మూడు పోలీసు కథలు!

పతంజలి శాస్త్రి గారి కథల చిన్ని పరిచయం – 5

( పతంజలి శాస్త్రి గారి 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కథల్ని చిన్నగా పరిచయం చేస్తున్నాం. ఈ కథలు కొంతమంది చదివి ఉండొచ్చు, చాల మందికి తెలియకపోయి ఉండచ్చు, ఎందుకంటే ఇవేవి చదువరులకు అందుబాటులో లేవు. చదవని వాళ్ళకి కథని రుచి చూపించడంకోసం, చదివేసిన వాళ్ళకి మరోమారు గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ చిన్ని పరిచయం. ఇది  విశ్లేషణ, వివరణ ఏమాత్రం కాదు).

సారి పోలీసు నేపధ్యంలో ఉన్న మూడు కథలు ‘ఎస్సై నవ్వేడు ( 1990 )’, ‘కనకం గట్టెక్కిన వైనం ( 1992)’, సర్మ (1993 ) ‘సరమ్మ ‘ కథలను పరిచయం చేస్తున్నాము.   పోలీసు వ్యవస్థ సమాజంలోని అంతర్భాగం, సమాజంలో ఉండే సర్వ అవలక్షణాలు దాంట్లోనూ ఉంటాయి అనే నిజం  ఈ కథలలో ధ్వనిస్తుంది.

***

అనిల్ ASP  గా వచ్చి రెండునెలలైంది. కొత్తగా నాటిన మొక్కలా నవనవలాడుతుంటాడు. అయితే సెల్యూట్ చేసిన జవానులకి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పటం, పనులు చేసే కానిస్టేబుళ్లకు థాంక్సు  చెప్పడం   లాంటి అవలక్షణాలు ఇంకా వదులుకోలేదు. ప్రజలకి సహాయం చేయడం, వాళ్ళతో కర్టియస్ గా ఉండడం లాంటివి పోలీసుల పరమార్థమనే దురభిప్రాయాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇంకా భార్యని, కూతుర్ని తీసుకురాలేదు. వూళ్ళో సెయింట్ మారిస్ అనే మంచి స్కూలు ఉందని విన్నాడు.   పిల్లకి అందులో అడ్మిషన్ ట్రై చేయడం కోసం బయలుదేరాడు.  ASP  అనిల్ ని  ఫాథర్ జార్జి, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ స్కూల్ అంతా తిప్పి చూపించారు. అక్కడ అదే మంచి స్కూల్ అని అతనికి అర్థమైంది. క్లాస్ లో పిల్లలు ఒకళ్ళనొకళ్ళు అతుక్కుపోయి కూర్చున్నారు. సీట్ ఇవ్వడం కష్టమని, ఏదైనా వేకెన్సీ వస్తే చెప్తానని చెప్పాడు ఫాథర్ జార్జి. పోలీసు హోదాను కూడా కాదని సీట్ ఇవ్వడానికి తిరస్కరించిన జార్జి పట్ల ASP అనిల్ కి విపరీతమైన గౌరవం పెరిగిపోయింది. ఆనందం కూడా కలిగింది. ఆ సాయంత్రం యధాలాపంగా ఎదో మాట్లాడుతూ అనిల్ ఎస్సై వెంకట్రావు తో సీట్ దొరకలేదన్న విషయం చెప్పాడు. వెంకట్రావు ఆ స్కూల్ వాళ్ళకి తనకి ఆత్మీయ సంబంధాలున్నాయి అని, తను సీట్ సంపాందిస్తానని అనిల్ కి చెప్పాడు. ఎస్సై వెంకట్రావు కిందినుంచి పైకి వచ్చినవాడు. దొరల్ని ఎప్పుడు ఎలా సేవించుకోవాలో బాగా తెలిసిన వాడు. చీకటి పడుతుండగా ‘రమ’ని రమ్మని కబురుపెట్టాడు.

మరుసటి రోజు ఉదయం ‘రమ’  ఫాథర్ జార్జి దగ్గరకు  వెళ్లి కళ్ళు తుడుచుకుంటూ తనని, పిల్లని భర్త వదిలేసాడని, పిల్లకి ఎలాగైనా స్కూలు లో సీట్ ఇప్పించాలని అడిగింది. ఆర్థిక సహాయం చేయగలను కానీ సీట్ ఇవ్వడం కుదరదన్నారు ఫాథర్. సాయంత్రం మళ్ళీ ఆ ఆడమనిషి ఫాథర్ దగ్గరకి వెళ్ళింది, భోరుమని ఏడుస్తూ కళ్ళు తుడుచుకుని సీట్ గురించి ప్రాధేయపడింది. ఫాదర్  గాఢంగా నిట్టూర్చి కుదరదని చెప్పి పంపించాడు. బయటకు వచ్చిన  ‘రమ’  ఎవరూ చూడకుండా రిక్షా ఎక్కి  టూ టౌన్  పోలీసు స్టేషను కి  వెళ్ళింది.  మర్నాడు వెంకట్రావు ఫాదర్ జార్జి దగ్గరకు వెళ్ళాడు. మోలెస్టేషన్ కంప్లైంట్.

‘సీట్ కోసం ఒకామె వచ్చినమాట నిజం, తానే పాపం ఎరగను, భగవంతుడే సాక్ష్యం’ అన్నాడు ఫాథర్ జార్జి.   రేప్ కేసుల్లో ‘భగవంతుడు సాక్ష్యం చెప్తాడా? నిజమో అబద్దమో పక్కన పెట్టి, ప్రెస్ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది? ముందు పేరు పేపర్లో పడి పరువు కొండెక్కుతుంది’. ఇలా వెంకట్రావు పెట్టిన భయానికి జార్జి పేపర్వెయిట్ తినడానికి సిద్దమైపోయాడు. ఆ మరునాడు పాపకి సీట్ ఇచ్చినట్లు ఫాదర్ జార్జి ASP అనిల్ కి ఫోన్ చేసాడు. కానీ ఫాదర్ కంఠం లో ఉత్సాహం సంతోషం ధ్వనించినట్లు లేదు. అనిల్ కి ఆశ్చర్యం కలగకపోలేదు. ఎస్సై వెంకట్రావు కి ఉన్న పరిచయం కారణం అయి ఉంటుందని అనుకున్నాడు. ఇప్పు తెలిసిందిగా ‘ఎస్సై నవ్వేడు’ కి కారణం.

***

కానిస్టేబుల్ కనకం కూతుర్ని డబ్బులు తెమ్మని అల్లుడు మళ్ళీ పంపాడు. అంతకు ఆర్నెల్ల ముందే ఏడొందలు కావాలంటే చచ్చి చెడి సద్దాడు, ఇప్పుడు మళ్ళీ పదిహేనొందలు .

“ఎక్కడా దొరకనట్టు ఆ ఎదవ కొడుక్కి ఇచ్చి చేశాను, ఆడి కంటే లోపలేసిన రాజుగాడు నయం. జేబులు కొడితేనేం ఇంకొకరి దగ్గర అడుక్కోడు, ఛీ” అనుకున్నాడు కనకం.

కనకానికి అల్లుడు తీసేసినా పోని ఆనికాయలా తయారయ్యాడు. అల్లుడు  మెకానిక్ బాగానే సంపాదిస్తున్నాడు. అయినా చీటికీ మాటికీ డబ్బులు తెమ్మనడం, చేయి చేసుకోడం జరుగుతోంది.

ఈసారి కనకం అల్లుడు పిల్లమీద పోలీస్ థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించాడు. ‘ఎస్సై కంటే హీనంగా తయారై కూర్చున్నాడు’ అనుకున్నాడు కనకం. కనకాన్ని అల్లుడు పోలీసు దెబ్బలు కొడుతున్నాడు. ఎక్కడినుంచి డబ్బులు తేవాలో అర్థం కావట్లేదు. కనకం తోటి కానిస్టేబుళ్లు సత్తిరాజు, నారాయణలకి  ఎలాగైనా కనకాన్ని ఆదుకోవాలని అనిపించింది  ఎప్పటిలాగే. సాయంత్రం, అంతకు ముందురోజు లాకప్పులో పడేసిన రాజుగాడితో మాట్లాడారు. రాజు వాళ్ళని కొత్త సినిమా రిలీజ్ అయినా డీలక్స్   ధియేటర్ దగ్గరకు తీసుకువెళ్లాడు. మరో గంటసేపు జనాల్లో పడుగు పేకలా కలిసిపోతూ కళాత్మకంగా తిరుగుతూ జేబుల బరువు తగ్గిస్తున్న రాజుని చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయారు నారాయణ, సత్తిరాజు. మరునాడు ఉదయం పదిగంటలకు మిత్రులిద్దరూ జేబులోనుంచి డబ్బులు తీసి కనకానికి ఇచ్చారు.

ఎక్కడిదిరా? అడిగాడు కనకం.

‘ తరువాత చెప్తాలే నీకు తెలియని విద్యా ఇది. ముందు అమ్మాయికి ఇచ్చి మధ్యాన్నం బస్సు ఎక్కించి పంపించు’.

ఈ సారికి ‘కనకం గట్టెక్కిన వైనం’  ఇది.

***

మొగుడు లేని నారమ్మ కూతురు సరమ్మని మంచిగా చదివించాలనుకుంది. కూలీ నాలీ చేసుకుంటూ సరమ్మని బడికి పంపినా ఓ పాడు కాలాన కాలు విరిగిన నారమ్మ,  సరమ్మని కూడా పనుల్లోకి  దింపక తప్పలేదు.   ఊళ్ళో కరువొచ్చి సరమ్మ తప్పని పరిస్తుతుల్లో పక్కూళ్ళో రోడ్ల పనికి వెళ్లడం మొదలు పెట్టింది. మేస్త్రి బాషా కావలసినదానికన్నా ఎక్కువ మర్యాదలే చేసేవాడు.  రోడ్డు పనులు అయిపోయాక  హైద్రాబాదులో గొప్పవాళ్ళింట్లో పని చేసే వాళ్ళు కావాలి ఎక్కువ డబ్బిస్తారంటూ ఎర వేసి సరమ్మని బొంబాయి లో బ్రోతల్ హౌసులో అమ్మేశాడు.

బుసలు కొడుతున్న బ్రాందీ వాసనల్ని చీలుస్తూ సరమ్మ పెట్టిన కేక సుడిగాలి హోరే అయింది. మూడోరోజుకి వంటిమీద చీదర పుట్టి, వారానికల్లా కాలికింద పడ్డ నేరేడుపండు అయిపోయింది.  పద్మ అనే దయాళువు సరమ్మ ని పోలీసుల సాయంతో విడిపించింది.  పోలీసులు దిగబెట్టాక ఊళ్ళో వాళ్ళు పోగై ఆరాలు తీసినా ఎవరో దీదీ ఇంట్లో పనిచేశానని తప్పించుకుంది. అయితే మరునాడు పేపర్లో  తాటికాయంత అక్షరాలతో ఊరు పేరు తో సహా పోలీసులు ఇచ్చిన పూర్తి వివరాలతో ఎలా రక్షించబడిందో  వచ్చిన కథనం, సరమ్మ బతుకు బండలు చేసింది. నలుగురూ వెకిలిగా చూద్దాం మొదలుపెట్టారు. తల్లి నారమ్మ ఎదురుపడితే అడ్డమైన తిట్లు తిట్టి పూర్తిగా మాట్లాడడం మానేసింది. ఊళ్ళో కుర్రాళ్ళు ‘బొంబాయోళ్లు తప్ప మేము పనికిరాలేదన్నమాట సూద్దుగాని రాత్రి రావా?’ అంటూ వంటిమీద చొరవ చేయడం మొదలు పెట్టారు. పక్కూరినుంచి ఓ విలేఖరి సరమ్మ కథ ప్రపంచానికి తెలియ చేస్తానంటూ మరింత యాగీ చేసాడు. సరమ్మకి తల్లి తనను యావగించుకోవడం అన్యాయమనిపించింది. తన ప్రమేయం ఏమీ లేకుండా తనకు అన్యాయం జరిగితే దానికి తాను ఎలా బాధ్యురాలవుతుంది? ఒకప్పుడు ఈ వూరు, ఈ ఇల్లు, ఈ మనుషులు తనవాళ్లు అనుకున్నది, ఈ రోజు అన్నీ శత్రువుల్లా మారిపోయాయి. ఏ బావిలో నైనా దూకి చద్దామనుకున్నా అంత ధైర్యం  రావట్లేదు. ఓరోజు రాత్రి నీళ్లు తేవడానికి బావికి వెళ్తే, ఒకప్పుడు తనంటే భయపడే వెంకట రాయుడు అడ్డగించాడు. డబ్బులు ఇస్తా రాత్రి రమ్మని హుకుం జారీ చేసాడు. రాకపోతే తనేం బలవంతం పెట్టనని ఊళ్ళో అందరికి ఆ రాత్రి వచ్చి పోయిందని చెప్తానని బెదిరించాడు.

కనీసం బొంబాయి లాంటి చోట తనను రక్షించేందుకు ఓ ‘పద్మ’ అయినా ఉండేది. ఇక్కడ ఎవరూ లేరు.తనకి చావడం చేతకాదు, ఊళ్ళో బతకనివ్వరు. తనకి మేస్త్రి బాషా ఇల్లు గుర్తుంది. అతని ఇంటివైపు నడవడం మొదలు పెట్టింది ‘సర్మ’ గా మారిన సారమ్మ. మసక వెన్నెల్లో బాటకడ్డంగా జరాజరా పాము పాకింది.

*

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు