గుత్తికోయలు అనే గిరిజన ప్రజలు భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన ఆదివాసీ సమూహం. వీరు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అటవీ ప్రాంతాలలో నివసిస్తున్నారు. పాలకుల రాజకీయాల వలన తమ నివాస స్థావరాలను వదిలి వివిధ ప్రాంతాలకు వలసలు పోతూ అనేక సమస్యలను ఎదురకొంటున్నారు.
2005వ సంవత్సర ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, ప్రభుత్వ మద్దతు గల ‘సల్వా జుడుం’సాయుధ దళాలకు మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణలు, హింస కారణంగా వీరు తమ సొంత గ్రామాలను వదిలిపెట్టి ప్రాణాలు దక్కించుకోవడానికి తెలంగాణ (భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు), ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతాలకు వలస వచ్చారు నిలకడలేని బతుకులు సాగిస్తున్నారు.
గుత్తికోయ గ్రామానికి ఒక సాంప్రదాయ పధ్ధతిలో సమస్యలను పరిష్కరించే పంచాయతీ (Village Council) ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే గ్రామ పెద్ద ‘పెద్ద’ నాయకుడుగా వుంటారు. పండుగల నిర్వహణ, అంతర్గత వివాదాల పరిష్కరించడంలో ఈ పంచాయతీ కీలకంగా వ్యవహారిస్తుంది. సామజికంగా కుల వ్యవస్థ లేదా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు వీరిలో కనిపించవు. ’ఏకపత్నీ వ్రతం ‘ఎక్కువగా అమల్లో వున్న వీరి కుటుంబాన్ని ‘కుటుమ్’అని పిలుస్తారు. వీరి మాతృ భాష ‘కోయ’ కోయ ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ఇది గొండి భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. తెలుగు ప్రాంతాలకు వలస రావడం వల్ల వీరి భాషపై తెలుగు ప్రభావం ఎక్కువగా ఉంది.
వీరు ప్రకృతే దైవంగా ఆరాధిస్తూ ‘భూమాత’ను పూజిస్తారు. విజ్జి పండుగ అనే గింజల పండుగ,కొండల కొలుపులతో పాటు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం- సమ్మక్క సారలమ్మ జాతరను వీరు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
వీరి జీవన సంస్కృతిలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం అడవిలో పెద్ద పెద్ద నిలువు రాళ్లను నాటే విశిష్ట సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా గ్రామ వైద్యుడు, పూజారి, గ్రామ పెద్ద చనిపోయినప్పుడు వారి గౌరవార్థం ఈ రాళ్లను ప్రతిష్ఠించి ఆరాధిస్తారు. అటవీభూముల్లో ‘పోడు’వ్యవసాయాన్ని సాగిస్తూ జీవిస్తున్నారు. పోడుతో పాటు పశుపోషణ, అడవి నుంచి ఇప్పపువ్వు, తేనె, జిగురు వంటి అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించడం అనేది వీరికి జీవనాధారం.
సామాజికంగా గుత్తికోయలకు ఛత్తీస్‌గఢ్ లో షెడ్యూల్డ్ తెగ గుర్తింపు ఉంది. అయితే, వీరు వలస వచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వారికి ఇంకా షెడ్యూల్ తెగ గుర్తింపు లేదు.దీనివల్ల సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు అండటంలేదు.
మరోవైపు అటవీ భూముల్లో వీరు చేసే పోడు వ్యవసాయం కారణంగా అటవీ శాఖ అధికారులకు, గుత్తికోయలకు మధ్య తరచూ తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. జయశంకర్ భూపాల్ జిల్లా, తాడ్వాయి మండలం, జలగలంచ ప్రాంతంలో జరిగిన సంఘర్షణ పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు. పోడు భూములపై వీరికి హక్కు ఎటువంటి పత్రాలు లభించకపోవడం పెద్ద సమస్యగా మారింది. అడవుల లోపల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వీరికి సరైన విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస సదుపాయాలు అందడం లేదు. వీరు స్వదేశంలోనే శరణార్థులుగా బతుకు పోరాటం సాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు వీరిని పట్టించుకుని సంక్షేమం దిశగా నడిపిస్తున్నాయి. పౌరా హక్కుల నేతలు, సామాజిక కార్యకర్తలు, ప్రగతిశీలవాదులు గొత్తి కోయిల పక్షం నిలపడి వారి హక్కులపోరులో అండగా వుంటున్నారు.
గొత్తి కోయిలను వారి స్తావరాలనుంచి ఖాళీ చేయించాలని బాలత్కారం జరిగినపుడు వారి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రకటించేలా, మద్దతుగా ఈ కవిత-
గొత్తి’కోయల’రాగంలో ఆకు పచ్చనిపాట
వాళ్ళు
అడవిని ఆలింగనం చేసుకున్నోళ్ళు
అడవినే అమ్మగా నమ్ముకున్నవాళ్ళు
వాళ్ళు యాడికెళ్తారు!?
నగరరాణ్యాలకు ఆవల
నాగరికతనాగరికులకుదూరంగా
స్వచ్చమైన ఊపిరి పీల్చుకుంటున్నోళ్ళు
యాడికెళ్తారు?
గడ్డిపోచల్తో పదాలల్లుకుంటూ
ఆకుపచ్చని పాటని
అడవిభాషలో పాడుకుని
పుట్టకముందే
యీ పుట్టతో
యీ చెట్టుతో
యీ మట్టితో
పెనేసుకున్నపేగునెలా తెంపుకుంటారు?
ఈ వనవాసమే వాళ్ళ ఆదివాసం
నివాసాలకాడనిలువనీడలేకుండాచేసినా
పుట్టలపైపడగలనీడవాలినా
చలిచీమలపాఠమే మళ్ళీమళ్ళీ గుణపాఠం
గుంటనక్కలుఊలేసినప్పుడల్లా
అడవిలో ప్రతిచెట్టుకు చేతులోస్తాయ్
అవి విల్లంబులెక్కుపెడుతాయ్
నేను సత్యాన్ని పాడుతున్నవాన్ని
గాబట్టే చెబుతున్నా…
వాళ్ళెందుకెళ్ళాలి?
అడవిని పిండి అన్నం చేసినంత సులభంగా
అన్యాయపుచెత్తకుప్పలకుఅగ్గిపెట్టగలరు
అడవి వాళ్ళది
అడవిబువ్వవాళ్ళది
వాళ్ళది అడవిభాషలో పాడే ఆకుపచ్చనిపాట
వాళ్ళు వేలవేల వనాలవారసులు
వాళ్ళే వాళ్ళ వనసార్వభౌములు
*** *** ****
(గొత్తికోయలకు మద్దతుగా,17/10/2017)
Photo Courtesy సామాన్యశాస్త్రం








Add comment