“రోదసిలో గెలాక్సీలు (నక్షత్ర రాశులు) ఢీకొన్నపుడు కాలానికి ఏమవుతుంది? ఉదాహరణకు, మన పాలపుంత సరసనే వున్న ఆండ్రోమెడాతో ఢీకొంటే కాలం ఏమవుతుంది? స్థల, కాలాలు వక్రీభవిస్తాయి. నక్షత్రాల రూపాలు మారిపోతాయి. ఇందులో మనకు తెలిసిన విషయాలు కొన్ని, ఇంకా తెలియనివి మరికొన్ని.”
నక్షత్రాలు, నక్షత్రరాశులు తలపడే వేళ రోదసిలో మొహరించిన యుద్ధ శకటాలు.
నక్షత్రాలు, ఆకాశం ముక్కలైన వేళ ప్రవాహ దిశను మార్చుకునే నదులు, దేశాలు సవరించుకునే సరిహద్దులు.
నక్షత్రాలు గడ్డ కట్టిన మంచు ఎడారులలో గజగజ వణికే సిపాయీలు.
నక్షత్రాలు సరిహద్దు పర్వతసానువులలో అప్రమత్తమై దాడికి సన్నద్ధమైన సైనిక బృందాలు.
నక్షత్రాలు చీకటిలో ధైర్యంగా మెరుపుల కాల్పులు జరుపుతున్న సైనికులు.
నక్షత్రాలు – ఆకాశాన భద్ర సైనిక ఉద్యోగం కోసం పడిగాపులు కాసే నిరుద్యోగ యువకులు.
నక్షత్రాలు – యుద్ధంలో అగ్నిపథాన నిలిచిన తాత్కాలిక సైనికులు.
నక్షత్రాలు – యుద్ధం ముగిశాక, రాత్రి తెల్లారాక కనిపించని మనుషులు.
నక్షత్రాలు – ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలకోసం ఎదురుచూసే సైన్యాధిపతులు.
నక్షత్రాలు – ఉద్రిక్త పరిస్థితులలో సర్వసన్నద్ధమై, చేతులు కట్టుకుని విధేయతతో కాచుకున్న సైనికాధికారులు.
నక్షత్రాలు – మేఘాల రహస్యాల మాటున తెరమరుగైన జ్ఞాపకాలు.
నక్షత్రాలు – ప్రచురణకు నోచుకోని పుస్తకాలు.
నక్షత్రాలు – దుకాణాలు అమ్మకాలనుంచి తొలగించిన పుస్తకాలు.
నక్షత్రాలు – ఆకాశ పుస్తకం నుండి తొలగించిన పేజీలలో మిణుకు మిణుకుమనే అక్షరాలు.
నక్షత్రాలు – చీకటి చెత్తకుండీలోకి నలిపి, విసిరేసిన చిత్తు కాగితాలు.
నక్షత్రాలు – రాత్రి నులిమివేసిన గొంతులలో వినిపించని నిజాలు.
(భారత మాజీ సైన్యాధిపతి ఎం ఎం నరవణె రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇటీవల వివాదాస్పదమైంది. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ప్రచురితమైన ఆ పుస్తకం ఇంకా విడుదలకు నోచుకోలేదు. నరవణె పుస్తకంలో పేర్కొన్న అంశాలు చైనాతో సరిహద్దు ఘర్షణలు, అగ్నిపథ్ కార్యక్రమంలో సైనికుల రిక్రూట్మెంట్ వంటి విషయాలపై ప్రభుత్వం చెబుతూ వచ్చిన వాటికి భిన్నంగా వున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నరవణె శీర్షికలోని నాలుగు నక్షత్రాలు సైనికాధికార హోదాలో అత్యున్నత స్థాయికి సూచికలు.)
*








Add comment