రమాదేవి కవితలు రెండు

1

ఓ… కొంగుముడి

పనేమీ లేనట్టు
సమయమే గడవనట్టు
నింపాదిగా కాళ్ళు ముడుచుక్కూర్చుంటానా

నా కోసమే కాచుకూర్చున్నట్టు
యాతన, వేదన ఒకింత నిశ్శబ్దం
ఒక్కసారిగా నన్ను చుట్టుముడతాయి

వాటిని

కళ్ళతోనే అదిలించి దూరంగా నెట్టేసి
కలవరపాటున కళ్ళెత్తి చూసానా …

దూరంగా మూలమలుపున
ఒక మంచుతెర

మసక మసకగా కనిపించింది

ఓహ్
అంతులేని నమ్మకమొకటి చేత చిక్కాక
గాలిలో ముద్దు విసిరినట్టుగానే
అమాంతం అరచేత అందుకుని
సుతారంగ కొంగున ముడివేసా…

ఇక అంతా తానై
నా నడకలో
కొంగుముడి ఊయలూగుతున్నది…

ఓయ్…

ఇపుడు …

నీపై మరింత ఇష్టం
తెలియని కొత్తరంగు అద్దుకుందోయ్

2

తడి కళ్ళు

అతగాడు
కొండంత సమయాన్ని
పోగేసుకు వస్తున్నానంటూ
ఊరించి ఊరించి చెప్పాడు…

వచ్చీ రాగానే
అందరూ  స్నేహితులేనంటూ
సమయాన్నంతా చిటికెలో ఖర్చుచేసి

అబ్బో
ఉట్టి చేతుల వస్తే ఊరుకోనని
రహస్యంగా దాచిన పిడికెడు క్షణాలు
నాకోసం ఎత్తుకొచ్చాడు …

ఈ కాసిన్ని క్షణాల్లో
పేచీనే పడనా
ఇష్టాన్నే చెప్పనా
తన తడి కళ్ళు దాచిన కథలే చదవనా…

అన్నీ సరిచేసేలోపే
వచ్చి వెళ్ళిన
ఆనవాళ్ళైనా లేకుండా ఆసాంతం చెరిపేసి
కొండంత నిశ్శబ్దాన్ని కుప్పగా పోసి వెళ్ళాడు

ఓయ్
నిన్ను తప్పు పట్టాలని లేదు
నవ్వులేని నీ ముఖం
మరీ మరీ బాధ పెడుతుందిరా

రారాదూ …
నువ్వు నొచ్చుకున్న క్షణమేదో
కాస్తంత పంచి వెళ్ళరాదూ !

*

 

ఆర్. రమాదేవి

పుట్టి పెరిగింది/ప్రస్తుతం ఉండేది: హైదరాబాద్. "వెన్నెల దుప్పటి కప్పుకుందాం" అనే కవిత్వ పుస్తకం (2023) లో వెలువడింది.

నా దృష్టిలో కథ / కవిత్వం అంటే మనసు తపన, వేదన, ఆనందం ఏదైనా కానీ ఆ సమయాన మనసు చెప్పే మాటలు. ఆ మాటలు అప్పటి సమయాన్ని బంధింస్తుంది అనుకుంటాను. అందుకే కొన్నిసార్లు రాసినవారు అందుకున్న వారు ఒకే భావ సంచలనానికి లోనవుతారని నా నమ్మిక. ఎదురైన చిన్న సంఘటనలు కథలుగా రాయడం కూడా ఇష్టం.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Lovely.. 2 nd one చాలా నచ్చింది. అభినందనలు రమ గారూ!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు