బైండ్లోళ్ళ కంచె

సెంద్రయ్య బైండ్లోడే గానీ బొత్తిగా భయం లేనోడు. మోటుదోపోడు. ఎన్క ముందు సూసుకోడు. ఎవరికీ అదురడు. బెదరడు. కానీ మంచోడు. అదిగో యిరవై యేళ్ళ యీడు మీద మాంచి కోడెలెక్కున్నడు. నెహ్రూ సేనలొచ్చి యెళ్లి పోయి అప్పటికి రెండేళ్ళ గావొత్తంది. వాతావరణంలో యింకా ఉడుకుతనం అట్టాగే వుంది. రోషం, పౌరుషం బానే వున్నాయి మడుషుల్లో. వయసు మీదున్నడే గానీ గాయిది పని జేసి ఎరుగడు. ఇద్దరు తమ్ములతో, అక్క పిచ్చమ్మ, సెల్లె అచ్చమ్మతో తన సిన్నతనమంతా అయిపోయింది. పదెకురాల యగుసాయం. జిలుకర నర్సయ్యకు సుట్టు పదూళ్లె మంచి పేరు. ఆ అయ్యకు తోడయ్యిండు. తను కూడా మూడో తరగతి వరకు సదువుకున్నడు ఉర్దుల. నాయినకు సేదోడుగా వుండాలని సదువు ఆపేసిండు. తమ్ముళ్ళు ఎంకటయ్య, సోమయ్యలను దర్దెపల్లి ఉర్దు బడికి బంపుతా, తాను ఎద్దోలే యవుసం సేత్తండు. కానీ మాయ వొక్కతీరుగా వుండదుగా. అదెప్పుడు ఎవరిని కప్పేత్తదో, కాలగుండంలో పడదొబ్బుతదో ఎవలికెరుక. గా  మాయ యిగో ఈ శారద రూపమెత్తింది. అది సెంద్రెయ్యను కప్పేసింది.

ఆరోళ్ల శారద బవు అందెగత్తే. వానబడ్డ యాళ్ల కాదుగాని మాంచి యాషింగి యాల్లనే వొక రోజు సెంద్రయ్యతో జతగూడింది. యెట్టనో సెప్తా యినుండ్లి. ఆ పొద్దు సూర్యుడు నడి నెత్తిమీదున్నడు. ఎండ ఎర్రగా కాలిపోతంది. మోత్కు ఆకులు దెంపుకోను సెంద్రయ్య భూములున్న కంచెలోకి వొచ్చింది శారద.

కంచెలో చాలా మోద్గు సెట్లు వున్నయి. వాటిని సూడంగనే శారద కళ్లు విప్పారినయి. యాప చెట్లు, సితపలక సెట్లు, పర్కి సెట్లు తునికి సెట్లు ఇంకా సానా వున్నయి. కంచె నిండా సానా రకాల గడ్డి గాదము బాగా ఎదిగి వున్నది. ఆ గడ్డిలో కనబడకుండా ఎత్తైన పుట్టలు కూడా బానే వున్నయి. ఆ సెట్లు, గడ్డి ఎండ మంటను కొద్దిగా తగ్గించింది. సెమట కారుతున వొళ్లును కొంగుతో తుడుసుకుంటా మోత్కు సెట్టు నీడ కిందికి సేరింది. ఆ సెట్టు మొదలులో ఏదో బరబరా కదిలి పక్కకు పోయింది. శారద పెయ్యి ఆ సప్పుడుకు జలదరించింది.

శారద ఎడమ సేత్తో జనప సంచి వట్టుకుంది. కుడి సేత్తో ఆకులు గోత్తంది. ఆకుల మాటును తొంగున్న ఉడుతలు ఆమెను చూసి భయంతో పక్కకు దప్పుకున్నయి.

కంచెకు కూత వేటు దూరంలో మామిడి సెట్టు. ఆ సెట్టు కింద బాయి. ఆ సెట్టు నీడన కూసోని తాడు పేనుతున్నడు సెంద్రయ్య. మావిడి సెట్టు మీద ఉడుతలు కొమ్మల మీద అటూయిటూ గెంతుతున్నయి. ఎండకు వొగరుస్తూ వొక సవరు కాకి ఎగిరొచ్చి, మావిడి కొమ్మల్లో దూరింది. ఆ రెండు అరసేతుల్లో తాటినార పాము అవతారం దాలుత్తంది. ఏదో అలికిడి గాలిలో యినవడ్డది. సెంద్రెయ్య తలెత్తి చూసిండు. కంచెలోని సెట్ల మీది పిట్టల గుంపు పైకి అరుత్తా లేసినయి. అటు వైపు సూసిండు సెంద్రెయ్య.

కంచెలో ఎవరో తిరుగుతున్నట్టు కనవడ్డది. ఆకులు తెంపుతున్న ఆడమనిషి కనవడ్డది. ‘అసలే సెల్లె అచ్చమ్మ పెళ్లున్నది. పెళ్లి కార్యానికి ఇస్తార్లు కుట్టుకోవాలే. ఈమెవలో ఆకులన్నీ తెంపుక పోతంద’ని మనసుల అనుకున్నడు. తాడు ఆన్నే పడేసి లేసిండు. చేతిల కట్టే వట్టుకొని రువ్వడిగా నడుత్తండు.

వున్నట్టుండి శారద గావు కేకలు పెడుతంది.

ఏదో జరిగిందని సెంద్రయ్యకు అర్థమైంది. వొక్కసారిగా యెల్ల కోడెలాగా ఉరుకుడు మొదలు వెట్టిండు.

శారద గజగజా వొణుకుతా కదలకుండా అన్నే నిలవడ్డది.

