మునిగిపోతున్న అందమైన జీవితాలు

గత పంచాయతీ ఎన్నికల నేపథ్యం లో ఎన్నికల అధికారిగా215 కిలో మీటర్ల  దూరం లో తూర్పు మన్యం లోని ముంపు మండలంలో ఒకటైన చింతూరు వచ్చినపుడు ఒకింత అసహనానికి గురైన విషయం ఒప్పుకోక తప్పదు.
కానీ ఆ ప్రయాణం నాకు ఎంతో మంది ఆదివాసీలను శాశ్వత మిత్రులుగా చేస్తుందని అసలు ఊహించలేదు.
నన్ను ఆదివాసీ సమాజం నన్ను ఆహ్వానించిన తీరు జీవితం లో మరిచిపోలేని అనుభూతి గా నిలిచిపోయింది..ఆ ప్రాంతానికి వెళ్ళేదారిలో వందల కిలోమీటర్ల అలసటను మరిచిపోయేలా
పచ్చటి ప్రకృతి సోయగాలు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండల వరుసలు, ఆ కొండల మధ్య ఒంపులు తిరిగిన రోడ్లు, కొండవాలులు, వాలులు ఆనుకుని లోయలు,మధ్యమధ్యలో సెలయేర్ల సరాగాలు, చల్లటి స్వచ్ఛమైన గాలుల పలకరింపులు… అడుగడుగునా అనిర్వచనీయ అనుభూతి కలుగకమానదు.. అవ్యక్తానుభుతులు అనుభవం లోకి మానవు.
దారిపొడవునా పసుపుపూల సవ్వడి, కాఫీ తోటల ఘుమఘుమలు, విప్పపూల ఘాటైన తుంటరితనం, మోదుగ పూల అరుణవర్ణ శోభలు, మనలని మురిపిస్తాయి. మైమరిపిస్తాయి.
చింతూరు మండల కేంద్రానికి 12కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో మల్లెతోట గిరిజన తండా ఒకటి ఉంది. వారితో ఎన్నికల డ్యూటీ సమయం లో ఏర్పడిన పరిచయం గత 5ఏళ్లుగా కొనసాగుతుంది. వారినీ,వారి సంస్కృతి సంప్రదాయాలను లోతుగా విశ్లేషించే అదృష్టం కలిగింది. కేవలం 120గుడిసెలతో 500జనాభా కలిగివుంటుంది ఆ తండా. ఉక్కు దేహాలు, దూది పింజల్లాంటి మనసులు, కలిగి నాగరిక సమాజానికి భిన్నంగా నిజాయితీ,నిష్కల్మసత్వం మూర్తీభవించిన నిలువెత్తు నిదర్శనం ఆ జానపదం. ప్రధానంగా వీరందరూ కోయ తెగకు చెందినవారు. కోయ భాష మాట్లాడతారు. వ్యవసాయం, పశుపోషణ వీరి ప్రధానవ్యాపకాలు.
అక్షరజ్ఞానం లేకపోయినా మానవత్వంతో నిండిన ఈ తండవాసులు తో కలిసిపోవడం చాలా సులభం. కలిసిపోవడం అనడం కంటే కలిపేసుకుంటారు అనడం సబబేమో! ప్రేమ, వివాహ విషయాల్లో వధువు ఇష్టాఇష్టాలకే అగ్ర ప్రాధాన్యం ఉంటుంది.
వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలు వీళ్ళ మెదళ్లలో ప్రవేశించలేదు. వీరి మధ్యలో వస్తుమార్పిడి వ్యవస్థ ఇంకా నడుస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా, ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా తండా వాసుల మధ్యలో బలమైన సాంఘిక వ్యవస్థ నిర్మించుకున్నారు. రచ్చబండ గ్రామ కట్టుబాటు స్థలం.. తండా పెద్దల నిర్ణయo మేర నిర్ణయాలు జరుగుతాయి. పొద్దస్తమాను కష్టపడటం, సాయంత్రం అయ్యేసరికి అందరూ ఒకచోట చేరి జీలుగ కళ్ళు, విప్పసారా సేవించి సాంప్రదాయ గిరిజన నృత్యాలు చేసుకుంటూ ,కోయ పాటలు పాడుకుంటూ ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. వీరికి బాహ్యప్రపంచం తో ఏ పని లేనట్టుంటారు.
కోయ తెగకు చెందిన వీరు సంస్కృతి సంప్రదాయాలు , పండుగలు అన్నీ ప్రకృతితో మమేకమై ఉంటాయి. వీరు జరుపుకునే ప్రతి పండుగ వ్యవసాయ ప్రాధాన్యంగా తొలకరి వేసేసమయం లో విట్జ్ పండుమ్ ( విట్జ్ పండుగ) మొదలుకుని పంటచేతికొచ్చి ఇంటికొచ్చాక ఇలవేల్పు ను కొలిచే పండుగ కుర్మిన్ పండుమ్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది.
మొత్తం సంవత్సరకాలం విప్పపూలు పూసే సమయానికి విప్ప పండుమ్, మామిడి పండ్లు సమయం అంటే మన ఉగాది సమయం లో మరక పండుమ్, చిక్కుడు కొంతసమయం లో చూకుద్ పండుమ్, సుంకు పండుమ్ ఇలా 9రకాల పండుగలు జరుపుకుంటారు.
కుర్మిన్ పండుగ కోసం జంతుబలి ఇవ్వవలసి ఉంటుంది. దానికోసం అడవికి వేట కెళ్ళే దృశ్యం మనలని ఆకట్టుకుంటుంది. తండాలో మగవాళ్ళు 70నుండి 80 మంది మగవాళ్ళు చిన్నపిల్లలు వేటకు బయుదేరతారు. ముందువరుసలో అనుభవజ్ఞులు, రెండవ వరుసలో యువకులు మూడవ వరసలో         ప్రౌడ ప్రాయులు ఉంటారు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఉత్సవం లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. సాయంత్రానికి అడవి జంతువుతో తిరిగి    వస్తారు. ఆ జంతువుని కుర్మిన్ పండుగలో గ్రామఇలవేల్పుకి బలి ఇస్తారు. నేను కుర్మిన్ పండుమ్ నీ ప్రత్యక్షం గా చూసే అదృష్టం కలిగింది.
ఆ తండవాసులు అందరూ చేరి మట్టిబొమ్మలు చేసి, జంతుబలి ఇచ్చి, పూజకు కోసం కొందరు ప్రత్యేకించిన దుస్తులు వేసుకుని నృత్యం చేస్తూ, జనసమూహం పూనకాలతో, మనకి మరిచిపోలేని అనుభూతిని మిగులుతుంది.
అనాదిగా ఎన్నో తరాలుగా ఆ నేలనే నమ్మి జీవిస్తున్న వీరికి ఆ ప్రాంతానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆ నేల వారి అస్తిత్వ ప్రతీక.
ఎన్నో ఏళ్లుగా ఆ గాలిలో వారి ఉద్వేగాలు మిళితమై ఉండిపోయాయి. నాగరిక సమాజంతో మిళితమై మనగలగడం ఆ అడివి బిడ్డలకు దాదాపు అసాధ్యం. అట్లాంటిది పోలవరం ప్రాజెక్ట్ పేరుతో వీరి ఆవాసాలు ప్రతి ఏటా ముంపుకు గురవుతున్నాయి. శబరినది విలయతాండవం ప్రతియేటా వీరి సంతోషాలను, పంటలను మింగేస్తుంది.
అంతటి సాంస్కృతిక వైభవం వరద నీటిలో నిస్సహాయంగా కొట్టుకుపోతోంది. పునరావాసం పేరుతో జరిగే హడావిడి అంతమాత్రమే. వీరిని అక్కునచేర్చుకునే నాధుడే లేకపోయాడు. 2022 వరదల తరవాత నేను వారికి సాయం అందించడానికి వెళ్లిన సమయం లో నేను చూసిన వారి దుస్థితి వర్ణనాతీతం. నా కళ్ళంపట నీళ్లు వస్తూనే ఉన్నాయ్.
తండా వాసులు సర్వం కోల్పోతున్నారు ప్రతీ ఏటా వరదలకు-
నాగరిక సమాజం కడుపునింపడం కోసం, వేల హెక్టార్ల భూమి పండటంకోసం వీరు చేస్తున్న త్యాగం సామాన్యమైనది కాదు… తమ అస్తిత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడిన ఈ వదలదు తండాలు సదా పూజ్యనీయులు.
ఆ ప్రాంతంనుండి తిరుగు పయనమయ్యే సమయంలో మానవ ఆవిర్భావానికి మూలమైన ఏదో సహజాతాన్ని వదలి దూరంగా వెళ్ళిపోతున్నానా అనే భావన, మాతృక నుండి వేరుపడుతున్నానా అనే వేధన, మన మదిలో మెదలక మానవు.. ఆ అడవిబిడ్డల ముఖం లో ప్రసన్నత,  సొంత తృప్తి, నిరాశ నిస్పృహ లకు చోటివ్వని వ్యక్తిత్వ రమణీయత ఎల్లప్పుడూ ప్రకటితం అవుతూనే ఉండాలని కోరుకుంటూ…
*

చంద్ర నాగ మల్లిఖార్జున్ బళ్ల

నా పూర్తిపేరు చంద్ర నాగ మల్లిఖార్జున్ బళ్ల. మాది ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా కోనసీమ ప్రాంతం. నేను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి అవార్డ్ అందుకున్నాను. సామాజిక సేవాసంస్థల ద్వారా గురుస్పందన, విద్యాశ్రీ అవార్డ్స్ పొందాను. ప్రవృత్తి రీత్యా writer ని, motivated speaker ని.

నేను రెండు పుస్తకాలు రాసాను. ప్రణయబాంధవి( నవల) ప్రణయమంజరి ( కవిత్వసంకలనం). సామాజిక సేవల్లో ఆసక్తి కనబరచడమే కాకుండా tribal community కి చాలా సార్లు సహాయసహకారాలు అందించాను..

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎక్స్లెంట్…కీప్ గోయింగ్…గుడ్ రైట్ అప్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.