కులానికీ మనిషికీ మధ్య.. ఒక ప్రశ్న

గత సంచికలో ప్రారంభమైన “కొత్త కథలూ- కథనాలూ” శీర్షికలో ఈ పక్షం అనూష గుర్రాల రాసిన కథా విశ్లేషణ చదవండి.

కులం మనిషిని కొలిచే ప్రమాణమా? లేక మనిషితనాన్ని చంపే ఆయుధమా?
కులం పేరుతో మనిషిని అవమానించే సమాజం నాగరికమని ఎలా చెప్పగలం? జన్మ ఆధారంగా మనిషి విలువను నిర్ణయించే వ్యవస్థను సంస్కృతి అని ఎలా పిలవగలం? దేవుడి ముందు అందరూ సమానమని చెప్పే సమాజమే, దేవుడి గడప దాటే ముందు మనిషిని కులం అడగడం ఎంతటి విషాదం! ఇలాంటి ప్రశ్నలను అడుగుతూ, కులవ్యవస్థలో దాగి ఉన్న అనాగరికతను నిర్మొహమాటంగా బయటపెట్టే కథ “నట్రాజు పెన్సిల్.”
కథ ఇక్కడ చదవండి!
ఈ కథలో మురారిగాడు ఒక బాలుడు మాత్రమే కాదు. అతడు ప్రశ్నించని ప్రశ్న. కలుషితం కాని మనసు. సమానత్వాన్ని సహజంగా నమ్మిన బాల్యం. చదువు అంటే ఇష్టం, స్నేహం అంటే ప్రాణం, నటరాజు పెన్సిల్ అంటే మమకారం. తన పెన్సిల్‌ను తిరిగి తెచ్చుకోవాలనే అమాయక కోరికతో బయలుదేరిన మురారి, తెలియకుండానే ఈ సమాజంలో శతాబ్దాలుగా నిలిచిన కులగోడల ముందు నిలబడతాడు. ఆ గోడలను అతడు చూడలేడు. ఎందుకంటే అతని చూపులో మనిషి మాత్రమే ఉంటాడు, కులం కాదు.
రాంబాబు ,మురారి స్నేహితులు. కానీ సర్పంచికి అతడు “ఆవులు కాసే వాడి కొడుకు.” ఈ ఒక్క మాటలోనే సమాజంలోని కుల అహంకారం మొత్తం దాగి ఉంది. ఇద్దరు పిల్లల మధ్య ఎలాంటి భేదం లేకపోయినా, పెద్దల ప్రపంచం వారి మధ్య కనిపించని గీతలను గీస్తుంది. కులాన్ని వారసత్వంగా కాకుండా, విషంగా తదుపరి తరాలకు అందించే సమాజాన్ని రచయిత ఎంతో పదునుగా ప్రశ్నిస్తారు.
కథలో నాగదోషం అనే అంశం కేవలం ఆచారం కాదు, మూఢనమ్మకాల పై ఒక విమర్శ. నాగదోషం పోవాలని పూజలు చేసే సర్పంచి, తన ముందున్న మనిషిని మాత్రం తకడనికి వెనుకాడతాడు. తెలియకుండానే పామును తొక్కి చంపిన మురారి అతని నమ్మకాన్ని నిజం చేసినా, అతని మానవత్వాన్ని మాత్రం గెలవలేడు. అతని మనసులోని కులదోషాన్ని మాత్రం తొలగించలేడు.
కాళీయమర్దనం హరికథ వినిపించే ముగింపు ఈ కథకు అపూర్వమైన ప్రతీకాత్మకతను అందిస్తుంది, పాముపై నృత్యం చేసిన కృష్ణుడిని భక్తితో ఆరాధించే మనిషి, తన ఇంటికి వచ్చిన అమాయక బాలుడిని మాత్రం లోపలికి రానివ్వడు. దేవుడిని వెతుకుతున్నవాడు, దేవుడిలాంటి మనిషిని నిరాకరిస్తాడు. ఇదే ఈ కథలోని సామాజిక వ్యంగ్యం.
“నట్రాజు పెన్సిల్” ఒక బాలుడి కథ కాదు. కులం పేరుతో మనిషిని చిన్నచూపు చూసే సమాజంపై దాఖలైన అభియోగపత్రం. పిల్లలకు తెలియని కులాన్ని పెద్దలు నేర్పిస్తారు. కానీ మానవత్వాన్ని నేర్పేది ఇలాంటి కథలే. సమానత్వం కోసం పోరాటం ఇంకా పూర్తికాలేదని, అసలు నాగదోషం పాములో కాదని, మనిషి మనసులోని కుల అహంకారంలోనే ఉందని ఈ కథ గుర్తు చేస్తుంది.
అందుకే ఈ కథను చదవడం ఒక సాహిత్యానుభూతి మాత్రమే కాదు, మనల్ని మనం ప్రశ్నించుకునే సామాజిక బాధ్యత.
కథ : నట్రాజు పెన్సిల్
పుస్తకం : బాహుదా బతుకు కథలు
రచయిత బూదూరి సుదర్శన్
ప్రచురణకర్తలు: అన్వీక్షికి పబ్లిషర్స్ 

అనూష గుర్రాల

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మురారి కులంగోడల ముందు నిలబడ్డాడు అనడం బావుంది. చక్కగా జాయిగా చెప్పిన కథలో చివుక్కుమనే కులవివక్ష. కథ నడిపిన విధానం బావుంది. కృష్ణుని కాళీయ మర్దన ప్రతీకాత్మకంగా వుందనే అనూష గమనింపు, ఒక మంచి యువ విమర్శకురాలుని వాగ్దానం చేస్తుంది. అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.