ఇంటికో వెలిసిపోయిన జెండా

అప్పుడు త్యాగవీరుల చరిత్ర గుర్తు చేసుకునేవాళ్ళం . ఇప్పుడు దేవాలయ హుండీల్లో వున్న ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న జాతిని చూడాలి. అప్పుడు ఉద్యమానికి సాహిత్యం తోడయ్యేది. ఇప్పుడు వున్నది లేనట్టు లేనిది వున్నట్టు ఏమార్చిన చరిత్రలు చదువుకోవాలి ? అప్పుడు దేశమాత వేషం వేసినందుకే పొంగిపోయేవాళ్ళం . ఇప్పుడు దేశమాత ముఖాన్ని ఎవరి పోలికలోకి మార్ఫింగ్ చేశారా అని దడుసుకోవాలి. 

జెండా వందనం ఇంటికో జెండా ఎగరేయాలట.

బావుంది.

ఇవాళ జెండా ఎగిరిన ఇల్లు రేపు కూలుస్తావో , ఎల్లు౦డి కూలుస్తావో తెలీకపోయినా నువు చెప్పావు కనక తప్పకుండా ఎగరేస్తా౦.

రోడ్డు మీదే పుట్టి, పెరిగి మరణించే పౌరులక్కూడా ఎక్కడ ఎగరేయాలి అనే స్పష్టత ఇచ్చి తీరాలి . అవునూ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కదా జెండాలు ఎగరేసేది. ఇల్లు వాకిలీ, స్వేచ్చా, సమానత్వం, అన్నీ పోయినప్పుడు కూడా ఎగరేస్తారా ? ఇది ఆకాంక్షా లేక నిబంధనా ?

పొద్దున్న మా అపార్ట్మెంట్ అసోసియేషన్ గ్రూప్ నుంచి మెసేజ్ కూడా వచ్చింది. పవిత్ర పంద్రాగస్ట్ రోజు పొద్దున్నే ఎనిమిది వాటాల జనాభా యావత్తూ అభ్యంగన స్నానం ఆచరించి, తమ తమ విభవముల కొలదీ పప్పు బెల్లాలతో గుండెకి జెండా గుచ్చుకుని టెర్రస్ మీదికి రావాలట. ఒకవేళ నీటి సరఫరా నిలుపుదల జాబితాలో ఆరోజు మా గల్లీ వుంటే అప్పుడేం చేయాలి ? ఏం చేస్తాం ?

మనోస్నానం చేసి జండా ఎగరేస్తా౦. మానగలమా ఏమిటి ?

లేదా చినజియ్యరు చెప్పినటు విబూది స్నానం చేస్తాం . అసలు నీళ్ళ స్నానం కంటే అదే శ్రేష్టమైనదట . ఏది ఏమయినా గానీ ఆరోజు వరలక్ష్మీ వ్రతం కానందుకు ఆడవాళ్ళంతా సంతోషించారు. లేకపోతే దైవభక్తికీ దేశభక్తికీ చచ్చేంత పోటీ వచ్చేది. బీపీ లు, సుగర్ లు చెక్ చేసుకున్నట్టు మనకసలు దేశభక్తి అనేది వుందో లేదో అప్పుడప్పుడు చూసుకోవాలి , చూసుకుంటే చాలదు అందరికీ చూపించాలి. చూపిస్తే చాలదు నమ్మించాలి.

దేశభక్తి ని దేనితో తూచాలి ? దానికి కూడా ఏలినవారు కొన్ని లెక్కలు ఇచ్చారు.

ఎన్నాళ్ళు పోయినా దేశభక్తి దైవభక్తి మాత్రమేనా ఇప్పుడు రాజభక్తి ఒక ట్రెండ్ . పట్టభద్రుడి నుంచి, పొట్ట పొడిస్తే అక్షర౦ ముక్క రానివాడి దాకా బూతులు రాయడం నేర్చుకోవాలి . భావంలో వున్నదే బూతు కాబట్టి భాషకి కొత్తగా వ్యాకరణ సంస్కారం అవసరం లేదు.

అది కూడా చాత కాని వారికోసం speech to text యాప్ ఎలాగో వుంది. దానికి ఇప్పుడు సంస్థా పరమైన వృత్తి నిపుణత కూడా వచ్చేసింది. లోగడ ఇదే రాజుగారు నిరుద్యోగ సమస్యకి పానీ పూరీ బండి పెట్టుకొమ్మన్నారు కానీ ఎక్కువ మందిని ఇదే ఆకర్షించింది. పరమ ఛాందస భావాల్ని అత్యాధునిక సాధనాలతో ముడి పెట్టడం ద్వారా రాజభక్తిని నిరూపించుకోవచ్చు అసలు ఈ పంద్రాగస్టు కి ఎన్నడూ లేనంత ప్రత్యేకత వుంది . అదేమిటో తెలుసా ? అప్పుడు “జనగణ మన అధి నాయక జయహే’ అని ఎలుగెత్తి పాడే వాళ్ళం. ఇప్పుడు జనగణన పేరుతో ఎవరి పేరు ఎగిరిపోతుందో అని భయపడాలి. అప్పుడు జాతికి పిత అంటూ మహాత్మాగాంధీని తల్చుకునేవాళ్ళం . ఇప్పుడు గాంధీని కాల్చిచంపిన గాడ్సే కి నమస్కారం చేయాలి.

అప్పుడు త్యాగవీరుల చరిత్ర గుర్తు చేసుకునేవాళ్ళం . ఇప్పుడు దేవాలయ హుండీల్లో వున్న ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న జాతిని చూడాలి. అప్పుడు ఉద్యమానికి సాహిత్యం తోడయ్యేది. ఇప్పుడు వున్నది లేనట్టు లేనిది వున్నట్టు ఏమార్చిన చరిత్రలు చదువుకోవాలి ? అప్పుడు దేశమాత వేషం వేసినందుకే పొంగిపోయేవాళ్ళం . ఇప్పుడు దేశమాత ముఖాన్ని ఎవరి పోలికలోకి మార్ఫింగ్ చేశారా అని దడుసుకోవాలి.

అప్పుడు అన్ని రాష్ట్రాల ఆహార్యం ధరించి కాలేజీ వేదిక మీద ఫ్యాన్సీ డ్రస్ పెరేడ్ చేసేవాళ్ళం . ఇప్పుడు పొరుగు వాడే కాదు మనవాడే మనకి శత్రువయినందుకు వెక్కి వెక్కి నవ్వుకోవాలి . రాజ్యం తాలూకు అనైక్యత ఇంటింటికీ విస్తరిస్తోంది . ఈ ఇల్లు కొనుక్కుని రెండేళ్లయిందా | అప్పటినుంచీ ఇంటిమీద ఒకే రంగు జెండా నిరవధికంగా ఎగురుతోంది . ఆ జెండా అందరికంటే ముందు ఇల్లు కొనుక్కున్న చిట్టీల వ్యాపారి తన సీనియారిటీ కి గుర్తుగా కట్టుకున్నాడు. (ఇంటికి జెండాలెందుకు  అనేది వేరే చర్చ)

అది సెకండ్ ఫ్లోర్ లో వున్న అతని ఇంటిమీద మీద వుంటే పేచీ లేదు. పై అంతస్తు లో ఎగరేసి అపార్ట్ మెంట్ మొత్తాన్ని పార్టీ ఆఫీస్ అనుకునేలా చేశాడు . అదేమిటని అడిగి నందుకు నాకు వాడితోనే కాదు మా ఇంట్లో వున్న వాడితోనూ వాగ్వివాదం అయింది . “చూసీ చూడనట్టు పోకుండా అన్నీ నెత్తిమీదకి తెస్తా”నని తనకు కోపం . మిగిలిన ఆరు వాటాలకీ కూడా ఈ పెత్తనం ఇష్టం లేదు అయినా ఎవరికి వారు లోపల గొణుక్కొ వడమే కానీ పైకి నోరెత్తరు.

పండగ వస్తే ఇంటిముందు గేటుకి పెద్ద పెద్ద కొమ్మలు తోరణాలుగా కట్టేస్తాడు . దానివల్ల గేదెలు మేకలు వచ్చి పేడ వేసి వెడుతుంటాయి . మొన్న గణేష్ చందాలు దగ్గరు౦డి భారీ గా వసూలు చేయించి, డిజే సౌండ్ పెట్టడమే కాకుండా సెల్లార్ లో ఉమ్మడి ఖాతా నీళ్ళు కరెంట్ ఖర్చుచేసి భోజనాలు పెట్టించాడు.

అసలు ఇక్కడ వేరే మతం వారు దిగకుండా వుండటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ కుదరలేదు. నేను, ఇంకొకరు చొరవచేసి ఒక క్రిస్టియన్ , ఒక ముస్లిం ప్యామిలీలు వచ్చి చేరేలా చేశాం . వాళ్ళ మనోభావాలు పట్టించుకోడు . నేను వాళ్ళతో మాట్లాడతానని కోపం . మొన్నటికి మొన్న హోలీ ఆడటానికి నేను కిందకి లిఫ్ట్ దిగిన వెంటనే , “మీరందుకు వచ్చారు మీరు హిందువులు కాదు కదా” అంటాడు. వాడి దృష్టిలో అదొక ఛలోక్తి . కానీ నా భర్తకి బాగాకోపం వచ్చింది . తన భార్య హిందూవే అని నిరూపించడానికి నా ముఖాన వున్న బొట్టు చూపించి, పుట్టు పూర్వోత్తరాలు చెప్పి అనవసరంగా అలిసిపోయాడు. నేను మాత్రం “ కాదు . అయితే ఏంటి” అని అడిగాను.

ఎప్పుడూ లేనిది మా ఇద్దరిమధ్యా అభిప్రాయ బేధాలు వస్తున్నాయి. ఏదో పని మీద నా గదిలోకి వస్తే నేను ఏమి రాస్తున్నాను అనేది చూడకుండా తను వెళ్ళడం లేదు . నేను కూడా విండో డౌన్ చేసి ఇంకేదో వీడియో చూస్తున్నట్టు నటిస్తున్నాను. ఇదంతా భద్రత కోసం అని తను అనుకోవచ్చు , పోలీసింగ్ లాగా నాకు కనిపిస్తుంది . మనుషుల సహజ స్వభావాలు కూడా తారుమారుచేసే కుట్ర ఎలానో కానీ జరుగుతోంది . ఈమాట నా స్నేహితులు కూడా చెబుతున్నారు. కుటుంబాల్లో కూడా మనం ఒంటరి వాళ్ళమే అవుతున్నామా ? ఆరో క్లాసు తప్పిన మా ఎదురింటి నిరక్షర కుక్షుడి బలం ఏమిటి ? గూండాయిజమే కదా.

పుట్టిన దగ్గరనుంచీ ఇప్పటివరకు ఎన్ని జెండాలకి వందనం చేసి పప్పు బెల్లా లు తినలేదు. ఇప్పుడు వున్న విరక్తి , ద్వైదీ భావం ఎప్పడూ లేదు . ఎర్రకోటలో రేపు ఎగరబోయే జెండా కింద వ౦దనం చేసినవారిలో ఎంతమ౦దికి పొరసత్వం మిగులుతుంది ? ఎంతమందికి మాతృ భూమి చేజారిపోతుంది ? అనేది అంతర్జాతీయ సమస్య అయితే, మా టెర్రస్ మీదున్న పార్టీ జెండా కంటే, జాతీయ జెండా ఎక్కువ పైకి ఎగురుతుందా లేదా? అనేది నా సమస్య.

మ౦గళ హారతులకి , పార్టీ నినాదాలకి పరిమితం అయిన ఆడ, మగ చెవులకి ముహమ్మద్ ఇక్బాల్ రాసిన “ సారే జహాన్ సే అచ్ఛా” అనే గీతం లో “మజ్హబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖ్నా…” ( ఏ మతమూ ఒకరినొకరు ద్వేషించుకోవాలని చెప్పదు. మనమంతా ఒకే దేశానికి చెందినవాళ్లం. కాబట్టి మతం, కులం, భేదాలను దాటి సోదరభావంతో కలిసి జీవించాలి.) అనే చివరి పంక్తులు ఎప్పటికయినా అర్ధం అవుతాయా ? స్వాతంత్ర్య పోరాట కాలంలో వున్న అధికార పార్టీ ఏమిటనేది ప్రశ్న కాదు . ఆ వారసులు ఇప్పుడు వరుణ యాగం చేయడమే పతాక . కప్పల పెళ్ళిళ్ళ కంటే ఇదే నాకు వింతగా వుంది.

దేశమ౦టే మట్టి కాదు మనసుషులన్నాడు గురజాడ . కాదు మతం అని చెప్పడానికి యావత్ దేశం సిద్ధంగా వుంది.

విచక్షణ లేని మనుషుల చేతిలో జెండా వెలిసిపోయింది. కర్రలు మిగిలాయి.

*

కొండేపూడి నిర్మల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గుడ్డి కంటె మెల్ల నయం. దేశాన్ని అమ్మేస్తాననే వాడు ఒకడు. వీలైతే అమ్మెయ్యడానికి చూసేవాడింకొకడు. అంతకంటే ఈ గూండాయే నయమని నాకు అనిపించింది. అయినా సాహిత్యం లోకి రాజకీయం రావడం నాకు మాత్రం నచ్చలేదు. సారంగ ను నేను కొద్ది కాలం గానే ఎరుగుదును గానీ నాకు మొదటి చూపులో సాహిత్య పత్రిక అనిపించిన భావాన్ని అది నెమ్మది నెమ్మదిగా చెరిపేసుకుంటున్నది. సాహిత్యం ద్వారానే చాలా ఉద్యమాలు వచ్చి సమాజంలో చాలా మార్పులు వచ్చి ఉండవచ్చు. కానీ అవన్నీ ఎందుకు వచ్చాయో ఎలా వచ్చాయో వాటి నిజాయితీ ఎంతని, ప్రస్తుతం వస్తున్న ఉద్యమాలలో నిజాయితీ ఎంతని అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న మాయా ప్రపంచంలో సాహిత్యం అటుప్రక్కకి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.