గత దశాబ్ధ కాలం నుండి రాయలసీమ ప్రాంతం నుండి అన్నీ సాహిత్యప్రక్రియల్లో విస్తృతంగా రచనలు వస్తున్నాయి. వొకదశలో తెలుగు రాష్ట్రాలు రాయలసీమ వైపు చూసే పరిస్థితి నెలకొంది. రాయలసీమ నుండి విమర్శ అనే సరికి కట్టమంచి రామలింగారెడ్డి, వల్లంపాటి వెంకటసుబ్బయ్యలే ప్రధానంగా సాహిత్యలోకానికి గుర్తుకువస్తారు.
కట్టమంచి రామలింగారెడ్డి తన రచన కవిత్వతత్త్వ విచారము పేరుతో వచ్చిన విమర్శ గ్రంధంలో సాంప్రదాయ విమర్శకు భిన్నంగా సాహిత్యాన్ని చూశారు.శాస్త్రీయ దృక్ఫథంతో చూడటం వల్ల సాహిత్యంలో శాస్త్రీయ విమర్శకు పునాదులేర్పడ్డాయి. తదనంతర కాలంలో వల్లంపాటి వెంకటసుబ్బయ్య విమర్శను ఉన్నత స్థానంలో నిలబెట్టారు. రాచపాళెం చెప్పినట్లు వల్లంపాటి వెంకటసుబ్బయ్య త్రిపురనేనిలా వ్యక్తిని గాయపరచకుండా సాహిత్య విమర్శను అన్ని కోణాల నుంచి సమగ్రంగా చూశారని అంటారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య వెయ్యిపుటల సాహిత్య విమర్శ చేశారు. అందులో నాల్గువందల పేజీలు మాత్రమే పుస్తకాలుగా లభిస్తుండగా మిగతావి వ్రాత ప్రతులుగానే మిగిలిపోయాయంటారు. వల్లంపాటి అనుశీలన, వల్లంపాటి సాహిత్య వ్యాసాలు, నవలా శిల్పం, కథా శిల్పంతో వచ్చినవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
వల్లంపాటి సమకాలీకులైన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి విమర్శను ఉన్నతశిఖరాలకు తీసుకువెళ్ళడంలో సఫలమయ్యారు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానమని చెప్పడానికి సాహసించలేకపోతున్నా కానీ, మొదటి వరసలో ఉన్న విమర్శకులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాహిత్యాన్ని మార్క్సిస్ట్ దృష్టికోణంలోంచి పరిశీలించిన రాచపాళెం మార్క్సిజం పరిచయం లేకుండా, దృక్ఫథం లేకుండా ఏ రచన చేసినా, అది సమాజాభ్యుదయాన్ని కాంక్షించదనే సత్యాన్ని వర్తమాన సాహిత్య సమాజానికి చెబుతున్నారు.
పాఠకునిలో సామాజిక చైతన్యం కలిగించే రచన మాత్రమే అభ్యుదయ సాహిత్యమని బలంగా నమ్మడమే కాకుండా సాహిత్య విమర్శను చిటికెన వేలు పట్టి అభ్యుదయ మార్గాన నడిపిస్తున్నారు. ప్రాచీనాంధ్ర కవుల కావ్యాలను పరిశీలించడం దగ్గర్నుంచి ఆధునిక కవుల వరకు కుండబద్దలు కొట్టినట్లు విమర్శ చేస్తుండటం గమనార్హం. ఆయన రాసిన దరి దాపు, చర్చ, కొన్ని నవలలు కొన్ని కథానికలు, ఆధునికాంధ్ర కవిత్వం ఉద్యమాలు సందర్భాలు, సాహిత్య విమర్శ, తులనాత్మక సాహిత్య వ్యాసాలు ఆధునిక విమర్శకు సరికొత్త దారులు పరిచాయి. తెలుగు సాహిత్య విమర్శలో ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.
ఇక కథనే ప్రధానంగా ఎంచుకుని కథచుట్టూనే అనేక సైద్దాంతిక విషయాలు చర్చిస్తూనే కథలో వస్తు, శిల్ప, నిర్మాణ పద్దతుల్ని వివరిస్తూ కథావిమర్శలో విశేష కృషి చేస్తున్న విమర్శకురాలు ఆచార్య కిన్నెర శ్రీదేవి. కథాశిల్పం అంచనా వేయడం, శిల్పలోపాన్ని చూపడం ఈమె ప్రత్యేకత. ఆమె రాసిన స్నేహిత స్త్రీవాద విమర్శ వ్యాసాలు, కథా సంహిత, సీమ కథ`అస్తిత్వం, ఓల్గా కథలు ఆమె చేసిన సైద్దాంతిక విమర్శ సూత్రాలకు నిదర్శనాలు.
ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతంలో వొచ్చిన రచనల్నే తూచి విమర్శ చేసిన కవి జి.వెంకటకృష్ణ. రవ్వలసడి పేరుతో రాయలసీమ ఆధునిక కవిత్వ పరిచయం పేరుతో లోతైన విమర్శ చేశారు. ఇందులో 45 వ్యాసాలు ఉన్నాయి. 1956 నుండి 1990 వరకు కవులను మూల్యాంకనం చేస్తూనే నేటి కవుల వరకు వారి సాహిత్య దృష్టి కోణాన్ని సమగ్రంగా చెప్పారు. రాయలసీమ నుండి వస్తున్న ప్రతి కవి భావజాలాన్ని ఈ కవి రవ్వలసడిలో విమర్శ చేశారు. అయితే ఈ పుస్తకం రాయలసీమ వరకే పరిమితమైనా కవి వెంకటకృష్ణ తెలుగు సాహిత్యంలో వస్తున్న ప్రగతిశీల రచనలను, రచయితలను పరిశీలించి విమర్శ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు.
ఈ కోవలోనే వర్తమాన విమర్శలో ప్రయాణం చేస్తున్న విమర్శకులు ఇటీవల అనేక విమర్శ గ్రంథాలు రాయలసీమ ప్రాంతం నుండి తీసుకొస్తున్నారు. ఇందులో కర్నూలు నుండి కెంగార మోహన్, జంధ్యాల రఘుబాబు, అనంతపురం నుండి తూంచర్ల రాజారాం, కడప జిల్లా నుంచి పిల్లా కుమార స్వామి తదితరులున్నారు. ఒకటి రెండు విమర్శ పుస్తకాలతో పరిమితమైన వాళ్లూ ఉన్నారు.
*








Add comment