యామినీదేవి కవితలు రెండు

1

అంతర్యామి

       ఒక నిశ్శబ్దం లోపలంతా కమ్ముకున్నప్పుడు నాకు నేను ఏమీ కాకుండా పోయినప్పుడు నేనాలపిస్తున్న నీరవ గీతాన్ని నా లోపల నుంచి నెట్టేసి నేనున్నానని మనసులోపలికి వచ్చేస్తావ్!!
    నీ ఆచూకీ కంటికి కనపడనిదీ, దేహానికి దొరకనిది.
అది పట్టుకునే నేర్పు నాకలవడింది నీవున్నావనే నమ్మకం వల్లనే! అనుభూతి గీతాల్ని ఆలపించాలనున్నప్పుడు మది గొంతు పెగలని వేళలే అన్నీ!! నిర్వేదం నన్ను నిర్వీర్యం చేసినప్పుడు ఊపిరి పోసేది నాలో వున్న నువ్వే!!
    దేహబంధంలో మనిషిని ఇమిడ్చి మనసుని ఎవరికీ ఏమీ కానీవ్వక నీకై మాత్రమే అత్తిపత్తిలా ఉంచావనుకున్నా!!    కమ్ముకున్న మాయ ఇహలో కి లాగుతూ నన్ను నాకు నాలో వున్న నీకు దూరం చేస్తుంటే చోద్యం చూస్తావేమని ఎన్నిసార్లు స్మరిస్తానో లెక్కకు దొరకదు.
2
ఒకపరి వినవూ…!
నాలో నేను అలా
తరచి తరచి చూసి
మౌనాన్ని అద్దుకున్న హృదిలో
నిలిపిన పుప్పొడి రాగం
సవ్వడి ఒకపరి వినవూ!!
శ్వాస రంద్రం గుండా
చీకటి సొరంగంలోకి
ప్రయాణం సాగుతున్న కొద్దీ
వెలుగు రేఖల్లోకి విస్తృతమౌతూ
ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా ఒకపరి కనవూ!!
ఏదో మత్తు మరేదో మహాత్తు
ఆవహించినట్టుగా అలౌకిక ప్రపంచంలో
మనో విహారినై మూసిన కళ్ళతో
తెరచిన హృదయంనిండా పరచుకున్న
నా లోపల వెలుగుని ఒకపరి కనవూ!!
అవ్యక్తానుభూతుల ఆనవాళ్లు
అణువణువూ నింపుకున్నాక
దృశ్యాదృశ్యాల నడుమనుంచి
ఈ సుదీర్ఘ మౌనంలోకి
ఆ దీర్ఘ ధ్యానంలోకి
చేరువవ్వాలని.. ఓ విశ్వమా
నన్ను ఒకపరి వినవూ!!!
*

యామినీ కోడే

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు