగలా చేసేవారు.దాని కొనసాగింపుగా వరంగల్ లో సహృదయ సంస్థ నిర్వహించేది.వీరందరితోను ఆకాశవాణి వరంగల్ కేంద్రానికి సత్సంబంధాలుండేవి.

సద్గురు శివానందమూర్తిగారు భీమిలీలో ఆశ్రమం నెలకొల్పినా వారి ఆశ్రమశాఖ వరంగల్ లో కూడా ఉండేది.వారికి వరంగల్ లో అపరిమిత సంఖ్యలో అనుయాయులుండేవారు.వారినొకసారి స్టూడియోకి ఆహ్వనించి భారతీయ తత్వచింతన అంశంపై నగర ప్రముఖులతో ఇష్టాగోష్ఠి నిర్వహించాము.పూర్తి ఆధ్యాత్మికతను సంతరించుకున్న కార్యక్రమం అది.

ఆరోజుల్లో బి.ఎస్.ఎన్.ఎల్.వరంగల్ విభాగం జనరల్ మేనేజర్ ఛాబ్రా అనే పంజాబీ ఆయనకు రేడియో అంటే చాలా ఇష్టం.

ఆయన వినియోగదారుల సమస్యలపై లైవ్ ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొనటానికి  తరచూ స్టేషన్ కి వస్తుండేవారు.వారికో ప్రపోజల్ ఇచ్చాం.రేడియో క్విజ్ ఫోన్ ద్వారా నిర్వహిస్తాం.మీరు స్పాన్సర్ చేయాలని కోరాం.ఆయన చాలా సంతోషంగా అంగీకరించారు.

అలా ఒక క్విజ్ మాస్టర్ సహకారంతో ప్రతి ఆదివారం చాలా వారాలపాటు ఉదయం ఏడుగంటల పదిహేను నిముషాలనుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహించేవాళ్ళం.మా మిత్రుడు కె.శ్రీహరి

అప్పుడు వరంగల్ స్టేషన్ లో లైబ్రేరియన్ గా ఉండేవాడు.తను వచ్చేవాడు.నేనెలాగు ఉండేవాడిని.రేడియో స్టేషన్ క్వార్టర్స్ లో ఉండటం అందుకు లాభించింది.ప్రతివారం ఫోనులో సమాధానం చెప్పిన టాప్ ఫైవ్ పిలల్లతో ఒక లిస్టు తయారుచేశాము.

సరిగ్గా డిసెంబర్ చివరివారంలో స్టేషన్ డైరక్టర్ మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారికి విజయవాడ రేడియో స్టేషన్ కు ట్రాన్సఫర్ అయింది. కొత్తగా ఆయన స్థానంలో చేరబోయే పి.రాజారావు గారు విశాఖపట్నం నుంచి వస్తున్నారు.

ఇన్నిరోజులూ ఒకతరహా పనితీరుకు అలవాటు పడిన మేము కొత్త డైరక్టరు ఎలా ఉంటారో అని ఆలోచిస్తున్నాం.ఆయన జనవరి ఒకటోతేదో 2005నాడు బాధ్యతలు స్వీకరించారు.

*

"రేడియో" రాంబాబు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ రేడియో జ్ఞాపకాలు వింటుంటే ఆ కాలంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు వింటున్నట్టుగా ఉంటుంది రాంబాబు గారు. ఇప్పుడు ఏది కోరిన క్షణాల్లో ముందు ఉండటంతో ఎదురుచూపులు అనేది లేక ఏ పాట అయినా, కథ అయినా శ్రద్ధగా విని, చూసి అర్థం చేసుకునే పరిస్థితులకు దూరమవుతున్నట్టు ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.