సెంద్రయ్య ఆడికి సేరుకున్నడు. రెల్లు గడ్డి ఎత్తుగా వున్న చోట వొక పుట్ట. తాపసి ఎవరో ధ్యాన ముద్రలో కూసున్నట్టు ఎత్తుగా వుందది. ఆ పుట్ట నుండి పెద్ద తాసు పాము బయటికొచ్చి శారద ముందు పడగ యిప్పి నిలవడ్డది. దాని పడగ మీద నల్లని ముద్ర భయంకరంగా వున్నది. అది శారదను వొక అరిష్ఠంవోలే సూత్తంది.

“నువ్వు కదులకు పిల్లా. అట్టనే నిలవడు’ అని పాము ముందుకు పోయిండు.

సేతులున్న కట్టెతో ఆ గడ్డిలో అడ్డంగా గీత గీసిండు.

పాముతో యిలా అన్నడు. “నువ్వు మంచిదానివో సెడ్డదానివో తెల్వదు. కాటేయ ముందుకొస్తే ఖతమైతవు. నా మాట యిని నీ యింట్లెకు నువ్వు బో. బైండ్లోళ్ల కంచెకు కావలి కాసుడు వరకే నీ పని. నా తండ్రి జిలుకర నర్సయ్య పేరు మీద నీకిదే నా సాసనం”  దాని కళ్లల్ల సూత్తా అన్నడు.

ఆ మాటలు దానికి అర్థమయ్యాయో లేదో శారదకు తెల్వదు. కానీ ఆ తాసు పాము సెంద్రయ్యను సూసింది. ఇంకొంచెం పైకి లేసి శారదను సూసి బుసకొట్టింది. శారద ఆ బుసకు దడుసుకున్నది. ఆమెలో ఏదో కీడును శంకిత్తంది పాము.

తాసు పాము సెంద్రయ్య కళ్లల్ల కళ్లుపెట్టి సూసింది. తన వొంటి మీద ఏదో  మాయా నీడ కనవడ్డది.

పడగను ముడిసింది. నేల మీదికి దిగింది. బరబరా పాకుతా పుట్టలోకి జారుకున్నది.

సెంద్రయ్య యెనక్కి తిరిగిండు.

శారద సెంద్రయ్యకు దండం పెట్టింది. “నువ్వు రాకపోతే, ఆ పాము నన్ను సంపేదే. పుణ్ణెం కట్టుకున్నవు పో” అని కిలకిలా నవ్వింది. ఆ నవ్వుకు గొర్రెంక పిట్టలు సప్పుడు సేత్తా టేకు సెట్టు మీది నుండి గాల్లోకి ఎగిరినయి.

మోద్గు ఆకులు నిండిన జనుప బత్తను సేత్తో లేపి భుజానికి ఏసుకో బోయింది.

సెంద్రయ్య ఆ బత్తను గుంజుకున్నడు.

“ఎవలి కంచె అని తెంపుకున్నవు? బైండ్లోళ్ల కంచె అంటే వుత్త పుణ్యానికి వుందా? పో. పో” అని కసిరిండు.

ఇలా మాట్లాడుతాడని వూహించ లేదు శారద. ఇంత కష్టపడి తెంపితే, ఈయన ఇట్టా అంటున్నడే అని బాధయింది. మొహం సిన్నబుచ్చుకున్నది. ఆమె కనుబొమ్మలు రెండూ వొంకలు దిరిగిన సందమామ కొడిపెల్లా వున్నయి.  కానీ వొక మాట అడిగితే ఏమైతది అనుకుంది మనుసుల.

“అయ్యో, ఏమైతంది. నేనేవన్నా సెట్టునే కొట్టుక పోతన్ననా. ఆకుల్నే గదా” అని దగ్గరికొచ్చి బత్త గుంజుకో బోయింది.

కానీ సెంద్రయ్య బలం ముందు కష్టం. బత్తను వొంటి సేత్తో ఇంకో భుజానికి మార్చిండు.

“ఇగో పిల్లా, ఇంకో నెల రోజుల్లో మా సెల్లె పెళ్లి వుంది. మాకే ఈ ఆకులు సరిపోవు. మా నాయినకు తెలిస్తే నన్ను తిడుతడు. పోపో” అని కసిరిండు.

సెంద్రయ్యను సూత్తంటే శారదకు మైకం కమ్ముతంది. కానీ తమాయించుకుంటంది.

మీదికొచ్చి బత్తను గుంజుకో బోయింది మల్లా. కలెబడినంత పని జేసింది. వొక సేత్తో బత్తను దూరంగా జరుపుతూ, యింకో సేత్తో శారదను నెట్టేత్తండు.

ఆమె రొప్పుతూ మీదిమీదికొత్తంది. తన ఎద మీది కొంగు ఎప్పుడో పక్కకు తొలిగి జారిపోయింది. మెడలో పసుపు తాడు ఎత్తయిన యెద మీద వొయ్యారంగా ఆడుతంది. ఆమెలో ఏదో  ఆవేశం, మోహం నిలవడనిత్త లేదు.

అమాంతం మీద పడి సెంద్రయ్యను గట్టిగా సుట్టేసుకున్నది.

“వోరి దీనయవ్వకు నా బారేత్తు. వో పిల్లా, ఈ కంచెల మోహినీ వుంటది. అదిగిన్న పట్టిందా యేంది నిన్ను” అని పక్కకు తోసిండు.

శారద బలంగా సెంద్రెయ్యను మీదికి గుంజుకున్నది.

యాప సెట్టు మీద గుడ్ల గూబ రెపరెపా సప్పుడు సేత్తా లేసిపోయింది. శారద సెంద్రెయ్య ను మండించింది. ఆమె ఆ కంచెలో రాలిపడిన మామిడి పండులా మాంచి వాసనేత్తంది. శారదది గట్టి వొళ్లు. అది సెంద్రెయ్య నిగ్రహాన్ని వోడించింది.

ఆ ఇద్దరు కోర్కెతో పాముల్లా అల్లుకు పోయిండ్లు.

శీతాఫల సెట్టు మీద వాలిన ఎర్రముక్కు గొర్రెంక మాంచి దోరదోర పండును వొడుపుగా పొడుసుకొని పొడుసుకొని తీయని గుజ్జును యిష్టంగా తిన్నది తొలిసారి.

లేసి సిగ ముడుసుకున్నది. బట్టలు సర్దుకొంటూ సెంద్రయ్యను జూసి కొంటెగా నవ్వింది.

యేం పేరు నీదని అడిగిండు. తన పేరు సెప్పింది.

దర్దెపల్లి అత్తగారు. ఆరె రామయ్య కోడలునని సెప్పింది.

ఎందుకట్టా సేసినవు? మీ యింట్ల దెలిత్తే యేట్టా? అన్నడు.

“యేమైతది? అరిగేదా కరిగేదా? వాళ్లు వొద్దంటే నీకే వుంటతియ్యి” అని కిసుక్కున నవ్వింది.

“నీ కత బానే వున్నది. యింకోపాలి యిటు రాకు. పోపో. ఎవలన్నా సూత్తే బాగుండదు” అని కసిరిండు.

నువ్వు ఆకులిత్తే తప్ప ఈనించి కదులా అన్నది. సరే పో అని బత్త సంచి ఇచ్చిండు. దాన్ని భుజాన యేసుకొని శారద కంచె నుండి‌ బయటికొచ్చింది.

అది మొదలు సెంద్రయ్యను శారద కలుత్తనే వున్నది.

యాప కాయల పేర వోసారి.

తునికి ఆకుల సాకుతో యింకోపాలి.

చీపురు పుల్లలు యేరుకొనే పేరుతో కూడా మల్లోపాలి కలుసుకున్నది.

“నాకు మరుగు మందు వెట్టినవా? నీ సుట్టూ తిప్పుకుంటన్నవు” అంది వొక రోజు.

“అట్టనా.  నీ దగ్గర సంసారి కతలు సాల్నే వున్నయిగనీ” అన్నడు సెంద్రెయ్య.

శారద యవ్వారం రెండూళ్లకూ తెలిసింది. గుసగుసలు పెరిగినయి.

శారద మొగనికి కూడా అనువానం వొచ్చింది. ఆ అనువానం కూడా రాకపోవు గానీ శారద వల్లనే అదీ వొచ్చింది.

సెంద్రయ్య మీదికి మనుసు గుంజుతంది ఆమెకు. కానీ మొగడు తనను యెటూ పోనిత్త లేడు. పొద్దగూకే యాళ్ల కల్లా శారదకు పిచ్చి లేసినట్టయింది. దేవుడు ఫూనినట్టు ఏవేవో కేకలు వెడుతూ వూగిపోతంది.

బైండ్లోన్ని పిలువాలే. దయ్యం పూనిందో దేవుడు బూనిండో వానికే తెలుత్తది అని ఎవరో పెద్ద మనిషివొచ్చి అన్నడు.

“సూత్తవేందిరా రావ. బిర్రున వురుకు. ఆ మల్లంపల్లికి బొయి నర్సన్న వుంటే తీస్కరాపో” అని యేగిరపెట్టిండు శారద మామ సత్తెయ్య. సైకిలేసుకొని సీకట్ల కలిసిండు రామయ్య.

అయిదు కిలోమీటర్ల దూరం సీకట్లో సైకిల్ తొక్కిండు. మల్లంపల్లి చేరుకున్నడు.  అప్పుడే నర్సయ్య బువ్వ దిని సెయ్యి కడుక్కుంటండు. సైకిల్ దిగి రామయ్య నిలబడ్డడు.

“వో నర్సయ్య నాయిన. జర బిర్రున యింటికి రావాల్నే. మీ కోడలు యెట్లనో సేత్తంది” అన్నడు రామయ్య.

“ఎవరయ్యా నువ్వు. సీకట్ల కనవడుత లేవు” అన్నడు నర్సయ్య.

“నేనే. ఆరె సత్తెయ్య కొడుకును. రామయ్యను”.

” వో నువ్వానయ్యా? యేమైంది బిడ్డా?” సేతిన తపాలను నేలమీద పెట్టి దగ్గరికొచ్చిండు.

రామయ్య జరిగింది సెప్పిండు.

“సూడయ్యా, ఇంత సీకట్ల నేను రాలేను. నా కొడుకులను పంపుతా. వాళ్లు దయ్యన్నైనా దేవతనైనా వొంటి మీదికెల్లి తీసేత్తరు. నువ్వు ఫికరు సెయ్యకు” అన్నడు నర్సయ్య.

” సెంద్రెయ్య, సోమయ్య ఇద్దరూ ఇటు రాండ్రి. దర్దెపల్లికి జల్ది పోండ్లి” అని కొడుకులిద్దరినీ తరిమిండు.

శారద యేదో కత సేసిందని సెంద్రెయ్యకు  అర్థమైంది. తనకు పెద్దగా వైదుగం రాదు. తమ్ముడు సోమయ్యకు వైదుగం తెలుసు. తను వున్నడు గదా. ఆ ధైర్నం వుంది తనకు.

“నువ్వు ముందు బా. కొబ్బరికాయ, పసుపు, కర్రెకోడి, అయిదు నిమ్మకాయలు, ఇంత వూదు తెచ్చి వుంచుపో. మేము నీ ఎన్కనే వత్తం” అని రామయ్యను పంపిండు సోమయ్య.

సెంద్రెయ్యకు పోవాలని లేదు. కానీ నాయిన మాట కాదనే ధైర్నం లేదు తనకు. కండువ భుజానేసుకొని సోమయ్య వెనుక నడుత్తండు. సిమ్మని సీకట్లో నల్లని సెట్లు బూతాల్లాగా నిలబడ్డయి. ఇద్దరూ నడుత్తండ్లు. రెండు కిలోమీటర్లు నడిసినంక తోడేలు వొకటి మేకపిల్లను నోట కరుసుకొని పోతంది. సేతి కందిన రాయి దీసి దాని మీదికి యిసిరిండు సెంద్రెయ్య. అది వెళ్లి తోడేలు అన్కల దాకింది. అయినా అది మేకపిల్లను వొదల్లే. కుడి పక్కకు దిరిగి తుప్పల్లో మాయమైంది.

సోమయ్య మనస్సు ఏదో కీడు శంకిత్తంది. కానీ తనేమీ మాట్లాడుత లేడు. కొద్ది దూరం బోయినంక అడిగిండు. “ఏమైవుంటదే ఆవెకు? ఎందుకట్టా సేత్తంది?” అని సోమయ్య అడిగిండు.  “నీకు దివ్యదృష్టి వుందంటరుగా. అరసేతిల సూసి ఏం జరిగిందో సెప్పరాదు?” అన్నడు సెంద్రెయ్య. “యెకసెక్కెం ఆడుతానికి ఇది యాళ్లనా”? అని యిసుక్కున్నడు సోమయ్య. ఇద్దరూ చేరుకునే సరికి శారద అరుపులతో కేకలతో ఎవరికీ కునుకు లేకుండా సేత్తంది.

సెంద్రయ్యను సూసి ఇంకా వూగుతంది.

సోమయ్యకు సంగతి అర్థమైంది.

రామయ్యను దగ్గరికి పిలిచిండు.

“దయ్యం పూనింది. ఇంట్ల కర్రెకోడి వుందా?” అని అడిగిండు. రామయ్య గూట్లె వున్న కర్రె కోడి పుంజును పట్టుకొచ్చి సేతికిచ్చిండు.

“దయ్యాన్ని తీసెయ్యాలంటే వూరి బయటికి తీస్క పోవాలే. నువ్వు, నీ పెళ్లాన్ని తీస్కోని మా ఎన్కే రా. పసుపు వొక పిడికెడు తీస్కరా. ఐదు నిమ్మకాయలు ఆ సెట్టుయి కోస్కరా” అన్నడు. రామయ్య నిమ్మకాయలు ఇచ్చిండు. వొక నిమ్మకాయ కోసి ఆమె మీదికేలి తిప్పేసిండు. పసుపుతో బొట్టు పెట్టిండు సోమయ్య. ఏదో మంత్రం నోట్లోనే సదివిండు.

తీస్కరా అని ఎనక్కి సూడకుండా నడుత్తండు.

సెంద్రెయ్యను సూసినంక శారద ఇంకా రెచ్చిపోతంది. కొద్ది దూరం నడిసినంక నేల మీద కూలవడ్డది. పళ్లు పటపటా కొరుకుతంది. దయ్యం గురించి వినడమే తప్ప చూసి ఎరుగని రామయ్య శారద వింత చేష్టలు చూసి బెదిరిపోయిండు.

“వో తమ్మీ. ఇది కూలవడ్డది. జర యిటు రాండ్లి” అని పిలిసిండు.

సెంద్రయ్య, సోమయ్య దగ్గరికి వొచ్చిండ్లు. శారద వొక్కసారిగా లేచి, సెంద్రెయ్య మెడ పట్టుకొని వూగుతంది.

సోమయ్య సేతిలోకి పసుపు తీసుకొని ఆమెకు బొట్టుపెట్టిండు.

యేదో మంత్రం సుదువుతా వొక నిమ్మకాయ కోసి,ఆమె మీదికేలి తిప్పేసిండు.

కొద్దిగా శాంతించింది.

“యిగో రావన్నా. నువ్వు ఈన్నే వుండు. వొదినకు మేము బాగు చేసి తీసుకొత్తము. నువ్వు మా యెనుకే వొత్తే దయ్యం నిన్ను పట్టుకుంటదేవో తెల్వదు” అన్నడు సోమయ్య.

అప్పటికే రామయ్య దడుసుకొని వున్నడు.

“నేను ఈన్నే వుంట. మీరు గానియ్యిరి తమ్మీ” అన్నడు.

“సెంద్రన్న, యెత్తుకో దెయ్యాన్ని” అనగానే శారదను ఎత్తుకొని గబగబా నడిసిండు. ఆమెకు కావాల్సింది కూడా అదే.

కొద్ది దూరం నడిసినంక శారదను దబీమని నేల మీద ఎత్తేసిండు సెంద్రయ్య.

చెంప మీద సెంద్రయ్య కొట్టిన దెబ్బకు కళ్లల్ల నిప్పులు గురిసినయి.

కొట్టకు కొట్టకు యెహే అంటా సోమయ్య అడ్డు పడ్డడు.

నీకు దెల్వదు ఆగురా అని సోమయ్యను పక్కకు నెట్టిండు. శారద జుట్టు పట్టి గుంజంగానే బండలాంటి బలమైన యీపు సెంద్రయ్యకు దొరికింది. నాలుగు దెబ్బలు సరిసిండు గట్టిగా. ఆ దెబ్బలకు శారదకు పట్టిన దయ్యం వొదిలింది.

“నీ బాంచెను నన్ను కొట్టకు” అని కాళ్లు పట్టుకున్నది.

సెంద్రెయ్య యినేటట్టు లేడని అర్థమైంది. వురికి సోమయ్య ఎనుక నిలవడ్డది, దొంగ పిల్లి గోడెనుక నక్కినట్టు.

” ఎప్పుడు వడితే అప్పుడు నీ కాడ్కి రావడానికి నేనేవన్నా నీ మొగన్నా? వానికి దెలిత్తే ఏం గానే?” అని తిడుతండు.

సోమయ్యకు యవ్వారం అర్థమైంది.

“సోమయ్య నీ కాళ్లు మొక్కుతా. మీ యన్నకు జెర సెప్పు.  నేనేవన్నా ముసల్దాన్నా? ఉప్పు కారం దిని కష్టం జేసే వొళ్లు నాది. నా మొగని కాడ సుఖం సాల్త లేదు. తాటి ఆకుల మంటలాగా సప్పున సల్లారుతడాడు. అందుకే మీ అన్న మీద మనుసు వడ్డ. నాది తప్పా” అని బోరుమన్నది.

సోమయ్యకు యవ్వారం ఎరుకైంది. పక్కకు తొలిగిండు. సెంద్రయ్య శారదను ఎత్తుకొని ఆ పక్కనే వున్న జొన్న సేండ్లళ్ల కలిసిండు.

సోమయ్య కర్రెకోడి మెడ యిరిసిండు. దాని బొచ్చంతా పీకిండు. కొన్ని కర్రపుల్లలను ఏరి మంట తయారు చేసిండు. ఆ మంట మీద కోడిని కాలుత్తండు.

దూరంగా ఎర్రగా వెలుగుతున్న మండలను చూసి రామయ్య యింకా భయపడుతూనే వున్నాడు.  సెంద్రెయ్యను శారద పీల్చి పిప్పి చేసింది. తృప్తి పడ్డది. సంతోషంగా ఇద్దరూ బయటికొచ్చిండ్లు.

శారద తలొంచుకొని సోమయ్య ముందట నిలవడ్డది. తమ్ముడు తనను ఏమంటాడో తెల్వక నిశ్శబ్దంగా నిలవడ్డాడు.

“నీ కతలు అందరికీ తెలుసు. నీ పెనిమిటికి తెలిత్తే యిత్తు కోసి యిగురం సేత్తడు. ఇగ సాలు. మా అన్నను వొదిలెయ్యి” అని కసిరిండు.

శారద యేమీ మాట్లాడలే.

ముగ్గరూ కలిసి రామయ్య కాడికి పోయిండ్లు.

శారదను వొప్పజెప్పిండ్లు.

“యింగ భయం లేదు. దయ్యాన్ని తీసేసినం. నువ్వే వొదినను జర మంచిగ చూసుకోవాలే అన్నా. తీరని కోర్కెలే దయ్యాలై వొంటి మీదికొత్తయి. ఏవన్నా మొక్కులుంటే మర్చిపోకుండా తీర్చుకో” అన్నడు సోమయ్య.

సెంద్రయ్య పక్కన్నే నిలబడి మొగన్ని సూత్తంది శారద.

సరే తమ్మి. ఉప్పలమ్మ పండుగ సేత్తా అని మొక్కిన. ఆ సంగతి యేందో సూడాలే అన్నడు రామయ్య. పెళ్లాన్ని తీస్కోని యింటి బాట వట్టిండు.

సెంద్రెయ్యను దారి పొడుగునా తిడుతనే వున్నడు సోమయ్య.

ఎదురు మాట్లాడ లేదు సెంద్రెయ్య.

మూల సుక్క పొడిసే యాళ్లకు శారద వొంటి మీద చెయ్యేసిండు రామయ్య.

మైకంలో “సెంద్రెయ్యా రా” అన్నది.

రామయ్య గుండెల రాయి వడ్డది. సాచి సెంప మీద యేసిండు. దెబ్బకు శారదకు మైకం వొదిలింది.

లేసి మొగని కాళ్లు వట్టుకున్నది. నా తప్పేమీ లేదు. అంతా సెంద్రెయ్యదే తప్పు అని బొంకింది. సెంద్రెయ్య బతికి వుంటే, నేను నీతో సంసారం సెయ్యనని ఏడ్చింది. నువ్వంటే పాణం అంది. నాకు వాడు మందు బెట్టిండు అన్నది.

రామయ్యకు ఏం చేయాలో తోచలే. కోపంలో ఇంకో నాలుగు తన్నిండు.

కొద్దిసేపయ్యాక తమాయించుకున్నడు. నలుగురికి తెలిత్తే పరువు పోద్దనుకున్నడు.

సెంద్రెయ్యను భూమ్మీద లేకుండ చెయ్యాలని పథకం ఆలోచించిండు.

తడిబట్ట తానం చేయించి మారుతనని వొట్టు యేయించుకున్నడు.

పాలకుర్తి సోమన్న గుడికి తీస్క పోయి పెళ్లం సేత్తో అర్చన చేయించిండు. గుడి మెట్ల మీన కూసుండ బెట్టి, సెంద్రెయ్యను సంపుతా అని పమాణం చేసిండు.

శారదకు భయమేసింది. కానీ సెంద్రెయ్య బతికుంటే మొగనితో కాపురం చెయ్యలేనని అనుకున్నది. కులంలో తెలిస్తే, తనకు గుండు కొట్టుడు ఖాయమని సింత జేసింది.

“ఇగో సూడు. ఆణ్ణి నువ్వు ఏం జేత్తవో తెల్వదు. సంపాలె. వొకేళ నువ్వు సంపలేక పోతే, నన్ను ఆని మొఖం సూడొద్దని అనొద్దు. నువ్వు అట్టా అంటే నేను ఏ బాయిల్నన్నా దునికి పాణం యిడుత్తా. పాల్కుత్తి సోమన్న మీద వొట్టు” అని కుడిసెయ్యి తీసి నెత్తి మీన పెట్టుకున్నది.

రామయ్య కాదన లేకపోయిండు. పెళ్లాం యిసిరిన సవాలుకు సరే అన్నడు. ఉషారుగా మెట్లు ఎక్కి దేవుని ఎదర నిలబడి సేతులు జోడించిండు.

దేవునికి నిండు మనుసుతో నేల మీన పండి మొక్కిండు.

శారదను తీస్కొని యింటికొచ్చిండు. ఆ రాత్రి పెందరాలే సెయ్యేసిండు. నిండు జాబిలిలా చేతులు సాపింది.

రామయ్య అగ్ని పర్వతంలా ఎగిసిపడ్డడు.

సల్లని గంగ మురిపెంగా అల్లుకుంది. కానీ ఆ నీటి సుడిలో రామయ్య నిలబడలేక వాలి పోయిండు.

శారద కళ్లలో నిరాశ. ఆ గదిని ఆమె నిట్టూర్పులతో భయంకరంగా శపించింది.

పెళ్లాం మొహం కూడా సూడకుండా యింకో వైపు తిరిగి పడుకున్నడు రామయ్య.

తెల్లారి‌లేసి రాయపర్తికి బయల్దేరిండ్లు. శారద తల్లిగారి వూరదే. మిట్ట మధ్యాన్నం యాళ్లకు యింటికి చేరుకున్నరు. అల్లుడు బిడ్డలు వొచ్చిండ్లని కోణ్ణి దెచ్చిండ్లు. ఇద్దరు బామ్మర్దులు బావను పోద్దాటి కల్లుకు తీస్క పోయిండ్లు. ఎత్తయిన తాడి సెట్లు. పందిరి గూలకుండా గుంజలు నాటినట్టు,  అంబురం గూలిపోకుండా వాటిని నాటిండ్లా యేంది అన్నట్టున్నయవి.

సుట్టూ పచ్చంగా బుగురు.

పది షేర్ల కుండ కల్లు తీస్కున్నరు. యెచ్చటి కల్లు సారాయిలా మండుతా గొంతు జారుతంటే, వొంట్లో సెమటలు పట్టినయి. మంచి కల్లు బోసినవు గౌడూ అని మెచ్చుకున్నరు. ఈత ముళ్లు సేత్తో వట్టుకొని, మూడో వరుస తాగినంక రామయ్య కతంతా సెప్పిండు. తోడబుట్టిన తోడు. తప్పు సేత్తందంటే, ఎంత సాతగాని అన్నయినా, బాంచోతని లేత్తడు. వాళ్లు గూడా గదే సేసిండ్లు.

తొలుత బావను తిట్టిండ్లు. సెల్లె తప్పు సేత్తే దాన్ని యీన్నే సంపుతం అన్నరు బామ్మర్దులు.

‘‘తప్పు సెంద్రిగానిది. శారద దేవర. ఆ లంజ కొడుకును సంపాలే. మీరు నాకు సాతియ్యాలే. లేకపోతే ఈ బతుకు దండుగ. వురేసుకొని సత్తా’’ అని బామ్మర్దులను వొప్పించిండు.  ముగ్గురూ కల్లు దొప్పను ముళ్ల కంపలోకి యిసిరి లేసిండ్లు.

ఆ రాత్రి ముగ్గురూ బువ్వ దిన్నంక కూసొని మాట్లాడుకున్నరు. పథకం పన్నుకున్నరు. సీకట్లో  బువ్వ కుండల మధ్య తునుకల కోసం ఆసగా తిరుగురున్న పిల్లిని కర్రతో కొట్టబోయింది పెద్దోని పెల్లాం. ఆ పిల్లి దొరక్కుండా తప్పించుకున్నది. “దొంగపిల్లి పాడుగాను. అన్నిట్ల మూతివెడుతది” అని తిట్టుకుంటా మొగనికేలి జూసింది. ఆడు సీకట్లో సూత్తా వుండు.

తెల్లారి ముగ్గురూ దర్దెపల్లికి పయనమయ్యిండ్లు.

మూడు రోజులూ బామ్మర్దులకు మంచి మర్యాద చేసిండు రామయ్య. వాళ్లు వూహించినట్టే సెంద్రెయ్య దర్దెపల్లికొచ్చిండు.

మాదిగిండ్లల్ల ఎల్లమ్మ పండుగ చెయ్య వొచ్చిండు.

ఆడ కలిసిండు రామయ్య. ‘‘అత్తగారింటికాడ ఉప్పలమ్మ సేత్తనం. మీ వొదిన నిన్ను గూడ తీస్కరమ్మన్నది. నన్ను దీస్కపోను మా బామ్మర్దులు వొచ్చిండ్లు. పోదాం రా తమ్మీ’’ అన్నడు రామయ్య.

ఆ మాటలను సెంద్రెయ్య నిజంగానే నమ్మిండు. ఈడ ఎల్లమ్మ పండుగ సేత్తన్నం. ‘‘మా తమ్ముడు, మా పాలోళ్లు అందరూ వున్నరు. రేపు పొద్దటికల్లా పండుగ అయిపోద్ది. అటెంక పయినం అయిదామే’’ అన్నడు సెంద్రెయ్య. ‘‘సరే తమ్మీ’’ అని సంతోషంగా ఎళ్లిపోయిండు రామయ్య.

మర్నాడు పొద్దున పండుగ కాంగనే “నేను గీ రాపర్తి దాకా పొయ్యొత్త. జర్రంత పనుంది” తమ్ముడికి సెప్పిండు. ఆన్నుంచి రామయ్య ఇంటికి వోయిండు. అప్పటికే రామయ్య,  ఇద్దరు బామ్మర్దులు తయారైవుండ్లు. సెంద్రెయ్యను సూడంగనే సంతోషించిండ్లు. నలుగురు కొలనుపల్లి మీదుగా రాపర్తి పోదామని పయినమైండ్లు. బాటపొంటి బాగా ముచ్చట్లు సెప్పుకుంటా నవ్వుకుంటా నడుత్తండ్లు. పెద్ద గొర్రెను మింగి ఎటూ కదల్లేక తండ్లాడుతున్న కొండసిలువలా వుంది ఆ బాట.

కొలనుపల్లి దూరంగా కనవడుతంది. రామయ్య పెద్దబామ్మర్ది ఆరె భాషలో అన్నడు. “ఎర్రకోడి సిక్కింది బానే. యాడ కోద్దాం?” అని. సెంద్రెయ్యకు ఆరె భాష రాదనుకున్నరు. కానీ తనకు ఆ భాష వొచ్చు. ఆరె సోపతిగాళ్లు సానా మంది వున్నరు తనకు. వాళ్లు గొడ్ల మేపుకోడానికి  తన కంచెలకు వొచ్చేటోళ్లు. వాళ్లతో జతగట్టి బానే నేర్సుకున్నడు.

“ముందు కొలనుపల్లె తాళ్లల్ల కల్లుదాపుదాం. కోడి మత్తుకొత్తది. అటెంక వూరు దాటినంక కోద్దాం” అన్నడు రామయ్య ఆ భాషలో. సిన్నగ నవ్విండు చిన్న బామ్మర్ది. దంతెముల్ల మండ సెంద్రెయ్య కాళ్లకు అడ్డంబడ్డది.

సెంద్రెయ్యకు మొత్తం అర్థమైంది. ఎట్లా తప్పించుకోవాల్నా అని ఆలోసిత్తండు. ఇప్పుడు ఎనక్కి ఉరికితే దొరికి పోతడు. ఎట్లా అని ఆలోసిత్తా నడుత్తనే వున్నడు. యాట సెంద్రమ్మా, నేను బతికితే నీకు పండుగ సేత్తా అని మనుసుల్నే పమాణం చేసిండు.

తాటి వనం చేరుకున్నరు నలుగురు. పన్నెండు సేర్ల కల్లు దీసుకున్నరు.

ముందు మా తమ్ముడు సెంద్రెయ్యకు పొయ్యమన్నడు రామయ్య. మోద్గు దొప్పలో వొక దమ్ము పట్టిండు సెంద్రెయ్య. ఆ తర్వాత ఆ ముగ్గురూ తాగిండ్లు.

రెండో దమ్ము ఆ ముగ్గరినే పట్టమన్నడు. వాళ్లు బానే తాగి మైకంలోకి జారుతున్నరు.

సెంద్రయ్య తను తాగే దొప్పకు సిన్న పొక్క పొడిసిండు. కల్లు పొయ్యంగనే నోరు దొప్పకు పెట్టిండు గానీ తాగుత లేడు. ఆ పొక్క నుండి కిందపడి మట్టిలో కలిసి పోయింది.

కల్లుపోసే గౌండ్లాయన ఆ సంగతి పసిగట్టిండు. కానీ సెంద్రెయ్య కళ్లతోటే మాట్లాడకని సైగ చేసిండు. ఆ ముగ్గరునీ సూసిండు గౌడు. దూరంగా కాటమయ్య గుడి దర్వాజ కనిపిత్తంది. కల్లు లొట్టి యెత్తి ఆ కాటమయ్యకు యింత కల్లు ఆరబోసిండు. మనసులో ఏదో మొక్కిండు. సెంద్రెయ్య కూడా అటు సూసి మనసులోనే దణ్ణం పెట్టుకున్నడు.

ఇంకో రెండు పట్లువట్టిండు సెంద్రెయ్య. కానీ యింత గూడా గొంతు దాటనియ్యలే.

ఆ ముగ్గురికీ నమ్మకం కలిగేటట్టు మత్తు మత్తుగా ముద్దముద్దగా మాట్లాడుతండు.

కోడికి బానే ఎక్కింది ఇగ బాండ్లి పోదామని లేసిండు రామయ్య.

తాళ్లు దాటి వొక ఫర్లాంగు నడిసిండ్లు. బాట పొడుగునా వున్న సెట్లు పారిపో అని సైగ సేత్తున్నట్టుంది. సెట్ల కింద సేదతీరుతున్న గొడ్లు లేసి బాటకు అడ్డు రాబోయినయి. రామయ్య వాటిని అదిరించి ఎల్లగొట్టిండు. సానాసేపు నడిచినంక పెద్దపెద్ద గొడ్ల కొట్టాలొచ్చినయి.  అక్కడ కాపోళ్ల సెల్కలు వున్నయి. వాటిలో ఎత్తుగా పెరిగి ఎండిపోయిన కంచె వుంది. అందులోంచి బాటుంది. ఆ కంచెలకు పోంగనే బాటలో అడ్డంగా నల్లతాసు నిలబడి పడగిప్పి బుసకొడుతంది. రామయ్య దాన్ని సూసి గజ్జుమన్నడు.

సెంద్రయ్యకు ఆశ్చర్యం. అచ్చం అది తన కంచెలో కాపలా వుండే నాగు‌. చేతులు జోడించి దణ్ణం వెట్టిండు సెంద్రెయ్య. అది రామయ్య కేసి సూసింది. తల తిప్పి మిగతా ఇద్దరినీ సూసి బుసకొట్టింది. కళ్లు మూసి తెరిసే లోపు మాయమయ్యింది.

తేరుకున్న పెద్ద బామ్మర్ది సెంద్రెయ్యను నూకేసిండు.

సెంద్రెయ్య కిందపడకుండా నిలదొక్కుకున్నడు.

రామయ్య బూతులు తిడతా వుండు.

“బైండ్ల లంజొడుకా. నా పెళ్లం మీద కన్నేత్తవురా. ఇయ్యాల నిన్ను కొయ్యక పోతే నేను రావన్నే కాదు. బాంచొత్” అని బొడ్లోంచి కత్తి తీసిండు.

సిన్న బామ్మార్ది సెంద్రెయ్య మీదికి లంఘించిండు. వాణ్ణి గాల్లోకి ఎత్తి నేల మీద దబీమని ఎత్తేసిండు. నడుములిరిగినట్టున్నయి. వామ్మో వాయ్యో అని మూల్గిండు.

పెద్ద బామ్మర్ది ఎనక నుండి వొచ్చి బొండికాయ పట్టుకున్నడు. కదులొత్తలేదు.

“దొరికినవురా సెంద్రిగా” అని రామయ్య కత్తి దీస్కొని దగ్గరికి రానే వొచ్చిండు.

అదును కోసం సూత్తన్న సెంద్రెయ్య బలమంతా కూడ దీస్కొని రామయ్య వొట్టల మీద తన్నిండు.

నోట మాట రాకుండా కూలబడిపోయిండు రామయ్య.

బొండికాయ పట్టుకొన్న పెద్ద బామ్మర్దిని బలంగా విసిరి, దూరంగా నూకేసిండు. సేతికి ఎండిన కట్టె పెద్దది దొరికింది. దానితో వాని కాలు యిరగొట్టిండు.

రామయ్య కాడికొచ్చి వాని సేతులున్న కత్తి గుంజుకున్నడు.

వాడు లేసి మల్లా కలబడబోయిండు. సెంద్రెయ్య కుస్తీపట్లు బాగా పడుతడు.

రామయ్య కాల్లు పట్టి అమాంతం లేపి ఎత్తేసిండు. కూసాలు కదిలినట్టుంది. లేవ లేక పోయిండు.

సేతికి దొరికిన యాప కట్టెతో వాని కాళ్ల మీద నాలుగు దెబ్బ లేసిండు.

వాడు పెడబొబ్బలు పెడితా చేతులు జోడించి దండం పెట్టిండు.

“నీ పెళ్లం ఎదకొచ్చింది. దాన్ని నువ్వు సంతోషపెట్ట లేవు. అందుకే అది నా సెల్కలకొత్తంది. ముందు నువ్వు దాన్ని సక్కగ సూసుకో. నీకూ నాకూ ఏ పగా లేదు. నిన్నొదిలేత్తన్నా. మా నాయిన నర్సయ్య మీద వొట్టు. నా జోలికి వొచ్చినవా, సంపి పాతరేత్త నా కొడుకా” అని గట్టిగా బెదిరించిండు.

లేవలేని స్థితిలో రామయ్య పాణాలతో వొదిలెయ్యమని వేడుకున్నడు.

శాంతించిన సెంద్రెయ్య కత్తి బొడ్లో దోపుకొని అణ్ణుంచి ఉరుకుడు మొదలుపెట్టిండు.

అడ్డదారిలో ఇంగ ఎవ్వరికీ దొరక్కుండా మల్లంపల్లి చేరుకున్నడు.

నాయిన నర్సయ్యకు ఏమీ సెప్పలేదు. అయిదో నాడు పండుగ సేద్దామన్నడు.  యాటసెంద్రమ్మ కాడ మ్యాక పొటేలును కోసిండు. జమిడికె యేస్తా ఆడిపాడిండు. కంచెలోని పుట్టలో ఎవరో నాట్యమాడినట్టుంది. కంచెలోని జీవరాసులు జిబజిబా కదిలినయి.

మొగడు కాళ్లిరిగి మంచం మీన పడ్డడు. ఏం జరిగిందో ఎవలికీ సెప్పుకోలే రామయ్య. తండ్రి సత్తెయ్య అడిగినా సెప్పలే.

శారద తన మాట మీన నిలవడ్డది.

శారద తునికాకు తెంపుకొత్తా అని సంచులు వట్టుకొని యింట్లోంచి బయిటికొచ్చింది.

రామయ్య సేతగానోడిలా శారదను సూసిండు. వొద్దని సెప్పే దైర్నం లేదాయనకు. సక్కగా బైండ్లోళ్ల కంచెలకొచ్చింది.

సెంద్రెయ్య ముందు నిలబడి జరిగిందానికి మన్నించమని  బతిమాలుకుంది.

నీవొల్ల వొక పిల్లో పిలగాడో పుడితే సాలని ఏడ్చింది.

సెంద్రెయ్య సమించిండు. శారదను దగ్గరికి దీస్కొని వోదార్చిండు. యిగేముంది?

యాడిది తిరిగే లోపల పులిలాంటి బిడ్డను గన్నది.

ఆ బిడ్డను సూసిన అందరూ రామయ్య పోలికలు కనవడుతలేవని గుసగుసలాడుకున్నరు. ఏమి సెప్పాలో రామయ్యకు తెల్వట్లే.  “అంతా దేవుని దయ” అని అడిగినోళ్లకు బదులిచ్చిండు. ‘అవును. అన్నెం పుణ్ణెం ఆ బగవంతునికే ఎరుక అని జనం’ నోళ్లు నొక్కుకుండ్లు.

*

జిలుకర శ్రీనివాస్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథలోఆరె కులం శారదకు బైండ్ల చద్రయ్య మధ్యలోరంకుకట్థిన కథ. ఈకథలో పాఠకుడు ఏమి నేర్చుకున్నాడు అంటే శూన్యం. దళిత, బహుజనుల మధ్య శత్రు వైరుధ్యాలను పుట్టించే కథ. నిర్మొహమాటంగా చెప్పినందుకు బాధ పడవద్దు. దళిత, బహుజన రాజకీయ ఐక్యతకు కృషి చేసే తాత్వికుడిగా మీరు ఇలాంటి కథలు రాయడం వలన మీ ఇమేజ్ తగ్గించే ప్రయత్నంలో మీదే ప్రధాన పాత్ర. ఇలాంటి కథలు దళిత బహుజనులను మరింత రాజ్యాధికారం పొందకుండా మనువాద ఫాసిజానికి పరోక్ష శక్తి ఇచ్చిన వారవుతారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు