రాయలసీమ సాహిత్యంలో ఆదివాసీలకు సంబంధించిన సాహిత్యాన్ని పరిశీలించినపుడు ఆదివాసీలలో భాగమైన సుగాలీల బతుకుచిత్రమైన శ్రీరంగరాజచరిత్ర నవలే కనబడుతుంది. 1878లో కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన రాజశేఖర చరిత్ర కంటే ముందు మన కర్నూలు జిల్లా వాసి నరహరి గోపాలకృష్ణమశెట్టి 1872లో సోనాబాయి చరిత్రను శ్రీరంగరాజు చరిత్రగా నవలీకరించాడు.
సుగాలీల సాంఘీక జీవితానికి ప్రతిబింబంగా వారి జీవిత గమనాన్ని చిత్రిస్తూ, ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధంగా ఈ నవల రాశారు. నరహరి గోపాల కృష్ణమశెట్టి పూర్వీకులది కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామం కావడంతో తెలుగు సాహిత్యంలో తొలితెలుగు నవలగానూ, అలాగే తొలి ఆదివాసీ నవలగానూ చరిత్రలో స్థానం సంపాదించుకున్నది. ఈయన ‘కుంఫిని’ వారి కొలువులో ప్యాపిలి డిప్యూటీì కలెక్టర్‌గా పనిచేస్తూ వుండేవారు.
చింతా దీక్షితులు రచించిన ‘చెంచురాణి’ తెలుగు సాహిత్యంలో గిరిజన జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకున్న ముఖ్యమైన కథల్లో ఒకటి. చింతా దీక్షితులు గిరిజన, సంచార జాతుల జీవితాలను ఇతివృత్తాలుగా తీసుకొని సుగాలీ కుటుంబం (1920),చెంచుదంపతులు (1922) చెంచురాణి (1925) అనే మÖడు కథలు రాశారు. ఈయన రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, మార్కాపురం, చిత్తూరు తదితర జిల్లాల్లో పాఠశాలల డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పనిచేయడం వల్ల ఇక్కడ చెంచుల జీవితాలను సమగ్రంగా అధ్యయనం చేసి వారి జీవితాలను రికార్డు చేయగలిగారు.గ్రామీణ, గిరిజన, సంచార జాతుల జీవితాలను సాహిత్య వస్తువులుగా స్వీకరించి కథలను రాశారు.చింతా దీక్షితులు రచించిన ‘దాసరి పాట’ తెలుగు కథా సాహిత్యంలో సంచార జీవనం సాగించే దాసరి కుటుంబాల జీవితాన్ని హృదయవిదారకంగా చిత్రించిన కథ.సంచార జాతుల జీవన చిత్రణ ఇందులో కథావస్తువుగా వుంది.
చిత్తూరు జిల్లాకు చెందిన విఆర్ రాసాని నాలుగో నాటకం పేరుతో యాచక గిరిజన సంచార జాతులకు సంబంధించిన కథలు రాశారు. ఇందులో నాలుగో నాటకం, విషప్పురుగు, వేట, తపస్సు, మిన్నేరు, గొగ్గమ్మ ఎల్లిపోయింది, నల్లపూసలు, కుబుసాలు, పయనం, అదృశ్యవిధ్వంసం, తిరిగిరాని తిరుమల, ఎన్కౌంటర్, నేరం, పొగిడింపు, నిప్పు, బిక్షువర్షియస్సి, చావుకూడు, వీరజాటీì, పగటి తారలు, మల్లేశు కుక్క, తేనెకల్లు అనే కథలున్నాయి. గిరిజనేతరుడైన రాసాని రాయలసీమ సాహిత్యంలో ఎవరూ చేయని కృషిచేశారు. గిరిజన సంచార జీవితాలతో కలసి పరిశోధనాత్మకంగా ఏళ్ళకు ఏళ్లు వారితో స్నేహం చేసి వారి ఆచార వ్యవహారాలనేకాక సంస్కృతి సంప్రదాయాలను, వారి బాధల్ని కన్నీళ్ళను సాహితీచరిత్రలో కథలుగా నమోదుచేయగలిగారు.
తెలుగు నవలాసాహిత్యంలో సంచలనమైన నవల డా.కేశవరెడ్డి రాసిన చివరిగుడిసె.యానాదుల గిరిజన సమాజం జీవితాన్ని, వారి మీద జరిగే దోపిడీ, అణచివేత, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థను చిత్రించిన ముఖ్యమైన తెలుగు నవల.ఈ నవల 1945 నాటి గ్రామీణ సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగుతుంది.
కలెక్టర్ జార్జి దొర యానాదుల కోసం ఊరి బయట గుడిసెలు వేయించి, ఒక్కొక్క కుటుంబానికి రెండెకరాల భూమి ఇప్పిస్తాడు.గ్రామ మునసబు మణియం యానాదులపై తప్పుడు దొంగతనం కేసులు బనాయించి వారిని జైలుకు పంపిస్తాడు.వారి భూములను ఆక్రమించుకుంటాడు. మణియం దౌర్జన్యాలను తట్టుకోలేక యానాదుల కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోతాయి. చివరకు మన్నోడు అనే యానాది మాత్రమే అక్కడ మిగులుతాడు. అతని గుడిసెనే ఆ ప్రాంతంలో మిగిలిన చివరిగుడిసె అవుతుంది. మణియం మన్నోడును పొలంలో ఎలుకలు పట్టడానికి పిలుస్తాడు. ఆ తరువాత జరిగే పరిణామాలు నవలలో అత్యంత ఉత్కంఠభరితమైన మలుపుకు దారితీస్తాయి.ఇందులో యానాదుల అస్తిత్వ పోరాటం,గిరిజనుల భూమి హక్కుల సమస్య,అగ్రవర్ణ, భూస్వామ్య పెత్తందారీ దోపిడీ,గిరిజనులపై నేరస్థులనే ముద్ర వేయడం, అధికారం, న్యాయం, ప్రతిఘటనల మధ్య సంఘర్షణ, ప్రకృతితో ముడిపడిన గిరిజన జీవన విధానం కనిపిస్తుంది.
ఈ నవలను కేవలం ఒక యానాది కుటుంబం విషాదగాథగా కాకుండా, భూమి, గౌరవం, అస్తిత్వం కోసం అణగారిన సమూహం చేసే పోరాటానికి ప్రతీకగా చూడవచ్చు.ఇక తదనంతరకాలంలో ఆదివాసీలలో భాగమైన యానాదుల బతుకుచిత్రాలను చిత్తూరు జిల్లాకు చెందిన మునిశెట్టిగోవిందు నాడోడిబతుకులు, కె.వి.మేఘనాథ్‌రెడ్డి పాయిదరువులు పేరుతో నవలను, వానబొట్లు, పనిమంతుడు అనే రెండుకథలను రాశారు.
అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖరచయిత డా.శాంతినారాయణ పేగుతెంచిన బంధంపేరుతో కథ రాశారు. ఇది సుగాలీ జీవితానికి సంబంధించిన కథ.
2024లో చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు బాలాజీ 18 కథలతో ఏకలవ్యకాలనీ `ఎరుకల జీవనగాథలు పేరుతో కథలు రాశారు. ఈ పుస్తకంపై ఇదివరకటి శీర్షికల్లో ప్రత్యేకంగా చర్చించాను. ఇందులో ఎరుకలవారిపై వివక్ష, అవమానాలు, భూమి, నివాస హక్కులు తదితరవస్తువులతో బాలాజీ కథలను జీవంగా మలిచారు. ఇటీవల ఎరుకల జీవితాలకు సంబంధించి ఈ వ్యాసరచియితనైన నేను కర్నూలు పశ్చిమప్రాంతమైన ఆదోని ప్రాంతంలో ఎరుకలవాళ్లు ఎదుర్కొంటున్న వివక్ష, అలాగే నమ్మిపోసపోయే కథావస్తువుతో బతుకాట పేరుతో కథ రాశాను కూడా.
*








Add comment