సహానుభూతి తలపోత

ఈ శతాబ్దపు రచనలు గత శతాబ్దంలో వచ్చిన ఆధునికానంతర ఆలోచనలకు కొనసాగింపుగానే అయినా భిన్నంగా ఉండడం ఒక లక్షణంగానూ, ఇది ఒక్క కవిత్వమూ, సాహిత్యమూ మాత్రమే కాక అనేక సామాజిక రంగాలలో మనిషిని ప్రభావితం చేసిన తీరును ఆశ్చర్యంగా గమనిస్తూ ఉన్నాను.

వానీ ప్రసాద్ మిశ్ర్ అనే ఒక హిందీ కవి రాసిన కవితకు ఆర్.ఎస్. వెంకటేశ్వరన్ గారి అనువాదాన్ని నిన్న 26.02.2026 న వెంకటేశ్వరన్ గారి ఎఫ్‌బి వాల్‌పై చదివాను. ఆ కవిత చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కవితలోని వ్యంగ్యం , కవిని ప్రోత్సహించే విధం, కవిత్వాన్ని తూచే విధం చూడండి.

“కలం నీ చేతిలో ఉంది.

నీకు ఏది అనిపిస్తే అది రాసేయ్.

ఏమీ తోచకపోతే నీ పేరే ఒకసారి రాసేయ్.” అంటారు.

 

నాకు వెంటనే ఒక శ్రీశ్రీ కవిత గుర్తొచ్చింది.

“కుక్కపిల్లా, అగ్గిపుల్లా,  సబ్బుబిళ్ళా

హీనంగా చూడకు దేన్నీ…

కవితామయమేనోయ్ అన్నీ.” అని.

కవులందరూ దాదాపు ఏకీభవించే ఒక విషయం, కవితాత్మకంగా చెప్పడానికి ఏ విషయమైనా సరిపోతుంది. నాకు ఈ కవితలో భవానీ ప్రసాద్ మిశ్ర్ గారు కూడా అలాగే చెప్పారేమో అనిపించింది. ఆయన ఇంకా ఇలా అంటారు:

“ఏది రాస్తే అది ప్రచురితం అవ్వాలని లేదు.”

అంటే కవులు చాలా రాస్తూ ఉంటారు. రాసేవన్నీ ప్రచురణ కావాలని లేదు. కానీ చాలా మంది కవులకు తాము రాసింది ప్రచురితం కాకపోతే కోపం వస్తుంది. ఇతర కవితలతో తమ కవితను పోల్చుకునే ఒక ఉద్వేగం, ఉక్రోషం వస్తుంది. రాసిన కవిత అంతా ప్రచురితం అవ్వాలని ఏమీ లేదు. భవానీ ప్రసాద్ మాట విరుపుగా ఇంకో మాట అంటారు:

“ప్రచురణకు నోచుకోకపోతేనేం,

పొయ్యిలోకైనా పనికొస్తుంది.

బాగుందనుకో జ్వాలగా లేస్తుంది,

లేకపోతే బుస్సుమని ఊరుకుంటుంది.”

ఈ వాక్యాలు కూడా మనకు శ్రీశ్రీ ఉటంకింపులో ఎక్కడో విన్నట్టే అనిపిస్తుంది కదా! నిజానికి రాయడం ఎంత ముఖ్యమో భవానీ ప్రసాద్ తర్వాత చరణాల్లో ఇలా చెప్తారు:

“రాయడం అనే ప్రక్రియ పవిత్రమైనది.

ఎండిపోయిన మనసుకు వసంతం తెస్తుంది.

వెలుగు కలంల సంయోగం జరుగుతుంది.

మనసుకి భావంతో సంయోగం జరుగుతుంది.

కలం నీ చేతిలో ఉంది చైతన్య పరిచేలా రాయి.”

రాయడం అనేది ఎండిపోయిన మనసుకు వసంతం తెస్తుంది. వెలుగు, కలం ఈ రెండిటి సంయోగం జరుగుతుంది అంటాడు. అంటే “తమసోమా జ్యోతిర్గమయ” అని ప్రార్థించినట్లు  వెలుగు, కలం ఈ రెండూ కలిస్తే వెలుగు యింకా ఎక్కువ ప్రభావితం చేస్తుంది అనే అర్థం తోటి ఆయన రాసిన వాక్యాలా అనిపించింది..

“కలం నీ చేతిలో ఉంది, చైతన్య పరిచేలా రాయి.

కాగితాలు ఎన్ని వ్యర్థమైనా

పశ్చాత్తాప పడేలా కలం ఉపయోగించకు.” అంటారు చివర్లో .

కాగితాలు ఎన్ని వృధా అయినా సరే, ఎవ్వరూ, ఏదీ పశ్చాత్తాప పడకూడదు. అంటే “అయ్యో నేను ఒక పనికిమాలిన పని కోసం ఉపయోగపడ్డానే” అని   కాగితమూ నేను రాసింది వ్యర్థమే అని కవీ, నేను చదివింది అర్థం లేనిది అని చదువరీ అనుకోకూడదు అని కవి చెప్పడం చాలా బాగుంది.

చెట్లు కాగితాలనిస్తాయి, ఆ కాగితాలు కవితలనిస్తాయి, సాహిత్యం రూపంలో చరిత్రలనిస్తాయి. వీటిని మనం ఎలా రాయాలి అనేది నిర్ణయించుకోవడం కవికి ఒక సవాలు. ఈ సవాలు కవులు స్వీకరించేటప్పుడు కవులకు ఎదురయ్యే కొన్ని ప్రశ్నలు ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కవితా వస్తువులూ, కవితా రూపాలూ, కవితకు సంబంధించిన పనిముట్లూ. ఈ మూడిటినీ నైపుణ్యంతో వాడగలిగిన కవి ఎవరైనా మంచి కవిత్వం రాయగలుగుతారు అని నేను అనుకుంటాను.

పై కవితలో కవి వ్యంగ్యమూ ఆకాంక్షా ఒకేసారి చదువరులను ఆకట్టుకుంటాయి.

అపర్ణ నారాయణ గుంటి అనే ఇంకొక కవి తన ఫేస్‌బుక్ గోడపై 15.02. 2026 న ప్రచురించిన ఇంకో కవితను చూద్దాం:

“చెట్ల చాటున నిదురోతుంది ఆకాశం.

రహదారి మీద

నిశ్శబ్దం నూలు పోగులా విరబూసి

ఎదురుగా వచ్చే ప్రతి వాహనం

ఒక కలలా కరిగిపోతుంది.

చెట్ల కొమ్మలు

మంచు తడిలో తడిసి

ఏదో కథ చెబుతున్నట్టు.

 

వెలుగు ఇంకా పూర్తి రాలేదు.

చీకటి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు.

అది మధ్యలో నిలిచిన ఆ క్షణం

ఈ దారి చూస్తే

జీవితం గుర్తొస్తుంది.

ముందు ఎంత దూరం ఉందో కనిపించదు

కానీ అడుగు ఆగదు.

మంచు ఎంత ముసుగేసినా

దారి తన పని చేస్తూనే ఉంటుంది,

ముందుకు తీసుకెళ్తుంది.” అంటారు అపర్ణ.

ఆకాశం హద్దుగా ఎదగాలనుకున్న మనిషికి చెట్లు అడ్డొస్తాయి. చెట్ల చాటున ఆకాశం నిదురోతుంది, కనపడకుండా పోతుంది. రహదారి మీద నిశ్శబ్దం నూలు పోగులా విరబూసి ఎదురుగా వచ్చే ప్రతి వాహనం ఒక కలలా కరిగిపోతుంది. ఇది వేగానికి, కాలానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్. చెట్ల కొమ్మలు మంచుతో తడిసి ఏదో కథ చెబుతున్నట్టు. మంచు అనేది జడత్వానికి, మృత్యువుకు ప్రతీక. మంచుతో తడిసిన చెట్ల కొమ్మలు గతానికి సంబంధించిన గుర్తులనేవో చెబుతున్నట్టు ఏదో కథ చెబుతున్నట్టు అంటారు కవి అపర్ణ. వెలుగు ఇంకా పూర్తిగా రాలేదు, చీకటి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. అది మధ్యలో నిలిచిన ఆ క్షణం ఈ దారి చూస్తే జీవితం గుర్తొస్తుంది. అవును, మనం జీవితం మధ్యలో ఉన్నప్పుడు నడిచి వచ్చిన దూరం ఎంతో తెలియదు, ముందుకు ఎలా వెళ్లాలో ఎంత వెళ్లాలో తెలియదు కానీ జీవితం అడుగు మాత్రం ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటుంది.

Stopping by woods on a snowy evening కవితలో Robert Frost చెప్పిన వాక్యాలు lovely, dark and deep ప్రపంచపు అందాన్నీ, మనిషి కనుగొనలేని బ్రహ్మాండ చీకటి రహస్యాన్నీ,  ఊహించలేని మార్మికతనూ అతి సులభంగా వర్ణిస్తాయి.

కవి అనుభవాలూ, పొందే అనుభూతులూ అక్షర రూపం దాల్చే క్రమంలో జరిగే మనోమధనం ఎన్నింటినో చెప్ప ప్రయత్నిస్తుంది.  ఒక వరదలాంటి భావాల వెల్లువను క్రమబద్దీకరించడంలోనే  కవి నైపుణ్యం ప్రపంచానికి తెలుస్తుంది.

ఇలా కవిత్వం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దీనికి సంబంధించిన అనేక విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది.

కాలంతో బాటే కవితలకు సంబంధించిన ఎక్స్‌ప్రెషన్ మారుతూ వుంటుంది.  దానికి కారణం సామాజిక చలనంలోని మార్పులు 19 వ శతాబ్దం చివరలో వచ్చిన ఆధునికత ఇరవయ్యో శతాబ్దపు మధ్య భాగంలో సామయికత కోల్పోయింది. వ్యవస్థల మీద మనిషి కోల్పోయిన నమ్మకాలు వ్యక్తిని అంతర్మధనానికీ, అంతర్యానానికీ లోను చేస్తే దాని ప్రతిఫలనాలు సాహిత్యంలోనూ కనిపించాయి. అయితే వ్యక్తిపై వ్యవస్థలు చేస్తున్న దాడులు వ్యక్తి ఆలోచనలలో మళ్ళీ మార్పులకు కారణమయ్యాయి. ఇరవై ఒకటో శతాబ్దపు సాహిత్యంలో ఆ చాయలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కవిత్వం దీనికి మినహాయింపు కాదు.

కవిత్వంలో ఈ శతాబ్దపు కొత్త అభివ్యక్తిని చూసినప్పుడు ఈ ద్వైదీ భావాలకూ భావావేశాలకూ, అంతలోనే కనిపించే చొరవలేమికీ కారణాలు నాకు అర్థం కాలేదు.

ఈ శతాబ్దపు రచనలు గత శతాబ్దంలో వచ్చిన ఆధునికానంతర ఆలోచనలకు కొనసాగింపుగానే అయినా భిన్నంగా ఉండడం ఒక లక్షణంగానూ, ఇది ఒక్క కవిత్వమూ, సాహిత్యమూ మాత్రమే కాక అనేక సామాజిక రంగాలలో మనిషిని ప్రభావితం చేసిన తీరును ఆశ్చర్యంగా గమనిస్తూ ఉన్నాను.

ఈ శతాబ్దంలో అనేక రూపాలలో వస్తున్న కవితల్లో ఉన్న కొన్ని ప్రధాన లక్షణాలు ఇప్పుడు స్థూలంగా చూద్దాం.

  1. గతానికి సంబంధించిన తలపోత: ఈ తలపోత బహుశా 20వ శతాబ్దం చివరి వరకు ఆత్మిక తలపోతగా (Self-Reflexivity) ఉంటే, అది 21వ శతాబ్దంలో దాని స్థానం మార్చుకొని, దాని రూపం మార్చుకొని సహానుభూతి తలపోతగా (Empathic Reflexivity) మారింది. ఇది ఎలా ఉంటుందో ముందు ముందు చూద్దాం.
  2. అర్ధాంతరన్యాసం (The narrative double): మనం చెబుతున్నది ఒక విషయం అని పాఠకుడు భ్రమపడతాడు, కానీ మనం చెబుతున్న ఒకే విషయంలో ఇంకొక అర్థం కూడా దాగి ఉండడం. దీన్ని మనం లేయర్స్ (Layers) గా కవిత చెప్పడం, పొరలు పొరలుగా కవిత చెప్పడం, గూఢార్థంగా కవిత చెప్పడం అని కూడా అంటాం.
  3. ద్వైదీభావం (Oscillation Between Opposites): రెండు విభిన్న లక్షణాల మధ్య ఊగిసలాడే మనసును గురించిన భావన ప్రకటన. ఒక పక్క మానవాళి వినాశనానికి సంబంధించిన ఒక దిగులు నిరంతరంగా మన ముందు సాగుతూ ఉంటుంది, అదే సమయంలో మానవాళి మనుగడకు సంబంధించిన చిగురాశ ఏదో మనసులో మొలకెత్తుతూ ఉంటుంది. ఈ రెండిటిని ఒకేసారి తలపోయడాన్ని దీన్ని రెండు విరుద్ధ భావాల మధ్య ద్వైదీభావం కలగడం అంటారు.

ఇప్పటికి ఈ మూడు ప్రక్రియల గురించి మాట్లాడుకున్నాం గనుక వీటిని గురించి ఇంకొంత విపులంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, వాటి గురించి మళ్ళీ చర్చిద్దాం.

*

చంద్రశేఖర్ కర్నూలు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు